హుష్!

‘ప్రయాసపడి భారమును మోసుకుని పోవుచున్న
సమస్త జనులారా, నా యొద్దకు రండు
నేను మీకు విశ్రాంతినిచ్చెదను’
అంటే, అమాయకంగా దొరికిపోయారు.

అదొక దున్నబడని బీడుభూముల పండుగ
చూచి నమ్మినవారికంటే చూడక నమ్మినవారు ధన్యులట
అందుకే, అందరూ అంధులై
యవ్వనస్తుల కూడికలో గుణకారమైరి

కానీ గుడారముల పండుగకి శేషము మిగలలేదు.
ఇంతలోనే, పులియని రొట్టెల పండుగ ముంచుకొచ్చెను.
ఇక ప్రథమ ఫలముల పండుగ తప్పనిసరి కాగా
తదుపరి బూరల పండుగను సందడి కూడా అయ్యెను.
ఆపైన, ప్రాయశ్చిత్తార్థ దినమునకు తావులేక
పస్కా పండుగకూ తెర తీయబడెను
ఆశీర్వాద పండుగలు అనివార్యమయ్యెను. ఆమెన్!

ఈ పండుగ లెక్కల మతలబులన్నీ-
ఆమె హైటెక్ సిటీ రోడ్డువార
ఆపిల్స్ బేరమాడుతున్నప్పుడు
తలపై కాకి తన్నినప్పుడే అతడు గ్రహించాడు.
ఎప్పటిలాగే ‘హుష్’ అందామె
కాకి ఎగిరిపోయింది, అతడు కాదు.