దూరప్రణయము

L’Amour de loin (Love from Afar=దూరప్రణయము) అను నీ ఆపెరా క్రీ.శ.2000లో ప్రప్రథమంగా సాల్జ్‌బర్గులో ప్రదర్శింపబడిన ఐదంకముల సంగీతరూపకము. ఇది లెబనానులో జన్మించి ప్యారిసులో స్థిరపడిన అమీన్ మాలూఫ్ (Amin Maalouf) అను రచయితచే ఫ్రెంచి భాషలో వ్రాయబడి, ఫిన్లాండులో జన్మించి, ప్యారిసులోనే స్థిరపడిన కాయా(కేజా)సారియాహో (Kaija Saariaho) అను స్త్రీసంగీతకారిణిచేత సంగీతబద్ధము చేయబడినది. 21వ శతాబ్దములో సంతరింపబడిన ఒక ముఖ్యమైన ఆపెరాగా ఇది పేరు గడించినది.  ఇందులోని కథ కేవలం మూడు ప్రధానపాత్రలతో, ఎట్టి మలుపులు, అనూహ్యఘటనలు లేకుండ అతిసరళంగా సాగును. ఇందులోని కథ ఈక్రింది విధముగా నున్నది.

ప్రథమాంకము: 12వ శతాబ్దములో ఫ్రాన్సుదేశములోని బ్లే అను చిన్న సంస్థానమునకు జాఫ్రీ రూడల్ అను నతఁడు అధిపతి. అతఁడు గీతరచయిత యైన కవి కూడ. తన విషయలోలతపట్ల అతఁడు విముఖుఁడై, కేవల మూహావిజ్ఞాతమైన ఒక అందకత్తెయం దనురక్తుఁడై, ఆమె నభివర్ణిస్తూ గీతరచన చేస్తుంటాడు. కాని అట్టి అంగన ఎక్కడనో ఉన్నదని, ఆమెను తాను చూడగలనని అతఁడాశించి యుండడు. ఒకనాఁడట్టి గీతరచన చేయుచుండఁగా నొక సముద్రయాత్రికుఁ డతనికిఁ గన్పడి, అట్టి స్త్రీని తాను చూచినానని అతనికిఁ దెల్పుతాడు. ఆవార్తను విన్న యతఁడా దూరకాంతయందు ఇంకను అనురక్తుఁడై ఇతరవ్యాపకములను మాని అహోరాత్రము లామెపై గీతరచనలు చేస్తూ కాలం గడపుతుంటాడు.

ద్వితీయాంకము:: ఆయాత్రికుఁ డచ్చటినుండి సముద్రయానం చేసి, లెబనానులోని ట్రిపొలీనగరము నేలుచున్న రాజసంతతిలోని ఒక రాజకుమారిని చూచి, ఫ్రాన్సులోని బ్లేసంస్థానపాలకుఁ డామెను ప్రత్యక్షముగా చూడకున్నను ఆమెయందనురక్తుఁడై అనేకప్రణయగీతములు వ్రాయుచున్న ట్లామెకుఁ దెల్పి, కొన్ని గీతము లామెకు వినిపిస్తాడు. ఆదూరప్రేమికునిగుఱించి వినఁగానే మొదట క్రోధమును, తర్వాత తూష్ణీంభావమును వహించినను యాత్రికుఁ డామె కతఁడు వ్రాసిన ప్రణయగీతములను వినిపించిన తర్వాత ఆమె అతనియం దనురక్తురాలై, అతనినిగూర్చి చింతింప నారంభిస్తుంది.

తృతీయాంకము:: ఆయాత్రికుడు మఱల జాఫ్రీని దర్శించి, ట్రిపొలీనగరములో నున్న క్లెమోస్ (Clémence) అను రాజకుమారి అతని ప్రణయగీతములను తనద్వారా విని అతని(జాఫ్రీ)యందు అనురక్తురాలైనదని తెల్పుతాడు. అది విని జాఫ్రీ ఉత్కంఠాభరితుఁడై ఆయాత్రికునితో ట్రిపొలీ కేఁగుటకు సన్నద్ధుఁడౌతాడు.

చతుర్థాంకము: బ్లేసంస్థానము సముద్రసమీపమునందే యున్నను, జాఫ్రీ ఎప్పుడును సముద్రయానము చేసియుండడు. తొట్టతొలిగా నతఁ డాయాత్రికునితోఁ బాటు సముద్రయాత్రను చేయుచుండఁగా, ఆ యాత్రాజనితమైన అస్వస్థకు లోనౌతాడు. ఆస్థితిలో నతఁడా దూరవనిత నీటిపై నడచి తన సమక్షమునకు వచ్చినట్లు భ్రమపూరితమైన మనోదృశ్యాన్ని చూస్తాడు. అతని అస్వస్థత క్రమంగా తీవ్రమై ట్రిపొలీకి చేరుకొనే సమయమున కతఁడు మరణదశలో నుంటాడు.

పంచమాంకము: మరణదశలో మతిలేక పడియున్న జాఫ్రీతో యాత్రికుఁడు ట్రిపొలీకి చేరుకుంటాడు. అతని స్థితి నరసి క్లెమో సత్యంత ఖిన్నురాలౌతుంది. ఆమె సమక్షంలో నతఁడు కొంతగా కోలుకొంటాడు. ఆస్థితిలో వారిర్వురు పరస్పరానుగమును ప్రకటించుకొంటారు. కాని, త్వరగానే జాఫ్రీ అస్వస్థత తీవ్రతరమై, అతఁడామె కౌఁగిటిలోనే మరణిస్తాడు. ఈవిధంగా పరిణమించిన దూరప్రణయమున కామె ముందుగా భగవంతునినే నిందించి, తర్వాత తనవల్లనే అతని కిట్టి మరణము సంభవించినదని భావించి, వేఱెవ్వరిననీ వివాహమాడనని ప్రతిన చేసి, ట్రిపొలీలోని చర్చిలో సన్యాసినిగా చేరిపోతుంది.

ప్రస్తుతప్రయత్నము

అనూహ్యములైన సంఘటనలతో నాశ్చర్యమును గొల్పు మలుపు లిందులో లేకున్నను, ఇందలి ఇతివృత్తము శృంగార,కరుణారస భరితమై ఇంపుగా నున్నది. దీనిని భారతసంస్కృతికి అన్వయించుకొనుటకు కొన్ని ముఖ్యమైన మార్పు లవసరమైనవి. 12వ శతాబ్దిలో జెరూసలెంవంటి క్రైస్తవపుణ్యస్థలములను పరిరక్షించుకొనుటకై అచ్చట నున్న ముస్లిముపాలకులతో మధ్యప్రాచ్యదేశములలో యూరోపియనుల కనేక మతయుద్ధములు జరిగినవి. ఈవిధముగా లెబనాను యూరోపియనుల హస్తగతమైనది. ఈ ఆపెరాలోని నాయిక క్లెమోస్ తన చిన్నతనములో లెబనానున కాధిపత్యమును వహించుటకు పంపబడిన తన సోదరునితో ఫ్రాన్సునుండి లెబనానున కేఁగినది. ఇట్లు నాయకుడు ఫ్రాన్సులోను నాయిక లెబనానులోని ట్రిపొలీలోను ఉండుట తటస్థించినది. వారిద్దఱిమధ్య సంధానకర్తగా సముద్రయాత్రికుఁడు వర్తించినాడు.

దీనిని భారతమున కన్వయించుకొనుట కటువంటి భౌగోళికసన్నివేశమే అవసరమైనది. 12వ శతాబ్దిలో చోళరాజైన మొదటి రాజేంద్ర చోళుఁడు గొప్ప నౌకాబలముతో శ్రీలంకను, ఇండొనీసియాలోని సుమాత్రాదిద్వీపములను, బర్మా, కాంబోడియా, థాయిలండులలోని కొన్ని తీర ప్రాంతములను గెల్చుకొని అక్కడ తన ప్రతినిధుల నుంచి, హిందూసంస్కృతిని వ్యాపింపజేసినట్లు చారిత్రకాధారము లున్నవి. తత్ప్రకారము సుమాత్రాకు సమీపముననే ఉన్న లంబకద్వీపమున కేలికగా పంపబడిన తన సోదరునితో నాయిక యైన శాంతిశ్రీ తన చిన్నతనములోనే చోళరాజ్యములోని ప్రధాన రేవుపట్టణమైన నాగపట్టణమునుండి ఆద్వీపములోని చక్రనగరమునకు పోయినట్లూహించినాను. చక్రనగరములో చాలా పెద్దదైన త్రిమూర్త్యాలయముండుట గూడ దాని ఎన్నికకు కారణము. మూలములోని చర్చికి బదులుగా నీ ఆలయము చొప్పింపబడినది. ఈ ఆపెరాకు నాయకుఁడైన నాగసేనుని నాగపట్టణమున కుత్తరమున రెండు క్రోసుల దూరములో సముద్రసమీపములో నున్న నాగూరు సంస్థానాధీశునిగా నూహించి, నాగూరు, చక్రనగరములకు మధ్య ప్రణయసంబంధమును కల్పించినాను. ఇందులో వాడిన ఛందస్సులివి: 1.చతురస్రగతి, 2.ఖండగతి, 3.మిశ్రగతి, 4.త్ర్యస్రగతి, 5.తేటగీతి, 6.ఆటవెలది, 7.కందము, 8.ఉత్పలమాల, 9.చంపకమాల

పాత్రలు:
నాగసేనుఁడు: చోళరాజ్యములోని నాగూరు సంస్థానపాలకుఁడు, 30 ఏండ్లవాఁడు
శాంతిశ్రీ: లంబకద్వీపములోని చక్రనగరములో నున్న 24 ఏండ్ల వయసుగల రాజకుమారి
యాత్రికుడు: నాగపట్టణం నాగూరులకు, చక్రనగరమునకు మధ్య సముద్రయానం చేయుచున్న యాత్రికుఁడు
నాగసేనుని సహచరుల కోరస్, శాంతిశ్రీ సహచారిణుల కోరస్.

ప్రథమాంకము

(నాగసేనుఁడు నాగూరులోని తన ప్రాసాదములో సహచరుల బృందముతో(కోరస్‌తో) సమావేశమై యుండును. తాను రచించు గీతమును వీణపై పలికించుటకు యత్నించుచుండును. గీతములోని పదములను మాటిమాటికి మార్చుచు, అవి శ్రావ్యముగా నుండునట్లు సవరించుచుండును.)

నాగ:
1పలుకగ నేర్చితి ప్రమదము గూరిచి గానీ
ప్రమదంబును గన నా బ్రతుకున గనగా నేర్వను

(పై గీతమును వీణపై బలికింప యత్నించుచు, అసంతృప్తితో) కాదు, కాదు, తప్పు, తప్పు…

ప్రమదము గూరిచి పలుకగ నేర్చితి గానీ
ప్రమదంబును నాబ్రతుకున గనగా నేరను

(మఱల అసంతృప్తితో) కాదు, కాదు, అది సరి కాదు…

1ప్రమదము గూరిచి పలుకగ నేర్చితి నైనను
ప్రమదం బెది నాబ్రతుకునఁ గనఁగా నేరను
తరువుల దాఁగిన పరభృతగీతిక వినఁగనె
సరసనఁ జేరును చక్కని కోకిలవధువులు

నాకవనమునందలి పదలయ లాలింపఁగ
నేకాంతయుఁ దమకింపదు చెంతకుఁ జేరఁగ
ఓపికమా! ఓహో పికమా! వచియింపుము
నీపలుకులలో నిహితంబైన రహస్యము

ఓపికమా! ఓహో పికమా! వివరింపుము
నీపలుకులలో నిహితంబైన రహస్యము

కోరస్:
1పలుకదు పలుకదు పరభృత మేదియు
కలనిజ మెఱుఁగుము, తెలివిగ మసలుము!
నాగ:
2సారంపుఁబదములన్ సరిగ నన్వేషించి
పూరింపఁగానిండు పూర్తిగా నాగీతి
కోరస్:
5మాను మట్టియత్నంబు, మామాట వినుము
విన్నవించెడిదెల్ల వేవేగఁ బలికి
జారుకొందు, మిందుండఁగాఁ గోరమేము
ఓర్మితో నందుచే వినుమోయి మమ్ము!
నాగ:
2కోరుకొన నిటనుండి మీరేఁగవలెనంచు
ఓరిమిం బూని మీరొకయింత శాంతించి
సారంపుఁబదములన్ సరిగ నన్వేషించి
పూరింపఁగానిండు పూర్తిగా నాగీతి
కోరస్:
2ఒకకొంత మామాట లోర్మితో వినవోయి!
ప్రకటమౌ వానిలో రమ్యపదబంధాలు
ప్రకటమౌ వానిలో రమణీయభావాలు
ఒకకొంత మామాట లోర్మితో వినవోయి!

