సోల్జర్ చెప్పిన కథలు: రెండు గంటల కోర్స్

“వెల్‌కమ్!”

కమాండింగ్ ఆఫీసర్, కల్నల్ రైనా గొంతు నిశ్శబ్దంగా ఉన్న హాల్లో ఖంగుమంది.

“మీరంతా సోల్జర్స్. ఆరేడేళ్ళ సర్వీస్‌ని చేసినవాళ్ళు. ఇంతవరకూ మీరు చేసిన సర్వీస్, మీరు పోగు చేసుకున్న అనుభవం అంతా చంటి పిల్లాడు ఆరేళ్ళు వచ్చే వరకూ నేర్చుకున్నదాంతో సమానం.”

“బేసిక్ ట్రైనింగ్ తర్వాత, ఈ మూడు-నాలుగేళ్ళూ మీరు మీ మీ యూనిట్లలో ఏయే ఎక్విప్‌మెంట్ మీద పనిచేశారో, ఆ అనుభవం మీకు ఇప్పుడు, మీరు చేసే ఈ ఆరునెలల అప్‌గ్రేడింగ్‌ కోర్స్‌లో పనికొస్తుంది.”

క్షణం ఆగి, అందర్నీ పరికించాడు. “సో, ఈ కోర్స్ చేశాక మిమ్మల్ని జూనియర్ సిపాయిలుగా కాక, బాధ్యతగల సైనికులుగా గుర్తించడం మొదలవుతుంది. ఇక్కడో మాట చెప్పాలి మీకు. ఎదగాలన్న తపన ఉన్నవాళ్ళని ఏ ఆటంకాలూ ఆపలేవని మీరు వినే ఉంటారు. ఆర్మీలో అది పూర్తిగా నిజం. కష్టపడి పై రాంకుల్లోకి ఎదిగేవాళ్ళని అడ్డుకునేవాళ్ళెవరూ ఉండరు.”

చెవులు రిక్కించుకొని వింటున్నాం.

“మీరు ముఖ్యంగా గమనించాల్సింది – ఈ కోర్స్ చేసిన తర్వాత మీ కెరియర్ ఒక క్రాస్‌రోడ్స్‌కి చేరుతుందని. వాటిలో ఒక దారి మిమ్మల్ని చాలా ఎత్తుకి ఎదగనిచ్చి ‘కల్నల్’ రాంక్‌కి చేర్చుతుంది. మరో దారి ‘హవల్దార్’ రాంక్ వరకూ వెళ్ళి ఆగిపోతుంది. ఏ దారిలో వెళ్ళాలో నిర్ణయించుకోవాల్సింది మీరే… కాబట్టి, ఈ కోర్స్‌లో మంచి రాకులు తెచ్చుకోవడం మీకు చాలా అవసరం.”

“యూ! స్టాండప్,” చివరి లైన్లో కూర్చున్న నాయర్‌ని కేన్‌తో సూచిస్తూ అన్నాడు. నాయర్ ఠక్కున లేచి, స్మార్ట్‌గా సెల్యూట్ చేశాడు.

“ఈ రెజిమెంట్ గురించి నీకేం తెలుసు?”

“…”

“ఏమీ తెలీదా?”

“…”

“సరే. ఈ గోవా గురించి ఏం తెలుసు?”

“బీచ్‌లు, ఇంకా…” తడుముకున్నాడు నాయర్.

‘చూశారా?’ అన్నట్లు పక్కనే స్టిఫ్‌గా నిలబడ్డ సుబేదార్ మేజర్ కేసి చురుగ్గా చూసి, నాయర్ని కూర్చోమన్నట్లు సైగ చేశాడు సీవో.

“మీరందరూ వేర్వేరు చోట్లనుంచి ఇక్కడికి వచ్చారు. చెయ్యబోయే కోర్స్ తాలూకు సిలబస్ గురించి తెలిసినా తెలియకపోయినా, ఇక్కడి బీచ్‌ల గురించి, ఇతర ఆకర్షణల గురించీ మాత్రం బాగా తెలుసని, నాకు ఇంకా బాగా తెలుసు.”

హాల్ వింటోంది.

“ఎయిడ్స్ గురించి విన్నారా?” ఉన్నట్టుండి ప్రశ్న వేశాడు కల్నల్.

ఊపిరి బిగబట్టాం. తెలియందెవరికి? చాలామంది గుటకలు మింగాం.

“అదిక్కడ చాలా కామన్ అని గుర్తుంచుకోండి. ఐ వాంట్ టోటల్ డిసిప్లిన్. వన్ రాంగ్ స్టెప్ అండ్ యూ విల్ బీ ఇన్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్.”

