ఏర్ పోర్టుకి వచ్చాక నూట పదిహేనోసారి పాస్పోర్టు చూపిస్తున్న విసుగుతో, ఇదే ఆఖరిసారి కదా అన్న ఊరటతో, తన చేతిలోని నీలం పుస్తకాన్ని సెక్యూరిటీ మనిషికి అందించాడు మూర్తి. అలా అందిస్తుంటే అట్టమీద అశోకుడి సింహాల బొమ్మ కనిపించి ఒక్క క్షణం ఒళ్ళు పులకరించింది. ఏనాటి అశోకుడు?మూడువేల సంవత్సరాల తర్వాత కూడా ఆ మహనీయుణ్ణి గుర్తుంచుకుని, గౌరవించే జాతి మనది.అంతకు పూర్వం ఎన్నో వేల సంవత్సరాల నుంచీ, వంశ పారంపర్యంగా వస్తున్న సంస్కృతి మనది!మధ్యలో కాలానుగుణంగా ఎన్ని మార్పులు వస్తేనేం, దానికి మూల స్థంభాలుగా ఉన్న విలువలలో, భావాలలో ఏమీ మార్పు లేదు.అందుకే ఆనాటి మనుషులకీ, ఈనాటి మనుషులకీ తెగని బంధాలున్నాయి.తాను భారతీయుడిగా పుట్టడం ఎంత అదృష్టం!ఉప్పొంగిన మనసుతో యధాలాపంగా చూస్తున్న మూర్తికి సెక్యూరిటీ అతను తన ముందున్న వ్యక్తికి తిరిగి ఇచ్చేస్తున్న పాస్ పోర్టు దృష్టిలో పడింది.
అదే నీలం రంగు అట్ట, దాని మీద అదే బంగారు అక్షరాలూ, ప్రభుత్వ ముద్రా.కాని ఈ ముద్రలో ఉన్నది అశోకుడి సింహాలు కావు, అమెరికన్ల డేగ.ఒక కాలితో బాణాలూ, ఒక కాలితో ఆలివ్ కొమ్మా పట్టుకుని, ఠీవిగా తలెత్తి, రెక్కలు విప్పి ఎగురుతున్న డేగ.ఆ డేగ బలానికీ, శక్తికీ సంకేతమనీ, ఆ ఆలివ్ కొమ్మ శాంతి సూచకమనీ, ఎప్పుడో చదివిన విషయం గుర్తుకి వచ్చింది మూర్తికి.ఒక పక్క బాణాలు పట్టుకుని బెదిరిస్తూంటే, ఎన్ని ఆలివ్ కొమ్మలు పట్టుకున్నా ఆ మనిషి (పోనీ ఆ పక్షి, ఆ దేశం) ఉద్దేశాలు శాంతియుతమైనవీ, స్నేహపూరకమైనవీ అని ఎవరు నమ్ముతారు?నవ్వుకున్నాడు మూర్తి.అహింసకీ, ధర్మపాలనకీ ఆలంబనమైన అశోకుడెక్కడ?అణ్వాస్త్రాలకీ, అగ్ర రాజ్య రాజకీయాలకీ మూలవిరాట్టైన అమెరికా ఎక్కడ?కానీ ఈ రోజులకదే తగిన ధర్మమేమో.ఈనాడు అహింసాసూత్రం అసమర్ధత కింద లెక్కకడుతున్నారు ఎవరో కాదు, ఆ అహింసాసూత్రం ద్వారానే స్వాతంత్య్రం తెచ్చుకున్న భారతీయులే!అవును మరి.మనవాళ్ళు ఎప్పుడో చెప్పిన విషయమే కదా.బలంగల వాడికే రాజ్యమూ, గౌరవమూ!
తిరిగి పాస్ పోర్టందుకుంటున్న మూర్తికి సెక్యూరిటీ అతని కళ్ళలో ఏదో నిరసన భావం తళుక్కుమన్నట్టనిపించింది.తన ముందరి వ్యక్తికి చూపించిన మర్యాద తనకి లోపించినట్టనిపించింది. తను అనవసరంగా లేనిపోనివన్నీ ఊహించుకుని బాధపడుతున్నాడా?తమాషా ఏమిటంటే , తన ముందరున్న అతను కూడా భారతీయుడిలాగే కనిపిస్తున్నాడు.చేతిలో ఉన్న ఒక చిన్న పుస్తకంలోని తేడాకే మనిషిచ్చే విలువలో భేదమా?