(వారి పట్టుదలకు కించిదాగ్రహమును, అసంతృప్తిని బొందుచు, వారు వచించిన పై వాక్యములను వీణపై బల్కింప యత్నించి, ఆప్రయత్నము విరమించి, ఆపైని తానే లయబద్ధముగా కూర్చిన మూర్ఛనలను వీణపైఁ బల్కించుచు, నోటితో వాని నాలపించును. ఆతర్వాత…)

కోరస్:
5ఏమి చిత్రమొ, మారితి వెంతొ నీవు!
మదిరయందునఁ, గాంతల యధరసుధల
యందునం దోఁగి యానందమొంద దిపుడు
తొల్లిటింబలె నీయోష్ఠపల్లవంబు!
నాగ:
(పైవిధముగాఁ బల్కిన సహచరుల పరిహసించుచున్నవానివలె వీణను మీటుచు పాడును.)

2మారితివి నీవు, ముమ్మాటికిది నిజము
వారుణికి దూరమై, వనితకుం దూరమై
యేరీతి సుఖియింపఁగోరుదో నీవు?
నీపూర్వలీలలే నిక్షిప్తమై యుండె
ఆపానములలోన నీపురీంద్రమునందు (వారుణి=మద్యము;ఆపానము=పానశాల)
నీపేరెవానిలో నిరతంబు నినదించు,
నీపొడయె వానిలో నేఁడునుం గనిపించు.

(వీణను వాయించుట నాపి..) మిత్రులార! మఱచితినా ఏమైన నేను? ఔనౌను…
(మఱల వీణను మీటుచుఁ బాడును.)

1పూనిరి నినుఁ గని పొలఁతులు త్రాసము
పూనిరి నినుఁగని పూరుషు లీర్ష్యలు!
(వీణను మీటుట నాపి…) లేక యది దీనికిఁ దలక్రిందులుగా నుండెనా…?
(మఱల వీణను మీటుచుఁ బాడును.)
1పూనిరి నినుఁ గని పురుషులు త్రాసము
పూనిరి నినుఁగని పొలఁతుక లీర్ష్యలు!

కోరస్:
5పరిహసించిన మిత్రంబ! ఫలిత మేమి?
మదిరలో, స్త్రీజనాధరసుధలలోన
ముందు దోఁగిన నీయందు నొందియుండె
నిత్యనూతనసౌఖ్యంబు నిజముగానె!
నాగ:
8పొంగెడి యౌవనాన ననుఁ బొందిన కాంతల కౌఁగిలింతలున్,
రంగగు రాత్రికేళికలు, రమ్యతరాసవపానగోష్ఠు, లా
త్మం గలఁగించుచుం సుఖవిదారణశీలము లౌను నేఁడు, నే
నంగనలందునన్, మదిరయందునఁ జిత్తము నిల్పనిత్తరిన్
కోరస్:
5ఐన మిత్రంబ! నీవెట్టి యతివనైన
కౌఁగిటం జేర్పవా యింకఁ గౌతుకమున?
తమ్మికంటుల తనువులే తల్పములుగఁ
జేసి శయనింపవా తమస్వినులయందు?

5బాహువల్లరియందున పద్మముఖుల
బంధనము సేయ నొల్లవా వలపుమీర?
సుందరాంగుల నందింప నందమైన
కాన్కలీయవా వారికిం గౌతుకమున?

నాగ:
5బాహు లెంతగ సాఁచిన ఫలిత మేమి?
అందుకొనలేను నాసుందరాంగి నిపుడు.
కోరస్:
(పరిహసిస్తూ) 2ఏదేశమందుండె, నెవ్వరా యింతి?
నాగ:
2అతిదూరదేశాన నాకాంత యుండె
కోరస్:
(మఱల పరిహసిస్తూ) 2అంతయును చిత్రంబె, ఆమె యెట్లుండె?

నాగ:
8ఆసుకుమారిసౌరు గొనియాడఁగ నాతరమౌనె, చంద్రికా
భాసురమైన హాసమును, బంగరుకాంతుల నీను కాయమున్,
దోసముఁ బాసి వెల్గెడు విధుండనఁగా వెలుగొందు నాస్యమున్
వాసిగఁ గూర్చి సద్గుణవిభాసము జేర్చిన మూర్తి యామెదౌ!

5వ్రీడ యున్నను ధైర్యంబు వీడనట్టి
ధనము గల్గియు నణకువఁ దాల్చినట్టి
సాహసియె యయ్యు సౌమ్యతఁ జార్చనట్టి
సద్గుణంబుల రాశి యా సారసాక్షి!

(ఇట్లతఁడామెను వర్ణించుచుండఁగా దూరమునుండి సముద్రయాత్రికుఁ డొకఁడు విశిష్టమైన యాత్రికవేషముతో నచ్చట ప్రవేశించుచుండును. అతనిని గమనింపక నాగసేనుం డింకను ఆ అజ్ఞాతస్త్రీ గుణపరంపర నిట్లు వర్ణించుచునే యుండును.)

5అందమున్నది, అవలేప మసలు లేదు
ఆశ యున్నది, వంచనధ్యాస లేదు
ఆస్తియున్నది, దాతృత్వనాస్తి లేదు
అట్టి గుణవతి కెనయైన అతివ లేదు.

5ఊహయందున మాత్రమే యున్న యట్టి
కామినీమూర్తి యా సుమగాత్రి గాదు
ప్రాణమూనియె యుండు నా చాన యెటనొ,
పాడుచుండును నాపాట భవ్యముగను.

కోరస్:
7ఏలోకమందు నుందువొ,
ఆలోకంబులఁ గలలనె అరయుదొ నీవున్?
ఏలోకమందు వెదకిన
ఆలోకింపంగఁ జాల మట్టి వధూటిన్!

(ఇంతలో ఆ యాత్రికుడు సమక్షమునకు వచ్చును. అతనితో…)
2పలుదేశములయందు పయనించితీవు
కలకంఠు లెందఱినొ కనుగొంటివీవు
నీవైన యాత్రికా! నిజమేదొ తెలుపు
ఆవిష్కరించితే అవని నెందైన
అతఁడు వర్ణించుచున్నట్టి గుణవతిని
అతిలోకసౌందర్యవతియైన సతిని?

యాత్రికుడు:
6ఉండ దేమొ యట్టి యువిద యుర్వరలోన!
(అని నెమ్మదిగా పల్కి, క్షణ మాలోచించి మఱల పల్కును)
6ఉన్నదేమొ యట్టి ఉవిద ఉర్వరలోనె!

2ఒకసారి నేను లంబకదీవినిం గాంచి
అకలంకమై పొల్చు నా యంతరీపాన (అంతరీపము=ద్వీపము)
చక్రనగరాఖ్యమౌ చక్కనౌ పురమందు
చక్రీశపరమేష్ఠి సన్నిధులు నెలకొన్న
చక్కనౌ దేవళపు సౌరునుం దిలకించి
అక్కజంపడుచుండ నగపించె నొకకాంత

2అందకత్తెయె కాని, అవలేపమూనదు,
వ్రీడాన్వితయె కాని, ధృతి మాని మెలఁగదు,
ధనికురాలే కాని, ధనమదం బెఱుఁగదు
రాచకన్నెయె కాని, రాజసం బూనదు
అట్టి కాంతారత్న మగపించె నాకందు

2సుందరాహార్యంబు, సొమ్ములుం ధరియించి
మందగమనంబుతో మందిరంబును జేరఁ
జనుచున్న యామెనుం జనులెల్ల ముగ్దులై
కనుచుండ నేకాకిగనె యామె చనుచుండె
దూరంబు నుండియే ఆరామనుం గంటి
ఆమెపేరేదియో అడుగంగ లేనైతి

నాగ:
(ఉత్కంఠతో) వచియించు యాత్రికా! వచియించు మాయింతి వాలకంబింకను…
యాత్రికుడు:
ఇంకేమి వచియింపవలెను?
2శ్రావణమునందు శుభశనివారమందు
దేవునిం దర్శింపఁ బోవు నాయింతిఁ
గనుచుండ్రి చకితులై జనులెల్లఁ గాని
చనుచుండె వారలం గనకుండ నామె.
నాగ:
(ఉద్రేకంతో) 2అరయకుండినఁ గాని ఆమె నామంబు,
అరసియుండినఁ దెల్పు మామె కనురంగు
యాత్రికుడు:
ఆమె కనురంగు …ఆమె కనురంగు? (అని గుర్తు చేసికొను యత్నము చేసి)
ఆయింతినిం జూడ నంతికంబున నుండి
అందుచే నుడువలే నాయింతి కనురంగు.
నాగ:
ఆమె కనురంగు …ఆమె కనురంగు!
5ఉదయవేళాసముద్రంపు టుదకకాంతి,
ఫుల్లనీలోత్పలంబుల పూర్ణకాంతి
నేత్రములఁ జేరినట్లుగ, నీలకాంతి
కలితమైయుండు నాయింతి కన్నుఁదోయి.
కోరస్:
(అతని ఊహాపరంపరను విమర్శించుచు నిట్లందురు; వారితరణి=ఓడ)
5అంతకంతకు మిత్రంబ! అలలఁ జిక్కి
తీరమందుండి దూరమౌ వారితరణి
కరణి నీదు చిత్తము విశృంఖలముగాను
కదలి చనుచుండె నూహలకడలిలోన!
నాగ:
(వారి నుపేక్షించుచు మఱల యాత్రికునిట్లు పృచ్ఛించును) ఆమె కేశచ్ఛవి?
యాత్రికుడు:
(అతనిని హెచ్చరించుచున్నట్లుగా నసమ్మతితోననును) మిత్రమా!
నాగ:
ఆమె కేశములు?
5షట్పదంబులచందాన శ్యామలంబు
లై, నిడుదలై, మృదువులై, మహాంధకార
నిభములై, కుటిలంబులై, నిగ్గుదేఱి
యుండు నామె కేశములని యూహసేతు!
యాత్రికుఁడు:
అది నిజమే!
నాగ:
ఆమె బాహువులు?
2 నిడుదలై, మృదువులై, నిగనిగన్మెఱయు
నామె బాహువు లంబుయంత్రనిస్రుతము
లగుచున్న జలధారలంబోలియుండు,
ప్రీతితో నేనెంతుఁ జేతఁగొన వాని!

(అతడిట్లు పరధ్యానముతో ఎదుటివారిని గమనింపకుండ వాకొనుచుండగా, అనుచరుల కోరస్ బృందము, యాత్రికుఁడు అచ్చటినుండి నెమ్మదిగా నిష్క్రమింతురు. అది గమనింపక మధ్యమధ్య వీణను మీటుచు నతఁడామె వర్ణన నట్లే చేయుచుండును.)

ఆమె యధరము?
2అరుణమై పొల్చు నాతరుణి యధరంబు
మధురాతిమధురమై, మవ్వమై యుండు
కామితృష్ణను దీర్పఁ గమలాసనుండు
సంసృజించిన సుధాచషకంబుభంగి!

(ఇంకను పరధ్యానములోనే ఉండి, యాత్రికు డింకను అచట నున్నట్లే భావించుచు అతనినిట్లు ప్రశ్నించును; చషకము=పానపాత్ర)

తెలుపు మిత్రమా! ఆమె ఆహార్య మెటులుండెనో?

(ఆప్రశ్నకు నిరుత్తరుడైన యతఁడంతటను పరికించి, యట నెవ్వరును లేరని గమనించి కొంతసే పూరకుండును. ఆ సమయములో నింతవఱకు ఉత్సాహపూరితముగా నున్న అతని మనోవృత్తి విషాదచ్ఛాయావృత మగును. అతడు నిర్వేదముతో నిట్లు పల్కును.)