“బెస్టాఫ్ లక్.” టోపీ సర్దుకున్నాడు కల్నల్ రైనా.

“క్లాస్, సావ్‌ధాన్ బైఠ్!” కమాండ్‌ ఇచ్చి, బయటకు అడుగులేస్తున్న సి.ఒ. వెంట వడివడిగా ఫాలో అయాడు సుబేదార్ మేజర్.


ఆదివారం.

అంటే బయటికి వెళ్ళి షికారు చేసి వచ్చేందుకు అవుట్‍పాస్ దొరికే రోజు. ఆరింటికల్లా వెనక్కొచ్చేయాలన్నదొక్కటే షరతు.

దాదాపు పది కావొస్తుండగా నాయరు, సత్తిగాడు, నేనూ బయటపడ్డాం. ఏదైనా బీచ్‌కి వెళ్దామన్నాడు నాయర్. సరేననుకున్నాం. ముగ్గురం అంజునా బీచ్‌కి చేరుకున్నాం. అంత సావకాశంగా సముద్రాన్ని చూడ్డం అదే మొదటిసారి. కింద ముదురునీలంలో నీటిని, పైన లేత నీలంరంగులో ఆకాశాన్నీ కలిపే గీతని చూస్తుంటే ఏదో తెలియని ఆనందం, విస్మయం, కలిసి చుట్టుముట్టాయి.

పదకొండు దాటింది. బీచ్ దాదాపు నిర్మానుష్యం. పై పొర వేడెక్కిన ఇసకలో, ముదిరిన ఎండలో పాంటూ షర్ట్‌లతో విహరిస్తున్నది మేమే. ఎక్కడో దూరంగా కనిపించిన ఒకళ్ళిద్దరూ ఎప్పుడో కనుమరుగయారు… అప్పుడు కనపడిందామె. ఒక్కర్తే. నల్లటి బికినీలో బోర్లా పడుకుని.

బికినీ కప్పినచోట తప్ప మిగిలిన చోటంతా రాగి రంగులో వుంది చర్మం. ఎండలో, వేడెక్కుతున్న ఇసుకలో ఎలా పడుకోగలిగిందా అనుకుంటూనే ఆమెని దాటి నడిచాం. అప్పుడు తెలిసింది ఆమె ఏం చేస్తోందో.

ఆమె చేతుల్లో స్ట్రా వేసిన కొబ్బరిబోండాం. దాని ముందో కాకి… మాటిమాటికీ టక్ టక్‍మని తలతిప్పుతూ ఆమె ముఖంలోకీ బోండాంలోకీ చూస్తూ, మధ్యమధ్యలో బోండాంలోకి ముక్కుదూర్చి నీళ్ళు చప్పరిస్తోంది. ఆమె మాత్రం అలాగే నిశ్చలంగా!

మర్యాద అనుమతించినంతసేపూ ఆ మూకీ సినిమా చూసి, అక్కణ్ణించి కదిలాం పదే పదే వెనక్కి తిరిగి చూస్తూ. అసలామెకి మా స్పృహే లేదు.

ఒకచోట నీళ్ళలోకి దిగి, వేగంలేని అలలతో ఆడుతున్నాం. నాయర్‌కి ఈత వచ్చు. నాకూ ప్రకాశం బారేజ్ దగ్గరి ఘాట్‌లలో ఈదిన అనుభవం ఉన్నా, సముద్రంలో ఇదే మొదటిసారి… ఇంతలో, కొద్దిదూరంలో ముగ్గురు విదేశీ వనితలు. అంతే. మా చూపులు అటే తిరిగిపోయాయి. వాళ్ళు పరుగెడుతున్నారు. అలలకి అల్లంత దూరంలో ఉండగానే ఒక్కొక్కటిగా బట్టలు వలిచేసుకుంటూ దభేల్ దభేల్మంటూ నీళ్ళలోకి దూకారు. ఆ నవ్వులూ కేరింతలూ… నాయర్ మాకేసి చూసి, తలతో వాళ్ళవైపు సూచించి కొంటెగా నవ్వాడు. అసలే వాడివి పెద్ద పళ్ళు. జుట్టు కిందకి జారి అతుక్కుపోయి, పెద్దపెద్ద మీసాలకింద మెరుస్తున్న తెల్లటి పళ్ళతో ఇప్పుడు వాడి ముఖంలో ఒక వెర్రి సంతోషం.

