లక్ష్మి

లక్ష్మి యను పేరునకు యూరోపియనుల ఉచ్చారణలో వికృతమైన లాక్‌మె (Lakmé) యను పేరుగల ఆపెరా ఎడ్మోఁ గోడినే (Edmond Gondinet) మఱియు ఫిలీప్ జీలా (Philippe Gille) అను ఫ్రెంచి కవుల రూపకరచనకు సుప్రసిద్ధుఁడైన ఫ్రెంచి సంగీతకారుఁడు లియో డెలీబ్ (Leo Delibes) సంగీతరచన చేసిన సంగీతరూపకము. లియో డెలిబ్ అత్యంతలలితముగా సంగీతరచన చేసిన ఈ ఆపెరా ప్రప్రథమముగా పారిస్‌లో క్రీ.శ.1883లో ప్రదర్శింపఁబడెను. అప్పటినుండి ఇప్పటి వఱకును తరచుగా ప్రదర్శింపఁబడుచున్న నేత్రశ్రోత్రపర్వమైన సంగీతరూపకమిది. ఉత్తమప్రమాణములతో సిడ్నీ (ఆస్ట్రేలియా) ఆపెరాసంస్థ ప్రదర్శించిన ఇంగ్లీషు లఘువ్యాఖ్యలతోఁ గూడిన ఈ ఆపెరాను యూట్యూబులో చూడవచ్చును.

కథాసంగ్రహము

మూడు అంకములుగా నున్న ఈ ఆపెరా 19వ శతాబ్దములో విక్టోరియారాణి పాలనలోనున్న భారతదేశములో జరుగును. ఇందులో హిందువులపట్ల, వారిదేవతలు, సంస్కృతులపట్ల ఆంగ్లేయులకుండిన అనాదరము వ్యక్తమగును. అట్లు అనాదరమునకు లోనై, ఆంగ్లేయుల పాలనను నిరసించుచు ప్రచ్ఛన్నముగా నొక దుర్గామందిరమున ప్రధానార్చకునిగా నున్న నీలకంఠుని కూతురు లక్ష్మికి, ఆంగ్లేయసైనికుఁడైన జెరార్డునకు మధ్య సాగు ప్రణయవృత్తాంత మీ ఆపెరాయొక్క ఇతివృత్తము.

కథాసంగ్రహము ప్రథమాంకము

నీలకంఠునికి విధేయులైన హిందువులయొక్క ఉదయకాలదుర్గార్చనాసన్నివేశముతో ఈ అంక మారంభమగును. వారితోఁబాటు లక్ష్మి, ఆమె సేవిక మల్లిక, సేవకుఁడు హాజీ (శ్రావకుఁడు) గూడ అందులో పాల్గొందురు. ప్రార్థనానంతరము ఆముగ్గురిని అచట వదలి నీలకంఠుఁడు సమీపనగరములో జరుగు దేవతోత్సవములో సాయము చేయుటకై నిష్క్రమించును. అతఁడు వెళ్ళిన తర్వాత లక్ష్మీమల్లికలు నికటమందలి నది ప్రక్కన సంచరించుటకు, ఇందీవరములను కోసికొనివచ్చుటకు, నదిలో స్నానము చేయుటకు బయలుదేరుదురు. అప్పుడు లక్ష్మి తన అందమైన సొమ్ముల నన్నిటిని తీసి అచట ఒక శిలావేదకపై ఉంచును. తర్వాత వారొక చిన్నపడవలో నదీవిహారమునకు పోవుదురు. అడవిలో చాటుగా నున్న ఆదేవాలయప్రాంగణము నిర్మానుష్య మగును. అప్పుడు జెరార్డ్, ఫ్రెడరిక్ అను సైనికులు, ఎలీనా, రోజ్ (హెలీనా) అను వారి ప్రియురాండ్రు, ఆస్త్రీలకు రక్షకురాలైన మధ్యవయస్కురాలు మేడమ్ బెన్సన్ విహారార్థమచటికి వత్తురు. ఆస్త్రీలు ఆఆభరణములను చూచి వాటిచే ఆకర్షితులగుదురు. వాటియొక్క నమూనాలను వ్రాసికొనివచ్చి ఎలీనాతో తనకు జరుగబోవు పెండ్లి సమయములో అటువంటివే చేయించి ఇత్తునని జెరార్డ్ అచ్చటనే ఉండిపోవును. మిగిలిన నల్వురు అచ్చటినుండి నిర్గమించెదరు. ఇంతలో లక్ష్మీమల్లికలు పడవనుండి దిగుదురు. వారిని చూచి జెరార్డ్ చెట్లసందున దాగికొని వారిని గమనించుచుండును. మల్లిక నదిప్రక్కన విశ్రమించుటకు బోవును. లక్ష్మి ఒక్కతియే అచ్చట మిగులును. ఆమె జెరార్డును చూచి భయగ్రస్తురాలై మల్లికను,హాజీ (శ్రావకుని) ఎలుగెత్తి పిలుచును. కాని త్వరగా సంయమించుకొని, జెరార్డునుగుఱించి తెలిసికొనవలెనను ఉత్కంఠతో, వారి నిర్వురిని బయటికి పంపివేయును. మొదట జెరార్డుపట్ల భయముతో, అనిష్టముతో వర్తించినను, ఆమె క్రమముగా అతనియందు ఆసక్తురాలగును. ఆమె అందమునకు ముగ్ధుఁడై అతఁడును ఆమెయందు ఆసక్తుఁడగును. ఇంతలో నీలకంఠుఁడు, హాజీ (శ్రావకుఁడు), ఇతరహిందువు లచ్చటికి వత్తురు. వారి రాకను గమనించి, వారట ప్రవేశింపక ముందే లక్ష్మి జెరార్డు నటనుండి పంపివేయును. నీలకంఠుఁడు ఒక ఆంగ్లేయు డక్కడికి ప్రవేశించి, ఆస్థలము నపవిత్రము చేసినాడని అనుమానించి అతనికి ప్రతీకారము చేయుటకు నిశ్చయించును.

