1808-1843 నాటి నిజాం రాజ్య చరిత్రలోని చిత్రకథలు 1

ఆంధ్రుల చరిత్రలో వెలుగుచూడని కొన్ని ఘట్టాలు 1: చందూలాల్ వంశ చరిత్ర

మొగలు చక్రవర్తియైన అక్బరు పాదుషాగారి దగ్గర రాజస్య(రివిన్యూ) మంత్రిగా చరిత్రప్రసిద్ధుడైన మహారాజా తోడర్‌మల్లు వంశీయులైన ఖత్రి కులమువారమని చందులాల్‌గారు చెప్పేవారు.

తోడరుమల్లుగారికి అయిదవతరమువాడైన రాయ్ మూల్చందుగారు హైదరాబాదుకు నిజాముల్‌ముల్కు దక్కను సుబేదారుగా వచ్చినప్పుడు మాలవదేశం నుంచి వారితో వచ్చాడు. ఆయన సాయరు సుంకములు (excise) అబుకారీ శాఖకు అధ్యక్షత వహించే ఉద్యోగిగా నియమించబడినాడు. ఆయన కుమారుడు రాయ్ లక్ష్మీరామ్‌గారు కూడా ఆ ఉద్యోగం చేశారు. ఆయనకు నానకురామ్, రాయ్ నారాయణదాసు అనే ఇద్దరు కుమాళ్ళు. నానకురాముగారు తండ్రి ఉద్యోగానికి వారసుడైనాడు. రాయ్ నారాయణదాసుగారికి చందులాల్ గోవిందబక్షు అని ఇద్దరు కుమాళ్ళు. చందులాల్‌గారు సింధియా రాజుగారి కొలువులో ఉన్న బుర్హాన్‌పూరు ప్రభువైన విఠల్‌రాయిగారి కొమార్తెను వివాహమాడినాడు. చందులాలుగారికి బాలప్రసాదు అనే కుమారుడు, ఒక కుమార్తె, నానకుబక్షు అనే చిన్నకుమారుడు కలిగినారు. బాలప్రసాదుకు నారాయణ బహద్దూరనే కుమారుడు కలిగినాడు. ఆయన కొమార్తె కొడుకే ఏడవ నిజాము ఉస్మానాలీఖానుగారి దగ్గర మంత్రిగా కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడుగా నుండిన మహారాజా కిషన్‌ప్రసాద్ బహద్దరుగారు.

మహారాజా చందులాల్ మొదట హైదరాబాదు రాజ్యంలో సాయరు అబుకారీ శాఖలో చిన్న ఉద్యోగం చేశారు. తరువాత ఆ శాఖకు అధిపతియైనారు. 1797వ సం.లో ఆ ఉద్యోగం మానుకున్నారు. ఆ సమయంలో ఇంగ్లీషు కంపెనీవారికి టిప్పుసుల్తానుగారితో జరిగిన యుద్ధములో బళ్ళారి కడప గుత్తి జిల్లాలు నిజాముగారి వాటాక్రింద పంచియివ్వగా వానిని పరిపాలించుటకు చందులాల్‌గారు నియమింపబడిరి. ఆ తరువాత ఆ జిల్లాలను నిజాము 1800 సం.లో సైనిక ఖర్చులక్రింద ఇంగ్లీషువారికివ్వగా అవి దత్తమండలములని వ్యవహరింపబడినవి. మహారాజా చందులాలుగారు నిజాముగారి ప్రధానమంత్రికి సహాయకుడై 1806 సం.లో దివానుపేష్కారుగా నియమింపబడినా ఆయన సర్వాధికారాలుగల మంత్రిగానుండేవాడు. ఆయన 1843 సం.లో పదవిని విరమించగానే నెలకు 30,000 రూపాయల పింఛను ఇచ్చారు. ఆయన 1846 ఏప్రిలు 15వ తేదీన దివంగతుడైనారు.

మహారాజా చందూలాల్ దివాన్గిరీ

ఇంగ్లీషు వర్తక కంపెనీవారి వలలో చిక్కి ఉత్తర సర్కారులను రాయలసీమను వారికి కట్టబెట్టిన హైదరాబాద్ నవాబు నిజామలీఖాన్ 6-8-1803 తేదీన చనిపోవగా ఆయన కుమారుడైన సికందర్‌జా నవాబయ్యెను.

హైదరాబాద్ నవాబు మొదట హిందూదేశమునేలు మొగలు చక్రవర్తికి ప్రతినిధిగా దక్షిణాపథ రాజ్యములను పరిపాలించుటకు నియమింపబడి దక్కను సుబేదారుడని వ్యవహరింపబడుచుండిన నిజాముల్ ముల్కు నంతతివాడు. నిజాముల్ ముల్కు పేరునకు దక్కను సుబేదారుడుగనున్నను 1724 నుండి స్వతంత్రుడుగనే వ్యవహరించుచుండెను. 1803 నాటికి మొగలు చక్రవర్తియొక్క సామ్రాజ్యమంతరించెను. మహారాష్ట్రులు ఇంగ్లీషువారు బలవంతులై యుండిరి. ఆనాటి ఢిల్లీ పాదుషా షాఆలం పేరునకు మాత్రమే చక్రవర్తి. ఆయనకు పూర్వపు రాజలాంఛనములు మర్యాదలు మాత్రము జరుగుచుండెను.

సికందరుజాకూడా తన పూర్వులవలెనే తన దక్కను సుబేదారీని ఢిల్లీ పాదుషాచేత ఖాయపరిపించుకొను ప్రహసనమును జరిపెను. తనతండ్రి ఇంగ్లీషుకంపెనీవారితో చేసుకొనిన సంధి యేర్పాటులనన్నిటిని స్థిరపరచెను. ఆ సంధి షరతుల ప్రకారము నవాబుగారికి సహాయముచేయుటకను మిషతో ఇంగ్లీషువారు ఆరు పటాలముల సైన్యమును హైదరాబాదులోనుంచిరి. వారి ప్రతినిధియైన రెసిడెంటు హైదరాబాద్‌లో కాపురముండి ఇక్కడి వ్యవహారములనెప్పటికప్పుడు కలకత్తాలోని గవర్నరు జనరలుకు తెలియపరచుచుండును.

