కాసిల్ ఆఫ్ ఆల్బకర్కీ

అతని రాగి రంగు జుట్టు, చూడగానే ప్రత్యేకంగా అనిపించిన మొదటి విషయం. అతడు ఆ స్పానిష్ కోటలో కనిపించకపోతే నేనంత పట్టించుకొని ఉండేదాన్ని కాదేమో! ఎందుకో అతడు ఎన్నో ఏళ్ళ క్రితం ఆ కోటకి చెందినవాడిలా అనిపించాడు. స్పానిష్ రాజో, సైన్యాధ్యక్షుడో లేకా మంత్రి కుమారుడో! ఆ కోట మీద అతడి మోహమో లేక అతడి చూపులో ఏదో ఆశనో చిరుతపులిలాంటి అతని కళ్ళలో కలగలసిపోయి కనిపిస్తున్నాయి.

గాలికి ఎగురుతున్న అతని రాగి రంగు జుట్టు ఆ పరిసరాలకి కొత్త అందాన్ని తెచ్చిపెడుతోంది. ఎదురుగా ఉన్న స్పానిష్ యువతితో ఏదో మాట్లాడుతున్నాడు. మాటలు అర్థం కావట్లేదు. కానీ ఆ శబ్దాల అర్థం మాత్రం తెలుస్తుంది. ఆమెపై ఉన్న అతని కోరికని అవి బయటపెడుతున్నాయి. నేను నీ కోరికను గుర్తించాను, దానిని ఆస్వాదిస్తున్నాను అన్నట్లుగా ఆమె నవ్వే నవ్వు పులకరింతలా ఉంది.

వాళ్ళను పెద్దగా పట్టించుకోనట్లు ముందుకు నడిచి లోపలికి వెళ్ళా. కాస్తీయో దెల్ ఆల్బుర్కెర్కె. కాసిల్ ఆఫ్ ఆల్బకర్కీ – చాలా పెద్దకోట. ఎదురుగా విశాలమైన గది. గోడకి వరుసగా పెద్దపెద్ద కిటికీలు. వాటి నుంచి పడమటి కొండల్లోకి వాలుతున్న సూర్యుడు కనిపిస్తున్నాడు. సాయంత్రపు రంగులు ఆ ప్రాంతానికి వింతశోభను అద్దుతున్నాయి. నేను లోపలకు అడుగుపెట్టగానే ఆ కిటికీల నుంచి వస్తున్న మంద్రమైన గాలి హఠాత్తుగా స్తంభించినట్టుగా, ఎక్కడి నుంచో ఎవరో నావైపే కదలకుండా చూస్తున్నట్టుగా అనిపించింది. ఏవో పురాస్మృతులు నాలో కదులుతున్నట్లు కొన్ని క్షణాలపాటు చిత్రమైన భావన. ఎన్నో సాయంత్రాలు నేను ఆ సూర్యాస్తమయ అద్భుతాన్ని చూసినట్టు. ఎందరో మనుషులు నానుండి బయటికి వెళుతున్నట్టు, ఎవరో నన్ను దగ్గరగా తీసుకుంటున్నట్టు. ఎప్పటినుంచో నేను ఇక్కడికే చెంది ఉంటానా?!

దూరం నుంచి రాగి జుట్టతను పిలుస్తున్నాడు. అతని గొంతులో విస్మయం.

‘ఇనేస్ దె కాస్త్రో!’ అంటూ ఏదో చిత్రమైన పేరుతో పిలిచాడు. ఎందుకలా పిలిచాడో అర్థం కాలేదు.

దగ్గరకు వస్తూ అడిగాడు “మీరు బాగానే ఉన్నారా?” అని.

“హాఁ, బానే ఉన్నా” అన్నా సర్దుకొని.

“కోట మూసే టైం అవుతోంది. మనం వెళ్ళాలి ఇక్కడినుంచి” అతని ఇంగ్లిష్ భాషలో చిన్న విరుపు ఉంది.

