జూన్ 2022

తెలుగులో ప్రపంచస్థాయి సాహిత్యం రావట్లేదని, సాహిత్య విమర్శ లేదని, రచయితలు ఎక్కువగా చదవరని, నేర్చుకోరని, విమర్శను ఏ రకంగానూ తీసుకోలేరని, కూపస్థమండూకాల్లా ఉంటారనీ వింటూంటాం. రచయితలు దురాచారాల్ని చీల్చి చెండాడాలని, పీడితపక్షాన నిలబడి గళమెత్తాలని, సాహిత్యం సమాజపు అభ్యుదయం కోసమేననీ రొడ్డకొట్టుడు ఉపన్యాసాలు, పిలుపునివ్వడాలు కూడా వింటూంటాం. (అలా అని మనకు సాహిత్యప్రశంస లేదనుకునేరు! తెలుగు సాహిత్య సమాజాల్లో ఏ పుస్తకావిష్కరణకు వెళ్ళినా బాజాభజంత్రీలతో పనిలేనంత పొగడ్తల వెల్లువ. సాహిత్యకారుల వ్యక్తిగత సంబంధాలు, వృత్తిఉద్యోగాలు, వాళ్ళ వ్యక్తిత్వాలతో మాత్రమే ముడిపడ్డ ‘సాహిత్య సంభాషణలు’ తెలుగునాట ఎటు తిరిగినా ఎదురొచ్చే నిత్యదృశ్యాలు.) అయితే, ఇంత మామూలైపోయిన మాటల మధ్య, మచ్చుకైనా కనపడని, వినపడని అంశమేదైనా ఉందీ అంటే, అది సంస్కారం. కనీస సంస్కారం. సాహిత్యంలోనైనా సమాజంలోనైనా మౌలికమూ ముఖ్యమూ అయిన ఈ సంస్కారం, ప్రస్తుత సమాజంలోను, సాహిత్య చర్చల్లోనూ పూర్తిగా మృగ్యమైపోయింది. ప్రపంచ స్థాయి సాహిత్యం రాలేదని విమర్శకులు, విమర్శలో పస లేదని రచయితలూ ఒకర్నొకరు వేలెత్తి చూపుకోవడం సరే, కానీ దాని కన్నా ముందు, నిజానికి సాహిత్య సంభాషణల్లో ప్రధానంగా ఉండవలసినది, మనం కాపాడుకోనందుకు ఆందోళన పడవలసినదీ మనుషుల మధ్య మచ్చుకైనా కనపడని సంస్కారపు జాడల గురించి. నచ్చిన కవి, రచయిత, నటుడు, గాయకుడు, చలన చిత్రం, చిత్రకళ- ఇంకెవరైనా, ఏదైనా సరే అందరికీ ఒకే తీరున నచ్చనక్కర్లేదనే కనీస అవగాహన లేకపోవడం. కొడవటిగంటి, చలం, విశ్వనాథ, జాషువా ఎవరైనా కానీండి, మన వాదజాలానికి సంబంధించినా, సంబంధించకున్నా మనకు చాతనయింది విగ్రహాలు కట్టి పూజించడం, కాదన్నవారిని అసభ్యంగా దూషించడం. కొడవటిగంటి నీకు మహానుభావుడైతే నాకు కానక్కర్లేదు. నా దృష్టిలో అతను ఒక అతిమామూలు కథకుడు కావచ్చు. విశ్వనాథ నీకు దేవుడైతే నాకు అతను కేవలం ఒకే మూస దృక్పథంతో రచనలు చేసిన ఒక వ్యక్తి మాత్రమే కావచ్చు. ఒక కవి, రచయిత, శిల్పి, చిత్రకారుడి సృజన లోతుపాతుల గురించిన చర్చ మనకు ఎప్పుడూ పట్టలేదు. ఆమాటకొస్తే మనం గుడ్డిగా ఇలా అభిమానించే చాలా మంది సృజన స్వరూపాన్ని అభిమానులమని చెప్పుకుని గుండెలు విరుచుకునే వారెవరూ ఎప్పుడూ లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కాని, అలా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఎవరైనా విమర్శిస్తే ఆ అభిప్రాయం వెలిబుచ్చిన వారిని – వారెవరైనా సరే, విద్యాధికులయినా, అధ్యాపకులయినా, అద్భుత విశ్లేషకులైనా, వారి జ్ఞానం ఎలాంటిదయినా – నీచంగా ఎద్దేవా చేయడం, అసభ్యంగా మాట్లాడడం మాత్రం వెన్నతో పెట్టిన విద్య అయింది. సోషల్ మీడియా వచ్చాక ఈ జాడ్యం మరింత ప్రబలమయింది. ఇదేదో ట్రోల్స్ అనబడే పరదాల చాటు కులమతజాడ్యులు, మూర్ఖాభిమానులు మాత్రమే చేస్తున్నది అయితే ఆందోళన లేకపోను. ఇది కవులు, రచయితలు, అభ్యుదయవాదులు, ధర్మసంరక్షకులు, అరుణపతాకులు, కాషాయకేతనులు, అస్తిత్వవాదులు – ఇలా సమాజపు ప్రతీ పార్శ్వం నుంచి, ఎవరినుంచయితే ఇలాంటి ప్రవర్తన ఏ మాత్రమూ ఆశించమో వారి నుంచీ ప్రబలంగా రావడం సమకాలీన విషాదం. అఘాయిత్యంగా విరుచుకుపడటం, అన్యాయంగా సాటి మనిషి మీద విషం చిమ్మడం, అడుగుకొకటిగా కనపడుతున్నప్పుడల్లా మరీ మరీ అనిపించేది ఒక్కటే: ముందు మనిషి నేర్వవలసినది సాటి మనిషి పట్ల సంస్కారంతో ప్రవర్తించడం. పైపై మాటలతో కాదు, నిజంగా విరుద్ధాభిప్రాయాల పట్ల గౌరవం చూపడం, తమ అభిప్రాయాన్ని, తమ వ్యతిరేకతను మర్యాదగా తెలియజేయడం. కాని, రాజకీయనాయకుల నుంచి మామూలు మనుషుల దాకా అందరిలోనూ పాకివున్న రోగం ఇది. దీన్ని ఎలా రూపుమాపడం? ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ఆ గౌరవాన్ని, అందులో తమ బాధ్యతనూ ఎలా వీరికి తెలిసేలా చేయడం? ఇప్పటికీ, అసభ్యపదజాలంతో దూషించడం, తొడలు గొట్టటం, మీసాలు తిప్పటం లాంటి జాంతవికప్రవర్తన నుంచి బయటకు రాని సమాజం నుండి, ఆత్మవిమర్శ, నిజసంస్కారం లేని సమాజం నుండి, ఉత్తమసాహిత్యమనే కాదు, ఏరకమైన ఉన్నతినైనా ఎలా ఆశించగలం?