హైదరాబాద్ నవాబుగారికి కూడా ప్రత్యేక సైన్యమున్నను అది క్రమశిక్షణము పొందినట్టిదికాదు. అందువలన దానికి కూడా ఇంగ్లీషు ఉద్యోగులను నియమించుట అవసరముగనుండెను. కంపెనీవారు క్రమక్రమముగా బలవంతులగుచుండిరి. అన్ని విషయములందును నవాబుగారు వారిపైన ఆధారపడవలసిన దుస్థితి కలుగుచుండెను. బలవంతులగు నీఇంగ్లీషువారికి కోపమువచ్చినచో నేమిచేయుదురో అను భయము నవాబుగారికిని, వారి మంత్రులకునుండెను. నవాబుగారి మంత్రులు ఇంగ్లీషు రెసిడెంటుగారిపట్ల వినయవిధేయతలు కలిగి, వారి కనుసన్నల మెలగవలసినవారైరి. సికందరుజా నవాబగునప్పటికి మీర్ ఆలం ప్రధానమంత్రిగనుండెను. అతడు సమర్థుడేగాక ఇంగ్లీషువారికి అనుకూలుడుగమండెను. అందువలన రాజకార్యములు ఇంగ్లీషువారికి అనుకూలముగ వారి ఇష్టానుసారముగా జరుగుచుండెను. మీర్ ఆలం 1808లో చనిపోవగా ఆయన అల్లుడైన మునిర్ ఉల్ ముల్కుగారును సంస్థాన సైనికపక్షమువారి నాయకుడగు షమ్సుల్ ఉమ్రాగారును ప్రధానమంత్రి పదవినపేక్షించి పోటీపడిరి. ఈ విషయములో నవాబుగారు గవర్నరు జనరలైన మింటోగారి అభిప్రాయమును తెలిసికొనగోరిరి. మింటోగారు షమ్సుల్ ఉమ్రాను నియమించిన బాగుండుననిరి. అయితే నవాబుగారికిది యిష్టములేదు. ఇంగ్లీషువారిని సంతృప్తిపరచుటకై అప్పటికే దివాను పేష్కారుగా నుండి వారికనుకూలుడుగనుండిన రాజాచందులాల్‌గారి సలహా సహాయములతో అన్ని పనులను ఆయన కృతముగానే జరిపించు పద్ధతితో మునిర్ ఉల్ ముల్కుగారిని ప్రధానమంత్రిగా నియమించిరి. ఇంగ్లీషువారు దీనికంగీకరించిరి. సికందర్ జా సుఖలోలుడై భోగవిలాసములందు మునిగి రాజకార్యముల పట్ల శ్రద్ధ వహింపక సంస్థాన పరిపాలనమును దివాను పేష్కారుగారికిని, ప్రధానమంత్రికిని వదలివేసిరి.

రాజాచందూలాల్‌గారు ఖత్రీ అను క్షత్రియకులమువారు. వ్రాతకోతలందు లెక్కలందు ప్రవీణులు. హిందూరాజుల క్రిందను మహమ్మదీయ ప్రభువుల క్రిందను రాజోద్యోగులుగా పనిచేయువారు. చందులాల్ గారి పూర్వులు మొదట 1724లో నిజాముల్ ముల్కుగారితో ఢిల్లీ నుండి హైదరాబాద్‌కు వచ్చిరి. రాజాచందులాల్‌గారు 1776లో జన్మించిరి. ఆయనకు చాలా భాషలు వచ్చును. ఆయన పారసీ ఉర్దూ భాషలలో కవిత్వము చెప్పుచుండెను. ఆయన రచించిన గజల్ అను పద్యముల సంపుటి యొక్కటి ముద్రింపబడి యున్నది. చందులాల్‌గారు దివాన్ పేష్కారుగా ముప్పదేండ్లపై కాలము సమర్థతతో పనిచేసిరి. ఆయన కాలములో హైదరాబాద్ రాజకీయ ఆర్థిక వ్యవహారములందనేక చిక్కులు కలిగెను. వానినన్నిటిని ఆయన ధైర్యముతో ఎదుర్కొని పరిష్కరించెను. దివాను పేష్కారు పని సులభమైనదికాదు. ఒక వంక నిజాముగారికిని ఇంకొక వంక కంపెనీవారికిని గూడా తృప్తికరముగా పనిచేయవలెను. చందులాల్‌గారు ఇంగ్లీషు రెసిడెంట్లు అందరితోను స్నేహముగా నుండి వారి గౌరవమునకు పాత్రుడయ్యెను.

రాజాచందులాల్‌గారు దివాన్ పేష్కారగు నాటికి సంస్థానము యొక్క ఆదాయము సరిగా వసూలగుటలేదు. భూములన్నియు జాగీరుదారుల క్రింద నుండెను. జాగీరుదారులు చాల బలవంతులై సర్కారుకు చెల్లించవలసిన పేష్కషు బాకీలు పెట్టుచుండిరి. భూమి శిస్తు వసూలుచేయు హక్కును, పన్నులు వసూలుచేయు హక్కులును ఇజారాలకిచ్చుట ఆచారముగనుండెను. ఇజారాదారులు ప్రజలను పీడించుచుండిరి. జాగీరుదారులు శాంతిభద్రతలు కాపాడలేకుండిరి. ప్రజల బాధలు మితిమీరెను. బలవంతులు తిరుగుబాటు చేయుచుండిరి. అల్లరులు తిరుగుబాటులు అణచుటకు సైన్యమునంపవలసి వచ్చుచుండెను. హైదరాబాదు ప్రభుత్వమువారు ఇంగ్లీషు సైనికులకు జీతబత్తెములివ్వవలసి వచ్చుటవలనను, సంస్థానములోని అల్లరుల నణచుటకు నియమించు సామాన్య సైనికుల జీతబత్తెములు చెల్లించవలసి యున్నందునను సైనిక వ్యయము పెరిగిపోవుచుండెను. సామాన్య పరిపాలన ఖర్చులకు సొమ్ము చాలకుండెను.