కథాసంగ్రహము ద్వితీయాంకము

ఇంతలో ప్రక్కనగరములో దుర్గాదేవి తిరునాళ్ళ వచ్చును. ఆసమయములో నీలకంఠుఁడు సన్యాసి వేషమును వేసికొని, లక్ష్మికి సైతము మాఱువేషమును వేసి, ఆమెచేత దీర్ఘమైన గీతమాలపింపఁజేయును. తాను వినియుండిన లక్ష్మీకంఠస్వరమువంటిదేయైన ఆకంఠస్వర మాధుర్యమునకు వశుఁడై జెరార్డు ఆమెను సమీపించును. అతనిని చూచి ఆమె నేలవ్రాలును. దానివలన నీలకంఠుఁ డతఁడే దేవాలయప్రాంగణము నందుఁ జొచ్చిన ఆంగ్లేయుఁడని నిర్ధారణ చేసికొని, ఆనాటి రాత్రి జరుగు దుర్గాయాత్రాసందర్భమున అతనిని చుట్టుముట్టి అంతమొందింపవలెనని తన అనుచరులతో పన్నాగము పన్నును. అనుకున్నవిధముగనే ఆరాత్రి అతనిని చుట్టుముట్టి, నీలకంఠుఁ డతనిని బాకుతో పొడిచి తన అనుచరులతో పరారీ యగును. అట్లు క్షతుఁడై తెలివిగోల్పడి నేలకొరిగిన జెరార్డును లక్ష్మీహాజీలు చూతురు. లక్ష్మి ఆతనికి ప్రథమోపచారములు చేయును. హాజీ సహాయముతో అతనిని అడవిలో నున్న ఒక వెదురుగుడిసెలో నుంచుటకు గొనిపోవును.

కథాసంగ్రహము తృతీయాంకము

లక్ష్మి చేయు ఉపచారములవల్ల జెరార్డు తేరుకొనును. తనతో నుండిపొమ్మని ఆమె అతనిని కోరును. ఇంతలో దూరమునుండి యువప్రేమికులు జంటలుగాఁ జేరి పయనించుచు పాడు పాట వారికి వినిపించును. జెరార్డు అది విని భయగ్రస్తుఁడగును. అది సమీపమందున్న పవిత్రమైన సెలయేటినుండి ప్రేమికుల జంటలు వారి ప్రేమను శాశ్వతీకరించునట్టి పవిత్రజలమును తెచ్చుకొనుట కేగునప్పుడు పాడు పాట యని, దానివలన తమకేమి భయము లేదని లక్ష్మి అతనిని ఊరడించును. ఆజలమును ఒకే పానపాత్రనుండి ప్రేమికు లిర్వురు త్రాగిన వారిబంధము శాశ్వత మగునని, అట్లు తనతో నాఝరమున కేగి ఆజలమును త్రాగుటకు జెరార్డుకు వీలు లేనందున, తానేగి ఆజలమును కొనివత్తునని, తెచ్చిన తర్వాత ఇర్వురును అదేపాత్రనుండి ఆజలమును త్రాగవచ్చునని లక్ష్మి ఆజలమును కొనివచ్చుటకు బోవును. ఆమె లేని సందర్భములో ఫ్రెడరిక్ జెరార్డును వెదకికొనుచు వచ్చి మఱునాడు యుద్ధమునకు బోవలెనని, అది సైనికులుగా తాము నిర్వహింపవలసిన బాధ్యత యని జెరార్డునకు గుర్తు చేయును. జెరార్డు లక్ష్మియొక్క ప్రేమకంటె సైనికవిధియే పరమమని నిశ్చయించుకొనును. లక్ష్మి జలమును తీసికొని తిరిగి వచ్చి జెరార్డు మనసు మాఱిపోయినదని గమనించి, తన గౌరవమును కాపాడుకొనుటకై ఉమ్మెత్తపూవును దిని మరణించును. కాని మరణించులోగా తాను త్రాగిన పాత్రనుండే జెరార్డుచేత తాను దెచ్చిన జలమును త్రాగించును. ఇంతలో నీలకంఠుఁడు ప్రవేశించి క్రోధావేశముతో జెరార్డును వధ్యునిగా నెంచి నిందించును. లక్ష్మి అతడు తనతో పవిత్రజలము నదేపాత్రనుండి త్రాగి పవిత్రుడైనాడని నీలకంఠునికి దెల్పి, జెరార్డు ప్రాణముల రక్షించి, తన ప్రాణములను వీడును.

ప్రస్తుతప్రయత్నము

ఫ్రెంచి ఆపెరాలలో అతిరమ్యమైనదిగా ప్రసిద్ధిగన్న ఈ ఆపెరాను అనువాదముగా గాక స్వతంత్రమైన పునస్సృష్టిగా కొన్ని స్వల్పమైన మార్పులను చేయుచు నేను వ్రాసితిని. జెరార్డును పొడిచినది నీలకంఠుడు గాక అతనికి విధేయులైన హైందవులలో ప్రధానుడైనవాడని కథను మార్చితిని. హాజీ, రోజ్‌ల పేర్లను శ్రావకుడు, హెలీనా అని మార్చితిని. ఈస్వల్పమైన మార్పులు దప్ప, ఇతివృత్తమును యథామూలముగనే అనుసరించితిని.

పాత్రలు

నీలకంఠుఁడు: బ్రాహ్మణుఁడు, దుర్గోపాసకుఁడు
శ్రావకుఁడు: అతని సేవకుఁడు
జెరార్డ్, ఫ్రెడరిక్: ఆంగ్లేయ సైనికులు
ఎలీనా,హెలీనా: జెరార్డ్, ఫ్రెడరికుల ప్రియురాండ్రు
మేడమ్ బెన్సన్: ఎలీనా,హెలీనాల పాలకురాలు (Governess)
లక్ష్మి: నీలకంఠుని కూతురు, కథానాయిక
మల్లిక: లక్ష్మి పరిచారిక
ఇంకను ఇతరాంగ్లేయసైనికులు, వీథివ్యాపారులు, పౌరులు, బ్రాహ్మణులు

