వానలో ఓ జాణ

ఎన్నో కొన్నో ఏళ్ళ క్రితం: టాంక్ బండ్ మీద బొమ్మలు లేనప్పుడు, బంజారా హిల్స్ లో బండలే కాని ఇళ్ళు లేనప్పుడు;

ఇండియాలో, హైదరాబాదు నగరంలో సాయం సమయం. అకస్మాత్తుగా ఆకాశంలో కారు మబ్బులు అల్లుకున్నాయి. నగరం ఒక్క సారిగా చీకటై పోయింది. ఉండుండి ఉరుములు. మెరుపులు. మంచి కోలాహలంగా ఉంది పైనంతా. వాన దడ దడా కురుస్తూంది.

శ్రీ నగర్ కాలనీలో ఒక ముచ్చటైన మూడంతస్తుల గులాబీరంగు మేడ ముందు ఒక రిక్షా వచ్చి ఆగింది. పరదాలు వేసి ఉన్నాయి. రిక్షా అతను తడిసి ముద్దయి పోయి ఉన్నాడు. రిక్షా దిగి పరదా తొలిగించాడు. రిక్షా లోంచి ఒక అమ్మాయి దిగింది. వాన ఎంత ఉధృతంగా ఉందంటే పరదా ఏమీ పని చెయ్యలేదు. ఆమె కూడా మొత్తం తడిసిపోయింది.

మేడ పైన కిటికీ కి కొంచెం వెనగ్గా నిలబడి, 555 సిగరెట్ కాలుస్తూ, వాన అందం చూస్తున్నాడు గోపాల్. అక్కడి నుండి కుడివైపుగా ఉన్న కింది బాల్కనీ మీదకు దట్టంగా పాకి వానకు కంపిస్తున్న తెల్ల గులాబీ క్లైంబర్ కనిపిస్తూంది. ఇటు పక్కగా , ఎడమ వైపు, ఇంకా దిగువగా ఉన్న అనాబ్ షాహీ ద్రాక్ష పందిరి, కురిసే వానను అంచుల వెంబడి ధారలుగా వంపటమూ వినిపిస్తున్నది. రెండు తలుపుల ఇనుప గేటుకి పైగా ఉన్న ఆర్చీ మీద అటూ ఇటూ వత్తుగా అల్లుకున్న రంగుల బోగన్ విల్లా వర్షపు చలి గాలికి గజగజ వణకటమూ అతనికి తెలుస్తున్నది. అతని చేతిలో సిగరెట్టు ఎర్రగా, వెచ్చగా వెలుగుతూంది.

ఇంటి గేటు కిరు పక్కలా ఉన్న దీపాల కాంతులలో , గేటు ముందు ఆగిన రిక్షా , అందులోనుండి అమ్మాయి దిగటమూ గమనించాడు గోపాల్. సిగరెట్టు కిందకు విసిరేసి, గబగబా మేడ రెండంతస్థులు దిగి వచ్చాడతను. గోపాల్ ఇంటి తలుపు తీసేసరికి, ఇంటి ముందున్న మెట్ట్లెక్కి వరండాలో నుంచుని ఉన్నారు అమ్మాయీ, రిక్షావాలా, ఇద్దరూ.

తలుపు తీసిన గోపాల్ని చూసి బైట నిలబడిన ఆమె కొంత సంజాయిషీ ఇచ్చుకుంటున్న గొంతులో, “వాన చాలా జోరుగా ఉంది. రిక్షా అతను బాగా తడిసి పోతున్నాడు. నేనే ఇక్కడ కొంచెం సేపు ఆపమన్నాను. ” అంది.

గోపాల్ ఆమె ముఖం ముందాశ్చర్యంగా చూసి, తర్వాత స్నేహంగా నవ్వాడు. ” మంచి పని చేశారు. లోపలికి రండి. వాన తగ్గాక వెళ్ళొచ్చు. ” అని రిక్షా అతనితో

” నువ్వు కూడా లోపలికి రావోయ్ . కొంచెం వేడి కాఫీ అదీ ఏమన్నా తాగుతావా? అన్నాడు.

“లేదు బాబూ. ఈ అమ్మ కోసమే ఆపినా. నేనెళ్ళాల బాబూ. నా డబ్బులిప్పిస్తే నే పోతా.”

ఆమె పర్సు లో నుండి డబ్బులు తీయబోతుంటే గోపాల్ త్వరగా కొన్ని నోట్లు జేబులోనుండి లాగి రిక్షా అతని చేతిలో పెట్టాడు. దీపాల వెలుగులో రిక్షావాలా ముఖం మీద మెరుస్తున్న నీటి చుక్కలతో పాటు అతని ఆనందం కూడా మిలమిల మెరిసింది.

” మీరు లోపలికి రండి . వాన తగ్గాక వెళుదురు గాని,” అని మళ్ళీ అంటూ గుమ్మం లోంచి కొంచెం పక్కకు తప్పుకున్నాడతను.

ఆమె లోనికి వచ్చి అతను తలుపు వేశే లోగా గాలి విసురుకు వాన జల్లులో అతను కూడా కొంత తడిశాడు. లోనికి వచ్చిన ఆమె పరిస్థితి గమనించాడతను. చేతి మీద తెల్ల కోటు వేళ్ళాడుతూంది. ఉంగరాలు తిరిగిన నొక్కుల జుట్టు. కొంత ముఖానికి అతుక్కు పోయి ఉంది. చెంప పక్కగా జడలో పెట్టిన గులాబి సోయగం తగ్గి నీళ్ళు కారుతూ వేళ్ళాడుతూంది. చీర జాకెట్టు, తడిసి ముద్దయి పోయి ఉన్నాయి.

