ప్రిథుండ నగరం

చరిత్ర కొన్నిసార్లు ఒక ఆధారాన్ని అల్లుకొని ఊహించబడి నిర్ణయించబడుతుంది. నిర్ణయించిన దాన్ని విశ్వసించడం మొదలుపెట్టాక కొంతమంది మేధ అక్కడే ఆగిపోతుంది. ఇంకొంతమందికి మరో మార్గంలోకి వక్రీకరణ చెందుతుంది.

క్రీ.శ. 2022 ఉదయగిరి గుహలు, భువనేశ్వర్, ఒరిస్సా.

“ఏందబ్బాయ్, ఈ కొండ పైకి వచ్చి ప్రశాంతంగా పడుకున్నావ్, ఏమైనా ప్రత్యేకత ఉందా ఇక్కడ?” అంది మధు ఆకాశం వైపు చూస్తున్న నాతో.

“ఏమో మధూ, ఈ ఏర్పాటు చూడు, ఒక మనిషి పడుకొని తలపెట్టుకోవడానికి, చేతులు చాపి కొంచెం నీటితో నోరు తడుపుకోవడానికి, చుట్టూ కట్టబడిన అరుగుల మీద కూర్చొని మంత్రాలు చదవడానికి వీలుగా డిజైన్ చేసినట్లుంది కదా! బహుశా ఇది జైనులు సల్లేఖన వ్రతం కోసం ఎంచుకున్న ప్రాంతమేమో!”

“ఏందయ్యో ఆ సల్లేఖన వ్రతం, ఇలా పడుకోవడమా?” కొంచెం వెటకారం మధు మాటల్లో.

“లేదు మధూ, తమకు తామే ఆహారాన్ని క్రమంగా తగ్గించుకుంటూ భక్తితో, ఇష్టంగా శరీరాన్ని క్షీణింపచేసుకుంటూ మరణించడమే సల్లేఖన. జైనులు దాన్ని వారి మతంలోనే చాలా గొప్పదైన పవిత్రమరణంగా భావిస్తారు.”

“ఓహ్! అంటే ఆత్మహత్యలానా!?”

“అదొక స్వచ్ఛంద మరణం మధూ. సల్లేఖన పైన చాలా వివాదాలు నడిచాయి. చివరికి సుప్రీంకోర్టు కూడా ఆత్మహత్య కాదని తీర్పు చెప్పింది. ఇప్పటికీ మనదేశంలో ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో జైనులు ఇలా మరణిస్తున్నారని లెక్కలు చెబుతున్నాయ్. గొప్ప చక్రవర్తిగా పేరుగాంచిన చంద్రగుప్త మౌర్యుడు కూడా ఇలానే మరణించినట్లు చెబుతారు.”

“హ్మ్! మతవిశ్వాసాలు మరణాన్ని కూడా ఆనందంగా ఆహ్వానించేలా చేస్తాయేమో! అది సరే కాని ఇందాక ఓ గుహలో వేయబడ్డ శాసనం గురించి ఏదో చెప్తానన్నావ్. ఈ సల్లేఖన వ్రతం గురించి ఉందా ఆ శాసనంలో?”

“లేదు. దానిలో సల్లేఖన ఊసు లేదు కాని, జైనుల నమోకర మంత్రంతో మొదలవుతుంది. ఖారవేలుడు అనే ఓ గొప్ప కళింగ చక్రవర్తి గురించి చెప్పే హాథీగుంఫా శాసనం అది.”

“కళింగ అంటే ఒరిస్సానే కదా?”

“ఇప్పటి ఒరిస్సారాష్ట్రం అనేది కళింగ రాజ్యంలో ఓ భాగం మాత్రమే. దక్షణాన కృష్ణానది మొదలుకొని ఉత్తరాన గంగానది దాకా ఉన్న తూర్పు సముద్రతీరం మొత్తం ఏదో ఒక సమయంలో కళింగరాజ్యంలో భాగంగానే ఉన్నాయి. కృష్ణ, గోదావరుల మధ్య ఉండేది దక్షిణ కళింగ అనుకుంటే గోదావరి మహానదుల మధ్య ఉండేది మధ్య కళింగ, ఇక మహానది గంగానదుల మధ్య ఉండేది ఉత్తర కళింగ. దీన్ని ఇలా అని విభజన చేయడం సరైనదో కాదో తెలియదు కాని త్రికళింగలు పేరుతో మూడు కళింగలు ఉండేవి.”

“అదేంటబ్బాయ్? నువ్వు చెప్తున్న దాని ప్రకారం చూస్తే దాదాపు సగం ఆంధ్రప్రదేశ్ కళింగలోనే ఉన్నట్లుంది కద?”