1818లో మహారాష్ట్ర యుద్ధానంతరము గవర్నరు జనరలు ఇంగ్లీషు సహాయక రక్షణపై వ్యయము తగ్గించుటకు, గుర్రపుదళము, కాల్బలము, ఫిరంగి మందుగుండు దళములు అన్నియు కలిపిన మూలబలములను పదివేలకు తగ్గించెను. అయితే చందులాలుగారు తమ సంస్థానములో శాంతిభద్రతలకని సామాన్య (ఇరెగ్యులర్) ఆయుధ జనమును ముందు వెనుక ఆలోచింపక పెంచుచు వానిని ఇంగ్లీషు సైనిక దళాధిపతుల క్రిందనుంచు ఏర్పాటు చేసెను. దీనివలన సైనిక వ్యయము పెరిగెను. సంస్థానాదాయము చాలక ఋణములు చేయవలసివచ్చుచుండెను. హైదరాబాద్ రెసిడెంటగు (సర్) చార్లెస్ మెట్కాఫ్‌గారు సంస్థానములోని ఆర్థిక పరిస్థితులను పరికించుటకు, 1820లో సంస్థానములో పర్యటనము చేసిచూడగా దేశము దుస్థితిలో నుండుట కనబడెను. జాగీరుదారులు జమీందారులు బలవంతులుగానుండి ఒండొరులతో కలహించి పరిసర గ్రామములు కొల్లపెట్టుచుండిరి. దేశములో దారిదోపిడిగాండ్రు చెలరేగి హత్యలు చేయుచుండిరి. రాజబాటలపైన రాకపోకలు రవాణాలు ఆయుధజనుల సహాయము లేనిది జరుగుట దుర్లభమయ్యెను. దేశములో శాంతిభద్రతలు క్రమపరిపాలనము లేకుండెను. నిజాము రాజ్యములోని యుద్యోగులు లంచగొండులుగను అసమర్థులుగను ఉండిరి. శిస్తులు పన్నులు విర్ణయించుటలో క్రమపద్ధతి లేకుండెను. అందువలన దేశములో శాంతిభద్రతలను కాపాడి క్రమపరిపాలనము జరుపుటకు ప్రతి జిల్లాలోను ఇంగ్లీషు ఉద్యోగులను నియమించిన బాగుండునని ఆయన చందులాల్‌గారితో చెప్పగా ఆయన కూడా దీని కంగీకరించెను. ఈ యుద్యోగుల జీతబత్తెములు సంస్థానమువారు చెల్లించు పద్ధతిని ఇంగ్లీషు దొరలు నియమింపబడిరి. వారు త్వరలోనే శాంతిభద్రతలు క్రమపరిపాలనమును స్థాపించి, శిస్తులను నిర్ణయించి వానిని ఖచ్చితముగా వసూలుచేయసాగిరి. పూర్వము లాభము పొందుచుండిన ఇజారాదారులకు లంచగొండులగు ఉద్యోగులకు ఈ క్రొత్త విధానము వలన నష్టము కలిగినందువలన వారు లేనిపోని చాడీలు చెప్పుచు దుష్ప్రచారము చేయసాగిరి. వారెంత ప్రయత్నించినను సికందరుజాగారు 1829లో చనిపోవువరకును ఈ విధానమున మార్పు జరుగలేదు. ఇంగ్లీషువారికి చెల్లించవలసిన సైనిక వ్యయఖర్చులు చెల్లించి సక్రమ పరిపాలనము జరుపుదునని క్రొత్త నవాబుగారివలన వాగ్దానము చేయించుకొని ఆ దొరలను తొలగించిరి. ఇంగ్లీషు ఉద్యోగులు తొలగుటయే తడవుగా దేశములో మరల అశాంతియు అల్లకల్లోలమును చెలరేగెను. ఇంగ్లీషు ప్రభుత్వమువారు చేసిన వాగ్దానము ప్రకారము వారు సంస్థానము యొక్క ఆంతరంగిక పరిపాలనమునందు జోక్యము కలిగించుకొనకుండిరి. అందువలన సంస్థానములోని పరిస్థితులు మరింత పాడయ్యెను. నిజాముగారికిష్టమైన దివానుని నియమించుకొనవచ్చునని ఇంగ్లీషువారు చెప్పినను, చందులాల్‌గారిని తీసివేసి మరియొకరిని నియమింపవలెనని నిజాముగారికి గట్టియుద్దేశమున్నను ఈ పరిస్థితులలో చందులాల్‌గారు తప్ప ప్రభుత్వ వ్యవహారములను నడపగల సమర్థులు మరి ఎవ్వరును లేరని తోచినందువలన ఆయననేయుండనిచ్చిరి. ఆ సమయమున ఇంగ్లీషు సైనిక దళములకు జీతబత్తెములకొరకును, సంస్థానవ్యయముకొరకును గావలసిన సొమ్మును పోగుచేయుటకు చందులాల్‌గారు పడిన పాట్లును ఆ సందర్భమున ఇంగ్లీషు దళారి వ్యాపారసంస్థయైన పామర్ కంపెనీవారు సంస్థానమునకు ఋణమిచ్చుటలో ఆడిన నాటకమును తరువాత జరిగిన చిత్రవ్యవహారములును చరిత్ర ప్రసిద్ధములైనవి.

