కళ–మనిషి

సమాజాన్నో, మనిషినో సరళం చేయడానికి కళ ఒక సాధనంగా ఉపకరిస్తుందని అనుకుంటాంగానీ, మళ్ళీ అదే కళ జీవితాన్ని సంక్లిష్టం చేస్తోంది. కళ అనేదాన్లో రెండు దశలున్నట్టున్నాయి. మొదటిది, ఒక ఘర్షణలోంచి, ఒక గుంజాటనలోంచి తనను తాను స్పష్టపరుచుకోవడం, ఆ క్రమంలో ఒక యోగిత్వాన్ని సాధించడం ద్వారా ఆ కళాకారుడి నుంచి కళ పలుకుతుంది. కానీ ఆ కళ అనేది సాక్షాత్కారమైనాక తన ఉనికికి ఒక ప్రత్యేకత ఉందన్న అనుకోలూ, దానికి తగిన గుర్తింపు ఈ సమాజం నుంచి తీసుకోవాలన్న డిమాండూ ఆ కళాకారుడిలో మొదలవుతాయి. అంటే ఏ కళైతే మనిషిని తేలికపరుస్తుందనుకుంటామో అదే మళ్ళీ నెత్తిన బరువు కూడా మోపుతోంది. ఏ నీటివల్లయితే బురద అవుతున్నదో అదే నీటివల్ల అది శుభ్రమూ అవుతుందన్నాడు వేమన్న. దీనికి విరుద్ధంగా ఏ కళ అయితే శుభ్రం చేస్తుందనుకుంటున్నామో అదే కళ ఆ కళాకారుడిని మురికిలోకి కూడా జారుస్తోంది. మరి దీనికి ఉన్న మార్గం ఏమిటి? నిర్మమకారంగా మనకు వచ్చింది చేయడం, ఆ చేసిందానితో మనల్ని డిటాచ్‌ చేసుకోవడం. చెప్పడానికి ఇది బాగుంది. నిర్మమకారంగా చేయడం అనే మాట చెప్పినవాడు చాలా గొప్పవాడు. కానీ ఆ మాట చెప్పిన తర్వాత, ఆ చెప్పినది ప్రత్యేకమైనదనీ, దానికారణంగా ఆ గుర్తింపు తనకు రావాలనీ అతడు కోరుకునివుంటే! అదింక మనిషి బలహీనత అనీ, ఇదంతా సృష్టి విలాసంలో భాగమనీ సర్దిచెప్పుకుని నోరు మూసుకోవాల్సిందే.