నేను అతని వెనుక నడిచా.

“ఈ రాత్రి మద్రీద్‌లో చిన్న లైవ్ మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉంది. మీరు అక్కడికి వస్తారా?” అనడిగాడు.

వస్తాను, రాను అన్నట్లు తలూపి అక్కడి నుంచి వెళ్ళిపోయా.

ఇక్కడ ఉండేది ఒక్కరోజే. కానీ చిత్రంగా ఒక్కరోజులోనే ఎన్నో జరుగుతుంటాయి. మనసు, ప్రపంచం, మనుషులు క్షణంలోనే ఎన్నో మారిపోతుంటాయి. ఆ క్షణకాలం ఎవరో చెప్పినట్లు, ఏదో శక్తి ఆదేశించినట్లు, ఏవైనా గతం గుర్తులు అక్కడ దాచుకున్నట్లు, ఆ శిథిలాల్లో ముక్కలైన హృదయం ఏదో దాగి ఉన్నట్లు ఇక అక్కడ గడిపేస్తామేమో!

ఇక్కడికి ఇలా రావడానికి ఏదైనా కారణం ఉందా? లోపలెక్కడో తెలీని ఆలోచనల నుంచి ఇక్కడికి రావాలని, ఇలా ఈ క్షణాన్ని గడపాలని, ఈ పరిసరాలను చూడాలని, ఇలా ఒక మనిషిని కలవాలని అనిపించి ఉంటుందా? లోలోపలే ఏదైనా జరిగి ఉంటుందా? ఇదేదీ కాకపోవచ్చు! మనుషుల జీవితాలు చాలా చిన్నవి. దేనికీ ఎవరికీ అక్కర ఉండదు. బతికుండే క్షణాలను కల్పించుకోడం కోసం మనస్సు పడే వెంపర్లాటేమో ఇదంతా!

అతనేదో పిలిచాడు
నేనెప్పుడూ వినని పేరుతో
నన్నే పిలిచాడు. ఎక్కడో తెలిసినట్టుగా ఉన్న పేరుతో
ఎవరో నన్ను ఇంతకుముందు పిలిచిన పేరుతో
ఏదో తెలియని ఆశ్చర్యం. ఎందుకలా పిలిచాడు. ఈ రాగి జుట్టతను ఎప్పటినుంచో నన్ను వెంటాడుతూ వస్తున్నాడా!

ఎప్పుడూ ఈ ప్రాంతానికి వచ్చిన దాన్ని కాదు. ఆ ప్రాచీనమైన కోటకి వెళ్ళి వచ్చాక ఏదో అర్థం కాని అలజడి. కలవరం. నాకున్న ఏకైక స్నేహితుడు మాలిక్‌కి కాల్ చేశాను. ఏదైనా మాట్లాడదామనుకున్నా. కానీ, అతను ఫోన్ తీయకపోతే బావుండు. మాట్లాడకపోతే బావుండు అని మనసుకు అనిపిస్తోంది. అలా ఎందుకనిపిస్తుందో తెలీదు. అతడు నిజంగానే ఫోన్ తీయలేదు. ఊపిరి పీల్చుకున్నా.

మాడ్రిడ్ లైవ్ మ్యూజిక్‌కి వెళ్ళాలని నిర్ణయించుకున్నా. ఏరికోరి ఎంతో ఇష్టమైన లేత పర్పుల్ రంగు ఫ్రాక్ వేసుకున్నా. దానికి బ్రౌన్ రంగు కలిసిన పర్పుల్ బ్రోచ్ పెట్టాను. రింగుల జుట్టుకి చిన్న పిన్ పెట్టా. ఆ డ్రెస్ ఇంతవరకు వేసుకోకుండా అట్టిపెట్టి ఉంచింది బహుశా ఇప్పుడు వేసుకోడానికేమో! అంతా రెడీ అయ్యాక అద్దంలో చూసుకున్నా. ఎవరో లీలగా కనిపించారు. నాలో నేను కాకుండా నాలాంటి ఎవరో! నవ్వొచ్చింది ఆ ఆలోచనకు!

