పీడకల

కంప్యూటర్ కీబోర్డు మీద వేళ్ళు టకటకలాడుతున్నాయి గానీ కళ్ళు మాత్రం గడియారం చుట్టూనే తిరుగుతున్నాయి. ఇవాళ కూడా నేను ఫస్ట్ ట్రైన్ అందుకోలేనేమో. చివరి నిమిషంలో, అదీ నేను బయలుదేరేముందు, మిసెస్ రావ్ ఈ పని అప్పజెప్పింది.

“అసలే ఆఫీసు పదిరోజుల తర్వాత తెరిచాం” అంటుంది పైగా.

మహారాణిగారూ, మీరన్నది నిజమే గానీ మీకేం? మీ ఆయన వెనక బైక్ మీద కూచుని ఇంటికి పోయి వేడిగా ఇడ్లీ, సాంబార్ రెడీ చేస్తే చాలు. మరి నేనో? ఫస్ట్ ట్రైన్ మిస్ అయితే మళ్ళీ గంట దాకా ఇంకోటి లేదు. ఆ గంట తర్వాత ఎవరూ లేని ఆ ఖాళీ ట్రైన్‌లో మరో రెండు గంటలు ప్రయాణిస్తే గానీ కొంప జేరలేను. ఇదంతా నీకు అర్థమవుతుందని నేనెలా అనుకుంటాన్లే.

పోన్లే ఎలాగో పనైపోయింది ఇవాల్టికి. అమ్మయ్య, ఆటో కూడా వచ్చింది సమయానికి.

“ఇదిగో భయ్యా, కాస్త త్వరగా పోనీ!”

కర్ఫ్యూ పదిరోజుల తర్వాత ఎత్తేయడంతో జనం పంజరాల్లోంచి బయటపడ్డట్టు బిలబిలమంటూ రోడ్ల మీదికి రావడంలో ఆశ్చర్యం లేదు. కార్లలో, బైకుల మీదా హాయిగా తిరుగుతూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడైనా ఒక్క టపాకాయ పేలిందా… వీళ్ళే పరిగెత్తుకుపోయి ఇళ్ళలో దూరి తలుపులేసుకుంటారు.

దేవుడా, ఈ రెడ్ సిగ్నల్ ఇప్పుడే పడాలా? అదృష్టం అలా తగలబడింది!

అమ్మయ్య, సరిగ్గా ఏడురూపాయలున్నాయి, ఆటో కోసం చిల్లర వెదక్కుండా.

స్టేషన్లోనించి జనం కుప్పలుతెప్పలుగా బయటకు వస్తున్నారు.

“బాబూ, ట్రైన్ ఎక్కడానికి పరిగెత్తుకొచ్చే వాళ్ళక్కూడా కాస్త దారివ్వండయ్యా!”

ఈ రైల్వే వాళ్ళు నిజంగా టూమచ్ అసలు. అవతల వైపుకు తీసుకుపోయే మెట్లు ప్లాట్‌ఫామ్ ఆ చివర ఎక్కడో ఉంటాయి.

నేనెక్కాల్సిన లోకల్ ట్రైన్ నాలుగో నంబర్ ప్లాట్‌ఫామ్ మీద కదలడానికి సిద్ధంగా ఉంది

పరిగెత్తాలి తప్పదు, కమాన్ రన్… అయిపోయింది, చివరి రెండు మెట్లే…

అయ్యో! వెళ్ళిపోయింది రైలు. ఇక తీరిగ్గా సంతోషించు.

“అక్కా” టీ స్టాల్ మనిషి గొంతు “తర్వాత రైలు కోసం ఇంకో గంట ఎదురు చూడాలి నువ్వు.”

అసలు వీడేంటి అలా చూస్తున్నాడు? ప్లాట్‌ఫామ్ మీద ఒక్క పురుగు లేదు. పది నిమిషాల ముందు క్రిక్కిరిసిపోయి ఉన్న జనం, రాయేస్తే ఎగిరిపోయిన పక్షుల గుంపల్లే మాయమైపోయారు.

నేనసలు బహుశా స్మితా వాళ్ళింటికి వెళ్తే బాగుండేదేమో. గంట తర్వాత వచ్చే రైల్లో కూడా మాట్లాడేందుకు ఎవరూ ఉండరు.

