1. పద్యంలో రాగం వున్నదా?

పల్లెటూరివిద్యార్థిని “అబ్బీ, ఒక పద్యం చదవరా” అంటే చదవడు; పాడడము మొదలుపెడతాడు. సప్తస్వరాలూ ఒకేమారు తోసుకువచ్చే గొంతుకువాడైనా సరే, బడిపంతులు కూడా పద్యాన్ని పాడే తీరతాడుగాని చదవడు. పెళ్ళి అరుగుల మీద గావంచా పరుచుకుని పడుక్కునే కుక్షింభరుడు కూడా ‘భోజనకాలే గోవింద నామస్మరణ’లో పద్యాల్ని పాడతాడు. పౌరాణికుడి పక్కన పద్యపాఠము చదివే తోడు పెళ్ళికొడుకు చెవి మీద చెయ్యి పెట్టుకుని పద్యాల్లో రాగాలు విసిరేస్తాడు. సభల్లో, హరికథల్లో, గొల్లకలాపాల్లో, నాటకాల్లో— సర్వత్రానూ పద్యం రాగంతో చేరే ప్రత్యక్షమౌతోంది, పద్యాన్ని పాడే ఆచారం తెలుగుదేశంలో బాగా వేళ్ళుతన్నుకుంది.

కాని ఈ పాడడంలో ఒక నియమనుంటూ ఏదీ కనపడదు. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారు మునుపు మోహనరాగంలో పాడేవారు. నేడు మాయామాళవగౌళలో పాడుతున్నారు. కాశీ కృష్ణాచార్యులుగారు శ్రీరాగము, జాషువాగారు మాయామాళవగౌళ, పువ్వాడ శేషగిరిరావుగారు, రాచకొండ నరసింహ మూర్తిగారూ బిలహరీ వాడుతున్నారు. నటుల్లో కూడా ఈ తేడాలు కనపడుతున్నాయి. డి. వి. సుబ్బారావుగారు మధ్యమావతి, అద్దంకి శ్రీరామమూర్తిగారు బిలహరి, నిడసనమట్ల కొండలరావుగారు మోహన, బ్రహ్మాజోస్యుల సుబ్బారావుగారు సురటి, బి. వి. నరసింహారావుగారు సరస్వతి వాడతారు తరచు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిమానరాగమో, బాగా నలిగిన రాగమో, ఏదో ఒకటే బాగా నచ్చుతోంది. “ఆ రాగమే ఎందుకు వాడుతున్నారూ?” అని అడిగితే వారు చెప్పగలిగిన ప్రత్యేక సమాధానమేదీ వుండదు.

‘పద్యాన్ని ఈ రాగంలో పాడాలి’ అనిగాని, ‘ఈ రాగంలో కూడదు’ అనిగానీ నియమమేదీ లేదు. అంటే, పద్యం పాడే ఆచారం నియమబద్ధ ప్రపంచంలోది కాదన్నమాట.

ఇది కేవలం కృతకమేగాని సహజంగా ఏర్పడ్డది కాదని సుళువుగా కనపడిపోతుంది. ఒక పద్యాన్ని పట్టుకుని బయల్దేరితే, ఆ పద్యానికే వీరు శ్రీరాగముద్ర, వారు బిలహరిముద్ర, ఇంకొకరు మాయామాళవగౌళ ముద్ర, వేరొకరు సరస్వతిముద్ర, ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క రాగముద్ర కొడతారు. ఎడ్రను తప్పిన ఉత్తరము గతే పద్యానికీ పట్టుతుంది. ఇక, ఒక వ్యక్తిదగ్గిరే కూర్చున్నామనుకోండి. అతని దగ్గిరకి ఏ పద్యం రానివ్వండి దానికి ఒకే రాగముద్ర తగులుతుంది. ఆ పద్యం కందమైనా, వృత్తమైనా, సీసమైనా సరే——అదే రాగముద్ర! అది శృంగార సంబంధి కానివ్వండి, కరుణాసంబంధి కానివ్వండి దానికి అదే రాగముద్ర పడుతుంది! కృతకత్వమన్నది ఇంతకంటే జుగుప్సాకరంగా ఉండగలదా?