బొత్తిగా నిష్ప్రయోజనమైన ఆలోచనలు వదుల్చుకునేందుకు తల విదుల్చుకుని, చకచకా వెళ్ళి విమానంలో తన సీట్లో కూర్చున్నాడు మూర్తి.ఆశ్చర్యకరంగా, తన పక్క సీట్లో ఉన్న వ్యక్తి సెక్యూరిటీలో తన ముందరున్న వాడే!ఇంతలో అతను కూడా మూర్తి వేపు తిరిగి పలకరింపుగా నవ్వాడు.”ఎక్కడికి వెళ్తున్నారు?” అని ఇంగ్లీషులో అడిగాడు.
“న్యూయార్కు,” అని జవాబిచ్చాడు మూర్తి.
“భలే!నేనూ అక్కడికే. దోవపొడుగునా ఒకరికొకరు తోడుంటామన్నమాట.నా పేరు అజయ్” అని తనని తాను పరిచయం చేసుకున్నాడతను.
మూర్తి తన పేరు చెప్పగానే, “ఓ, మీరు కూడా తెలుగువారేనా?” అని సంభ్రమమూ, సంబరమూ కలిసిన గొంతుతో తెలుగులో అడిగాడు.
ఇక అక్కడినుంచి వారి పరిచయం ప్రయాణస్నేహం లోకి మారి, అంతకంటే శాశ్వతమైన బంధంగా మారుతుందా అన్నంత త్వరగా వర్ధిల్లసాగింది.ఈ కబుర్లలోనే విమానం పైకి లేచి ప్రయాణం మొదలు పెట్టింది.
ఒకరివివరాలొకరికి చెప్పుకోవడం లో వారిద్దరూ యు. ఎస్. లో తలో మూలా ఉన్నారనీ, మూర్తి యూనివర్శిటీ ప్రొఫెసర్ గానూ, అజయ్ ఒక కంపెనీలో ఇంజనీర్ గానూ పని చేస్తున్నారనీ తెలిసింది.
“మీరు ఎన్నాళ్ళుగా అమెరికాలో ఉంటున్నారు?” అనడిగాడు అజయ్
“ముఫ్ఫైయేళ్ళ పైనే అయింది,” చిరునవ్వుతో జవాబిచ్చాడు మూర్తి.”మీరు?”
తెల్లబోయిన ముఖ కవళికలని మామూలుగా మార్చేసుకుంటూ, “మీ సర్వీసులో సరిగ్గా సగం ఉన్నది నాకు.నేనొచ్చి పదిహేనేళ్ళవుతోంది.మీరు నాకు బాగా సీనియర్ అన్నమాట,” అన్నాడు అజయ్ నవ్వేస్తూ.
మూర్తికూడా నవ్వాడు.”ఇందులో సీనియారిటీ ప్రసక్తి ఏముంది?ఇదే మన్నా పోటీయా ఏమిటి?మీరూ నా వయసుకొచ్చేసరికి ముఫ్ఫై ఏళ్ళ సర్వీసూ, ఇంకా ఎక్కువా కూడా అవుతుంది,” అన్నాడు.
“యు. ఎస్. సిటిజెన్షిప్ తీసుకుని ఎన్నాళ్ళైంది?మీరొచ్చినటైములో ఇప్పటికంటే చాలా సులభమనుకుంటాను,” అనడిగాడు అజయ్.
“నేనసలు తీసుకోలేదు.ఇంకా సిసలైన ఇండియన్నే.” అజయ్ మొహం చూసి నవ్వేశాడు మూర్తి.
“ఏమిటీ?ఇంకా తీసుకోలేదా?ఎందుకని?ఇన్నాళ్ళనుంచీ ఇక్కడుండికూడా?”అజయ్ ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోయాడు.
“నాకా అవసరం ఎప్పుడూ కనిపించలేదు, కోరికా ఎప్పుడూ కలగలేదు,” స్థిరంగా జవాబిచ్చాడు మూర్తి.
