పుట్టిల్లు

“ఏవండీ, మా పుట్టింటికి తీసుకువెళ్ళరా?” అభ్యర్థన. ఇది ఏ మూడోసారో.

సిగ్గేసింది. ఆరేళ్ళు దాటిపోయిందేమో. ఈ ఉత్తర భారతదేశం వచ్చాక ఉద్యోగంలో పని ఒత్తిడి మరీ ఎక్కువైపోయింది. మొదట అమ్మ అనారోగ్యమని, పిల్లల చదువులని, తర్వాత కరోనా కాలమని ఏదో ఒక అడ్డంకి. ఒక్కర్తీ వెళ్ళడం అలవాటు లేదు, భయం కూడా. బడిలో చదువుతున్నపుడు వెళ్ళిన హైదరాబాద్ విహారయాత్ర తప్ప పెళ్ళయ్యే వరకూ వేరే ఊరు ఎరగదు. అప్పుడు చూసిన చార్మినార్, సాలార్‌జంగ్ మ్యూజియం, బిర్లా మందిర్ గురించి పిల్లలకి ఇప్పటికీ చెబుతూనే ఉంటుంది. ఏదైనా శుభకార్యమా అనుకుంటే తనకా తోబుట్టువులు లేరు. అన్నీ పక్కనబెట్టి ఇద్దరం బయలుదేరాం.

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో దిగి క్యాబ్ తీసుకున్నాం. మూడుగంటల ప్రయాణం.


ఊరు పెద్దగా మారలేదు. సముద్రపు ఒడ్డున ఉండే చిన్న చిన్న ఊళ్ళన్నీ సముద్రం లాగే… పెద్దగా మారవు.

“అదిగోనండి ఆ బడే. మా కాలేజ్ చూశారా? ఇది గడియారం స్తంభం, ఇక్కడో సినిమా హాలుండేది. అందులోనే శంకరాభరణం సినిమా చూశాం. అదిగో ఆంజనేయస్వామి కోవెల. మన పెళ్ళైన కొత్తలో ఆకుపూజ చేయించాం” ఊళ్ళోకి వస్తూనే ఉద్విగ్నత. నా చెయ్యి గట్టిగా పట్టుకుంది.

ఎలానూ మళ్ళీ ఊరంతా నడిపించి అన్నీ చూపిస్తూ విశేషాలు చెబుతుంది. తనువూ మనసూ తూనీగే. చదువుకున్న బడిని సందర్శించినపుడు వాలీబాల్ ఆడుతున్న అమ్మాయిలతో ఒక నిమిషం కలిసిపోతుంది. కళాశాల చూడడానికి వెళితే కొంచెం హుందాతనం వస్తుంది. గుడిని దర్శించినపుడు పెద్దరికం వచ్చేస్తుంది. సముద్రపు ఒడ్డున ఏం ఆలోచిస్తుందో తెలియదు కానీ సముద్రమంత గంభీరంగా ఉంటుంది.

“ఏవండీ ఆ ఇల్లు గుర్తుపట్టారా? ఇంటర్‌లో నాతో చదివింది. మా శ్యామలా వాళ్ళ ఇల్లు. పోయినసారి వెళ్ళాం” ఉత్సాహంగా చెబుతోంది. ‘ఆపమంటారా’ అనడిగాడు డ్రైవర్.

“వాళ్ళు ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయారుగా” అంది నిరాశగా. ఆ క్షణానికి తనకి జీవితంలో పెద్ద లోటు అదే.

“ఊరు చూసి అమ్మగారు చిన్నపిల్ల అయిపోయినట్టున్నారు.”

తనంతే. భావోద్వేగాలు నియంత్రించుకోలేదు. ఏవైనా ప్రకృతి ఉత్పాతాలు, ప్రమాదాలు, కరోనా కాలంలో వలస జీవుల వెతలు, మరణాలు… టీవిలో చూస్తే ఏడ్చేస్తుంది. ఎవరి కష్టాలు చూసినా ఏదో ఆందోళన. పెళ్ళి అప్పటి కన్నా ఇప్పుడు చాలా నయం. మందులేవైనా రాసిస్తారా అనడిగేవాడిని మా డాక్టర్‌ని. మీ ప్రేమే మందు అనేవారాయన. తన గురించి ఆయనకి పూర్తిగా తెలుసు.

“ఇవాళ నాలుగో తారీఖు కదా. ఈ నెల మావాళ్ళకి డబ్బులు పంపారా?” హఠాత్తుగా అడిగింది.

“పంపాను.” డ్రైవర్ నాకేసి ప్రశంసగా చూసాడు.

ఫ్రతినెలా ఒకటో తారీఖు అది మాత్రం మర్చిపోను. తను అడగడమూ మర్చిఫోదు. పెళ్ళినాటి ప్రమాణాల్లో అది ఒకటి. ఇంకా ఉన్నాయి.

జనసమ్మర్దంగా ఉన్నచోట చెయ్యి పట్టుకుని నడవాలి.

తనవాళ్ళని ఎపుడూ తక్కువ చేసి మాట్లాడకూడదు.

మద్యం ముట్టకూడదు.

పిల్లల్ని అస్సలు కొట్టకూడదు.

అవసరంలో ఉన్నవాళ్ళకి మనకి ఉన్నంతలో సాయం చెయ్యాలి.

“పుట్టింటివాళ్ళంటే అందరికీ ప్రేమే సార్. వాళ్ళ కోసం అమ్మగారు బోలెడు వస్తువులు కొన్నట్టున్నారు.” విమానాశ్రయంలో సామాన్లు కార్లో పెట్టడంలో డ్రైవర్ సహాయం చేశాడు. అవును చాలానే కొనింది.

కారు ఆ వీధిలోకి ప్రవేశించగానే, నలభయ్యో పడిలోకి వస్తున్నా ఇంకా ఒక చిన్నపిల్లలా సగం తెరిచిన విండో గ్లాస్ రెండు చేతుల్తో పట్టుకుని ఆత్రంగా బయటకు చూస్తోంది.

“ఇదే ఇదే మా ఇల్లు. ఆపు.” తన గొంతు గద్గదమయింది. కళ్ళ వెంబడి నీళ్ళు. భుజంపై చెయ్యి వేశాను.

విశాల ప్రాంగణం, తన మనసు లాగే. ప్రహరీగోడ మీదుగా నిలబెట్టిన బోర్డ్ చూసి డ్రైవర్ మూగబోయాడు.

శారదామాత అనాథ శరణాలయం.