మెడలోతు నీళ్ళలో కేరింతలూ కిలకిలా నవ్వుల్లో మునుగుతున్న వాళ్ళు మమ్మల్నేమీ పట్టించుకోలేదు. ఒకామె నిలువునా పైకి గెంతింది. వెంటనే మిగిలిన ఇద్దరూ. కాసేపు అలా గెంతుతూనే ఉన్నారు. నవ్వులూ కేరింతలూ.

నాయరూ సత్తిగాడూ ఈత మర్చిపోయి తదేకంగా చూస్తున్నారు తడిగా మెరుస్తున్న ఆ శరీరాలని. మెడలోతు నీళ్ళలో దాగుతున్న ఎత్తులూ పల్లాలూ వాళ్ళు బిందాస్‌గా పైకి గెంతుతున్నప్పుడు అదుపులేకుండా కదుల్తూ, వేగంగా మళ్ళీ నీళ్ళలోకి మాయమవుతున్నాయి. వాళ్ళు బయటకి పరుగెత్తేక గానీ నాయర్ మొఖంలో నవ్వు వెడల్పు తగ్గలేదు.

బయటకొచ్చాం. ముందుగా కనిపించిన హోటల్లోకి దూరి ఏవో తిన్నాం. ఇప్పుడేంటి అనుకునేలోపు నాయరే మళ్ళీ చాలా కాన్ఫిడెంట్‌గా దిశానిర్దేశం చేశాడు. “వాస్కోకి పోదాం!”

“ఏముందక్కడ?” అడిగాను.

నవ్వాడు నాయర్. “నయా నయా పిక్చర్ దేఖ్నా నహీ క్యా?”

ఇక్కడ లేవూ సినిమాలు? అంతలోనే సీరియస్‌గా మారిన వాడి మొహం చూసి, మళ్ళీ అడగాలనిపించలేదు.

బైనా బీచ్‌ పొడవునా పాకలు, పక్కా షెడ్లు. ఒక మాదిరి రద్దీ. ఎక్కువగా కుర్రాళ్ళ చిన్న చిన్న గుంపులు – వాటిలో ఒకళ్ళిద్దరు ఆడవాళ్ళు. నడక మొదలుపెట్టాం. కుర్రాళ్ళు చనువుగా తాకుతున్నా, ఆ ఆడవాళ్ళేమీ అడ్డుకుంటున్నట్లులేదు. వెంటనే అర్థమైంది ఆ ఏరియా ఏమిటో. ఒకప్పుడు చదివిన కొన్ని పుస్తకాలు గుర్తొచ్చాయి. ఆ వెనకే సి.ఒ. వార్నింగులు కూడా…

నాయర్ ఒక షెడ్ లాంటి హోటల్‌ ముందు ఆగి, ‘పదండి’ అన్నట్లు తలతో సూచించి లోపలికి నడిచాడు. కొన్ని బల్లలు, వాటికి రెండువైపులా చెక్క బెంచీలు. గ్లాసుల్లో ద్రవాలు. ప్లేట్లలో నాన్-వెజ్ స్నాక్స్. మద్యం, సిగరెట్ల వాసన ఘాటుగా, వొత్తుగా చుట్టుముట్టింది. డిమ్ముగా ఉందక్కడి సీన్. నాయర్ కూర్చోగానే మేమూ కూర్చున్నాం.

“నయా పిక్చర్… దేఖ్నా హై?” అన్నాడు ఇందాకట్లా నవ్వుతూ. అందులో, వయసు ఎగదోస్తున్న ధైర్యమేదో వెలుగుతోంది. జరగబోతున్నదేమిటో తెలియకపోయినా, భేషజంతో కవర్ చేస్తున్నాను.

ఇక్కడికి రాకుండా ఉంటేనే బాగుండేదిమో. పోనీ, ఇప్పుడు లేచి వెళ్ళిపోతే?… ఆలోచన ఆచరణ అయ్యేలోపే బీరొచ్చింది. గ్లాసుల్లోకి పోశాడు వెయిటర్. తప్పదని, సిప్ చేశాను. నోట్లో చేదు పేలింది. సత్తిగాడూ, నాయరూ తొందరగా సగం సగం ఖాళీ చేశారు. సత్తిగాడు నవ్వుతూ చెప్తున్నాడు. “రేయ్, రావుగాడా. బీర్ ఎప్‌డినా తాగినావ్‌రా. మనం ముగ్గురోల్లు కలిచి నిండా ఖతం చెయ్యవాలి. చేస్తువా?” ఛాలెంజికి వొప్పుకుంటున్నట్లు తలూపాను.

