‘ఇవాళేం రాశావ్?’
విని వూరుకున్నాడు.
ఏమని జవాబివ్వాలో తెలియక కాదు. ఇవ్వడానికేమీ లేక.
రాయాలి. చదవాలనిపించేట్లుగా రాయాలి. చూసినవన్నీ, చూడనివి కూడా రాయాలి. చదివినవాళ్ళందరి కళ్ళూ పెద్దవయేట్లు, జుట్టు పీక్కుని కొందరూ పీక్కోక కొందరూ ఆలోచించితే కానీ అర్థం కానివి రాయాలి. మెచ్చుకునేట్లు, లైకులూ కామెంట్లూ పెట్టడానికి పోటీలు పడేట్లూ రాయాలి. రాస్తాడు. రాయగలడు తను.
‘ఎప్పుడు?’
దీన్నీ విని వూరుకున్నాడు. జవాబివ్వక్కర్లేదనిపించి.
“సర్, దిస్ పార్టాఫ్ ది టెర్రయినీజాల్మోస్ట్ కవర్డ్ విత్ రోడోడెండ్రాన్స్ అండాల్సో విత్…”
మధ్యలోనే కట్ చేసి – “డిడ్ యూ సీ దట్? హేవ్ యూ వాక్‌డ్ ఆన్ దోజ్ స్లోప్స్?” రెండురెళ్ళు నాలుగు అంటే, నువ్వు సరిగ్గా లెక్కపెట్టి చూశావటోయ్ కుర్రాడా? అంటున్నాడు గుబురుమీసాల్లోంచి జీవోసీ (జనరల్ ఆఫీసర్ కమాండింగ్). నమిలిన నీళ్ళని పైకి కనిపించనివ్వలేదు మేజర్ సుబ్బు, వినయంతో కూడిన చిరునవ్వుతో కేమోఫ్లేజ్ చేసి. అయినా ఈయన చెప్పేది ఆయన చెవులప్పగించి వింటాడనుకుంటే ఎలా? జీవోసీకి తెలియని టెర్రయిన్ అయితే కద!
“ఎనీవే, ప్లీజ్ కంటిన్యూ.”
అసలివన్నీ కథలుగా రాయాలి. పెద్ద ఆఫీసర్ల ధాటీలు, చిన్న ఆఫీసర్ల వినయాలు. ధాటీ ఊరికేనే ఏర్పడిందా? ఎంత అనుభవం ఉంటే అలా ప్రశ్న వెయ్యగలడాయన? తెలియకనా అడిగేది? కానీ ఎంత చిన్న ఆఫీసరైనా, మన ముందుకొచ్చేసరికి తోకలు బయటికొచ్చేస్తాయి ఎక్కణ్నించో…
ఇంకా ఎంతసేపో ఈ బ్రీఫింగ్. తప్పేదేముంది?
స్క్రీన్ సేవర్‌ని డిసేబుల్ చేశానా లేదా? లేకపోతే మళ్ళీ చేపలు ఈదుకుంటూ వచ్చేస్తాయ్ స్క్రీన్ మీదికి. గోల్డ్ ఫిష్‌లు. గొరిల్లా సైజులో. టెర్రయిన్ ఉన్నట్టుండి పేద్ద ఎక్వేరియంలా. సరిగ్గా ఇలాంటప్పుడే ‘ట్రై టు థింక్ ఆఫ్ ది వరస్ట్ దట్ కుడ్ హేపెన్’ అన్నాడు కార్నెగీ.
చేపలొచ్చేశాయే అనుకుందాం. ఏమౌతుంది? అందరూ తనకేసి చూస్తారు. చూడ్డం కాదు. ఫ్రౌన్ చేస్తారు. తప్పకుండా. చూడుడు: ‘ఫ్రౌన్’ – ‘కోపముతో చూపు.’ ‘ముఖము చిట్లించి చూచుట.’ మరుక్షణం ఇక్కడ తంతే అక్కడెక్కడో యూనిట్‌లో పడతాడు. వార్నింగులూ, రిప్రిమాండ్ల పర్వం కొనసాగును.
అయినా వెధవ అనుమానం ఇప్పుడొచ్చిందేం? మొదలై చాలాసేపయిందిగా? వచ్చేవే అయితే… ఒక నిశ్శబ్దపు నిట్టూర్పుతో తమాయింపుని ప్రాక్టీస్ చేసుకుని…
తను రాస్తాడు. ఇవ్వాళే మొదలుపెడతాడు. రోజుకి కనీసం రెండు పేజీలు రాసిపెట్టినా చాలు. వారానికి పధ్నాలుగు, ఏడాదికి? …ముప్ఫై రెళ్ళు అరవై అరవై పన్నెండ్లు డెబ్భై రెండు… ఏడొందల పేజీల కథ/ నవల/ గాథ/ అనుభవాలు/ గోడు/ గోల/ బుక్ తయారౌతుంది.
లంచ్ బ్రేక్. నాలుగింటికి.