ప్రథమాంకము

ప్రథమదృశ్యము

(స్థలము: పలువిధముల పూలచెట్లు, పొదలు, వృక్షములు, గఱిక దట్టముగా పఱచుకొన్న పచ్చని వనప్రాంతము. ఆచెట్లచాటున ఒక చిన్న యేఱు పాఱుచుండును. ఆయేఱులో పయనించుట కొక చిన్న పడవ సిద్ధముగా తీరమునఁ గట్టఁబడి యుండును. ఆవనములో ఒక చిన్నపాటి దుర్గాదేవి ఆలయముండును. అందులో దుర్గాదేవితోఁ బాటు, శివ వినాయకుల ప్రతిమలు గూడ నుండును. ఒక దుర్బలమైన వెదురుకంచె ఆ ఆలయ ప్రాంగణము నావరించి యుండును. వెదురుబొంగులతో చేసిన తలుపుగల ఆకంచెలోని ద్వారముగుండా ఆదేవాలయప్రాంతమునకు ప్రవేశము కల్గును. అది ఉషఃకాలము. తెర లేచు సరికి ఉదయార్చనకై వచ్చు లోకులకై శ్రావకమల్లికలు ఆవెదురుతల్పును తెఱచుచుందురు. అట్లు తెఱవగా లోకు లాదేవాలయప్రాంగణములోనికి ప్రవేశింతురు.)

లోకులకోరస్:
ఆరంభించుచు నభినవదివసము
తూరుపుమలపైఁ దోఁచుచు భానుఁడు
బంగరురంగుల భాసిలు కాంతుల
నింగిని నేలను నింపెడు వేళను

లేతకరంబుల నాతఁడు దట్టగ
చైతన్యముతోఁ జక్కగ నవ్వెడు
మోములు దాలిచి తామరతీవియ
లామోదంబు వెలార్చెడి వేళను

ముకుళితకమలంబులలో రాతిరి
సకలము బుచ్చి యుషస్సున సూర్యుఁడు
విడుదల సేయఁగ భృంగము లాతని
సడిసేయుచు స్తుతి సల్పెడి వేళను

విరివిగ విరిసిన విరితండంబుల
పరిమళ ముర్వినిఁ బర్విన వేళను
చేరి భజింతుము శివునిం దుర్గను
వారణవక్త్రుని భక్తి తలిర్పఁగ

పరదేశస్థుల పాలనమున మా
ధరకుం గల్గిన దాస్యము నవమతిఁ
బరిమార్పంగను బ్రార్థన సేతుము
కరిముఖ! దుర్గా! పరమేశ్వర మిము!

(అని ప్రార్థించుచు నందఱును ముందుగ దేవతావిగ్రహములకు మ్రొక్కి ఆతర్వాత నీలకంఠునికి మ్రొక్కెదరు)

నీలకంఠుఁడు:
అనిశము కాళిక నారాధించెడు
నను మ్రొక్కెడు మీకును నాకాళిక
కరుణావశమునఁ గలుగును గావుత
స్థిరసౌఖ్యంబును, తృప్తియు, తేజము

మనదైవంబుల మన ధర్మంబుల
గణియింపని ఆగంతుకగణముల
పాలనమందున పాడగుచుండెను
పాలన కఱవై భారతసంస్కృతి

కాళిక ఆగ్రహకీలలు వారల
లీలల నడఁచెడి కాలము వచ్చును
మనహైందవధర్మంబున కప్పుడు
పునరుజ్జీవనమొనరును దప్పక

అది జరిగెడి వఱకామెను గొల్వుఁడు
సదమలభక్తిని సర్వవిధంబుల
కరుణామయి యా కాళిక తప్పక
వరదాయిని యగు భక్తుల కెప్పుడు

(ఇంతలో నాలయగర్భమునుండి లక్ష్మి చేయు నీక్రింది ప్రార్థన వినబడును. )

లక్ష్మి:
పాలింపు మోదుర్గ! పాలింపు మమ్ము!
పాలింపు మోగౌరి! పాలింపు మమ్ము!
పాలింపు మోకాళి! పాలింపు మమ్ము!
మాలోపములఁ బాపి పాలింపు మమ్ము!
నీలకంఠుఁడు:
కాళీస్తవమును గావించెడు నీ
బాలికలో ఆకాళీరూపమె
కనుగొంటిని సాక్షాత్తుగ నేనీ
దినకర సముదయదివ్యక్షణమున

(ఆతర్వాత లక్ష్మి బయటికి వెల్వడును. ఆమెతోఁ గూడ ఇతరులందఱును ప్రార్థించుచు విగ్రహములకు మ్రొక్కెదరు.)

అందఱు:
పాలింపు మోదుర్గ! పాలింపు మమ్ము!
పాలింపు మోగౌరి! పాలింపు మమ్ము!
పాలింపు మోకాళి! పాలింపు మమ్ము!
మాలోపములఁ బాపి పాలింపు మమ్ము!

పాలింపు విశ్వేశ! పాలింపు మమ్ము!
పాలింపు విఘ్నేశ! పాలింపు మమ్ము!
పాలింపు నందీశ! పాలింపు మమ్ము!
ఆలించి పాలింపుఁ డనిశంబు మమ్ము!

(తర్వాత లోకులందఱు నీలకంఠునికి మ్రొక్కి, అతని ఆశీర్వాదమును, అనుమతిని తీసికొని నిష్క్రమింతురు.)

నీలకంఠుఁడు:
కరుణించు మిమ్మెపుడు కాళికామాత!
స్మరియించుఁ డామెనే సద్భక్తితోడ
మీయింట నున్నను నేయింటనున్న
ఆయంబనేఁ దలఁచు డనిశంబు మీరు
ఈయుషస్సేవ నిపుడింకఁ జాలించి
హాయిగా మీమీ గృహంబులకుఁ బొండు!

(అచట లక్ష్మీ మల్లికా శ్రావక నీలకంఠులు మాత్రమే మిగులుదురు. శ్రావకుఁడు వెదురుతల్పును మూయును.)