పద్యం పాడే ఆచారం తెలుగువారిలోనే కాదు, భారతీయములైన జాతులన్నిటిలోనూ వుంది. అంటే ఈ సంస్కృతులకన్నిటికీ తల్లి అయిన సంస్కృతమునుంచే ఈ ఆచారము దిగుమతి అయి ఉంటుందని ఊహ చేయవలసివస్తోంది. సంస్కృత పండితులు కూడా శ్లోకాన్ని పాడుతునేవున్నారు. ఈ ఆచారమే దేశభాషలకి కూడా పాకి ఉండవచ్చుననుకోడము విపరీతపుటూహ కాదు. అయితే శ్లోకాల్ని పాడే ఆచారం ఎలా వచ్చింది?

సంస్కృతాలంకారికులు ఎవరూ పద్యానికి ఉపయోగించవలసిన రాగమును గురించిన జిజ్ఞాస చేయలేదు. ఒక్కొక్క అలంకారాన్ని పట్టుకొని దాని రూపభేదాల్ని గురించి అధ్యాయం పొడుగునా చర్చ సాగించిన ఆలంకారికులు శ్లోకపఠనం గురించి ఏమీ ఎత్తుకోనేలేదంటే, అసలు శ్లోకాన్ని రాగము మాత్రమే చేర్చి పాడే ఆచారం ఇటీవల సంక్రమించినదే కాని ప్రాచీనం కాదేమోననిపిస్తోంది. ప్రామాణిక సంగీతవేత్తలు భరత, దత్తిల, మతంగ, నారదాదులు కూడా శ్లోకమును పాడడము గురించి ఏమీ వ్రాయలేదు. ఒక్క స్వరమూ, రెండు స్వరాలూ, మూడు స్వరాలూ, నాలుగు స్వరాలూ, అయిదు స్వరాలూ ఉపయోగించి పాడినవాటికి ఆర్చిక, గాధిక, సామిక, స్వరాంతర, ఔడవము-లని పేర్లు పెట్టి గౌరవమిచ్చిన సంగీతశాస్త్రకారులు రాగాన్ని పూర్తిగా ఇమిడ్చి పాడిన పద్యగానాన్ని పేర్కొనకపోడము చిత్రంగానే ఉంది. గీతాలూ ప్రబంధాలూ గురించి వివరిస్తూ శార్‌ఙ్గదేవుడు తన సంగీత రత్నాకరంలో రెండు శ్లోకాలు లిఖించాడు. అవి ఇవి:

వర్ణజో మాత్రికశ్చేతి కలహంసో ద్విధా మతః
గద్యాత్మాచేత్ స్వరాన్ గీత్వా తతః పదనివేశనం (241 శ్లోకం)

అనిబద్ధా నిబద్ధాచ ద్విధా సా గద్య-పద్యజా,
గాతవ్యా నియతైర్నిత్యం గీర్వాణగణవల్లభా

అంటే అర్థము ఇది: కలహంస అనే ప్రబంధములో వర్ణఛందస్సూ వాడతారు, మాత్రాఛందస్సూ వాడతారు. దానిలో అనిబద్ధమైన గద్యా, నిబద్ధమైన పద్యమూ కూడా ఉంటాయి. దాన్ని గీర్వాణ గణము ప్రీతితో పాడుకునే వుంటారు. ఈ శ్లోకాల్ని బట్టి (కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రులుగారన్నట్టు) లోకంలో వున్న గద్య అంతా పాడవలసినదే అనడానికి వీలు లేదనుకుంటాను. పాడడముకోసమే కూర్చబడ్డ కలహంసవంటి గద్యప్రబంధాల్ని పాడాలి గాని, ‘గద్యనంతటినీ పాడుకోవలసినది’ అన్నదే పై శ్లోకాల యొక్క అభిప్రాయమని బుకాయించడానికి నాకు దమ్ము చాలదు.