ఇందాక మరో టేబుల్ దగ్గర కూర్చున్న ఒకామె లేచొచ్చి నా పక్కన కూర్చుంది. గుండె గతుక్కుమంది.

దూరం జరిగాను – రెండంగుళాలు!

రెండు నిముషాలు గడిచాయి. ఏదో పక్షి ఈక స్లోమోషన్లో నేలమీద పడినట్లుగా, ఆమె చేతి స్పర్శ నా కుడి తొడమీద తెలిసి తెలిసీ… పొలమారింది. ముక్కులోకి చేరి బీరు మండింది.

నాయరూ సత్తిగాడూ నవ్వారు. ఆమె కూడా శ్రుతి కలిపింది. నాయర్‌తో ‘బీర్ వాంగిడా’ అంది. నాయర్ సైగ అందుకున్న వెయిటర్ వెంటనే మరో బీరుతో వాలాడు. ఎత్తిన బాటిల్ని దించకుండా రెండంటే రెండు నిమిషాల్లో బీరు సీసాని గాలితో నింపిందామె కంటి చివర్లనుంచి మమ్మల్ని పరికిస్తూ. సీసాని దించి పైకి లేచింది.

చిరునవ్వుతో నాయర్ పక్కకు నడిచి చెయ్యిపట్టుకుని లేవదీసింది. అందుకే ఎదురుచూస్తున్నట్లు లేచి, ఆమెతోసహా, ఒక మూల చీకటిగా కనిపిస్తున్న నడవాలోకి నడిచాడు.

యూనిట్లో ఉన్నప్పుడు, వానపామల్లే చెప్పిన పని సైలెంట్‌గా చేసుకుపోయే నాయర్ వీడేనా! అంటే ఈ చాపల్యంతోనే వీడు మమ్మల్ని ‘వాస్కో’కి తోలేడన్నమాట! ఓరినీ! బరువెక్కుతున్న కళ్ళని కంట్రోల్లోకి తెచ్చుకునేసరికి పక్కన సత్తిగాడూ లేడు. నాకేనా ధైర్యం లేంది?

అమ్మో! పుస్తకాలూ జాగ్రత్తలూ వార్నింగులూ… బెంచీకి తాపడం అయిపోయినట్లు అతుక్కుపోయాను.

అదుగో సత్తిగాడు!

“రావ్‌గాడా, బీర్ తాగి అవతగా, ఆ క్రాసింగ్‌లే నిలు. ఆటో ఫిక్స్ చెయ్‌వాల. సెంట్రల్ పార్క్ బస్టాండ్ అని సెప్పవాల. అంబదు రుబాయ్‌కు బేరం సెయి” హడావుడిగా ఆర్డరేసేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికెళ్ళాడో గమనించేలోపే. తూలకుండా మేనేజ్ చేసుకుంటూ ఆటోస్టాండ్‌కి చేరాను.

అరగంట గడిచింది. హీరోలిద్దరూ తిరిగొచ్చారు. ఆటో కదిలింది. సిగరెట్ వెలిగించాడు నాయర్. ఆశ్చర్యంగా చూశాను. “కభీ కభీ పీతా హై?” అన్నాడు నా మోహం చూసి. మళ్ళీ అన్నాడు “అభీతో – పీనా పడ్తా హై!” వాడి నవ్వు ఇప్పుడు వెలుగుతోంది – తృప్తిగా.

ఆటో పరుగెడుతోంది. కాసేపటి తర్వాత “డేయ్ నాయర్. కిత్నా దియారే?” సత్తిగాడి ప్రశ్న.

“టూ హండ్రెడ్. తుమ్?”

“నూత్తి అంబ. నూర్రువా…”

“కన్నడా… కన్నడా మాల్. మజా ఆయా దోనోఁ బార్!” గుర్తుచేసుకున్నాడు నాయర్.

వాంతిని గొంతులోనే అదిమిపట్టాను. కాసేపు నిశ్శబ్దం.

“డేయ్ రావ్‌, ఎంతరా ఆటో? ఫిఫ్టీదానా?” సత్తిగాడి క్వైరీ.

“ఊహు. హండ్రెడ్.”

“క్యోఁ?” విసుక్కున్నాడు నాయర్.

“హండ్రెడ్ వేస్ట్. హండ్రెడ్ మే తో…”

“ఇంద…” అంటూ ఒక వందనోటు వాడి జేబులో కుక్కి, మొహం తిప్పుకున్నాను.