భయం వాసన గాల్లో అక్కడక్కడే తచ్చాడుతోంది. చాయ్‌వాలా నా వైపు చూసినపుడల్లా కొంచెం భయమేస్తోంది. ఎవరికి తెలుసు, ఆ చేతిలో సామాను నా మొహం మీద విసిరేస్తాడేమో?

అసలు ఇంతకీ వాడిదేం కులమో?

అయినా మనలాంటి వాళ్ళకి కులమూ మతమూ లాంటి తేడాలు లేవనుకోండి. కానీ వాడికా విషయం తెలీదుగా?

చాయ్‌వాలా నా నుదుటి బొట్టు, మంగళ సూత్రం కేసి చూస్తున్నాడనిపిస్తోంది. కాదు కాదు, అందరూ అలాటి వాళ్ళుండరు…

దాహమేస్తోంది. నా వాటర్ బాటిలేది? బాగ్‌లో ఉండాలి. ఆఁ, దొరికింది. కానీ ఖాళీగా ఉంది.

ఇంటికి ఒకసారి సారి ఫోన్ చేస్తే మంచిదేమో. అలాగే ఒక పత్రిక ఏదైనా కొనుక్కుని, బాటిల్‌లో మంచినీళ్ళు పట్టి తెచ్చుకోవాలి.

విక్రమ్ ఫోన్ తీశాడు. నేను ఫస్ట్ ట్రైన్ పట్టుకోలేకపోయినందుకు అతనికి కోపం వచ్చింది. అతని కోపాన్ని నా మీద చూపించేంత టైము ఇవ్వలేదు నేను. పెట్టేశాను.

టెలిఫోన్ బూత్‌లోని వ్యక్తి ఒక సలహా పడేశాడు. “ట్రైన్ కోసం చూస్తూ ఇంటికి ఆలస్యంగా వెళ్ళకండి. పరిస్థితులు ఇదివరకు లాగా లేవు. రిస్కు తీసుకోవద్దు.”

‘ఈ పది రోజుల్లో ఏం మారింది?’ నన్ను నేను ప్రశ్నించుకున్నాను.

జనం ఇహపై కన్నీళ్ళు కార్చరా? లేక ప్రేమించడం మర్చిపోయారా? ఇకపై పిల్లలు పుట్టరా? పూయక ముందే పూలు వాడిపోతాయా?

నిజానికి ఏమీ మారలేదు.

మరి ప్రతి చోటా ఈ భయం, సంశయం ఎందుకు?

వెళ్ళి బుక్‌స్టాల్‌లో పుస్తకాలు తిరగేద్దాం. అబ్బ, న్యూస్ పేపర్ల నిండా మళ్ళీ అదే. చచ్చిపోయిన వాళ్ళ సంఖ్యలు, కాల్పులు, బుల్లెట్లు, చావు కరాళ నృత్యపు వార్తలే అన్నీ. ఏవో రెండు పత్రికలు తీసుకుని ఒక బెంచీ మీద కూచున్నాను.

ప్లాట్‌ఫామ్ ఖాళీగా ఉంది. టీస్టాల్‌లో స్టవ్‌లు ఆర్పేయడంతో, తినుబండారాలు వేయించడానికి కాచిన నూనె చల్లారిపోయింది. టేబుల్ మీద ఉంచిన కూల్‌డ్రింకులన్నీ లోపల సర్దేశారు. పని చేసే కుర్రాళ్ళు కునికిపాట్లు పడుతున్నారు. బూట్ పాలిష్ కుర్రాడు పాలిష్ స్టాండ్‌ని తలగడగా చేసుకుని హాయిగా నిద్రపోతున్నాడు.

నా బెంచీ పక్కనే ఉన్న కుక్క మాత్రం చిరాగ్గా ఉంది. కూచోటం, లేవటం, చెవి గోక్కోడం, మళ్ళీ పడుకోవడం. ప్లాట్‌ఫామ్ అవతల వైపు రెండు కుక్కలు పోట్లాడుకుంటున్నాయి. బహుశా అది చూసి భయపడుతోందేమో.

