ఊహలకందని మొరాకో -2

ఆట్లస్‌ పర్వతశ్రేణి – ఇమ్లిల్ – బెన్‌‍హద్దూ

మొదటి యాత్ర చేసిన ఐదేళ్ళకు మొరాకో మరోసారి నన్ను తన దగ్గరకు పిలిపించుకుంది. నా మొదటి ప్రయాణపు కేంద్ర బిందువు దేశపు నైరుతి దిశలో ఉన్న అగాదీర్‌ పట్టణం అయితే నా ఈ రెండో ప్రయాణానికి తుళ్ళిపడే మరాకేష్‌ నగరం ప్రధాన వేదిక. అప్పటికే మరాకేష్‌ గురించి ఎంతెంతో విని ఉన్నాను. మొదటి ప్రయాణంలో ఆ నగరానికి వెళ్ళలేకపోయాను. చాలామందికి మొరాకో అంటే మరాకేష్‌, మరాకేష్‌ అంటే మొరాకో. యాత్రికులంతా మొరాకోలో మొట్టమొదట అడుగు పెట్టేది మరాకేష్‌ నగరంలోనే. మొదటిసారి చూడలేకపోయిన ఆ మార్మిక మాంత్రిక నగరాన్ని చూడటానికి ఇపుడు నాకు అవకాశం చిక్కింది.

అవి 2019 చిట్టచివరి రోజలు. క్రిస్‍మస్‌ వేడుకలు అప్పుడే ముగిశాయి. పండుగ రోజుల్లో ఉండే నా ఒత్తిడి నిండిన ఉద్యోగ బాధ్యతలను ముగించుకొని, హాస్పిటల్లోని ఇతర పనులన్నీ పూర్తి చేసుకొని, క్షణం ఆలస్యం చెయ్యకుండా లండన్‌ నగరపు గాట్విక్‌ విమానాశ్రయం వేపు పరుగుతీశాను. హాస్పిటళ్ళలో పనిచేసే డాక్టర్లకు పనివేళల పట్టింపు ఉండే అవకాశం లేదు, ఇరవై నాలుగ్గంటలూ పని చెయ్యాలి కదా–పండుగలూ, వారాంతాలూ, బ్యాంక్‌ శలవలూ వచ్చినపుడు మా డాక్టర్లమంతా వంతులవారీగా డ్యూటీలు వేసుకుని హాస్పిటల్‌ నిరవధికంగా సాగేలా చూస్తాం. ఈసారి ఆ వంతు నాదయింది. మా ఆవిడా పిల్లలూ కొద్దిరోజుల ముందే మా మరో స్నేహితుని కుటుంబంతో కలసి మొరాకో చేరుకున్నారు. డ్యూటీలన్నీ ముగించుకొని నేను వెంటనే విమానం ఎక్కి వాళ్ళందర్నీ చేరుకోవాలన్నది మా ప్రణాళిక. ఆ ప్రకారం నేను విమానం పట్టుకొన్నాను.

నేను తీసుకున్నది మధ్యాహ్నం లండన్‌ నుంచి బయల్దేరే విమానం. మూడున్నర గంటల ప్రయాణం. పగటి ప్రయాణం అవడం వల్ల దిగువున నింగీ నేలా సముద్రం స్పష్టంగా కనిపించాయి. ఇంగ్లీషు ఛానెల్‌ దాటుకొని విమానం ఫ్రెంచి భూభాగంలోకి ‘అడుగు’ పెట్టడం, అదీ దాటుకొని, పైరెనీస్‌ పర్వతాలను దాటుకొని స్పెయిన్‌ గగనతలం చేరడం గమనించాను. ఉత్తర దక్షిణాలుగా విస్తరించి ఉన్న ఆ పర్వతాల జాడలు అతి స్పష్టంగా కనిపించాయి. విమానం స్పెయిన్‌ భూభాగాన్ని దాటుకొంటూ ముందుకు సాగింది. నాకు తెలియకుండానే చిన్నపాటి కునుకు తీశాను. ‘మనం కోస్టా డి సాల్ ప్రాంతపు మలాగా నగరం మీదుగా సాగుతున్నాం’ అన్న విమానం కెప్టెన్‌ ప్రకటన నన్ను నిద్రలోంచి బయటపడేసింది. కిటికీలోంచి చూస్తే మధ్యదరా సముద్ర తీరాన ఉన్న మలాగా నగరపు రూపురేఖలు స్పష్టంగా కనిపించాయి. కొద్దిక్షణాల్లో సముద్రపు అవతలి ఒడ్డున ఉన్న మొరాకో గగనతలం లోకి ప్రవేశించాం. దిగువున గోధుమరంగు గొగ్గిరి పర్వతాలు, వాటిలో అక్కడక్కడ గాఢనీలపు జలాల కొలనులు, ఆ కొలనుల నీరు చిలవలు పలువలుగా కొండల నడుమ విస్తరించి ఉండటం కనిపించింది.

మరాకేష్‌‍ లోని అధునాతనమైన మెనేరా విమానాశ్రయంలో కస్టమ్సూ ఇమ్మిగ్రేషన్ల తనిఖీ ఏ ఒడిదుడుకులూ లేకుండా చకచకా సాగిపోయింది. అక్కడి అధికారుల వ్యవహార సరళి, ప్రవర్తనా రీతి, మర్యాద పూర్వకంగా స్వాగతం చెప్పే పద్ధతి నన్నాకట్టుకొన్నాయి. యాత్రికుల పట్ల మొరాకో దేశం ఎంత ఆదరంగా ప్రవర్తిస్తుందో నాకు విప్పిచెప్పాయి. విమానాశ్రయంలో అన్ని పనులూ ఎంతో సరళ సమన్వయంతో ముగిశాయి.

ఎరైవల్స్‌ గేటు దగ్గర నా పేరు రాసి ఉన్న ప్లకార్డు పట్టుకుని ఒక మనిషి కనిపించాడు. మా వాళ్ళు నాకోసం టాక్సీ పంపారన్నమాట. ఎయిర్‌పోర్ట్‌ నుంచి క్లబ్‌ డర్‌ ఆట్లస్‌ అన్న మా హోటలుకు అరగంట ప్రయాణం.

