నిమ్మకాయలు

(మాచిరాజు సావిత్రి గారు అమెరికా రచయిత్రులలో అగ్రగణ్యులు. వీరి కవితాసంకలనం ఒకటి పుస్తకరూపంలో వెలువడింది. కథానికా రచనలో కూడ సిద్ధహస్తులు. ఆంధ్రుల అమెరికా జీవనానికి అద్దం పడుతూ వారి మనోభావాలకి రూపం కలిగిస్తున్నారు తమ రచనల్లో. )

మార్కెట్టు దగ్గిర కారాపి, చుట్టూ ఎవరూ లేకుండా చూసుకుని, జాగ్రత్తగా దిగాడు శేఖర్‌. తలుపు చప్పుడవ్వకుండా నెమ్మదిగా వేసి, లేత ఎండలో మెరిసిపోతున్న కారు మిలమిలలలో తన ప్రతిబింబం చూసుకుని అప్రయత్నంగా చిరునవ్వు నవ్వాడు. ఒక్క రేణువు కూడా ధూళీ, దుమ్మూ లేని కారుని మరొకసారి ఆప్యాయంగా ఆపాదమస్తకమూ చూసుకుని, తృప్తిగా మార్కెట్టులోకి దారి తీశాడు. లోపలకి వెళ్ళబోయేముందర వెనక్కు తిరిగి, మరొక్క సారి దూరంగా తళుకులీనుతున్న కారుని తనివితీరా చూసుకుని లోపలకి అడుగు పెట్టాడు. కారుని దూరంగా పార్కు చెయ్యడమే మంచిదయింది. అంత దూరంలో ఎవరూ పార్కు చెయ్యరు. ఎవరి అశ్రధ్ధ వల్లనో
కారు తలుపులు కొట్టుకుంటాయని గానీ, ఎవరి నిర్లక్ష్యం మూలానో గ్రోసరీ బండి కారుని గీరుకుపోతుందని గానీ భయం లేకుండా లోపల తన పని పూర్తిచేసుకుని రావచ్చు. ఎంత సేపు? పది నిముషాలు కూడా పట్టదు.

కొంచెం సంకోచంగానే లోపలకు వెళ్ళాడు శేఖర్‌. కానీ ఈ సంకోచానికి కారణం కారు గురించిన బెంగ కాదు. తను చేస్తున్న పని తనకే కొంచెం ఎబ్బెట్టుగా, విడ్డూరంగా అనిపించడం వల్ల కలిగే సిగ్గు. అమ్మ మాట తీసెయ్యలేక ఇలా వచ్చాడుగానీ …

ఎటు వెళ్ళాలా అని పరధ్యానంగా దిక్కులు చూస్తున్న అతని కాళ్ళని ఎవరో బలంగా ఢీకొన్నారు. కాళ్ళు తొట్రుపడి, పడబోయి, ఎలాగో నిలదొక్కుకున్నాడు శేఖర్‌. ఇదేమీ పట్టించుకోకుండా ఒక మూడేళ్ళ కుర్రాడు శేఖర్‌ కాళ్ళ సందులోంచి దూరి ఏవో బొమ్మలున్న వైపు పరిగెట్టి వెళ్ళిపోయాడు, “మామీ! లుక్‌ లుక్‌” అని అరుచుకుంటూ. ఇంతలో వెనకబడిన ఆ కుర్రాడి తల్లి రొప్పుకుంటూ వచ్చి క్షమార్పణలు చెప్పుకుంది. “ఇట్సాల్రైట్‌ ఇట్సాల్రైట్‌” అని లాంచనంగా కాక మనఃపూర్వకంగానే బదులిచ్చాడు శేఖర్‌.

ఒక్కసారి తన చిన్నప్పటి రోజులు కళ్ళ ముందు నిలిచాయి.

మూడు నాలుగేళ్ళ వయసప్పుడు ప్రపంచం ఎంత అద్భుతంగా అనిపించేదో! అన్నీ వింతలే. అన్నీ సంబరాలే. పక్షి కూత విన్నా, పూవు విచ్చుకున్నా, వాన చినుకు పడినా, ఆకు రాలినా, గాలి వీచినా, బురద చిమ్మినా, అన్నీ కొత్తే, అన్నీ కుతూహలమే. కూస్తున్న పక్షుల పాటలు వీనులకు విందులు, విచ్చుకున్న పూవులు కనులకు పండుగలు. వానకు తడిసిన వాసనలు మనసుకు ఉక్కిరిబిక్కిరులు, రాలి పడిన ఆకులు ఒంటికి గగుర్పాటులు. వీచే గాలి పెట్టే గిలిగింతలూ, బురదలో  ఆడే తన కేరింతలూ. బ్రతుకంతా పులకరింతలే అయిన ఆ పరమానందాన్ని పంచుకునే తోడొక్కటే కరువయ్యింది.

