బ్లూ ఫిన్

ఆల్బర్ట్ క్రీక్ లేక్, కొలంబస్‌లో అతడుండే చోటికి కొద్దిగా దూరమైనా అతడికి ఇష్టమైన లేక్ అది. గత రెండు నెలలుగా మరీ ఇష్టంగా వస్తున్నాడు. ఈ రోజు ఇంకొంచెం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. తేజు కాల్ చేసి ఓ అమ్మాయి అక్కడికి వస్తుంది, కలవమని చెప్పింది. చిత్రమైన మనిషి, కొంచం జాగ్రత్త అని కూడా చెప్పింది. అమ్మాయి పేరు మాత్రం చెప్పలేదు. ఆమె పేరు ఆమెతో చెప్పించగలిగావంటే ఆమె నిన్ను స్నేహితుడుగా అంగీకరించినట్టే అని చెప్పింది ఒక గొప్ప హింట్ ఇస్తున్నట్లు. రాక్‌కి ఉన్న ఏకైక ఇండియన్ ఫ్రెండ్ తేజు.

దూరం నుంచి వస్తూ కనిపించింది ఆమె. పల్చటి హుడీ వేసుకుంది. కొద్దిగా గాల్లో ఎగురుతున్నట్లు నడుస్తుంది. తమాషాగా ఆ కళ్ళు నవ్వుతున్నట్లు అనిపించాయి. చేతులకి ఏవో రెండు మూడు రకాల బ్రేస్‌లెట్స్. ఆమెకి ఎదురుగా వెళ్ళి నవ్వుతూ పలకరించాలనుకున్నాడు. ఆ లోపే ఆమె వచ్చి ఎదురుగా కూర్చుంది.

ఏమి మాట్లాడాలో తెలీనట్లు కాసేపు మౌనంగా ఉండిపోయాడు. ఆమే సంభాషణ మొదలుపెట్టింది.


“చాలా ఉక్కగా ఉంది కదా!”

“సముద్రతీరంలో అలానే ఉంటుంది!”

“ఇక్కడ సముద్రం ఎక్కడ ఉంది?”

“మీరున్నారు కదా ఎదురుగా.”

అతను ఫ్లర్ట్ చేస్తున్నాడా? ఏమో! కానివ్వు, ఇది కూడా బాగానే ఉంది.

అంతకు మించి సంభాషణ పొడిగించడానికి నాకేమి తోచలేదు. తేజు రెండు మూడు సార్లు చెప్పింది, అతన్ని కలువు ఓ సారి అని. ఈ రోజు కుదిరింది.

“మీరిక్కడికి తరచుగా వస్తుంటారా?” అతను కొనసాగించాడు.

“తరచుగా కాదు కాని, ఎప్పుడైనా కొంచెం టైమ్ దొరికినప్పుడల్లా వస్తుంటాను.”

“ఒక్కరేనా!” అని ఆపేశాడు. ఏమి అడగాలనుకున్నాడో అర్థమైంది. నాకు సమాధానం చెప్పాలనిపించలేదు.

“ఇక్కడ సన్‌సెట్ చాలా బావుంటుంది కదా!”

“అవును.”

“నేనేదో స్ట్రేంజర్‌లా ఫీలవ్వకండి, డౌన్‌టౌన్‌లో బ్యాంక్ అఫ్ అమెరికాలో వర్క్ చేస్తాను.”

ఎక్కడ పని చేస్తున్నాడో చెపితే స్ట్రేంజర్‌ కాకుండా పోతాడా? స్ట్రేంజర్స్‌లో కూడా నమ్మదగినవాడిని అని చెప్పుకోవడానికేమో! నమ్మదగినవాడైతే ఏం చేస్తా. సంభాషణతో పాటు స్నేహం కొనసాగించి, ఒక కాఫీ తాగి వీలైతే క్యాంపింగ్ కూడా చేయచ్చేమో. అతని యాస చూస్తుంటే మెక్సికనేమో అనిపించింది. వాళ్ళూ మనలాగే ఈ దేశం వచ్చి ఎలాగో ఒకలా కష్టాలుపడతా ఉంటారు. వీళ్ళకి మోసం చేసే టైమ్ ఉండదు. అవకాశం వస్తే చేయకుండా ఉండటానికి పెద్ద కారణాలు కూడా వెతకరేమో! నేను మౌనంగా నా ఆలోచనల్లో ఉండిపోవడంతో అతనే అడిగాడు.

“మీ పేరేంటి?”

