అవీ ఇవీ ముచ్చట్లు: భారతమూ పురుషార్థాలూ

షేక్స్‌పియర్, దాన్తెలు యూరపును పంచేసుకున్నారు, అన్నాడు ఎలియట్. యుగాలముందే, వాల్మీకి, వ్యాసుడు (వ్యాసవాల్మీకులు అనికూడా కొందరంటారు) భరతవర్షాన్ని ఆక్రమించుకున్నారు. తులసీదాసు ఉత్తరభారతాన్ని తుంచుకున్నాడు. పోతన తెలుగునాట నాటుకున్నాడు. ఆంధ్రమహాభారతం మాత్రం తెలుగుదేశంలో మూలల్లో దాగి అరణ్యవాసం అజ్ఞాతవాసం చేస్తున్నది, మళ్ళీ మళ్ళీ వ్రతభంగమైనట్టు.

కొంతసేపు పడమటికి తిరిగి దణ్ణం పెడదాం. ఇంగ్లీషు తెలిసినవాడెవడైనా షేక్స్‌పియర్ చదవవచ్చు. పాండిత్యం అవసరంలేదు. రసజ్ఞత చాలు. దాన్తెను చదవాలంటే, ఒక గ్రంథాలయమే అవసరం. చాలా కావాలి. మధ్యయుగపు చరిత్ర, భూగోళం, ఖగోళం, కవి చేసిన విచిత్రవిశ్వనిర్మాణం, క్రైస్తవమతశాఖలు, పోపుల రాజుల వివాదాలు, గ్రీకు యితిహాసం, యివి కాక దాన్తె కాలపు కవులు చిత్రకారులు, దాన్తె అభిమానకవులు, ఆనాటి రాజకీయాలు, సాధారణపౌరుల ప్రేమకథలు, హత్యలు మోసాలు, యింకా ఎన్నో. వింటుంటే గుండె జారిపోతుంది. ఎన్ని పాత్రలు! ఒక్కొక లోకంలో ఎన్ని వలయాలు, మండలాలు, ప్రాంతాలు! ఏ వర్జిల్ లాంటివాడో ‘సాహసం శాయరా డింభకా’ అంటున్నా పాఠకుడు ముందుకు సాగలేడు. దాన్తెను మెచ్చుకోనివారుండరు. సాంతం చదివినవారూ ఉండరు. ఇన్‌ఫెర్నోలో సుఖంగా ఆగిపోతారు. వాళ్ళ వర్జిల్ వాళ్ళను అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడేమో, మీకిది చాలని! విక్టర్ హ్యూగో అంటాడు ది డివైన్ కామెడీ గురించి: మానవుడి కళ్ళు చూడగలిగిన దృశ్యాలు కావవి, చివరి రెండు భాగాలు. చీకటి విరిగేకొద్దీ వెలుగు పెరిగేకొద్దీ, పాఠకుడి కళ్ళు చదువలేవు, అలవాటు లేని ఆ కాంతికి కళ్ళు మూసుకుపోతాయి.

ది డివైన్ కామెడీ సాంతం చదవగలగడమెలా అనేదానిమీద అనేక సూచనలున్నాయి. పారడీసోతో మొదలుపెట్టి ఇన్‌ఫర్నో, ఆ తరువాత చివరగా పర్గటోరియో చదవాలి అంటాడు ఎలియట్. ది డివైన్ కామెడీలో వందల పాత్రలు ఉన్నమాట నిజమే. (కాని అవి మహాభారతంలోని పాత్రల్లో శతాంశం.) అందులో ఎన్ని వందల పాత్రలున్నా, ముఖ్యపాత్ర ఒక్కటే, దాన్తె. తక్కిన పాత్రలు ఆ పాత్ర గతిచిత్రణకు ఉపకరణాలు మాత్రమే. ఉదాహరణకు, ఇన్‌ఫర్నోలో ఫ్రాన్చెస్కా, పావ్లోల అక్రమప్రేమకథ (5వ సర్గ) చాలా ప్రసిద్ధం. మన దృష్టి ప్రేమికులపై ఉండడం సహజం. కాని, దాన్తెపై దృష్టి నిలిపి ఆ కథ చదవాలి. అలా చదివితే కాని ఆ కథ ప్రాముఖ్యం అర్థం కాదు.