“కాని … నాకు నమ్మ శక్యంగా లేదు.మీ ఉద్యోగానికీ, అభివృద్ధికీ సిటిజెన్ షిప్ లేకపోవడం ఒక అడ్డంకిగా నిలవలేదా?”ఆశ్చర్యం ప్రకటించాడు అజయ్.
“ఒకవేళ నిలిచినా ఆ సంగతి నాకెప్పుడూ తెలిసిరాలేదు.”
“కానీ మీ ఉద్యోగంలో రిసెర్చ్ చేసేందుకు కావాలికదా?”
“సిటిజెన్ షిప్ కావాల్సిన రకం రిసెర్చ్ లో నాకెప్పుడూ ఆసక్తి కలగలేదు.నా రిసెర్చిగ్రాంట్సు నాకు నిక్షేపంలా వస్తూనే ఉన్నాయి.”
“అయితే ఈ విషయంలో నేనే మీకు సీనియర్నన్నమాట!”ఉత్సాహంగా అన్నాడు అజయ్”నేను యు. ఎస్ సిటిజెన్ షిప్ తీసుకుని ఏడెనిమిదేళ్ళయింది.”
పరిశీలనగా చూశాడు మూర్తి.”ఏడెనిమిదేళ్ళా?మీరు వచ్చి పదిహేనేళ్ళే అయిందన్నారుగా?అంటే వీలవగానే వెంటనే తీసేసుకున్నారన్నమాట.”
“ఆహా.గ్రీన్ కార్డ్ వచ్చాక నాలుగున్నర ఏళ్ళ తర్వాత అప్లై చేయచ్చు కదా.నాలుగు సంవత్సరాల ఆరు నెలలు పూర్తయిన మర్నాడే నేను అప్లికేషను పంపేశాను.”
“ఎందుకంత తొందర?” సాలోచనగా అడిగాడు మూర్తి.
“తొందరేముంది?ఇక్కడకు వచ్చినవాళ్ళకి అమెరికన్ గవర్నమెంటు ఇస్తున్న సదుపాయమిది.దాన్ని ఉపయోగించుకుంటే తప్పేముంది?”
“కానీ … ఎంతైనా మనం పుట్టి పెరిగిన దేశాన్నీ, మనుషులనీ వదులుకోవాలంటే ” సందిగ్ధంగా ఆగాడు మూర్తి .
అజయ్ నిండుగా నవ్వాడు.”ఏం వదులు కుంటున్నామండీ?ఈ సిటిజెన్ షిప్ అనేది ఒక కాయితం ముక్క మాత్రమే.మనమీద తగిలించుకునే లేబుల్ లాంటిది.దాని మీద ఇండియన్ అని రాసున్నా, అమెరికన్ అని రాసున్నా, మన వ్యక్తిత్వం మారిపోతుందంటారా?మా అమ్మా, నాన్నా మా అమ్మా నాన్నాకాకుండా పోతారా?వారి రక్తం ఇంకా నాలో ప్రవహిస్తూనే ఉంది కదా.వాళ్ళు నాకు నేర్పిన పద్ధతులే నేనింకా అమలుపెడ్తున్నాను కదా?వాళ్ళు నన్ను ఎలా పెంచారో, నా పిల్లల్ని కూడా అలాగే పెంచుతున్నాను కదా? ఇంక ఇందులో నేను పోగొట్టుకున్నదేమిటీ?”
“మీరు బావుకున్నది మాత్రం ఏమిటీ?”
“చాలానే ఉంటాయి.అమెరికన్ సిటిజెన్ గా ఉంటే ఇంకా మంచి ఉద్యోగం దొరకడానికి వీలవుతుంది.”
“మీకింతకు ముందుకంటే మంచి ఉద్యోగం దొరికిందా?” అజయ్ మాటలను మధ్యలోనే తుంచేస్తూ అడిగాడు మూర్తి.
“నేనప్పటికి ఉన్నదే చాలా మంచి ఉద్యోగం కాబట్టి వేరే దాన్ని వెతుక్కోలేదు.కానీ కావాలంటే ఆ అవకాశం ఉంటుంది కదా?”
మూర్తి ఏమీ మాట్లాడలేదు.
పుంజుకున్న ఉత్సాహంతో అజయ్ కొనసాగించాడు.”ఇంకా మా చెల్లెళ్ళని గానీ, నా భార్య అన్నదమ్ములని గానీ అక్కడకు తీసుకు వచ్చేందుకు కూడా సులభమవుతుంది.”