నీలకంఠుఁడు:
నీదగు నిర్మలాంతరము నీదగు భక్తియు సాధుశీలమున్
నీదగు దైవసంస్తవననిష్ఠయు లక్ష్మి! సతంబు నిన్ను మ
మ్మాదుకొనంగఁజాలు వరమయ్యెను, దీన బలిష్ఠమయ్యెఁబో
నాదగుపూన్కి హైందవసనాతనధర్మము నుద్ధరింపఁగన్
లక్ష్మి:
నను మీర లీరీతిఁ గొనియాడఁ దగదు
ఘనమైన మీకాళికాదీక్షకంటె
ఘనమైన దన్యంబు గనరాదు నాకు
మనభాగ్యనిర్దేశ మదియె గావించు
నీలకంఠుఁడు:
ఇంక నేనేఁగవలె
లక్ష్మి:
ఇంత త్వరగా? ఇప్పుడేనా?
నీలంఠుఁడు:
భయ మక్కఱ లేదు. నిశ్చింతగా నుండుఁడు.

పరిసరమందు మ్లేచ్ఛజనపాతితమై చననట్టి దేవమం
దిరమున నాచరింపఁబడు దేవునియుత్సవమందు సాయము
న్నెరపఁగ నన్నుఁ బిల్చి రది నిర్వహణం బొనరించి వత్తు స
త్వరముగ రాత్రికి న్మునుపె ధైర్యముతో మనుఁడంతకాలమున్

(లక్ష్మివైపు చూపుచు మల్లికాశ్రావకులతో అనును; పాతితము=పడ(కూల)గొట్టఁబడినది)

అండగా నుండుడు లక్ష్మి కంతసేపు

శ్రావకుఁడు:
అండగా నుందు మవశ్యముగను
మల్లిక:
వీడకుండగ నామెనుం గూడియుందు
లక్ష్మీమల్లికాశ్రావకులు:
కరివక్త్రుకరుణచే కష్టంబుఁ బడక
పరదేశభటులచే బాధింపఁ బడక
సతతంబు ధర్మాభిరతులైన మీరు
అతిశయంబగు వేడ్క నాదైవమునకు
సాగించి యుత్సవము శాస్త్రోక్తముగను
వేగంబ మముఁజేర వేంచేయుఁ డార్య!
వేగంబ మముఁజేర వేంచేయుఁ డార్య!
నీలకంఠుఁడు:
చింతింపకుఁడు మీరు శీఘ్రంబుగానె
అంతయును గావించి యరుదెంతు నేను

(నిష్క్రమించును )

రెండవదృశ్యము

లక్ష్మి:

(తన సొమ్ములను దీసి అచ్చటి శిలాఫలకముపై నుంచి, చెంతనే మందముగా పాఱుచున్న యేటిలో ప్రతిబింబించిన పూగుత్తులు గల తీవలను చూపుచు సంతోషంతో మల్లికతో ననును.)

కనుమో మల్లిక! కను మీవింతను!
తీరములందున తీరుగఁ బెరిగిన
తీవెలు నిండుగ పూవులు దాలిచి
తమయందంబును తటినీనీరపు
ముకురంబునఁ గని మురియుచునున్నవి

మల్లిక:

(ఆ దృశ్యమును గమనించుచూ ఉత్కంఠతోఁ బల్కును; తటిని=నది, ముకురము=అద్దము)

నీయుత్సాహము నీయానందము
గనుచుండఁగ నీక్షణమున స్వామిని!
విదితంబయ్యెను మృదుతామయమగు
నీదుస్వభావపు నిర్మలరూపము!

లక్ష్మి:
(భీతి నటించుచు)
కానీ మల్లిక! కంపిలుచుండును
పూని భయంబును మానసమెంతయొ
స్మరియించుచు నాజనకుని క్షేమమె
పరపాలిత తత్పురవరమందున
మల్లిక:
ఈవిధి భీతిల నేటికి స్వామిని!
కావకపోవున కాళిక యాతని!
శ్వేతగరుత్తుల చెల్వము నదిలో
చూతము రమ్మిఁక చేతం బలరఁగ!

(ఇర్వురు నదీతీరమున గల లతాపుష్పాదులను గూర్చి క్రిందిపాట పాడుచు పాట చివర ఓడలో నదీయానమును చేతురు; శ్వేతగరుత్తులు=హంసలు)

మల్లిక:
ఎంతయొ హృద్యం బీవనసౌందర్యము
సంతోషంబుగ నంతయు వీక్షింతము

తెల్లనిపూవుల దీధితు లెల్లడఁ జల్లుచు
మల్లెల మొల్లల వల్లరు లల్లుకొనంగను
వల్లీగృహములు వాహిని కిరుతీరంబుల
పెల్లుగ నడరును వీక్షణపర్వంబుగ ॥ఎంతయొ…వీక్షింతము ॥

లక్ష్మి:
కందము కన్నులవిందుగ నిందలి వింతలు
డెందం బలరఁగ నిందున విహరింతము

మెఱయుచు ప్రతిబింబించిన బాలాదిత్యుని
త్వరగను గదలెడు తరగల డోలిక నుంచుచు
సరసన పక్షులు చక్కని జోలలు వాడఁగ
అరయుము మల్లిక! ఆపగ ప్రేమగ నూపును ॥కందము…విహరింతము ॥

ఇర్వురు:
ఇచ్చటి భూముల నిచ్చటిపుష్పచయంబుల
అచ్చెరువొందుచు నారసి యానందింతము

పచ్చతివాచింబలె భూతలమును గప్పిన
పచ్చికబయలుల విచ్చెను చేమంతులు
ముచ్చటగొల్పుచు పొంతం బల్వలముల
స్వేచ్ఛఁ జరించెను శ్వేతగరుత్తుల గుంపులు ॥ఇచ్చటి భూముల…యానందింతము ॥

ఇర్వురు:

(క్రింది పాటను పాడుచు పడవలో నెక్కి పడవను నడుపుకుంటూ నిష్క్రమింతురు; పల్వలములు=నీటిగుంటలు )

తీరంబులఁ బువుటీరంబులు చెలువారఁగ
ఏఱిది పాఱును నీరంబుల నిండారుచు

తళతళమెఱసెడు తరగలపై నీపడవను
అలవోకగ నల్లల్లన నడపుచుఁ బోదము
జలపక్షుల జలజాతంబులఁ దిలకింతము
పలురంగుల కల్వల కంజంబులఁ దెత్తము ॥తీరంబుల…దెత్తము ॥

మూఁడవదృశ్యము

(మేడమ్ బెన్సన్, ఎలీనా జెరార్డులు, హెలీనా ఫ్రెడరిక్‌లు ఆయావరణముయొక్క వెదురుతల్పున కవతల కనిపింతురు.)