ఆ సంగతి అలా ఉంచి, ఇప్పుడు మన మహాభారతానికి వద్దాం. ఒక విధంగా ఈ కావ్యం తెలుగునాట సదాశరత్తు. ఒక శారదరాత్రి, శరద్భయంతో నేలమీదకు దిగివచ్చిన మహాభారతపర్వప్రావృట్పయోదాలు నీరవనీరదాలుగా, అరణ్యవాసము అజ్ఞాతవాసమూ చేస్తున్నాయి సుమారు వేయి సంవత్సరాలుగా. ఇది ఒక్క తెలుగునాట మాత్రమే సాధ్యం. కవిత్రయభారతాన్ని సాధారణ పాఠకుడికి చేరవేసే ప్రయత్నం ఒకే ఒక్కసారి జరిగింది తి.తి.దే. పుణ్యమా అని. తి.తి.దే. ప్రతిలోని వివరణ ఎక్కడైనా సరిగ్గా లేదనిపిస్తే మరో గతి లేదు. (తి.తి.దే. అచ్చుప్రతులు ఇప్పుడు దొరకడంలేదు. ఇ-బుక్ ఎంతకూ డౌన్‌లోడ్ కాదు. నా దగ్గర 1972 నాటి వావిళ్ళ ముద్రణ ఉంది. దానితో సరిపెట్టుకుంటున్నాను. నా చిన్నతనంలో మా పెదనాన్నగారింట్లో కొన్ని పర్వాలు మాత్రం ఉండేవి, ఒక్కొక పర్వం ఒక వాల్యూము. ఎవరి ముద్రణో గుర్తులేదు.) ఇదే భారతాన్ని మరో భాషలో యీ కవిత్రయం రాసి ఉంటే, యిప్పటికి వందల ప్రతులు, వ్యాఖ్యలు, విమర్శ వచ్చి ఉండేది. వారి పేరు తెలియని ఊరు ఉండేదికాదు.

కవిత్రయరచనను మెచ్చుకోని వాడుండడు. సాంతం చదివినవాడూ…? ‘శ్రీవాణీ’ దగ్గర మొదలుపెట్టి ‘శిక్షితచిత్తులార శుభసిద్ధులు పొందుననేకజన్మపాపక్షపణంబునన్ వెలుగు భారతసంహితకెల్ల వాసుదేవు ప్రకటార్థముగా గొని విన్న మానవుండు… శశ్వదుల్లాసముఖానుభూతినచలస్థితినొప్పునతండుదాత్తుడై’ వరకు (భారతంలో చివరి రెండు పద్యాలు) ఎంతమంది చదివారు? చాలామంది చదివి ఉండరు. దీనికి కారణం లేకపోలేదు. ది డివైన్ కామెడీ భారతంలో శతాంశం ఉంటుంది. భారతంలో లేని శాస్త్రం లేదు. వ్యాసుడన్నాడు కదా: యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్ (ఇందులో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు) అని. అంతకాకున్నా, తెలుగులోని కవిత్రయభారతం కూడా డివైన్ కామెడీతో పోలిస్తే ఒక్క పరిమాణంలోనే కాదు చాలా విషయాలలో చాలా పెద్దది. కనుక సాంతం చదవడం సులభం కాదు అని ఒప్పుకోడంలో కష్టం లేదు.

ఇక, డివైన్ కామెడీ విషయంలో లాగా, భారతం ఎలా చదవాలి అన్న చర్చ జరగలేదు, సాంతం చదవలేదు అని ఒప్పుకోడం యిష్టం ఉండదు కనుక. ఆ చర్చ అవసరమా అనిపించవచ్చు. చేయడంవల్ల ప్రయోజనం ఉండవచ్చు. అయినా యిదే క్రమంలో చదవాలి అనడంలేదు. కాని ఒక సూచన. శాంతి పర్వంతో మొదలుపెట్టి, ఆనుశాసనిక, స్త్రీపర్వాలు ముగించి, ఆదిపర్వానికి రావడంలో కొంత ప్రయోజనం ఉంది. తిరిగి, చివరి పర్వాలతో ముగించవచ్చు. ఎందుకు?