గద్య నిమిడ్చిన పాటలకోసము శార్‌ఙ్గదేవుడిదాకా మనము పోనక్కరలేదు. త్యాగరాజు రచించిన ‘సమయానికి తగుమాట లాడే’ అనే ఆరభి రత్నంలో ‘రంగేశుడు సద్గంగా జనకుడు సంగీతసాహిత్యలోలుడు’ అని గద్య వుంది. ఈ గద్యని స్వరాలు చేర్చే పాడతారుగాని వితాళముగా మాత్రం పాడరు. ఈ గద్య గాని, ‘కలహంస’లోని పద్యము గానీ సంగీతానికి అనుగుణంగా తాళబద్ధం చెయ్యబడే వున్నాయి గాని మనము వ్యాసాల్లో రాసుకునే గద్యలాగే విశ్ళంఖలంగా లేవు. ఏతావాతా తేలేదిది. పద్యాల్ని (రాగము మాత్రమే చేర్చుకుని) గానీ, గద్యాన్ని గానీ వితాళముగా పాడే ఆచారము ప్రాచీనకాలంలో లేదు.

శారదాతనయుడు భావప్రకాశములో ‘వైతాళికులు తెరలోనుంచి తాళము లేకుండా అపరవక్త్ర-వక్త్ర వృత్తాల్ని పాడతారు’ అన్నాడట (డాక్టరు వి. రాఘవన్‌గారు చెప్పారు). ఈ మాటల్ని బట్టి, తాళముతో పాడే ఆచారమే వాడుకలో నున్నట్లున్నూ, వితాళముగా పాడేవారికి వైతాళికులని పేరువచ్చినట్లున్నూ తెలుస్తోంది. అంటే నేటి విధముగా వితాళముగా శ్లోకాల్ని, పద్యాల్నీ పాడే ఆచారము వైతాళికులదన్నమాట! మెల్ల మెల్లగా ఈ ఆచారము వక్త్ర, అపరవక్త్ర వృత్తాల్ని దాటి తక్కిన (శ్లోక, స్రగ్ధరాది ఇతర) వృత్తాల్ని కూడా ఆక్రమించిందేమో! శ్లోకగానాన్ని సంగీతలాక్షణికులు, సాహిత్యలాక్షణికులూ ఆమోదించలేదు. దీన్ని ఆచారంలోకి దించినవారు తెర వెనుక ఉండే వైతాళికులు! శహబాస్. గొప్పవాళ్ళనే అనుసరిస్తున్నాం!

వాల్మీకిమహర్షి కుశలవుల చేత రామాయణ కావ్యాన్ని పాడించినట్లు రామాయణంలో వుంది. మూడుచోట్ల గాబోలు ఈ ప్రశంస వచ్చింది. ‘పాద బద్ధోక్షరసమ స్తంత్రీలయసమన్వితః’ అని ఒకమారూ; ‘పాఠ్యే గేయేచ మధురం ప్రమాణై స్త్రిభిరన్వితం, జాతిభి స్సప్తభిర్బద్ధం తంత్రీలయసమన్వితం’ అని రెండోమారూ; ‘తంత్రీలయపదిత్యర్థం విశ్రుతార్థమగాయతాం’ అని మూడోమారూ కనపడుతుంది ఈ గాన ప్రశంస. మూడుచోట్లా కూడా తంత్రీలయ సమన్వితంగానే పాడినట్లు చెప్పాడు ఆదికవి. అంటే తంత్రిమీద వాయిస్తూ పాడేరన్నమాట! అంటే రాగతాళాలు రెండూ ఉన్నాయన్నమాట. కాని రాగము మాత్రము చేర్చి లాగేయలేదు! కుశలవులు పాడిన పద్ధతి వేరూ, మనవారు పాడుతూన్న పద్ధతి వేరూను. మనవారి పద్యంపాటలో లయ ఎక్కడ ఉంది? లేనేలేదు. కాబట్టి ఇప్పటి పద్ధతిలో నడిచే పద్యగానాన్ని సమర్థించడానికి వాల్మీకిని దింపడంలో సబబు లేదు.