“క్రీ.పూ. ఒకటో శతాబ్దం నాటి పరిస్థితుల్లో అలానే ఉందనుకోవాలి. తెన్ అంటే దక్షిణ అనే అర్థం ఉందమ్మాయ్. ఉత్తర కళింగ ఉత్కళగా మారినట్లు ఆ తెన్ కళింగనే కాలక్రమంలో త్రిలింగదేశంగా మారిపోయుండచ్చు. తెలుగును మొదట తెనుగు అనే కదా పిలిచింది! ఇక్కడ తెన్ అనేది దక్షిణాది భాష అనే భావాన్ని సూచిస్తుందేమో! త్రికళింగకు అనుకరణగానే త్రిలింగ అనే పదం వచ్చినట్లుంది. చిన్నప్పుడు మనం చదువుకున్న శ్రీశైలం/ కాళేశ్వరం/ ద్రాక్షారామం/ శ్రీకాళహస్తులలో మూడు శైవక్షేత్రాల మధ్యప్రాంతమే త్రిలింగదేశం అనేది శైవం బలపడిన తరువాతే ప్రాచుర్యంలోకి వచ్చుండచ్చు! చారిత్రకంగా ఆ కాలంలో ఆంధ్ర అంటే ఇప్పటి మహారాష్ట్ర, తెలంగాణాలలోనే ఎక్కువ ప్రాంతాన్ని సూచిస్తుంది.”

“హ్మ్! ప్రాంతాల మధ్య విభజన కాలాలు గడిచేకొద్ది ఎంత సులభంగా చెప్పబడుతుందో కదా!”

“ఐక్యత కూడా అంతే కదా! భరతవర్ష అనే పదాన్ని మొదటిసారిగా వాడింది ఈ హాథీగుంఫా శాసనమే. ఇప్పటి ఉత్తర భారతదేశంలో కొంత ప్రాంతానికి మాత్రమే వాడబడిన పదం అది. ఇప్పుడు భరతవర్ష అంటే భారతీయులందరం మనదే అనుకుంటాం. కాలంతో పాటుగా అనేక విభజనలు, ఐక్యతలు రకరకాల కారణాలతో జరుగుతూనే ఉంటాయ్. తెలంగాణ, ఆంధ్రాలు కలవడం విడిపోవడం మన ముందు జరిగినదే కదా!”


క్రీ.పూ 176, ఖండాచల శిఖరం, కళింగనగరం.

ఓం నమో అరిహంతానాం
ఓం నమో సిద్దానాం
ఓం నమో ఆయరియాణమ్
ఓం నమో ఉవజ్ఝాయనమ్

జంబూద్వీపం నలుమూలలనుంచి విచ్ఛేసిన జైన సాధువుల నమోకర మంత్రోచ్ఛరణతో ఆ పర్వతమంతా మారుమోగుతోంది. ఆచార్య ఇంద్రభూతి జినసేన దాదాపు సంవత్సర కాలంగా చేస్తున్న సల్లేఖన వ్రతదీక్ష చివరి దశకు వచ్చింది. కళింగ చక్రవర్తి ఖారవేలుడు శిఖరం పైన ప్రత్యేకంగా నిర్మించిన వృత్తాకార ప్రదేశం మధ్యభాగంలో రాతి పడక మీద పడుకొని ఉన్నారు జినసేనులవారు. ప్రజలందరూ ఆచార్యులవారిని కడసారి దర్శించుకొని వెళ్తున్నారు. వణుకుతున్న పెదవులతో జైనమంత్రాలు ఆచార్యుల వారి నోటినుంచి అస్పష్టంగా వెలువడుతున్నాయి. నెమ్మదిగా ఆయన మగతలోకి జారిపోతున్నారు. కళింగాధిపతి ఖారవేలుడు ఆయన వైపు చూస్తూ ఉండిపోయాడు.


విశాలమైన మహావిజయ రాజప్రాసాదమంతా నిశ్శబ్దంగా ఉంది ఏదో ముఖ్యమైన విషయం వినబోతున్నట్లు. సభామందిరంలోకి అడుగుపెట్టాడు మహామంత్రి విశ్వరూపుడు. ఎప్పుడో కాని ఆ సమయంలో ఇక్కడికి రమ్మని కబురు పంపడు మహారాజు. సింహాసనంపై కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు ఖారవేలుడు.

మహరాజుకి వినయంగా నమస్కరించి తన ఆసనంలో కూర్చొన్నాడు విశ్వరూపుడు. మహారాజు ఎందుకు పిలిపించారో అర్థంకాకపోవడంతో మౌనంగా ఆయన వంకే చూస్తున్నాడు.

“విశ్వరూపా, నా చిన్నతనం నుంచి నేను ఆచార్యులవారి దగ్గరే గణన, లేఖ, రూప, వ్యవహార, విధి వంటి అనేక విద్యలను అభ్యసించాను. జైనం పట్ల నాకింత భక్తి, రాజకీయ కార్యకలాపాలలో ఇంత చురుకుగా, దూకుడుగా వ్యవహరించేలా నా వ్యక్తిత్వాన్ని రూపుదిద్దడంలో ఆచార్యులవారి పాత్ర గురించి మీకు తెలిసిందే కదా. మహా మేఘవాహన వంశం యొక్క కీర్తి ప్రతిష్ఠలు ఈ రోజు జంబూద్వీపమంతా వ్యాపించి ఉన్నాయంటే అదంతా ఆయన ఆశీర్వాద బలమే. ఆయనెప్పుడూ ఆయన గత జీవితం గురించి ఒక్క మాట కూడా మాకు చెప్పి ఉండలేదు. అది వారి నిర్యాణానంతరం వర్ధమాన్ నుంచి వచ్చిన సాధువుల ద్వారా ఈ రోజే తెలిసింది. ఒక్కో విషయం తెలిసిన కొద్ది మనసంతా వేదనగా ఉంది” అంటూ ఆగాడు ఖారవేలుడు.