గోపాల్ కళ్ళజోడు తుడుచుకుని మళ్ళీ పెట్టుకుంటూ, ఆమె వంక చూసీ చూడనట్లు చూసి కొంచెం నవ్వుతూ అన్నాడు ” మీరు లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకోవచ్చు. అదిగో, అది నా గది. బీరువాలో మీకు నచ్చిన చొక్కా పైజమా తీసుకు వేసుకోండి. ఈ లోపల నేను మీకు నాయర్ తో కాఫీ చేయిస్తాను.”

ఆమె లోనికి వెళ్ళబోతూ ఆగి ” ఓ! కాఫీ కాదు. టీ చేయిస్తారా. నాకు ఆకలేస్తోంది కూడా. ” అని నోరు కొంచెం సున్నాలా చుట్టింది.

అతనికి ఇంకా నవ్వు వచ్చింది. ‘రాణి! ‘ అని లోపల అనుకుని పైకి ” అలాగే! నిరభ్యంతరంగా!” అని ఈల వేసుకుంటూ లోపలికి వెళ్ళాడు.

ఆమె అతను వెళ్ళిన వేపే కొంచెం సేపు చూసింది. నల్లని సిల్క్ చొక్కా వేసుకున్నాడతను. భుజాలు విశాలంగా అనిపించాయి. చొక్కా తెల్లని పేంట్లో టక్ చేసుకుని ఉన్నాడు. దీపం వెల్తురిలో నల్లని జుట్టులో తెల్ల వెంట్రుకలు అక్కడక్కడా మెరిశాయి. ఇంకా పాతికేళ్ళు గట్టిగా పై బడినట్టు లేదు. ఇతనికి తల అప్పుడే నెరుస్తున్నది . ఆమె పెదాల మీద చిన్న నవ్వు మొలిచింది. కర్టెన్ తొలిగించుకుని ఆమె లోపలికి పోయింది.

ఆ గది ఎంతో విశాలంగా ఉంది. నేల మొజైక్ చేసి ఉంది. మంచానికటూ ఇటూ చక్కని చెక్కడపు బీరువాలున్నాయి. గోడల మీద అందమైన వర్ణ చిత్రాలున్నాయి.

బాత్రూమ్ లోకి వెళ్ళి హాయిగా ముఖం కడుక్కుని మెత్తటి తుండుతో ముఖం వత్తుకుని, గదిలోకి వచ్చింది. బీరువాలు తీసి చూసింది. దొంతర్లుగా ఎన్నో ఇస్త్రీ చేసిన కాటన్, రా సిల్కు చొక్కాలు. మడతలు ఇంకా విప్పని కొత్త పాంట్లు. ఎన్నో నైట్ డ్రెస్సులు. బిన్నీ సిల్కు పంచెలు. ఒక అరనిండా రంగు రంగుల సీసాల్లో సెంట్లు. బ్రిల్ క్రీములు. పౌడర్లు. ఒక్క మనిషి కిన్ని బట్టలా! ఎందుకూ!

ఒక బీరువాలోనుండి ఓ చొక్కా, పైజమా తీసుకుని, బట్టలు మార్చుకుంది. తన తడి బట్టలు ఒక పక్కగా పడవేసి, జుట్టు తడి ఆర్చుకుంటూ, గది సమస్తమూ గమనించింది. రేడియో గ్రాం, దాని మీద అందమైన పాలరాతి బొమ్మలూ, పక్కనే కారు తాళాలు, రోలెక్సు వాచీ, రవ్వల ఉంగరాలు.

ఒక నీలాల ఉంగరం మీద ‘వై’ అని రవ్వలతో పొదిగి ఉంది. ఎవరితను ? ఇతడు కుబేరుడా? కొండలపై నెలకొన్న కోనేటి రాయడా?

పక్కగా నేలమీద ఎన్నో రకాల బూట్లూ, ఫాషన్ చెప్పులూ. అబ్బో! ఆడ వాళ్ళకన్నా షోగ్గా ఉందే ఇతని వ్యవహారం. జడ తిన్నగా అల్లుకొని హాల్లోకి వచ్చిందామె.

హాల్లో ఒక పెద్ద గాజు కిటికీ పక్కన వెడల్పాటి పాలరాతి గట్టు ఉంది. దాని మీద చక్కని వెల్వెట్ మెత్త. అటూ ఇటూ గోడ కానించిన కుచ్చుల దిళ్ళు. పక్కనున్న గోడల మీద రంగుల గాజు కుప్పెల షేండెలీర్లు. బైట తోటలో వెలిగే దీపాలు వర్షపు ధారలను స్పష్టం చేస్తున్నాయి. మెరుపులు అప్పుడప్పుడూ మెరిసి మాయ మవుతున్నయ్. కిటికీ బైట పక్కన , లోపలున్న పాలరాతి గట్టు అంత పొడుగునా ఆనుకుని ఉన్న పెద్ద సిమెంటు కుండీలో నిండుగా ఉన్న నాజూకు యాస్పరేగస్ మెరుపు వెలుగులో మాత్రం కనిపించి మళ్ళీ చుట్టూ నలుపు లో కలిసిపోతోంది.

ఆమె రావడం చూసి గోపాల్ గట్టు మీద నుండి లేచి వచ్చాడు.