“వాళ్ళు కూడా మీలాగే వాళ్ళ స్వశక్తి మీద ఆధారపడి రావచ్చు కదా?”
మూర్తి మాటలు పట్టించుకోలేదు అజయ్”అదీగాక మా అమ్మా వాళ్ళకి కూడా నేను గ్రీన్ కార్డుకి స్పాన్సరు చేసేందుకు వీలయింది.ఇప్పుడు ఏ గొడవా లేకుండా వాళ్ళు ఇష్టమొచ్చినట్టు ఇండియాకీ, అమెరికాకీ వస్తూ పోతూ ఉండచ్చు. అడిగే వారెవరూ లేరు.
మూర్తి కొంచెంసేపు మాట్లాడలేదు.తోపుడు బండితో అక్కడకి వచ్చిన ఫ్లైట్ అటెండంట్ తాగడానికి ఏమి కావాలో అడిగి వాళ్ళిద్దరి ఆర్డర్సూ తీసుకుంది.
మళ్ళీ తన వాదాన్ని బలపరుస్తున్నట్టు మొదలుపెట్టాడు అజయ్”దీంట్లో ఇంకో పెద్ద అడ్వాంటేజ్ ఉందండీ.చక్కగా ప్రపంచంలో అన్ని దేశాలకీ సులభంగా వెళ్ళి రావచ్చు.వీసాలనీ, గొడవలనీ పట్టుకు వేళ్ళాడక్కరలేదు.అమెరికన్ పాస్ పోర్టుందంటే అన్ని దేశాలకీ వీసా లేకుండా వెళ్ళచ్చు, తెలుసా?” గర్వంగా అన్నాడు అజయ్. “లేకపోతే విమానంలోంచి దిగ్గానే అప్పటికప్పుడే ఇస్తారు.”
“అన్ని దేశాలకీ కాదు,” అన్నాడు మూర్తి చిరునవ్వుతో.
చప్పరించేశాడు అజయ్”ఫర్వాలేదులెండి.అలా ఒప్పుకోని దేశాలకు వెళ్ళాలని ఎవడేడుస్తున్నాడు?బొత్తిగా థర్డ్ వరల్డ్ కంట్రీస్”.
మూర్తి మొహంలో ఒక చిరునవ్వు మెరిసి మాయమయ్యింది.”ఇండియాకి రావడానికి కూడా వీసా కావాలనుకుంటాను?అఫ్ కోర్స్ అది కూడా థర్డ్ వరల్డ్ కంట్రీ కిందే లెక్కనుకోండి,” అజయ్ ముఖ కవళికలు జాగ్రత్తగా పరిశీలించుతూ అన్నాడు.
అజయ్ కొంచెం తొట్రు పడ్డాడు.”నా ఉద్దేశం అదికాదనుకోండి.”అప్పుడే ఫ్లైట్ అటెండెంట్ వాళ్ళ డ్రింక్సూ, స్నాక్సూ తీసుకువచ్చింది.వాటిని వారి బల్లల మీద సర్దుతున్న విరామంలో అజయ్ తనను తాను సర్దుకున్నాడు.
గ్లాసు చేతిలోకి తీసుకుంటూ మూర్తి ప్రారంభించాడు.”ఏమో, నాకు మాత్రం నాదీ అనుకున్న దేశానికి రావడానికి ఎవరి దగ్గిరో పర్మిషన్ తెచ్చుకునీ, వాళ్ళు సరేనంటే తప్ప లోపలికి రావడానికి హక్కు లేకుండా ఉండడం చాలా బాధనిపిస్తుంది సుమండీ!అందుకే ననుకుంటాను, ఎన్నిసార్లు సిటిజెన్ షిప్ మార్చుకోమనే చర్చ వచ్చినా, ఈ ఒక్క కారణం చాలు నాకు, ఆ ఆలోచనని నశింపచెయ్యడానికి.”
“ఆఁ, మీరు మరీ సెంటిమెంటల్ గా మాట్లాడుతున్నారండీ.”కొట్టిపారేశాడు అజయ్.
“పోనీలెండి.మీ అమెరికన్ పాస్ పోర్టుతో మీరేమేం దేశాలు చూశారు?” కుతూహలంగా అడిగాడు మూర్తి.