8న్యాయమె యిద్ది యాత్రికుఁడ! నాకొక యందని మ్రానిపండునున్,
దాయఁగరాని దూరపు సుధాసరసిం గనఁజేసి యెవ్వియో
మాయలమాటలాడితివి; మద్విరహంబు సముద్ధృతంబుగాఁ
జేయుచు నంతలోపలనె శీఘ్ర మదృశ్యుఁడవైతివేలకో?

8ఆమదిరాక్షి నాయెడ ప్రియత్వము నూనునొ లేదొ గాని నే
నామెకుఁ గూర్మిమై మనసు నంకితముం బొనరించి యన్యక
న్యామణులం బరోక్షముగ నైనను గానను యాత్రికుండ! ని
న్నేమదినెంతు నాస్థితి మృగేక్షణకుం దెలుపంగ నెమ్మితోన్.

5ఎదుటఁ గన్పడుమోయి యిట్లేల మాయ
మైతి వస్తమించిన మిహికాంశువోలె?
ఆమె వృత్తాంతముం దెల్పి, యబ్ధివోలె
పొంగఁజేసి నా తృష్ణ నప్పొలఁతియందు!

కోరస్:
(నేపథ్యమునుండి)
5ఏఁగె యాత్రికుఁ డెప్పుడో నాగసేన!
ఏల కావింతు వతనికై యింత గోల?
వినఁగఁజాలఁ డాతండు నీవేడికోలు!
మఱల నాతని గనునాశ మఱచిపొమ్ము!
నాగ:
అంతేనా? చెప్పకనె యాతండు దప్పుకొనెనా?

(అనుచు హతాశుఁడై నేల కొరుగును. ప్రథమాంకము సమాప్తము.)

ద్వితీయాంకము

(స్థలము: లంబకద్వీపములో చక్రనగరి యను చిన్న పట్టణము. ఆనగరి కోట సముద్రమునకు ప్రక్కనే కన్పించుచుండును. కోటనుండి సముద్ర తటమునకుఁ జొచ్చుకొని పోవుచు, అచ్చట నిల్చి తటమువైపు వచ్చు నావలను దూరమునుండియే కన్గొనునట్లొక ఆకాశవారధి ఏర్పాటు చేయఁబడియుండును. ఆవారధినుండి సముద్రతటమునకు దిగుటకు మెట్లుండును.అచ్చట నిల్చి, శాంతిశ్రీ యను ఆదుర్గపాలకుని సోదరి తటమును సమీపించుచున్న ఒక నౌకను గమనించి, ఆనౌకనుండి దిగి, ఆమెను గమనింపకుండ ముందుకు సాగుచున్న ఒక యాత్రికుని చెంతకుఁ బిల్చి ఇట్లు మాట్లాడును.)

శాంతిశ్రీ:
యాత్రికుఁడా!
యాత్రికుఁడు:
(ఆపిలుపు విని మెల్లగా నామె వైపు దిరిగి) వందనము రాజకుమారీ!

శాంతిశ్రీ:
ఎచటినుండి నీయాత్ర, నీవెవ్వండవోయి?
యాత్రికుఁడు:
2నాగపట్నముచెంత నలువుగా నున్న
నాగూరునుండియే నాయానమమ్మ!
పరదేశములఁజూచు వాంఛతో నేను
తిరుగుచుంటిని యిట్లు తరియించి వార్ధి.
శాంతిశ్రీ:
2నాగపట్నంబన్న నాగూరు పురమన్న
రాగాన్వితంబగుచు రంజిల్లు నామనము
భాసింతు వీవయ్య బాంధవుని చందాన
భాషింత మింత గుప్తంబుగా నిటు రమ్ము!

(అని తనవెంట రమ్మని అతనికి సైగ చేసి, అతనితోఁ బాటు తన అభ్యంతరమందిరంబున కేఁగి క్రిందివిధముగా సంభాషించును.)
2ఎన్నియో దేశంబు లీభూమిలో నుండ
ఈచిన్నదీవికే యేలకో వచ్చితివి?

యాత్రికుఁడు:
2తరియించి సంద్రంబు తమిళరాజేంద్రుండు
అరిగణంబుల గెల్చి ఆక్రమించిన దీవి
ఈదీవి కాణాచి ఎన్నియో వింతలకు
ఈదీవినిం బోలి ఇలలోన నెది లేదు

రమణీయమై యుండు రంజనీశైలంబు
కమనీయమై యుండు కాననం బిందు
అరుదైన తరురాజి, అరుదైన మృగరాజి
అరయంగ నెంతయో అర్హమై యుండు
అందుచే శ్రమకోర్చి అంబుధిం దాఁటి, యీ
సుందరద్వీపంబుఁ జూడంగ వచ్చితిని

(రంజనీశైల మనునది లంబకద్వీపం మధ్యలో నున్న ఇండొనీసియాలో నున్న అత్యున్నతపర్వతములలో రెండవదైన పర్వతము.)

శాంతిశ్రీ:
2ఎందరో చనుదెంతు రీదీవినిం జూడ
ఎందరో తృప్తులై ఏగుచుందురు తిరిగి
కాని నాకీదీవి కాదు మోదంకరము
నేనెపుడుఁబోనెంతు నానగరికే తిరిగి
యాత్రికుఁడు:
2ఆనగర మేదియో అడుగంగ వచ్చునా?
శాంతిశ్రీ:
2సాగరాంతికమందు సంపన్నమై యున్న
నాగపట్టణమౌను నాజన్మనగరంబు
నాచిన్నతనమందె నాయన్ననుం గూడి
ఈచిన్న ద్వీపాని కేతెంచితిని నేను
కాని నేనిచ్చటం గనను సంతోషంబు
ఆనాగపట్నమునె అనిశంబు స్మరియింతు
పోనెంతు నచటికే, కాని పోవఁగ లేను.
యాత్రికుఁడు:
2ఈదుఃఖ మెందుకో? ఏలుకొమ్మని మీకె
ఈదీవి రాజేంద్రు డిచ్చియుండెను గాద!
ఇందుఁగల సిరులెల్ల ఇష్టానుసారంబు
అందుకొని ఆనంద మొందవచ్చును గాద!
శాంతిశ్రీ:
2కాని బంధము చాల గాఢంబుగా నుండు
మానినుల కందునను మఱికొంతగా నుండు
తన జన్మధరఁ జూడ, తన తల్లినిం జూడ
ఘనతరంబగు కోర్కె వనజాక్షులకు నుండు.

చిననాటి యాటలను, చిననాటి తోఁటలను
చిననాటి జంతువుల, చిననాటి మిత్రులను
చిననాటి సేవకుల, చిననాటి బంధులను
కనుచుందు నిప్పుడును మనమందునను నేను

ఈపుడమిపై నడచు నాపదము లిచ్ఛించు
ఆపుడమిపై నడచు ననుభవంబును మఱల
ఈయనిలముం గ్రోలు నాయసువు లిచ్ఛించు
ఆయవనిలో వీచు ననిలంబునుం గ్రోల

ఆనాటి జీవితం బఖిలంబు స్మరియించి
నేనటకుఁ బోవంగఁ బూను దుత్సాహంబు
కాని స్మరియింప రొకరైన నన్నచట
కానఁ బోనెంచియును బోనేర నటకు

(ఇట్లు పల్కి ఆమె యింకను పైవిషయములనేగుఱించి చింతించుచు పరాకుగా నుండును.)

యాత్రికుఁడు:
2మఱవరందఱు నిన్నుమహిలోన దేవి!
సరసుండు నాగూరు పురపాలకుండు
సరసంపు గీతముల స్మరియించు నిన్నె
నిరతంబు వినుతించు నీదురూపమ్మె!
శాంతిశ్రీ:
(అనవధానస్థితినుండి మేల్కొని) ఏమంటివి?
యాత్రికుఁడు:
2మఱవరందఱు నిన్ను మహిలోన దేవి!
సరసుండు నాగూరు పురపాలకుండు
సరసంపు గీతముల స్మరియించు నిన్నె
నిరతంబు వినుతించు నీదురూపమ్మె!
అని యంటిని.
శాంతిశ్రీ:
ఎవ్వఁడా నాగూరునగరేశ్వరుండు?
యాత్రికుఁడు:
2నాగసేనుండన్న నామంబు గలవాఁడు
నాగూరు నగరంపునాయకశ్రేష్ఠుండు.

శాంతిశ్రీ:
2నాగపట్నము ప్రక్క నాగూరు గలదు
నాగసేనుండెపుడొ ననుఁ జూచియుండు
అందుచే నతడట్టు లనుచుండెనేమొ!

యాత్రికుఁడు:
2కనియుండలేదంట నిను నాతఁ డెపుడు
శాంతిశ్రీ:
(అనుమానంతో) 2ఐన నేరీతి నన్నతఁడు వినుతించు?

యాత్రికుఁడు:
2నినుఁగూర్చి యెవ్వరో ఘనముగాఁ బల్కిరట!
శాంతిశ్రీ:
( మఱింత అనుమానంతో) ఏమని?

యాత్రికుఁడు:
5 ‘అందమున్నది, అవలేప మసలు లేదు
ఆశ యున్నది, వంచనధ్యాస లేదు
ఆస్తియున్నది, దాతృత్వనాస్తి లేదు
అట్టి గుణవతి కెనయైన అతివ లేదు’
అనుచు వర్ణించిరట వారు ఘనముగాను!

శాంతిశ్రీ:
2నానామ మెఱుఁగునా నాగసేనుండు,
కొనియాడునా యట్లు తనకవితలందు?

యాత్రికుఁడు:
5నిన్నుఁదక్క వర్ణింపఁ డే చిన్నదాని,
నిన్నుఁ దక్క స్మరింపఁ డే కన్నెదాని,
నిన్నుఁ దక్క నుతింపఁ డే నీలవేణి,
నిన్నుఁ దక్కవాంఛింపఁ డే నెలఁతనేని.

శాంతిశ్రీ:
అతని కవితలలో నాపేరు స్ఫురించునా?
యాత్రికుఁడు:
లేదు. కాని నిన్నె వర్ణించునందు రాతని విన్నవారు.

శాంతిశ్రీ:
(అనుమానము నాగ్రహ మాచ్ఛాదించుచుండఁగా)
7పేరెత్తక, నారూపము
నీరీతిగఁ గవితలందు నిఱికించెడు నీ
ఘోరాచారంబున కధి
కారం బేవిధ మతనికిఁ గలిగెం ధరలోన్?

యాత్రికుఁడు:
6బ్రహ్మయొసఁగె నీకు బహురమ్యరూపంబు
అతులమైన భూతి యదియె నీకు
దానిఁ గూర్చి పరులు స్తవియింప దొరకొన్న
వర్జ్యమనఁగ రాదు వారి వాంఛ!

శాంతిశ్రీ:
అతఁడెట్లు స్తవించును?
యాత్రికుఁడు:
7కవిసహజంబగు భావ
ప్రవహముతో నిన్నుఁ జాల ప్రస్తుతి చేయున్,
ప్రవిమలమగు ప్రేమంబున
నవిరతముగ నిన్నతండు ధ్యానము సేయున్.

శాంతిశ్రీ:
2అధికార మెవఁడిచ్చె నతనికిం బ్రేమింప?
యాత్రికుఁడు:
5అడుగఁడాతఁడు ప్రేమింపు మనుచు నిన్ను,
అడుగఁడాతఁడు ధ్యానింపు మనుచు నిన్ను,
ఐన దూరంబునుండి స్నేహంబుతోడ
నిన్ను ప్రేమింప, ధ్యానింప నేరమేమి?

5ఎఱుఁగు నాతఁడు మింటిలో మెఱయుచున్న
అందుకొనలేని తారవే యనుచు నిన్ను
ఐన ననురాగమయమైన మానసమున
నీదురూపంబె కనుచుండు నిరతమతఁడు.