మా టాక్సీ డ్రయివరు ఒమర్‌ మేమేదో బాల్యస్నేహితులం అన్నట్టు ఎంతో చనువుగా వ్యవహరించాడు. మొరాకో దేశపు రాజకీయాల గురించి అనర్గళంగా ప్రసంగించాడు. దారిలో ఓ హోర్డింగ్‌ చూపించి, ‘అదిగో, ఆయనే మా పెద్దాయన. మొరాకో దేశపు రాజు మహమ్మద్‌’ అని పరిచయం చేశాడు. అతనికెందుకనో వాళ్ళ రాజుగారన్నా, రాచకుటుంబమన్నా విముఖత ఉన్నట్టనిపించింది. ఆ దేశపు రాజకీయాలతో నాకు బొత్తిగా పరిచయం లేకపోయినా ఒమర్‌కు మాత్రం అవి బాగా తెలుసునని, ఆ రాజకీయాల విషయంలో అతనికి ఎంతో అసంతృప్తి ఉందనీ అర్థమయింది. అంతా అవినీతిమయం అన్నది అతని ఆవేదన. ఏదేమైనా ఆ దేశంలో వాక్స్వాతంత్య్రం పుష్కలంగా వుందనిపించింది. లేకపోతే అతగాడు వాళ్ళ రాజుగారి గురించీ రాజకీయ నాయకుల గురించీ అంత విమర్శనాపూరితంగా మాట్లాడలేడు గదా…

ఒమర్‌ ఇంగ్లీషు పరిజ్ఞానం అతి పరిమితమే అయినా అతగాడు వసపోసినట్టు గలగలా మాట్లాడేయటం నాకు గొప్ప ఆశ్చర్యం కలిగించింది. అడపాదడపా ఫ్రెంచి భాషలోకి గెంతేసి ఆ భాషలోనూ మాట్లాడేస్తున్నాడు. నాకు వేరే పనేమీ లేకపోవడం వల్ల పోనీలే అనుకుంటూ అతని ఏకపక్ష ప్రసంగాలను వింటూ ఉండిపోయాను. అతని మాటల మీద నా నిరాసక్తత పసిగట్టిన ఒమర్‌ విషయం మార్చి సంభాషణ హిందీ సినిమాల వైపుకు మళ్ళించాడు. నేను లండన్‌ నుంచి వచ్చిన విమానంలో ప్రయాణించానన్న విషయం గ్రహించి, ‘అవును లండన్‌ నుంచి కూడా ఎంతోమంది భారతీయులు మరాకేష్‌ వస్తూ ఉంటారు’ అన్నాడు.

మా బృందం నన్ను సాదరంగా ఆహ్వానించింది. అంతా డిన్నరు చెయ్యడానికి ఉపక్రమించాం. మా పిల్లలు నన్ను చూసి సంబరపడ్డారు. అదే సమయంలో ‘అమ్మో, నాన్న వచ్చాడు! తెగతిప్పి వదిలిపెడతాడు’ అన్న ఆందోళన వాళ్ళల్లో కనిపించింది. అప్పటిదాకా ‘కడుపునిండా తిండి, ఒంటినిండా నీళ్ళు’ అన్న బాణీలో బఫే లంచ్‌లతోనూ, స్విమ్మింగ్‌ పూల్స్‌లోనూ వాళ్ళు హాలీడే హాయిగా గడిపేస్తున్నారు… అంచేత నారాక వాళ్ళకామాత్రం ఆందోళన కలిగించడం సహజమే.

మా క్లబ్‌ డర్‌ ఆట్లస్‌ ఉత్తర మొరాకో వాస్తు రీతిలో రూపకల్పన చెయ్యబడ్డ సువిశాలమైన రిసార్టు. కబుర్లు చెప్పుకోడానికి లాబీలు, మీటింగ్‌లకు కాన్ఫరెన్సు హాళ్ళు, భిన్నభిన్నరకాల రెస్టారెంట్లు ఉన్న ముఖ్య భవనమే గాకుండా అతిథుల కోసం చెట్ల నడుమ వరుసలు వరుసలుగా కట్టిన విల్లాలు… పరిసరాల్లో సువిశాలమైన గార్డెన్లు… సౌకర్యవంతమైన రిసార్టది.


మర్నాడు సుష్టుగా బ్రేక్‌ఫాస్ట్‌ చేశాక హై ఆట్లస్‌ పర్వతాల్లో రోజంతా తిరిగి రావడానికి బృందమంతా బయల్దేరాం. నలుగురు సభ్యుల మా కుటుంబం, ముగ్గురు సభ్యుల మా స్నేహితుని కుటుంబం–అంతా కలసి ఏడుమందిమి. వాళ్ళ పాపదీ మా కవలపాపలదీ ఒకే వయసు. చిన్నప్పట్నించీ కలసి పెరిగారు. కలసి ప్రైమరీ స్కూలుకు వెళ్ళారు.

మా ఏడుగురి మధ్యా రెండు ఉపబృందాలు ఏర్పడ్డ ఛాయలు స్పష్టంగా కనిపించాయి. పన్నెండూ పదమూడేళ్ళ పిల్లలు ముగ్గురూ ఒక బృందం. పెద్దాళ్ళం నలుగురం ఒక బృందం. రెండు బృందాలూ ఒకదానితో ఒకటి సహకరించుకోవడంలో, సమయాలు ఇచ్చుకోవడంలో, ఎవరి స్పేసు వారికి ఇవ్వడం విషయంలో చక్కని సామరస్యం సాధించాయి. నేను చేరుకోక ముందే ఆ సామరస్య సాధన జరిగిపోవడం గమనించాను.

ఆనాటి మా డ్రైవర్‌ కమ్‌ గైడ్‌ పేరు అబ్దుల్‌ యేలా. స్నేహశీలి. కాస్తంత వాగుడుకాయ. మంచి ఇంగ్లీషు మాట్లాడుతున్నాడు. దాంతోపాటు ఫ్రెంచ్, అరబిక్‌, బెర్బర్‌ భాషలు కూడా వచ్చని చెప్పాడు. హై ఆట్లస్‌ పర్వతాల్లో ఆనాటి మా సమయం ఉల్లాసంగా ఉత్తేజంతో గడుస్తుందని హామీ ఇచ్చాడు.

మంచుకప్పు వేసుకొన్న హై ఆట్లస్‌ పర్వతాలు మరాకేష్‌ నగరానికి చక్కని నేపథ్య దృశ్యంగా అమరి ఉన్నాయి. అవి ఉండటానికి నగరానికి అరవై కిలోమీటర్ల దూరాన ఉన్నా ఊళ్ళోంచి చక్కగా కనిపిస్తున్నాయి. గగ్గురు గగ్గురు శిఖరాలు, వాటి మీద మంచు పైకప్పూ నగరంలో ఉండగానే మమ్మల్ని ఊరించడం మొదలెట్టాయి. ఆ శిఖరాలన్నీ నగరాన్ని అటు తూర్పు దిక్కునా ఇటు పడమరనా చుట్టేసి ఉన్నాయి. పశ్చిమ ఆఫ్రికాలోని పర్వతశ్రేణుల్లో హై ఆట్లస్‌ శ్రేణి ముఖ్యమైనది. మొరాకో దేశపు నట్టనడుమన వెయ్యి కిలోమీటర్ల మేర కర్ణరేఖలా విస్తరించి ఉన్న పర్వతశ్రేణి అది. ఆ పర్వతాల మధ్య అందమైన ఆకట్టుకొనే బెర్బర్‌ గ్రామాలు ఉన్నాయి.

