మనుషులను తాత్త్వికత వైపు ఎన్నెన్నో కారణాలు నడిపించాయి. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలన్న కోరిక వాటిలో అత్యంత గౌరవించదగినది. తత్త్వ-విజ్ఞాన శాస్త్రాలు వేరువేరు కాని పూర్వపు రోజుల్లో ఈ కోరిక ప్రబలంగా ఉండేది. ఇంద్రియాలు కల్పించే భ్రమ ఆ కాలంలో మరో ప్రభావవంతమైన ప్రోత్సాహకం. ఇంద్రధనుస్సు అసలు ఎక్కడ ఉంది? వస్తువులు నిజంగా సూర్యరశ్మిలోనూ వెన్నెల్లోనూ కనబడేలాగే ఉంటాయా? ఇదే ప్రశ్న ఆధునిక రూపంలో – వస్తువులు నిజంగా మామూలు దృష్టికి కనబడేటట్టు ఉంటాయా లేక మైక్రోస్కోపు దృష్టికి కనబడేటట్టు ఉంటాయా? కొంతకాలంలోనే ఇలాంటి చిక్కులకు మరింత పెద్ద సమస్య వచ్చి తోడయ్యింది. గ్రీకులు ఒలింపియన్ దేవుళ్ళని శంకించడం మొదలుపెట్టాక కొంతమంది సంప్రదాయ నమ్మకాలకు ప్రత్యామ్నాయంగా ఫిలాసఫీని ఎంచుకున్నారు. ఈ రెండు కారణాల మూలాన ఫిలాసఫీలో రెండు దృక్కోణాల ఉద్యమం పుట్టుకొచ్చింది. దీని ప్రకారం, ఒక పక్క అనుదిన జీవితంలో జ్ఞానంగా పరిగణించబడే చాలా విషయాలు అసలైన జ్ఞానం కాదని ఫిలాసఫీ చూపిస్తుంది; రెండవ పక్క, మన రోజువారీ నమ్మకాలకన్నా లోతైన ఒక తాత్విక వాస్తవం ఉంది, ఈ విశాలవిశ్వపు నిజస్వరూపాన్ని ఆ వాస్తవం ద్వారానే తెలుసుకోగలం. ఎందరో తాత్త్వికుల ధోరణి ఇదే. దాదాపు అన్ని తత్వాలకూ సంశయం ప్రేరణగానూ నిశ్చయత పరమావధిగానూ ఉంటూ వచ్చాయి. ఇంద్రియాల మీద, విజ్ఞానం మీద, మతసిద్ధాంతాల మీద అనుమానాలు ఉంటూనే వచ్చాయి. కొంతమంది తత్త్వవేత్తలలో ఒకటి బలంగా ఉంటే ఇంకొంతమందిలో ఇంకోటి. ఈ అనుమానాలకు వాళ్ళు సూచించిన సమాధానాలలోనూ, అసలు వాటికి సమాధానాలు ఉంటాయా అన్న విషయంలోనూ తత్త్వవేత్తలు విస్తృతంగా విభేదించారు.
ఈ సంప్రదాయక కారణాలన్నీ కలిసి నన్ను తాత్త్వికత వైపు నడిపించాయి, కాని ప్రత్యేకించి వాటిలో రెంటి ప్రభావం నాపై బాగా ఉంది. ఖచ్చితంగా వాస్తవమని అంగీకరించదగ్గ జ్ఞానాన్ని కనుక్కోవాలన్న కోరిక నాలో మొదట కలిగినదీ, దీర్ఘకాలం కొనసాగినది. నాలోని సహజాత మతోద్వేగాన్ని తృప్తి పరచాలన్నది రెండో కోరిక.