“ఆచార్యుల వారి జీవితంలో దుఃఖంతో కూడిన రహస్యమా!?”

“అవును విశ్వరూపా, అది రహస్యంగా ఉంచారో లేక క్షమించి మరిచిపోయారో తెలియదు కాని ఆచార్యులవారు భరించలేని శోకంతో చేసిన ప్రతిజ్ఞకు నేను కట్టుబడి ఉండాలనుకుంటున్నాను. అది నెరవేర్చేదాకా ఏ విధమైన రాజకార్యాలు నిర్వహించదలుచుకోవట్లేదు.”

ఖారవేలుని కంఠంలోని దృఢత్వం విశ్వరూపుణ్ణి ఆశ్చర్యపరుస్తోంది. దాని నుండి తేరుకుంటూ “అసలేం జరిగింది మహారాజా?” అన్నాడు సున్నితమైన స్వరంతో.

“దక్షిణ కళింగలోని ప్రిథుండ నగరం ఆచార్యులవారి జన్మస్థలం. ఆ నగరం అనేక ఆరామాలు చైత్యాలతో నిండి బుద్దుని శరణువేడిన ప్రాంతమట. మన ఆచార్యులవారు మొదటి నుంచి జైన ఉపాసకులే. తరువాత వర్ధమాన విహారంలో వారు జైన సన్యాసిగా దీక్ష తీసుకొని దిగంబరంగా నగరానికి విచ్చేసినప్పుడు అక్కడి బౌద్ధ ప్రజలు వారిని, వారి కుటుంబసభ్యులను చేసిన హేళనలను భరించలేక వారి భార్య, కుమార్తెలు ఆత్మహత్య చేసుకున్నారట. ఆయన వారికి అక్కడే అంతిమసంస్కారాలు పూర్తి చేసి తన దిగంబర దేహంతో ఆకాశంలోని సూర్యుని వైపు చూస్తూ నా భార్య, కుమార్తెల మరణానికి కారణమైన ఈ బౌద్ధుల దురహంకారం నేలరాలేట్లు ప్రిథుండలోని ప్రతి చైత్యాన్ని ఏ రోజుకైనా గాడిదలతో దున్నిస్తాను అని ప్రతిజ్ఞ చేసి నగరాన్ని విడిచి వచ్చేశారట. ఆచార్యుల వారి సల్లేఖన దీక్షా కార్యక్రమానికి వచ్చిన వర్థమాన్ సన్యాసులు ఈ రోజు తిరిగివెళ్తూ నన్ను కలిసి మాట్లాడటం వలన ఈ విషయాలన్నీ తెలిశాయి. మనం శాతవాహనులను లెక్క చేయకుండా కృష్ణానదీ తీరం దాకా వెళ్ళాం, మూషిక నగరాన్ని హడలెత్తించాం. కాని ఆ రోజున కూడా పక్కన ఉన్న ప్రిథుండ గురించి ఆచార్యులవారు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆయన నిజంగానే జినుడు, తనను తానే జయించడం పైన దృష్టి పెట్టిన ధీరుడు విశ్వరూపా. కాని నేను ఆయన చేసిన ప్రతిజ్ఞను వమ్ము చేయదలుచుకోలేదు. ఆయన కుటుంబానికి ద్రోహం చేసిన ఆ నగరానికి చరిత్రలో ఆనవాలు దొరక్కుండా చేస్తాను. మన సేనాపతితో చర్చించి ప్రణాళికను సిద్ధం చేయండి. త్వరలోనే మన సైన్యం ప్రిథుండను చేరుకోవాలి” అంటూ అక్కడ నుంచి నిష్క్రమించాడు ఖారవేలుడు.


ప్రిథుండకు సంబంధించిన వివరాల కోసం కళింగ సేనాపతి అభిరభిల్లు పంపిన వేగులైన సింహరాయుడు, వినోదుడు ప్రిథుండకు దగ్గరలో ఉన్న కూడూరు రేవు పట్టణాన్ని చేరుకున్నారు.

“దక్షిణ కళింగలో ఇంత గొప్ప రేవుపట్టణమా!? ఇక్కడ అనుమతికి సుంకం కూడా లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది సింహరాయా! అందుకే రోమన, యవన, సింహళ, సువర్ణ, చేర, పాండ్య, చోళాది అనేక రాజ్యాల నౌకలు ఇక్కడ బారులు తీరి స్వేచ్ఛగా వ్యాపారం చేస్తున్నట్లున్నాయి. కళింగాధిపతి ఖారవేలుని నౌక అనగానే అత్యంత గౌరవంగా చూస్తున్నారు ఇక్కడి అధికారులు. మంచి వసతి ఏర్పాట్లు కూడా చేశారు. ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయాన్నే ప్రిథుండకు బయలుదేరుదాం” అన్నాడు వినోదుడు చుట్టూ చూస్తూ.

“తామ్రలిప్తి మొదులు కంటకసేల దాకా తూర్పు తీరమంతా మన కళింగ రేపు పట్టాణాలే కదా వినోదా, కళింగ నౌకలకు ఆ మాత్రం గౌరవం దొరుకుతుందిలే. అయినా ఇంత పెద్ద రేవు పట్టణాన్ని నడుపుతున్నారంటేనే అర్థం కావడం లేదా వ్యాపారాన్ని, వ్యాపారులను వీళ్ళు ఎంత గౌరవంగా చూసుకుంటారో! వీలైనంత తొందరగా వచ్చిన పని పూర్తి చేసుకొని బయలుదేరుదాం” అంటూ బడలికతో ఆవులించాడు సింహరాయుడు.