ఆట్లస్‌ పర్వతాల దిశగా గంటసేపు ప్రయాణం చేసి ఒకటి రెండు వ్యూ పాయింట్ల దగ్గర ఆగాం. ఆగి ఆ దృశ్యాలు చూసుకుని ముందుకు సాగాం. చివరికి ఒక పర్వత సానువులో చక్కని రూపుతో మిసమిసలాడుతోన్న ఓ బెర్బర్‌ గ్రామం దగ్గరికి చేరాం. అక్కడి లేత గులాబీ మెరుపుల గోధుమరంగు మట్టి ఇళ్ళు పరిసర పర్వతాల రంగుల్లో ఎంతో చక్కగా మిళితమై కనిపించాయి. ఆ ఊరిపేరు అజారాల్‌ అట. పర్వత శిఖరాల నడుమ ఊయలలూగే గ్రామాలతో మాకు అదే మొట్టమొదటి పరిచయం.

ఈ బెర్బర్‌ తెగవాళ్ళు వాయవ్య ఆఫ్రికా ప్రాంతపు మూల నివాసులు. ఉత్తర ఆఫ్రికా అంతా విస్తరించిన తెగ అది. మొరాకో, అల్జీరియా, ట్యునీషియా, లిబియా, మారుటానియా, మాలి, నైజర్‌, బుర్కినా ఫాసో, ఈజిప్టు దేశాల వరకూ వీరి ఉనికి కనిపిస్తుంది. వారి సాంస్కృతిక జీవన పరంపర చరిత్రపూర్వపు దినాలనుంచీ అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తోంది. వారికంటూ వారి వారి భాషలున్నాయి. సంస్కృతి ఉంది. కొండలకు చెందిన తెగగా వారికి స్పష్టమైన ఉనికి ఉంది.

ఏడు ఎనిమిది శతాబ్దాల్లో ఆ ప్రాంతాల్లో ఇస్లామిక్‌ శక్తుల ఆధిపత్యం స్థిరపడ్డాక స్థానిక బెర్బర్లంతా ఇస్లామ్‌ను అనుసరించారు. అరేబియాకు చెందిన బెడోయిన్‌ తెగల వాళ్ళు చేసినట్టే ఈ బెర్బర్లూ క్రమక్రమంగా సంపదలను సమకూర్చుకుని స్థితిమంతులయ్యారు. నాగరిక జీవితానికి అలవాటుపడిన వాళ్ళు పట్నాలూ నగరాల్లో స్థిరపడ్డారు. ఆ జీవన సరళికి అలవాటుపడిపోయారు. కొండల లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు మాత్రం తమ పూర్వ సంప్రదాయాలను, ఆచారాలనూ వదిలిపెట్టకుండా ఆయా గ్రామీణ వాతావరణాల్లో తమతమ సంచార జీవితాలను కొనసాగిస్తున్నారు. ఆఫ్రికా వాయవ్య భాగంలోని బెర్బర్‌ ముస్లిమ్ అధినేతలు స్పెయిన్‌ దేశపు దక్షిణ భాగంలో ఉన్న అండాలూషియా ప్రాంతాన్ని ఎన్నో శతాబ్దాలపాటు పాలించారు. అక్కడి కార్‌డోబా, గ్రెనడా, సెవీల్‌ లాంటి ఈనాటి నగరాల మీద ఆనాటి పాలకులు వదిలిన పాదముద్రలు ఇప్పటికీ కనిపిస్తాయి. వారి సాంస్కృతిక ఔన్నత్యం అక్కడి అల్ హంబ్రా పాలెస్‌ ప్రాంగణంలో ఇప్పటికీ సజీవంగా కనిపిస్తుంది.

విశ్వవిఖ్యాతి చెందిన మహా యాత్రికుడు ఇబ్న్‌ బటూటా మొరాకో దేశపు టాంజీర్‌ నగరానికి చెందిన మనిషి. ఖల్దూన్‌, ఇబ్న్‌ బాజా, ఇబ్న్‌ఝర్‌ లాంటి ఎనిమిదీ పధ్నాలుగు శతాబ్దాలనాటి ఇస్లామిక్‌ స్వర్ణయుగానికి చెందిన బహుముఖ ప్రజ్ఞావంతులందరూ బెర్బర్‌ మూలాలవారే.

అశ్ని అన్న వ్యాపారకూడలి దగ్గర మేమంతా ఆగాం. ఆ ప్రాంతాల మార్కెట్‌ కార్యకలాపాలు వారానికొక రోజు చొప్పున విభిన్న ప్రదేశాల్లో కొనసాగుతూ ఉంటాయి–మన గ్రామాల్లో ఒకప్పటి సంతల్లాగా. ఆనాడు అశ్నిలో సంత జరిగే రోజు. రంగురంగుల దుకాణాలు, క్రిక్కిరిసే జన సందోహం–పెద్ద సంతే అది.

బెర్బర్‌ జనజీవితంలో ఆ సంచార దుకాణాలది ప్రముఖ పాత్ర. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అమ్మకాలూ కొనుగోళ్ళ కోసం ఈ సంతలకు విరివిగా వస్తూ ఉంటారు. గృహోపకరణాలు, పచారీ సామాన్లతోపాటు ఆ మార్కెట్లలో సంచార క్షురకులు, సంప్రదాయ వైద్యులు, జాతకాలు చెప్పేవాళ్ళు–విభిన్న సేవల కేంద్ర బిందువులా సంచార విపణులు.

వచ్చిన అవకాశం అందిపుచ్చుకొని మా డ్రైవరు వారానికి సరిపడే సరుకులు అక్కడి సంతలో కొన్నాడు. కూరగాయల దగ్గర్నించి చీపుళ్ళదాకా అన్నీ కొన్నాడు. మరాకేష్‌తో పోలిస్తే ఇక్కడ బాగా చవక అన్నాడు. తన రెండో భార్య ఈ కొన్నవన్నీ చూసి మహా మురిసిపోతుందన్నాడు. ఇలాంటి సంత మార్కెట్లు చూడటమంటే నాకు ఎంతో ఇష్టం. అక్కడి బేరసారాలు, జన సందోహం, స్థానిక జీవనసరళి నగరపు మెరుగులు లేకుండా స్వచ్ఛంగా కనిపిస్తాయి. నాకు ఏదో తెలియని సంతోషం కలిగిస్తాయి.

మా తదుపరి ప్రయాణం కొండదారుల్లో సాగింది. లోయల అంచులను హత్తుకొని ఉన్న దారి వెంబడే సాగిపోయాం. ఎగువున ఉన్న కనుమకేసి మా ప్రయాణం. లోయ దిగువున పారుతోన్న చిరునది ఆ లేటు ఉదయపుటెండలో కరిగిన వెండిలా తళతళలాడింది.

అలా అశ్ని నుంచి గంటసేపు ప్రయాణం చేశాక ఇమ్లిల్‌ అన్న ఊరు చేరుకున్నాం. సముద్ర తలానికి ఆరువేల అడుగుల ఎత్తున ఉందీ ఇమ్లిల్‌ గ్రామం. ఊరిమధ్యగా రెహ్ రాయ అన్న చిరునది పారుతోంది. ఇళ్ళన్నీ పరిసర చరియల్లో విస్తరించి ఉన్నాయి.