నా పక్కన ఎవరో వచ్చి కూచున్న విషయాన్ని సడన్‌గా గమనించాను. ఆమె నల్లటి బురఖా ధరించి ఉంది. చేతులొక్కటే బయటికి కనిపిస్తున్నాయ్. చేతిలో పెద్ద గుడ్డ సంచీ ఉంది. మొహానికి అడ్డంగా ఉన్న వలలాంటి పరదాలోంచి ఆమె కళ్ళు నాకు కనిపించట్లేదు గానీ, నన్నే తీక్షణంగా చూస్తోందనిపించింది.

ఇక్కడ ఇన్ని బెంచీలుండగా నేను కూచున్న బెంచీ మీదే ఎందుకు కూచుంది? ఏమాలోచిస్తోందో ఏంటో? ఆ సంచీలో బాంబు గానీ తెచ్చిందా? ఒకవేళ ఈ సంచీ ఇక్కడ వదిలిపెట్టి ఆమె లేచెళ్ళిపోతే? ఆ వెంటనే బాంబు పేలితే? నేనేమై పోవాలి? నా మొగుడూ పిల్లల కథ కంచికే ఇక. ఛ! ఇలా ఆలోచిస్తున్నానేంటి?

పాపం, మౌనంగా కూచుని ఉందామె. కానీ దానర్థం ఆమె ప్రమాదకరం కాదనా ఏంటి? అసలు ఇక్కడి నుంచి లేచి వేరేచోట కూచుంటే? నాలుక పిడచకట్టుకుపోతోంది నాకు. చేతులు బాగ్‌ని గట్టిగా నొక్కి పట్టుకున్నాయి. అంత చలిలోనూ చెమట చుక్క నుదుటి మీద నుంచి జారిపడింది.

“ఏంటక్కా? ఎక్కడికెళ్ళాలి” వడలు అమ్మే చిమన్ దేవుడిలా ప్రత్యక్షమయ్యాడు. అమ్మయ్య, కర్ఫ్యూ ఎత్తేసినట్టు గడ్డకట్టిన నా రక్తం ఒంట్లో మళ్ళీ ప్రవహించడం మొదలైంది.

“నువ్వు లేటుగా వచ్చావక్కా. ఫస్ట్ ట్రైన్ వెళ్ళిపోయింది” అన్నాడు నవ్వు మొహంతో.

తలాడించాను తెలుసన్నట్టు. నోట్లోంచి మాటే పెగల్లేదు. భయంతో గొంతు వణికితే ఎలా?

“ఇక్కడ కూచున్నావేంటక్కా? ఇలాటి టైమ్‌లో ఇక్కడ కూచోడం అంత మంచిది కాదు.”

కాళ్ళు భూమిలో పాతేసినట్టు కదలడానికి మొరాయించాయి. చిమన్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అతడు చెప్పింది కరెక్టే. ఇక్కడ నుంచి లేచి వెళ్ళాలి నేను. ఆమె ఏ క్షణంలో ఏం చేస్తుందో? బాగ్ లోంచి కత్తి తీసి పొడిస్తే మాత్రం ఎవరు చూడొచ్చారు? అసలు ఆమె ఒక చేత్తో తోస్తే చాలు నేను కుప్పకూలిపోతాను. అంత బలంగా ఉన్నాయి ఆమె చేతులు. కొంపదీసి కరుడుగట్టిన నేరస్తుడెవరైనా ఆ బుర్ఖాలో లేడు కదా? వెన్నులో చలి పుట్టింది. అసలిప్పుడు ఎలా లేవాలి ఇక్కడి నుంచి? ఈ టైమ్‌లో ఈ ట్రైన్ ఎక్కాలని అసలు ఎందుకు అనుకున్నాను నేను?

దేవుడా, నన్ను క్షేమంగా ఇల్లు చేర్చు. ఆమె ఏదైనా చేయాలని ప్రయత్నిస్తే చెప్తా ఆమెతో, ‘చూడమ్మా, ఏది కావాలన్నా తీసుకో, కానీ నన్ను ప్రాణాలతో వదిలెయ్.’