అతడక్కడే ఒక్కడే బయట కూర్చొని నా కోసమే ఎదురుచూస్తున్నట్లున్నాడు. దూరం నుంచి నన్ను చూస్తూ ఏదో అన్నట్లు తోచింది. అది ఇందాక పిలిచిన పిలుపే! వెళ్ళి ఎదురుగా కూర్చున్నా. అతనిలో ఏదో తడబాటు.

“నీకిష్టమైన రంగు కదా ఇది. నువ్వీ సాయంత్రం కంటే, ఈ మనుషుల కంటే, ఈ లైట్ల కంటే కూడా ఎంతో ప్రత్యేకంగా ఉన్నావు” అతని ఇంగ్లిష్‌లో స్పానిష్ యాక్సెంట్‌ ఉంది. అతడిచ్చిన కాంప్లిమెంట్‌లో కోరిక కనిపించలేదు. ఇందాకమల్లే అతని మాటల్లో ధ్వనించిన విస్మయం మాత్రం అలాగే ఉంది.

“నీ రాగి జుట్టే వేరే వారికంటే నిన్ను భిన్నంగా చూపిస్తోంది.”

నేనా మాట కాంప్లిమెంట్ ఇవ్వాలని అన్నానో లేక అతడిని మొదటగా గమనించడానికి కారణం అదేనని చెప్పదలుచుకున్నానో తెలీదు.

“నువ్వేం చేస్తుంటావు?”

“ఇలాంటి ప్రశ్నలేవి లేకుండా ఈ సాయంత్రాన్ని గడుపుదామా?” అంటూ అతడు నవ్వుతూ బదులిచ్చాడు. చిరుతపులి కళ్ళలాంటి అతని కళ్ళు ప్రత్యేకంగా అనిపించాయి. అతడి నవ్వు నా ప్రశ్నలోని అధికార ప్రదర్శనని అడ్డుకున్నట్టు అనిపించింది.

“వైన్ తాగుతారా ప్రిన్సెస్?”

నా ముఖంలో చిన్న చిరునవ్వు చూశాడేమో! నేను సమాధానం చెప్పకముందే ఆర్డర్ ఇచ్చాడు.

“ఇక్కడికి నన్నెందుకు పిలిచినట్లు?” సూటిగా అడిగా.

“మ్యూజిక్ వింటావని” అతని గొంతులో భావం అందలేదు.

ఏదో స్పానిష్ పాట. ఫోక్ సంగీతంలా ఉంది.

“ఆ పాట ఇప్పటిది కాదు.”

నేను ఆ మ్యూజిక్ వినడానికి ప్రయత్నించి, రుచించనట్లు అతని వైపు చూశా.

“నిజానికి నీకొక కథ చెప్పాలని ఇక్కడికి రమ్మన్నాను” అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. నా అంగీకారం కోసం అతనేమీ ఎదురుచూడలేదు.

“ఈ రోజు కోటలో నువ్వు సూర్యాస్తమయం చూస్తున్నప్పుడు నిన్ను చూస్తే ఇనేస్ దె కాస్త్రోను చూసినట్టే అనిపించింది.”

అదే పేరు. ఇంతకు మునుపు అతని గొంతు నుంచి లీలగా వినిపించిన పేరు. చిత్రంగా ధ్వనించిన పేరు.

“ఎవరిది ఆ పేరు?”

వైన్ సిప్ చేసి అతను చెప్పడం మొదలుపెట్టాడు.

