కొత్త నిర్వచనం

రాతిరి
రెండే దారులు

ఒకటి-
కనురెప్పల వెనక
వేకువ కంచెల గుండా
వేచి చూసే ప్రయాణం
ఉదయానికై.

రెండు-
కల
జ్ఞాపకంతో కలిసి
గుర్తెరిగిన లోకాలేలి
పరిచే వ్యక్తావ్యక్త తీరాలకై.

నువ్వు ఇంకా ఉంటావ్
ఓ యవనిక రూపాన
తక్కినదంతా
ఓ రేఖామాత్రమై…

ఘోషలు, ఉద్వేగాలు
కథలు, ప్రయాణాలు
ముగింపులన్నీ
తుది అంచులని దాటిన
గాలి తెరలుగా మారి
వీచి వీచి వెళ్ళిపోయాయి.

లేచి దులుపుకోగలిగితే
నిశ్శబ్దంగా రాలిపోయి
వెళ్ళిపోగలవు నువ్వు,
అది ఈ ఉదయం.

మరో ఉదయాన
నీ మీద మొలిచిన పూల గుత్తులు…
సంవత్సరాల తేదీలు
విశ్వ చలనాలకు తెలీదు కదా.

ఎవరి వైపునుంచి చూసినా
కొన్ని కణాలు
వాటి మరణాల డైరీ
నువ్వు-నేను-ప్రపంచం.