తుబ్‌కుల్‌ శిఖరం ఎక్కే పర్వతారోహకులకు ఈ ఇమ్లిల్‌ గ్రామం ఆరంభ స్థావరం. 13665 అడుగుల ఎత్తున ఉన్న తుబ్‌కుల్‌ శిఖరమే గాకుండా ఆ పర్వతశ్రేణిలో ఔత్సాహికులను ఆకర్షించే ఇతర శిఖరాలూ ఉన్నాయి. వాటన్నిటి అధిరోహణకు ఈ ఇమ్లిల్‌ గ్రామమే అనువైన వేదిక.

ఊరంతా చెర్రీ, ఆపిల్‌, వాల్‌నట్‌ వనాలు. ఆకురాలు కాలం గాబట్టి చెట్లన్నీ కళావిహీనంగా కనిపించినా ఆ ప్రాంతపు ముగ్ధ సౌందర్యం మా దృష్టిని దాటిపోలేదు. ‘ఒక్కసారి సీజన్‌ మొదలయిందంటే ఈ తోటలన్నీ ప్రాణం పోసుకొని చిగుళ్ళు వేసి కళకళలాడతాయి’ అని ఉత్సాహంగా వివరించాడు అబ్దుల్‌.

ఊళ్ళోని ఒక కాలిబాటను పట్టుకొని అందరం ఓ కొండ చరియ పైకి ఎక్కాం. ఓ సెలయేటిని దాటాక కాస్తంత కష్టమైన అధిరోహణ చెయ్యవలసి వచ్చింది. చివరికి అఫ్లా అన్న రెస్టారెంటు చేరుకొన్నాం. సంప్రదాయ పద్ధతిలో కొండచరియలో కట్టిన భవనమది. ఆ రెస్టారెంటు మిద్దె మీదకు చేరుకోగానే చుట్టూ కనిపించిన దృశ్యం మాకు విభ్రమ కలిగించింది. ఎటు చూసినా ఆ మధ్యాన్నపుటెండలో ధగధగలాడుతున్న హిమశిఖరాలే! అందరూ అక్కడ తీరిగ్గా చేరగిలబడుతోన్న సమయంలో నేనా మిద్దెమీద అటూ ఇటూ పచార్లు చేశాను. కంటి ఎదుట కనిపిస్తోన్న అద్భుతాన్ని ఆకళింపు చేసుకొనే ప్రయత్నం చేశాను. నేనా పనిలో నిమగ్నమై ఉండగా ‘రండి, భోజనం ఆర్డరు తీసుకొంటున్నారు. రండి’ అంటూ మా హేమ పిలుపు.

ఆ హోటలు నడిసేవాళ్ళంతా ఒకే కుటుంబపు సభ్యుల్లా కనిపించారు. ఎంతో ఆదర మర్యాదలతో ఆర్డర్లు తీసుకొన్నారు. వాళ్ళ సిఫార్సు మేరకు చికెన్‌ టజీన్లూ వెజిటబుల్‌ కుస్‌కుస్‍లూ ఆర్డర్‌ చేశాం. ముందుగా అపుడే చేసిన వేడివేడి బెర్బర్‌ బ్రెడ్‌ అందించారు, దాంతోపాటు హరీరా అన్న లెంటిల్ సూప్‌ కూడా ఇచ్చారు. మా టజీన్లు వచ్చేదాకా ఆ వేడివేడి బ్రెడ్డును హరీరా సూప్‌లో ముంచుకొని నంచుకుంటూ గడిపాం. కాసేపట్లో పొగలుగక్కుతోన్న టజీన్లు టేబుల్‌ మీదకు చేరాయి. అవి ఎంతో రుచిగా ఉన్నాయి. వాటిని తినడం ముగించాక తాజా తాజా కమలాపళ్ళు, అరటిపళ్ళూ అందించారు. చక్కని రుచి. చాలాకాలం తర్వాత అలాంటి కమలాలు తిన్నాననిపించింది.

అబ్దుల్‌ మార్గదర్శకత్వంలో ఏడు – అవును, అక్షరాలా ఏడు – బెర్బర్‌ గ్రామాలు దాటుకొని ఆట్లస్‌ జలపాతం వైపుగా నడక ఆరంభించాం. సెలయేళ్ళూ బండరాళ్ళ మీదుగా ముప్పావుగంట సాగిన నడక అది. దారిలో కనిపించిన ముచ్చటైన బెర్బర్‌ పల్లెలు అప్పుడే నిద్రలేచి తమ దైనందిన కార్యకలాపాల్లో పడుతున్నాయి. వారికి టూరిస్టుల నడకలు బాగా అలవాటేమో, మమ్మల్ని పెద్దగా పట్టించుకోలేదు. ఊళ్ళకింకా పూర్తిగా తెల్లారకపోయినా కొన్ని దుకాణాలు మాత్రం సువనీర్లు, హస్తకళాకృతుల్ని అమ్మే పనిలోకి అడుగు పెట్టేస్తున్నాయి. దారిలో మాకు మౌంట్‌ తుబ్‌కల్‌ ధీరగంభీర శిఖర దర్శనమయింది. మెరిసే వెండి కప్పుతో అది మాకేసి ఆప్యాయంగా చూస్తున్నట్టు అనిపించింది.

అలా నడిచాక కాసేపటికి మేమంతా ఎంతో ఆకట్టుకొనే ఆట్లస్‌ ఫాల్స్‌ చేరుకున్నాం. ఆ సుందర దృశ్యమూ ఆ ఫాల్స్ చేస్తోన్న జలగర్జనలూ అప్పటిదాకా కొండల్లో నడచినడచి అలసట చెందిన మాకు తక్షణ ఉపశమనం కలిగించాయి. ఆ పక్కనే ఉన్న పళ్ళ దుకాణంలో తాజా నారింజరసం తాగాం. కొత్త సత్తువ ఒళ్ళంతా అలుముకొంది. సురలోకపు అమృతం రుచి చూసిన భావన!

వెళ్ళిన దారివెంటనే నడిచి తిరిగి ఇమ్లిల్‌ చేరుకున్నాం. ఊళ్ళో కూడలి ప్రాంతంలో అటూ ఇటూ తిరుగాడాం. మామూలు దుకాణాలూ రెస్టారెంట్లతో పాటు ట్రావెల్ ఏజన్సీలు, పర్వతారోహణ పరికరాలు అమ్మడము, అద్దెకివ్వడము చేసే దుకాణాలూ విరివిగా కనిపించాయి. ఆ ఊళ్ళో గడిపింది చాలా తక్కువ సమయమే అయినా అది నాలో ఒక ఉత్తేజాన్ని నింపేసింది. ‘ఇలా చిన్న చిన్న ట్రెక్కులు కాదు; ఈ హై ఆట్లస్‌ పర్వతాల్లో ఒక ఘనమైన ట్రెక్కు చెయ్యాలి’ అన్న సంకల్పం మనసులో నాటుకొంది. ఆ ట్రెక్కేదో మౌంట్‌ తుబ్‌కుల్‌కే అయితే మరీ బావుంటుంది అనీ అనిపించింది. ఆ కోరిక నా మనోకాంక్షల పట్టికలో చేరిపోయింది.