శాంతిశ్రీ:
(కొంచెం మెత్తబడి) ఇంకేమి తలంచుచుండును?
యాత్రికుఁడు:
5విన్న విషయంబు త్వరలోనె విస్మరింతు,
ధారణాశక్తి నాకు లేదైనఁగాని
స్మరణకున్వచ్చు నినుఁగూర్చి శ్రావ్యముగను
అతఁడు పాడిన గీతంబు లప్పుడపుడు!
శాంతిశ్రీ:
(ఉత్కంఠతో) అట్టి గీత మొకటి అనగలవా?
యాత్రికుఁడు:
యత్నింతును. (శ్రావ్యముగ పాడును. ఈపాటను వినుచున్న ఆమెలో క్రమముగా ననురక్తిసూచనలు కన్పించుచుండును.)

పాట
2ఎదుటనే యెందఱోఇందుముఖు లున్నను
ఇదియేమి చిత్రంబొ మది వారి నిరసించు
ఊహాజగంబులో నుజ్జ్వలంబై తోఁచు
ఆ హసన్ముఖియందె హాయినిం గననెంచు

దూరాన నున్నను చేరువనె యున్నట్లు,
తోరంపు రక్తితో నారమ్యతరగాత్రి
చెలువంబు మీరంగ చిఱునవ్వులొల్కుచు
పలుకరించుచు నన్ను కలలందుఁ గన్పించు

దైవంబు నాయందు దయతోడ నున్నచో
ఆ వారిజాతాక్షి ఆలోక మొనగూడు
అంతవఱ కామెనే ధ్యానించుచుందు
స్వాంతమందామెనే స్థాపించుకొందు

ఇంకెవరిఁ బ్రేమింప నీదూరపుం బ్రేమ
సంకటావహమౌచు సఫలంబు గాకున్న
ఆమెనే స్మరియించు చాగామిజన్మలో
ఆమెతో నైక్యమై అనుభవింతును సుఖము.

శాంతిశ్రీ:
(ఆపాటను విని ఆర్ద్రమైన మనసుతోఁ బల్కును.)
2మఱల నీవాతనిం దరిసించినం దెల్పు

యాత్రికుఁడు:
తెల్పంగవలె నేమి?

శాంతిశ్రీ:
(అంతలో త్రపాసంశయపూరితమైన భావముతో) ఏమీ లేదు… ఏమియును లేదు.
యాత్రికుఁడు:
2నిన్నుఁ గాంచినయట్లు విన్నవింతున నేను?
శాంతిశ్రీ:
(కొంచెం యోచించి) అది నీయిష్టం.
యాత్రికుఁడు:
5చెంతకుం బిల్చి ఆదర మెంతొ చేసి
రమ్యభాషితంబులచేత రాకుమారి!
సంతసమ్మును గూర్చితి వెంతగానొ
ఏఁగివచ్చెద నిఁక సెలవిమ్ము నాకు!
శాంతిశ్రీ:
పొమ్మటులె, భద్రమగుఁగాక నీకు!

(అతఁడు నిష్క్రమించుచు ఆమెకుఁ గన్పడకుండ భవనద్వారము ప్రక్క కొదిగి నిల్చి వినుచుండఁగా నామె యీ దూరప్రణయపు యుక్తా యుక్తములను వితర్కించుచు నిట్లు పాడుచుండును.ఆపాట విని యతఁడామె నాగసేనునియం దనురక్తురాలగుచున్నట్లు గమనించును.)
‘ఇంకెవరిఁ బ్రేమింప నీదూరపుం బ్రేమ
సంకటావహమౌచు సఫలంబు గాకున్న
ఆమెనే స్మరియించు చాగామిజన్మలో
ఆమెతో నైక్యమై అనుభవింతును సుఖము.’

3నన్ను పూర్తిగ నెఱిఁగియుండిన
నాగసేనుం డిట్లుపల్కున?
ఎట్టయెదుటను నన్నుఁ గాంచిన
ఇట్టులే కడు సన్నుతించున?

తనదు కవితలయందుఁ దీర్చిన
తరుణిగా నను గుర్తెఱుంగున?
దూరమందున నున్న నన్నిట
జేరఁగాఁ దమకించి వచ్చున?

అందుకొనునా చందమామను
అవనిపైఁ గల కలువకన్నియ?
ఈదృశంబగు ప్రణయలీలల
నాదు కాలము బుచ్చ న్యాయమ?
ఈదృశంబగు… బుచ్చ న్యాయమ?

యాత్రికుఁడు:
(తనలో) ఆరయ నిట్టి వాక్సరణి నాతనివైపునకే క్రమంబుగాఁ
జేరుచునుండె నీయువతి చిత్తమటంచును దోఁచు నందుచేఁ
జేరిచి నాగసేను నిటఁ జేయఁగ నొప్పును వీరి ప్రేమమున్
సారఫలోన్ముఖంబుగను, సౌఖ్యము గూర్పఁగనొప్పు వీరికిన్

(నిష్క్రమించును; ద్వితీయాంకము సమాప్తము)

తృతీయాంకము

(స్థలము: నాగూరిలోని నాగసేనుని ప్రాసాదము; నాగసేనుఁడు, యాత్రికుఁడు.)

నాగ:
(యాత్రికునితో) నిజమేనా యిది? 2నిజముగాఁ జూచితివె నీవు తత్కాంతనే?
యాత్రికుఁడు:
సందేహమెందుకు? 2కాంచితిని యామెనే కన్నుల కఱవు దీర!
నాగ:
5నాకుఁ గల్గని భాగ్యంబు నీకుఁ గల్గె
సాటిలేనిది నీయదృష్టంబు సఖుఁడ!
నాదుపాటలు విన్న క్షణంబునందు
ఆమె మూర్తియె తోఁచునా యక్షులందు?
యాత్రికుఁడు:
2లేదు సందియ మా కృశోదరియె తోఁచు
నీదు వర్ణన విన్నయానిముసమందె!
నాగ:
5ఐనఁ దెల్పుము యాత్రిక! ఆమె రూపు
రేఖ లెట్లుండెనో నాకుఁ బ్రీతితోడ!
యాత్రికుఁడు:
5నీదుపాటలు విన్నచో నిల్చు నెదుట
ఆమెమూర్తియె యంచు నేనంటి నిపుడె
విన్నదానినె మఱిమఱి విన్నవింపు
మనుట ఉన్మాదలక్షణం బండ్రు బుధులు!
నాగ:
(ఉత్తేజితుఁడై, కించిత్క్రోధంతో) ఉన్మాదలక్షణం?

యాత్రికుఁడు:
8ఔనది భావ్యమే సఖుఁడ! ఆమెను గూరిచి చింతసేయుట
ల్మానుము, నీప్రజాభ్యుదయలక్షితమైన ప్రయోజనంబులం
దూనుము లక్ష్యమున్, నిరత మూహలకే మితమైన ప్రేమసం
ధ్యానమునందున న్మునిఁగి యన్యముపేక్షయొనర్పఁబోకుమీ?

6అంతెకాక నగరియందున్న జనులెల్ల
పడయరాని పడఁతి ప్రణయమనెడు
ఊబిలోనఁ బడిన ఉన్మాదివని నిన్ను
చెప్పుకొనుచునుండ్రి చేరి చేరి!

నాగ:
6నీవు సైత మట్లె భావింతువా నన్ను?
యాత్రికుఁడు:
5అన్యులొక్కని నున్మాది యన్నయెడల
అతని నిజముగ నున్మాది యనుట గాదు;
అతని దుస్థితి నారసి అన్యజనులు
జాలిచే వానికై పల్కు సాంత్వనంబు!
నాగ:
5అన్యు లున్మాది యంచు నన్ననుట గాదు
అట్లె యనుకొందు నేను స్వయమ్ముగానె
కితవముం దిని ఉన్మాదు లితరులైరి
అతివనుం గోరి ఉన్మాది నయితి నేను.
(కితవము=ఉమ్మెత్త, దాని పూలు, కాయలు తిన్నచో ఉన్మాదము కల్గుట ప్రసిద్ధము.)

8ఆమెనుగూర్చి నీవు తెలియంగను జెప్పిననాటినుండి నా
కామెయె కన్పడుం గలలయందున, కన్పడి మేచకోత్పల
శ్యామలనేత్రయుగ్మమున సంస్మిత మొల్కుచుఁ బల్కరించుచు
న్నామదినిం బ్రమోదపరిణద్ధముఁ జేయును రాత్రులందునన్.

8ఆ రమణీస్వరూపమును, ఆకలలు న్నశియించు వేకువన్,
దూరమునందు నున్నదియు దుర్లభమైనది యైన యామనో
హారిని సంస్మరించుచు నిరాశను గుందుచుఁ దల్పమందు వే
సారుచుఁ బొర్లుచుందు మదసారపుభాగ్యము దూరుచత్తరిన్

8ఎన్నడు గాంచనట్టి, యిఁక నెన్నడు గాంతునొ యన్నయాశయున్
సున్నయె యైనయట్టి సుమసుందరగాత్రినిఁగూర్చి యిట్టు లా
పన్నతనొంది తీవ్రదురవస్థను జెందిన నన్ను వెఱ్ఱిగా
నెన్నిక సేయకుండ మఱి యెవ్వనిఁ జేతురు లోకమందునన్?

యాత్రికుఁడు:
(పైవిధముగాఁ బల్కుచున్న నాగసేనుని ఇంతవఱ కాశ్చర్యానుకంపలతోఁ గనుచు, అతని స్థితి నంతరంగమున వితర్కించుచుఁ గూర్చున్న యాత్రికుఁ డిప్పుడు మాట్లాడును.)
5తలఁపవలదామె కేమియుఁ దెలియదనుచు
విదితమైయుండె నామెకు విషయమెల్ల
నాగ:
ఏమంటివి?
యాత్రికుఁడు:
5విదితమైయుండె నామెకు విషయమెల్ల’ అంటిని.
నాగ:
4విదితమయ్యె నెట్టి విషయ మామె కిపుడు?
యాత్రికుఁడు:
5తెలియవలసినదంతయుఁ దెలిసియుండె
కవివి నీవంచు, నీవల్లు కవితలందు
అద్దమునఁ జూపినట్లుగ నామెరూపు
వ్యక్తమగుచుండునంచు సర్వంబు దెలిసె.
నాగ:
4ఎట్లు దెలిసె నామె కిట్టి విషయమెల్ల?
యాత్రికుఁడు:
5నాముఖంబున వినియుండె నామె యంత
నాగ:
అట్లేల చేసితివి?
యాత్రికుఁడు:
5ఆమె యడిగెను, దెల్పితి నంత నేను
అనృతమాడుట దోషమౌ నాప్తులందు
అందుచేత నుడివితి యథార్థరీతి
అట్లె యొనరించియుందువీవైనఁ గాని!
నాగ:
7అది యెట్లున్నను యాత్రిక!
వదరితివా యామెతోడ వలచుచు నేనా
సుదతికి నాడెందంబును
సదనముగాఁ జేసియుంటి సతతం బనుచున్?
యాత్రికుఁడు:
5 వదరకుందునా నేనట్టి వలపుతీరు?
నాగ:
(అసమ్మతితో)
5నోరు జారుట విజ్ఞులతీరు గాదు,
వదరితెందుకు నీవిట్లు వాసి దప్పి?
యాత్రికుఁడు:
5 లేని విషయంబు వినిపింప లేదు నేను
వలచితివి నీవనెడు మాట వాస్తవమ్ము!
నాగ:
(నెమ్మదించి) ఎట్లు స్పందించె నామె యపుడు?
యాత్రికుఁడు:
2ఆగ్రహాన్విత యయ్యె నారంభమందు
నాగ:
(అలజడితో) ఆగ్రహాన్విత యయ్యెనా?
యాత్రికుఁడు:
ఆశ్చర్యమేమి?
7కనివిని యెఱుఁగని యెవఁడో
తననుం బ్రేమించుచుండె తాత్పర్యముతో (తాత్పర్యము=ఆసక్తి)
నని యాకస్మికముగ నే
వనితామణి విన్నఁగాని వర్తించు నటుల్.