బెన్సన్:
అమ్మాయీలూ జాగ్రత్త. ఇది పరస్థలం.
హెలీనా:
ఏముందో తొంగిచూడనైనా చూతాము!
ఎలీనా:

(హెలీనా పైమాట అంటుండగానే వెదురుతల్పును తెఱచికొనునట్లుగా ద్రోయును)

హెలీనా:
తలుపు సందీయనే ఇచ్చింది. ఇందులో దూరవచ్చు.

(అందఱు మెల్లగా ఆసందులోనుండి ఆలయప్రాంగణములోనికి ప్రవేశింతురు.)

జె రార్డ్:

(మేడమ్ బెన్సన్‌కు చేయూత నొసఁగి, ఆమెను ప్రాంగణములోనికి ప్రవేశపెడుతూ)

నాందీ నేడేదో నవ్యారంభానికి.

బెన్సన్:
(ప్రవేశించి) అవాంఛనీయమీ సాహసమంతా!
జెరార్డ్:
కానీ అత్యంత వినోదకరం!
ఫ్రెడరిక్:
అపాయకరం కూడా!
జెరార్డ్:
అందులోనే ఉంది అసలు వినోదం!
బెన్సన్:
ఐనా నాబాధ్యతను నేను మఱవరాదు.
ఎలీనా:

(ప్రక్కనున్న ఉమ్మెత్తపూవులు త్రుంచి చేతిలోనికి తీసికొంటూ)

కమనీయంబయి ఘంటాకృతితో
ఈసుమ మొప్పును హిమవర్ణముతో!

ఫ్రెడరిక్:
చూచుటకెంతటి సుందరమైనవొ
తాఁకుటకంతటి లోఁకువ యైనవి
అవి విషపూర్ణములగు నుమ్మెత్తలు
వర్జించుటయే వానిని శ్రేయము
బెన్సన్:
విషపూర్ణములే విరులన్నియు నిట!
జెరార్డ్:
సుందర సురభిళ సుమపాత్రలలో
అందించును విసమిందలి తరువులు!
ఫ్రెడరిక్:
కలలను గనుచుం గవితాజగమున
మెలగుట మానుఁడు; తిలకింపుడిటం
దరువుల చాటున దాఁగెను కోవెల!
నిరసించుచు మన పరిపాలనమును
ప్రజలకు బోధలు పచరించెడు నా
ద్విజుఁ డర్చించెడు దేవాలయ మది!
ఇతరులందఱు:
(ఉత్కంఠతో) ఆ హిందూదురభిమాని నీలకంఠుఁడా??
ఫ్రెడరిక్:
సందేహమా?

(ముందునకు సాగి, చెట్లసందునుండి పరీక్షగా చూచి పల్కును; నిశాంతము=సదనము)

కొంతగ శిథిలంబయి, యీ
కాంతారంబున కరాళ కాళీ గణనా
థాంతకరిపుమూర్తి ని
శాంతం బగు నిద్ది యతని సంస్థానంబే!

జెరార్డ్:
ఆహా నీలకంఠుఁడు!!

ప్రొద్దుమాపులందున నూరిపోయుచుండు
ఆశ్రితజనౌఘముల హృదయంబులందు
ద్వేషభావంబు మనయందు తీవ్రముగను
హైందవమతదురభిమాని యగు నతండు

ఫ్రెడరిక్:

(ఎగతాళిగా)

అంతకంటె వింత, ఆదిశక్త్యవతార
మంచు నెంచి యాతఁ డాత్మసుతను
మనకుబోటివారి మలినవీక్షణములు
తాఁకకుండ నెపుడు దాఁచియుంచు

మహిమచేతఁ గాదు మంజురూపముచేత
ఆమె దర్శనంబు హాని గూర్చు
కామపీడితంబు గావించి హృదయంబు
వయసుకాండ్ర కనుచుఁ బలుక వింటి!

హెలీనా:
ఆమె పేరు లాక్మి యనఁగ విందు నేను
జెరార్డ్:
ఓహో లాక్మి – Godess of Wealth!
ఎలీనా:
అట్టి సుందరి నజ్ఞాతమందు నుంచు
వీరి సంస్కృతి యెంతయొ వింతవింత!
బెన్సన్:
వింతగాదది కొండంత వెఱ్ఱివెఱ్ఱి!
ఫ్రెడరిక్:
ఏది చేసిన దోసమే యిచట మనకు!
శిలల మ్రొక్కెడు వీరల చిత్తవృత్తి
గేలి యొనరింపఁగా రాదు కేళికైన,
ఆలకున్ మ్రొక్కు వీరల యల్పబుద్ధి
హేళనంబు సేయంగరా దెట్టివారు!
జెరార్డ్:
కూఁతురునె దైవముగఁ జేసి కొలుచుచున్న
అతనిమూఢత్వమును దోషమనఁగ రాదు!
బెన్సన్:
అట్టి యామెను గన నాకు హడలె పుట్టు!
హెలీనా:
ఎంతగా స్త్రీసహజమైన స్వాంతవృత్తి
కప్పిపుచ్చఁగ నెంచినఁ గాని యామె
సరసుఁడైనట్టి పురుషుని స్తవముచేత
పొంగి యాతనిఁ గోరకపోవు నెట్లు?
ఫ్రెడరిక్:
నిజమె కాఁబోలు నది మన నెలఁతలందు
కాని వీరివర్తన వేఱుగానె యుండు
ఇతరులు:
ఆకసంబున విహరించు నాస్థ మాని
నేలకుం దిగి యోచింపు నిక్కమేదొ
స్త్రీలచిత్తంబు లొకతీరె చెలఁగుచుండు
ఇచటనైనను మఱియింక నెచటనైన
ఫ్రెడరిక్:
ఉప్పరంబున విహరింప, నున్నరీతి
నున్నరీతిగఁ గన్నట్టు లూహసేతు;
ఇంతులందఱి చిత్తంబు లెల్లచోట్ల
నొక్కతీరుగ నుండవు నిక్కముగను!
ఎలీనా:
ఆమె ఆచూకి నెట్లైన నరయఁగలమ
ఈ నిగూఢప్రదేశంబులోన మనము?
ఫ్రెడరిక్:
అట్టి దుస్సాహసంబు చేయంగరాదు
సంచరించిన నిట మనసాటివారు
మలినమైపోవు వారల మందిరమ్ము
వారివేల్పుల కెంతొ కోపంబు గల్గు!
హెలీనా:

(ఎగతాళిగా)

అవనికిం దిగినట్టి దుర్గయే ఆమె యగునేమో?