హైదరాబాదు సంస్థానమున 1824 నుండి నలుబదేండ్లు పెద్దయుద్యోగము చేసిన సుప్రసిద్ధ గ్రంథకర్త మన మెడోస్ టైలరుగారు 24-9-1843వ తేదీన సీమకు వ్రాసిన లేఖలో చందులాల్‌గారిని గూర్చి ఇట్లు వ్రాసియుండిరి.

‘చందులాల్‌గారు అధికార నిర్వహణమున చాలా సమర్థుడైన రాజ్యనీతిజ్ఞుడు. కార్యదక్షుడు. అయితే ఇటీవల నాలుగు సంవత్సరములనుండి ఆయన శక్తిసామర్థ్యములడుగంటినవి. దుర్మార్గులైన గోసాయీలు, బైరాగులు, ఫకీరులు మొదలైన నేర్పరులైన మోసగాండ్రు చందులాల్‌గారి దగ్గరకు వచ్చి స్వర్గధామమునందు హిందూ మహమ్మదీయ పుణ్యమూర్తులును మహానుభావులును ఉన్న సభామధ్యమునందు చందులాల్‌గారాసీనులైనట్లు తమకు దిన్యదృష్టిలో కనబడుచున్నదనిగాని, ఆయనకు ఐహికాముష్మిక సుఖము కలుగునని తమకు రూఢియైనట్లుగాని చెప్పినచో చందులాల్‌గారుబ్బిపోయి వారికి ధనకనకవస్తువాహనములను బహుమతిగా నిచ్చుచుండును. అట్టివారిలో తెలివితేటలుగలిగిన భాగ్యశాలి యావజ్జీవ పర్యంతము సాలుకు వేయిరూపాయలు వచ్చు జాగీరునుకూడా పొందగలుగును. ఇట్టి యుదాహరణములెన్నో జరిగినవి. ఈయననుగూర్చి చెప్పుకొను కథలు చాలా వింతగా నుండుటయేగాక హాస్యాస్పదముగా కూడా ఉండును. ఈముదుసలివాడు ఇంక ఎక్కువ కాలము జీవించునని నాకు తోచుటలేదు. ఇంతవరకు విధివిరామము లేకుండా లౌకిక వ్యవహారములందు మునిగితేలుచున్న చందులాల్‌గారికి పనిలేకుండా ఒకచోట కూర్చుండవలసివచ్చుట దుర్భరముగ మండును. ఎల్లప్పుడును లెక్కలేనంతమంది తననాశ్రయించుచుండగా రాజఠీవితో దర్బారు చేయుచుండునతని ఇంటికెవ్వరును రాకుండా ఇల్లు నిశ్శబ్దముగా నుండుటనాయన సహింపజాలడు. ఆయన గుండెపగిలి త్వరలోనే మరణించగలడు’ అని టైలరుగారు వ్రాసిరి*. ఇది నిజమేయయ్యెను. చందులాల్‌గారు 1845లోనే దినంగతులైరి. (*Letters of Philip Meadows Taylor to Henry Reeve. OxforD University Press. Page 19-118.)

చందులాల్‌గారిని గూర్చి ఏనుగుల వీరాస్వామయ్యగారు 1830లో తమ కాశీయాత్ర చరిత్రలో వ్రాసియున్నారు. చందులాల్‌గారు తిరుపతిలో గోసాయిలకు సదా వృత్తియిచ్చుట కేర్పాటుచేసిరి. అహోబలక్షేత్రమునకు సాలుకు వేయి రూపాయలిచ్చుచుండిరి. శ్రీశైల దేవాలయము మరమ్మత్తు లేక పాడగుచుండగా చందులాల్‌గారు దానిని మరమ్మత్తు చేయించుటకు పూనుకొనిరి. అయితే ఆ దేవాలయము కందనూరు (కర్నూలు) నవాబుగారి రాజ్యములో చేరియుండి దానిని మరమ్మత్తు చేయువారు మరమ్మత్తుకైనంత సొమ్ము నవాబుగారికి హాసీలుగా చెల్లించవలెనను నిర్బంధముండెను. చందులాల్‌గారు చాలా సొమ్ము వ్యయముచేసి మరమ్మత్తులు పూర్తిచేయజాలక విసిగియూరుకొనిరి. చందులాల్‌గారు దేవ బ్రాహ్మణ భక్తి కలవారు. బ్రాహ్మణులు కాపురముండు షాలిబండ అను పేటలో చందులాల్‌గారు ఇల్లు కట్టించుకొని అందు కాపురముండిరి. ఆయన వేదశాస్త్రములనభ్యసించిన పండితులను గాయకులను పోషించుచు దాన ధర్మముల నిమిత్తము చాలా రొక్కము వెచ్చించుచుండెను.

చందులాల్‌గారికి నరేంద్ర బహద్దరను కుమారుడుండెను. ఆయన కుమారుడైన మహారాజా కిషన్ ప్రసాద్ బహద్దర్‌గారు 1900 మొదలు 1912 వరకును హైదరాబాద్ ప్రధానమంత్రిగా పనిచేసి ఏడవ నిజాము ఉస్మానాలిగారు రాజైన పిమ్మట ఆ పదవి నుండి విరమించిరి. 1925 నుండి 1937 వరకును నిజాముగారి కార్యనిర్వాహక సంఘాధ్యక్షులుగా పనిచేసిరి.