“పేరు అంత అవసరమంటారా?” అన్నా నవ్వుతూ.

“అలా అని కాదు కాని, ఏదో ఒక పేరుతో పిలవాలి కదా!”

“అయితే ఏదో ఒక పేరుతో పిలవండి, ఫరవాలేదు.”

“లూసీ అని పిలవొచ్చా. అంటే ఏమీ లేదు, అది నాకు తెలిసిన మా పక్కింటి అమ్మాయి పేరు అంతే.”

“ఓహ్! మీ కుక్కపిల్ల పేరనుకున్నా” అన్నా, అదేదో ఒక జోక్‌లా. అతను “కాదు” అన్నాడు, దాన్ని జోక్‌లా అతనేమీ ఫీలయినట్లు లేదు.

“నన్ను మీరు రాక్ అని పిలవొచ్చు.”

“ఏ రాక్” అని అడుగుదామనుకున్నా, అనవసర సంభాషణ ఎందుకు అనిపించింది.

“ఇక్కడికి నా తమ్ముడితో కలిసి ఫిషింగ్‌కి వస్తూ ఉంటా, కొద్దిగా నడుద్దామా?” అంటూ నా వైపు చూడకుండానే ముందుకు వెళ్ళాడు.

రెండు క్షణాలు అతని వైపు కొంచెం పరిశీలనగా చూశా. రగెడ్ షర్ట్, చిందరవందరగా ఉన్న జుట్టు, చిన్న నవ్వు ముఖం, పెదాలు విరిచి ఏదో చెపుతున్నట్లు. ఎక్కడో చూసినట్లనిపిస్తుంది.

“వస్తున్నావా లూసీ?”

అదేదో కొన్ని యుగాలుగా తెలిసినట్లుగా పిలుస్తున్నాడు రాక్. అక్కడంతా పిల్లలు, స్విమింగ్ చేసేవాళ్ళు, ఫిషింగ్ చేసేవాళ్ళు, బోటింగ్ చేసేవాళ్ళు.

“నేను కొన్ని వారాలుగా ప్రతి వీకెండ్ ఇక్కడికి వస్తున్నా ఒక విషయం పైన” అతను నడుస్తూ మాట్లాడుతున్నాడు. “ఒక రెండు నెలల క్రితం ఒకసారి సాయంత్రం ఇలానే ఆరవుతుందనగా…” చెప్పడం ఆపి తలతిప్పి నావైపు ఒకసారి చూసి ముందుకు నడిచాడు. ఏదో చెప్పబోయే ముందు సస్పెన్సులా.

ఆ బండరాళ్ళ మధ్యకి వెళ్తున్నాడు కొద్దిగా మనుషులకి దూరంగా. నా దగ్గర ఖరీదైన వస్తువులేమి లేవు కదా! నా ఆలోచనకు నవ్వు వచ్చింది.

“ఏంటి మీలో మీరు ఎక్కువగా మాట్లాడుకుంటారా!?”

“హాఁ, అదేమీ లేదు. ఇంకా ముందుకు ఎందుకు?”

“పర్వాలేదు లూసీ, కొద్దిగా ముందుకు వెళ్దాం. బావుంటుందక్కడ. ఇక్కడంతా సేఫ్‌గానే ఉంటుంది.”

పెద్ద బండరాయిని ఎక్కి ముందుకు వెళ్ళాం. నాకు తెలుసు ఆ ప్రదేశం బావుంటుందని. దాన్ని అతడే కొత్తగా కనిపెట్టినట్లు చెప్తున్నాడు “ఇక్కడ కూర్చుందాం, రండి.” కొద్దిగా చదునుగా ఉన్న బండ దగ్గరకు పిలిచాడు. అక్కడ కూర్చుంటే ముందున్న బండకు అలలు వేగంగా కొట్టుకొని కొద్దిగా నీళ్ళు ముందుకు దూసుకు వచ్చి, కాళ్ళను తడిపి వెళుతున్నాయి.

“చూశారా, ఈ ప్రదేశం ఎంత బావుందో! ఇక్కడ నుంచి సూర్యాస్తమయం మనోహరంగా ఉంటుంది.”

అంతకుముందు ఏదో చెప్పబోయి ఆగాడని అనిపించి గుర్తుచేశా.

“చెప్తాను ఆ విషయం గురించి సూర్యాస్తమయం అయ్యాక” అని సడన్‌గా నా వైపు చూసి “ఎందుకో మీరు బాగా తెలిసిన వ్యక్తిలా అనిపిస్తున్నారు” అన్నాడు. నేను సమాధానం చెప్పకుండా అలానే ఉన్నా.