“ఈ లైన్‌లోకి మాత్రం ఠంచన్‌గా వచ్చి నిలబడతావ్!” చనువుగా కామెంట్ చేశాడు నాయక్ జార్జ్. పీకే సింగ్ నవ్వేశాడు. వాళ్ళిద్దరిదీ ఒకటే సెక్షన్. నాకూ పీకే సింగ్‌కీ జార్జ్ కామన్ ఫ్రెండ్. “చూడు మేజర్, ఫౌజ్‌లో పని చెయ్యాలంటే రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. హర్ ఫాలిన్ మే జరూర్ మిల్నా, సాబ్ కే సామ్నే సే, గధే కే పీచే సే నహీ జానా!”

“నీలాంటి బిహారీనే ఓసారి, ఎనిమీ ఫైర్ వస్తుంటే దోమతెర కప్పుకుని కూచున్నాట్ట. అదేంట్రా అంటే, ‘దోమలే దూరలేని దోమతెరలో బుల్లెట్లెట్లా దూర్తాయీ’ అన్నాట్ట!” ఇష్యూ ఎన్‍సిఓ వచ్చాడా లేదా అని ఓ కంట చూస్తూనే అంటించాడు జార్జ్.

తమని రాష్ట్రం పేరుతో సంబోధిస్తే బీహార్‌వాళ్ళకి సాధారణంగా వచ్చే కోపం పీకే సింగ్‌కి రాలేదు. నవ్వుతూ, మెస్ వైపునుంచి వీచిన మటన్ కూర వాసనని తనివితీరా పీలుస్తూ మొదలెట్టాడు. “ఎందుకో చెప్పనా? గాడిద వెనకాల తచ్చట్లాడావనుకో, అది ఎప్పుడు తంతుందో తెలీదు. అలాగే, ఆఫీసర్ ముందునుంచి గుడ్ సోల్జర్‌లా సెల్యూట్ కొట్టుకుంటూ వెళ్ళావనుకో, ఎప్పుడు నిన్ను పిలిచి ఏం పని చెప్తాడో తెలీదు. పైగా మనల్ని చూస్తే ఏదో ఒక పని తప్పకుండా గుర్తు రానే వస్తుంది. చాలు కదా! మూడోది చెప్పాలా?”

ఆ రోజుకి రమ్‌ని కొలిచి అమ్మే డ్యూటీ పడ్డ ఎన్‍సిఓ వచ్చాడు. వరండాలో వేసిన టేబుల్ పక్కనే లిక్కర్ కేస్ పెట్టుకుని, ఒక లాంగ్ నోట్‌బుక్ తెరిచి కూర్చొన్నాడు.

“అసలూ, ఈ రమ్ ఇష్యూ వారానికి మూడు రోజులే ఎందుకుండాలి? రోజూ ఎందుకుండదు? మన డబ్బులతో మనం కొనుక్కుని తాగేదే కదా?” జవాబు తెలిసిన ప్రశ్న వదిలాడు పీకే సింగ్. “జెసిఓ అయిపో. అక్కడ రోజూ ఉంటుంది. అందుకే అంటారు – సూర్యా అస్త్, జెసిఓ మస్త్! అదింకో పది పదిహేనేళ్ళ తర్వాతి మాటేలే…” నిట్టూర్చాడు పీకే.

రమ్ ఇష్యూని పర్యవేక్షించడానికి వచ్చిన డ్యూటీ జెసిఓ తనకోసం ఒక పక్కన వేసిన కుర్చీలో కూర్చొని మాట్లాడ్డం మొదలుపెట్టాడు.

“దేఖో భాయ్. ఏక్ పెగ్ మిలేగా. అంతకన్నా ఎక్కువ ఇష్యూ చెయ్యడానికి సి.ఒ.సాబ్ పర్మిషన్ కావాలి. మీరంతా డిసిప్లిన్‌తో వుంటే, సాబ్‌తో మాట్లాడి ఓకే చేయిస్తాను.” అవి ఉత్తుత్త బెదిరింపులేనని అక్కడ అందరికీ తెలుసు. మెస్‌లో రమ్ ఇష్యూ గురించి సి.ఒ.తో మాట్లాడే దమ్ముందా ఈ జెసిఓకి?

“అప్రేల్ కా మహీనా హై. ఎండాకాలం. ఎక్కువ తాగకండి. పొట్ట పాడవుతుంది. ఠీక్ హై? మేజర్, శురూ కరియే…” అంటూ, రమ్ ఇష్యూని మొదలుపెట్టమని ఎన్‍సిఓకి చేత్తో సూచించాడు డ్యూటీ జెసిఓ. “యస్‍ సర్!”