రోజల్లా “అదేమిటీ?”, “ఇదెందుకూ?”, “దీన్నెలా?” అనే తన ప్రశ్నలతో ఇల్లు మారుమ్రోగిపోయేది. అమ్మనడిగితే నాన్ననడగమనీ, నాన్ననడిగితే తర్వాత చూద్దామనీ దాటింపులే తప్ప తన సందేహాలకు సమాధానాలు మాత్రం దొరికేవి కావు. పోనీ తాతా బామ్మలనడుగుదామనుకుంటే, తన ప్రశ్న వినగానే తాత ముసిముసినవ్వులతో, “విన్నావా వీడి మాటలు? నా మనవడంటే ఏమనుకున్నవు?” అని మీసాలు మెలేశేవాడు. బామ్మ కళ్ళింతింత చేసుకుని, “చంటి వాడి బుర్రలో ఎన్ని ఆలోచనలో! మా బంగారు తండ్రే!” అని బుగ్గలు పుణికేది. తన ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోయేవి.

తీరా తీరా జీవితం గురించిన తన జిజ్ఞాసా, ప్రపంచం గురించిన తన జ్ఞానతృష్ణా, ఇంట్లో వారికి ఒక వేధింపుగా తోచాయి. ఈ బెడద వదిలించుకునే మార్గమేమిటని వాళ్ళు అన్వేషించారు. చివరకు “మూడేళ్ళు నిండినా ఇంకా చదువూ, సంధ్యా లేకుండా ఇంట్లో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవడం” మూలానే ఇలా తయారవుతున్నాడని తీర్మానించారు. తత్ఫలితంగా తనను స్కూల్లో వేశారు. అప్పటినించీ తన సమయమంతా అక్షరాలు దిద్దడానికీ, అంకెలు వల్లెవేయడానికీ, అదీ ఇదీ కాకపోతే నర్సరీ రైమ్స్‌ ఒప్పచెప్పడానికీ సరిపోయేది. స్కూల్లో చేరాకే ప్రశ్నలు వేయడం తప్పని తెలుసుకున్నాడు. చెప్పినట్లు చేయడం, చెప్పిన మాట వినడం నేర్చుకున్నాడు.

చిన్ననాటి ముచ్చట్లలోంచి బయట పడి, రకరకాల కూరగాయలు కుప్పలు కుప్పలుగా పొసివున్న వేపుకి నడిచాడు శేఖర్‌. “లెమన్స్‌” అని రాసిఉన్న అట్ట ముక్క కింద సూర్యుడికి ప్రతిబింబాలలా పసిమి చాయలో వెలిగిపోతున్న రాశినీ, పక్కనే “లైమ్స్‌” అనే అట్ట కింద ఉన్న ఆకుపచ్చ గుట్టలనీ చూస్తూ మళ్ళీ తికమకలో పడిపోయాడు.

నిమ్మకాయలని ఇంగ్లీషులో “లెమన్స్‌” అంటారనే గట్టి నమ్మకం. కానీ, ఇండియాలో దొరికే నిమ్మకాయల్లాంటివి కావాలంటే, ఈ “లైమ్స్‌” అన్నవే అలా ఉన్నాయి మరి. ఇప్పుడింతకీ తను “లెమన్స్‌” కొనాలా, “లైమ్స్‌” కొనాలా? ఇక్కడి పసుపచ్చ నిమ్మకాయలను చూసి ఒక తెలుగావిడ (పెద్దావిడే) “ఇవి నిమ్మకాయలేమిటి? దబ్బకాయలుగానీ,” అనడం గుర్తొచ్చింది. దబ్బకాయలేమిటో శేఖరుకి సరిగ్గా తెలియదు. అసలు తన జన్మలో ఎప్పుడైనా దబ్బకాయలని చూశాడో లేదో కూడా తెలియదు. ఈ రెండిట్లో తను ఏవి కొనాలి? ఏదైతేనేం,రెండూ పుల్లగానే ఉంటాయిగదా అనుకోవాలా? “ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు” అని ఏదో ఒక పద్యంలో భాగం మనసులో మెరిసి మాయమైంది. ఎప్పటిదో ఈ జ్ఞాపకం? అసలిది ఏ పద్యంలోది చెప్మా? సుమతీ శతకంలోదా? వేమన పద్యాల్లో ఒకటా?

