ఆఫీస్ నుంచి బైటపడి ఫోన్‌లో వెతికిమరీ హైదరాబాద్‌ని గుర్తు తెచ్చే పాట ఒకటి పెట్టుకుని వింటూ ‘అటా? ఇటా?’ అనే అనుమానంలో ఎటూ కదలలేకుండా విపరీతంగా ట్రాఫిక్ జామ్. పొడిమంచు పొడిగా రాలుతూ చుట్టూరా. జనంతో పాటుగా ఇంటికెళ్ళిపోతున్న దినం.
ఏమైందో అని ఆత్రుతో, ఏదో జరగాలని కోరికో, ఏంటో మరి ప్రతివాడు కదల్లేక కదల్లేక కదులుతున్నారు. విరిగిపడిన బెల్లంగడ్డ సందర్శనార్థం దారిచేసుకున్న చీమల్లా మేమందరం. రెండు లేన్లని మూసేస్తూ దీనికంతటికీ కారణం నేనే అన్నట్టుగా పెద్ద ట్రక్.
దాదాపుగా నిశ్చలత్వం పొందిన ట్రాఫిక్. అందరిలోని అసహనాన్ని, అలసటని కక్కుతూ కార్లలో నుంచి పొగ. ఆ సాయంత్రం రాసిపెట్టబడిన కార్పొరేట్ కష్టాల అసహనం, సంస్కారం ఆధారంగా ఆ ట్రక్ డ్రైవర్‌ను రకరకాల స్థాయిలలో దుర్మార్గుడిగా తీర్మానించుకున్నారు, నాతో సహా ఆగిపోయిన డ్రైవర్లందరూ.
ఇంకాస్త ముందుకి చూస్తే నుజ్జునుజ్జు అయిన కారులో ఒక పడుచుపిల్ల. ’స్టూడెంట్ డ్రైవర్’ అని కారు వెనక అద్దం మీద స్టికర్. విండ్‌షీల్డ్ మీద మంచుని వైపర్ తుడిచేస్తున్నట్టుగా తప్పొప్పులు మారిపోతున్నాయ్.
ఇలా సెకనుకొక వాస్తవికత. అసలు వాస్తవమే కట్టుకథ. ఆలోచనలు నింపే అర్థంలేని అస్తిత్వాలు అల్పమై, మనసు తేలికై, కొన్ని క్షణాలలో సాయంత్రపు న్యూయార్క్ బ్రిడ్జి మీదకి నడకకు తీసుకెళ్ళాయి.
ఎందుకో తెలీదు, వర్షంలో తడవనంటే చాలు మనస్సు ఎండిపోతుంది. తేలికపాటి జల్లుల్లో, ఏటవాలు రోడ్ల పైన పారుతున్న నీటి మీద స్ట్రీట్ లైట్ల వెలుతురు. వెలిసిపోయిన తెరపై నిజజీవితపు సినిమాని చూస్తున్నట్టు ఉంటుంది నాకు. అది చూస్తూ నడవాలని ఉంటుంది, ఆడాలని ఉంటుంది. డాన్స్ తప్ప నన్ను నేను మర్చిపోయే పని ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. ఆ క్షణాల్లో నన్ను నేను దాటడం కూడా నాకు చాలా సులువు.
బ్రిడ్జి మీదగా నడిచివెళ్తూవుంటే అమ్మ-నాన్న వీడియో కాల్. “ఎక్కడున్నారు?” అని అడిగితే “ఇక్కడే. మన ఇంటి ముందు స్కూల్ అరుగు మీద” అన్నారు. వీడియోలో వాళ్ళ వెనక నలుపు ఊడిపోయి, రాతలు రాలిపోయిన బ్లాక్‌బోర్డు ఒకటి బ్యాక్‌గ్రౌండ్ లాగా. రెండు జీవితాలు ఒక్కటై మగ్గుతున్నాయి ఆ వీడియోలో నా కంటికి.
చాలా మామూలు దృశ్యమే అది. కానీ అసాధారణంగా దాడిచేసింది, జీవితంలానే! న్యూయార్క్‌ని నిద్రపోని నగరం అంటారు కదా. నియాన్ లైట్లు, హడావిడి నడకలు-కదలికలు, నిరంతరం ఒక అల్లికలాంటి గజిబిజి. అన్నిటి మాటున సగటు మనిషి అల్పత్వాన్ని దాటి అందరి ఆత్మలెక్కడో స్పష్టమయ్యే నగరం కూడా. టైమ్ స్క్వేర్‌లో ప్రతీ మనిషి మొహాన ఉండే ఒక వింత చూపు సాక్ష్యం.
ప్రతీ విమానం చేసే చప్పుడికి ఉలిక్కిపడి చూసే మనసు ఈ ఊరిది. వద్దనుకున్నా వినపడే చప్పుడు చెవులు ఇన్‌వాలంటరీగా నిజాలను మోసుకుంటూ వచ్చి తలని, అందులో ఉన్న జ్ఞాపకాలని తిప్పేస్తాయి. ఆ జ్ఞాపకాలు గుండెని మెలిపెడతాయి. గాలిలో లేని వెచ్చదనం గుండెల్లో ఎక్కడ ఉంటుంది అన్నంత కర్కశంగా ఉంటుంది మనస్సు ఆ సమయాల్లో. అలానే ఉండింది ఆ రోజు నాకు. మరో వారం అయితే గాలిలో జీవం గడ్డకట్టిపోయే రాత్రి అది. పార్కింగ్ స్ట్రక్చర్ బయటకివచ్చి నిలబడేసరికే కార్ కీస్ చేతికి ఇచ్చి ‘ప్లీజ్, దట్ వే’ అన్నట్టు చూస్తున్నాడు వాలే పార్కింగ్‌వాడు.