ఇమ్లిల్‌ నుంచి దిగడం మొదలెట్టిన కొద్దిసేపటికే హిమ శిఖరాలు కనిపించడం మానేశాయి. తడీ తేమా చెట్టూ చేమాలేని నిర్జీవ ప్రదేశం గుండా మా ప్రయాణం సాగింది. ఆ ప్రాంతాన్ని అగాఫే ఎడారి అంటారట. చందమామ ఉపరితలాన్ని పోలిన ప్రదేశమది. సంభ్రమాశ్చర్యాలు కలిగించే ప్రదేశమది.

ఒకే ఒక్కరోజులో మేమంతా నాగరికత నిండిన మరాకేష్‌ నుంచి గంటన్నర దూరం ప్రయాణించి నగరంతో ఏ మాత్రం పోలికలేని కొండచరియల్లో వేలాడే బెర్బర్‌ గ్రామాలను, సారవంతమైన లోయలను, హిమ శిఖరాలను, నిర్జీవపుటెడారులనూ చూడగలిగామన్నది విస్మయ పరిచే విషయం.

అగాఫే ఎడారి అంచున ఉన్న ఒక ఒంటెల శిబిరం దగ్గర ఎడారి ఓడల మీద సవారీ చెయ్యాలన్న కోరికతో మేమంతా ఆగాం. అసలు మొరాకో దేశానికి వచ్చిన పిల్లలైనా పెద్దాళ్ళయినా ఎవ్వరూ ఒంటెసవారీ చెయ్యకుండా వెళ్ళలేరు. మా పిల్లలు అప్పటికే ఆ అనుభవం పొంది ఉన్నారు గాబట్టి తమకు తామే ఆ విషయంలో నిపుణులమని ప్రకటించేసుకున్నారు. ఒక్కొక్కరం ఒక్కొక్క ఒంటెను ఎక్కి చిన్నపాటి ఊరేగింపుగా ఆ సుందర దృశ్యాలగుండా అరగంటసేపు సాగిపోయాం. నాకూ ఆఫ్రికా అరేబియాల్లో ఒంటె సవారీ చేసిన అనుభవం ఉంది కానీ అవన్నీ అరగంటా గంటలో ముగిసే సవారీలు. అలాగాకుండా కనీసం ఒకరోజంతా సాగే సవారీ చెయ్యాలన్న కోరిక, అలా రోజుల తరబడి సాగిపోయిన మహా యాత్రికుల అనుభవమూ అనుభూతీ రుచి చూడాలన్న కోరిక ఇంకా నాలో తీరని కలలానే మిగిలి ఉంది.

అక్కడి భూతలానిది ఒక విలక్షణ సౌందర్యం. పచ్చదనమన్నది మచ్చుకైనా లేకపోయినా ఆ చిన్నపాటి కొండలూ గుట్టలూ సాయం సంధ్యాకాంతిలో పసిడివర్ణంలో మునిగితేలుతూ కనిపించాయి. ఎడారుల్లో సూర్యోదయాలు, సూర్యాస్తమయాలూ ఎప్పుడూ అద్భుతమే!

మరాకేష్‌ నగరం చేరేముందు లాలా అన్న కొండవాలు గ్రామం దగ్గర సూర్యాస్తమయం చూడటానికి ఆగాం. ఆ సమయంలో నింగీనేలా రంగులు విరజిమ్మతాయని వర్ణించాడు అబ్దుల్‌… అతను చెప్పింది నిజమే. సాయంసంధ్యా వీక్షణానికి ఎంతో అనువైన ప్రదేశమా లాలా గ్రామం!


మర్నాడు బాగా పొద్దున్నే హై ఆట్లస్‌ పర్వతాలకేసి ఆగ్నేయ దిశలో ప్రయాణం చేద్దామనుకొన్నాం. ఈసారి ఆ పర్వత శ్రేణిని దాటివెళ్ళి సహారా ఎడారి అంచులు తాకి రావాలన్నది మా సంకల్పం.

ఠంచనుగా చెప్పిన సమయానికి వచ్చేసి హోటల్‌ లాబీలో మాకోసం ఎదురు చూస్తోన్న అబ్దుల్‌కు అందరం శుభోదయం చెప్పాం. నిన్నంతా కలసి ప్రయాణం చేశాం కదా, కించిత్‌ ఆత్మీయతా చనువూ మా మధ్య చోటుచేసుకొన్నాయి. స్నేహం అంకురించింది. మా అవసరాలు అన్నీ అతను బాగా అర్థం చేసుకొంటున్నాడు. ముఖ్యంగా పిల్లల అవసరాలూ కోరికలూ తీర్చడంలో ముందడుగు వేస్తున్నాడు. గంట ప్రయాణం తర్వాత అట్లస్‌ పర్వతాల పాదాల దగ్గరకు చేరాం. మెల్లగా ఆ కొండలు ఎక్కసాగాం. కొంత ఎత్తు ఎక్కేసరికి ఉష్ణోగ్రత తగ్గింది. వాతావరణం చల్లబడింది. దారిలో ఒక కొండ కొమ్మున కనిపించిన టిజి ఐత్‌ బర్కా అన్న రెస్టారెంటు దగ్గర ఆగాం. సముద్ర మట్టానికి 4800 అడుగుల ఎత్తున ఉందా రెస్టారెంటు. అక్కడ అందరం ఒక కప్పు మింట్‌ టీ తాగి కొత్త సత్తువ సమకూర్చుకున్నాం.

చక్కని మింట్‌ టీ లభించడం సరేసరి–నేను చూసిన సుందరమైన పరిశుభ్రమైన రెస్టారెంట్లలో టిజి ఐత్‌ బర్కా అగ్రభాగాన నిలుస్తుంది. ఎంతో ఎగువున ఉన్న ఆ రెస్టారెంటు నుంచి దిగువున ఉన్న లోయ ఎంతో ఆసక్తికరంగా కనిపించింది. చెట్టూ చేమాలేని ఎర్రమట్టి గుట్టలు… మధ్యలో చెదురుమదురుగా పచ్చదనపు తునకలు… లోయకు అవతలివేపున కొండ చరియలో ఒక బెర్బర్‌ గ్రామం, ఆ గ్రామంలో పాలిపోయిన గులాబీరంగు ఇళ్ళు–అందమైన దృశ్యమది.