నాకు పదకొండేళ్ళప్పుడు అనుకుంటాను మొట్టమొదటి సారి ఒక విషయం నన్ను ఫిలాసఫీ (అప్పుడు ‘ఫిలాసఫీ’ అన్న పదం నాకు తెలియకపోయినప్పటికీ) వైపు నడిపించింది. మా అన్నయ్య నాకన్నా ఏడేళ్ళు పెద్దవాడవడం చేత నా చిన్నతనం ఎక్కువగా ఏకాంతంలో గడిచింది. ఈ ఏకాంతం వల్లే నాలో చింతన పెరిగిందన్న విషయంలో అనుమానం లేదు. అలా ఖాళీ సమయం చాలా ఉన్నప్పటికీ ఆలోచనకి సాధనమైన జ్ఞానం నా దగ్గర లేకపోయింది. కాని గణితంపై ఆసక్తివున్న మనసుల లాగా నాక్కూడా తెలియకుండానే నిరూపణలలో సంతృప్తి ఉండేది. పెద్దయ్యాక ఇదే తరహా వ్యక్తుల్ని నేను కలిశాను. నా స్నేహితుడు, శుద్ధగణిత ఆచార్యుడు, జి. హెచ్. హార్డి ఈ ఆనందాన్ని అధికంగా ఆస్వాదించేవాడు. నేను ఇంకో అయిదు నిమిషాల్లో చనిపోతానని తాను నిరూపించగలిగితే, నా చావు పట్ల బాధ ఉన్నా దాన్ని అతిశయించే సంతృప్తి ఆ నిరూపణ కలిగిస్తుందని నాతో ఒకసారి అన్నాడు. దానికి నేను ఏమాత్రం నొచ్చుకోకుండా తనని అర్థం చేసుకున్నాను.
నేను జ్యామితి నేర్చుకోకముందే దాంట్లో నిరూపణలు ఉంటాయని ఎవరో చెప్పడం చేత మా అన్న నాకు జ్యామితి నేర్పుతానన్నప్పుడు చాలా ఆనందమేసింది. ఆ రోజుల్లో అదింకా యూక్లిడ్ జ్యామితే. మా అన్న నిర్వచనాలతో మొదలుపెట్టగా, నేను వాటిని వెంటనే అంగీకరించాను. తర్వాత స్వయంసిద్ధ సూత్రాలు వచ్చాయి. ‘ఇవి రుజువు చెయ్యలేనివి. వీటిని ఒప్పుకుంటే తప్ప మిగతా వాటిని నిరూపించలేం’ అన్నాడు. ఈ మాటలు నా ఆశల్ని ముక్కలు చేశాయి. ఏదైనా నిరూపించగలిగిన దాన్ని కనుక్కుంటే అద్భుతంగా ఉంటుందనుకున్న నేను దానికి ముందు రుజువుల్లేని కొన్నింటిని ఒప్పుకొని తీరాలని తీరా తెలుసుకున్నాను. కోపంగా అన్న వంక చూసి ‘రుజువులు లేని వీటిని నేనెందుకు ఒప్పుకోవాలి’ అని అడిగాను. ‘ఒప్పుకోకపోతే ఇంక ముందుకు కదల్లేం’ అని జవాబిచ్చాడు. మిగిలిన విషయం కూడా తెలుసుకోవడం మంచిదేనని తాత్కాలికంగా వాటిని నేను ఒప్పుకున్నాను. నిస్సందేహమైన స్పష్టతను కనుక్కోవాలని ఆశ పడిన చోటే నేను చిక్కులూ అనుమానాలతో మిగిలిపోయాను.
ఈ అనుమానాలన్నీ ఉన్నప్పటికీ వాటికి సమాధానాలు ఉండే ఉంటాయన్న నా నమ్మకం చేత, వాటిని దాదాపు మర్చిపోవడం చేత, గణితంలో నాకు మరెక్కడా దొరకనంత విపరీతమైన సంతృప్తి దొరికింది. భౌతిక ప్రపంచానికి గణితాన్ని అన్వయించడాన్ని గురించి ఆలోచించడం నాకు నచ్చేది. యంత్రాల గణితం అంత ఖచ్చితత్వంతో రాను రాను మనుషి ప్రవర్తన యొక్క గణితం కూడా వస్తుందని ఆశించాను. నిరూపణలలో ఉండే సంతృప్తే నా ఈ ఆశకి కారణం. ఆ సంతృప్తే స్వతంత్రచిత్తం (ఫ్రీ విల్) ఉంటుందని నమ్మాలన్న నా కోరికను కూడా చాలా సమయాల్లో అతిశయించింది. ఏదేమైనా గణితం ప్రమాణతపై ఉన్న నా అనుమానాలను నేను ఎప్పటికీ పూర్తిగా అధిగమించలేకపోయాను.