అయితే వాల్మీకి చేసినది ఏమిటీ? వాల్మీకిది ఆదికావ్యం అన్న సంగతి జ్ఞాపకానికి తెచ్చుకుంటే నాకిది ఒకలాగ అర్థమవుతోంది. అంతకుముందు గానానికే ప్రాముఖ్యత ఉండేది. ‘పాఠ్యేచ మధుర’మైన కావ్యం వాల్మీకిదే మొదటిది. క్రౌంచపతనం చూచి ఆయన శ్లోకాన్ని పాడేయలేదు. ‘అబ్రవీ’త్తేడు! ఆ శ్లోకంలోని గతిని చూసుకుని ఆశ్చర్యపడుతూంటే, ఎవరో రావడమూ, కావ్యం రచించమనడమూ జరిగేయి. ప్రజలు ఈ నూత్నసృష్టిని ఆమోదిస్తారో, గానముగ్ధ చాపల్యం చేత పెదవి విరుస్తారో! అని ఆలోచించి శ్లోకాలకి లయ ఏర్పరచి, గానము చేర్చి ‘గేయేచ మధురం’గా కూడా చేశాడు ఆదికవి!

అభినవగుప్తుడు భరతుని నాట్యశాస్త్రానికి అభినవభారతి వ్యాఖ్య వ్రాస్తూ, పధ్నాలుగో అధ్యాయంలో ఛందోప్రశంస చేస్తూ ‘దోధక, తోటక వృత్తాలు పాడితే బాగుంటాయని, శ్లోకమూ స్రగ్ధరా పఠిస్తే బాగుంటాయ’నీ అన్నాడట. అంటే మాత్రాఛందస్సులు పాడితే బాగుంటాయనీ అక్షరఛందస్సులు పఠిస్తే బాగుంటాయనీ ఆయన అభిప్రాయము అన్నమాట. శ్లోకాల్ని పాడకూడదనే వెఱ్ఱి అభినవగుప్తునికి కూడా ఉండేది!

బాహ్యసాక్ష్యము పద్యగానాన్ని నిలబెట్టలేదు. అభ్యంతరసాక్ష్యం కూడా అంతే. కీర్తనకి రాగనిర్ణయం ఉంది. ఎక్కడో తప్పిజారి, దేవామృతవర్షణిలో వున్న కీర్తన ఒకటి ఖరహరప్రియలో ప్రచారమై పోవడము చిత్రమేగాని సదాచారము మాత్రం కాదు. ఇలాగ రాగాలు మారిపోతాయేమో అనే కాబోలు దీక్షితులవారు రాగాల పేరుల్ని కూడా తమ కీర్తనల్లో బిగించారు. పద్యాలికి అలాంటి రాగనిర్ణయం కనబడదు. తెలుగు (స్టేజి) నాటక ప్రదర్శనాల తొలి రోజుల్లో రాగాల పేరులు ఇమిడ్చి చాలామంది సీసపద్యాలు రాశారు. ఆ సీసపద్యంలో నాలుగు పాదాలూ మంచంకోళ్ళలాగు ఒకేరీతిగానే వుంటాయి. (సామాన్యంగా అలాగే ఉంటున్నాయి కూడాను!) వాటికి నాలుగురాగాల్ని తగిలించడములో పాపమా కవులు, ఏదో, పాదంలోని అభిప్రాయానికి రాగాల పేర్లు కలిసి వచ్చాయని తగిలించారు గాని, ఆ పాదభావానికి ఆ రాగాలు తగివున్నాయని మాత్రం కాదు. రామ రామ! ‘నా ఊళ కేదారగౌళ’ అని నేటి అధివాస్తవికకవి అన్నాడంటే, అతనికి కేదారగౌళ అంటే ఇదీ అని తెలుసునని అర్థమా? ‘సంగీత’ నాటకాల్లోని పద్యకారులకు కూడ అంతే!

