సెప్టెంబర్ 2020

భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణభాగంలో, ప్రత్యేకించి తెలుగుభాషాప్రాంతాలలో ఆంగ్లేయుల పాలన వేళ్ళూనుకుంటున్న సమయంలో వారికి మన చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలు, సామాజిక విధివిధానాలను అర్థం అయేలా చెప్పి పరిపాలనాపద్ధతులకు సహకరించిన పండితులు, విద్యావేత్తలు అయిన స్థానికుల గురించి మనకు ఎక్కువగా తెలియదు. ఉదాహరణకు, సి. పి. బ్రౌన్ గురించి మనకు తెలిసినంతగా, అతనికి ఇతోధికంగా సహాయం చేసిన తెలుగు పండితుల గురించి, వారి కృషి గురించి తెలీదు. కల్నల్ మెకంజీ పేరు మనం విన్నాం కాని అతనికి ఆ పేరు రావడానికి కారణమయిన కావలి సోదరుల గురించి వినలేదు. కలకత్తాలో విలియమ్ జోన్స్ సంస్కృత భాషను ప్రధానం చేసి ఇతర స్థానిక భాషలను పట్టించుకోని కారణంగా స్థానిక భాషలు మాట్లాడే వాళ్ళంతా బ్రిటిష్ వారి దృష్టిలో అధములు, తమ పురాచరిత్ర ఔన్నత్యానికి తగనివారుగానూ అయారు. అందుకు కొంత భిన్నంగా దక్షిణ భారతంలో ఆంగ్లేయులకూ స్థానికులకూ మధ్య సంబంధం మరికొంత సాదరసమభావనలతోను, విజ్ఞానం ఇచ్చిపుచ్చుకునేలానూ ఉంటూ వచ్చింది. అందువల్ల స్థానిక పండితులు, మేధావులు జాత్యహంకారపు నీడలోను, అధికారి-సేవకుడు వంటి అసమానమైన స్థితిలోనూ కూడా విజ్ఞానం రెండువైపులకూ పారే స్థితిని వీలైనంతగా నెలకొల్పుకున్నారు. వీరు స్థానిక సంస్కృతీసంప్రదాయాలను, సాహిత్యాన్ని బ్రిటీష్ వారికి నేర్పే క్రమంలో ఆ పురాచరిత్రను ఒక ఆధునికరూపంలో నమోదు చేయడమూ మొదలుపెట్టారు. ఇలా స్థానిక పండితులు, ఆధునికరూపాల్లో నమోదు చేసిన చరిత్ర వల్ల ఇప్పటిదాకా పుక్కిటి పురాణాలుగా కొట్టిపారేసిన మన చరిత్రను, సాంప్రదాయ సాహిత్యాలను అధునాతన పరిశోధనాపద్ధతులలో విశ్లేషించి అర్థం చేసుకోవడానికి కావలసిన వీలు ఇప్పుడు మనకుంది. వీరి కృషిని గమనించి, తద్వారా మరుగున పడ్డ మన నిజచరిత్రను మనం వెలికి తెచ్చే అవకాశాలు ఎంతగానో ఉన్నా ఇప్పటికీ తెలుగునాట చారిత్రకపరిశోధకులెవరూ వాటిని వినియోగించుకున్న దాఖలాలు లేవు. చారిత్రక సాహిత్యాన్ని పునః ప్రచురించడం, ఆ సాహిత్యానికి సందర్భోచితమైన వ్యాఖ్యానాన్ని అందించడం, వాటికి లోతైన దృష్టీ అధ్యయనం ఉన్న విమర్శకులతో ముందుమాట రాయించడం ద్వారా చరిత్రను ఒక కొత్త కోణం నుండి భావి తరాలకు పరిచయం చెయ్యడం ఏకాలానికాకాలం పునరావృతం కావలసిన ఒక అవసరం. ఆ అవసరాన్ని గుర్తెరిగి ఆ దిశగా అడుగులు పడుతున్నాయో లేదో గమనించుకోవాల్సిన బాధ్యత సాహిత్యసమాజంలో ఉన్నామని చెప్పుకునే ప్రతి ఒక్కరిదీ.