“బోలో…” పొడవాటి నోట్‌బుక్ తెరిచి పెన్నుతో సిద్ధమై అడిగాడు ఎన్సీవో.

“140812-ఎల్, సిపాయ్ భూరేలాల్.”

బాటిల్లోంచి పెగ్ మెజర్‌తో కొలిచి, ఆ సిపాయి పట్టుకున్న స్టీల్ గ్లాసులో ఒక పెగ్ రమ్ పోశాడు ఎన్సీవో. “తీన్ రుపయ్యా” డబ్బు తీసుకుని ఒక ప్లాస్టిక్ సంచీలో వేసుకున్నాడు.

“874236-డబ్ల్యు, నాయక్ మల్ఖాన్.”

క్యూ మెల్లిగా కదుల్తోంది.

“794432 వినోద్ కె. ఎన్.” నా సెక్షన్ వాడే.

“రాంక్?”

“ఊఁ? సిపాయ్. సర్, దో దేదో…”

“మళ్ళీ రావచ్చుగా.” విసుక్కుంటూనే, డ్యూటీ జెసిఓ కంట పడకుండా రెండు పెగ్గులూ కొలిచి పోశాడు ఎన్‍సిఓ.

“చలో భాయ్” అంటూ కదిలాడు జార్జ్. పీకే సింగ్‌తోబాటు గ్లాసులు తీసుకుని బారక్ వైపు అడుగులు వేస్తున్నాం.

“ఓయ్! మందు బారక్ లోకి తీసుకుని వెళ్ళకండి. హుకుమ్ భూలో మత్. ఇక్కడే తాగాలి. మెస్‌లో తినేసి వెళ్ళి చుప్‌చాప్‌గా పడుకోవాలి!” డ్యూటీ జెసిఓ కేక పెట్టాడు. మాట్లాడకుండా వెనక్కి తిరిగి, వెళ్ళి మెస్ వరండా చివర మెట్ల మీద కూర్చొన్నాం.

“ఇస్ కీ…” తిట్టుకున్నాడు పీకే సింగ్. “మొన్న కోర్స్ చేశాను చూడు, అక్కడ కూడా ఇలాగే ఒక సుబేదార్ మేజరున్నాడు. పరమ ఖరోడాగాడు. ఫౌజ్‌లో రూల్సన్నీ తనే అమలు చెయ్యడానికి వచ్చినట్టు మాట్లాడేవాడు. అక్కడెందుకు నిలబడ్డావ్? కటింగ్ చేయించుకోలేదేం? షూ పాలిష్ చెయ్యలేదేంటి? అది లేదేంటి, ఇది ఉందేంటి?’ అంటూ ఏదో ఓ సాకుతో పీక్కు తినేవాడు.”

“ఊఁ”

“ఒకరోజు కాంటీన్‌కెళ్ళా. తిరిగొస్తుంటే, ఉన్నట్టుండి ఎదురుపడ్డాడు. ‘ఇక్కడేం చేస్తున్నావ్?’ అని గద్దించాడు. చచ్చాన్రా బాబూ అనుకున్నా.”

“ఎందుకని? కాంటీన్‌కి వెళ్ళకూడదా అక్కడ?”

“అది పెరేడ్ టైమ్‌లే. అప్పుడు నేను క్లాసులో ఉండాల్సింది.”

“ఓ. ఏం చెప్పావ్ మరి?”

“మెడికల్ రూమ్‌కి వెళ్ళాను సర్” అన్నా. కాంటీన్ పక్కనే ఉందది.

“ఏమైంది?” అని అడిగాడు. నోటికొచ్చిందేదో చెప్పా ‘క్లోరోఫిల్ అయిందన్నారు సర్ డాక్టర్ సాబ్’ అని.”

“ఏంటీ!?” భళ్ళున నవ్వాడు జార్జ్.

“ముసలాడికి తెలిసి చావలా. పైకి మాత్రం ‘ఓహో, ఎక్కడ?’ అంటూ కూపీ లాగబోయేడు తెలివిని చూపిస్తూ. ‘కుడి మోకాలి మీద సార్’ అన్నా. రోడ్డు మీద పాంటు విప్పి చూపించమనలేడుగా! ‘ఊఁ చలో. ఊరికే అటూ ఇటూ తిరక్కుండా వెళ్ళి రెస్ట్ తీసుకో’ అని వదిలేశాడు.”

జార్జ్‌తోబాటు నేనూ నవ్వాను.