చందులాల్‌గారిని గూర్చి ఆ కాలమున రెండు అభిప్రాయములుండెను. ఆయన కుటిలరాజ్యతంత్రజ్ఞుడనియు, లంచగొండియనియు, దుబారాఖర్చు చేయువాడనియు, దుర్మార్గుడనియు, కొందరాయనను గూర్చి చెప్పుచుండిరి. మరికొందరాయన చాలా మంచివాడనియు, కార్యదక్షుడనియు, స్నేహపాత్రుడనియు, దాతయనియు పొగడుచుండిరి. ఏది ఎట్లున్నను చందులాల్‌గారు సనాతనధర్మపరుడు, దేవబ్రాహ్మణ భక్తి కలవాడు. ఆస్తికుడు, దానధర్మములు చేయుటలో ఆయన దానకర్ణుడనిపించుకొనెను. దేశవ్యవహారములను కూడా ఆయన చాలా జాగ్రత్తగా చక్కబెట్టుచుండెను. ఆయనలోనెన్నిలోపములున్నను సికందరుజా పరిపాలనమునందు హైదరాబాద్ సంస్థాన ప్రభుత్వ వ్యవహారములన్నియు జాగ్రత్తగా నిర్వహింపగల శక్తిసామర్థ్యములు గలవాడింకొకడు దొరకలేదు. ఆ కాలమున సంస్థానమునకు తటస్థించిన చిక్కులను ఆయన గనుకనే తొలగించగలిగినాడని చాలామంది అభిప్రాయము.

హైదరాబాద్ సంస్థాన వ్యవహారములు నానాటికి పాడై వానిని చక్కబరచుటకు చందులాల్‌గారికి కూడా అలవిగాని పరిస్థితులు దాపురించెను. అంతట ఆయన తన పదవికి 1843లో రాజీనామానిచ్చిరి. అప్పటి గవర్నరు జనరలైన ఎలెన్‌బరో ప్రభువు చందులాల్‌గారు హైదరాబాద్ దివాను పేష్కారుగా చేసిన అమూల్య సేవను ప్రస్తుతించిరి. నిజాముగారు చందులాల్‌గారికి నెలకు ముప్పదివేలరూపాయలు చొప్పున ఉపకారవేతనమునిచ్చిరి. అయితే చందులాలుగారు పదునెనిమిది నెలలు మాత్రమే దానిని అనుభవించి దివంగతులైరి.

ఆంధ్రుల చరిత్రలో వెలుగుచూడని కొన్ని ఘట్టాలు 2: సికిందరుజా నాటి హైదరాబాదు

సికందరుజావారి హయాములో చివరిభాగమున హైదరాబాదు పరిపాలనము చాలా అధ్వాన్న పరిస్థితికి దిగినది. పన్నుల వసూలు ఇజారాదారుల పరముకాగా వారు జిల్లాలలో బలవంతులై ప్రజలను బాధింపసాగిరి. అల్లరులు చెలరేగినవి. వాటిని అణచి శాంతి నెలకొల్పుట కొరకు సైనిక దళములను ప్రయోగించవలసి వచ్చుచుండెను. రాజబాటలలో దొంగలు విచ్చలవిడిగా తిరుగుచుండిరి. సైనిక బందోబస్తులు లేకుండా ప్రయాణము చేయుటయే దుర్ఘటమైనది. రెవిన్యూ పన్నుల వసూలు కొరకు ఇంగ్లీషు దొరలను ప్రత్యేక కలెక్టరులుగా నియమించవలసి వచ్చెను. అప్పుడు నిజామురాజ్య ప్రభుత్వము దేశములోని వర్తకులగు ఇంగ్లీషువారికినిగూడా రుణపడినది.

1808–1838 మధ్య మన దేశములో ఇంగ్లీషు సైనికోద్యోగిగానుండిన హెచ్. బివాన్‌గారు తాను చూచిన సంగతులను గూర్చి ఒక గ్రంథమును వ్రాసినాడు. అందులో అప్పటి హైదరాబాదును గూర్చి వర్ణించి, అక్కడి స్థితిగతులను వివరించినాడు. అతడిట్లు వ్రాసెను.

హైదరాబాదు గొప్ప నగరము. దానిలో జనులు క్రిక్కిరిసి నివసించుచున్నారు. ఈ మహానగరమున మహమ్మదీయులు, పఠానులు, హిందువులు జీవించుచున్నారు. గాని తురక మహమ్మదీయుల సంఖ్యయే హెచ్చుగానున్నది. హైదరాబాదు తురకలు హిందూదేశములో నున్నవారందరిలోనూ క్రూరులైన దుండగీండ్రుగను, ఆకతాయిలుగానున్నారు. ఈ బస్తీలో దెబ్బలాటలు, అల్లరులు నిత్యకృత్యములుగా జరుగుచున్నవి. ఆయుధపాణులు వచ్చి ఆపివేసినగాని అవి ఆగవు. ఒకప్పుడీ దేశమును తాము పాలించితిమనియు, ఈ తెల్లవారు తమను త్రోసిరాజనినారనియు యీ తురకలు మరచిపోలేదు. అయితే వారా ద్వేషభావమును పైకి చూపక లోలోపలనే అణచుకొనవలసి వచ్చినందువలన ఆది తగ్గుటకు బదులు మరింత తీవ్రముగా వృద్ధియగుచున్నది. తగిన రక్షణము లేకుండా తెల్లదొరలెవ్వరును ఆ బస్తీలో పోవుటకు సాహసింపరు. ఒకవేళ ఎవ్వరైనను అట్లు పోవుటకు సాహసించినచో వారు అవమానమును పొందకుండగను, బహుశః దెబ్బలుతినకుండగను తప్పించుకొనలేరు. ఇంగ్లీషు బాటసారులను ఈ తురకలు తిట్టినట్టి తిట్లు నోట వచింపరానివి. హైదరాబాదులో ప్రజల నీతినియమములు ఎంతమాత్రము బాగుగలేవు. పుంమైథునము మొదలైన అసహజములును, అమానుషములునగు దుష్ప్రవర్తనములు చాల ఎక్కువగా నుండి సర్వసామాన్యముగా ప్రజల సంభాషణములందు బహిరంగముగా వినవచ్చుచుండెను. ఇంగ్లీషు సైనికదళములు కనుక అక్కడ లేకపోయినచో హైదరాబాదులోని ధనవంతులైన గొప్పవారును, వర్తకులును, షాహుకారులును ఒక్కరైనను క్షేమముగ బ్రతకలేరు. సగము ఆకలితో వీధులవెంబడి తిరుగు ఆకతాయిమూకలు సైనిక దళములు లేనిచో బస్తీని దోచుకొనెదరనుటకు సందియము లేదు. హైదరాబాదులో వాణిజ్య పరిశ్రమలు చాలా తక్కువ. కీన్కాబు జలతారుబుటేదారు పనిచేసిన పట్టుబట్టలు, తలపాగాలు, చిల్లరనగలు తయారుచేయుటయే అక్కడి ప్రధానవృత్తులు. దేశ ప్రజలుపయోగించు ఉన్ని నూలుబట్టలు చాలవరకు ఐరోపాదేశమునుండియు మచిలీపట్టణము నుండియు నరసాపురము దగ్గరనున్న మాధవాయపాలెము నుండియు, ఇంజరము మొదలైన ప్రదేశముల నుండియు దిగుమతి చేయుచున్నారు. ఉన్న కొలది పరిశ్రమలును హిందువుల చేతులలోనేయున్నవి. హైదరాబాద్ నవాబైన నిజాముగారి కొలువులో స్త్రీల సైనికదళమొకటియున్నది. వీరు ఇంగ్లీషు సైనికులవలెనే ఆయుధములను సైనిక దుస్తులను ధరించి కవాతులు చేయుచుందురు. వీరు జనానాకు కావలిగానుండిరి.