గొంతు ఎండిపోతోంది. చేతులు మంచుముద్దల్లా అయిపోయాయి. పిరికిగా చుట్టూ చూశాను. నరమానవుడు లేడు. జనమంతా ఏమైపోయారసలు?

నిన్న మొన్న చూసినట్టుంది… ఈ ప్లాట్‌ఫామ్ అంతా జనంతో నిండి ఉండేది. వచ్చే పోయే రైళ్ళతో సందడిగా, అసలు మనిషి నిలబడటానికి కూడా చోటు లేకుండా ఉండేది

నేను రోజూ ప్రయాణించే ఆడవాళ్ళ కంపార్ట్‌మెంట్ ఎలా ఉండేది? ప్రతి స్టేషన్లోనూ రైలు ఆగగానే ఆడవాళ్ళు కంపార్ట్‌మెంట్ లోకి గలగలమంటూ ప్రవహించినట్టు ఎక్కేసేవారు. ఎవరో కొద్ది మంది మాత్రం దిగేవాళ్ళు. ఎక్కడో ఒక చోట చోటు సంపాదించి కూచున్నాక, హాండ్‌బాగుల నుంచి, సంచీల నుంచి బీన్సు, వెల్లుల్లి, బఠానీలూ బయటికొచ్చేవి. అన్ని చేతులూ కబుర్లు నంజుకుంటూ వాటిని వొలిచి, పొట్టు తీసి, తరిగి, తిరిగి బాగుల్లో సర్దేవి. ఒక్కోసారి రంగురంగుల దారాలూ సూదులూ బయటికొచ్చి చీరల మీదా, కుర్తీల మీదా పువ్వులుగా, రేకులుగా అమరిపోయేవి. అప్పడాలు, ఊరగాయలు, మసాలా పాకెట్లూ ఆ కంపార్ట్‌మెంట్‌లో అమ్ముడయ్యేవి.

అత్తలు, మొగుళ్ళు పెట్టే ఆరళ్ళతో రాలిన కన్నీళ్ళు, వాటిని తుడిచే చేతులు కూడా ఆ కంపార్ట్‌మెంట్‌లో ఉండేవి. అప్పుడప్పుడూ ఆఫీసులో ఎవరి మీదనో అక్కడ గుసగుసలు కూడా నడిచేవి. పెళ్ళిళ్ళనో, పండగలనో స్వీట్ల పందారాలు జరిగేవి ఆ రైలు పెట్టెలో. ఈ మధ్యలో ఎవరో రామరక్షా కవచమో గాయత్రీ మంత్రమో పాడుతూ ఉండేవారు. నమాజ్‌కి సమయమైతే, అందరూ సర్దుకుని వారికి చోటు చేసేవారు.

స్టేషన్లలో రైలు ఆగిన కొద్దీ ఇంకా ఎంతోమంది ఎక్కుతూనే ఉండేవారు ఆడవాళ్ళు. ఏరీ వాళ్ళంతా ఇవాళ? ఆ ముఖాలన్నీ ఏమైపోయాయి? ఆ బఠానీలూ, మసాలా పాకెట్లూ, అప్పడాలూ ఎటు పోయాయి? ఇప్పుడు నేనిక్కడి నుంచి ఎలా బయటపడాలి?

అరె, ట్రైన్ రానే వచ్చిందే, గమనించనే లేదు. సరాసరి లేడీస్ కంపార్ట్‌మెంట్ లోకి పోదాం ఇక.

ఓరి దేవుడా, ఈ బుర్ఖా నా వెనకాలే ఎక్కుతోందే, వదిలిపెట్టి పోదా నన్ను?

ట్రైనంతా దాదాపుగా ఖాళీగా ఉంది. ఇద్దరు ముగ్గురున్నారంతే. ఎదురు సీట్లో ఒక చేపలమ్మే ఆమె తన ఖాళీ బుట్ట పక్కన పట్టుకుని నిద్రపోతోంది. కంపు కొడుతోంది ఆ బుట్ట. అయితెమానెలే, ఎవరో ఒకరున్నారు తోడుగా అంతే చాలు.

ఆమె పక్కనే కూచుంది బుర్ఖా ఆవిడ, నాకెదురుగా!