తన తెల్ల సిల్కు చొక్కా ఆమె వంటి మీద ఎంతో మెత్తగా ఉన్నట్లనిపించిందతనికి. చేతులు పొడవైతే మడిచి పైకి పెట్టింది. ఒక చెతికి సన్నని బంగారు గాజులు. ఇంకో చేతికి సుతారమైన వాచీ. తెల్ల పైజమా కాళ్ళకు అడ్డం పడకుండా చక్కగా పైకి మడిచి పెట్టుకుంది. ఆ సీలమండలు! అవి ఎంత అందంగా ఉన్నాయి. పాదాల అందం గురించి ఉర్దూ కవులు చెపితే విన్నాం. కాళ్ళ అందం ఇంగ్లీషు కవులు చెపితే విన్నాం. యాహూ! ఏంకిల్స్ ఇంత అందంగా ఉంటాయా!

” రండి. ఇక్కడ కూర్చుందాం. ఈ బల్ల వద్ద. ” ఒక గుండ్రని రోజ్ వుడ్ బల్ల వద్దకు నడిచాడతడు. ” ఈ సేండ్విచెస్ , ఈ జీడిపప్పు పకోడీ , సన్న కారప్పూస , మసాలా టీ -సరిపోతాయా లేక ఇంకేమన్నా కావాలా? సికిందరాబాద్ క్లబ్ లో సేండ్విచెస్ బాగా చేస్తారు. మా నాయర్ స్పెషల్ జీడిపప్పు పకోడీ. అవి తప్పక ట్రై చెయ్యండి. ”

” మీరు కూడా తీసుకోండి.” హాయిగా తింటూ, అతని ఇంట్లో అతన్నే మర్యాద చేసిందామె.

” ఛెస్ గేమ్ మధ్యలో ఉన్నట్లున్నారు?” బల్ల మీద ఒక పక్కగా ఉన్న చదరంగపు బల్ల కేసి చూస్తూ అందామె.

” ఊరికే , ఈ రోజు పేపర్లో ఇచ్చిన ఛెస్ ఆట చూస్తున్నాను. ”

“ఈ ఆట ఇష్టమా?”

” పేకాట అంత కాదు. ” అన్నాడతను నవ్వుతూ.

“ఓ! దానికన్నా ఇంకా ఇష్టమైనవి? ”

” గుర్రప్పందాలు. ”

“బాగుంది.” నవ్విందామె. నవ్వినప్పుడామె బుగ్గల్లో లోతుగా రెండు సుడులు. గడ్డం కింద సొట్టకు తోడయ్యి మూడయ్యాయి. గోడ దీపాల వెలుగులో ఆమె కళ్ళు తళ తళ మెరిశాయి.

” కొంచెంసేపు ఆడదామా?” అడిగింది.

“అలాగే.”

ఒక్కసారి మా అన్నయ్యకు ఫోన్ చేసి వస్తాను. వచ్చి నన్ను తీసుకెళ్ళమని ”

ఎందుకతన్ని శ్రమ పెట్టటం? వాన తగ్గాక నేను నా కారులో మిమ్మల్ని ఇంటిదగ్గర దింపుతాను కదా.”

” మా అన్నయ్యకు నన్ను తీసుకు వెళ్ళటంలో శ్రమ ఏమి ఉంది. భలేవారు!” నవ్వుతూ జుట్టు సవరించుకుందామె. చేతి గాజులు సన్నని సవ్వడి చేస్తూ మిలమిల మెరిశాయి. పక్కగా ఉన్న ఫోన్ ఎత్తి మాట్లాడి తనెక్కడ ఉందో, ఎందుకు ఉందో, తనకేం కావాలో చెప్పి పెట్టేసిందామె.

” కారు బైటికి వెళ్ళిందట. వీలైనంత తొందరలో మా అన్నయ్య వస్తాడు. ”

” ఊహు. ఆడండి మరి. ముందు ఎత్తు మీదే . ” సరిగా సర్దిన ఛెస్ బల్లను తెలుపు పావులు ఆమె పక్కకు తిప్పుతూ అన్నాడు.

రాజు ముందు బంటును రెండు గళ్ళు ముందుకు జరిపిందామె. నల్ల రాజు శకటు ముందున్న బంటును రెండు గళ్ళు ముందుకు తోశాడతను. ఆమె రాజు శకటుని రాజు బంటు స్థానం లోకి తెచ్చింది. అతడు రాజు గుర్రం ముందు బంటుని ఒక గడి ముందుకు జరిపాడు.

” ఏ మెడికల్ కాలేజీ మీరు. గాంధీనా? ఉస్మానియానా?”

“ఉస్మానియా.”

” ముల్కీ విద్యార్ధులా? లేక వరంగల్లో డొనేషన్ కట్టి చేరి మెల్లిగా హైదరాబాదుకు మార్పించుకున్నవారా?

చురుగ్గా చూసిందామె. ” రెండూ కాదు. మా నాన్నగారి ఉద్యోగం ఈ ఊరికి బదిలీ అయ్యింది. మా కుటుంబం ఈ ఊరికి మారుతూ, నన్నూ కాలేజీ మార్పించారు.”

ఆమె రాజును కేజిల్ చేసి, వెనక్కు జేరగిల బడి చిన్న త్రిభుజాల్లాంటి సేండ్విచ్లు తింటూ చుట్టూ చూస్తూ ఇంటి అందచందాలు గమనిస్తూంది. ఓ! చాలా చాలా బాగుంది. వక్త్ సినిమాలో సాధన ఇంటి కన్నా బాగుందీ ఈ ఇంటి ప్లాన్. ఎంత చక్కని గదులు. ఎంత చక్కని టెర్రెస్స్డ్ గార్డెన్స్! ద్రాక్ష ట్రెల్లిస్ , క్లైంబింగ్ రోజెస్. కాగితప్పూల క్రీపర్లూ అనుకుంది మనసులో.