7తొలుతం గల్గిన క్రోధము
పలుచనయగుచుం దొలంగె త్వరగనె కానీ
నెలకొనె తూష్ణీంభావము
వలజామనమునఁ గినుకకు బదులుగ పిదపన్

నాగ:
(వైకల్యంతో) తూష్ణీంభావమా?
యాత్రికుఁడు:
ఔను. తూష్ణీంభావమంటే నిరాదరణ కాదు. విను …
8నీదగు నాభిజాత్యమును, నీదగురూపము, నీస్వభావమున్
నీదు కవిత్వపాండితిని నీరజలోచన చింతసేసి, ని
న్నాదరణీయుఁడైన యభికాగ్రణిగాఁ దలపోసియుం దదీ
యాదరభావగోపనము నట్లొనరించె నటంచు నెంచెదన్.

నాగ:
ఇది యథార్థమేనా యాత్రికా? నాగీతముల నామెకు వినిపించితివా?
యాత్రికుఁడు:
ధారణశక్తి లేనివాఁడను. అఱగొర ఆమె యెదుట నంటిని.
నాగ:
(క్రోధపూరితుఁడై) అఱగొర అంటి నంటివా?
9సరియగు భావసంపదను చక్కగఁ గూర్చుటకై దివానిశల్
మఱిమఱి శబ్దబంధముల మార్చి రచించిన నాదుపాట లీ
వఱగొరమాత్రమే యనుట న్యాయమ యాత్రిక? ఇంతకంటె న
న్నురమున కత్తితోఁ బొడుచుటుత్తమమౌఁగద గీతఘాతకా!

యాత్రికుఁడు:
(అతని క్రోధమునకు వెఱచి) ఇక నేను నిష్క్రమించుట యుక్తము.
నాగ:
(పశ్చాత్తప్తుఁడై)
9విడువకు నన్ను యాత్రికుఁడ! వేదన నొందుచు నట్లు పల్కితిన్
పుడమిని నీకు నెక్కుడఁగు పూరుషుఁ డాప్తుఁడు నాకు లేడు, నీ
యెడఁ బ్రతిఘాన్వితుండనయి యిట్లు మెలంగుట నాదుదోషమౌ,
చిడిముడిపాటు లేల, యిఁకఁ జేరి తరింతము సింధువామెకై.

7నన్నుంగూఱిచి నీవా
కన్నెకుఁ దెల్పితిని యన్న క్షణమందుండిన్
నన్నామె చూచుచున్నటు
చెన్నగు తలఁపొదవుచుండె చిత్తమునందున్

7కనుటయె కాదటనుండియె
వినుచుండును నేను బాడు ప్రేమపదంబుల్,
వినుచుండును మద్వీణా
క్వణనంబును సైతమనుచు భావింతు నెదన్

7దూరమునుండియె ప్రేమం
బారఁగ నన్నా లతాంగి హస్తాంగుళులం
దీరుగ సాఁచుచు రమ్మని
చీరుచు నున్నటు మనసున చిత్రము గందున్

7ఆవామామణి పేరెదొ
నీవింక వచింపుమోయి నెనరున నాకున్
నీవాక్యమమృతధారలు
నావీనులలో స్రవింప నందింతు నెదన్.

యాత్రికుఁడు:
(సంతోషంతో) శాంతిశ్రీ!

నాగ:
శాంతిశ్రీ! శాంతిశ్రీ! ఎంత సుందరమైన పేరు!
5అందమగు నాకృతికిఁ దగినట్టులామె
అభిధసైత మందంబుగా నమరియుండె
అంబుధిని దాఁటి ఆపేర నామెఁ బిలువ
ఆత్రపడు నాదుడెంద మత్యంతమిపుడు.

(తృతీయాంకము సమాప్తము)

చతుర్థాంకము-ప్రథమదృశ్యము

(స్థలము: చక్రనగరంలోని శాంతిశ్రీ ప్రాసాదమధ్యంలో గల ప్రమదావనం. ఆమె ఆప్రమదావనంలో గూర్చొని యాత్రికునిద్వారా విన్న నాగసేనుని పాట పాడుచుండును. ఆమె పాడుచుండఁగా వెనుక దూరమునుండి మధ్యమధ్య స్త్రీల కోరస్ వినిపించుచుండును.)

శాంతిశ్రీ:
2‘దూరాన నున్నను చేరువనె యున్నట్లు,
తోరంపు రక్తితో నారమ్యతరగాత్రి
చెలువంబు మీరంగ చిఱునవ్వులొల్కుచు
పలుకరించుచు నన్నుఁ గలలందుఁ గన్పించు

దైవంబు నాయందు దయతోడ నున్నచో
ఆ వారిజాతాక్షి ఆలోక మొనగూడు
అంతవఱ కామెనే ధ్యానించుచుందు
స్వాంతమందామెనే స్థాపించుకొందు

ఇంకెవరిఁ బ్రేమింప నీదూరపుం బ్రేమ
సంకటావహమౌచు సఫలంబు గాకున్న
ఆమెనే స్మరియించు చాగామిజన్మలో
ఆమెతో నైక్యమై అనుభవింతును సుఖము.’

కోరస్:
2వినుడెట్టు లీయింతి ఘనపారవశ్యాన
కనరాని దూరంపు కవిగారి గీతాలు
ఆలపించుచు ప్రేమజాలంబులోఁ జిక్కె
కనలేడు, వినలేడు, కౌఁగిలింపఁగలేడు,
మనసార మవ్వంపు మాటలాడఁగలేడు
ఫలమేమి యిటువంటి పరదేశిఁ బ్రేమింప?

పరిణయంబును లేదు, పడకటిల్లును లేదు,
సరసంపు దాంపత్యసౌఖ్యమేమియు లేదు,
కామించి వానినిం గావించు నెది యీమె?
సుందరులు సౌభాగ్యశోభితులు సుకుమారు
లెందరో గల రీమె కెంతయో తగువారు
వారుండ నింక నీదూరంపు వలపేల?

(పైవారిని నిరసించుచు ఆ కోరస్‌లో లేని ఇర్వురు స్త్రీలిట్లు పాడుదురు)

ఱాఁగలై నిరసింత్రు రాకుమారిని మీరు
భోగింత్రు మీరెంత పొంతఁగల పతులతో?
పనికత్తెలుగఁ జేసి పనులుగొంటయె కాని
నెనరుతో మిమ్మెంత తనియింత్రు మీవారు?

కూడియుండిన నాఁడు కుసిలింతు రొకతీరు
వీడిపోయిన నాఁడు విలపింతు రొకతీరు
కడనున్న వల్లభులు గలకాంత లిలలోన
పడుపాటు లివె కదా పంకేజముఖులార!

(ఱాఁగ=ధూర్తురాలు; కుసిలించు=అసంతృప్తిచే మనోవ్యథ నొందు)

శాంతిశ్రీ:
5ధన్యవాదాలు మీకెంతొ తరుణులార!
సత్యముం బల్కితిరి చాల చక్కగాను,
దూరమున నున్నపుడె ప్రేమ తోరమగుచు
బాఢమొనరించు దాంపత్యబంధమిలను!
కోరస్:
(ఆమాటలు వినిపించుకొనక కోరస్ మునుపటి ధోరణిలోనే మఱల నిట్లు పాడును.)

2వంతనొందవ యిట్టి వలపునందునఁ జిక్కి?
చింతింపవా యతని చెంతఁజేరి సుఖింప?
ఆతని కటాక్షంపు టలరుపందిరిలోన
నీతనువు పులకింప నిల్వ నుంకింపవా?

ఆతండు బాహువుల నాప్యాయముగ సాఁచి
నీతనువు వలయించి నిన్నావరించుచో
పరవశించుచు క్రుంగు ప్రమదైకభావంబు
దొరకునా నీకిట్టి దూరంపు ప్రేమలో?

కడలికావల నున్న కాంతునిం గామించి
ఇడుమలం బడనేల నీరీతి మృదుగాత్రి?
చదలందు వెలుగొందు చందురుని నాశించి
అదవదల పాలౌట న్యాయమా సుమగాత్రి?

శాంతిశ్రీ:
2నే వంతనుం జెంద, నేవంతనుం జెంద
దైవంబు దయచేత ధవళాక్షులార!
అతనికౌఁగిలికంటె అతని గీతంబులే
అతిశయంబైన ఆహ్లాదముం గూర్చు
అతనిగీతములందు నాలోకమొనరింతు
అతనిరూపంబునే, అతనిప్రేమంబునే!

అందుచే నేనేమి ఆర్తితోఁ గుందను
కొందలము మీకేల సుందరీమణులార!

ఆతనినిఁ జూడంగ నాశించి యున్నచో
ఆతండు రాకున్న అలమటింతును గాని
ఆశింప నది నేను, ఆదూరభూమిలో
ఆశించు నన్నొకం డను తృప్తియే చాలు

అందుచే నేనేమి ఆర్తితోఁ గుందను
కొందలము మీకేల సుందరీమణులార!

ఉదధి కావల నతఁ డుండుటయు సత్యంబు
ఉదధి కీవల నేనుండుటయు సత్యంబు
దూరముండిన నేమి చేరవేయుచు నుండు
మా రాగమయసమాచారంబు లనిలుండు

అందుచే నేనేమి ఆర్తితోఁ గుందను
కొందలము మీకేల సుందరీమణులార!

అనురాగమయమైన అతని గీతంబులను
విన సొంపులౌ నతని వీణాస్వనంబులను
అనిలుండు గొనివచ్చి యాతనిం జెంగటను
కనఁ జేయుచును నాదు కలతలం దీర్చును

అందుచే నేనేమి ఆర్తితోఁ గుందను
కొందలము మీకేల సుందరీమణులార!

చతుర్థాంకము–ద్వితీయదృశ్యము

(యాత్రికునితో నావలో సముద్రమార్గమున నాగసేనుఁడు లంబకద్వీపమునకు పయనించుచుండును.)

నాగ:
8నిచ్చలు నే వసించితిని నీరధి చెంతనె, నావలందునన్
వచ్చుచుఁ బోవు యాత్రికుల వైఖరులం గనుగొంటి, వింటిఁ బ
ల్ముచ్చట గొల్పు వారి కథలు, న్మఱి నేనొకసారియుం దరం
గోచ్చయభీకరంబగు పయోనిధిలోఁ బయనింప మున్నుగన్
యాత్రికుఁడు:
7పదియవ యాత్రయొ, నాకిది
పదిరెండవదో, అయినను ప్రతినవముగనే
యిది తోఁచును ప్రతిసారియు,
మొదటం గ్లేశము, పదపడి ముదముం గల్గున్

7తిన్నది యఱుగక యుండుట,
కన్నులు దిరుగుట, మగతయు, కడు నీరసమున్
మున్నగు చిహ్నము లొదవును
పన్నుగ నీయాత్రలందు ప్రతిసమయమునన్

7క్రమముగ నా లక్షణములు
శమియించును; సాగరంపు సౌందర్యంబున్,
గమియించెడు లక్ష్యంబును
ప్రమదంకరమగుచుఁ దోఁచు పదపడి నాకున్

నాగ:
(ఇనుమడించిన ఉత్సాహముతో)
5అతితరప్రయాసకర మీయాత్ర గాని
దీని చివరను లంబకద్వీపముండె
నాదు రెండవప్రాణమౌ నళిననేత్రిఁ
గనెడుభాగ్యము నాకందుఁ గల్గనుండె!

8అంచితగాత్రి నన్నుఁ గనినంతట సిగ్గున మొగ్గయౌచు చే
లాంచలమందు దాఁచునొ నిజాస్యము, లేక మహానురాగభా
వాంచితచిత్తవృత్తి నను నక్కునఁ జేర్చునొ తత్క్షణంబ, యా
చంచలనేత్రి యింకెటుల సాత్త్వికభావములన్ వెలార్చునో?

7దేవునికృపచే వైళమె
యీవార్నిధి దాఁటి యామృగేక్షణఁ గను భా
గ్యావిష్కృతి కల్గుత, నా
జీవితమున నవ్యదీప్తి చేకుఱుఁగాతన్!

యాత్రికుఁడు:
5ఆత్రపడుచుంటి వెంతయో ఆమెఁ గనఁగ
సహజ మిది ప్రణయోన్మాదసహితమతికి,
కాని యీదూరయానంబు కష్టకరము
గాన, విశ్రమించుట సౌఖ్యకరము నీకు!