కాసేపయ్యాక అతని కష్టాలు చెప్పడం మొదలుపెట్టాడు. మొదట, అతన్ని విడిచిపెట్టి వెళ్ళిన ప్రియురాలి గురించి, ఆమె బ్రతకనేర్చినతనం గురించి చెప్పాడు. ఆమెని తలుచుకొని తిట్టుకున్నాడు. కొద్దిసేపు బాధపడ్డాడు. ఆమె మోసం చేసిందని నిందించాడు.

“ఏంటి లూసీ, ఏమీ మాట్లాడరు” అన్నాడు మధ్యలో.

“మీ ప్రియురాల్ని నిజంగా ప్రేమించారా?”

“ఆమెతో జీవితం బావుంటుందనుకున్నా. ఆమె వెళ్ళిపోయిందని పెద్దగా దుఃఖం ఏమీ లేదనుకో. మోసంచేసి వెళ్ళి, నాకు బాధ లేకుండా చేసింది. నాకు నిందించడానికి ఒక కారణం చూపించి వెళ్ళింది” అంటూ ఏదో ఆలోచిస్తూ గొణుక్కున్నాడు.

“లేకపోతే మీ ప్రేమించలేనితనం బయటపడుతుందేమో అని భయపడ్డారా” అంటూ గట్టిగా నవ్వా.

అతను విసురుగా నావైపొకసారి చూసి “నువ్వెవరినైనా ప్రేమించావా?” అన్నాడు.

“ప్రేమించాను, చాలమందిని.”

అతడి చూపులో ఏదో విస్మయం. నేనింకా ఎక్కువ మాట్లాడితే అతడు ఇబ్బంది పడతాడనిపించింది. కాసేపు అతని తల్లి గురించి తలుచుకున్నాడు. ఎంత రాత్రి వెళ్ళినా తన తల్లి తన కోసం ఎదురుచూస్తుందని, తనకోసం నిరంతరం ఆరాటపడుతూ ఉంటుందని, ఎంతో మంచిదని, ఎంతగానో ప్రేమిస్తుందని, నిస్వార్థపరురాలని చెప్పుకున్నాడు.

“మీరు మీ తల్లిని ప్రేమిస్తారన్నమాట.”

“తల్లిని ప్రేమించని వాళ్ళెవరుంటారు!”

“ఏమో!” అన్నా.

“మీరు ప్రేమించరా?” అతని ప్రశ్న సూటిగా ఉంది.

అతనిప్పుడు నేను తల్లిని ప్రేమించకపోతే ఒక క్రూరమైన మనిషిని నాలో చూసుకోడానికి రెడీగా ఉన్నాడనిపించింది.

“నాకు తెలియదు” అన్నా కాసేపటికి నిదానంగా.

“అదేంటి?”

“నేనెప్పుడూ నా తల్లిని ప్రేమించాలా వద్దా అని ఆలోచించలేదు.”

మా సంభాషణ అతని ప్రియురాలి మీదుగా వచ్చి అతని తల్లి దగ్గర ఆగింది.

“మీ గురించి ఏమీ చెప్పలేదు.”

“నేను ఎక్కడా కుదురుగా ఒక చోట ఉండను. ప్రస్తుతం మా అమ్మ స్నేహితురాలి దగ్గర ఉన్నా. ఒక బైక్ రైడర్ గ్రూప్‌తో కలిసి తిరుగుతూ ఉంటా. నాకేమి లక్ష్యాలు లేవు. ఉన్నంత కాలం లైఫ్ బోర్ కొట్టకుండా ముందుకు వెళ్ళిపోవాలి, అంతే.”

“అదేంటి?”

“ఒక చోట స్థిరంగా ఉండటం, మనుషులకోసం దుఃఖించడం, ప్రేమించడం ఇదంతా నాకు నచ్చదు. మనుషులు వాళ్ళ జీవితాల్లో ఖాళీతనాన్ని మోసుకోలేక, పూరించుకోలేక దాన్ని ఈ ప్రేమలతో దుఃఖాలతో బాధలతో నింపుకుంటారు అనిపిస్తుంది.”

అతడు నావైపు చూస్తున్న చూపుకు నవ్వొచ్చింది.

“అదేంటి నువ్వెవరినీ ప్రేమించలేదా?”