‘కౌన్ ఆయా కి నిగాహోం కి చమక్ జాగ్ ఉఠీ’ అని అదే సమయంలో అతడూ అనుకున్నాడు.

ఎత్తులు బాగానే వేస్తున్నది డాక్టర్ పిల్ల! అని లోలోపల మురుసుకున్నాడు. పావులు కదుపుతూ ఆమె అంద చందాలు గమనిస్తున్నాడతను. ఒక ఇరవయ్యేళ్ళుంటాయేమో ఆమెకి. అవతలి వ్యక్తి తనను గమనిస్తున్నాడని తెలిసీ, తొణుకూ బెణుకూ లేకుండా ఉందామె. ఎంతో మందితో మసలి, అందరూ తనని ఆదర భావంతో చూడటం అలవాటైన మనిషిలా దర్జాగా, ఠీవిగా ఉన్నదామె. చంద్రుడికి వెన్నెల ఎంత మామూలు విషయమో, అందంగా ఉండటం ఆమెకు అంత సహజ విషయంగా ఉంది.

తన బంటుతో ఆమె శకటుని తీస్తూ , ” మీకు మెడికల్ కాలేజీలో చదువుతో కుస్తీలు , కష్టాలు చాలా ఉంటాయి కదా. ఈ ఆటలు నేర్చుకోడానికి మీకు టైమెక్కడిది.?” అని ఆడిగాడు గోపాల్.

” మంచివారే! ఆ కష్టాలు తట్టుకోడానికే ఆటలు ఆడాలి. పాటలు పాడాలి.”

” పాటలు కూడానా. వైద్యమెప్పుడు చేస్తారు గానా బజానాలు చేస్తే? ”

” ఇంకా డాక్టరు అవ్వలేదు కదండి. అప్పుడే కట్టిపెట్టమంటారా? ఆటలూ, పాటలూ? ”

” ఓహో! పెళ్ళి అయ్యాక తగ్గిస్తారు కాబోలు!”

ఆమె ముఖం ఎర్రబారింది. . చిరు రోషంతో రోజిందామె. కోపమొచ్చినప్పుడు ఆమె పల్చని ముక్కు పుటాలు అదరటం ఆనందంగా గమనించాడతడు.
” అలాటి వేవీ నాకు కుదరవు. మీ పెళ్ళైతే మీ సరదాలు మానుకుంటారా? ”

” లేదు. నా శ్రీమతిని కూడా రేసులకు వెంటేసుకుని పోతాను. ఆమె చెప్పిన గుర్రాల మీదే పందాలు కడతాను. నిజం. అబద్ధమేం లేదు. ” అతని చక్కని తీరైన పలువరస మెరిసింది. నవ్వినపుడు మనసారా నవ్వడం, అతని ముఖమంతా ఒక వెలుగుతో నిండటం ఆమె విచిత్రంగా చూసింది.

” మీదే ఎత్తు. ఐదు నిమిషాలయ్యింది నా ఎత్తు ముగిసి.”

“మరిచాను మాటల్లో పడి అంటూ ” మంత్రిని రాజు వైపు శకటుకి వెనుకగా వరసలోకి తెచ్చాడతను. వాన తగ్గుముఖం పట్టటం గమనించాడు గోపాల్. అతని ముఖం కొంచెం వాడింది. వాళ్ళ అన్నయ్య వచ్చెయ్యడానికి ఏమి ఆటంకం ఇంకా. అయ్యో! ఈ నాజూకు సుందరి. ఈ ‘వానలో పిల్ల’ వెళ్ళిపోతుంది కాబోలు. ఏమిటి దారి?

ఎత్తులు నడుస్తున్నాయి. బోర్డ్ మీద పావులు తగ్గిపోతున్నాయి.

ఆమె తన గుర్రాన్ని కదిల్చి అతని రాజుకి ‘చెక్’ అంది. రాజును అలాగ్గా ముందుకు తోశాడతను. విచిత్రంగా, ఎందుకో ఆమె అతన్ని ప్రశ్నలు వేయడం మొదలు పెట్టింది. .

” మీకింకా పెళ్ళి కాలేదన్నమాట?”

” లేదు ”

“చేసుకోరా?”

” అయ్యో! నన్ను చూస్తే నేను పెళ్ళి చేసుకునే రకం కాదని మీకు అనుమానమొచ్చినట్లుంది. ఎందుకు చేసుకోను. నాకు పెళ్ళి ప్రయత్నాలు జరుగుతున్నాయి.” కొన్నిసార్లు వాళ్ళ సంభాషణ వాళ్ళకు తెలియకుండానే ఇంగ్లీషు లోకి జారిపోతున్నది.

” అమ్మా నాన్నా చెప్పిన పిల్లనే చేసుకుంటారు బహుశా. ”

” తప్పకుండా. వాళ్ళతో తగువెందుకు. ”

” ఆస్థి పోతుందని భయం కాబోలు. మీ ఇష్టాఇష్టాలు లేవా? ”

“ఎందుకు లేవు? వాళ్ళకు నచ్చిన పిల్ల నాకు నచ్చకూడదా ఏమిటి?

” పిల్లను చూసి చేసుకుంటారా? చూడకుండానే చేసుకుంటారా?”