భారతం కథకోసం చదవం. స్థూలంగా తెలిసిందే కనుక. దాని రచనలో సమగ్రవ్యూహం ఏమిటో తెలుసుకోడానికి చదువుతాం. వ్యాసమహర్షి ఏ సమగ్రదర్శనంతో రాశాడో, కవిత్రయం కూడా అదే దర్శించి ప్రదర్శించారా? ఆనాటి సామాజిక ప్రయోజనం కవిత్రయ యుగానికి అన్వయిస్తుందా? వీరేమైనా కాలానుగుణమైన మారినదృష్టితో రాశారా? గుణత్రయం మారదు, దాని ప్రకటన మారుతుంది. ఏ కాలంలోనైనా, మనం గ్రహించవలసింది మూలతత్త్వమే. నన్నయ అన్నట్టు భారతం ఒక డిపార్టుమెంటల్ స్టోర్. ఏది కావలసినవారికి అది దొరుకుతుంది. కాని యివన్నీ దేనిలో అంశలో ఆ అంశిని పట్టుకోవలె పాఠకుడు.

పురుషార్థసాధనం జీవితం. ఆ పురుషార్థాలు ఎలా సాధించాలి? పురుషార్థం వైయక్తికమా సామాజికమా అనేది తెగని చర్చ. ఈ చర్చకు అంతిమ నిర్ణయం ఆ రెండూ వేరు కావని, విశ్వమంతా ఒకే ప్రాణి అన్న వైశ్వానరతత్త్వదర్శనంలోనే సాధ్యం. అది కలిగే వరకు సంపూర్ణసమన్వయం సాధ్యంకాదు. అది కలిగేవరకు ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి, వ్యక్తిలో సమాజంలో ఘర్షణ ఉంటూనే ఉంటుంది. ఘర్షణ అంటే, రజస్తమస్సులతో సత్త్వం పెనగులాట. సత్త్వం సమస్య అయే స్థితివరకు చాలా కొద్దిమంది మాత్రమే ఎదుగుతారు. ఏ కావ్యమైనా రజస్తమస్సులతో సత్త్వసంఘర్షణచిత్రణే. అదే ధర్మయుద్ధం. ధర్మం ప్రత్యేక పురుషార్థం కాదు. కామార్థాల ప్రకటనే ధర్మస్వరూపం. (ప్రస్తుతానికి మోక్షవిషయం పక్కన ఉంచుదాం.)

రామాయణం రంకు, భారతం బొంకు అని ఒక నానుడి. భారతం విషయం నిర్వివాదం, అది ధర్మరాజు బొంకు కనుక. కాని రామాయణం విషయంలో ఆ నానుడి యీనాడు ఏమాత్రము నిర్వివాదం కాదు. ఆనాడు కానీ యీనాడు కానీ అన్ని అనర్థాలకు మూలం కామం. అది లేంది సృష్టిలేదు. కనుక, దాన్ని అదుపులో ఉంచుకోవడమే పురుషార్థసాధన. ఏ కావ్యవిషయమైనా ఆ విషయమే, ప్రాచ్యంగాని పాశ్చాత్యంగాని.

భారతంలో ప్రధానంగా కథనునిండి కనిపించేవి రెండు. మొదటిది కామం. రామాయణంలోది మూలస్వరూపం, ఆదిమకామం, అత్యంతసహజం. దాన్తె డివైన్ కామెడీలో యీ కామం అతి సహజం, అత్యంతమానవీయం, అధికక్షమార్హం. ఇంచుమించు నరకద్వారంలోనే (రెండవ వలయం), అంటే ప్రాథమికస్థాయిలో, ఉంచబడింది ఆ కావ్యంలో. అన్ని పాపాలకంటే కామం దాన్తె దృష్టిలో దయనీయం. కామికులకు (ఫ్రాన్చెస్కా, పావ్లో) విధించబడిన శిక్షకు దాన్తె కదిలిపోయి కూలిపోతాడు (I felt myself diminish, as if I were dying/ And fell down, as a dead body falls. –Canto 5:ll. 141-142.)