పోనీలే అతడు నా తల్లి గురించి అడగలేదు. నాకెవరైనా ప్రేమికుడు ఉన్నాడేమో తెలుసుకోవాలనుకుంటున్నాడు.

“ప్రేమించానో లేదో తెలీదు. మార్టిన్ అని ఒక బైక్ రైడర్ మా గ్రూప్‌లో ఉండేవాడు. ఒకసారి మేము గ్రాండ్ కేన్యన్‌కు లాంగ్‌ట్రిప్ ప్లాన్ చేశాం. అతడు నా వెనుకే ఉండేవాడు. ప్రతి చిన్నదానికి సహాయం చేస్తానని వచ్చేవాడు. నాకెలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకొనేవాడు. నెమ్మదిగా అతని మీద ఆధారపడటం మొదలుపెట్టా. నేను చెప్పే మాటలు ఆసక్తిగా వినేవాడు. ఎప్పుడైనా ఒకసారి నీ నవ్వు బావుంటుందనో, నీ కళ్ళతోనే మనుషులతో మాట్లాడుతుంటావ్ అనో అనేవాడు. అతడు అనుకున్నది జరిగింది. నేనతన్ని చాలా ఇష్టపడటం మొదలుపెట్టా. అతనికి చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేకపోయేదాన్ని. అతన్ని ఎవరన్నా ఏమైనా అంటే పోట్లాడేదాన్ని. నాలో ఉన్న స్థిరత్వం నెమ్మదిగా తగ్గడం మొదలైంది. అందరూ నాలో మార్పును గమనించినా గమనించనట్లు ఉండేవారు.”

“ఆ తరువాత ఏమైంది?” ఓ నిమిషం గాప్‌ని కూడా తట్టుకోలేనట్లు అడిగాడు.

“ఒకసారి చిన్న బైక్ ఆక్సిడెంట్‌లో అతని కాలుకి దెబ్బ తగిలింది. అతనితో పాటు నేనూ ఆగిపోయా. అతను నన్ను వెళ్ళమన్నా నేను వెళ్ళలేదు. అతడితోనే ఉన్నాను. ఆ రోజు రాత్రి…” అంటూ చెప్పడం ఆపాను.

రాక్ నావైపు చూస్తున్నాడు, ‘పర్వాలేదు చెప్పు’ అన్నట్లు ఉన్నాయి అతని చూపులు.

“మనసు బాగాలేదని పక్కన పడుకోమని అడిగాడు. నాకది అభ్యంతరంగా అనిపించలేదు. నేను ఎప్పటినుండో ఎదురుచూస్తున్నట్లు అతని పక్కన పడుకున్నా. అతడికి ఏమైందో మరి సడన్‌గా నిద్రలో నొప్పి పుట్టేంత గట్టిగా నా చేతిని పట్టుకున్నాడు. ఉన్మత్తతతో మోహంగా ముద్దు పెట్టుకున్నాడు. అతడి ముద్దు నన్ను వివశురాల్ని చేసింది. నాలోపల ఇష్టం నాకు తెలుస్తుంది. కానీ అతను నా చేతిని ఎంత గట్టిగా పట్టుకుంటున్నాడంటే నా చేయి లోపల రక్త ప్రసరణ ఆగిపోవడం, నా చేయి నీలంగా మారడం నాకు తెలుస్తోంది. ఒక్కసారిగా నా శక్తి మొత్తం కూడగట్టుకొని అతన్ని తోసి విడిపించుకొని లేచాను. ఇక వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాను. అంతే ఇక ఎపుడూ ప్రేమ జోలికి వెళ్ళలేదు.”

“మీరు మార్టిన్‌ని మళ్ళీ కలవాలని అనుకోలేదా!?”

“రక్తం ప్రవహించడం ఆగిపోతే ప్రాణం పోతుంది, తెలుసు కదా!” అన్నా గట్టిగా నవ్వుతూ.

మా సంభాషణ అక్కడితో ఆగిపోయేదే బ్లూ ఫిన్ చేప మా మధ్యకి రాకపోతే.


కొద్దిగా మసక చీకటి పడింది. అతనిలో ఏదో చిన్నపాటి వెతుకులాట.

“ఏంటి అలా ఉన్నారు?” అన్నా.