అక్కడ ఒకమూల గోడకు తగిలించిన ఆ ప్రాంతపు వివరాలు విపులంగా ఉన్న మ్యాపులు కనిపించాయి. వాటికి తోడు ఒక చెక్క పాయింటర్‌ కూడా కనిపించింది. భూదేవి బొమ్మలంటే నాకు బోలెడు ఆసక్తి. స్మార్ట్‌ ఫోన్లలో కనిపించే మరుగుజ్జు మ్యాపులంటే కాదు, గోడలకు వేలాడే పురాతన బాణీ విపులమైన మ్యాపులంటే నాకు వ్యామోహం. పిల్లలతోపాటు నేనూ ఆ మ్యాపులతో కాసేపు గడిపాను. ఆరోజు మేం వెళుతోన్న మార్గం, అప్పటిదాకా చేసిన ప్రయాణాలు పాయింటర్‌ సాయంతో పిల్లలకు చూపించాను. వాళ్ళంతా సంబరపడ్డారు. ఇతర ఏ గుణగణాలూ లేకపోయినా అక్కడ ఉన్న ఆ మ్యాపుల్ని చూసే నేనా రెస్టారెంటుకు నూటికి నూరు మార్కులు వేసి ఉండేవాడిని.

టిజి ఎన్‌ టిచ్కా అన్నది మొరాకో అంతటికీ ఎత్తయిన కనుమ. 7414 అడుగుల ఎత్తు. మరో ముప్పావుగంట కొండలు ఎక్కుతూ సాగాక ఆ కనుమను చేరుకున్నాం. చేరి అక్కడి అతి ఉన్నత బిందువు దగ్గరకు వెళ్ళాం. వెళ్ళి మేము అప్పటిదాకా మెలమెల్లగా ఎక్కి వచ్చిన వంకరటింకర సర్పాకారపు రహదారి సంపూర్ణ విశాల చిత్రాన్ని చూశాం!

కనుమ దాటి అవతలికి దిగడం మొదలెట్టగానే పచ్చదనమంతా మంత్రం వేసినట్టు మాయమైపోయి చెట్టూ చేమాలేని ఎడారి ప్రదేశం మా కళ్ళముందు సాక్షాత్కరించింది. మేవు టిజి ఎన్‌ టిచ్కా నుంచి పర్వతాల మీదుగా ఎడారి చేరుకొన్న రహదారిని అక్కడ ఎన్‌-9 అని వ్యవహరిస్తారు. సహారా ఎడారికి దక్షిణాన ఉన్న దేశాలను మొరాకోతో అనుసంధించే పురాతన వాణిజ్య మార్గమది. ఆ మార్గంలో మరాకేష్‌ నగరం ఒక ముఖ్యమైన బిందువు.

మా ప్రయాణం పొడవునా అబ్దుల్‌ అటు హిందీ పాటలూ ఇటు అరబిక్‌ గీతాలూ స్టీరియోలో వినిపిస్తూ పోయాడు. మొరాకోలో బాలీవుడ్‌ సినిమాలది అగ్రస్థానమనీ హాలీవుడ్‌ది ఆ తర్వాత స్థానమేననీ చెప్పాడు. తనకిష్టమయిన బాలీవుడ్‌ తారల పేర్లొక డజను గడగడా వల్లించాడు. మొరాకో ప్రజలందరూ కుటుంబ సమేతంగా అరబిక్‌లోకి డబ్బింగయిన హిందీ సినిమాలు చూస్తారని, తాను చెప్పిన బాలీవుడ్‌ తారలపేర్లు ఆ దేశంలో ప్రతి ఇంటా తెలిసిన పేర్లేననీ వివరించాడు. మా దేశంలోనూ మీ భారతదేశంలోనూ ఫామిలీ సెంటిమెంట్లు ఒక్కలాగానే ఉంటాయి గాబట్టి మావాళ్ళు హాలీవుడ్‌ సినిమాలకన్నా హిందీ సినిమాలనే ఎక్కువ ఇష్టపడతారనుకొంటాను’ అని కూడా అన్నాడు. నిజమే. వాళ్ళకూ మనకూ కుటుంబ వ్యవస్థ విషయంలో చాలా పోలికలున్నాయి. స్నేహాలు, బంధుత్వాలు, సామాజిక వ్యవహారాలు, విలువలు – వీటన్నిట్లో సారూప్యం కనిపిస్తుంది. మొరాకో అనేకాదు, ఇస్లామిక్‌ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా – పశ్చిమ ఆఫ్రికాలోని మొరాకో నుంచి మధ్య ఆసియాలోని ఉజ్‌బెకిస్తాన్‌ దాకా – హిందీ సినిమాలు ఒక సంభాషణా బిందువు అవడం గమనించాను. నిజానికి ఎన్నో ఐరోపా దేశాలతో పోలిస్తే మొరాకో బాగా పశ్చిమాన ఉన్న ప్రదేశం. కానీ విలువలూ ఆచారాలూ ఉద్వేగాల దగ్గరకొస్తే వారికీ తూర్పు దేశాల వారికీ పోలికలు ఎక్కువ.

మరాకేష్‌ నుంచి నాలుగు గంటల కారు ప్రయాణం తర్వాత 200 కిలోమీటర్ల దూరాన ఉన్న వర్‍జజట్ (Ouarzazate) అన్న పట్నం చేరుకున్నాం. పరిసర ప్రాంతమంతా బీడువారిన కొండలు… పాలిపోయిన గులాబీ రంగు కొండలు… దూరాన మాత్రం మంచు కప్పు తొడుగుకున్న హై ఆట్లస్‌ పర్వతాలు కనిపించాయి. మా రోడ్డు అసిఫ్‌ ఒనీలా అన్న నది పక్కగా సాగింది. ఆ నదిలో నీళ్ళంటూ పెద్దగాలేవు. రాళ్ళూ బండలు నిండిన నదీ గర్భం మాకు తోడుగా వచ్చింది.

ఈ వర్‍జజట్ అన్నది మొరాకో దేశపు సినిమా రాజధాని. అంతర్జాతీయంగా పేరు పొందిన స్టూడియోలు కొన్ని అక్కడ ఉన్నాయి. ఎన్నో విదేశీ చిత్రాలు, హాలీవుడ్‌ చిత్రాలూ అక్కడ తీశారు. ఔట్‌డోర్‌ షూటింగులకు అనుకూలమవడమే గాకుండా అక్కడ సినిమాలు తియ్యడానికి అయ్యే ఖర్చు బాగా తక్కువ. అంచేత ఆ పట్టణం విదేశీ నిర్మాతలను బాగా ఆకర్షిస్తోంది. ఆట్లస్‌ స్టూడియోస్‌ అన్న చిత్ర నిర్మాత సంస్థ ప్రాంగణం లోపలికి వెళ్ళి చూశాం. ప్రిన్స్‌ ఆఫ్‌ పర్షియా, క్లియోపాట్రా, అలెగ్జాండర్‌, బెన్‌-హర్‌, కుందన్‌, మమ్మీ లాంటి ప్రముఖ చిత్రాలను అక్కడ తీశారు. ఆ మధ్య వచ్చిన ‘టైగర్‌ జిందాహై’ అన్న బాలీవుడ్‌ సినిమా కూడా అక్కడే తీశారట. షూటింగ్‌ సమయంలో సల్మాన్‌ఖాన్‌, కత్రీనాకైఫ్‌లకు తాను ఆతిథ్యమిచ్చానని చెప్పాడక్కడి మా స్టూడియో గైడు. ఆ స్టూడియోల్లో కొన్ని ముఖ్యమైన సెట్లను యధాతధంగా ఉంచేయడము, అవి క్రమక్రమంగా చక్కని టూరిస్టు ఆకర్షణలుగా మారడమూ జరుగుతోంది. తమకిష్టమైన హాలీవుడ్‌ సినిమాల అసలుసిసలు సెట్ల మధ్య తిరుగాడగలగడం పిల్లల్ని సంబరపరచింది.