ఫ్రెడరిక్:

(ఎగతాళిగా)

అందు కనుమానమా?

జెరార్డ్:

(ఎగతాళిగా)

ఆమెకు మోకరిల్లవలసిందే!

ఎలీనా:

(ప్రక్కకు నడచి, అచ్చట శిలాఫలకముపై నున్న లక్ష్మియొక్క వజ్రఖచితమైన సువర్ణాభరణములను చూస్తూ…)

ఆహా! అద్భుతమైన ఆభరణాలు!

హెలీనా:
(సమీపించి చూచి) అవి ఆవిప్రపుత్రివి కాబోలు!
ఎలీనా:
(ఇంకా పరీక్షగా చూచి) ఎంతో అందమైన సొమ్ములు!
బెన్సన్:
ఎలీనా! జాగ్రత్త, తాఁకకు వాటిని!
ఎలీనా:
అవ్వి యావిప్రపుత్రివి; అందుచేత
అతిపవిత్రమైనవి; వాని నంట నేను;

(స్త్రీసహజమైన ఒయ్యారంతోఁగూడిన అనురాగవిన్యాసంతో జెరార్డును పట్టుకొని సంభావిస్తూ పల్కును)

నాప్రియుండు జెరార్డు విన్నాణమెసఁగ
వానిరూపును చక్కగా వ్రాసి తెచ్చు!

జెరార్డ్:

(అందు కంగీకరిస్తూ అనురాగపూర్వకంగా ఎలీనాతోఁ బల్కును)

ఇచ్చటనె యుండి వైదగ్ధ్య మచ్చుపడఁగ
వీని రూపును చిత్రించి వివరముగను
అట్టి సొమ్ముల మన వివాహంబునందు
నీకు నర్పణమొనరింతు నెనరు మీర!

ఫ్రెడరిక్:
నీవిందే ఉందువా?
జెరార్డ్:
తప్పేమి?
ఫ్రెడరిక్:
తప్పేమి లేదు, కాని…
బ్రాహ్మణావాస మిచ్చటివారి కెల్ల
దేవతావాసముంబోలె పావనంబు
అట్టిచోటఁ జొచ్చిన మనయట్టివారు
వైరభావంబు మనయందువారికొదవు
జెరార్డ్:
ఎంత హాస్యాస్పదంబిట్టి చింతనంబు
ఎల్లదేశంబునే గెల్చి యేలుచున్న
రాణి విక్టోరియాభటరాజి నిచట
ప్రతిఘటించునె యొక పేదపాఱుఁ డకట?
ఫ్రెడరిక్:
ప్రతిఘటింపరు వారలు బలముతోడ
అతిరహస్యములైన వ్యూహములతోడఁ
గడపఁజూతురు మనల నాకస్మికముగ
కాన నుండఁగాఁ దగును జాగ్రత్తగాను
బెన్సన్:
క్రూరతరమైన దేశంబు, సారెసారె
కాపదలె యిట సంప్రాప్తమగుచునుండె
భద్రకరము గాదు మనకీ ప్రాంగణంబు
సత్వరంబుగ నిది వీడి చనుట మేలు

(సాధికారస్వనముతో ఎలీనాహెలీనాలతోఁ బల్కును.)

తిరిగిపోవలె నింక తరుణులార!

జెరార్డ్:
వదలి వెళ్ళుఁడు నన్నిట స్వైరముగను
అందమైన ఆసొమ్ముల ఆకృతులను
వ్రాసికొని వత్తు నేను సత్వరముగానె
స్త్రీలు:
తామసింపకు నీవు త్వరగాను రమ్ము!

(అని పల్కి స్త్రీలు నిష్క్రమించుచుందురు.)

ఫ్రెడరిక్:
నీదు పూన్కి మిత్రంబ! ప్రమాదకరము;
సాహసివి నీవయితి, విట్లు సంవదించు
నేను భీరువు నైతిని; నిజము వల్కు
వాని నిట్లె భావింతు రీ వసుధయందు.

(ఆస్త్రీల వెనుక నడచు ఫ్రెడరిక్ జెరార్డ్‌ను పై విధముగా హెచ్చరించి నిష్క్రమించును.)

నాల్గవదృశ్యము

(అచ్చట జెరార్డు మాత్రమే మిగిలి, కొంచెము దూరమునుండి ఆసొమ్ములను జూచుచు …)

జెరార్డ్:
కుతుకంబున నీసొమ్ముల
ప్రతి వ్రాసికొనుట యసాధువర్తన యగునా?
ప్రతిషేధించుట దీనిని
మతి లేని ఫ్రెడిరికు మూఢమతమే కాదా?

(పైవిధముగా పాడి, ఆసొమ్ముల యాకృతులను గ్రహింప ముందుకు సాగి, అంతలో నాగి పాడును.)

కానీ అజ్ఞాతంబు, అ
మానుషమగు శక్తి యేదొ మానుము నీవీ
పూనిక నని యిప్పుడు నా
వీనులలో నూఁదుచుండె వింతగ నేలా?

(క్షణకాల మట్లాగి, మఱల ఆసొమ్ములవైపు చూచుచు, అవి ధరించిన స్త్రీని చూచుచున్నట్లుగా మనసులో భ్రమించి, క్రింది పాటను సాభినయముగా పాడును.)