ఉన్నతస్థాయి గణితాన్ని నేర్చుకోవడం ప్రారంభించాక నా మీదకు కొత్త సమస్యలొచ్చి పడ్డాయి. కేంబ్రిడ్జ్‌లో మా ఉపాధ్యాయులిచ్చే రుజువులలో దోషాలున్నాయని నాకనిపించేది. తర్వాత అది నిజమేనని తేలింది. అప్పుడు గానీ నేను కేంబ్రిడ్జ్ వదిలేసిన కొన్నాళ్ళకు గానీ మెరుగైన రుజువులను జర్మన్ గణితవేత్తలు కనుగొన్నారని నాకు తెలీదు. ఇందువల్ల ఇమ్మాన్యుల్ కాంట్ సిద్ధాంతాలలోని సాహసోపేతమైన పద్ధతుల పట్ల ఆసక్తి చూపించి వాటిని ఆహ్వానించాను. ఇది సూచించిన సరికొత్త పెద్ద అధ్యయనం మునుపు నన్ను ఇబ్బంది పెట్టిన సమస్యలను అల్పమైనవిగాను, వ్యర్థమైనవిగానూ అనిపించేలా చేసింది. కాని ఇలా అనుకొని పొరబడ్డానని ఆధిబౌతికమైన అడుసు లోతులలో మునిగి అయోమయంగా కొట్టుమిట్టాడిన తర్వాతే తెలుసుకున్నాను. పరీక్షలు రాసే నైపుణ్యానికి కావాల్సిన గాఢమైన శ్రద్ధ, ఏకాగ్రత నాకు గణితం మీద విసుగు పుట్టించాయి. నేను ఫిలాసఫీకి మారడానికి ఇది ప్రోత్సాహకం అయింది. ఈ నైపుణ్యాన్ని పొందే ప్రయాసలో అసలు గణితమంతా నేర్పుగల ఏమార్పులు, తెలివైన యుక్తులతో నిండి ఉంటుందనీ, మొత్తంగా ఒక పదబంధ ప్రహేళిక లాంటిదనీ అనిపించింది. కేంబ్రిడ్జ్‌లో మొదటి మూడేళ్ళు పూర్తయినప్పుడు చివరి గణిత పరీక్ష నుండి బయటపడ్డాక ఇక జీవితంలో గణితం జోలికి వెళ్ళబోనని ఒట్టు పెట్టుకొని నా దగ్గరున్న గణిత పుస్తకాలన్నీ అమ్మేశాను. ఇలాంటి మనస్థితిలో ఫిలాసఫీ అధ్యయనం నాకు లోయలో నుండి బయటికొచ్చాక కనిపించే కొత్త ప్రకృతిదృశ్యంలా కనబడింది.
నేను నిశ్చయత కోరుకున్నది గణితంలో మాత్రమే కాదు. రెనె డెకార్ట్ లాగా నాక్కూడా బయటి ప్రపంచమంతా ఒక కల కావచ్చునని అనిపించేది (అప్పటికి నాకు ఆయన రచనలు తెలీవు). ఒకవేళ అది నిజంగా కలే అయినా, ఆ కలను కనడం నిజం కాబట్టి, ఆ కలను నేను అనుభూతి చెందుతున్నది నిస్సందేహమైన వాస్తవం కాబట్టి నా ఉనికి అనుమానించలేనిదని నాకు అనిపించింది. ఈ రకమైన ఆలోచన నాకు పదహారేళ్ళప్పుడు వచ్చింది. దీన్నే డెకార్ట్ తన సిద్ధాంతాలకు పునాదిగా చేసుకున్నాడని తర్వాత తెలుసుకొని సంతోషపడ్డాను.