అబ్బో! మీకు డాక్టరునని కొంచెం గర్వం ఉన్నట్లుంది. మీరొక్కరే స్వతంత్ర భావాలు కలవాళ్ళని అనుకుంటున్నారు కాబోలు. నేను చేసుకోబోయే అమ్మాయి కూడా మీలా చదువుకుంటున్న వ్యక్తే. నేను మా వాళ్ళకు తల వంచినా, ఆమె నన్ను చూడకుండా, ఇష్ట పడకుండా నన్నెందుకు చేసుకుంటుంది చెప్పండి.”

” సారీ! ” కొంచెం తగ్గిందామె.

” సారీ ఎందుకు. మీరు మాత్రం డాక్టర్నే పెళ్ళాడతారు. వేరే వాళ్ళు మీకు ఇష్టముండక పోవచ్చు, బహుశా.” అన్నాడు ఆఖరి మాట మీద నొక్కుతూ.

కొంచెం ఆలోచిస్తున్నట్లు ముఖం పెట్టిందామె. ” మనిషిని ప్రేమిస్తాము కాని మనిషి వృత్తిని ప్రేమించము కదా? ” అంది.

” అర్ధం లేని ఆలోచన. వృత్తి కూడ మనిషిలో భాగమే. వృత్తీ, అందం, చదువూ, ఆస్థీ, ఇంకా చెప్పాలంటే మనిషి కుటుంబం -ఇవన్నీ మనిషిలో భాగాలే. వీటిలో ఏది నచ్చక పోయినా ఇబ్బందులు రావచ్చు.

మీ సంగతే చూడండి. రోజూ హాస్పిటల్ కి పోవాల్సిందేగా మీరు. మా తాతగారికి ప్రాస్టేట్ ఉబ్బితే ఆ ఉస్మానియా ఆస్పత్రిలో ఆపరేషన్ చేశారు. ఒక వారం ఆయన్ను చూస్తానికి రోజూ వెడితే, ఆ వార్డ్ లో కంపు భరించలేక చచ్చిన చావయ్యింది. యమ లోకం! ” అన్నాడతను.

ఆమె పగలబడి నవ్వుతున్నది. “ప్రాస్టేట్ ఉబ్బటం ఏమిటి. ఆ గ్లాండ్ పెరిగితే నీరుడు సరిగ్గా పడక, బ్లాడర్ ఉబ్బుతుంది గాని. ”

” ఐతే మీరు డాక్టర్ని చేసుకునే పనే లేదు? ” అంది నవ్వాపుకుని.

” డబ్బూ డుబ్బూ లేని వాళ్ళకి డాక్టర్ పెళ్ళాలు కాని నాకెందుకు? ఏదో చన్నీళ్ళకు వేణ్ణీళ్ళుగా వాళ్ళూ ఇంత సంపాదించి పెడతారని కొందరు చేసుకుంటారు. నాకెందుకండీ డాక్టరు. సుఖంగా తింటానికుంది. ఉంటానికుంది. నేనెప్పుడైనా మైసూరు బృందావన్ గార్డెన్స్ , నందీ హిల్సో చూడాలంటే , బాంగుళూర్, ఊటీకో పోయి , రేసులాడుకోవాలంటే నా భార్య హాస్పిటల్లో రోజూ వేరే వాళ్ళ పుళ్ళు కడుగుతూ, నాతో ఎక్కడికీ రాలేక పోతే నాకేమి సుఖం? ”

” మీరు చెప్పేది సబబు గానే ఉంది, మీవైపు నుంచి చూస్తే. నాకు పెళ్ళి కాదేమో అని భయం ప్రవేశ పెట్టారే” అంది.

అనేసి మళ్ళి ఆలోచించింది. ” మీరు చెప్పింది నిజమే. పుస్తకాల్లో మనిషిని ప్రేమించాలి. గుణాన్ని ప్రేమించాలి. డబ్బును కాదు. కులాన్ని కాదు. మతాన్ని కాదు. అని ఏమేమో రాస్తారు. అన్నీ కలిస్తేనే కదా మనిషి. ”

“మరే! ఇన్ని మతలబులుంటే ఎవరిని పెళ్ళాడాలో మనకు ఖచ్చితంగా ఎలా తెలుస్తుంది. మీకు తెలిసినప్పుడు కొద్దిగా నాక్కూడా సలహా ఇవ్వండి ” నవ్వుతూ చెప్పాడతను.

” ఎవరిని పెళ్ళాడాలో తెలియటం కష్టం కాని నచ్చని మనిషి అని గట్టిగా తెలిసినప్పుడు ఎలిమినేషన్ సులువు.” అందామె.

” సరి సరి. బాగుంది. మీకు గట్టిగా ఒక మనిషి నచ్చడం అనే మాట ఉండదన్న మాట.”

” ఊళ్ళో ఇంతమంది మనుషులు తెలిసినపుడు ఒకే మనిషి ఎలా నచ్చుతారు చెప్పండి. లేత లేత కోతలు కాకపోతే. చాలా మంది మనకు ఆకర్షణీయంగా ఉండొచ్చు. ఐనా, ఒక మనిషినే కదా! పెళ్ళి చేసుకోగలం. పెళ్ళి విషయంలో కొంతే మన ఛాయిస్. కొంత ఛాన్స్.”

“ఓ! మీరు కూడా జూదగాళ్ళా! పేకాట అవీ ఆడతారేమిటి?

” ఏం ఆడ కూడదా?”

“ఎందుకు ఆడకూడదు. దివ్యంగా ఆడొచ్చు.”