తన గతి ఏమిటి అన్న ఆలోచన కలిగి ఉంటుంది వ్యక్తిగా దాన్తెకు. తనుకూడ ప్రేమలో పడినవాడే. (ఈ కావ్యంలో దాన్తె రచయిత, పాత్ర కూడా.) నరకసందర్శనంలో దాన్తె ముందుకు వెళ్ళేకొద్దీ, యితరపాపాలు చేసినవారిని కలుస్తూ వెళ్ళేకొద్దీ శిక్ష అనుభవిస్తున్నవారిపై ఈ సానుభూతి సన్నగిల్లి, ఆగ్రహం పెరుగుతూపోతుంది. ఆర్జెన్తి, ఫొరినాత, పోప్ నికొలస్, బొక్కా, ఆల్బెరిగోల పాపపు కథలు వింటున్నప్పడు ఆగ్రహం క్రమంగా పెరుగుతూ తీవ్రస్థాయికి వచ్చినపుడు, అతడి ఆచార్యుడు వర్జిల్ పట్టరాని ఆనందంతో శిష్యుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు (my master… kissed my face and said: Indignant soul/ blessed is she who bore you in her womb! –Inf. VIII, 34-42: tr. Sisson: Oxford World’s Classics.) అంటే, కామం ఉపేక్షించదగిందే అని దాన్తె అర్థం కాదు. అది అత్యంతబలమైనది, కనుక మనిషి అత్యంతబలహీనుడు. ఆ బలహీనతపట్ల సానుభూతి మానవీయలక్షణం. దాన్ని జయిస్తే యిక జయించవలసింది లేదు. ఈనాడు స్త్రీలపై అత్యాచారాలను అరిచి వీథుల్లో ఖండించేవారు ఎక్కువమంది వీథిలో రామయ్యలని మనకు తెలుసు.

కాని మహాభారతంలో కామం యిలా మూలరూపంలో లేదు. అది యిక్కడ కామరూపి, బహురూపి. ఇక్కడ దాని ప్రధానరూపం అహంభావం, దానివలన కలిగే పగ, దాని ప్రతీకారం. భారతంలో కథలన్నీ యీ పగతో కలిగినవే. విచిత్రమేమంటే యీ పగ పనికిరాదని చెప్పడానికి, నిలువెల్లా విషమైన పాము ప్రధానసాధనమయింది. పాము పట్లకూడా పగ పాపమే అని, విషసర్పాన్ని ప్రధానంగా గ్రహించడంలో ఒక ప్రత్యేకస్ఫూర్తి. భారతయుద్ధం ముగిసిన తరువాత కూడా, వారి సంతతిగాని, జనసామాన్యంగాని పగ వదలలేకపోవడం విచిత్రం అనిపించడం లేదు ఎవరికీ. పగ ఆరని సెగ.

ఈ పాపసంతానకథలు మహాభారతమంతా పెనవేసుకున్నాయి, సర్పసంతానంలాగే. ఆది పర్వంలో, భారతకథాప్రారంభంలోనే ఉదంకుడి కథ, వినతాకద్రువల పగ పాఠకుడికి స్వాగతం చెబుతుంది. అక్కడ బుసలుకొట్టే పద్యాలు చాలానే ఉన్నాయి. మనం శాంతి, ఆనుశాసనికపర్వాల దగ్గర మొదలుపెడుదామనుకున్నాం కదా! (అన్నట్టు యిదే ఆనుశాసనికపర్వంలో కూడా ఉంది మరొక సౌపర్ణాఖ్యానం. దానిని తరువాత చూద్దాం.) భారతంలోని చివరి పద్యం (ఫలశ్రుతి) హృదయస్థం చేసుకొని, ఆ తరువాత మహాభారతం చదవడం మొదలుపెట్టాలి. ఆ పద్యం ప్రసిద్ధమే.