చచ్చిపోయిన ఆకలిని మళ్ళీ మండించుకుంటూ తిని, సిగరెట్‌తో దాన్ని అరిగించుకుంటూ.
…అలా అని పూర్తిగా రాయడం మానిందీ లేదు. రాస్తూనే ఉన్నాడుగా. ఉత్తరాలు. కనీసం అయిదారు పేజీలు. ఏం రాయాలో ముందుగా ఎప్పుడూ ఆలోచించకుండా. అప్పటికప్పుడు పదాల తుంపర మొదలై పెద్ద చినుకుల వాక్యాలై పేరాల సెలయేళ్ళై కాగితమ్మీద ఇంకిపోతూ.
తను రాస్తే అలానే ఉంటుంది.
ఎక్కడ మొదలుపెడదాం? అమ్మతో. పోనీ… నాన్న గురించి? వాళ్ళ గురించి రాస్తే అది ఆత్మకథ అవుతుందేమో కదా? ఆత్మకథలు రాయాలంటే ఆత్మకథలు చదవొద్దూ? చదివాడుగా? తెగిన జ్ఞాపకాలు బై సంజీవదేవ్? చాలదూ? చూద్దాం. లైబ్రరీలో ఉన్నాయేమో కనుక్కోవాలి.
చివరికొచ్చేసరికి స్ట్రాంగ్‌గా మారుతోంది ఆఫ్టర్ లంచ్ సిగరెట్. అరుంధతీ రాయ్ అన్నట్లు. మానెయ్యాలి. అరుంధతీ రాయ్‌నా? జోకులా? సిగరెట్లు. కాలిస్తే బాగుంటుంది. కాల్చకపోతే, తపనని తట్టుకోవడం కష్టం. అసలైనా ఇష్టమైంది, ఈరోజు చేస్తున్నది ఎప్పుడూ ఎందుకని నచ్చదు? ఒకప్పటి జులపాల, బెల్‌బాటమ్‌ల రోజులే బాగున్నాయనిపిస్తాయేం?
అవన్నీ తర్వాత. ముందు రాయాలి. ఇవాళ్టినుంచీ. రాస్తాడు. రాయగలడు తను.
“ఏం రావుగారూ, సిగరెట్ బ్రేకా?” చిరునవ్వుతో పలకరించాడు కల్నల్ డోడీ. అసలు పేరు దొడ్డమ్మ. వాళ్ళ నాయనమ్మ పేరు కావచ్చు. “ఆహాఁహఁ. పారేయొద్దు. కారీ ఆన్, కారీ ఆన్. గాట్ ఎ లైట్?” తనూ ఒక విల్స్‌ని నోటికి తగిలించాడు. సికింద్రాబాద్ వాడు. ప్యాక్ చేసిన నిలువెత్తు ఆత్మవిశ్వాసంలా.
“ఇంకా ఎన్ని స్లైడ్‌లు? హండ్రెడుంటాయా?” అడిగాడు. చిన్న నవ్వే జవాబైంది. తనూ నవ్వేడు. అంతే చిన్నగా.
ఒక్కటే చివుక్కుమనేది. ఎవరూ లేనప్పుడే తెలుగులో ఒలుకుతుంది కమెరాడరీ. ఉండాల్సింది అలానేగా. ఎంత ఒకే వూరయినా కలిసి సిగరెట్ కాలుస్తున్నా కల్నల్ భుజంమీద చెయ్యేసి కబుర్లు చెప్పనిస్తారా సబార్డినేట్‌ని? సమస్య లేదు.
ఇది కూడా రాయాల్సిందే. మొత్తానికి ఇవాళ మెటీరియల్ బానే తయారయేలా ఉంది. నికోటీన్ మహిమా?
“ఊ ఇంకేంటండీ… ఇంట్లో అంతా బాగున్నరా?”
“బానే ఉన్నారు సర్…”
“మీది ఎక్కడ? విజయవాడనా?” భుజాల మీద రాంక్ బాడ్జ్‌లు తళుక్కుమంటున్నాయి.
“అవును సర్.”
“ఓకే.”
“మీ…”
విసవిసా బ్రీఫింగ్ హాల్ వైపు నడుస్తున్నాడు జీవోసీ. అది చూసి “లెట్స్ గో…” అంటూ మాటనీ సిగరెట్‌నీ తొక్కేసి తనూ విసవిస. కమెరాడరీకి కామా పడింది.
మళ్ళీ బ్రీఫింగ్ లోకి అమరడం. స్లైడ్‌లు. పది మాటల్లో ఒకటి అర్థమౌతుంది. నీకు అర్థం కావడం అవసరమని ఎవరన్నారు?
రాస్తాను దొడ్డమ్మగారూ. అన్నీ. ప్రతిదీ రాస్తాను. మీ గురించి. నా గురించి. జీవోసీ గురించి. ఈ బ్రీఫింగ్ గురించి. కుర్చీల్లో ముళ్ళ కంచెల గురించి. మొహం మీద నవ్వులు పులుముకున్న భేషజాన్ని గురించి.
‘ఎప్పుడు?’
ఇవాళ కాదు.
రేపు. బహుశా.