‘నామదిలోన నివ్వటిలు నవ్యతరప్రణయంపులక్ష్యమై,
నామదియందు సంతతము నర్తనసేయు కళైకరూపమై,
నామదితోఁట నెల్ల సుమనఃపరిపూర్ణముసేయు చైత్రమై,
తామరసాక్షి! కూడితివి ధన్యము సేయుచు నాదుమన్గడన్.ఆమనిలో కుహూస్వనసమాలపనం బొనరించు కోకిల
స్తోమమనోజ్ఞగానమును, సుందరకచ్ఛపిపై విరించిభా
మామణి పల్కునాదమును మచ్చరికించుచు నున్నదే సఖీ
నీమధురంపుఁబల్కె, యిఁక నీగళగానము చెప్పనేటికిన్?తమ్ములు గల్వలు న్మఱియుఁ దళ్తళలీనెడు చేపపిల్లయం
దమ్ములు సాటివచ్చు నయనంబుల కంచు వచించు పూర్వకా
వ్యమ్ముల కేమి గాని రుచిరాక్షి! త్వదీయమనోజ్ఞనేత్రయు
గ్మమ్మునుబోలువస్తువు జగమ్మున లేదని యందు రూఢిగన్.ఆకనుదోయియందున నిరంతరమున్ ప్రభవించు సుందరా
లోకనచంద్రికామృతములోన సమాప్లుతమైన నాదుహృ
ల్లోకమునందున న్మొలకలూనును నవ్యసుఖాంకురంబు, ల
స్తోకముగా సురేంద్రవనిఁ దోఁచు నవాంకురరాజి కైవడిన్.శృంగార రస మరంద త
రంగములం దేలియాడు రమణీయచలద్
భృంగద్వయమౌగద యో
సింగారీ! నీముఖవికసితలోచనముల్.మాటలతోఁ బని యేటికి
నీటుగ మాటాడు నీదు నేత్రములుండన్
మాటల కందని వలపులఁ
జాటునుగద చెలి!త్వదీయచక్షుర్ద్వయమే.లోకోత్తరసుందరమగు
నీకన్నులతోడొదవిన యీలోకంబే
నాక నిభంబుగ నిత్య ము
దాకరమై చెలఁగు నాకు హరిణీనేత్రీ!’ఈమాడ్కిని నొకయువకుఁడు
ప్రేమావిష్టాత్ముఁ డగుచుఁ బ్రేయసిచెలువున్
సామోదంబుగఁ బొగడఁగ
నామెయు సిగ్గిలుచుఁ బల్కె నాతని కిటులన్.‘చాలును నాథ! మీపలుకుసందడి, సేతలు, లోకమందునం
గ్రాలెడు నందమెల్ల ననుఁ గావలెనంచును జేరినట్టు లీ
లీలను మీరు వల్కు టగులే పరిహాసము, మ్లానశీలమౌ
పూలను బోలు నీయొడలిపోఁడిమి నింతగ నెన్నఁ బోలునే?నశ్వరము దేహ మయ్యది నాశమగుట
కంటెముందె యందం బడుగంటిపోవు;
దీనికంటెను శాశ్వతంబైనయట్టి
యంద మున్నచో నది యుపాస్యంబు మనకు.’అన విని నాతఁడిట్లను, ‘ప్రియాంగన! నీపలు కౌను సత్యమే,
కనుగొన నైన నింతదనుక న్నిను మించిన మంజులత్వమున్
ఘనసుఖదాయకత్వమును గల్గిన వస్తువు ధాత్రియందుఁ, గా
వున మనసార నీదుచెలువున్ భజియింతు ననుక్షణంబునన్.సాటిలేనట్టి నీకంటిసౌరు గనుచు
పరవశించుచు నుంటిని ప్రత్యహంబు;
తఱుగునో వానియందంబు తరణి సోఁక
ననుచు గొడుగు గప్పుదును నీవరుగు నపుడు.’అని ప్రియమారఁగాఁ బలుకు నాతని భవ్యసుధోపమానమౌ
భణితము లాత్మయందున నవప్రణయాన్వితభావవీచికల్
పెనుపఁగ నామె యాతనిని పేరగుకౌఁగిట గ్రుచ్చి, తోరమై
చనియెడు మోవితేనియలచాలులఁ దన్పెను నుత్కటంబుగన్.పరమంబౌ శ్రీరంగే
శ్వరపురనికటంబునఁ గల వరయూరనగం
బరగెడి యూరన్ వసియిం
తురు వారు నితాంతహార్దతుష్టాంతరులై.కరికరంబులఁ బోలు ఘనదీర్ఘబాహువుల్
బలలక్ష్మికిం బోల నెలవు లగుచు,
కంచుడాలును బోలు ఘనమైన వక్షంబు
శౌర్యలక్ష్మికిఁ గ్రాల సద్మ మగుచు,
గిరిశృంగములఁ బోలు వరమాంసలాంసముల్
కీర్తిలక్ష్మికి నొప్ప గృహము లగుచు,
సాలోపమంబైన సంహననంబు సౌం
దర్యలక్ష్మికిఁ జెల్ల స్థాన మగుచు,కర్కశుండయ్యు మల్లరికయ్యమందు
హృదయమార్దవ మింతేని వదలకుండ
అంద మెప్పు డర్చించుచు డెందమందు,
ఆతఁడుండు ధనుర్దాసుఁ డనగ నూర.