“అంటే ఎక్కువ చూడలేదనుకోండి.టైము కుదరటం లేదు. ఇన్నాళ్ళూ ఇండియాకి వచ్చి వెళ్ళడంతోటే సరిపోతోంది.ఇదిగో, ఈ సమ్మర్ లో యూరప్ కి వెకేషన్ కి వెళ్ళాలని ప్లాను వేస్తున్నాం.”
“అలాగా,” అని ఊరుకున్నాడు మూర్తి.
ఫ్లైట్ అటెండంటు వచ్చి వాళ్ళు వాడేసిన ఖాళీ గ్లాసులూ, స్నాక్ ప్లేట్లూ తీసేసి చెత్త బాగులో వేసుకుంది.చిరునవ్వుతో థాంక్సు చెప్పారు ఇద్దరూ.
“మీరు వెళ్ళారా?యూరప్ కి గానీ, వేరే దేశాలకిగానీ?” ఆసక్తిగా మళ్ళీ సంభాషణలోకి దిగాడు అజయ్.
“ఆఁ.అడపాదడపా వెళ్తూనే ఉంటాను.కనీసం ఏడాదికో, రెండేళ్ళకో ఓ సారి ఎక్కడో వేరేదేశానికి కాన్ ఫరెన్సుకైనా వెళ్ళక తప్పటం లేదు.ప్రతిసారీ ఆయా దేశాలనుంచి వీసా తెప్పించుకునేందుకు పెద్ద తతంగమూ తప్పటంలేదు,” అన్నాడు మూర్తి.
“చూశారా?అదే నేను చెప్పింది.”
మూర్తి మౌనంగా తన గతానుభవాల్ని తవ్వుకున్నాడు.పాతిక, ముఫ్ఫై ఏళ్ళకిందట యూరప్ కి మొట్ట మొదటిసారిగా వెళ్ళినప్పుడు తన పాస్ పోర్ట్ చూడగానే అక్కడి ఇమిగ్రేషన్ ఆఫీసర్ల మొహాలు ఎలా ముడుచుకునేవో, తను యు. ఎస్ నుంచి వచ్చానని చెప్పినా తనని హెల్త్ సర్టిఫికేటు కోసం ఎలా నిర్బంధించేవారో, తనేదో రోగపీడిత దేశాన్నుంచి వచ్చాననీ, తన గాలి సోకితేనే ఏమి ప్రమాదమోనన్నట్టు ఎలా వ్యవహరించే వారో, అంతా ఒకసారి కళ్ళకు కట్టినట్టు అనిపించింది.కాలక్రమేణా మశూచికం లాంటి వ్యాధులు ప్రపంచం మొత్తంలో మాయమవడంతో, మిగతా అంటు వ్యాధులని కూడా చాలా మట్టుకు భారతదేశ ప్రభుత్వం అరికట్టడంతో, తర్వాత తర్వాత భారతీయులు విదేశాలకు వెళ్ళడం ఎక్కువై, వాళ్ళ తెలివితేటలతో, వృత్తి సామర్య్ధంతో, సత్ప్రవర్తనతో, తమకు గౌరవం పెంపొందించుకునేట్టు వ్యవహరించడంతో ఇలాటి అనుభవాలు ఇంచుమించు మాయమయ్యాయి.ఆ రోజుల్లో ఎన్ని అవమాన పరిచే చూపులనెదుర్కొన్నాడో, ఎన్ని సార్లు ఆవేశాగ్రహాలను బలవంతంగా దిగమింగాడో నెమరు వేసుకున్నాడు.
అతని ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ అజయ్ అన్నాడు, “ఇన్నేళ్ళు మీరు అమెరికాలో ఉన్నా, అది మీకు ఇంకా పరాయి చోటనిపించడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది.కనీసం ఇండియాకి వచ్చినప్పుడైనా స్వదేశం వచ్చినట్టు సంతోషంగా ఉంటుంది కదా?”