(పాట)

మదిలో మెదలెడు, నా
మదిలో మెదలెడు మంజులమూర్తియె
ఎదుటను నిల్చెను, నా
యెదుటను నిల్చెను ఇందుని కళవలె

తొలిచూపులలోఁ గలిగిన త్రపయును
అలుకును క్రమముగ గళితము గాఁగా
ఎలనవ్వును వెలయించుచు నాచెలి
పలుకును నెవియో తెలియని బాసలు!

తెలియని బాసలు పలికిన నేమీ
తెలుపును చక్కగ తెలిగన్నులలో
నలరెడు తళతళ లాచెలిమదిలో
మొలకెత్తిన తొలివలపుల తీరును

మదిలో మెదలెడు మంజులమూర్తియె
ఎదుటను నిల్చెను ఇందుని కళవలె, నా
యెదుటను నిల్చెను ఇందుని కళవలె

(అంతలో ఆ చిత్తభ్రమనుండి తేరికొనుచు, క్రింది పాటను పాడును.)

అంతయును నాదు భ్రమ యౌను గాని
లేదు, నాయెదుటాయింతి లేదు లేదు

ఆశల యాకసమందున, నా
యాశల ఆకసమందున స్వేచ్ఛగ
విహరించు మనోవిభ్రమవిహగమ!
ఆలింపుము నా యభ్యర్థనమును
చాలింపుము నీస్వైరవిహారము
పణముగఁ జేయక నను నీమాయకు
చనుమిఁక నీదగు స్వప్నజగత్తుకె
చనుమిఁక నీదగు స్వప్నజగత్తుకె

(పైవిధముగా పాడినను, ఇంకను తొలఁగని భ్రమతో ముందుకు నడచి, సొమ్ములలోని హస్తకంకణమును గ్రహించి …)

ఇది యామె కంకణము కాబోలు!

కనకమునందున కమనీయంబగు
మణులం దాపిన మంజులకటకము
ఆసుమకోమలి హస్తమునందున
వాసముచేసిన భాసురకటకము

ఈకటకాలంకృతమగు హస్తము
గైకొను యోగము నాకుం గల్గున?
ఈకటకాలంకృతమగు హస్తము
గైకొను యోగము నాకుం గల్గున?

(కంకణమును యథాస్థానమున నుంచి, రవ్వల ఉంగరమును గ్రహించి …)

పదియార్వన్నియ బంగరునందున
పదిలంబగు నేర్పరితన మొప్పఁగ
చుక్కలరీతిగఁ జక్కగ మెఱసెడు
చొక్కపు రవ్వలు చెక్కిన యూర్మిక

ఈయూర్మిక ధరియించిన యంగుళి
సోయగముం గని చొక్కఁగఁ గందున?

(సొమ్ములలోని మణిస్థగితహారమును గ్రహించి …)

ఆహా! ఇది యామె గళమాధుర్యము గన్న హారము!

పలురంగుల ప్రభలొలికెడి మణులం
జెలువారఁగఁ గూర్చినదీ హారము
ఆ సతి యురమున నలఁదిన గంధపు
వాసన యింకను మోసెడు హారము
ఆచెలి యెదలోఁ బూచిన రాగము
రేఁచిన కంపనఁ జూచిన హారము

కనుగొందునొ ఈ మణులందున నా
యనుబింబమునే యామె గళంబున?
కనుగొందునొ ఈ మణులందున నా
యనుబింబమునే యామె గళంబున?

(సొమ్ములలోని చిఱుగజ్జెలుగల అందెలను గ్రహించి క్రింది పాటను పాడును.)

ఇవి యామె పాదావాసధన్యములైనవి కాబోలు!

పూవులఁదలిరుల నావృతమగు నీ
త్రోవలఁ జను నా తొయ్యలి కోమల
చరణాబ్జంబుల సహవాసంబున
చరితార్థములై పరగును గద నీ
చిఱుగజ్జెల సడిఁ జేసిడి యందెలు!

కందునొ నేనీ యందెల నా
సుందరిపదములయందున
పొందించెడి భాగ్యంబును?

కందునొ నేనీ యందెల నా
సుందరిపదములయందున
పొందించెడి భాగ్యంబును?

(మఱుల భ్రమనివృత్తి నర్థించుచు పాడును.)

ఆశల యాకసమందున నా
యాశల ఆకసమందున లీలగ
విహరించు మనోవిభ్రమవిహగమ!
చాలింపుము నీస్వైరవిహారము
చాలింపుము నీస్వైరవిహారము
పణముగఁ జేయక నను నీమాయకు
చనుమిఁక నీదగు స్వప్నజగత్తుకె
చనుమిఁక నీదగు స్వప్నజగత్తుకె

(ఇంతలో దూరమునుండి లక్ష్మీమల్లికల పడవ చేరవచ్చును. దానినిఁ జూచి ఉద్వేగముతో క్రిందివిధముగా పాడి జెరార్డు చెట్లసందులో దాఁగును.)

అదిగో లాక్‌మి! లాక్‌మి! ఆసుందరియే లాక్‌మి! ఆసుందరియే లాక్‌మి!

ఇందుసుందరాస్యమందు నానందంబు
కందళింప నామె కరములందు
అందమైన అంబుజేందీవరంబులు
చెందొవలును బూని చేరవచ్చు!

ఐదవదృశ్యము

(మల్లిక చేయూత నీయగా లక్ష్మి పడవనుండి దిగును. ఆపూవులను వారు విఘ్నేశ్వరుని ముందుంచి క్రింది విధముగ ప్రార్థించుచుండగా వారిని జెరార్డు చాటునుండి చూచుచుండును. )

లక్ష్మీమల్లికలు:
నిరతము మమ్ముల దయతోఁ
బరిపాలించెడు కరిముఖ! వైరులచే మా
కిరవుకొను వెతల నెల్లం
బరిమార్పుము స్వీకరించి మాప్రార్థనలన్
లక్ష్మి:

(మల్లికతో)

శీతలనీరంబులతో
ఈతటిని పరిభ్రమించు నీ సైకతమున్
ఈతావు మనకు మల్లిక!
ఆతపశాంతినిఁ గనంగ ననుకూలంబౌ

మల్లిక:
అవనిజంబుల నీడచే నంతకంటె
ఆపగాతీరధర సేవ్యమగును చాల,
రమ్ము స్వామిని! కొంత కాలమ్ము నచట
గడపి యాతపశాంతిని గాంచఁగలము

(అని మల్లిక తీరమునందలి చెట్లసందునకు వడిగా నుఱికి అదృశ్యమగును. లక్ష్మి యామె ననుసరింపఁబోయి, అంతలో ఆగిపోయి క్రింది విధముగా పర్యాలోచించును.)