“ఆహా, మొత్తం కళింగలోనే ఇలాంటి వాణిజ్యనగరాన్ని చూడలేదు. ఎక్కడ చూసినా కుంచెలతో రంగులద్దిన మల్లు నేత వస్త్రాల దుకాణాలే. బియ్యం, వెన్న, తేనె, సుగంధ ద్రవ్యాలు, ముత్యాలు, తమలపాకులు, నూనెలు, ఔషధాలు, ఆభరణాలు, ఆయుధాలు, వ్యవసాయపరికరాలు, పాత్రలు, గృహోపకరణ వస్తువులు, పశువులు ఒకటేమిటి ఈ నగరంలో దొరకని వస్తువే లేనట్లుంది! ఏ అంగడి చూసినా జనంతో కిటకిటలాడుతోంది. ఈ నగరం అనేక రాజ్యాలకు వీటిని ఎగుమతులు చేస్తున్నట్లుంది. బంగారు నాణాలను మన కళింగనగరంలో రాగినాణాలంత సహజంగా మారకం చేస్తున్నారు సింహా. ఈ దారులు చూడు ఎంత రద్దీగా ఉన్నాయో!”

“వినోదా! అటు చూడు అక్కడ బోర్లించిన కోడిగుడ్ల వంటి స్తూపాలు వరసగా పదుల సంఖ్యలో కనబడుతున్నాయి. బహుశా ఆ ప్రాంతం గురించేనేమో మన మహామంత్రి చెప్పింది. మధ్యలో ఉన్నది మహాచైత్యమేమో! మన ధౌళీ స్తూపం కంటే ఇంకా పెద్దగా ఉంది.”

“అవును సింహా, ఎక్కడ చూసినా వ్యాపారులు, బౌద్ధ బిక్షువులే. ధర్మాలు దండిగా దక్కుతున్నాయి. పనిమానేసి ఏ చైత్యం దగ్గర కూర్చున్నా పూట గడిచిపోయేట్లుంది” అన్నాడు వినోదుడు నవ్వుతూ.

“ఇలాంటి ఆలోచనతో మన కుటుంబాలకు, వచ్చిన పనికి ఎసరు పెట్టకు. ఈ ప్రాంతమంతా నగరాధ్యక్షుల పరిపాలనలోనే కొనసాగుతున్నట్లుంది. అతనే ఆర్థిక, రక్షణ వ్యవహారాలు చూసుకుంటున్నట్లున్నాడు. ఒకప్పుడు మన ఐరా మహారాజులు నివసించిన నగరమేనట కదా ఇది. ఇప్పుడు చాలా అభివృద్ధిని సాధించినట్లుంది. అయినా రేపు పట్టణం ఒకరి ఆధీనంలో ఉంటే పక్కనే ఉన్న ఈ నగరం ఇంకొకరి ఆధీనంలో, రక్షణ ఏర్పాట్లు చాలా తక్కువగా ఉన్నట్లున్నాయి వినోదా.”

“మన మహారాజులు పూర్తిగా కళింగనగరంలో స్థిరపడటంతో సరిహద్దులలో ఉన్న ఈ ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడం, ఇటు శాతవాహనులు వీటిని కళింగ ప్రాంతమనుకోవడంతో ఈ నగరాలన్నీ దేనికవి నగరాధ్యక్షుల పర్యవేక్షణలో స్వతంత్ర జనపదాలుగానే వ్యవహరిస్తున్నట్లున్నాయ్. వ్యాపారంపైన భద్రంగా బతుకుతున్న ప్రిథుండను స్వాధీనం చేసుకోవడం – రథికులను, భోజకులను రోజుల వ్యవధిలోనే పాదాక్రాంతం చేసుకున్న మన మహరాజుకి పెద్ద కష్టమైన పనేం కాదు సింహా. రేపే మన తిరుగు ప్రయాణం” అన్నాడు వినోదుడు గుర్రాన్ని అదిలిస్తూ.


“కూడూరు, కంటకసేల రేవుపట్టణాలనుంచి బిక్కువాడ, మూషికనగరం, ధాన్యకటకం నుంచే కాక విదేశాలనుంచి వచ్చే వ్యాపారులతో నిత్యం రద్దీగా ఉండే వాణిజ్య కూడలి మాత్రమే కాదు, తొంభైతొమ్మిది స్తూపాలతో దాని పేరులోనే మహా అండనగరమని గర్వంగా చెప్పుకుంటూ అది ప్రిథుండ నగరంగా పేరుగాంచింది మహామంత్రీ! దక్షిణ కళింగలోనే అత్యంత శాంతియుతమైనది, ఆర్థికంగా బలమైన నగరమది. ఇప్పటికీ కృష్ణానది తీరం దాకా మన ప్రాబల్యమే ఉంది. ఆచార్యులవారి ప్రతిజ్ఞను నెరవేర్చడం పెద్ద కష్టమైన పనేం కాదు. వాటికోసం మన చతురంగబలాలను తరలించాల్సిన అవసరమూ లేదు. ఇక్కడ నుంచి భూమార్గంలో వెళ్ళి గోదావరిని దాటడం ప్రయాసతో కూడుకున్న పని. ఇది సముద్రయానానికి అనుకూలమైన కాలం కాబట్టి నౌకలతో కూడూరు చేరి అక్కడనుండి ప్రిథుండను చేరదాం. సముద్ర ప్రయాణమే ప్రస్తుతం మనకి సునాయాసమైనది. నేను రేపే అక్కడ మనకి కావల్సిన ఏర్పాట్లు చేయడానికి రెండు నౌకలలో మన మనుషులను పంపుతాను. మన ఎనిమిది యుద్ధ నౌకలు చాలు మహారాజు కోరికను తీర్చడానికి.”

