కలత

బాగా దుమ్ము పట్టి మాసిపోయిన బట్టలతో, వెండి రంగు కళ్ళజోడుతో, ఒక వయసు మళ్ళిన పెద్దాయన దారి పక్కన కూర్చుని ఉన్నాడు. పక్కనే ఉన్న బల్లకట్టు వంతెనపై నుండి పెద్ద ఎత్తున పిల్లలు, పెద్దలు అంతా నది దాటుతున్నారు; వేసడం బండ్లు, ట్రక్కులు అన్నీ వంతెన దాటుతున్నాయి. వాలుగా ఉన్న నదీ తీరాన్ని ఎక్కలేక ఎక్కలేక ఎక్కుతున్న ఆ గాడిదల బండ్లను అక్కడ ఉన్న సైనికులు వెనకనుండి తోసి సాయం చేస్తున్నారు. ట్రక్కులు సులువుగా వెళ్ళిపోతున్నాయి కాని, కాలినడకన వెళ్ళే రైతులు పాదాలు మునిగిపోయేంత దుమ్ము, ధూళిలో అతికష్టం మీద నడుస్తున్నారు. కానీ ఆ పెద్దాయన మాత్రం కదలకుండా అక్కడే కూర్చొని ఉన్నాడు. ఇంక ముందుకెళ్ళడానికి ఏ మాత్రం వీలు కానంతగా అలసిపోయినట్టున్నాడు.

వంతెన దాటి, రక్షణ స్థావరాల ఆవలి ప్రాంతం పరిశీలించి, శత్రువులు ఏ మేరకు ముందుకు వచ్చారని కనుక్కోవడం నా బాధ్యత. అది పూర్తి చేసుకొని నేను మళ్ళీ వంతెన దాటుకొని తిరిగి వచ్చాను. అప్పటికి వంతెన మీద బండ్లు ఎక్కువగా ఏమీ లేవు. కాలినడకన వెళ్ళే వారూ తక్కువే, కానీ ఆ పెద్దాయన ఇంకా అక్కడే ఉన్నాడు.

“ఎక్కడ నుండి వచ్చారు మీరు?” ఆయన్ని అడిగాను.

“సాన్ కార్లోస్ నుండి” అన్నాడాయన, చిరునవ్వుతో. ఆయన స్వస్థలం అది. ఆ పేరు తలచుకుంటే వచ్చిన సంతోషం అది. “అక్కడ జంతువులను చూసుకుంటూ ఉండేవాడిని.”

“ఓహో!” అన్నాను నేను, పూర్తిగా అర్థంకాక.

“అవును, ఆ మూగప్రాణుల్ని చూసుకుంటూ అక్కడే ఉండిపోయాను. మా ఊరు విడిచి వచ్చినవాళ్ళలో నేనే ఆఖరివాడిని.”

ఆయన కాపరిలానో, గొల్లపెద్దగానో కనిపించలేదు నాకు. మాసిపోయి ఉన్న తన మొహాన్ని, దుమ్ముతో నల్లగా ఉన్న బట్టల్ని, ఆ వెండి రంగు కళ్ళజోడునూ చూసి, “ఏ జంతువులు?” అని అడిగాను.

“రకరకాల జంతువులు. వాటన్నింటిని వదిలిపెట్టాల్సొచ్చింది” అన్నాడాయన, తలాడిస్తూ.

ఆఫ్రికా ఖండంలోని దేశంలా కనిపించే ఆ ఎబ్రో డెల్టా ప్రాంతాన్ని, ఆ వంతెననీ చూస్తూ శత్రువు రాక కోసం నేను ఎదురుచూస్తున్నాను; వాళ్ళ మొదటి అలికిడి కోసం ఆ ప్రాంతమంతా జాగ్రత్తగా గమనిస్తున్నాను. ఆ పెద్దాయన మాత్రం ఇంకా అక్కడే ఉన్నాడు.

“ఏ జంతువులు?” మళ్ళీ అడిగాను.

“మొత్తం మూడు రకాలు” వివరించాడాయన. “ఒక పిల్లి, రెండు గొర్రెలు, నాలుగు జతల పావురాలు.”

“వాటన్నింటిని మీరు వదిలేయాల్సొచ్చిందా?”