“ఆమెని డెత్ క్వీన్ అంటారు. 14వ శతాబ్దపు వ్యక్తి. అసలు పేరు ఇనేస్ దె కాస్త్రో. ఆమెని పోర్చుగల్ రాకుమారుడు ప్రిన్స్ పెద్రో ప్రేమించాడు. ఆమె ప్రేమలో అతడు సర్వం మరిచిపోయాడు. ఇది తండ్రి కింగ్ అఫోన్సోకి నచ్చలేదు. అతన్ని మార్చడానికి ఎంతగానో ప్రయత్నించాడు. అయినా పెద్రో ఆమెని వదల్లేదు. కింగ్‌ అఫోన్సో ఆమె మాయలో నుంచి కొడుకును బయటికి తెచ్చుకోవడానికి ఆమెని చంపించాడు.”

కాసేపు చెప్పడం ఆపి బలంగా ఊపిరి తీసుకున్నాడు. “ఇదొక సాధారణ ప్రేమ కథలా ఉంది కదా! కింగ్‌ అఫోన్సో చనిపోయిన రెండేళ్ళకి పెద్రో రాజయ్యాడు. చంపేయబడిన ఇనేస్ దె కాస్త్రో శవాన్ని సమాధి నుండి తవ్వి బయటకు తీయించాడు. ఆమె స్కెలిటన్‌కు క్వీన్‌ హోదా కల్పించి సింహాసనంపై కూర్చోపెట్టాడు. ఆమె బతికి ఉన్నప్పుడే రహస్యంగా పెళ్ళి చేసుకున్నానని చెప్పి రాజ్యంలోని ప్రజలంతా ఆమెని క్వీన్‌గా అంగీకరించేలా చేశాడు. అందరితో ఆమె స్కెలిటన్‌ చేతిని ముద్దాడించాడు. ఆమెని చంపేసినవారిని పట్టుకొని ప్రజలందరిముందు వారి గుండెలను పెకలించి చంపించాడు. ఇనేస్ దె కాస్త్రో ఆ విధంగా డెత్ క్వీన్ అయింది” అంటూ కథ ముగించాడు.

అతడు నా వైపు అపురూపంగా చూస్తూ “నీ గోధుమ రంగు దేహం, తేనె కళ్ళు, నల్లని జుట్టు చాలా నచ్చాయి” అన్నాడు. నా జుట్టుని ముట్టుకోవాలా వద్దా అన్న సందేహంతో ముందుకు చాచిన చేతిని వెనక్కి తీసుకున్నాడు.

చాలాసేపు మౌనం తరువాత అడిగా. “పెద్రోది గొప్ప ప్రేమ అంటావా?”

“తెలీదు” అని బదులిచ్చాడు.

“ఇనేస్‌ను చంపేవాడు ఆమె అందాన్ని చూసి ఉండాల్సింది.”

“అది చూసే చేశాడేమో!” అతనిలో ఏదో దిగ్భ్రాంతి.

కాసేపయ్యాక “మీరేమీ తాగట్లేదు ప్రిన్సెస్” అంటూ నా వైపు వైన్ గ్లాస్ జరిపాడు.

“చాలాసార్లు కథలకు సాక్ష్యాలుగా రాళ్ళూ గోడలే మిగులుతాయి” అన్నా వైన్ గ్లాస్ అందుకుంటూ.

అతడేమీ మాట్లాడలేదు.

అతడు స్ట్రేంజర్ అయినా అడగ్గానే ఎందుకు వచ్చాను అన్న సందేహం కలిగింది నాలో. అతడు చెప్పే కథలు ఏవైనా కావొచ్చు. ఇక్కడినుంచి త్వరగా వెళ్ళిపోవాలనిపించింది బలంగా. కానీ అతని చూపు నన్ను వెళ్ళనివ్వకుండా ఆపుతోంది.

“నువ్వు డాన్స్ చేస్తావా నాతో” అన్నాడు.

“లేదు, చేయను. నాకు డాన్స్ రాదు” అన్నా. అతని కళ్ళవైపు చూశా.