చిన్నప్పుడు, కొన్నాళ్ళు స్కూలు చదువయ్యాక, తాతయ్య తనకు శలవల్లో పద్యాలు నేర్పించడం మొదలుపెట్టాడు. పాపం ఆయనకి పద్యాలంటే చాలా ఇష్టం. తిరుపతి వేంకట కవుల పద్యాలంటే చెవి కోసుకునేవాడు. వాటిని అర్ధం చేసుకునే స్థాయికి తను ఎదగలేదుగానీ, అందుకు పునాదిగా ముందు తనకు శతకాలు నేర్పించడం మొదలు పెట్టాడు తాతయ్య. అదెప్పుడు? తను హైస్కూలు చదువుకొచ్చినప్పుడు. అయితే ఆ ప్రయత్నం తొందరగానే ముగిసిపోయింది. పబ్లిక్‌ పరీక్షలొస్తున్నాయి, వాటికి ప్రిపేర్‌ అవ్వాలి, తర్వాత ఎంట్రెన్స్‌ పరీక్షలొస్తాయి, వాటికి ప్రిపేర్‌ అవ్వాలి, పనికిమాలిన ఈ పాండిత్యం ఎందుకు? కూడు పెడుతుందా ఏమైనా? అని తాతయ్య దగ్గిర చేరి పద్యాలు వినే వేళల్లో ట్యూషన్‌ పెట్టించారు. పరీక్షా పత్రాలలో రాని విషయం దేనికీ తన బుర్రలో స్థానం లేదని తీర్మానించారు. అప్పటినించీ స్కూలు పుస్తకాలు తప్ప ఇంకేవీ తన చేతుల్లో కనిపించడానికీ, స్కూలు పాఠాలు తప్ప ఇంకేవీ తన నోట్లోంచి వినిపించడానికీ వీల్లేకపోయింది.

తన తల్లితండ్రుల ముందు జాగ్రత్తకి తగిన ఫలితమే కనిపించింది. ఇంజనీరింగులో సీటొచ్చింది. ఆ వయసులో తనకసలు ఏ సబ్జెక్టులో ఆసక్తి ఉందో, దేంట్లో లేదో తెలుసుకునే మానసిక పరిపక్వత కూడా లేదు. అప్పుడప్పుడు ఒక క్లాసు కంటే ఇంకొకటి బాగుందనీ, ఇది నచ్చిందనీ, భావాలు మొలకెత్తినా, అవి చిగురించకుండానే వాడిపోయేవి. తన ఇష్టాలేమిటో తనకే తెలియకుండా బ్రతికేవాడు. ఇంజనీరింగులో చేర్పించాక ఇదీ బాగానే ఉందనిపించింది. క్లాసులో చెప్పే లెక్కలూ, ప్రాబ్లెమ్సూ ఆసక్తికరంగానే అనిపించాయి. ఎప్పుడో చచ్చిపోయిందనుకున్న జిజ్ఞాసను మళ్ళీ రేకెత్తించాయి. ఈ ఫీల్డులో తన భవిష్యత్తు ఊహించుకుంటే తనకే సరదా వేసేది.

కానీ ఆ సంబరం ఎంతో కాలం నిలవలేదు. తీరా డిగ్రీ చేతికొచ్చాక చూస్తే ఉద్యోగాలెక్కడా కనిపించలేదు. కొత్త్తొక వింత, పాతొక రోత అన్నట్టు, అందరూ ఇప్పుడు కంప్యూటింగ్‌ ఫీల్డు లోకి పోతున్నారు. “మంచి అవకాశాలన్నీ ఇందులోనే ఉన్నాయిరా. ఈ ఫీల్డులో చేరడమే మంచిది,” అని నాన్నగారు తనని ఒక డిప్లోమా క్లాసులో చేర్పించారు. ఇన్నాళ్ళూ కష్టపడి సాధించిన చదువంతా వృధా అనేసరికి తనకి చాలా బాధ వేసింది. అయినా ఏం లాభం? ఆయనచెప్పిందాంట్లో కూడా సత్యం ఉన్నది కదా? ఎన్ని డిగ్రీలున్నా ఉద్యోగం కోసమే కదా? అంతే. ఇంజనీరు శేఖర్‌ అవతారం చాలించి, ప్రోగ్రామర్‌ శేఖరుగా పునర్జన్మనెత్తాడు.

అయినా “ఏమిటిది? ఎందుకిలా గతంలో పడి కొట్టుకుంటున్నాను?” అని తన మీద తనే చిరాకు పడ్డాడు శేఖర్‌. వచ్చిన పనేదో తొందరగా చేసుకు వెళ్ళాలి గానీ గబ గబా నాలుగు లైమ్స్‌ కొని బయటపడ్డాడు శేఖర్‌. ప్లాస్టిక్‌ సంచీని జాగ్రత్తగా సీటు కింద పెట్టి కారులో కూర్చునేటప్పటికి మళ్ళీ మనసు ఉత్సాహంతో ఉప్పొంగింది. ఇలాంటి కారు కొనుక్కుని తిరుగుతూంటాడని తను కలలోనైనా అనుకున్నాడా? తనసలు తన భవిష్యత్తు గురించి ఎలాంటి ఊహాగానాలూ చెయ్యలేదు. ఏదో మరీ అసంతృప్తి కలిగించని ఉద్యోగం, నెలకొక నాలుగైదు వేలు జీతం ఉంటే చాలనుకున్నాడు. జీవితం సాఫీగా నడిచేందుకు ఆమాత్రం చాలదా?