ఆమె మాట మార్చి, ” ఆటల సంగతికేం గాని ఇందాక మీ గదిలోకి వెళ్ళినప్పుడు ఒక్క పుస్తకం అంటే ఒక్కటి లేదేంటి? నాకైతే మంచం మీద , పక్కనా, కిందా ఎప్పుడూ ఏవో పుస్తకాలుంటాయ్. ”

గోపాల్ ” అసలు ఎవరైనా పుస్తకాలు ఎందుకు చదువుతారో నాకు అర్ధం కాదు. నేను శుభ్రంగా చుట్టూ ఉన్న మనుషులతో మాట్లాడతా. అన్ని ఊళ్ళూ తిరిగి చూస్తాను. మా ఊరు పోయినప్పుడు అక్కడ మా వ్యవసాయం , గొడ్దూ గోదా సంగతి చూస్తాను. మా తోటల్లో చెట్ట్లూ , పువ్వులు చూస్తాను. తోటపని చేస్తాను.

ఈ పుస్తకాల పురుగులున్నారే, వాళ్ళు అసలు పూలు చూడకుండా, పువ్వుల మీద పొయెట్రీ చదువుతారు. రైల్లో, బస్సులో ఎప్పుడు చూడండీ తలకాయ బుక్ లో దూర్చేస్తారు. కిటికీ లోంచి బైటి క్కూడా చూడరు. ఏముంటుంది. ఆ చెత్తా ఈ చెత్తా చదవటం అన్నీ బుర్రలోకి ఎక్కించుకోడం. ఒక్క సొంత ఆలోచన ఉండదు. తలకాయ లేని వాళ్ళు చదవాల్సిందే పుస్తకాలు.”

ఆమెకు బుస్సున కోపం వచ్చింది. పక్కనే బల్లమీద పడిఉన్న శకటుని అతని మీదకు విసిరి కొట్టింది. అది పోయి అతని నుదుటి మీద కొట్టుకుంది. ఇద్దరూ నిర్ఘాంత పోయారు.

ఆమె తొందరగా లేచివచ్చి అతని నుదురు పరీక్షగా చూడబోయింది.

అతను చెయ్యి తోసేస్తూ, ” వద్దు. వద్దు. ఇప్పుడు ఆ కంకుభట్టు-సైరంధ్రి సీనూ వద్దు, మీ వైద్యమూ- ఉపచారమూ వద్దు. ఇంకా నయం కన్ను పోలేదు. ఏదో వాన నుంచి రక్షణకు వచ్చారు. కాసేపు కూర్చుని వెళ్ళండంటే నా ఇంటికి వచ్చి నన్నే కొడుతున్నారే? ” అన్నాడు నుదురు పట్టుకుని.

ఆమెకు చాలా దిగులు వేసింది. మితిమీరిన తన తొందరపాటు ప్రవర్తన చూసి. ఎంత పొరపాటు.

” నేను మళ్ళీ మా ఇంటికి ఫోన్ చేసి ఆలస్యం చెయ్యకుండా వెంటనే మా వాళ్ళని రమ్మంటా.” అని గిరుక్కున తిరిగి ఫోన్ దగ్గరకు వెళ్ళబోయింది.

గోపాల్ ” ఏం అవసరం లేదు. ఇప్పుడేం ప్రమాదం జరిగిందని” అంటూ వెళ్ళే ఆమె చెయ్యి పట్టుకుని గుంజాడు. ఆమె చేతి గాజులు జారి అతని చేతిలోకి వచ్చాయి.

ఆమె గిర్రున వెనక్కి తిరిగి, అతన్ని మిర్రున చూసింది.

” సారీ . సారీ. ఈ సిమిలర్ సీన్ కూడా ఎప్పుడో చదివాను. ఆ. గుర్తొచ్చింది. కర్ణుడు, భానుమతి మనలాగానే చదరంగం ఆడుతుంటారు. దుర్యోధనుడు గది లోపలికి వస్తే భానుమతీ దేవి గబుక్కున లేస్తుంది. ఆట ధ్యాసలో ఆమె తన మిత్రుని భార్య, పైగా రారాజు భార్య అనీ, మరిచిపోయి ఆమె పమిట పట్టి గుంజుతాడు, కర్ణుడు.

ఆ రాలే ముత్యాలు, రత్నాలు చూసి, అప్పుడు స్పృహలో పడిన కర్ణుడు, తన దోస్త్ ను చూసి ఖంగు తింటాడు. దుర్యోధనుడు చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు ఈ వ్యవహారమంతా.

ఆడండి మేడమ్, చదరంగం బల్ల పిలుస్తూంది. కూర్చోండి ” అన్నాడు నవ్వుతూ.

ఆమె ఆ నవ్వు చూసి స్థిమిత పడి వెళ్ళి కూర్చుంది తన వెనుకటి స్థానంలో.

“ఇవిగో మీ గాజులు. వేసుకోండి. బాప్ లాల్ లో చేయించినట్టున్నారు. బాగున్నాయ్. మీకు పావులూ, పాచికలూ విసిరే అలవాటేనా? సత్యభామలా కాలు జాడించే అలవాటు కూడా ఉందా? ”

“మరి ఏం పుస్తకాలు చదవనన్నారూ?” మళ్ళీ మూతి ముడిచింది.

“మళ్ళీ మొదలా? ఇది యుద్ధరంగమా? చదరంగమా? ఆట ఆడండి మడామ్! ”

ఆమె ఆట మీదకి దృష్టి మళ్ళించింది.

ఇంతలో ఫోన్ మోగింది. గోపాల్ లేచి వెళ్ళి ఫోన్ ఎత్తాడు. అవతలి వైపు నుండి ” ఏం చేస్తున్నరు సార్?” అనటం బైటకే వినిపించింది.