“ఆమాత్రం లౌక్యం తెలీకపోతే ఫౌజ్‌లో బతకలేం.” సగం గ్లాసు ఖాళీ చేసి మళ్ళీ మొదలెట్టాడు పీకే సింగ్. “ఓసారిలాగే యూనిట్‌కి దూరంగా ఓ కొండమీదున్న ‘డిటాచ్‌మెంట్’లో నేనూ, జావడే అని ఇంకో సిపాయీ ఉన్నాం. నేను టాయిలెట్‌కి వెళ్ళొచ్చి చూస్తే, జావడే బెండ్ పొజిషన్లో కనబడ్డాడు. ‘ఏమైంది’ అంటే, ‘ఒసి సాబ్ కాల్ చేసి ఏదో అడిగాడు. నేను తెలీదన్నాను, చివాట్లు పెట్టి గంట సేపు బెండ్ చెయ్యమన్నాడు. సాబ్ ఇంకా లైన్లో ఉన్నాడా? అన్నాడు. నాకు నవ్వాగలేదు. ‘ఒరే గాడిదా, ఒసి సాబ్ పది మైళ్ళ దూరంలో ఉన్నాడు. నువ్వు ఇక్కడ బెండ్ చెయ్యడమేంట్రా?’ అన్నాను. అప్పుడుగానీ వాడికి బల్బు వెలగలేదు.”

రెండో పెగ్గు కోసం లేచాం.

“నెంబర్?” లైన్లో మా ముందు నిల్చొన్న వినోద్‌ని అడిగాడు ఎన్‍సిఓ. అప్పటికే కొద్దిగా ఊగుతున్నాడు వినోద్.

“క్యా?”

“నెంబర్?”

“అంగ్రేజీ మే బోల్. తమిల్ మే నై!” “మర్చిపోయావా ఏంటి?” ఎవరో జోక్ చేశారు. ఈ మధ్య వినోద్ పరధ్యానం మీద జోకులు తరచుగా వినిపిస్తున్నాయి.

“రెండు గ్లాసులు తెచ్చావేంటి?” అడిగాడు ఎన్‍సిఓ. “యే నాయర్ కా హై. బాత్రూమ్‌కెళ్ళాడు. వస్తున్నాడు.” సంజాయిషీ ఇచ్చాడు వినోద్.

“సిక్స్ టూ సిక్స్ టూ… ఫార్టీ సెవెన్…”

“రాంక్?”

“లాన్స్ నాయక్…”

“ఆగే బోలో?”

“ఆర్ గోపాల్.”

“మళ్ళీ చెప్పరా?!” చుట్టూ నవ్వులు మోగాయి. “పేరెప్పుడు మార్చుకున్నావ్ వినోద్? పెగ్గుకో పేరు మార్చుకుంటావా ఏంటి?” నవ్వులని పట్టించుకోకుండా రెండు గ్లాసులూ పట్టుకుని వెళ్ళిపోయాడు వినోద్.

డ్యూటీ జెసిఓ డైనింగ్ హాల్లోకి వెళ్ళాడు.

గ్లాసుల్లో రమ్ నింపుకుని, మళ్ళీ మెస్ వరండా మెట్ల మీదికి చేరాం. “ఈ షిండేగాడు మెస్ కమాండర్ అయినప్పట్నించీ, ఫుడ్డులో టేస్ట్ పూర్తిగా పోయింది. ఒకరోజు కారాలు ఎక్కువవుతాయి, ఇంకోరోజు రోటీలు ముందే అయిపోతాయి. అదేంట్రా అంటే, నువ్వే లేటుగా వచ్చావని దబాయిస్తాడు!” పితూరీ చెప్పసాగాడు పీకే. “వాణ్ని అడిగేవాడెవడూ లేడనుకుంటున్నాడు.”

“నాలుగువందలమందికి వండే వంట అది. ఒక్కొక్కళ్ళకీ నచ్చేలా చెయ్యడం ఎలా కుదురుతుంది? మనమే సరిపెట్టుకోవాలి” అన్నాను.

“ఏంటి సరిపెట్టుకునేది? నాకు రోజుకి 420 గ్రాముల గోధుమపిండి ఆథరైజ్ చేసింది సర్కార్. రోటీలు ఎందుకయిపోతాయి? ఎక్కడికి పోతున్నట్లు? ఈసారి ‘సైనిక సమ్మేళన్’లో పాయింట్ ఇస్తాను.” మందు పని చెయ్యడం మొదలుపెట్టింది పీకే సింగ్ మీద. “సాలేకో… పాఠం నేర్పాల్సిందే” అన్నాడు.

“ఇద్దువులే” అంటూ లేచాడు జార్జ్.