“వరస యుద్ధాలతో సాధించిన విజయాలు నీలో చాలా ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి అభిరభిల్లా. నీ ఆలోచన బావుంది. మహరాజు అనుమతిని తీసుకుందాం” అంటూ సేనాపతి భుజం తట్టాడు మహామంత్రి విశ్వరూపుడు నవ్వుతూ.


దిగంబర జైనుల మంత్రోచ్ఛరణ మధ్య నాగళ్ళు కట్టిన వందల గాడిదలు ఒక్కో స్తూపాన్ని కుప్పకూలుస్తూ ఏ విధమైన ఆనవాలు మిగలకుండా దున్నుతున్న దృశ్యాలను ప్రిథుండ నగరమంతా శరణు ఘోషను కూడా గుండెల్లోనే దాచుకొని స్తంభించిపోయి చూస్తోంది. ఆచార్యుల వారి ప్రతినను గుర్తుచేసుకొంటూ ప్రిథుండను గాడిదలతో దున్నించి తన గురువును అవమానించిన బౌద్ద ప్రిథుండపై మూడు రోజుల్లోనే ప్రతీకారాన్ని తీర్చుకొన్నాడు కళింగాధిపతి ఖారవేలుడు. బౌద్ధానికి సంబంధించిన ఏ ఆనవాలు మిగలకుండా అక్కడి స్తంభాలను, శిల్పాలను ఏనుగులతో మోయించి మహా విహారం పక్కన ఉన్న తటాకంలో నిమజ్జనం చేయించాడు. శాతకర్ణిని లెక్కచేయని, మగధను హడలెత్తించి యవనులను మధురకి పారదోలిన మహావీరుడైన ఖారవేలుడే సింహంలా అక్కడ నిలబడి ఉండటంతో ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదు. ఎక్కడా ఒక్క రక్తం చుక్కా చిందలేదు. అహింసాయుతమైన ఆ అవమానానికి బౌద్ధబిక్షువులందరూ నగరాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఉపాసకులు తమ గృహాలలోనే గుడ్లనీరు కుక్కుకుంటూ ఉండిపోయారు. వ్యాపారులు ఇక ఆ నగరం వైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడి పారిపోయారు. ప్రిథుండ నగరం క్రమంగా తన వైభవాన్ని కోల్పోయి అనామకమైన వాడగా మిగిలిపోయింది. ఒక్కడే కదా అని చేసిన హేళనతో తన నాశనాన్ని చేజేతులా తనే తెచ్చుకుంది ప్రిథుండ.

ప్రిథుండనుంచి పారిపోతున్న ద్రవిడ కూటమి వ్యాపారులు ఆ అర్ధరాత్రి కూడూరు రేపు పట్టణంలో లంగరు వేసి ఉన్న కళింగ యుద్దనౌకలను అగ్నికి ఆహుతి చేశారన్న సమాచారం ఖారవేలుడిని కోపోద్రిక్తుడ్ని చేసింది. కళింగ నుంచి తెప్పించిన అరవై ఆరు నౌకలతో కూడూరు రేవు పట్టణంనుంచే తమిళ సమాఖ్యపై దండయాత్ర మొదలైంది. వాటిపై విజయం సాధించి ఆ కూటమిని విచ్ఛిన్నం చేసి తమ నౌకాబలాన్ని, గజబలాన్ని, సంపదను మరింత సమృద్ధి చేసుకొని తన పదకొండవ పాలన వర్షాన్ని విజయవంతంగా ముగించాడు ఖారవేలుడు.


“ఈ కథంతా ఉండటం వలన అది అంత పెద్ద శాసనం అయినట్లుందబ్బాయ్” అంది నవ్వుతూ మధు.

“లేదబ్బా, ఖారవేలుడి బాల్యం నుంచి పదమూడో పాలన సంవత్సరం దాకా ఒక స్పష్టమైన క్రోనాలజీతో రాయబడిన బయోగ్రఫికల్ స్కెచ్ లాంటి పదిహేడు వాక్యాల పెద్ద శాసనం అది. తన పదకొండో పాలనా సంవత్సరంలో ప్రిథుండను గాడిదలతో దున్నించి తమిళ సమాఖ్యను విచ్ఛిన్నం చేసినట్లు ఆ శాసనంలోని ఒక వాక్యం తెలియచేస్తుంది. గురువు, మంత్రి, నౌకలు ఇవి నేను కల్పించినవి.”

“ఆ ఒక్క లైన్ తోనే ఈ కథ ఊహించావా?”