కానీ అమ్మా నాన్నల ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ప్రతి అల్లాటప్పా గాడూ కాంట్రాక్టు ప్రోగ్రామరుగా అమెరికా చెక్కేస్తూంటే, చక్కటి తెలివితేటలూ, కష్టపడి పనిచేసే తత్వం ఉన్న తమ కొడుకెందుకు తీసిపోవాలి? పైగా ఎంత కష్ట పడినా దానికి తగిన గుర్తింపు లేకపోతే ఏం లాభం? చేసే పనులు ఒకటేనైనా, వాటికి వచ్చే ప్రతిఫలాలలో ఇంత తేడా ఉన్నప్పుడు ఈ దేశాన్నే పట్టుకు వేళ్ళాడడంలో అర్ధం లేదు. అమ్మా నాన్నల బోధనలతో తన ఆలోచనలలో పొరబాటేమిటో తెలిసివచ్చింది శేఖర్కి. వాళ్ళ
ప్రేరేపణే కాకుండా వాళ్ళ ప్రయత్నాల మూలాన కూడా తను అమెరికా వచ్చి చేరాడు. వచ్చిన ఆరు నెలలకే బ్రహ్మాండమైన కారు కొనేశాడు. కారు కొన్నానని అమ్మా నాన్నలకు ఫోను చేసి చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఎంతో సంతోషించారు. అమ్మ, “ఒరేయ్‌ ఆ కొత్త కారుని ముందు గుడికి తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టాలి. కొట్టాక అప్పుడు డ్రైవ్‌ చెయ్యడం మొదలుపెట్టు,” అని చెప్పింది. అంతవరకూ ఎంతో సంతోషంగా మాట్లాదుతున్న తను ఈ మాటలు వినగానే గతుక్కుమన్నాడు.

“గుడికా?” అని నీరసంగా వినిపించిన తన స్వరానికి అమ్మ కొంచెం దబాయింపుగా,

“అవున్రా. ఏం? అమెరికా వెళ్ళగానే మన ఆచారాలన్నిటినీ మరిపోయావేమిటి?” అని కసిరింది.

“ఆఁ ఊఁ , కాదు, కానీ  ఈ ఊళ్ళో మన గుళ్ళేమీ లేవు.”

“అదేమిటిరా? గుళ్ళేని ఊరేమిటి? అక్కడన్నీ మన దేశంలాగే ఉంటాయని అందరూ చెప్తూంటే! నీకు సరిగ్గా తెలీదు కాబోలు. ఎవర్నైనా అడుగు.”

సరే. అడిగాడు. ఆ ఊళ్ళో గుడి లేదుగానీ, అక్కడకి రెండు వందల మైళ్ళ దూరంలో ఉండే కొంచెం పెద్ద ఊళ్ళో ఒక గుడి ఉందని తెలిసింది. ఆ మాటే మళ్ళీ అమ్మకి ఫోను చేసి చెప్పాడు.

“ఇంకేం? అక్కడికే వెళ్ళి కొబ్బరికాయ కొట్టించి పూజ చేయించుకో,” అంది అమ్మ.

“ఇక్కడ కొబ్బరికాయలు దొరకవమ్మా,” అని నసిగాడు.

“ఫరవాలేదు. నాలుగు నిమ్మకాయలు కొంటే సరి,” అని అమ్మ సులభమార్గం సూచించింది.

“నిమ్మకాయలా? ఎందుకూ?”

“అదేరా. గుళ్ళో పూజ చేయించాక నాలుగు నిమ్మకాయలూ, ఒక్కొక్కటీ తలో టైరు కింద పెట్టి, వాటి మీదుగా డ్రైవు చేసి, ఆ తర్వాత నువ్వెక్కడికి తిరిగినా నీకు శుభం,” అన్నదమ్మ.

“మరవి చితికిపోవూ?” అనడిగాడు అమాయికంగా.

“ఓరి భడవా! చితికిపోవాలనే కదా ఉద్దేశం. చక్కగా నాలుగూ చితికిపోతే, అప్పుడు నీకేమీ ప్రమాదం జరగకుండా రక్షగా ఉంటుంది.”