“అవును. ఫిరంగుల వల్ల. ఫిరంగుల నుండి తప్పించుకోవడానికి ఆర్మీ కేప్టెన్ నన్ను వెళ్ళిపొమ్మన్నాడు.”

వంతెన వైపు చూశాను. ఆఖరి బండ్లు కొన్ని నది ఆవలి గట్టున దిగుతున్నాయి.

“మీకు కుటుంబం లేదా?” అడిగాను.

“లేదు” అన్నాడాయన. “ఇందాక చెప్పినవే. ఆ పిల్లికి ఏమీ కాదు. అది తనని తాను చూసుకోగలదు, కానీ మిగతా వాటికే ఏమవుతుందో.”

“మరి ఈ యుద్ధం సంగతి?”

“నేను రాజకీయాలు పట్టించుకోను. నాకు డెభ్బై ఆరేళ్ళు. సుమారు పన్నెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాను. ఇంక ముందుకు వెళ్ళడం నా వల్ల కాదు.”

“ఇక్కడ కూర్చోడం మంచిది కాదు. ఇంకొంచెం ముందుకు వెళ్ళగలిగితే తోర్తోసా పట్నం వెళ్ళే రోడ్డు కూడలిలో ట్రక్కులున్నాయి.”

“కాసేపు ఆగి వెళతాను. ఆ ట్రక్కులు ఎక్కడికి వెళతాయి?”

“బార్సెలోనా నగరం వైపుకు.”

“అటువైపు నాకు ఎవరూ తెలీదు. మీరు నిజంగా మంచివారు. మీకు ధన్యవాదాలు.”

అలసిపోయిన ముఖంతో ఆయన నా వైపు చూశాడు. తన దిగులును ఎవరితోనైనా పంచుకోవాలన్నట్టుగా, “పిల్లిపై నాకు చింత లేదు, దానికేమీ కాదు. కానీ మిగతావే… వాటికేమైనా అవుతుంది అంటావా?” అని అడిగాడాయన.

“ఏమీ కాదు.”

“ఖచ్చితంగానా?”

“అవును” అన్నాన్నేను, నిర్మానుష్యంగా ఉన్న నది ఒడ్డుని చూస్తూ.

“ఫిరంగుల దాడికి నన్నే వెళ్ళిపొమ్మన్న చోట అవెలా బతికి బయటపడాయో.”

“పావురాల పంజరాలని తెరిచిపెట్టే వచ్చారా?”

“ఊఁ!”

“మంచిది. అవి ఎగిరిపోతాయి.”

“అవి ఎగిరి పోతాయిలే, కానీ మిగతావే. మిగతా వాటి గురించి ఆలోచించకపోవడమే మంచిది.”

“ఇక నేను వెళ్ళాలి. అలసట తీరిపోతే మీరు లేచి అటుగా నడవడానికి ప్రయత్నించండి” అని నెమ్మదిగా హెచ్చరించాను.

“అవును, వెళ్ళాలి. వెళ్ళాలి” అంటూ పైకి లేచాడాయన. అటూ ఇటూ కాసేపు ఊగిసలాడాడు, మళ్ళీ ఆ దుమ్ములో అక్కడే కుర్చుండిపోయాడు.

“జంతువుల్ని చూసుకుంటూ ఉండేవాడిని నేను” అన్నాడాయన, విచారంగా. నాతో కాదు. “కేవలం జంతువుల్ని చూసుకుంటూ ఉండేవాడిని, అంతే.” తనలో తానే మాట్లాడుకుంటున్నాడు.

ఇక ఆయనకు నేను చేయగలిగిందేమీ లేదు. అది ఈస్టర్ ఆదివారం. ఫాసిస్టు శత్రుమూకలు ఎబ్రో వైపుగా వస్తున్నాయి. ఆరోజు బాగా మబ్బులు పట్టి ఉండటంతో వారి యుద్ధవిమానాలేవీ ఆకాశంలో తిరగక పోవడం, ఆపైన పిల్లులు తమను తాము ఎలాగైనా కాపాడుకోగలవు అన్న నిజం.

అదే ఇక ఆయనకు మిగలబోతున్న అదృష్టం.

(మూలం: Old Man at the Bridge)