కేంబ్రిడ్జ్‌లో ఉన్నప్పుడు ఫిలాసఫీలో నాకున్న ఆసక్తికి మరో ప్రోత్సాహకం కారణమైంది. గణితాన్నే అనుమానించేలా చేసిన నా సంశయాత్మకత నన్ను మౌలిక మతవిశ్వాసాలను కూడా ప్రశ్నించేలా చేసింది. కాని మతంపై నమ్మకమన్నది ఏదైనా కొంత నిలుపుకునే దారి ఏదైనా కనుక్కోవాలని బలంగా కోరుకున్నాను. పదిహేను నుండి పద్దెనిమిది ఏళ్ళ మధ్య చాలా సమయం కేటాయించి మతవిశ్వాసాల గురించి ఆలోచించాను. ఆ మూలసిద్ధాంతాలని నమ్మడానికి ఒక్క కారణమైనా దొరుకుతుందేమోనని మనసారా ఆశపడి వాటిని ఒక్కొక్కటిగా పరిశోధించాను.అప్పుడు నాకు తోచిన ఆలోచనల్ని ఒక నోట్‌బుక్‌లో రాసుకున్నాను, అదిప్పటికీ నా దగ్గర ఉంది. యౌవనంలో తోచిన ఈ ఆలోచనలు ముతకగానే ఉండేవి, కాని వాటిలో ఉన్న నా సంశయవాదానికి నాకప్పుడు సమాధానం మాత్రం దొరకలేదు. కేంబ్రిడ్జ్‌లో నాకు మునుపు తెలియని ఆలోచనా పద్ధతులన్నీ తెలిశాయి. అప్పటి వరకు నేను ఏకాంతంలో రూపొందించుకున్న ఆలోచనలన్నీ కొన్నాళ్ళు పక్కన పెట్టాను. కేంబ్రిడ్జ్‌లోనే నాకు హెగెల్ ఫిలాసఫీ పరిచయం అయింది. హెగెల్ తన పంతొమ్మిది జటిలమైన గ్రంథాల ద్వారా ఏదో నిరూపించానని చెప్పుకున్నది మెరుగుపరిచిన, సవరించిన సంప్రదాయక నమ్మకాలనే అనిపిస్తాయి. విశ్వం ఏకత్వమున్న ఒక అల్లిక లాంటిదని హెగెల్ అనుకున్నాడు. హెగెల్ విశ్వం ముక్కలు చెయ్యలేని ఒక ముంజ లాంటిది, ఎక్కడ తాకినా మిగిలిన మొత్తమూ కదులుతుంది. విశ్వం విడివిడి భాగాలుగా కనిపించడం ఒక భ్రమ అన్నాడు హెగెల్. ఉన్నదల్లా పరమము (అబ్సల్యూట్) ఒక్కటే. ఇదే హెగెల్ దృష్టిలో దేవుడు. ఈ సిద్ధాంతంలో నేను కొంతకాలం పాటు ఊరట పొందాను. హెగెల్ అనుయాయులు, ముఖ్యంగా జె. ఎం. ఈ. మెక్‌టాగ్గర్ట్, నాకు చూపిన దాని ప్రకారం హెగెల్ సిద్ధాంతం ఆకర్షణీయంగానూ నిరూపించదగినదిగానూ అనిపించింది. నాకు ఆరేళ్ళు సీనియరు అయిన మెక్‌టాగ్గర్ట్ తన జీవితాంతం హెగెల్ శిష్యుడుగా ఉన్నాడు. తన సమకాలీనులపై బలమైన ప్రభావం చూపాడు. కొంత కాలం నామీద కూడా ఆ ప్రభావం పడింది. స్థలకాలాలు అబద్ధమని, పదార్థం భ్రమ అని, విశ్వమంతా మనసే తప్ప మరేమీ కాదనీ నమ్మించుకోవడంలో ఒక వింత తృప్తి ఉండేది. కాని ఒక దుడుకు క్షణాన దృష్టిని శిష్యుల నుండి గురువు మీదకు మరల్చినప్పుడు తానే ఒక తికమకల గందరగోళం అని తెలుసుకున్నాను. శ్లేషలకు మించి నాకేమీ కనబడలేదు. దాంతో హెగెల్ సిద్ధాంతాలని పూర్తిగా విడిచిపెట్టేశాను.
కొంత కాలం ప్లేటో నుండి మార్పులతో నిష్పాదించుకున్న సిద్ధాంతంలో తృప్తిని పొందాను. శాశ్వతమైన, కాలాతీత భావాల ప్రపంచం ఒకటుంటుందని, మనం చూస్తున్న ప్రపంచం దాని అసంపూర్ణ ప్రతి మాత్రమేనన్న ఈ సిద్ధాంతాన్ని నేను కొంత వరకు అంగీకరించాను. గణితం ఆ భావాల ప్రపంచంతో వ్యవహరిస్తుంది గనుక అందులో రోజువారీ ప్రపంచంలో లేని ఖచ్చితత్వము, సంపూర్ణత ఉంటాయని ఈ సిద్ధాంతం చెప్తుంది. పైథాగరస్ నుండి ప్లేటో తెచ్చుకున్న ఈ మార్మిక వాదన నన్నూ ఆకర్షించింది. చివరికి ఈ సిద్ధాంతాన్ని కూడా విడిచిపెట్టక తప్పలేదు. ఆపై మరెప్పుడూ నాకు అంగీకరించదగినవి అనిపించిన ఏ తాత్విక సిద్ధాంతాల లోనూ నాకు మతైక తృప్తి దొరకలేదు.
(మూలవ్యాసం: Portraits from Memory, London: Allen & Unwin; New York: Simon & Schuster, 1956. నుంచి)