“అవును మధూ, ప్రిథుండ గురించి నేను మొదటిసారి భట్టిప్రోలు స్తూపం చూడటానికి వెళ్ళినప్పుడు విన్నాను. హాథీగుంఫా శాసనంలో ఉన్న ప్రిథుండ ఆంధ్రప్రదేశ్‌లోని భట్టిప్రోలే అని చాలామంది తెలుగు చరిత్రకారులు సరైన ఆధారాలు లేకపోయినా బలంగానే చెప్తారు. శ్రీకాకుళంలో జరిగిన హిస్టరీ కాంగ్రెస్ సెమినార్లో ప్రిథుండ పైన ఒక పేపర్ చూశాను. గుంటుపల్లికి వేంగికి మధ్యన ఉండి అదృశ్యమైన గ్రామంగా చెప్పారు అందులో. గుంటుపల్లే ప్రిథుండ అనేవారు కొందరున్నారు. ఒరిస్సా చరిత్రకారులు చెన్నైకి దగ్గరలో ఉండే నగరమని చెప్తారు. అలా దీనిపైన రకరకాల వాదనలు ఉన్నాయ్. టోలెమీ అనే ఒకటో శతాబ్దపు శాస్త్రవేత్త తను రాసుకున్న నోట్సులో మైసోలస్ అంటే కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో పిటిడ్ర అనే వాణిజ్య నగరం గురించి ప్రస్తావించాడు. బహుశా ఆ పిటిడ్రనే ప్రిథుండ కావచ్చు. ఇప్పటికి స్పష్టంగా ఆ నగరం ఏదో గుర్తించడానికి తగిన సమాచారం లభ్యమైతే కాలేదు. కాని నాకు దాని పేరే చాలా ఆసక్తిగా కనిపించింది. సాధారణంగా బౌద్ద స్తూపాలు నేలలో సగం పూడ్చిన గుడ్డు ఆకారంలో ఉంటాయి. ప్రిథుండ అంటే పెద్ద గుడ్డుగా అర్థం చేసుకుంటే అలాంటి ఓ పెద్ద స్తూపం ఉన్న నగరంగా ప్రిథుండను ఊహించాలి. అక్కడ ఉండే స్తూపాలు అన్ని గాడిదలతో దున్నించి అవమానించడం వలన అక్కడ మళ్ళీ స్తూపాలు నిర్మించి పూజించే అవకాశాలు తక్కువ. అవి పూర్తిగా భూగర్భంలో కలిసిపోయుండాలి. ఇలాంటి ఆధారాలతో చూసినప్పుడు వీటికి దగ్గర కనిపించేది గుడివాడ పట్టణం. వాడ, పల్లె లాంటి పదాలు బౌద్ధ గ్రామాలకు ముడిపడి ఉండటం మన తెలుగు ప్రాంతాల్లో మాములు విషయమే. కాసేపు గుడివాడని గుడ్డు వాడగా చూస్తే దానిలోని ప్రిథుండ నగరాన్ని బయటకు లాగచ్చేమో అనిపిస్తుంది నాకు. 1870-94 మధ్యకాలంలో ఇక్కడ ఆంగ్లేయాధికారులు కొన్ని తవ్వకాలు జరిపి అక్కడ ఓ మహానగరం ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పారు. అంతేకాకుండా ఇక్కడ భూమిలో కలిసిపోయిన కొన్ని బౌద్ధ స్తూపాలు బయటపడ్డాయి. వాటిలో సాంచి స్తూపం వంటి పెద్ద స్తూపం ఉండే అవకాశం ఉందని చెప్పారు. కాని తరువాత పరిశోధనలు కొనసాగలేదు. ఇక్కడ దొరికిన గ్రీకు, రోమన్ నాణేలు గుడివాడ ప్రాచీనతను తెలియచేస్తాయి. వీటి ఆధారాలతో చూస్తే ప్రాచీన ప్రిథుండనే ఇప్పటి గుడ్డువాడ, లేదా గుడివాడగా మారిందేమో అనిపిస్తుంది. నిజానికి మన రాష్ట్రంలో గూడూరు, గుడ్లూరు, గుడ్లవల్లేరు లాంటి ఊర్లు అనేకం కనిపిస్తాయి. ఇవన్నీ ఒకప్పుడు బౌద్ధస్తూపాలతో ఉండే అండవాడలే అయ్యుండచ్చు. విజయనగరం జిల్లాలో కూడా గుడివాడ దిబ్బ అనే చోట బౌద్ధస్తూపం ఆనవాళ్ళు దొరికాయి. మనం చాలాసార్లు అలాంటి ఊరిపేర్లు గుడులు (హిందూ దేవాలయాలు) ఉండే ప్రాంతం కావడం వల్ల వచ్చింది అనుకోవడం ఒక పొరపాటేమో! ఈ గుడ్లు (బౌద్ధ స్తూపాలు) ఉండే ప్రాంతాలు తరువాతి కాలంలో గుడిగా రూపాంతరం చెంది ఉండచ్చు.”

“ఇదంతా నిజమేనా అబ్బాయ్?”