ఈ వర్‍జజట్ అన్నది సహారా ఎడారి ప్రవేశ ద్వారం. డోర్ ఆఫ్ ది డిజర్ట్ అని నిక్‍నేమ్ ఈ ఊరికి. ఆ ఎడారి తన అసలు సిసలు రూపంలో ఈ బిందువు దగ్గర ఆరంభమవుతుంది. ఎంతో ఘనత వహించిన మెర్జోగా ఇసుకతిన్నెలు అక్కడికి తూర్పుదిక్కున నాలుగయిదు గంటల దూరంలో ఉన్నాయి. ఆ ఎడారిని, ఇసుక తిన్నెల విన్యాసాలనూ పరిపూర్ణంగా అనుభవించాలంటే నాలుగయిదు రోజులు అక్కడి కాంపుల్లో ఉండిపోవడం ఉత్తమ మార్గం అన్నాడు అబ్దుల్‌. జీవితంలో ఒక్కసారైనా ఆ అనుభవం పొంది తీరండి అని అన్నాడు. అతనిది ఆ ప్రాంతమేనట. మొరాకో దేశపు ఆ ప్రాంతమంటే తనకు ప్రాణమన్నాడు. సహారా ఎడారి అంటే ఎంతో మక్కువ అన్నాడు. అవును మరి బెర్బర్‌ తెగలకు చెందిన ఎడారి పుత్రుడతను… మరి ఎడారి సౌందర్యాలను అతనికంటే ఎవరు వివరించి చెప్పగలరూ!

పిపాస నిండిన అబ్దుల్‌ మాటల పుణ్యమా అని, ‘అవును ఈ ఎడారిలో, ఈ ఇసుక తిన్నెల మధ్య, నాలుగు రోజులు తప్పక గడపాలి’ అనిపించింది. అది కాస్తా ఒక కోరికగా క్షణాల్లో ఘనీభవించింది. అప్పటికే మౌంట్‌ తుబ్‌కల్‌ శిఖరారోహణను నా కోరికల చిట్టాలో చేర్చి ఉన్నాను. ఇపుడు మెర్జోగా ఇసుక తిన్నెలు కూడా వచ్చి పట్టికలో చేరాయి. ఇవన్నీ ఈ ట్రిప్పులో చెయ్యడం సాధ్యం కాదు గదా, మరోసారి వచ్చి ఈ కోరికలు తీర్చుకోవాలన్న సంకల్పం మనసులో రూపుదిద్దుకొంది.


ఒనీలా నదీలోయలో ఉన్న ఐత్‌ బెన్‌‍హద్దూ అన్న అతి సుందర బెర్బర్‌ గ్రామం మా తదుపరి మజిలీ. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అక్కడికి చేరుకున్నాం. అందరికీ కరకరమంటూ ఆకలి. అది తీర్చుకోడానికి ఆ గ్రామమే సరైన వేదిక. అబ్దుల్‌ సూచించిన ప్రకారం ల బర్కా అన్న రెస్టారెంటుకు వెళ్ళి చికెన్‌ టజీన్లు, ఉడకబెట్టిన కూరగాయలూ ఆర్డరిచ్చాం. భోజనం తాజా తాజాగా రుచికరంగా ఉంది. మొరాకో రెస్టారెంట్లలో భోజనం తర్వాత డిసర్ట్‌ ఇవ్వడానికి బదులుగా తాజా పళ్ళు ఇస్తారు. అది నాకెంతో నచ్చింది. బహుశా ఈ అలవాటు వారి సంచార జీవన సరళిలోంచి వచ్చి ఉండాలి. సహారా ఎడారుల్లో నెలల తరబడి తిరుగాడినప్పుడు శరీరానికి అవసరమైన పోషక పదార్థాలూ వైటమిన్లను అందించడానికీ, అంతకన్నా ముఖ్యంగా వారి దాహార్తిని తీర్చడానికీ పళ్ళను మించిన పదార్థమేముంటుందీ? నా వరకూ నాకు పంచదారా క్రీములు నిండిన డిసర్ట్‌లకన్నా ఇలా తాజాపళ్ళు తీసుకోవడమే ఇష్టం.

ఐత్‌ బెన్‌‍హద్దూ గ్రామంలోని ఖసర్‌ ప్రాంతం ఆ ఊరి ముఖ్యాకర్షణ. బెర్బర్‌ భాషలో ఖసర్‌ అంటే చుట్టూ ప్రాకారమున్న ప్రదేశం అని అర్థం. ఆ ప్రాంతపు సన్నపాటి కాలిబాటల్లో పావుగంటా ఇరవై నిమిషాలు నడిచాక బాగా విస్తరించి ఉన్న ఒనీలా నది ఒడ్డుకు చేరుకున్నాం. నదిలోని రాళ్ళూ బండలమీద జాగ్రత్తగా అడుగులు వేస్తూ, బూట్లు తడవకుండా జాగ్రత్తపడుతూ నదిని దాటాం. అవతలి గట్టు మీద ఎత్తయిన ప్రదేశంలో మట్టితో కట్టిన దిట్టమైన ఖసర్‌ కోట ఉంది. అక్కడి సందుగొందుల్లో నడిచి, వాటిల్లోని దుకాణాలనూ సువనీర్‌ షాపుల్నీ పరకాయిస్తూ ఆ కోట పైకి చేరుకున్నాం. కొన్ని బాటలమీద చుర్రుమనే వేడి నుంచి పాదాలను కాపాడటానికి కాబోలు, కంబళ్ళు పరచి ఉన్నాయి.

అక్కడి పిక్చర్‌ పోస్ట్‌కార్డుల్లాంటి పరిసర దృశ్యాలు ఎంతోమంది హాలీవుడ్‌ దర్శకుల్ని ఆకర్షించాయిట. కోటమీదకి వెళుతున్నపుడు అమెరికా రాజధాని వాషింగ్టన్‌ నుంచి వచ్చిన ఓ హిస్టరీ టీచరుతో మాట కలిసింది. ఆయనక్కూడా ఆ ప్రాంతానికి రావడం అమితానందం కలిగిస్తోందట. ఈ ఖసర్‌ ప్రాంతం ఎన్నో హాలీవుడ్‌ సినిమాల్లో కనిపిస్తుందని చెప్పాడాయన. గ్లాడియేటర్‌, అలెగ్జాండర్‌, జీసస్‌ అండ్‌ నాజరెత్‌, ది లాస్ట్‌ టెంప్టేషన్ ఆఫ్‌ క్రైస్ట్‌, ది లివింగ్ డేలైట్స్‌, ది జ్యూవెల్‌ ఆఫ్‌ ది నైల్–ఆ సినిమాల్లో కొన్ని.