నిజాముగారు రాజ్యపాలనమునెల్ల తమ దివాను పేష్కారు అయిన చందులాల్‌గారికిని ఆయన క్రింది అధికారులకును వప్పగించినారు. మంత్రులు చాలా నిరంకుశులు. ఇంగ్లీషు ప్రభుత్వ ప్రతినిధియైన రెసిడెంటుగారు వీరి పైన కొంత పెత్తనము చెలాయించుచున్నారు. నిజాముగారు చాలా సుఖలోలుడు. అవినీతికరమైన బస్తీయందెల్ల నిజాముగారి కొమాళ్ళు మరియు అవినీతి వర్తనులుగానున్నారు. సికిందరాబాదు బోలారములు ఇంగ్లీషువారి సేనలుండు దండుప్రదేశములు. ఇక్కడి దళములలో పండ్రెండువేలమందియున్నారు. వీరిలో పదవవంతు తెల్లవారు. ఇక్కడి వర్తకులును, షాహుకారులును ఇక్కడి దుర్మార్గులవలన బాధపడలేకుండా నుండుటకు ఇంగ్లీషువారిపైననే ఆధారపడియుందురు.

హైదరాబాదులోనున్న షాహుకారులును వడ్డీవ్యాపారస్థులును హిందూదేశములోని ఇతర ప్రదేశములలో నున్నవారివలె గౌరవముకలవారు కారు. వీరు ఆస్తి తాకట్టుపెట్టుకొనిగాని వస్తువులు కుదువపెట్టుకొనిగాని బుణములిచ్చెదరు. వీరు చాలాహెచ్చువడ్డీలు పుచ్చుకొనెదరు. తాకట్టు ఆస్తి విలువ తగ్గించియు ఇంకను ఇతర విధముగాను మోసముచేయుదురు. ఇంగ్లాండులో తాకట్టుపెట్టుకొని అప్పులిచ్చువారిని వీరు మించిపోయినారు.

హైదరాబాదు చుట్టునున్న ప్రదేశము ముఖ్యముగా బస్తీకి ఆనుకొనియున్న తటాకము దగ్గరనున్న ప్రదేశములు చాలా సుందరముగానుండును. వ్యాహ్యాళికి పోవుటకు చాల చక్కని రాజబాటలును నిజాముగారి యుద్యానవనములు రెసిడెంటుగారి తోటలు ఇంగ్లీషు యుద్యోగుల బంగాళాలు తోటలు ఇండ్లు చాలా అందముగా నుండును. (Thirty years in India (1808-1838) Major Bevan; Story of my life. Meadows Taylor pages 47-60.)