“ఈ ప్రదేశంలో ఏవో శబ్దాలు వినిపించేవి. మొదట్లో అవి ఎక్కడనుంచో అర్థమయ్యేది కాదు. చివరకు అవి నీళ్ళలోంచి వస్తున్నట్లుగా గ్రహించాను. అప్పుడు చూశాను బ్లూ ఫిన్ చేపను. కొద్దిగా పెద్దగా ఉంది. వెన్నెల్లో ఆ చేప, చుట్టూ కాంతి నింపుకున్నట్టు ఎంత అందంగా ఉందంటే, నా కళ్ళు తిప్పుకోలేంత. అదే శబ్దాలు చేస్తుందని, నాతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుందనిపించింది.”

కొద్దిగా ఆసక్తిగా ముందుకు వంగాను.

“బ్లూ ఫిన్ బండరాళ్ళ మధ్యకి వచ్చి, మళ్ళీ నీళ్ళ లోపలికి వెళ్ళి, మళ్ళీ వెనక్కి వచ్చేది. ఓ అద్భుతంలా అనిపించింది. అది నిదానంగా నా ఉనికికి కూడా అలవాటుపడి నా కాళ్ళదాకా వచ్చింది. దాని వైపు చూస్తూ అలానే మైమరిచి ఉండిపోయాను. కాసేపు ఉండి వెంటనే అది నీళ్ళ లోపలికి వెళ్ళిపోయింది.”

కాస్తంత విరామం తరువాత మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. “నా ప్రియురాలు నన్ను వదిలించుకొని వెళ్ళిన రోజు అది నా కంట పడింది. దాన్ని చూస్తూ నా దుఃఖాన్ని మరిచిపోయాను. అలాగే కొన్ని గంటల పాటు రోజూ ఇక్కడే గడిపి వెళ్ళేవాడ్ని.”

“చేపలు మన మాటలు వింటాయా?”

“ఏమో తెలియదు కాని, దాని శబ్దాలు వినే కొద్ది కొన్ని రోజులకు అర్థమైంది, అది చేస్తున్నవి శబ్దాలు కావు, అది పాడుతుందని. ఆ పాట ఎంత తీవ్రతతో ఉంటుందంటే దాన్ని వింటున్నప్పుడు ఒక్కోసారి దుఃఖం వచ్చి ఏడ్చేవాడిని. ఇంకొన్నిసార్లు ఆనందం లోపలనుంచి పొంగుకొచ్చేది. అప్పుడప్పుడు అది ఏదో శాంతి మంత్రం జపిస్తున్నట్లు అనిపించేది. దాని పాట వింటూ ప్రపంచాన్ని మనుషుల్ని మరిచిపోయేవాడిని. ఆ బ్లూ ఫిన్ నాకెంత నచ్చిందంటే, దాన్ని పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళాలి అనిపించిదోసారి. విచిత్రం ఏంటంటే ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం అది నా మనసుని చదివినట్లు వెంటనే పాట ఆపేసింది. కనిపించకుండా వెళ్ళిపోయింది. మరుసటి రోజు దానికి మనసులో క్షమాపణలు చెప్పుకొని ఎదురుచూశా. అప్పుడు మళ్ళీ వచ్చింది. నా ఆలోచనలను అది గ్రహించడం చాలా వింతగా అనిపించింది. ఏదైనా సొంతం చేసుకోనంతవరకే దానిపైన ప్రేమ ఇష్టం ఉంటాయనో, ఇది నాది అనిపించుకోవడంలోనే ఏదో అసౌకర్యం ఉందనే విషయం అది నాకు చెబుతున్నట్లనిపించిది.”

“సొంతం చేసుకున్నాక ఉండవంటారా?”

“ఉండవు, స్వార్థం తప్ప ఏదీ ఉండదు.” అతని గొంతులో ఏదో స్థిరత్వం.

నా చూపుని చూసి, “లూసీ, నేను చెప్పేది నిజమే” అన్నాడు.

“నేను నమ్ముతాను” అన్నా నీళ్ళ వైపే చూస్తూ.

కాసేపు నిశ్శబ్దం తరువాత “మీ పేరు చెప్తారా” అన్నాడు.

పేరు అడగటంతో నవ్వొచ్చింది, అతని కళ్ళలోకి చూసి చిన్నగా నవ్వా!

బ్లూ ఫిన్ కాళ్ళను తాకుతూ తిరగడం తెలుస్తోంది.

శ్రీసుధ మోదుగు

రచయిత శ్రీసుధ మోదుగు గురించి: అమోహం, విహారి అనే కవితా సంకలనాలు, రెక్కలపిల్ల అనే కథా సంకలనం వచ్చాయి. ...