The song cycle of Shyam

Dear international readers of eemaata magazine:

Recently, I have been listening to the nineteenth century French Composer E. A. Choussan’s song cycle – ‘Poeme de l’amour et de lamer’ (Poem of Love and the sea) streamed from the Salzburg Festival, 2021. I heard it in the voice of Benjamin Bernheim, and in the accompanied piano of Mathieu Pordoy. The lyrics are of a French poet Maurice Bouchar of the same century. I could only appreciate the poetry because of recent English translation by Korin Kormick, kindly made available on the net. At this 2021 festival, the duo Bernheim and Pordoy had also performed (From Jules Massenet’s opera Werther) – the famous beloved aria – Porquoi me reveiller?

It is their music that brought ‘Shyam’s song’ back into my head. Shyam is no Yorkshire Heathcliff, No Derbyshire Darcy, not a German Werther. Nor He is Arabic Majnu, nor Bengali Devdas. He is a twentieth century Telugu guy. If you read my story వానలో ఓ జాణ, you get to know him a bit. At that time (1960s) that young fellow Shyam was writing love letters, and songs. He was singing this Telugu song వాన జల్లువో… and making a wish. It appears his wish came true, for good or bad. Why not read that opening song and the subsequent Love and Life songs. My wish as a chronicler is that, this poetry be performed by Benjamin and Mathieu. Someday! Why only them you may ask! It is just a fancy, Ladies and Gentlemen! Nothing more. Nothing less.

Thank you
Lyla


The song cycle of Shyam

వానజల్లువో! తటిల్లతవో!
రూపెత్తిన గాఢపు నీలపు రాత్రివి నీవో?
మర్మ సుందరీ! మరల రమ్ము!
ఈ పరి జీవన సహచరివై, నా
హృదయమున, ఈ నా రమ్య హర్మ్యమున
సదా వసించగా రమ్ము.

కామినీ
ఏమని కొలుతును నిన్ను!
కలల లోకాల కదిలేటి
సురబాల వీవు
కదలివచ్చేవు ఏలనో
ఇలలోన కాసేపు జతగాను నాకు.

దయితరో!
ఈ ఉదయం, నీ వదనం
నా హృదయంపై
విరియనీ!
అధరాలు భ్రమరాలై
మధువులలో మడియనీ
సుదతీ!
సురత సుఖాలలో
సురిగిపోనీ!
ఆలింగనాగ్నులలో
దయతో
నను దగ్ధమై పోనీ!

రాగిణీ!
పరిణయమాడితి నిన్నని
పదుగురందురు!
ప్రపంచపు రీతి దాటి
ప్రణయ మాడితివి
నాతో నీవని నేనందును

తరుణీ!
రతివో నీవు సరసాలకు
సతివో నీవు సేవలకు
శృతివో నా జీవన గీతికి
సద్గతివో? చరమంబున!
హారతి! నీకె నేనెత్తెద.

అతివా!
నీ యతులితమౌ
శోభన సంపర్కము
సతతము లేక
ఈ జీవిత పయనము
నా కగునా!
నిను వేడెద
ఏకతమున నను వీడకు
భూతలమున
నా తనువున్న దాక.

మగువా!
మన్నించగలవు!
ఈశుడిచ్చిన పెన్నిధి వీవు
ఎన్నొమార్లు
బ్రతుకు జూద మాడి
పన్నిదమును నిను జేసితి.

భామినీ!
అడుగడుగున
బడుగువు నీవని
భ్రమ పడితి నేను;
కర్మ జ్ఞానివి నీవు కాగ
సర్వము పూరంబుచ్చిన
వాడిని నేనైతిని కడకు.

నెలతా!
తరు వోలె శాఖలు
రాల్చుచుంటి; నన్నా
శ్రయించిన పక్షులెల్ల
ఎగిరిపోయె! కూలు మామిడిని
నిలుపు పూల లతిక నీవైతివో.

రమణీ!
నీ మణికంకణ
కరతలము నా
ఫాలమున నున్న వేళ
వ్రణమెక్కడ,
బాధతో రణమెక్కడ?
మరణమన్న భయమెక్కడ!

వనితా!
అల్లితివి నితాంత ప్రణయ
బంధము నా చుట్టు
తెల్లమి! నాశము నాకు
కాని, అల్ల నెప్పుడో ఈశ్వరి
పలికె! మన ప్రేమ – అనశ్వరమని.