“ఏం కేశవరావ్? ఏంటి ఇవ్వాళ పేపర్లో ఏం వేస్తున్నారు. తెలంగాణా బంద్ గురించి.”

అవతలి నుండి తెలంగాణా తెలుగులో చక చకా మాటలు వినిపించాయి.

“ఫెర్నాండెజ్ సెలవు ఎన్నాళ్ళు? నీకు పని ఎక్కువ పడింది ఈ మధ్య నాకు తెలుసు. అడ్వర్ టైస్ మెంట్లు, కలెక్షన్లు ఎలా ఉన్నాయ్ ఈ వారం?”

అవతలి వైపు సంభాషణ కొంచెంసేపు విని, ” చీఫ్ మినిస్టర్ ఆఫీసు నుండి ఫోన్ వచ్చిందా లేదా, కేశవరావ్? ఆయన సరేనంటే గాని నువ్విప్పుడు చెప్పిన ఆ న్యూస్ పేపర్లో వెయ్యకోయ్. ” అని చెప్పి పెట్టేశాడు గోపాల్.

“సారీ! ఎక్కడున్నాం. మీ ఎత్తు కొంచెం చిక్కుల్లో పెట్టబోతున్నట్టుంది . కొంచెం సరిగ్గా చూసుకోనివ్వండి. ” అతను ఏనుగును, రాజుకు ఆసరాగా వేశాడు. “తెలంగాణా ఏజిటేషన్ ముదిరేట్లుంది డాక్టరు గారు. మీ కాలేజీలు మూత పడొచ్చు.”

” ఓ గాడ్! మా వాళ్ళు నాకు చేశే ఉపకారాలన్నీ ఇలాగే ఉంటాయండీ. నే మొత్తుకున్నా, నన్ను మధ్యలో కాలేజీ మార్చొద్దనీ ” అని అతనికి ఫిర్యాదుగా చెప్పింది.

” మీ పెళ్ళి విషయంలో మాత్రం వాళ్ళ మాట వినకండి అయితే. మీ ఇష్ట ప్రకారమే జరగాలని నేను ఆశిస్తున్నా” అన్నాడతను ఎంతో మర్యాదగా, మనస్ఫూర్తిగా. “చదువుకన్నా పెళ్ళి ఎక్కువ కాంప్లికేటెడ్ కాదాండి. కాలేజీ కావాలంటే మళ్ళీ మళ్ళీ మారొచ్చు. ”

ఆమెకు కొన్ని గంటల క్రితం ఏమాత్రం ఎరగని తనను గురించి అతని ఆందోళన చూసి నవ్వొచ్చింది. “ఉండండి. మీరన్నట్లు ఇప్పుడొచ్చిన ప్రమాదమేం లేదు. ముందు ఈ ఆట సంగతి చూడనివ్వండి.” అంది. రెండెత్తుల తర్వాత ‘తోసి రాజు’ చెప్పనూ చెప్పింది. .

“అయ్యయ్యో! మళ్ళీ దెబ్బ కొట్టారు. ఆటలో మీ చేతిలో ఓడి పోవలిసిందేనా. తప్పదా.” అన్నాడతను నవ్వుతూ.

ఇంతలో పెద్దగా కారు హారన్, సడెన్ బ్రేకులు కొట్టి స్క్రీచ్ మంటూ కారు ఆగిన శబ్దం వినపడింది. కాలింగ్ బెల్లు మోగింది. గోపాల్ లేచి వెళ్ళి తలుపు తీశాడు. లోపలికి హడావిడిగా వచ్చాడొక యువకుడు. గొడుగునూ, రెయిన్ కోటును, తలను, వరసగా విదిలించి గొడుగు మూసి గోడ పక్కన పెట్టి, గోపాల్ వెనకే హాల్లోకి వచ్చాడతను. మంచి ఉషారుగా ఉన్నాడు. గోపాల్ వంక చురుగ్గా పైకీ కిందకీ చూసి, తల ఎగరేసి, కాస్త నవ్వాడతను. పోలికలు చూస్తే, ఆగంతుకురాలి గారి అన్నగారు వీరని సులువుగా చెప్పవచ్చు.

“ఏమి వర్షం. ఏమి వర్షం. సారీ. ఇంతకన్న ముందు రాలేక పోయాను. ” అన్నాడా యువకుడు.

“ఏం ఫర్వాలేదు. కొంచెం ఫలహారం .., కాఫీ, టీ…”

“లేదు. లేదు. మరో సారి తప్పకుండా. మా నాన్నగారు ఇంట్లో ఈమె కోసమే ఎదురు చూస్తున్నారు. ఇంకా ఆయన భోజనం కాలేదు. ఛెస్ ఆట నడిచినట్టుంది. మా చెల్లి ఓడిపోయి ఉండాలి? అలా జరిగితే ఇవ్వాళ మా ఇంట్లో తలుపులు మోత మోగి పోతాయ్. ఈమెగారు ఓటమి తట్టుకోలేదు.” అన్నాడతను.

ఆమె రోషంతో “బోర్డ్ కేసి కొంచెం చూడు సోదరా! చూసినా అర్ధం ఐతే గదా. నేనే గెలిచాను.” అంది.