భోజనాలు కానిచ్చి బయటికొచ్చాం. రమ్ ఇష్యూ ముగియడంతో ఇప్పుడు అక్కడి సందడి పల్చబడింది. వరండా చివర ఒక్కడూ ఇంకా కూర్చొనే కనబడ్డాడు వినోద్. చేతిలో గ్లాస్. పీకే సింగ్, జార్జ్‌తోబాటు బారక్ వైపు కదిలాను.

“చాల్లే వినోద్. మెస్ క్లోజ్ అవుతోంది. వెళ్ళి తినేయ్?” అంటూ అతన్ని సమీపించాను. రెండు క్షణాల తర్వాత, తల పైకెత్తి చూసిన వినోద్ కళ్ళల్లో ఏదో తెలియని ఇబ్బంది – క్షణం పాటు కదిలి మాయమైంది.

“రమ్ చేదు. కానీ తాగుతాం. జీవితం చేదు. కానీ బతుకుతాం. కదూ రావ్?”

“ఏంటీ?” ఎంత మందు ఎక్కువైనా తొణికే మనిషి కాడు వినోద్. ఏదో జరిగింది. మళ్ళీ అడిగాను.

“ఏం… ఏముంది? ఏం లేదు. ఎవరూ లేరు.” ఖాళీగా ఉన్న చేతిని చిన్న పిల్లాడిలా తిప్పుతూ అన్నాడు వినోద్.

“అంటే?”

“…”

“అంటే? ఏమైంది భాయ్?” రెట్టించాను స్నేహంగా.

“అమ్మ… నాన్న… అక్క…”

“ఏమైంది వాళ్ళకి?

“…”

“పర్వాలేదు చెప్పు… చెప్తే కొంత బాధ తగ్గుతుంది.”

“ఏంటి తగ్గేది?” బాధ ఎండి గరుకెక్కిన గొంతుతో ఎదురుప్రశ్న వేశాడు వినోద్.

గతుక్కుమన్నాను. “అసలేమైంది?”

“అక్క బెంగళూరులో చదువుతుండేది. నేను సెలవ మీద ఇంటికి వెళ్ళినప్పుడు, అక్క కూడా వచ్చి మాతో నాలుగురోజులు ఉంటుందిలే అని తనని తీసుకుని ఐలాండ్ ఎక్స్‌ప్రెస్‌లో తిరిగి వస్తున్నాం నేనూ, నాన్నా. పెరుమన్ లేక్ దాటుతున్నాం. పగలే. భోజనం చేశాక, ఊరికే డోర్ దగ్గరకి వెళ్ళి నిలబడ్డాను. వాళ్ళిద్దరూ ఇంకా తింటూనే ఉన్నారు…” వినోద్ గొంతులో పొడి పెరిగింది.

“ఊఁ…”

గ్లాసెత్తి పెద్ద గుక్క వేసి, “ఉన్నట్టుండి పెద్ద సౌండు. ఒక్కసారిగా జారి పడిపోయాను నీళ్ళలోకి. నా వెనకే ట్రైన్ బోగీ, మనుషులూ పడుతున్నట్టు కేకలు… అంతే గుర్తుంది. మళ్ళీ కళ్ళు తెరిచింది ఆస్పత్రిలోనే. నాలుగు రోజుల తర్వాత” అన్నాడు ఎటో చూస్తూ.

“ఆఁ?!”

“వచ్చే తెలివీ, పోయే తెలివీ. కాలు విరిగింది. రెండు రిబ్స్ బీటిచ్చాయి. చెవి తెగింది.” చూపించాడు. ఎడమ చెవి తమ్మె ఉండాల్సిన చోట, ఆక్వర్డ్‌గా ఒక ఖాళీ. “మరో నాలుగైదు రోజులకి తెలిసింది. నాన్నా, అక్కా ఇద్దరూ…”

“అయ్యో!”

అలవాటైపోయినట్లు, నా సానుభూతిని పట్టించుకోలేదు వినోద్.

“… మరి… మీ అమ్మ? అమ్మ నిన్ను వెతుక్కుంటూ ఆస్పత్రికి రాలేదూ?” కూడదీసుకుంటూ అడిగాను.

“ఎలా?”

అతని ఎదురుప్రశ్నని అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తుండగానే గ్లాసు ఖాళీ చేశాడు.

“కబురు విన్న అమ్మకి హార్ట్ ఫెయిలైందిట. ఆ రాత్రికే…” చటుక్కున ఆపేసి లేచి వెళ్ళిపోయాడు వినోద్, తూలకుండా నడుస్తూ.