1829 నాటి హైదరాబాదు రాజ్యమును గూర్చి కొన్ని విశేషములు మెడోసు టెయిలరుగారు వ్రాసిరి. మెడోసు టెయిలరుగారిని హైదరాబాదు రాజ్యమున పడమటి జిల్లాలలో అసిస్టెంట్ పోలీసుసూపరెండెఁటుగా నియమించిరి. ఆతనియుద్యోగపుజిల్లా ముఖ్యపట్టణము సదాశివపేట. దానిచుట్టు ప్రక్కల గల దేశములోని ప్రజల మాతృభాష తెలుగే. అయితే కొంతదూరములోనే ప్రజలు కన్నడము మాట్లాడుదురు. అయినప్పటికిని ఆ ప్రాంతమునందలి వ్యవహారములెల్ల మహారాష్ట్ర భాషలోనే జరుగుచుండెను. బీరారు పడమటి సరిహద్దులనుండి ఉప్పు మిరియములు మొదలైన మసాలాదినుసులకు బదులుగా ప్రత్తి నూనెగింజలు అల్లము శొంఠి ధాన్యము ఎగుమతి దిగుమతి వ్యాపారమునకంతకును కూడ హమినాబాద్ పట్టణము కేంద్రముగానుండెను. అక్కడి వర్తకులలో ఆత్మారాము సేఠ్‌గారు చాలా పలుకుబడి కలిగినవాడు. అక్కడ కొందరు వర్తకులు దొంగతూకముతూచి ప్రజలను మోసగించుచున్నట్లును, గోధుమపిండిలో ఇసుక కలిపి అమ్ముతున్నట్లునూ తెలియగా గోధుమపిండి అమ్ము వర్తకులను టెయిలరుగారు మందలించి జరిమానాలు విధించిరి. గోధుమపిండిలో ఇసుకకలిపి అమ్ముతున్న వర్తకులకు బుద్ధిచెప్పదలచి టైలరుగారు తన జవానును పంపి దొరగారు గోధుమ పిండి కొనదలిచిరి కావున తక్కిడతో మీ సరుకును తీసుకునిరమ్మని చెప్పి పంపించి ఒక వర్తకునివద్ద ఒక సేరు గోధుమపిండిని తూపించి దానినావర్తకునే తినమనిరి. ఇసుకకలిపిన ఆ పిండిని అతడు తినలేక బాబు బుద్ధివచ్చినదనినాడు. అంతట అక్కడి వర్తకులందరును సమ్మెకట్టి తమయంగళ్ళను మూసివేసి ప్రక్కనున్న మామిడి తోపులలోనికిపోయి భీష్మించుకొని కూర్చుండిరి. ప్రజలకిందువలన ఇబ్బంది కలిగెను. అంతట టెయిలరుగారు దేశములో మహారాష్ట్రులకును ఇంగ్లీషువర్తక కంపెనీ సైన్యములకు జరిగిన యుద్ధములందు ఇంగ్లీషు సైన్యములకు తినుబండారపుసరుకులను సరఫరాచేసిన బ్రింజారీ(లంబాడీ)ల నాయకులను పిలిపించి ఒక స్వతంత్రమైన బజారును స్థాపించెను. అంతట ఇతర గ్రామములనుండి రకరకముల సరుకులు దిగుమతియగుచుండెను. పారిపోయిన వర్తకులను మరలపిలువనంపుమని కొందరు జిల్లా పెద్దమనుష్యులు టెయిలరుగారికి చెప్పినను అతడు వినలేదు. అంతట అతని పైన కొందరుహైదరాబాదు ముఖ్యమంత్రియైన చందులాల్‌గారిదగ్గర ఫిర్యాదుచేసి అతడు పట్టణములో దౌర్జన్యములు కావించి చాలా సొమ్ము లాగుకొనుచున్నాడని అబద్దములు కల్పించిచెప్పిరి. ఈ విషయమును గురించి హైదరాబాదులోని రెసిడెంటుగారు టెయిలరుగారిని సంజాయిషీ అడుగగా ఆయన జరిగిన సంగతి చెప్పెను. ఇంతలో ఆతనిపైన ఫిర్యాదుచేసిన వర్తకశిఖామణులు కాళ్ళబేరమునకు వచ్చిరి. తమనుగూర్చి టెయిలరుగారు పొరపాటు అభిప్రాయమును పడినారనియు అసలు నేరముచేసినవారిని తాము పట్టి ఇచ్చెదమని, వారినతడు తన ఇష్టమువచ్చినరీతిగా దండింపవచ్చుననియు ఒకవిన్నపమును టెయిలరుగారికిచ్చిరి. హైదరాబాదు రెసిడెంటు మార్టినుగారు ఇది విని సంతోషించి యీ సంగతిని మంత్రిగారికి తెలిపిరి. అప్పుడు చందూలాల్‌గారొక ప్రత్యేకాధికారిని పంపగా అతడు వర్తకులను గట్టిగాతిట్టి వారిపై పదివేలరూపాయలు జరిమానా విధింతునని బెదరించెను. అంతటి పెద్దశిక్ష విధింపవలదని టెయిలరుగారతనిని బతిమాలిరి. అప్పుడతడు వర్తకుల దగ్గర కొంతసొమ్ము లంచము తీసుకొని వెడలిపోయెను. తరువాత టెయిలరుగారు హైదరాబాదుకు వెళ్ళి మంత్రి చందూలాల్‌గారిని దర్శించినప్పుడు “మీరా హమీనాబాదు వర్తకులపైన గట్టిచర్యను తీసికొనకుండా చేసితిరి. వారిని మీరు బాగుగా పట్టివేసితిరి. నేను వారిదగ్గర నుండి ఒక లక్ష రూపాయలను గుంజుకొనియుండెడివాడను” అని మంత్రిగారు పలుకగా టెయిలరుగారు “మహారాజా మీరట్లుచేసినచో మీ మంచిపేరు పోయియుండునుకదా. తమ గౌరవము కాపాడినందులకు తమరే నాకొక ఏబది వేలరూపాయలు బహుమానమొసగవలెను” అనిరి.

టెయిలరుగారి క్రిందనుండిన జిల్లాలోని చాలాభాగములు గొప్పజాగీరుదారుల క్రిందను, జమీందారుల క్రిందను చేరియుండెను. వారు హైదరాబాదు ప్రభుత్వమువారు తమ వ్యవహారములందు జోక్యము కలిగించుకొనుట కిష్టపడకుండిరి. వారు చాలా బలవంతులుగానుండి దోపిడీగాండ్రకు సహాయము చేయుచు దొంగసొమ్ములో భాగము పంచుకొనుట కలవాటుపడియుండిరి. టెయిలరుగారి కందువలన నిక్కడ శాంతిభద్రతలను కాపాడుట చాలా కష్టతరమైన కార్యముగానుండెను. ఇదిగాక, కొంతమంది కొండరాజులును నాయకులును తామే దోపిళ్ళు చేయుచుండిరి. అట్టివారి దుశ్చర్యలు మితిమీరిపోయినప్పుడు హైదరాబాదు ప్రభుత్వమువారి యుత్తర్వులను పొంది, వారిని పట్టుకొని, హైదరాబాదు పంపగా, నక్కడ వారిని చందులాల్‌గారు కారాగారమున పెట్టించుచుండిరి. ఇట్టివారిలో గుర్రముకోట రాజా అని పిలువబడు నారాయణరావనునతడు తన దగ్గర బందుగునొకని హత్యచేసి, ఆస్తిని దోచుకొనిపోయెను. అప్పుడతని కోటలోనికి టెయిలరుగారు చాలసాహసముతో ప్రవేశించి ఆతనిని పట్టుకొనిరి. ఆతడు అప్పుడు టెయిలరుగారికి 24,000 రూపాయలు లంచమిచ్చెదనని ఒక బరాతము వ్రాసియిచ్చెను. టెయిలరుగారా సొమ్మును తెప్పించుకొనక అతనిని హైదరాబాదుకు తీసుకొనిపోవుచుండగా అది చాలదని అతడు అభిప్రాయపడుచుండెననుకొని, నారాయణరావు ఏబదివేలిచ్చెదనని బేరముపెట్టెను.