ఇదేమిటో చాలా తిరకాసు వ్యవహారం గానే అనిపించింది తనకి. కానీ “ఆచారం”, “సాంప్రదాయం” అనేది దేన్నీ ఆచరించడమే తప్ప ప్రశ్నించే అలవాటు ఎప్పుడో పోయింది కాబట్టి, అమ్మ చెప్పిన మాట తూ చా తప్పకుండా పాటించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఇవ్వాళ్టి ప్రయాణం.

నెమ్మదిగా కారు స్టార్టు చేసి హైవే వైపు బయల్దేరాడు శేఖర్‌. అమెరికా వచ్చిన ఆరు నెెలలకే ఎంత బాగా స్థిరపడిపోయాడో అని అమ్మా నాన్నలు అందరికీ డాబులు కొడుతున్నారు గానీ, తనకు మాత్రం ఇంకా ఏమిటో అంతా కొత్త కొత్త గానే అనిపిస్తోంది. అసలు తను తను కానట్టూ, ఎవరో కొత్త మనిషిగా మారినట్టూ, ఉక్కిరిబిక్కిరిగా కూడా అనిపిస్తోంది.

ఇక్కడ గుడి లేదంటేనే అమ్మ నమ్మలేదుకానీ, ఇంకా ఇక్కడ ఎన్ని లేవో తెలిస్తే ఏమంటుంది? అప్రయత్నంగానే మనసు ఇండియాలో ఉన్నవీ, ఇక్కడ లేనివీ జాబితా వేయసాగింది.

సాయంకాలం షికారు వెళ్ళినప్పుడు సరదాగా నమిలేందుకు మిరపకాయ బజ్జీలమ్మే బళ్ళూ, మండుటెండలో చల్లగా సేద తీర్చే కొబ్బరి నీళ్ళూ, నోట్లో వేసుకున్నంత మాత్రమే కరిగిపోతున్నట్టున్న లేత కొబ్బరీ, రోడ్డు మీదకు వెళ్తే చుట్టు జనసందోహం, రెప రెప లాడే చీరలూ, పిల్లల అరుపులూ, బళ్ళ వాళ్ళ కేకలూ, బస్సుల రొదలూ, అంగళ్ళ ముందరో, రోడ్డు పక్కనో, నడివీధిలోనో జరిగే చిన్నవీ పెద్దవీ కొట్లాటలూ, ఊరేగింపులూ, బాజా భజంత్రీలూ, భజన సందోహాలూ, ఏం తోచక కిటికీ దగ్గిర
నుంచున్నా ఏదో ఒక విశేషం కనబడుతూనే ఉంటుంది. వీధిలో ఒకరింట్లో పెళ్ళంటే వీధిలో ఉన్నవారికందరికీ వినోదమే ఆ అలంకారాలూ, లైట్లూ, సరదాగా చూస్తూ ఎన్ని గంటలైనా గడిపేయవచ్చు.

ఇక్కడ రోడ్డు మీద మనుషులే కనిపించరు. అందరూ కార్ల బందీఖానాల్లోంచే లీలగా కనిపించి మాయమౌతూంటారు. పక్కింటికి కూడా ఫోను చేయందే వెళ్ళకూడదు. పైజమా లాల్చీతో బయట తిరగకూడదు. అక్కడ స్వేచ్చగా తిరిగేందుకూ, తోచినట్టు చేసేందుకూ ధైర్యంగా ఉండేది. నన్నడిగే వాళ్ళెవ్వరనే ధీమా ఉండేది. ఇక్కడ ఏం చేస్తే ఏం ముంచుకొస్తుందో అనే భయం, ఏమంటే ఏం తప్పవుతుందోననే బెదురూ ఉన్నాయి. అక్కడ నలుగురిలో కలిసిపోయి ఆ సంఘంలో ఒక భాగంలా ఉండేవాడు. ఇక్కడ తెల్ల కాగితం మీద నల్లటి మచ్చలా తన ఉనికి తనకే కొట్టొచ్చినట్టు ఉంటూ ఎంత ప్రయత్నించినా అందరిలో కలవలేకపోతున్నాడు. అక్కడ జీవితం ప్రతి క్షణమూ, నవ్య చైతన్యంతో సాగిపోతూంటుంది. జరుగుతున్న దానితో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, కేవలం ప్రేక్షకుడిలా కూర్చుండిపోయినా కాలక్షేపానికి లోటు ఉండదు. ఇక్కడ ఎవరికి వారు స్వంతంగా ఏర్పరుచుకునే జీవితం తప్ప ఇంకేమీ ఉండదు. తనలా ప్రేక్షకుడిలా ఉండి జీవితాన్ని ఒడ్డున నిలబడి చూసి ఆనందించాలంటే కుదరదు. అసలు జీవితమే లేకుండా పోతుంది.