అతనికి జవాబు చెప్పలేదు మూర్తి.విదేశాలలో తనకెదురైన అనుభవాలు నెమరువేసుకున్నట్టే, ఇప్పుడు స్వదేశంలో జరిగినవికూడా తిరగబోసుకున్నాడు.ఇప్పుడంటే గ్రీన్ ఛానలంటూ వచ్చింది కానీ, పాత రోజుల్లో?డ్యూటీ వెయ్యాల్సిన వస్తువులేమీ లేవని చెప్పినా అనుమానం వీడని కస్టమ్స్ అధికార్లూ, పాస్ పోర్ట్ రిన్యూయల్ ఫారాలు ఇచ్చేందుకే నిక్కీ నీలిగే కాన్సులేట్ పనివాళ్ళూ, అసలు మేము విదేశాల్లో ఎంబసీలు పెట్టుక్కూర్చున్నది మీలాంటి వాళ్ళకోసం కాదని నిరసించిన దేశ ప్రతినిధులూ, భారతీయుడంటే మన సాటివాడని కాకుండా ఓ చీడపురుగులా చూసి విదేశీ పాసెంజర్లపైనే శ్రద్ధ చూపించే ఏర్ ఇండియా సిబ్బందీ, వేరే దేశంలో ఉంటూ తనవాళ్ళనుకునే వారికోసం మొహం వాచిపోయిన వారికి ముఖం చిన్నబోయేలా, మనసు ముడుచుకునేలా అందించిన చేదు అనుభవాలు ఎన్నో, ఎన్నెన్నో.నిట్టూర్చాడు మూర్తి.
“అమెరికా మీద నాకేం ద్వేషం లేదు.అన్నాళ్ళు ఉన్న చోటు మీద మమకారమూ లేకపోలేదు.ఇక ఇండియా అంటారా ” ఇబ్బందిగా నవ్వాడు మూర్తి.”ఈ దేశం నా స్వంతమని ఎంత విర్రవీగినా, నువ్వు పరాయివాడివేనని ఎప్పుడూ హెచ్చరిస్తున్నట్టుంటుంది.అన్నిట్లోనూ వ్యత్యాసం! ప్రయాణానికి టికెట్ కొనాలన్నా, హోటల్లో బస చెయ్యాలన్నా, ఏ పని చేయాలన్నా,బయట దేశాలలో ఉండే వాళ్ళకు ఒక రేటూ, ఇండియాలో ఉండే వాళ్ళకు ఒక రేటూ.నీ సిటిజెన్ షిప్ ఏమిటని ఎవడూ ప్రశ్నించడు, పట్టించుకోడు.ఆఖరికి షాపులో ఏదైనా వస్తువు కావాలన్నా దాని ధరని డాలర్లలో చెప్తారు, రూపాయలలో కాదు.ఏమన్నా అన్నా, ఎందుకనడిగినా, మీరు ఎన్నారైలు కదా అని సమాధానం. ఈ ఎన్నారై అన్నది ఒక బిళ్ళలా మొహానగానీ కట్టి ఉన్నదా అని సందేహం వస్తుంది చాలాసార్లు.అయినా ఏదో చాదస్తం మనసు పట్టుకుని పీకుతూ ఉంటుంది.ఎవరి పిచ్చి వాళ్ళకానందం అంటారిందుకే కాబోలు.నిజం చెప్పాలంటే ఈ ఇండియన్ పాస్ పోర్ట్ మూలాన నాకేం ఒరుగుతోందో నాకే అర్ధం కాదు ఒక్కోసారి.”మాట్లాడుతూండగానే మూర్తి మొహం గంభీరంగా మారి కళ్ళు చెమరించాయి.
ఆయనలో మార్పు చూసి అజయ్ కీ బాధ వేసింది.ఓదార్పుగా అన్నాడు, “ఇప్పుడు డ్యూయల్ సిటిజెన్ షిప్ వస్తుందంటున్నారు కదా.మీలాంటి వాళ్ళకది మంచి పరిష్కారం.అటు అమెరికన్ సిటిజనై ఆ లాభాలనూ పొందచ్చు, ఇటు ఇండియన్ సిటిజన్లాగా ఉండి మీ దేశానికి పరాయి వారవకుండానూ ఉండచ్చు.”
అసంతృప్తిగా చూస్తూ తల అడ్డంగా ఊపాడు. మూర్తి.”అవ్వా కావాలి, బువ్వా కావాలన్నట్టుంటుందీ వాదన.ఒకేసారి రెండు దేశాలకి పౌరుడుగా ఉండటం సాధ్యం కాదు.ఒకే ఒరలో రెండు కత్తులుంచినట్టు.”