తాము నారాయణరావును చందూలాల్‌గారి దగ్గర హాజరుపెట్టెదమని, ఆ సొమ్మును చందూలాల్‌గారికే సమర్పించవలసినదని టెయిలరుగారనిరి. అట్లు చేయవలదని ఒక లక్ష రూపాయలిచ్చెదననియు నారాయణరావు బతిమాలెను గాని టెయిలరుగారు నిరాకరించిరి.

చందులాల్‌గారు తన దగ్గరనున్న ధనమునెల్ల లాగుకొనునని నారాయణరావు భయము. చందులాల్‌గారు సాధారణముగా బ్రాహ్మణులకురిశిక్ష విధింపరు. వారి ధనము మాత్రము లాగికొందురు.

టెయిలరుగారు చందూలాల్‌గారిని దర్శించగా, నారాయణరావు ఇచ్చెదనన్న లక్ష రూపాయలు ఎందుకు తెప్పించవైతివి, ఇక మనకా ధనము కనపడనివ్వరని చందులాల్‌గారు వగచిరి.

నిజాముగారి జమీందారులు ఉత్తరసర్కారులలో కూడా చాలా దౌర్జన్యములు చేసిరని హైదరాబాదు రాష్ట్రమునందు ప్రతిదినము బందిపోట్లు జరుగుచుండెనని దొంగలగుంపులు గ్రామములను దోచుకొనుచుండెనని బిల్ గ్రామీగారు తమ గ్రంథమున వ్రాసినారు. (ఆంధ్రుల సాంఘిక చరిత్ర: సురవరం ప్రతాపరెడ్డిగారు పుట 441- 444)

1819 మొదలు 1835 వరకు మద్రాసు సుప్రీంకోర్టులో ఇంటర్‌ప్రెటర్‌గా నుండిన ఏనుగుల వీరాస్వామయ్యగారు 1830-1831 మధ్య కాశీయాత్రకు పోవుచు, హైదరాబాదు రాజ్యమునందు ప్రయాణముగావించి కొన్నాళ్ళు హైదరాబాదు నగరములోనుండిరి. వారు చూచిన సంగతులను ఆయన తన మిత్రుడైన కోమలేశ్వరపురము శ్రీనివాసపిళ్ళేగారికి ఎప్పటికప్పుడు వ్రాయుచుండిరి. ఆ వృత్తాంతము కాశీయాత్ర అను పేరుతో 1838లో ప్రకటింపబడెను. అందులో ఆనాటి పరిస్థితులెల్ల కన్నుల గట్టినట్లు వర్ణింపబడియున్నవి.

హైదరాబాదు నవాబు క్రింద ఆనేక జమీనుదారులు నిర్ణీతమైన రూకలు కట్టి సకల రాజ్యతంత్రములను తమ జమిందారీలో స్వతంత్రముగా జరిపించుచున్నారు. సేనాసహాయము సంపద ఎక్కువగాగల జమీందారుడు నిర్ణయమైన సొమ్మును ఇచ్చుటలేదనికూడ చెప్పుచున్నారు. అప్పుడు హైదరాబాదువారు దండెత్తివచ్చి కొట్టి సాధించి సొమ్ము తీసుకొనుచున్నారు. ఆ జమీందారుల కొకరికొకరికి సరిపడనప్పుడు పోట్లాడి చావడమేకాక, ఒకరి గ్రామములనొకరు కొల్ల పెట్టి రైతులను హింసించి, గ్రామాదులను పాడుచేయుచున్నారు. ఈలాగున కలహములు పొసగినప్పుడు న్యాయము విచారించి ఒకరికొకరిని సమాధానము పరచకుండా దివాన్‌జీతనము చేయు చందులాల్ ప్రభృతులు ద్రవ్యకాంక్ష చేత ఉభయులకు కలహములు పెంచి వేడుకచూచుచున్నారు. ఈ లాటి ప్రారబ్దము నాప్రయాణ కాలములో వనపర్తి జమీందారుగారికిని, కొల్లాపురము జమీందారిగారికిని ఒక సంవత్సరముగా పొసగి తహతహపడుచున్నారు. పెంటుపల్లి అను గ్రామములోని కోటలో హైదరాబాదు నవాబు గారిది కొంత ఫౌజు ఉన్నది” అని వీరాస్వామయ్యగారు వ్రాసినారు. (కాశీయాత్ర చరిత్ర 24-25).

జమీందారువారి ఆధీనములోనుండుభూమిపైన పూర్ణమైన స్వాతంత్ర్యము కలిగి ఆయా భూములలోని కాపురస్తులను భర్త భార్యపైన చెల్లించు అధికారముకంటె ఎక్కువైన ఆధికారముతోనే యున్నారనికూడా వ్రాసిరి. (చూ. కాశీయాత్ర చరిత్ర 33-38) ఆయన వ్రాసి 120 సంవత్సరములు దాటినను ఇప్పటికినీ హైదరాబాదు జాగీరులలో రైతులు సర్వరహితులుగనున్నారని సురవరం ప్రతాపరెడ్డిగారు ఆంధ్రుల సాంఘిక చరిత్ర మొదటి ముద్రణమున వ్రాసియున్నారు.