(రాత్రి యగుచుండును. కాని నాగసేనుఁ డింకను తఱుగని ఉత్సాహముతో పడవచివర నిల్చి, తొంగి చూచి సముద్రజలమును పరిశీలించుచుఁ బల్కును)

నాగ:
5నీలముగ నుండె నీజల మేల యిటుల?
యాత్రికుఁడు:
5నీలగగనానుబింబ మానీట నుండె!

నాగ:
5గగనమేటికి నీలంబుగాను నుండె?
యాత్రికుఁడు:
5నీలజలబింబ మందులో నిల్చియుండె!
(కొంత విసుగుతో నాగసేనుని నిద్రింపు మనుచు నిట్లభ్యర్థించును.)
5కాని నాగసేనుండ! యీకడలిలోన
యానమింకను దుర్భరమగుచు నుండు
కాన నభ్యర్థనము సేతు మాని యిట్టి
పూనికలు నీవు నిద్రను బూనుమనుచు!

(నాగసేనుఁడు బలవంతముగా నిద్రించును. యాత్రికుఁ డతనికి ముందుగనే నిద్రించియుండును. రాత్రి అంధకారమయముగా నుండును. కడలి క్రమముగా కల్లోలపూరితమగును. నడిరాత్రిలో నాగసేనుఁడు చిత్తవైకల్యముతో మేల్కొని యిట్లఱచును.)

నాగ:
7చూచితినామెను యాత్రిక!
చూచుచు నున్నటులె నిన్ను సుస్పష్టముగన్!
యాత్రికుఁడు:
5కటికిచీకటి గప్పె జగంబు నెల్ల
కనవు నన్నీవు, నిన్నేను గనఁగలేను
నిద్ర వోవక, దయ్యంబుమాద్రి లేచి
వాగుచుంటివి యిటులేల నాగసేన?
నాగ:
కాదు యాత్రికా, ఆమెను చూచితిని. నేనామెను చూచితిని.
7చూచితి నామెను యాత్రిక!
చూచితి సంద్రముపయి నడచుచు శాంతిశ్రీ
వాచాచతురతఁ బల్కుచు
నాచెంతకు వచ్చినట్లు నడిరాతిరిలోన్

7బంగరుచాయపుఁ దనువును,
చెంగున నలవోలె లేచు శ్వేతాంశుకమున్
చెంగటి చీకటితెరలన్
భంగము సేయుచు వినూత్నపాండిమ నింపన్

7శ్రవణసుఖంబుగ నాదగు
కవితలనే పాడుచామె కమనీయముగన్
దివిలో మెఱసెడు చంచల
సవతున నడయాడి నాదుసరసనఁ జేరెన్

(పైవిధముగా నతఁడు వర్ణించుచుండఁగా ఆవర్ణన కనుగుణముగా రంగముపై వారిర్వురి స్వప్నదృశ్యము కన్పడును.)
పాట

శాంతిశ్రీ:
2చెలువుండ! నీయందె చిత్తంబు నిల్పితిని
తలపులందున నేను, కలలందున న్నేను
చరియించు వేళలన్, శయనించు వేళలన్
స్మరియింతు నిన్నే, వరియింతు నిన్నే

దినముకంటెను నాకు క్షణదయే మేలు (క్షణద=రాత్రి)
క్షణదలోఁ గలలందుఁ గనుగొందు నిన్నె
కలలందు విడువక కలసియుందువు నీవు
కలలజగ మందుచే కల్యాణకరమౌను!

నాగ:
2జలజాక్షి! నీయందె స్వాంతమ్ము నిల్పితిని
తలపులందున నేను, కలలందున న్నేను
చరియించు వేళలన్, శయనించు వేళలన్
స్మరియింతు నిన్నే, వరియింతు నిన్నే

దినముకంటెను నాకు క్షణదయే మేలు
క్షణదలోఁ గలలందుఁ గనుగొందు నిన్నె
కలలందు విడువక కలసియుందువు నీవు
కలలజగ మందుచే కల్యాణదం బౌను!

నాగ:
7సరసనఁ జేరిన యాచెలి
సరసాలోకములతోడ సమ్మిళితములై
వరలెనునాచూపు, లపుడు
దరహాసముతో ననుఁగని తరుణీమణియున్

2తనవెంట రమ్మనుచు కనుసైగలం జేసి
క్షణములో నీటిపై సరసరా నడచుచుం
జని ముందు కట నిల్చి సారించి బాహులన్
నను రమ్ము రమ్మనుచు నెనరారఁగాఁ బిల్చె

శాంతిశ్రీ:
(పైన చెప్పిన విధముగా తన బాహువులు సాఁచి నాగసేనుని తనకడకు రమ్మని ఇట్లు పాడుచు గన్పడును.)
2చెలువుండ! జాగేల చేరంగ రావోయి!
లలితంపు నాబాహులతలలో బంధించి
అందింతునోయి నా యాశ్లేషసౌఖ్యంబు
సందేహపడఁబోక సత్వరము రావోయి!
చెలువుండ…సత్వరము రావోయి!

2ప్రియురాలు పిలువంగ వెనుదీతు వేలోయి
ప్రియమార జలధిపై బిరబిరా చరియించి
ననుఁ జేర రావోయి నాదు కౌఁగిటిలోన
ఎనలేని సౌఖ్యాలఁ గనుమోయి నెఱకాఁడ!
ప్రియురాలు పిలువంగ… గనుమోయి నెఱకాఁడ!

నాగ:
2భీరువును నేనౌచు వారిపైఁ జనలేక
నైరాశ్యభరముతో నోరగిలి పడవపై
ఆమెనుం గనుచుంటి నంతలో నాకలయు
నామెయుం గతమయ్యె, వ్యథయె నా గతియయ్యె

యాత్రికుఁడు:
7భీరుఁడనని నీవిట్లు వి
చారింపకు మిత్రమ! కడు స్థైర్యంబున నీ
దూరపు యానంబునకై
సారించుచునుంటి వఖిలశక్తులు నీవే!

నాగ:
5ధీరచిత్తునియూహలతీరు వేఱు,
భీతచిత్తుని యూహలరీతి వేఱు,
ఆమె నరయంగ లేనేమొ యనెడు నార్తి,
ఆమె నరయుదునో యేమొ యనెడు భీతి,

ప్రాణములతోడ నటకుఁ జేరంగగలనొ?
ప్రాణముల వీడి యటకుఁ జేరంగగలనొ?
అనుచు వివిధంబులైన యోజనలచేత
సదమదంబగుచుండె నా స్వాంత మిపుడు.

(వారు మఱల నిద్రింతురు. ఇంతలో రాత్రి గడచి, ఉషఃకాల మగుచుండును. ఇప్పు డస్వస్థతతో నాగసేనుని శరీరము పాలిపోయి యుండును. ఈసమయములో సముద్ర ముద్ధృతముగా కల్లోలిత మగుచుండును. నాగసేనుఁడు ఓడయొక్క పార్శ్వమున కానుకొని వంగి చూచుచు హఠాత్తుగా పడవ తీవ్రముగా కదలుటచేత క్రింద పడఁబోయి కష్టముగా సర్దుకొని నిల్చొని, తన పరిస్థితికి తానే జాలి చెందుచూ ఇట్లనుకొనును.)

నాగ:
(తనలో తాను నిరుత్సాహంతో)
5ఘనతరాశా తటిత్కాంతికలిత మగుచు
నుల్లసిల్లవలసిన నా యుల్ల మిపుడు
ఘననిరాశా తమోరాశికలిత మగుచు
వ్యాకులంబయి భీతితో వనరుచుండె.
నేపథ్యంనుండి పురుషుల కోరస్:

1విక్రమసూర్యులు,విజయసమేతులు
చక్రవర్తులతి చండప్రతాపులు
హిమశైలంబుల, నెండుటెడారుల
తమసైన్యంబుల దక్షత నడపిన
ధీరులు గలరీ ధారుణిఁ గానీ
ఘోరతరోర్ములకున్ భయమొందక
వారిధిపై తమ బలముల నడపిన
వారలు లేరిల, వీరులు లేరిల.

ఉత్తుంగంబగు నూర్ముల దాఁటఁగ
ఉత్తమయోధులె ఉలుకుచు నుండఁగ
పత్తివలెం గడుమెత్తని వారలు
ఉత్తలమందక యుందురె యెందును?

నాగ:
(తనలో) 1ఈ తరగలు నా హృదయక్షోభకు
హేతువు గావని యెఱిఁగిన వీరలు
భీతుఁడ నేనని గీతులు పాడరు!

(యాత్రికునితో) 5ఎఱిఁగియుండున నావార్త నెటులొ యామె?
ఎఱిఁగియుండున నారాక నెటులొ యామె?

యాత్రికుఁడు
5భిన్నదేశాలలో నేను విన్నవార్త
ఉన్నదేశాన నేను కాలూన కున్నఁ
బ్రకటితంబయి యుండు చిత్రంబుగాను
వాయువే వార్తలం గొనివచ్చునేమొ?

5అందుచే ననుకొందు మున్ముందుగానె
అందియుండును నీవార్త యామె కనుచు
విదితమైయుండు నీయానవిషయ మనుచు,
విస్మయంబేల, యిది లోకవిధమె యగును.

నాగ:
(యాత్రికుని మాటలను సరిగా వినక, తనదైన విచారగ్రస్తమైన ధోరణిలో నిట్లు పాడును.)
1సంతస మూనక స్వాంతము నందున
ఇంతటి శోకము నేల వహింతును?
ఆమెను జూచెద నని ముదమొందక
ఈమాదిరి నేనెందుకు వగతును?

కోరును నామది కూరిమి నొకపరి
కోరును నామది దూరము నొకపరి
నాకే తెలియదు నాకెది హితమో
నాకే తెలియదు నాకెది సుఖమో?

వరమిచ్చెదనని పరమాత్ముండే
సరసన నిల్చిన సందేహింతును
తెలియక కోరఁగవలెనో యామెను,
తెలియక పూనఁగవలెనో మౌనము?

ఆమెను గాంచినయపు డేమందును?
ఆమె స్వరూపము నభివర్ణింతున?
దూరప్రణయము భారము గాదని
సారయుతంబని సంభాషింతున?

దూరప్రణయముతోఁ దనివొందక
చేరుట తగునా ఆరుచిరాంగిని?
దూరమునం దొనగూరిన ప్రేమము
చేరువ నున్నను స్థిరమై యుండున?

ఇది చిత్రం బీ ఉదయాదిత్యుఁడు
ముదిరిన తాపం బూనక యున్నను
అగపడు నాకుం గగనపుచితిలో
రగిలెడు భీకరమగు జ్వాలంబలె

ఏలకొ నాతను విప్పుడు దూలును?
ఏలకొ కన్నుల నిరులే క్రమ్మును?
ఏలకొ నిలువఁగఁ జాలవు పదములు?
ఏలొకొ క్రమముగఁ దూలును స్మృతియును?

(ఇరులు=చీకట్లు; పైపాటను పాడుచుండగా క్రమముగా నాతని అస్వస్థత తీవ్రతరమై, పాట అంతమగుసరి కతఁడు మూర్ఛిల్లి ఓడలో పడిపోవును. అంతటితో నీ నాల్గవ అంక మంతమగును.)

పంచమాంకము-ప్రథమదృశ్యము

(స్థలము: లంబకద్వీపములోని చక్రనగరము. శయనించి యున్న శాంతిశ్రీ ఉషఃకాలమునకు ముందుగా నొక స్వప్నమును గాంచును. స్వప్నములో కలసికట్టుగాఁ గాక, వేర్వేరుగా పలుకు స్త్రీల కోరస్ ఆమెకు వినిపించుచుండఁగా దూరమున సముద్రతీరమున నామె ఇద్దఱు పురుషులను చూచును. వారిలో నొకఁడు నాగసేనుఁడు, ఇంకొకఁడు యాత్రికుఁడు.)

శాంతిశ్రీ స్వప్నము

స్త్రీల కోరస్:
1అదిగో రేవున ఆగిన దొకనావ!
అందున వచ్చిన దెవరో కందము గాక!
అందున నుండెను యాత్రికుఁడొక్కఁడు!
ఆతఁడు మున్నుగ మన మెఱిఁగిన వాఁడే!