ఆమె బుర్ఖా లాగే ట్రైన్ బయట నల్లని దట్టమైన చీకటి అలుముకుని ఉంది. ఆ చీకటంతా తొలగిపోవాలని, నా మీదే నిఘా వేస్తున్న ఆమె చూపుల నుంచి తప్పించుకోవాలని ప్రార్థిస్తూ కళ్ళు మూసుకున్నాను.

ఏం చేస్తూ ఉండుంటుంది? వీళ్ళని నమ్మనే కూడదంటారు జనం. ఎప్పుడు కత్తి తీసి ఎవరిని నరుకుతారో తెలీదు కదా. హసీనా అని నాకో ఫ్రెండ్ ఉండేది కాలేజీలో. దాని అన్న, పెళ్ళాన్ని నరికి చంపేశాడు. ఈవిడ మాత్రం అలా చేయదనేముంది?

ఎవరో నా భుజాలు పట్టి కుదుపుతున్నారు. దేవుడా! కళ్ళు తెరిచాను. బుర్ఖా స్త్రీయే ఎదురుగా. పై ప్రాణాలు పైనే పోయాయి. అమ్మో, ఇప్పుడేం చేయాలి? ఏం చేస్తోందీవిడ? పెద్దగా అరిస్తే? ఎదురుగా చేపలామె హాయిగా నిద్రపోతోంది. నన్ను ఈమె గప్‌చుప్‌గా చంపేసినా ఆమెకి తెలీదు.

కదులుతున్న ఈ రైల్లోంచి దూకేస్తే? దేవుడా, ప్లీజ్ నన్ను కాపాడు. మళ్ళీ జన్మలో ఈ ట్రైన్ ఎక్కనని ఒట్టు పెడుతున్నాను. అసలు ఈ ఉజ్జోగం కూడా మానేస్తాను. ఇలాటి పీడకల లాంటి పరిస్థితిలో చిక్కటం కంటే పస్తులుండి చావడం మంచిది.

“బెహెన్ జీ, అక్కా…” అంటోంది ఆమె. “నాకు తోడుగా ఉన్నందుకు చాలా థాంక్స్ మీకు. ఇక్కడ దిగిపోతున్నాను నేను. ఇలాటి పరిస్థితుల్లో ఒంటరిగా ప్రయాణం చేయడం చాలా కష్టం అక్కా. చచ్చేంత భయం వేసింది. మీరుండబట్టి…”

ఆమె కూడా నాలాగే భయపడిపోయింది!

భయమంతా ఒక్క క్షణంలో మాయమై… పెద్దగా నవ్వేశాను. “భయమా? ఇందులో భయపడటానికేముంది? నేను రోజూ అప్ అండ్ డౌన్ చేస్తాను ఈ ట్రైన్లో” రైలు కూత కంటే గట్టిగా, ధైర్యంగా ధ్వనించింది నా గొంతు.

ఆమె తన చేతిని నా చేతి మీద ఉంచి ఖుదా హఫీజ్ చెప్పింది. దేవుడు నీయందు ఉండుగాక!

ఆమె చేతికి ఉన్న చెమట నా చెమటతో కలిసిపోయింది.

ట్రైన్ ఆగింది. ఆమె దిగుతుంటే ఆమె బాగ్ అందించి సహాయం చేశాను. సడన్‌గా ఆ బాగ్ తేలికగానూ, ప్రమాదరహితంగానూ తోచింది. ట్రైన్ స్టేషన్ దాటుతుండగా స్టేషన్ లైట్ల మసక వెలుగులో ఆమె రూపం నెమ్మదిగా కనుమరుగై దాటిపోయింది.

నా ఎదురు సీట్లోని చేపలామె ఆవులించింది. ఆమె బుట్టలోనుంచి బీన్సు నిండిన ఒక ప్లాస్టిక్ సంచీ తీసింది. ఆ ఆకుపచ్చదనం నా చుట్టూ పరుచుకుంది.

నాకు ఇంటికి దారి చూపిస్తూ బయట ఆకాశంలో నక్షత్రాలు మిలమిలా మెరిశాయి.

(గుజరాతీ మూలం: దూస్వప్న. ఆంగ్ద్నువాదం: Rita Kothari)