ఇదంతా అమ్మా నాన్నలకు అర్ధం అయ్యేలా చెప్పాలని తనెంత ప్రయత్నించినా విఫలుడే అయ్యాడు. “కొత్త కాబట్టి అలా ఉంటుంది. కొన్నాళ్ళు పోతే అంతా అలవాటయ్యి చక్కగా ఉంటుంది,” అని తన మాటలను కొట్టిపారేశారు వాళ్ళు. నిజమే కాబోలని తను కూడా కొత్తలో ధైర్యం తెచ్చుకున్నాడు. కానీ, ఇక్కడి తెలుగు వాళ్ళతో, ఇండియన్సుతో పరిచయమౌతున్న కొద్దీ, ఆ నమ్మకం సమసిపోయింది. ఇరవై, ముఫ్ఫై ఏళ్ళ నుంచీ ఇక్కడ ఉంటున్న వాళ్ళకు గూడా ఇలాంటి ఒంటరితనమే ఇంకా అనుభవమౌతోందంటే దాన్నెలా అర్ధం చేసుకోవాలో తెలియటంలేదు. ఎప్పుడూ “మన” వాళ్ళతోనే జట్టుగా ఉంటూ, వారానికోసారో రెండు సార్లో కలుసుకునే ఆ కొద్ది గంటల కాలం కోసం ఎదురుతెన్నులు చూస్తూ బ్రతకాలంటే మనసంతా నిస్పృహతో నిండిపోతోంది. ఇలాంటి జీవితం కోసమేనా తను ఎదురుచూడాల్సింది? చుట్టూ ఉన్న అందరిలోంచీ వెలి చేసుకుని బ్రతికేందుకే అయితే ఇక్కడకి రావడంలో అర్ధమేమిటి? అసలు తనకెప్పుడూ అమెరికా రావాలనే తపన లేదు. అందుకే ఇలా అనిపిస్తోందేమో?

అమ్మా, నాన్నా ఇదంతా ఇంటి మీద బెంగ ప్రభావమనీ, కొన్నాళ్ళు పోతే అదే పోతుందనీ నచ్చచెప్పడమే కాక, తను ఒంటరిగా ఉండడం మూలాన లేని పోని పిచ్చి ఆలోచనలొస్తున్నాయని కూడా తీర్మానించారు. ఈ రెండు సమస్యలకీ వాళ్ళు చూపించిన పరిష్కారం పెళ్ళిచేసుకోవడం.

అప్పుడే పెళ్ళా? అని తను ఆశ్చర్యబోతే, “అప్పుడే ఏమిటి? చదువైయింది, ఉద్యోగంలో స్థిరపడ్డావు. ఇంక పెళ్ళికి ఆలస్యం ఎందుకు? ఇప్పటికే బోలెడు సంబంధాలు వస్తున్నయ్‌. అది కూడా కానిచ్చేస్తే ఇక మా బాధ్యతలన్నీ తీరిపోతాయ్‌” అన్నారు.

తన పెళ్ళి వాళ్ళ బాధ్యతా తన బాధ్యతా? ఇక్కడికి వచ్చాక, ఇక్కడి పధ్ధతులని కొంచెం ఆకళింపు చేసుకున్నాక, ఇలాంటి ఆలోచనలు కొత్తగా వస్తున్నాయి. అనవసరపు సిగ్గూ, బిదియాలు లేకుండా, మగవాణ్ణి చూడగానే ఎవరో శతృవులా కాకుండా మామూలు మనిషిలాగా చూచి స్నేహంగా మాట్లాడే అమెరికన్‌ అమ్మాయిలను చూస్తే కొంచెం కంగారూ, ఆశ్చర్యం కలిగినా, ఆకర్షణ కూడా లేకపోలేదు. నలుగురితో పరిచయాలు పెంచుకుని నచ్చినవారినెంచుకుని పెళ్ళాడటం బాగానే ఉంటుందనిపిస్తోంది. కానీ, ఎంత ఆకర్షణ కలిగినా, ఇంతవరకూ ఒక్క అమెరికన్‌ అమ్మాయిని కూడా తనంతట తాను పలకరించే ధైర్యం చెయ్యలేకపోయాడు. ఆఫీసులో వాళ్ళతో కూడా అవసరమొచ్చినపుడు మాట్లాడేందుకు ముందర నాలుగు సార్లు రిహార్సల్స్‌ వేసుకుని గానీ మాట్లాడలేకపోతున్నాడు. ఇక వాళ్ళను కాఫీకి రమ్మని గానీ, సినిమాకి వెళ్దామని గానీ అడగగల్గడం కలలో కూడా ఊహించలేని సంగతి. ఎన్నాళ్ళిక్కడ ఉన్నా తనలో ఆ తెగువ వస్తుందనే నమ్మకం లేదు. ఇంక వాళ్ళతో పెళ్ళేమిటి?