“నిజం అనేదానికి దగ్గరగా ప్రయాణం చేయాలని ప్రతి నిజమైన చరిత్రకారుడు కోరుకుంటాడు. కాని ఈ నిజనిర్థారణ అనేక సందర్భాలలో సాధ్యం కాదు. అంతెందుకు రొమిల్లా థాపర్ లాంటి చారిత్రకపరిశోధకురాలు రాసిన మౌర్యవంశ క్షీణత పుస్తకం చూడు. ఏ విషయాన్నీ నిర్థారణగా చెప్పదు. అనేక చోట్ల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇస్తూ సందేహాస్పదంగా ముగిసే వాక్యాలే ఎక్కువ. చరిత్రలో ఉండే సౌలభ్యమూ, అరాచకమూ అదే. అందుకే అది జనం మెదళ్ళతో ఆటలాడుతూనే ఉంటుంది.”

“ఇన్ని రేవు పట్టణాలు ఉండటం వలన కళింగ తీరంపైన పట్టు సాధించడానికే అశోకుడు కళింగపైన దాడి చేసి ఉండవచ్చా?”

“తూర్పు తీరంలో రేవు పట్టణాల పరంగా చాలా ప్రాధాన్యం ఉన్న ప్రాంతం కళింగ. అశోకుడి కుమారుడైన మహేంద్రుడు, కూతురు సంఘమిత్రలు ఈ రేవు పట్టణాల నుంచే శ్రీలంకకు వెళ్ళి ఉండచ్చు. వారు ఈ రేవు పట్టణాలలో ఏమైనా ఇబ్బందికి గురి అయుండచ్చు. పోనీ వ్యాపారపరంగా చూసినా సముద్రతీరం చాలా ముఖ్యం. బహుశా అందుకే కళింగపైన దృష్టి పెట్టి ఉండచ్చు.”

“ఆంధ్రులను మొదట అంధకులు అనే వారట కదా, ఈ ప్రిథుండలానే ఆ పదం కూడా అండకులు నుంచి రాలేదు కదా!”

“ఈ వందల సంవత్సరాలలో ఏది ఎలా మారిందో గ్రహించాలంటే చాల కష్టమే మధూ. మనం కట్టుకున్న అనేక గంతలు మనల్ని సత్యాన్ని చూడనీకుండా నిరంతరం అడ్డం పడుతూనే ఉంటాయి. అంధకులు అనే పదం చాలా పురాతనమైనది మధూ. చైత్యాలను పూజించే వాళ్ళను చైత్యకులు అన్నట్లు అండాలను పూజించే వాళ్ళను అండకులు అని ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. పల్లె అని ఉంటే అవి బౌద్ధ సంబంధ గ్రామమై ఉండచ్చు అని చెప్పా కదా. అది బౌద్ధుల భాషైనా పాళీ నుంచి కూడా వచ్చుండచ్చు.”

“మూషిక నగరం అనేది చెప్పావు కదా! గుడివాడ దగ్గరలో అలాంటి పేరుతో ఏమైనా ఊర్లు ఉన్నాయా?”

“హాఁ, ఘంటశాల దగ్గర ఎలికల కుదురు అనే శిథిల గ్రామం ఒకటి ఉంది. నిమ్మకూరు దగ్గర ఎలకుర్రు అనే ఊరు ఒకటి ఉంది. కేవలం ఇలాంటి ఊహలతో వీటిని నిర్ణయించడం నిరూపించడం కష్టం మధూ. తమాషా ఏంటంటే మూషిక నగరం అనేది కృష్ణానది పరిసరాల్లో ఉందని చెప్పిన ఖారవేలుడి సంతతి గుంటుపల్లి దగ్గర వేయించిన ఓ శాసనంలో వాళ్ళు కళింగ మహిషాధిపతిగా చెప్పుకున్నారు. ఈ పేర్లు వింటే పురాణాలలోని మహిషాసురుడు, మూషికాసురుడు లాంటి వాళ్ళు గుర్తుకొస్తారు.”

“అవును నిజమే, ఇలాంటి ప్రతీకలతో పురాణాలు తరువాత కాలంలో రాయబడ్డాయేమో! ఆచార్యులు సన్యాసదీక్ష తీసుకున్న ఊరు వర్ధమాన్ అని చెప్పావ్ కదా! అదెక్కడ ఉంది?”

“అమరావతికి పదికిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం వడ్డెమాను అని పిలుస్తున్నారు. అక్కడ జైన గుహాలయాలు ఉన్నాయి. అశోకుడి మనవడైన సంప్రతి శాసనం ఉంది. అక్కడి ఒక విహారాన్ని మహామేఘవాహన విహారం అంటారు. ఖారవేలుడో, వాళ్ళ సంతతి వాళ్ళో దీనికి సహాయం చేసి ఉంటారు. జైనగురువైన వర్థమాన మహవీరుడి పేరు పైన వడ్డమానులాంటి ఊర్లు మన తెలుగు రాష్ట్రాలలో చాలానే ఉన్నాయి. సిద్ద, పాడు, పాక, మాను ఇలా ఉండేవి జైనులను ఆదరించిన ఊర్లు అయ్యుంటాయ్ సాధారణంగా.”

“వీటి గురించి తెలుసుకోవడం ఆసక్తిగా ఉంది. ఇంకా ఏమన్నా ఉన్నాయా ఆ శాసనంలో?”