శిక్షితచిత్తులార శుభసిద్ధులు పొందు ననేకజన్మపా
పక్షపణంబునన్ వెలుగు భారతసంహితకెల్ల పుండరీ
కాక్షుని వాసుదేవు ప్రకటార్థముగా గని విన్న మానవుం
డక్షయపుణ్యలోకములయందు రమించు నిరామయస్థితిన్.

పుణ్యలోకాలమాట ఎటున్నా ముందు యీ లోకం బాగుపడుతుంది, దానివల్ల మన పగలూ ప్రతీకారాలూ తగ్గితే. ఆ కథ, దానిలో తిక్కన కవిత్వపు లోతు చూద్దాం. ఈ పర్వాలన్నీ భీష్ముడు ధర్మరాజుకు చేసిన బోధ. ఈ కథ కూడా గౌతమి అనే బ్రాహ్మణస్త్రీ చెప్పే పాఠం. ఆ కథను భీష్ముడు ధర్మరాజుకు చెబుతున్నాడు. గౌతమి కుమారుడు పాము కరిచి చనిపోయాడు. ఆ తల్లి దుస్థితి చూసిన ఒక బోయ ఆ పామును పట్టితెచ్చి ఆమెకు చూపిస్తూ, అడుగుతాడు:

వగచుచుజూడ నయ్యురగవల్లభు రజ్జునగట్టి తెచ్చి య
మ్మగువకు జూపి దీని తల మ్రందగ మోదెద, కోల నొండె రెం
డుగ నెఱగత్తి వ్రేసెద, కడుం చెడుగీ పొడపాపపుర్వు నే
మి గతి వధింతు నంచు నొకమేటి కిరాతుడు రోషదీప్తుడై

ఉన్నగని యప్పడతి యోయన్న విడువు భుజగనాథు ననవుడు నతడీ పిన్నాతని ప్రాణంబులు కొన్నది యిది, దీని యుసురు గొనియెద ననియెన్. అనిన నక్కోమలి యక్కిరాతుంజూచి విధివశమున వచ్చిన కీడధములు కొనియాడి వ్రేగులై విపులజలాంబుధి మునుగుదురు మునుంగరు సధర్ములగు నుత్తములు ప్రశాంతి జులుకనై. ఈ పాముజంప బ్రదుకునె నాపుత్రుడు విడువుమర్జునక… (ఆనుశాసనికపర్వం: 1: 6-10)

తన కొడుకు ప్రాణం తీసిన పాముపట్ల కూడా పగ సహించలేని తల్లిని చూస్తున్నాం యీ కథలో. ఆ తరువాత కథలో, బోయ ఎందుకు యీ పసివాడి ప్రాణాలు తీశావు అని పామును అడుగుతాడు. నేరం నాది కాదు, మృత్యువుది అంటుంది. మృత్యువునడిగితే, నేరం నాది కాదు కాలానిది అంటుంది, ఏడు చేపల కథలో లాగా. ఇంతకూ యీ కథ పగను గురించి, దాన్ని నిగ్రహించడం గురించి. (ఈ కథలోని తల్లి బ్రాహ్మణి అని చెప్పడం సామాజికదురన్యాయమనో దురహంకారమనో కొందరు అనవచ్చు. పగ పనికిరాదన్నదే యీ కథలోని బోధ. ద్రౌపది బ్రాహ్మణి కాదు. ఆమె బిడ్డలు ఒకడు కాదు అయిదుగురు రాక్షసంగా నిద్రలో హత్యచేయబడ్డారు. హత్యలు చేసినవాడు ఒక బ్రాహ్మణుడు. ద్రౌపది కూడా ‘విడువుము’ అనే అన్నది, గౌతమి లాగ.)