ఇక్కడే పుట్టి పెరిగిన తెలుగమ్మాయిలు కూడా కొందరు తగలకపోలేదు. వాళ్ళు అసలు అర్ధం కాలేదు తనకు. చూపులకు ఇండియన్స్‌ లా, చేతలకు అమెరికన్స్‌ లా ఉండే వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో తెలియక తికమకపడిపోయాడు. సూ అనే అమ్మాయితో (పూర్తి పేరు సుజాత) తన పరిచయం స్నేహం దాకా కూడా వెళ్ళింది. ఒక్కోసారి తనమీద జాలితో ఆ అమ్మాయి తనతో స్నేహం చేస్తోందా అనే అనుమానం వచ్చినా, కాదనే ధైర్యం కూడా వెంటనే వచ్చేది.

తన తల్లితండ్రులు తన పెళ్ళి మాట ఎత్తినప్పుడు సూని కానీ, అలాంటి ఇంకో అమ్మాయిని కానీ చేసుకుంటే ఎలా ఉంటుందో అనే ఆలోచన రాకపోలేదు. వాళ్ళలో తనకున్నలాంటి సందేహాలూ, సంకోచాలూ ఏమీ ఉన్నట్టు లేవు. ఇక్కడి వాళ్ళతో బాగా కలిసిపోతారు, మళ్ళీ తెలుగు వాళ్ళతోనూ బాగానే ఉంటారు. అలాంటి పెళ్ళి చేసుకుంటే తనకికూడా ఇక్కడి సంఘంలో స్థానం లభిస్తుందేమో? కానీ ఆ అమ్మాయిల మనసులో తనకు స్థానం లభిస్తుందా? అదసలు తనెలా సంపాదించుకోవాలో? ఇండియాలోలా ఈ అమ్మాయిలు అమ్మా, నాన్నా ఎవరిని చూపిస్తే వారికే తలాడించి పెళ్ళికి ఒప్పేసుకుంటారని తనకు నమ్మకం లేదు. వీళ్ళు కూడా తెలుగు తల్లి తండ్రుల
చేతుల్లోనే పెరిగిన వాళ్ళూ, ఆ తల్లి తండ్రులు కూడా తెలుగు పధ్ధతులనే పాటిస్తున్న వాళ్ళూ మరైతే వీళ్ళకింత స్వేచ్చా, స్వతంత్రాలోచనా ఎలా అబ్బాయబ్బా? ప్రతీదీ తరచి తరచి చూసీ, ప్రశ్నలు వేసీ, దాని అంతేమిటో తేల్చనిదే వదలరు వీళ్ళు.

తన కారుని గుడికి తీసుకు వెళ్తున్నానని చెప్తే సూ ఏమంది? నిమ్మకాయల మాట వినగానే తమాషాగా నవ్వి, “ఓ! అయితే బలి ఇస్తున్నావన్నమాట!” అంది. (ఇంగ్లీషులోనే అన్నది కానీ, సూ అన్న మాటలను తను ఎప్పటికప్పుడు తెలుగులోకి తర్జుమా చేసుకుంటూనే ఉంటూంటాడు).

“బలేమిటి?” అన్నాడు తను విస్తుబోయి.

సూ పకపకా నవ్వేసి, “అయితే నీకా  నిమ్మకాయలెందుకో తెలియదా?” అని నిలదీసింది.

“రక్ష అని మా అమ్మ చెప్పింది,” అన్నాడు తను అనుమానంగానే.

“అదేలే. దేన్నించి రక్షా అని.”

“నాకు తెలియదు.” కష్టమైనా నిజం ఒప్పుకోక తప్పలేదు తనకు.

సూ సాలోచనగా చూసింది. “నీకు పూరీ జగన్నాధుని రథం గురించి తెలుసా?”

“అంటే? ఏం తెలియాలి?”

“దాన్ని ప్రతి సంవత్సరం రథోత్సవానికి బయటికి తీస్తారు. ఒక నరబలి జరిగేంతవరకూ అది కదలదని నమ్మకం. అందరూ పట్టుకుని దాన్ని కదిలించేందుకు తాళ్ళతో లాగుతూంటారు. బరువైన రథం కదా! చాలా శ్రమ పడితే గానీ కదలదు. ఆ తొక్కిసలాటలో ఎవరో ఒకరు దాని చక్రాల కింద పడి నలిగిపోతారు. ఇక రథయాత్ర నిర్విఘ్నంగా సాగిపోతుందని అందరూ సంతోషిస్తారు.”