వాడి దగ్గరికెళ్ళి తెలుగులోనే మాట్లాడాలని అనిపించింది.
‘విను. నాది ఇండియా. ఇప్పుడే ఫోన్ వొచ్చింది. మా కరెన్సీ రూపాయల్లో ఉంటుంది. పది అంటే టెన్. పది రూపాయల మించి లెక్కలు ఎరగని అమాయకత్వం తన జీవితం. తను ఇక లేదంట. వెళ్ళిపోయేముందు జ్ఞాపకాలన్నీ రివ్వున తిరుగుతాయంటారు. ఇది పూర్తిగా జ్ఞాపకశక్తి కోల్పోయిన మనుషులకి కూడానా?’ అని అడగాలని అనిపించింది. నిండా అమాయకత్వమైన అమ్మమ్మని ‘తను’ అని సంబోధించిన దూరం గొంతులో అడ్డొచ్చి, చేతులకి చలి తెలిసింది. ‘హేయ్! యూ. మూవ్ మాన్!’ అని మళ్ళీ వాడే. Here is New York, on a wintry night for you!
ఇన్ని గుర్తొచ్చిన ప్రాణం ఊపిరిని కోరుకుంది. రద్దీ న్యూయార్క్ అయినా ఒక్క క్షణం కారులో ఉండాలనిపించలేదు. కారుని ఎక్కడో దగ్గర మళ్ళీ వదిలేసి నడుస్తూ, తడుస్తూ, నడుస్తున్నా ఒక నది వెంట. నా ముందు అటు నుంచి ఇటు అమాంతంగా ఒక బ్రిడ్జి. వర్షపు సాయంత్రాలు ఇచ్చే నాదైన మానిక్ ఎనర్జీ నాలో కనిపించట్లేదు.
న్యూయార్క్‌లో ఎన్ని బ్రిడ్జిలో, అందులో ఇదేంటో, ఎప్పుడు కట్టారో దీన్ని, ఇది చూసిన మనుషుల్లో ఎంతమంది నాలా గుండె చిట్లిపోయే అనుభవాలని మోసుకుంటూ ఒంటరిగా నడిచారో ఈ తీరం వెంట.
నా చుట్టూ ఇపుడు పూర్తిగా చీకటి. వర్షపు నీళ్ళు, పెట్రోల్ కలిసి రోడ్ల మీద అంతటా చిన్న చిన్న ఇంధ్రధనస్సుల రంగులు.
తల ఎత్తి బ్రిడ్జిని చూస్తే దూరంగా ఒక జంట నడక గొడుగు నీడన. కదిలీ కదలనట్టుగా, అక్కడే నిల్చుండిపోయినట్టుగా, ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోలోంచి సజీవమై చలనం పొందినట్టుగా, గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న సెకండ్స్ ముల్లులా… ఇన్ని వర్ణనలు మోస్తూ వాళ్ళు.
ఎందుకో ఇందాకటి వీడియోకాల్ లోని అమ్మ నాన్న గుర్తొచ్చారు. సాధారణ దృశ్యమే అది. పూర్ణానుభవమై తోచింది.
మూడేళ్ళు ఒకే ఆఫీస్‌కు రోజూ వెళ్తుండే శ్రమ అడగని అలవాటు వల్ల ఇల్లు చేరుతున్నా. రేర్ వ్యూ మిర్రర్‌లో చూస్తే ఇందాకటి ట్రాఫిక్ జాడ ఏదీ లేకుండా వెనక్కి పాకుతూ రోడ్డు. పొడి పొడి మంచు, సాయంత్రపు ఆఖరి వెలుగు, ఏవీ లేవు.
ఎటూ కదలనివ్వని డ్రైవర్ సీట్లో అక్కడే కూర్చొని ఎంత ప్రయాణం! ఎన్ని హక్కులు ‘క్షణం’ అనే ఒక ఎంటిటీ మీద మన మనస్సులకి!
ఆ ఆక్సిడెంట్లో ఆ పడుచుపిల్ల భయం, అస్తిత్వపు శూన్యాన్ని నింపే మన ఆలోచనలు. ‘ఈశ్వరా! ఎంత నాటకం?’
అమ్మ-నాన్న, న్యూయార్క్ బ్రిడ్జి మీద ఒక జంట నడకలో ఆవహించిన సమ్యక్‌మోహన రాగం. ఎంత నిండుతనం. ‘ఈశ్వరా! ఎంత భోళాగాడివి నువ్వు?’
ఇన్ని అనుభవిస్తుంటే అమ్మమ్మ ఒక్కసారిగా మెరిసి మాయమైంది.
‘నువ్వంటూ ఒకడివి ఉన్నా లేకున్నా, మా జీవితాల నుంచి జ్ఞాపకాల వరకు, అన్నీ క్షణికాలే కదా ఈశ్వరా నీకు!’