ఇంతకూ, యీ కథ యిలా వదిలెయ్యడానికి తిక్కననే చదవక్కర్లేదు. ఆ మాటకొస్తే, ఏ కావ్యమైనా అందులోని రచనాశిల్పం కొరకు కదా చదవవలె? కవి పటుత్వమంటే శబ్దంపై అతని అధికారం. అది యిక్కడ ఎలా తెలుస్తుందో చూద్దాం. ‘విపులజలాంబుధి మునుగుదురు మునుంగరు సధర్ములగు నుత్తములు ప్రశాంతి జులుకనై.’ (‘విపులభవాంబుధి’ అని పాఠాంతరము.) మునుగుదురు అనడంలో, ఒక చెంబునో బిందెనో నీటిలో ముంచినపుడు నీరు క్రమంగా లోపలికి పోవడం స్ఫురిస్తుంది. మునుంగరు అన్నపుడు బిందెను తలకిందులుగ ముంచినపుడు కలిగే బుడుంగు శబ్దాన్ని స్ఫురింపచేస్తుంది. మునగదు, పైకి తన్నుకొస్తుంది. కాని యీ పద్యంలోని అసలైన అక్షరశిల్పం పద్యంలోని చివరి స్వరాక్షరం, చులుకనై- లోని చివర ఐత్వం. ఇక్కడ ఐత్వం మునుగకుండా పైకి లేస్తున్న ప్రయత్నాన్ని స్ఫురింపజేస్తుంది. అచ్చులు అర్థానికి అనురూపం వహించడం తిక్కన రచనావైశిష్ట్యం. అచ్చులను ప్రాణములు అని కూడా యిందుకేనేమో అంటారు! తిక్కన రచనలో యివి నిజంగా ప్రాణాలే. భీష్మపర్వంలోని ‘అంహోమర్దనుడా జనార్దనుడు …సింహోల్లాసవిభాసియై…’ లోని ఓత్వం ‘కుప్పించి ఎగసిన’ అనకుండా ఆ అర్థాన్ని శబ్దంలో స్ఫురింపజేస్తుంది. తిక్కన శబ్దాన్ని శాసించడు. ఆ అవసరం లేదు. శబ్దం అతడికి అనుకూలవతి.

ఇటువంటి శబ్దసామరస్యం ఒక పరభాషలో కావ్యం చదివేటప్పుడు (డివైన్ కామెడీ అనుకోండి) తెలియదు. ఆ భాష నేర్చుకొని చదివినా కలగకపోవచ్చు. తిక్కనను ఇంగ్లీష్ లోనో, ఇటాలియన్ లోనో అనువాదం చేసినా తెలుగుమూలంలో కలిగే యీ రసస్ఫూర్తి కలగదు. కేవలం మాతృభాషలో మాత్రమే ఆస్వాదించగల స్వారస్యం అది.

ఇక, చులుకనై-లో అర్థప్రాధాన్యం కూడా చూద్దాం. క్షమాగుణం కలిగినవాడిని లోకం చులుకన చేయడం సామాన్యమే. ఆ తృణీకారాన్ని సహించడానికి ఎంత ధృతి అవసరమో దాస్తావ్‌స్కీ నవలలోని ఫాదర్ జోసిమా పూర్వాశ్రమ కథలో తెలుస్తుంది. పూర్వాశ్రమంలో జోసిమా ఒక మిలిటరీ అధికారి. తన ప్రేమ విఫలమైనపుడు అతడు నిస్పృహతో కోపంతో నిండిపోతాడు. ఆ కోపంలో తన సేవకుణ్ణి ముఖం పగలగొడతాడు అకారణంగా. కాని తన పనికి తనపై తనకే అసహ్యమేస్తుంది. ఆ రాత్రి నిదురపోలేకపోతాడు. తెల్లవారగానే ఆ సేవకుడి పాదాలపై పడి క్షమించమని అడుగుతాడు. మిలిటరీ ఆఫీసర్లు ఒక సేవకుణ్ణి అలా కొట్టడం సాధారణమే. జోసిమా కొట్టినపుడు, ఆ పనివాడు కనీసం చేయికూడా అడ్డు పెట్టుకోడు. అధికారి తన పాదాలపై పడిపోయినపుడు ఆ అధికారికి మతిచెడిందేమోనన్న అనుమానం కలిగి ఉంటుంది ఆ సేవకుడికి. ఈ క్షమాభిక్ష విషయం తెలిస్తే మిలిటరీ సేవకే అవమానం. అయినా జోసిమా చేశాడు, వివేకం కలిగి. పగ పనికిరాదని, అది వివేకాన్ని హరిస్తుందని.