“నువ్వెందుకు పదే పదే నా కళ్ళవైపు చూస్తున్నావు?”

“నీ కళ్ళు ప్రత్యేకంగా చిరుతపులి కళ్ళలా ఉన్నాయి. ఎక్కడో చూసినట్టు అనిపించాయి.”

“కళ్ళు మన ఆత్మని రెప్రెసెంట్ చేస్తాయట తెలుసా” అన్నాడు ఆశ్చర్యంగా.

“అవునా! అంటే నువ్వు వేటాడే ఆత్మనా?”

అతను మాట్లాడకుండా వైన్ సిప్ చేస్తున్నాడు.

అతని సమక్షం ఎందుకో క్రమంగా ఇరుగ్గా ఇబ్బందిగా అనిపిస్తోంది.

“ఇక వెళ్తాను” అంటూ సడెన్‌గా లేచాను.

“కాసేపు నాతో కూర్చోండి ప్రిన్సెస్” అంటూ వేడుకుంటున్నట్టు అడిగాడు.

ఆ కథను చెప్పాక అతడు మునపటిలా నవ్వడం లేదు. నిశ్శబ్దంగా ఉంటున్నాడు.

అతడు నా చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అతడి చేయి వెచ్చగా మెత్తగా ఉంది. చేయి తాకితేనే అతడి ఊపిరి నన్ను తాకుతున్నట్లు అనిపించింది. బాగా చీకటి పడింది. నక్షత్రాలు మెరుస్తున్నాయి. అప్పుడప్పుడు నక్షత్రాలు కూడా చరిత్రను చెపుతాయి.

“బహుశా ప్రిన్స్ పెద్రో తన ప్రేమని గొప్పగా చూపించుకోవడానికి కాక, మహారాణిగా ఉండాలనే ఇనేస్ కోరికను తీర్చడానికి అలా చేసి ఉంటాడు” అన్నాడు. చేతిలో ఉన్న పుస్తకం తీసి ఈ ఫోటో చూడు అని చూపించాడు.

పర్పుల్ రంగు ఫ్రాక్‌లో సింహాసనంపై కూర్చొని ఉన్న డెత్‌ క్వీన్‌, ఇనేస్ దె కాస్త్రో.

ఆమె స్కెలిటన్ చేతిని ఎవరో ముద్దాడుతున్నారు. అది చూశాక లోపలేదో కంపించినట్లనిపించింది. షాక్‌లో నేను వేసుకున్న పర్ఫుల్‌ కలర్‌ ఫ్రాక్‌ను చూసుకున్నా!

“ఇక, వెళ్తాను” అంటూ లేచి వేగంగా అడుగులు ముందుకువేశా.

అతడు నా వెనుకే వచ్చాడు. చీకట్లో వేగంగా నడుస్తూ నడుస్తూ కాలికి ఏదో తగిలి ముందుకు తూలి పడబోయా. అతడు నా చేతిని గట్టిగా పట్టుకొని కిందపడకుండా పట్టుకున్నాడు. అంతే అకస్మాత్తుగా మోకాళ్ళపై ఒంగి నా చేతిని ముద్దాడాడు.

“నీ పేరు?”

“ఆల్బరో గోన్సాల్బెస్.”

అతను చూపించిన పుస్తకంలోని వాక్యం గుర్తొచ్చింది: The three noble men, appointed by king Afonso – Pêro Coelho, Álvaro Gonçalves, and Diogo Lopes Pacheco – went to the Monastery of Santa Clara-a-Velha in Coimbra, in the gardens where she and Pedro used to meet, and killed Inês by decapitating her.

శ్రీసుధ మోదుగు

రచయిత శ్రీసుధ మోదుగు గురించి: అమోహం, విహారి అనే కవితా సంకలనాలు, రెక్కలపిల్ల అనే కథా సంకలనం వచ్చాయి. ...