“నాకేం అర్ధం కావడం లేదు.”

మళ్ళీ నవ్వింది సూ. “విడమర్చి చెప్పాలా? ఎవరో ఒకరు చక్రాల కింద పడేంతవరకూ ఎవరు పడతారో అని అందరికీ ఆందోళనగా ఉంటుంది. ఒకరు పడగానే బలి జరిగిపోయింది కాబట్టి ఇక మిగతా వాళ్ళందరికి భయం లేదని నిశ్చింత పొందుతారు. మీ అమ్మ చెప్పిన నిమ్మకాయలకు అర్ధం అదే. ఎటొచ్చీ మనుషులకు బదులు నిమ్మకాయలను పెట్టి శాస్త్రార్ధం బలి జరిపించేస్తున్నారు.”

చురుగ్గా చూశాడు తను. “నేనమ్మను.”

ఆమె అమెరికన్‌ స్టైల్లో భుజాలెగరేసింది. “ఎందుకు నమ్మవు? బుధ్ధుడు చేసిన సంస్కరణలలో ఈ బలులాపించడం ముఖ్యమైనది. అప్పటినించే ఈ నిమ్మకాయలూ, కొబ్బరికాయలూ వాడే ఆచారం వచ్చిందనుకుంటా.”

అప్పటికే కోపంతో కుతకుతలాడుతున్న తను ఇంక ఆ లెక్చర్‌ వినలేక వెంటనే వచ్చేశాడు. అలాంటమ్మాయితోనా తన పెళ్ళి? ఇండియన్స్‌ అంటే వీళ్ళ మనసులలో కూడా అమెరికన్స్‌ మనసులలోలాగే ఒక తేలిక భావం ఉంటుంది. అందుకే ఇండియా పేరెత్తగానే వీళ్ళకు నరబలులూ, స్త్రీ దహనాలూ తప్ప ఇంకేవీ గుర్తుకు రావు! వీళ్ళతో తనకు సంబంధ బాంధవ్యాలేర్పడుతాయనుకోవడం కేవలం హాస్యాస్పదం. బుధ్ధిగా అమ్మా వాళ్ళు చెప్పిన సంబంధాల్లోనే తనకు నచ్చినదేదో చేసుకోవడమే నయం. కనీసం
ఇద్దరి విలువలూ ఒకటే అవుతాయి.

అప్పుడే గుడి వచ్చేసిందని గమనించి కారాపాడు శేఖర్‌ లోపలికి వెళ్ళి డబ్బులిచ్చేసి, “వాహన పూజ” అని బోర్డు పెట్టి ఉన్న చోటుకి కారుని తీసుకెళ్ళాడు. అక్కడ పూజారి సరంజామా అంతటితోటి సిధ్ధంగా ఉన్నాడు. ఏవో మంత్రాలు చదివి, కారుకు హారతిచ్చి, నిమ్మకాయలు నాలుగూ తలొక టైరు కిందా పెట్టాడు.

పూజారి సంకేతం అందుకుని కార్లోకి వెళ్ళి కూర్చున్నాడు శేఖర్‌. మళ్ళీ మనసుప్పొంగింది. అప్పటివరకు జరిగిన తన జీవితమంతా ఒకసారి కళ్ళకు కట్టినట్టనిపించింది. తన జీవితంలోని వివిధ దశలకి ప్రతిబింబాలలాగా వేర్వేరు వయసుల్లో తనక్కడ నిల్చునట్టు అనిపించింది. మూడేళ్ళప్పుడు అంతులేని కుతూహలంతో ప్రపంచాన్ని తిలకిస్తున్న బాలుడూ, స్కూల్లో, కాలేజీలో సైన్సు అద్భుతాలకి పులకించుతున్న విద్యార్ధీ, తలితండ్రుల మాట విని ఎరగని దేశానికి ప్రయాణమైన విధేయుడైన కుమారుడూ,
జీవితంలో తోడుకోసం వెతుక్కుంటున్న యువకుడూ, నలుగురూ కారుకు నాలుగు వైపులా నుంచున్నట్టు అనిపించింది. వాళ్ళకి వీడ్కోలు ఇస్తున్నట్టు చెయ్యూపి, నాలుగు నిమ్మకాయలనూ నలిపివేస్తూ, ఉత్సాహంగా కొత్త జీవితం వైపుకి సాగిపోయాడు శేఖర్‌.


రచయిత మాచిరాజు సావిత్రి గురించి: జననం ఏలూరులో. తొమ్మిదేళ్ళ వయసు నుంచి అమెరికా, కెనడాలలోనే ఉన్నారు. నివాసం కేలిఫోర్నియాలో. వాతావరణకాలుష్య రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు, నాటకాలు, ఓ నవల రాసారు. ...