“ఎందుకు సాధ్యం కాదండీ?” ఉత్సాహంగా ముందుకి వంగాడు అజయ్”చూడండి. తల్లిమీద ప్రేముంటుంది. భార్యమీదా ప్రేముంటుంది.రెండూ దేనికదే ప్రత్యేకం.ఒకరిని అభిమానించినంతమాత్రాన రెండో వారిని అభిమానించడంలేదని కాదుగా అర్ధం?”
“ఆ భార్య కాస్తా వేరే కాపురం పెట్టమని భీష్మించుక్కూర్చుంటే?” నవ్వుతూ అడిగాడు మూర్తి.
“అది సింగిల్ సిటిజెన్ షిప్ రూలులాంటిది.అదే వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండడం డ్యూయల్ సిటిజెన్ షిప్ లాంటిది.”అజయ్ కూడా నవ్వాడు.
వాళ్ళ సంభాషణని భంగపరుస్తూ విమానం ముందుభాగం నుంచి ఏదో కలకలం వినిపించింది.సంగతేమిటో తెలుసుకుందామని అటు వైపు తిరిగిన వారిద్దరికీ నోటమాటరాలేదు.
క్రూరమైన చూపులతో, చేతులలో కత్తులతో, ఏక్షణాన్నైనా రణరంగంలోకి దూకడానికి సిద్ధం అన్నట్టు ముగ్గురు మొగవాళ్ళు నుంచుని ఉన్నారు.వారిమధ్యన ఇరుక్కుపోయిన ఇద్దరు ఫ్లైటు అటెండెంట్సు బిత్తర చూపులు చూస్తున్నారు.విమానమంతటా నిశ్శబ్దమలుముకుంది.
ఆ ముగ్గురిలో నాయకుడు కాబోలు, అందర్నీ ఉద్దేశించి ప్రకటించాడు.”మేము ఈ విమానాన్ని హైజాక్ చేస్తున్నాం.గొడవ చెయ్యకుండా మేము చెప్పినట్టు చేస్తే ఎవ్వరికీ ఏ ప్రమాదం ఉండదు.ముందు అందరూ మీ మీ పాస్ పోర్ట్ లని తీసి మావాడికి ఇవ్వండి,” అని ఆదేశించాడు.
“పాస్ పోర్టెందుకు వీళ్ళకి?కొంపదీసి మన పేరు వాడి ఎక్కడికయినా పారిపోరుకదా?” గొణిగాడు అజయ్
“షటప్”నాయకుడి గర్జింపుతో అజయ్ నోరు మెదపలేదు.
అనుచరుల్లో ఒకడు సీట్ల మధ్యగా నడుస్తూ అందరి పాస్ పోర్టులూ తీసుకోవడం మొదలు పెట్టాడు.నిస్పృహతో కొందరూ, నిస్త్రాణంగా కొందరూ, మౌనంగా అందరూ వారి వారి పాస్ పోర్టులు తీసి ఇచ్చారు.అజయ్ ది అందుకుంటున్నప్పుడు దానినీ, అతనినీ తీక్షణంగా చూశాడు హైజాకర్ ఇందాక మాట్లాడింది ఎవరో మెదడులో ముద్ర వేసుకుంటున్నట్టు.
రెండు గంటలు గడిచాయి.విమానం నెమ్మదిగా కిందకి దిగి లాండ్ అయింది.అయితే ఎక్కడ దిగారో తెలియటం లేదు.కిటికీలోంచి బయటకి చూసినా ఏమీ అంతుపట్టడం లేదు.పాసెంజర్సు అందరి మొహాల్లోనూ ఆరాటం, ఆదుర్దా నిండున్నాయి.కానీ ఎవరూ పెదవి మెదపటంలేదు.తుపాకులు పట్టుకున్న ఇద్దరు హైజాకర్లు కాబిన్ లో అందరికీ కాపలాగా ఉన్నారు.
ఇంకో గంట కూడా గడిచింది.