“ఖారవేలుడు చేధి వంశానికి చెందిన రాజు. చేధివంశ రాజులు మహాభారతంలో మనకిద్దరు వస్తారు. ఇద్దరూ కళింగులే. శ్రీకృష్ణుడి మేనత్త కొడుకులు శిశుపాలుడు, దంతవక్త్రుడు. వీరిద్దరి పేరుపైన రెండు ప్రాచీన గ్రామాలు కళింగలోనే బయటపడ్డాయి. శిశుపాల్‌ఘర్, ఇది ఈ ఉదయగిరికి 10 కి.మీ. దూరంలో, అశోకుడు నిర్మించిన ధౌళీ స్తూపానికి దగ్గరలో ఉంది. ఇక్కడ ప్రాచీనమైన కోట శిథిలాలను వెలికితీశారు. దంతవక్త్రుని కోట పేరుతో శ్రీకాకుళం నుంచి 20కి.మీ దూరంలో ఒక పురాతనమైన గ్రామం ఉంది. ఇక్కడ కూడా కోట శిథిలాలు, బౌద్దస్తూపం ఆనవాళ్ళు బయటపడ్డాయి. వీరిద్దరు శ్రీకృష్ణుడికి వ్యతిరేకులే. శిశుపాలుడు ధర్మరాజు చేసిన రాజసూయయాగంలో మరణిస్తే, దంతవక్త్రుడు కౌరవుల తరుపున పోరాడుతూ కురుక్షేత్రంలో మరణించాడు. ఇంకో విషయం ఈ శాసనంలో మగధ రాజధానైన రాజగృహ ముట్టడి ఉంటుంది. ఆ నగరం చుట్టూ ఐదు పర్వతాలు రక్షణప్రాకారాల్లాగా ఉంటాయని రామాయణంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు చెబుతాడు. మహాభారతంలో జరాసంధుని వధ సందర్భంలో శ్రీకృష్ణుడు అర్జున, భీములకు చెబుతాడు. రెండు చోట్ల అది మగధ రాజధానే. వాళ్ళు పేర్కొన్న గోరథగిరి అనే పర్వతం పేరు ఈ శాసనంలో వస్తుంది. ఖారవేలుడు తన ఎనిమిదో పాలనా సంవత్సరంలో గోరథగిరిపై దాడిచేసి రాజగృహరాజును బంధించాడు అని. అలా మొత్తం పైన ఈ శాసనం ఆ ఇతిహాసాలను కూడా గుర్తుచేస్తుంది.”

“ఓహ్ బావుందబ్బాయ్, అంత గొప్పరాజు పరిపాలించిన ప్రాంతాన్ని చూడటం” అంది మధు క్రింది నుంచి కనిపిస్తున్న హాథీగుంఫా వైపు చూస్తూ.

“ఏమో మధూ, ఈ శాసనంలో కొన్ని అయోమయానికి గురిచేసే అంశాలు, అతిశయోక్తులు కూడా ఉండచ్చేమో అనిపిస్తుంది. నందరాజులు ఎత్తుకెళ్ళిన జినకళింగ విగ్రహాలను 250 సంవత్సరాల తరువాత పుష్యమిత్ర శుంగుడిని ఓడించి తీసుకురావడం చెప్పేటప్పుడు అప్పటి రాజధాని పాటలీపుత్ర పేరు కాకుండా పాత రాజధాని రాజగృహ పేరు వాడటం; ఇటు శాతకర్ణి, తమిళ కూటమి, గ్రీకులు, బోజకులు, రథికులపై పైచేయి సాధించడం; ఇవన్నీ కేవలం పదమూడు సంవత్సరాల పాలనలోని విషయాలు. కాని రాజ్యం మాత్రం కళింగకే పరిమితమై ఉండటం విశేషం. అందుకే భారతీయ చరిత్రలో ఎంత ప్రాముఖ్యం ఉందో, అన్ని వివాదాలూ ఉన్నాయి ఈ శాసనానికి. ఇప్పటికీ ఖారవేలుడు ఏ కాలానికి చెందిన వ్యక్తి అనే దానిపైన స్పష్టత లేదు. క్రీ.పూ. 180 నుంచి క్రీ.శ. 50 మధ్య ఏదో ఒక సమయంలో కళింగను పాలించిన రాజై ఉండచ్చు అనేది ఎక్కువ మంది అంగీకరిస్తున్న విషయం. ఒరిస్సా రాష్ట్రమైతే ప్రస్తుతం ఖారవేలుడిని కళింగ హీరోగా ప్రొజెక్ట్ చేస్తుంది. చూడు, ఎక్కడ చూసినా ఆయన ఫ్లెక్సీలే! ఒక హీరో లేకుండా ఏ కథా ఉండదు కదా!” అన్నా నవ్వుతూ ఖండగిరి మెట్లపైన ఆడుకుంటున్న కోతులను చూస్తూ.

చరిత్ర చెప్పే ప్రతి వాక్యం వెనుక ఎన్నో కథలు దాగి ఉంటాయి. వాటిలో సత్యాలెన్నో, సత్యాల్లాంటి అసత్యాలెన్నో. మనం నిజమని నమ్మే అబద్ధానికి ఇంకొన్ని అబద్ధాలు చేర్చి చెప్తే దాన్ని ఇంకా బలంగా నిజమని నమ్ముతాం. బలమైన నమ్మకాలు చరిత్రను మరింత బలహీనంగా మారుస్తాయి. కాని సత్యం కంటే నమ్మకాలతోనే మనుషులు ఊగిపోయేట్లు చేయడం ఏ రాజ్యానికైనా ఒక అవసరం.