నది ఒడ్డున కూర్చున్నప్పుడు
నది ఒడ్డునే ఉన్నావా?
నగరంలో తిరిగేటప్పుడు
నగరంలోనే ఉన్నావా?
మాటల మధ్య
పాటల వేళ
పెదాలు కలిసినప్పుడు
కౌగిలి లో
స్పర్శాస్పర్శ సందర్భంలో
నవ్వుల మధ్య
దుఃఖద్వీపంలో
పదుగురిలో
ఏకాంతంలో
ఉన్నావా?
జ్ఞాపకాల పొలిమేరల్లో
తచ్చాడుతున్నావా?
అమ్మనో, బామ్మనో
నాన్ననో, అంతెందుకు
ఊరి చెరువు గట్టునో,
నాలుగు రోడ్ల కూడలినో,
అరుగు మీద కుర్చీలో
కదులుతున్న దృశ్యాలో
నెమరేసుకుంటున్నావా?
అంతర్బహిశ్చ తత్సర్వం
చిన్ని ప్రపంచమే
సూది దారంతో కుట్టుకునే అంగీనే!