గౌతమీలుబ్ధకసర్పమృత్యుకాలసంవాదమనే యీ ఉపాఖ్యానం చదివిన తరువాత ఆదిపర్వంలోని ఉదంకుడి ఉగ్రవాదం మరింత స్పష్టంగా తెలుస్తుంది.

కాదనకిట్టిపాటి యపకారము తక్షకుడేకవిప్రసం
బోధనజేసి చేసె నృపపుంగవ నీవుననేక భూసురా
పాదితసర్పయాగమున భస్మము సేయుము తక్షకాదికా
కోదరసంహతిన్ హుతవహోగ్ర సమగ్రశిఖాచయంబులన్

‘ఉగ్ర’శబ్దం చాలదు, ‘సమగ్ర’ కావలె (మహోగ్ర అనే పాఠాంతరం కూడా ఉందేమో?); ‘తతి’ (కాకోదర ‘సంతతి’) పనికిరాదు, ‘హతి’ (సం‘హతి’) అవసరం. పగను రెచ్చగొట్టేవాడు, పగవాడికంటే ప్రమాదకారి. భారతకథను ఆద్యంతము నడిపింది యీ పగే. ఉదంకుడి ఉగ్రస్వభావం తెలియాలంటే, అతడి నాగకులస్తుతి పద్యాలలో కాదు (బహువనపాదపాబ్ధి-తో మొదలయ్యే నాలుగు పద్యాలు కావు). ఆ తరువాత అతడు సృష్టించిన బీభత్సంలో చూడవలె:

పాతాళైకనికేతనాంతరమునన్ పర్వెం తదశ్వాఖిల
స్రోతోమార్గవినిర్గతోగ్రదహనార్చుల్ పన్నగవ్రాతముల్
భీతిల్లెన్ భుజగాధినాథుమనమున్ భేదిల్లె కల్పాంతసం
జాతప్రోద్ధతబాడబానలశిఖాశంకాధికాతంకమై. (నన్నయ: ఆది: 1.112)

గురుదక్షిణ కొరకే కావచ్చు, యింత ఉగ్రత, కల్పాంతబీభత్సం అవసరమా? పగ అతడి స్వభావం. మహాభారతాన్ని నడిపించింది యీ పగ. గౌతమి కథను భీష్ముడు చెప్పడం యీ మాటలతో మొదలుపెడతాడు: ‘అనవుడు భీష్ముడిట్టులనునాతనితో నకటా వధింపగా మనుజుడు కర్తగాడు.’ ఇంతకుముందు శాంతిపర్వంలో వ్యాసుడిటువంటిమాటే అంటాడు ధర్మరాజుతో: ‘మనుజులు సేయనెవ్వరు సమస్తమునీశ్వరునాజ్ఞ సెల్లెడున్ వినుము కుఠారపాణి ధరణీరుహముల్ నరుకంగ పాపమొందునొకొ కుఠారమున్ జనులు దోసము బొందరు…’ (ఇందులో ఒక చమత్కారం, ‘కుఠారమున్’ దగ్గర ఆపి చదవవలె. ఆపకుండా, కుఠారమున్ జనులు దోసము బొందరు… అనికూడా చదవచ్చు. కుఠారమెంతో కుఠారపాణి అంతే నిమిత్తమాత్రుడు.)

కర్త యీశ్వరుడని తెలిసినపుడు, కుఠారం పట్ల పగ ఎంత అవివేకమో, కుఠారపాణి యందు పగ అంతే అవివేకం.

(ఇంకొన్ని ముచ్చట్లు వచ్చే నెలలో)