తనువంతా మొలిచిన ఎడారి కళ్ళు
ఒక్క కన్నూ
పొరపాటున తడిని పలవరించదు
పక్కపై ఎంత పొర్లినా
అలసట తీరనట్టు
రెప్పలచూరుపై కునుకుపిట్ట వాలనట్టు
ఒకటే విసుగు
కిటికీ తెరిచినా మూసినా
చిక్కటి చీకటి నర్తిస్తూ
నరనరాలలో ప్రవహిస్తూ
ముక్కలైన చందమామ
నింగిలో మూలకు చేరి
ముఖం వేళ్ళాడేసినట్టు
ఆకాశం నలుపును పూసుకుని నిట్టూర్చినట్టు
అంతటా నక్షత్రసమూహాల సందడి
ఒక వెలుతురు తునకా
లోనికి ఇంకదు
పగలో రాతిరో
తెలియనివ్వని
పైపై పూతల
నియాన్ లైట్ల కాంతిలో
ప్రకాశిస్తున్న నగరం
ఏమివ్వగలదు
ఎప్పుడు తెల్లవారగలదు?
వెన్నెల దిగులంతా
ఏ లిపిలో రాయాలి
ఇంకిపోయిన నదిని
ఎలా చిగురింపజేయాలి?