ఆ హిస్టరీ టీచరు కథనం ప్రకారం ఈ ఖసర్‌ ప్రాంతం గేమ్‌ ఆఫ్‌ త్రోన్స్ అన్న ప్రముఖ సమకాలీన అమెరికన్‌ టి.వి. సిరీస్‌లో కనిపిస్తోందట. ఆ సిరీస్‌కు అంతర్జాతీయంగా ఎంతో ఆదరణ ఉంది. టి.వి. కోసం తీసిన సీరియళ్ళలో అత్యంత ప్రజాదరణ పొందిన సిరీసది. అదొక మధ్యయుగాలనాటి కాల్పనిక గాథ. అధికారం కోసం పెనగులాడే ఎన్నెన్నో రాచ కుటుంబాల గాథ అది. ఆ సిరీస్‌ను యు.కె., ఐర్లండ్‌, క్రొయేషియా, స్పెయిన్‌, మాల్టా, మొరాకో దేశాల్లో చిత్రీకరించారు. ఆ గాథలోని యున్‌కాయ్‌ అన్న బానిస నగరానికి వేదికగా ఈ ఐట్ బెన్ హద్దూ గ్రామాన్ని వినియోగించుకున్నారట. నేను యు.కె. నుంచి వచ్చానని తెలిసి ‘మొరాకోకు అమెరికా నుంచి రావడం కన్నా యూరప్ నుంచి రావడం ఆర్థికంగా సులువైన పని’ అని వ్యాఖ్యానించాడాయన.

ఖసర్ కోటలోని శిథిల ప్రాంగణాల పైకప్పున నిలబడి చూస్తే నాలుగు దిక్కుల్లోనూ ఏ అడ్డంకీ లేకుండా కనిపించే దృశ్యాలు మనకు ఊపిరి సలపనివ్వవు. అక్కడ్నించి ఒనీలా నదీగర్భం చాలా దూరం దాకా విస్తరించి కనిపించింది. ఆ నదికి ఇరుపక్కలా – ఒక చోట నదీ గర్భంలో కూడా – చిన్న చిన్న చెలకల్లో వ్యవసాయం సాగుతోన్న చాయలు కనిపించాయి. దూరాన మంచు పైకప్పుతో ఉన్న పర్వతాలు, మధ్యమధ్య మొక్క మొలవని విశాల మైదాన ప్రదేశాలు, చేరువలో అనంతంగా తోచే లేత గులాబీ రంగు భూతలం–అతిలోక సౌందర్యమా ప్రదేశానిది. విభ్రమ, విస్మయం, సంబరం ఒకే సమయంలో కలిగే అరుదైన క్షణాలవి.

ఈ ఖసర్ కోటను మొదటగా పదకొండో శతాబ్దంలో నిర్మించారట. మళ్ళా మళ్ళా అది పునర్‌నిర్మాణాలకు నోచుకుందట. ఇపుడు కనిపిస్తోన్న నిర్మాణాలు పదిహేనో శతాబ్దానివట. అది వ్యూహాత్మకంగా ముఖ్యమైన చోట ఉండటమే గాక, సహారాకు అవతలి ప్రాంతాలలో జరిగే వాణిజ్య కార్యకలాపాలకూ ముఖ్య బిందువుగా వ్యవహరించిందట.

ఖసర్ సందర్శన నన్ను ఎంతో సంతోషపరచింది. పెద్దగా ఏమీ ఆశించకుండానే వచ్చానా ప్రదేశానికి. వెళ్ళాక చూసిన దృశ్యాలూ వివరాలూ నన్ను ఎంతగానో ఆకట్టుకొన్నాయి. నేను చూసిన అందమైన కొండమీది కోటల్లో ఖసర్ ఒకటి అని ఖచ్చితంగా చెప్పగలను. ఆ కోట మట్టిగోడలు దానికి ఒక విలక్షణ సహజ సరళ శోభను సంతరించిపెట్టాయి. ఈ ఐత్ బెన్ హద్దూ ప్రాంగణాలకు యునెస్కోవారి ‘ప్రపంచ వారసత్వ సంపద’ గుర్తింపు లభించింది. వాటి చారిత్రక, సాంస్కృతిక విలక్షణతకు లభించిన గుర్తింపది. మట్టితో నిర్మించగల విలక్షణ కట్టడాలకు మొరాకో దేశపు ప్రతీకగా అది పరిగణింపబడుతోంది.


మేమంతా ఓ వంతెన మీద నదిని దాటి – పోల్చి చూస్తే అత్యాధునికంగా అనిపించే – ఐత్ బెన్‍హద్దూ గ్రామానికి చేరుకొన్నాం. అలా రానూపోనూ విభిన్న మార్గాలను తీసుకోవడం ద్వారా ఆ ప్రాంతాలను ఒక చుట్టు చుట్టగలిగామన్నమాట.

ఆ బెన్‌‍హద్దూ సందర్శన ముగిసేసరికి సాయంత్రపు ఛాయలు కనిపించసాగాయి. మరొక్కసారి అక్కడ మింట్‌ టీ తాగి మా ముందున్న నాలుగయిదు గంటల మరాకేష్‌ ప్రయాణానికి నడుంకట్టాం. దాదాపు తిరుగు ప్రయాణమంతా చీకటిలోనే సాగింది. చందమామ గుడ్డి వెలుగులో అడపా దడపా ఆట్లస్‌ పర్వతాలు రేఖామాత్రంగా కనిపించాయి. అందరం, ముఖ్యంగా పిల్లలు, ఆ తిరుగు ప్రయాణమంతా జోగుతూ గడిపాం. కొంతమందయితే గాఢనిద్ర కూడానూ. తిరిగి హోటలుకు చేరేసరికి రాత్రి పదిన్నర. అయినా హోటలు వాళ్ళు మాకోసం భోజనం తీసి అట్టేపెట్టారు.

ఆరోజు అంతా కలసి పదిహేను గంటల ప్రయాణం చేశాం. నాలుగు వందల కిలోమీటర్లు వెళ్ళి వచ్చాం. నాకయితే ఆ ప్రయాణం సంతోషమే కలిగించింది గాని, ఆడవాళ్ళూ పిల్లలూ మరాకేష్‌ చేరేసరికి తోటకూర కాడల్లాగా వేలాడిబడిపోయారు. ఆట్లస్‌ పర్వతాలలో రెండు రోజులపాటు ఎడతెగని ప్రయాణాలు చేసిన పుణ్యమా అని పిల్లలూ మహిళలూ ‘ఇహ మేవు మీతో సిటీ బయటకు ఏ ట్రిప్పుకూ రాము’ అని స్పష్టంగా ప్రకటించేశారు. ఆ ఊళ్ళో గడపడానికి మాకింకా మూడు రోజులున్నాయి. నేను మరాకేష్‌ నగరాన్ని చూడనే చూడలేదు. మిగిలిన మూడురోజులూ ఆ పనికోసం అట్టేపెట్టుకొన్నాను.

(సశేషం)