“నమస్కారం. మీ తెలివి తేటలు మాకు తెలిసినవే. ఐనా తమరు ఆడింది ఒక ఛెస్ చాంపియన్తో అని తమకు తెలిస్తే మంచిది.” చెల్లెలి వంక తిరిగి నమస్కారం చేస్తూ హాస్యంగా అన్నాడతను. పక్కనే బల్ల మీద ఉన్న ‘డెయిలీ న్యూస్’ అన్న పేపర్ తీసి , స్పోర్ట్స్ కాలంలో ఆ రోజు ఛెస్ పజిల్ కింద ‘వై. ఎస్ . గోపాల్’ అన్న పేరు చూపించి:

“మీ ఆడపిల్లలు స్పోర్ట్స్ సెక్షన్ చూస్తే గదా! సినిమాల గురించి , మార్నింగ్ షోల ఇన్ఫర్మేషన్ కోసమే ఈ పేపర్ మీరు కొంటారని హైదరాబాదులో అందరికీ తెలుసు. ఇదిగో ఈ పేపర్ పబ్లిషర్ క్కూడా, ” అని గోపాల్ కేసి వేలు చూపించాడు. “ఆయన కావాలని నిన్ను గెలిపించి ఉంటాడు. హి ఈజ్ ఎ స్పోర్టివ్ గై”

గోపాల్ గట్టిగా నవ్వాడు. ” అలాటి దేమీ లేదు. మీ చెల్లాయి నిజంగానే నన్ను ఓడగొట్టింది. ఫెయిర్ అండ్ స్క్వేర్ ” అన్నాడు నుదురు రుద్దుకుంటూ ఆమె కేసి చూస్తూ.

“ష్యూర్. షూర్. మరి మేము వెళ్ళొస్తాం.” అన్నాడన్నగారు.

ఆమె గోపాల్ తో “మీ బట్టలు…?” అని ప్రశ్నార్ధకంగా చూసింది.

“మళ్ళీ ఏం మార్చుకుంటారు. బట్టలదేముంది. ఉండనీయండి ”

ఆమె లోపలికి పోయి తన తడిబట్టలు తెల్లకోట్లో ఉండచుట్టి తెచ్చి అన్న చేతిలోని సంచిలోకి జార్చింది..

వెళ్ళి, గోపాల్ కి ఎదురుగా నిటారుగా నిదానంగా నిలబడింది. సూటిగా అతని కేసి చూస్తూ, చటుక్కున చెయ్యి చాపి కలకంఠంతో “మనం తప్పక మళ్ళీ కలుద్దాం, శ్యామ్! ” అంది.

గోపాల్ ఒక్క క్షణం నిర్ఘాంత పోయి, అంతలోనే సర్దుకొని ఆమె చేతిలో చేయి కలిపి, మరో చెయ్యి కూడా ఆమె చెయ్యి మీద మోపాడు.

ఆమె అన్న ఈ పాణిగ్రహణం సీన్ చూసీ, చూడనట్లుగా నటించి, తన రెయిన్ కోటు చెల్లెలికి కప్పుతూ “మీరు మా కోసం బైటికి రావద్దు. చలిగా ఉంది బైట. వెళ్ళొస్తాం ” అన్నాడు గోపాల్ తో.

వెళుతూ వెనక్కి తిరిగి నవ్వుతూ, “నన్ను గుర్తించారో లేదో , నేను లక్ష్మణరావు గారబ్బాయిని. మేము మాచవరంలో ఉన్నప్పుడు మీ నాన్నగారు, మా నాన్నగారిని కలవడానికి మా ఇంటికి తరుచూ వచ్చేవారు. వాళ్ళిద్దరికీ మంచి స్నేహం. ” అన్నాడు.

గోపాల్ “తెలుసు. తెలుసు. మిమ్మల్ని చూడగానే గుర్తు పట్టాను. ” అన్నాడు.

గుడ్ నైట్ లు చెప్పి అన్నాచెల్లెళ్ళిద్దరూ వెళ్ళి పోయారు.

గోపాల్ తలుపు వేసికొని, లోనికి వేళ్ళి కిటికీ లోంచి వారి కారు కనుమరుగవటం చూశాడు.

అతని చెయ్యి చాతీమీద ఎడమ పక్కకు వెళ్ళింది. ఖాళీగా అనిపించింది. కాసేపు రుద్దుకున్నాడు. అతని గుండెలో తియ్యని బాధ రేగింది. ముఖం పొంగారింది. వళ్ళంతా ఉప్పొంగింది.

ఈ రాత్రీ , ఈ వానా, ఈ జూకామల్లి లాటి నాజూకు సుందరి. ఊహించని ఈ విచిత్ర ప్రధమ సమాగమం. ఎంత ఆనందం! ఏమి అదృష్టం! అనుకున్నాడు.

అతడికి తెలుసు, వారిద్దరికీ పెళ్ళి మాటలు జరుగుతున్న విషయం. ఆమెకూ? తెలుసు. ఐతే నిజంగా వానలో చిక్కడి తన ఇంటి దగ్గర ఆగిందా? లేక తనను తనిఖీ చెయ్యడానికి వాన మిషతో?? ఏమో! తన గదిలోకి వెళ్ళి పక్క మీద వాలి మనసులో ఇలా పాట రచించుకొని లోగొంతులో పాడుకున్నాడు గోపాల్.

వానజల్లువో, తటిల్లతవో
రూపెత్తిన గాఢపు
నీలపు రాత్రివే నీవో?
మర్మ సుందరీ!
మరల రమ్ము! ఈ పరి
జీవన సహచరివై, నా
హృదయమున, ఈ నా
రమ్య హర్మ్యమున
సదా వసించగా రమ్ము.

గులాబీమేడలో గోపాల్ ఆగంతుకురాలి కోపాన్ని, తెలివిని, అందాన్ని అన్నిటినీ కలబోసి తలపోస్తూనే ఉన్నాడు. మేడ బయట వాన మెత్తగా మెల్లగా జల్లుగా కురుస్తూనే ఉంది.