ఇంతలో కాక్ పిట్ లోంచి ఒక హైజాకర్ వచ్చి తమ నాయకుడితో తగ్గు స్వరంలో ఏదో చెప్పాడు.అది వింటూనే నాయకుడి ముఖం జేవురించింది.క్రోధం నిండుకుంది.కసిరినట్టుగా తన అనుచరుడితో ఏదో చెప్పాడు.అతను మళ్ళీ కాక్ పిట్ లోకి వెళ్ళాడు.ఏం జరుగుతోందో తెలియక పోయినా, కాబిన్ లో, పాసెంజర్లలో టెన్షన్ పెరిగింది.
లోపలికి వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగొచ్చి నాయకుడికి ఏమో చెప్పాడు.వినీ వినడంతోనే కూర్చున్న నాయకుడు ఒక రంకెతో ఎగిరి నుంచున్నాడు.ఆవేశం పట్టలేనట్టు అతని ఒళ్ళు కంపించసాగింది.కోపంగా, కసిగా, ఆ ఉన్న కాస్త మేరలోనే పచార్లు మొదలుపెట్టాడు.ప్రయాణీకుల భయం, కంగారూ గడ్డకట్టినట్టు కాబిన్ లో గాలికూడా స్థంభించిపోయింది.
బుసలు కొడుతూ తిరుగుతున్న నాయకుడిని చూస్తూ మళ్ళీ గొణుక్కున్నాడు అజయ్”ఏంట్రా పోజు?మా గవర్నమెంటుకీ సంగతి తెలియగానే నీ పని పట్టకపోతే చూడు!”
వారించబోయిన మూర్తి హైజాకర్ల చూపులిటు తిరగడంతో బిగుసుకుపోయాడు.అజయ్ అన్న తెలుగు మాటలకి అర్ధం తెలియక పోయినా, భావం గ్రహించడానికి వారికి ఏమీ కష్టమైనట్టులేదు.నాయకుడి కళ్ళు అజయ్ మీదే కొన్ని క్షణాలు నిలిచిపోయాయి.తన అనుచరులని ఇద్దర్ని పిలిచి వారితో రహస్యంగా ఏమో చెప్పాడు.
అతని మాట వినగానే వాళ్ళిద్దరూ త్వరత్వరగా ఏవో కాగితాల్లాంటివి వెతికి, ప్రయాణీకులదగ్గరకి వచ్చి, కొంతమందిని లేవదీసుకుని వెళ్తున్నారు.ఏమీ అర్ధం అవలేదు మూర్తికీ, అజయ్ కీ.
ఇంతలో ఒక హైజాకర్ అజయ్ పక్కకి వచ్చి నుంచున్నాడు.”ఈ పాస్ పోర్టు నీదేనా?” కర్కశంగా అడిగాడు.
ఫొటో ఉన్న పేజీకి తెరిచి ఉన్న ఆ పాస్ పోర్టుకేసి చూస్తూ, అవునని గానీ, కాదని గానీ జవాబివ్వలేదు అజయ్నిలువు గుడ్లేసుకుని చూస్తూ ఉండిపోయాడు.
“చెప్పు!” గద్దించాడు అతను.
ఇంకా గొంతు పెగలని అజయ్ నీరసంగా తలాడించాడు.
“నాతోరా!” అంటూ దారితీశాడు హైజాకర్యాంత్రికంగా లేచి అతని వెనకాల వెళ్ళాడు అజయ్
ఏమవుతోందో అర్ధంచేసుకోవాలనే ప్రయత్నంలో హైజాకర్నే చూస్తున్న మూర్తి అప్పుడు గమనించాడు హైజాకర్ ఒక చేతిలో ఉన్నవన్నీ నీలం అట్టమీద డేగ ముద్ర ఉన్న పాస్ పోర్టులూ, రెండో చేతిలో మిగతా అన్ని రకాలూనూ.ప్రయాణీకులందరిలోంచీ వీళ్ళని మాత్రం ఎందుకు ఏరుకున్నారో అర్ధమయింది.హైజాకర్ వెనకాలే బలిపశువులాగా నడుస్తున్న అజయ్ ని చూస్తూ, రానున్న హింసా కాండని ఊహలోంచి తొలిగించాలని ప్రయత్నిస్తూ, చేష్టలు దక్కి ఉండిపోయాడు మూర్తి. ఇన్నాళ్ళూ ఎన్నో అవమానాలకూ, అపహాస్యాలకూ కారణమైన పాస్పోర్ట్ వల్ల తనకి ఒరిగిందేమిటో అర్ధమయింది.