ఆతని తోడను గలఁడొక రాజన్యుండును!
ఆతఁడె యగునా ఆదూరకవీంద్రుఁడు?
ఆతఁడె వ్రాసెన ఆ గీతంబుల?
శాంతిశ్రీ! చూచితివా యీ ఆగంతకులను?

శాంతిశ్రీ:
(వారి మాటల కప్రమత్తురాలై, శాంతిశ్రీ ఆపురుషులను చూచుచుండఁగా, నాగసేనుని అచ్చటనే యుంచి, యాత్రికుఁడు శాంతిశ్రీ చెంతకు వచ్చి యిట్లు మాట్లాడును.)

యాత్రికుఁడు:
జయము, జయము రాజకుమారీ! గుర్తింతు వనుకొందు నన్ను.

శాంతిశ్రీ:
5నిశ్చయంబుగ గుర్తింతు నిన్ను నేను
పాడియుంటివి నీవు శ్రావ్యంబుగాను
రసము చిప్పిలు నాగూరురాజరచిత
మధురగీతంబులను నాసమక్షమందు.

యాత్రికుఁడు:
ధన్యుఁడను రాజకుమారీ!
5మఱచిపోవక తొల్లిటిపరిచయంబు
ఎంతొ ధన్యునిఁ జేసితివిపుడు నన్ను!

శాంతిశ్రీ:
నీతోడ నున్న యాతం డెవండు?

యాత్రికుఁడు:
5రసము చిప్పిలు గీతముల్ రచనసేయు
భవ్యనాగూరుసంస్థానపాలకుండు.
శాంతిశ్రీ:
5ఏల రాలేదు నీతోడ నిటకతండు?
యాత్రికుఁడు:
9సరసుఁడొకింత సిగ్గరియు, సద్గుణశీలుఁడు గాన, నన్ను నీ
పరిచయమున్నవాఁడ నని పంపె నిటం దన రాకఁ దెల్పఁగా,
సరి యగునేని నేనతని సత్వరమే చని తోడితెచ్చెదన్,
కరుణను దెల్పుమమ్మ, కనఁగల్గునె యాతఁడు నిన్ను నిచ్చటన్?
శాంతిశ్రీ:
5వినిచియుంటివి మున్ను నీవితని కథను
సందియంబేల కొనిరమ్ము సాదరముగ
పూలకన్నెల యనుమతి పొందవలెనె
వ్రాలి మధువును గ్రోలంగ బంభరంబు?

(యాత్రికుఁడు నాగసేనుని దెచ్చుటకుఁ బోవును. అతఁడు వచ్చులోపల నాగసేనునితో కల్గబోవు సమావేశమునుగూర్చి శాంతిశ్రీ పరిపరివిధముల నాలోచించుచు, ఆభావముల నభినయించుచు నిట్లు పాడును.)

1అదిగో నతఁడే, ఆప్రేమికుఁడే
వెదకుచు నాకై యిట కేతెంచెను
అతిశయమగు ప్రేమోన్మాదమె
అతనిని వెఱ్ఱిగ నిటు రావించెను!

దూరంబున నూహాజగమందున
నారూపంబును, నాచెల్వంబును
దరిసించుచు తన కవితల నల్లిన
సరసుఁడు నను బ్రత్యక్షంబుగ
దరిసింపఁగ పారావారంబును
తరియించుచు నిట కేతెంచెను.

ఈతని నేరీతి నెదుర్కొందును?
ఈతని నేతీరుగ మన్నింతును?
ఈతఁడు నాపై వ్రాసిన కవితల
ఈతనినోటనె విని పులకింతున?

ఈతనియం దనురక్తి వహింతున?
ఈతనియందు నుపేక్ష వహింతున?
ఈతఁడు వర్ణించెడుఈదూరపు
శాతోదరి యెటులీతనిఁ గనవలె?

(పైపాట తర్వాత వాద్యనాదము వినిపించుచుండఁగా శాంతిశ్రీ వారికై పరీక్షగా సముద్రమువైపు చూచును. కాని వారచ్చట గన్పడరు. వారి నావసైత మట నుండదు. అది గమనించి నిరాశతో నామె నీక్రిందివిధముగాఁ బాడుచుండఁగా స్వప్నము భంగమగును. అప్పుడు తూర్పున ఉషఃకాంతి ప్రవేశించుచుండును.)

1ఆతని నిటకుం గొనిరమ్మని
ప్రీతిగఁ బంపితి నీతని నైనను
ఈతీరున నెందుకు వారిప్పుడు
పోతముతో సహ మాయం బైరో? (పోతము=ఓడ)

కనరాదెది నాయందున దోసము
కనరాని మహాపద యేదియొ
హేతువు గానోపును దీనికి నని
భీతిలి కంపిలుచున్నది చేతము

నీరాకరమున కావల నాశల
నూరించుచుఁ బూచిన యీప్రేమము
దూరంబునఁ దోఁచెడు మృగతృష్ణా
నీరంబే యని యిది సూచించునొ?

ఆశలు పెంచిన ఈప్రణయముచే
నాశమె కల్గును నీకుం దుదకని
సూచింపఁగ నీ స్వప్నోదంతము
ఈచందంబున దుదముట్టెనొ?

రెండవదృశ్యము

(ఉదయసమయం. రాజకుమారి శాంతిశ్రీ కోటముందరి వారధిపై నుండగా అప్పుడే రేవులో ఆగిన ఓడనుండి యాత్రికుఁడు ఆమె వైపు వచ్చుచుండును. అప్పుడు శాంతిశ్రీ వారధినుండి మెట్లమార్గమున క్రిందికి దిగి యాత్రికునితో మాట్లాడును.)

స్త్రీల కోరస్:
1అదిగో రేవున ఆగిన దొకనావ!
అందున వచ్చిన దెవరో కందము గాక!
అందున నుండెను యాత్రికుఁడొక్కఁడు!
ఆతఁడు మున్నుగ మన మెఱిఁగిన వాఁడే!

(ఇంతలో యాత్రికుఁడు రేవునుండి రాజకుమారి శాంతిశ్రీ సమీపమునకు వచ్చుచుండును. అతనిని జూచి ఆమె తనలో నిట్లనుకొనును)

శాంతిశ్రీ:
(తనలో) 8 8అల్లదె నేను స్వప్నమున నారసియుండిన యాత్రికుండె తా-
నల్లన రేవునుండి యిపు డాగతుఁ డయ్యెను, నాగసేనుఁడున్
పల్లవితానురక్తుఁడయి వచ్చెనొ యీతనితోడ, వచ్చి ఆ
యల్లక మొప్పఁ బంపెనొ నిజాగమనంబును దెల్ప నీతనిన్? (ఆయల్లకము=ఉత్కంఠ, తహతహ)
యాత్రికుఁడు:
(సమీపించి) రాజకుమారీ! ఒకవార్త.

శాంతిశ్రీ:
ఆవార్త అటుండనీ! నీప్రయాణ మెటనుండి తెలుపు.
యాత్రికుఁడు:
నాగపట్నమునుండే!

శాంతిశ్రీ:
అది క్షేమముగా సాగెనా?
యాత్రికుఁడు:
నాక్షేమమునకేమి గానీ అసలు వార్తను విను.
శాంతిశ్రీ:
అంతటి గొప్పవార్త యేది?

యాత్రికుఁడు:
చాలా చెడ్డవార్త, విషాదకరమైన వార్త.
శాంతిశ్రీ:
4నిర్ణయింపఁబోకు నీవె మున్ను
విన్నవింపు నాకు నున్నరీతి
మంచిచెడుగులేవొ మతిని నెంచి
నిర్ణయించుకొనఁగ నిమ్ము నన్నె!

యాత్రికుఁడు:
నాగూరు సంస్థాననాథుండు, నాగసేనుని వార్త యిది.

శాంతిశ్రీ:
అతఁడా! ఆదూరప్రేమికుఁడా? ఇటకు వచ్చినాడా? ఎన్నినాళ్ళిట నుండును?

యాత్రికుఁడు:
మరణదశలో నిట నున్నాఁడు రాణీ!

శాంతిశ్రీ:
దైవమా! యిది యేటి అశనికల్పమైన వార్త?

యాత్రికుఁడు:
55ఆతఁ డస్వస్థుఁడయ్యె ప్రయాణమందు
అతని స్వాస్థ్యము క్షీణించి యాతఁ డిపుడు
యముని పురికేఁగ నున్నాఁడు, అతనిఁ గావ
నీకు మాత్రమె సాధ్యంబు రాకుమారి!

శాంతిశ్రీ:
అతఁడెట నున్నాఁడు?
యాత్రికుఁడు:
5అడుగువేయని స్థితిలోన నాతఁడుండ
వెదురుమంచముపై నుంచి పదిలముగను
అతనిఁ గొనివచ్చుచున్నార లదిగొ కనుము
సుదృఢకాయులు, నల్వురు సుజనవరులు.

(అతఁడిది చెప్పుచుండఁగనే నల్వురు దృఢకాయులు వెదురుమంచముపై నాగసేను నెత్తుకొని వచ్చి వారిముం దుంతురు. శాంతిశ్రీ విచారముతో నతని ముఖమును, యావచ్ఛరీరమును చూచుచుండును. అతఁడు మూర్ఛితుఁడై పడియుండును.)

శాంతిశ్రీ:
(ఒక సేవికతో) వైద్యునిఁ గొనిరమ్ము!
(ఆమె చూపుల ప్రభావమో యేమో, మూర్ఛితుఁడైన నాగసేనుఁడు కొంచెము తేఱుకొని ఆమె ముఖములోనికిఁ జూచును.)

నాగ:
ఓహో నీవా, నీవు! వందమంది వనితలందును వైళమె నిను గుర్తింపఁగలను.

శాంతిశ్రీ:
(కొంచెముగా నతనిపై వంగి) నీవెట్లున్నావు?

నాగ:
(బలహీనస్వరముతోఁ బల్కును.)
5నీకటాక్షసేచనముచే నీరజాక్షి
తీక్ష్ణమైన నామూర్ఛితస్థితి యొకింత
శమము చెందుటచేత నీసమయమందు
తేఱుకొనుచుంటి నేనెదొతీరుగాను.

(ఇంతలో నొక వైద్యుఁడు వచ్చి అతని పరీక్షించి, శాంతిశ్రీని ప్రక్కకుఁ బిల్చి, ఆమె కేదో చెప్పును.)

శాంతిశ్రీ:
(హతాశురాలై) అయ్యో దైవమా!

నాగ:
(ఆమె విషాదమును గమనించి)
5వణకబోకుము సుకుమారి! వంతచేత
వైద్యు లెన్నియొ యందురు వారికేమి?
నాదు గుండియ లయయేదొ నాకుఁ దెలియు
పల్కదది యసత్యము వైద్యవరులభంగి.

శాంతిశ్రీ:
(అతని నోదార్చుచున్నట్లుగా మృదువుగా నతని కరమును గ్రహించి)
5నిన్నుఁ గాపాడు గావుత నెటులనైన
దైవకృప యన్నదొకటున్న ధరణిలోన!

నాగ:
5దైవకృపను న్యూనంబుగాఁ దలఁపరాదు
ప్రాణముండఁగ నిన్నొక్కపారియైనఁ
గనెడు భాగ్యంబు గల్పింపుమనెడు నాదు
వేడికోలును దైవంబు నేఁడు దీర్చె.

5అతని కృపచేతఁ గంటి నీయాననంబు,
అందుఁ గాంతిల్లు కందోయి యంద మిపుడు
ఏమి కొనిపోదు నిటువంటి స్మృతులు దక్క
నేఁడు నాతోడ నసువులు వీడు వేళ?

5వినఁగఁ గల్గితి నీకంఠనినద మిపుడు,
తాఁకఁ గల్గితి నీదు హస్తంబు నిపుడు
ఇంతకంటెను సౌఖ్యదం బేమి గలదు
అంత్యదశలోన నున్ననీ యతిథి కిపుడు?

5ఇంతకంటెను దైవంబు నేమి వరము
కోరుకొనఁ గల, నిఁక నేను నూరు వత్స
రంబు లీ లోకమందున బ్రతికి యున్న
అనుభవించున దేమి దైన్యంబు దక్క?