కీర్తనల్ని వాగ్గేయకారులు పాడుతూనే రచిస్తున్నారు. త్యాగరాజు, క్షేత్రయ్య, రామదాసూ తమ కీర్తనల్ని పాడేశారు గాని, సాహిత్యం ముందు కట్టుకుని స్వరములు వేరే కట్టుకోలేదు. అంటే, కీర్తనలోని రాగం అసలుతో చేరే బయటపడుతోందని నా అభిప్రాయం. కీర్తనలోని రాగం పుట్టుకతోనే ఉంది. అల్లాగే పద్యాలతో చేరి రాగాలు రావడము లేదు. వివరంగా మనవి చేస్తున్నా. ఒక్కొక్క కవి ఒక్కొక్క రాగంలో పద్యాల్ని పాడుకున్నట్లు చెప్పేను. ఆ కవికి అదొక అలవాటయిపోయి, (ఎవరో ఆంగ్లవక్త గుండీ తిప్పుకుంటూ ఉపన్యాసాలిచ్చినట్లూ మన పండితులు ముక్కుపొడుము పీల్చి శాస్త్రార్థము చేసినట్టూ) కూసురాగం తీస్తూ పద్యరచన సాగిస్తున్నాడు గాని, రాగంతో చేర్చి పద్యాన్ని ఇవ్వడం లేదు. అన్నట్టు కవులకి ఉన్న రాగజ్ఞానం ఏ పోటీరాగాల్లో పద్యాలివ్వడానికీ?

రాగం రాకపోవడము కవికి న్యూనత కాదు. కవులు కుంచె పట్టుకుని చిత్రాలు రచించగలరా? (‘ఆఁ! అంటున్నాడు నా పక్కన మిత్రుడొకడు. అయితే ఆ కవి కవిత్వంలో చిత్రకళ, చిత్రకళలో కవిత్వమూ ఉంటుంది చూసుకోమంటున్నాను!) గజ్జెలు కట్టుకుని తాండవం చెయ్యగలరా? (నువ్వు రాసినది బాగా లేదయ్యా అంటే మాత్రం కొందరు చేస్తారుట!) అవి వేరే సంస్కారాలు. కవి నేర్చేది భాష; స్వరాలూ గాంధర్వమూ కాదు. కవిత్వం చెప్పాలంటే గానము నేర్చివుండాలని ఎవరూ అనరనుకుంటాను. పద్యరచనా సంస్కారంలో రాగరచనా సంస్కారము లేనేలేదు. రాగము ఏమీ పాడలేని కవిసార్వభౌములలో ఉన్నంతగా పద్యరచనాసంస్కారము మరొకరికి లేదేమో. వేదుల సత్యనారాయణశాస్త్రిగారు కూడా పాడలేరు. వారి పద్యాలు రసగుళికలు! ఆచార్య రాయప్రోలు, శివశంకర ప్రభృతులూ పాడలేరు. (కాని పాడతారు. అది వినవలిసినవారి కర్మం! నాకు వారి కవిత్వమ్మీద ఉన్న మమత వారికి విదితమే.) కాని వారి పద్యాలు చక్కగా వుంటాయి. వేలకొద్దీ పద్యాలు రచించగల మహాకవులు పాడలేకపోడముకంటే బలమైన సాక్ష్యం ఏముంటుందీ, పద్యరచనా సంస్కారంలో రాగరచనా సంస్కారము ఎంతమాత్రమూ లేదనడానికీ?

పద్యానికి పుట్టుకలో రాగంతో సంబంధం లేదు. రాజశేఖరుడు తన కావ్యమీమాంసలో కవిత్వావిర్భావానికి మరో వింతకథ చెప్తున్నాడు. సరస్వతీదేవి కుమారుడట కావ్యపురుషుడు! ఆమె ఆ కుమారుణ్ణి ఒక చెట్టుకింద (?) పడుకోబెట్టి నీటికి వెళ్ళిందట. ఆ దారిని పోతూన్న వాల్మీకి ఈ బిడ్డణ్ణి చూసి ‘నీ వెవరు’ అని ప్రశ్నిస్తే, ‘నేను సరస్వతీ దేవికుమారుణ్ణి. కావ్య పురుషుడు నా పేరు’ అని శ్లోకంలో జవాబిచ్చాడట. భ్రమరకీటన్యాయంగా ప్రాచేతసుడికి పద్యగతి పట్టుబడిందట! ఈ కథనిబట్టి చూచినా, పద్యంలో వున్న గతిని చూచే ప్రాచేతసుడు అక్కజపడినట్టు తేల్తుంది గాని గానప్రశంస లేనేలేదు. పద్యంలో రాగము లేదు.

(ప్రథమ ప్రచురణ: భారతి పత్రిక. వ్యయ ఫాల్గునము. 1946.)