స్త్రీల కోరస్:
5బ్రతుకుపై నసహ్యంబును ప్రబలజేయు
వలపు సర్వత్ర నింద్యమై పరగుఁగాత!
జీవనముకంటె మరణంబె శ్రేష్ఠ మనెడు
తలఁపు గల్గించు ప్రేమంబు త్యాజ్యమగుత!
నాగ:
5కాదు ప్రేమంబు నింద్యంబు కాంతలార!
భవ్యమది గాని, దానికిం బాత్రులైన
వారె నింద్యులు, వారె యవద్యు లిలను,
ప్రేమ యనవద్యమైయుండు భామలార!
శాంతిశ్రీ:
5ఎంత బాగుండు నేఁ గవయిత్రినైన!
ఎంత బాగుండు నీవలె నింత యంద
మైన పదములందున నింత యందమైన
భావములఁ గూర్చి కవితలఁ బల్కియున్న!

నాగ:
5అందమంతయు నీది, ఆయందమందు
స్వల్పభాగంబు బింబించు సలిలమగును
నాకవిత్వంబు, పొగడ నస్తోకమైన
ప్రతిభ యందేమి సహజమై పరిఢవిల్లు?

శాంతిశ్రీ:
5ఎంతొ కాలమునుండి నాయెడఁదలోన
నణఁచియుంచితి నొక రహస్యంబు నేను
దానిఁ దెల్పంగవలయు నీతరుణమందు
ఇపుడు గాకున్నఁ దెల్పలే నెపుడు నీకు!

5‘అంతిపురమున రాత్రి నేకాంతమందు
అందమగు పదముల నలరారుచున్న
మధురతరమైన నీగీతమాలికలనె
పాడుకొని ప్రమదంబుతోఁ బరవశింతు.’

నాగ:
2లోకైకసుందరియె నాకవనలక్ష్యంబు
నాకవన మందమై నలువారు నందుచే!
అమలమై నాప్రేమ యలరారు గావునను
కమనీయ మగు నాదు కవనంబు సైతంబు

2కాని నాకవితలోఁ గనుపించు నీరూపు
న్యూనంబు వెయిరెట్లు నీనిస్తులాకృతికి
మున్నుగా నేఁగాంచియున్నచో నీరూపు
చెన్నుగా నాకవిత చెల్వారుచుండెడిది

2మనసులో నూహలకు మాఱుగాఁ గనులతోఁ
గనియున్నచో నీదు కమనీయరూపంబు
ప్రేమించియుందింక వేయియంతలు నిన్ను,
కామించియుందపుడె కౌఁగిలింపఁగ నిన్ను!

శాంతిశ్రీ:
ప్రేమించియుందట్లె నేనుసైతము నిన్ను!

నాగ:
ప్రేమించియుందువా నాయంతగా నీవు?

శాంతిశ్రీ:
ప్రేమించియే యుందు నీయంతగా నేను!
నాగ:
నాగసేనా నిన్ను బ్రేమింతు నందువా?

శాంతిశ్రీ:
నాగసేనా నిన్ను బ్రేమింతు నందును.

నాగ:
2దైవంబ యిదియేమి, జీవింపఁ బునరాశ దీపించు నాలోన?

(అని పల్కి, అతని అస్వస్థత తీవ్రతరమగుటచే నతఁడు మఱల మూర్ఛిల్లఁబోవును. శాంతిశ్రీ యతని తన ఒడిలో నుంచుకొని అనునయింప యత్నించును.)

నాగ:
5ఈమె తనుగంధముం గ్రోలు చిటులె యీమె
బాహుబంధమందున క్షణంబైన నుండు
భాగ్యముం గూర్చి మృత్యుదేవతకుఁ గొంత
విరతి నీయుము దైవంబ కరుణతోడ!

యాత్రికుఁడు:
5కాని ప్రాణాంతకస్థితిలోన నీవు
లేకయుండిన ఈప్రియాలింగనంబు,
ఈమె మైతావిఁ గ్రోలు నదృష్టసిద్ధి,
చేకుఱుచునుండెనా నాగసేన నీకు?

శాంతిశ్రీ:
5వ్యర్థభాషలు వల్కకు యాత్రికుండ!
రోగియైనను నీతఁ డరోగియైన
అన్నిపట్టుల నాకూర్మి యటులె యుండు
కోర రోగ మితనికి నాకూర్మికొఱకు.
(నాగసేనునితో ప్రణయాన్వితముగా)
ప్రేమింతు నెంతయో నిను నాగసేన!

నాగ:
5దైవకృపచేత నేను స్వస్థతను గనిన
నీకరంబున గ్రహియించి నాకరంబు
నన్నుఁ గొనిపోదువా నీప్రసన్నమైన
శయనగేహంబునకు ప్రేమ సంఘటిల్ల?

శాంతిశ్రీ:
5స్వస్థునిగఁ జేసెనేని దైవంబు నిన్ను
అట్లె కొనిపోదు నేనవశ్యముగ నిన్ను!

నాగ:
5మఱియు శయనింతువపుడు నాసరస నీవు!
శాంతిశ్రీ:
5ఔను, శయనింతునపుడు నీతోనె నేను!
నాగ:
2నాయంసలతపైన నీయుత్తమాంగంబు,
నాయాస్యమున కెదుట నీయాస్యముండు!

శాంతిశ్రీ:
2నీయంసలతపైన నాయుత్తమాంగంబు,
నీయాస్యమున కెదుట నాయాస్యముండు!

(అంసలత=బాహువు; ఉత్తమాంగము=శిరము, ఆస్యము=ముఖము, నోరు)

నాగ:
2నీపెదవి కడఁజేరు నాపెదవి!

శాంతిశ్రీ:
2నాపెదవి కడఁజేరు నీపెదవి!

(పైవిధముగాఁ బల్కుచు, ఇంకను ఆమె బాహుబంధములోనే యున్న నాగసేనుఁ డత్యంతసంతుష్టుఁడై ఆమెను ముద్దిడును.)

నాగ:
2నేను గోరినదెల్ల నేఁడు నా కొనగూడె,
ఇంకఁ గోరునదేమి యీజీవితంబందు?
ఇంక నూరేండ్లపాటిలలోన నున్నను
ఇంతకంటెను ననుభవించునది యేమి?

(పైవిధముగాఁ బల్కుచు అతడు రోగోపహతుఁడై క్రుంగి, ఆమె బాహువులలోనే పూర్తిగా స్పృహదప్పి పడును. ఆమె అతనిని కొంతసేపట్లే పట్టుకొని, అతఁడు విగతప్రాణుఁడగుచున్నాఁడని అనుమానించి, అతనిని ఆవెదురుమంచముపై పరుండఁబెట్టి, అంజలి ఘటించి, అతని ముఖమును, దూరమున నున్న త్రిమూర్త్యాలయమును చూచుచు దైవమునుగూర్చి ఇట్లు పాడును.)

2దీనావనుండవౌ దేవుఁడవు నీవంచు
నేనొక్క ప్రార్థనను నీమ్రోలఁ గావింతు
స్ఫటికంబు చందాన స్వచ్ఛమౌ మనసుతో
కుటిలత్వమెఱుఁగని కూర్మితో నీతండు

ప్రేమించి దూరంపు కామిని న్మనసార
ఆమెకౌఁగిటిలోనె ఆసన్నమృతుఁడయ్యె
కాపాడు మీతనిం గాపాడు నాప్రియుని
ఆపన్నరక్షకా! ఆర్తసంరక్షకా!

స్త్రీలకోరస్:
2అకలంకమగు ప్రేమ నబ్ధికావల నున్న
సుకుమారిఁ గనవచ్చి స్రుక్కె నీతఁడు నేఁడు
తన ప్రేయసీమణీ దరహాసలేశంబుఁ
గని తృప్తి గనినట్టి కాముకుం డీతండు

ఇంత త్వరితంబుగా నీయల్పసంతోషిఁ
జెంతకుం జేర్చుకొన నెంతువెందుకు నీవు
అనుభవింపఁగ నిమ్ము గొనినాళ్ళపాటైన
తన ప్రేమఫలమును ధరణిలో నీతనిని
త్వరయేల నీకడకె పయనింతు రందఱు
కరుణాకరా దేవ! కౌస్తుభాంచితదేహ!

(అబ్ధి=సముద్రము; స్రుక్కు=మూర్ఛిల్లు, వ్యథనొందు)
(వారట్లు ప్రార్థించుచుండఁగా యాత్రికుఁడు నాగసేనుని ముఖమును, నాడిని పరీక్షించి అతఁడు మృతుఁడైనట్లు శాంతిశ్రీకి, స్త్రీలకు సంకేతించును. అప్పు డత్యంవిషాదముతో శాంతిశ్రీ ఇట్లాలపించును.)

శాంతిశ్రీ:
2దీనులను రక్షించు దేవుండ వీవంచు
నేనెంచితిని గాని నీవిట్లు చేసితివి
ప్రేమంబె దీక్షగా ప్రేమంబె కవితగా
ప్రేమంబె శ్వాసగా నీమానవుండుండె
ఇది నేరమా దేవ, ఇది దోసమా దేవ?

అదయుండవై వీని అసువులం గొంటివి
దీనులను రక్షించు …నీవిట్లు చేసితివి

రోగంబు, మరణంపు యోగంబు లేనట్టి
భోగించుయోగ మొక పూటకొఱకైన
మాకొసఁగియుండుటకు నీకేమి లోటయ్యె,
నీకేల నిష్కరుణ ఈకరణి మాపైని?
దీనులను రక్షించు …నీవిట్లు చేసితివి

యాత్రికుఁడు:
(పశ్చాత్తాపంతో గూడిన విషాదంతో)
2ఏల నామూలమున నిట్టి శోకము గల్గె
ఏల నీరెండు తీరాలకును మధ్యలో
సంధానకర్తగా చరియించితిని నేను
బంధమ్ము గూర్పంగఁ బాల్పడితి నేను?

2దూరంపు ప్రేమికులఁ జేరువకుఁ జేర్పంగ
వారిప్రేమంబు ఫలవంతముగఁ జేయంగ
ఎంచితిని మేలునే యిసుమంత జేయంగ
కాంచితిని అదియంత గంగలో గలియంగ

2నీవు సేయవుగాని దైవంబ! యీరీతి
మావిధానము గూడ మట్టిలోఁ గల్పెదవు
అపన్నరక్షకుం డనవలెనొ, లేకున్న
ఆపన్నశిక్షకుం డనవలెనొ నిన్ను?

శాంతిశ్రీ:
2ఇదె నాదు ప్రేమంబు తుదముట్టు సమయంబు
యెదలోన నెవ్వాని నిఁక నేను ప్రేమింప
కనరాని ప్రేమికుని అనురాగగీతాలు
వినఁగాను కౌతుకము గననింక నేనెపుడు

2నన్నెఱుఁగకున్నను, నన్నుఁ గనకున్నను
నన్నె ప్రేమించుచు, నన్నె శ్లాఘించుచు
నున్న నీతనిఁ బాసియున్నట్టి విధవను
ఎన్నుకొన నింకెవని సాన్నిహిత్యము నేను

2నాగసేనుని విధవనైనట్టి నేను
భోగింప నింకెట్టి పురుషునిం గూడి
సౌఖ్యంబు గన నెవని సంశ్లేషమందు
సఖ్యంబు నెవనితో సల్పనిఁక ముందు

(ఎదుట దూరముగాఁ గన్పించు విష్ణుమందిరమును జూపుచు భక్తితో పాడును.)
2సుందరంబైన హరిమందిరం బటనుండె
అందులో నిఁకనుందు త్యజియించి సర్వంబు
అతిదూరమునయందు ఆదైవమున్నను
అతనినే పొందగా యత్నింతుఁ నిఁక నేను

2కనలేక వినలేక కడుదూరమందున్న
వనమాలినే నేను వరియించి యతనికే
నాదూరపుం బ్రేమ నంకితంబొనరింతు
నాదూరపతివంచు నతనినే కీర్తింతు.

2దూరంపువ్యక్తికై తోరంపురక్తితో
ఆరాటపడి పొందితిని అత్యంతఖేదంబు
దూరంబు నందున్న శౌరిపై మఱలించి
నారక్తి నిఁక నేను గోరుకొందును ముక్తి.

దూరప్రణయము సమాప్తము