పాట
ఎదియో నవమగు స్పందన యొదవును నేఁడెదలోన
ముదమో వ్యథయో చింతయొ ఎదియో తెలియఁగలేను

ఎప్పుడు పూచిన పూవులె యిప్పుడు సొంపుగఁ దోఁచు
ఎప్పుడు చూచిన నింగియె యిప్పుడు నవముగఁ దోఁచు
ఎప్పుడు వీచిన వాయువె యిప్పుడు హాయిని గూర్చు
చెప్పఁగఁ జాలను హేతువు చిత్రంబుగ నిది తోఁచు
ఎదియో నవమగు… తెలియఁగలేను
అలరులపెదవుల తేనియ లానెడు మదభృంగమును
వలపుం జెలితో మంతనములు వల్కు కపోతమును
కలహంసిక నోటను బిసముల నుంచు మరాళమును
తిలకించిన నెవొ తీయనితలఁపులు మదిలో మెదలును
ఎదియో నవమగు… తెలియఁగలేను

(పైవిధముగా స్వేచ్ఛగా పాడుచు చరించు నామెకు జెరార్డు కన్పడును. అతని హఠాద్దర్శన మామెకు అలజడి కల్గించును.)

లక్ష్మి:
మల్లికా! మల్లికా!

(బిగ్గరగా నఱచును. ఆమె యఱపును విని మల్లికాశ్రావకులు పరుగున నుఱికివత్తురు.)

మల్లిక:
భయము గల్గెన స్వామినీ!
శ్రావకుఁడు:
భయమయ్యెనా స్వామినీ!
లక్ష్మి:
(కొంత నెమ్మదించి, సర్దుకొంటూ) లేదు, లేదు

లేదు లేదేలనో నేఁడు నాదుమనము
చిన్నఘటనకె స్పందించు చిత్రముగను
తిరిగిరాకుండె నాతండ్రి పురమునుండి
అతని చింతయె గూర్చును వెతను నాకు
త్వరగఁ గొనిరండు మీరేఁగి తండ్రి నిపుడు

(ఆమె వైఖరికి అనుమానాశ్చర్యములు ప్రదర్శించుచు మల్లికాశ్రావకులు నిష్క్రమింతురు.)

లక్ష్మి:

(భయకోపంబులతో జెరార్డుతో)

ఎవ్వఁడ వీవు?వచ్చితివి యిచ్చటి కేల? యతర్కితంబుగాఁ
గ్రొవ్వి యిటం జరింతు, వొనగూర్చును నీకిది ప్రాణహానియే,
ఇవ్వన మీశివాలయము లెంతొ పవిత్రము లిందు నీదుబోం
ట్లెవ్వరు పాదమూనఁ దగ దిట్టి యకృత్యము మాని పొమ్మిఁకన్!

(తనలో)

ఒకవైపు భయంబును, నిం
కొకవైపున నితని నెఱుఁగు నుత్సాహంబున్
ప్రకటంబగుచు న్నాలో
వికలత గూర్చును పొనర్చు వ్రీడోద్గమమున్

(కొంత నెమ్మదించి ప్రకాశముగ పల్కును)

పరిమిళితాప్తభావమునఁ బల్కుచునుంటిని నీదుమేలుకై,
తిరిగిన నిచ్చటం గలుగు తీరనినష్టమె నీకు గావున
న్మఱలుము నీగృహంబునకు, మత్పితరుండిట హైందవేతరుల్
దిరిగిన, మాదుదైవముల తేలికచేసిన సైఁపఁడింతయున్

జెరార్డు:

(సానునయంగా)

కోపముతోడఁ బల్కినను కోమల మెంతయొ నీదు పల్కు, నీ
రూపము క్రోధమందునను క్రొత్త హొరంగు వెలా ర్చుచుండె, నీ
కోపమునందె కామనయు గుప్తముగాఁ బొడసూపుచుండె, ని
న్నే పగిదిం ద్యజించి యిఁక నేఁగఁగలాఁడను వేఱుచోటికిన్?

లక్ష్మి:
ఎంత తెగించి పల్కెదవొ! యిట్టి ప్రసంగము సేయరెవ్వరే
నింతకు మున్ను నాయెదుట, నిద్ది గ్రహించుచు నున్న దుర్గ నిన్
వంతలఁ బెట్టి నీపొగరుఁ బాపకపోవదు, పొమ్ము, పొమ్ము, నా
చెంతను నీదురూపుఁ గనఁజేయక పర్వుము తత్క్షణంబునన్

(అని క్రమముగా నతనియందు మనసు లగ్నమగుచున్నను పైకి గంభీరముగా పల్కును.)

జెరార్డు:
ఏగతి విస్మరింతు నిను నేగతి వీడుదు నీదుసన్నిధిన్
వాగురవోలెఁ బర్విన భవత్తనుమంజిమలోనఁ జిక్కితిన్
రాగమయత్వదీయమధురాధరకంపనతోడ నేకమై
యూఁగును నాదుమన్గడయె, ఓర్వదు తద్విరహంబు నింతయున్
లక్ష్మి:

(తనలో)

చేతమునందున బాణము
రీతిని దూరుచు నపూర్వమృదుతామయమై
యీతనిమాటలు నాలో
నూతనలోలత్వ మేదొ నూల్కొల్పుఁ గదా!

(పైకి గాంభీర్యమార్దవమిళితమైన స్వనముతోఁ బల్కును.)

చూడవు వచ్చు నపాయము,
వీడవు నీమంకుతనము, వేఁడెద నిన్నున్
వీడుము! వీడుము వెంటనె!
మూఁడును నీప్రాణములకె ముప్పిట నున్నన్

జెరార్డ్:

(కదలకట్లే నిలచి)

ముప్పు వచ్చిన రానిమ్ము, మురిపెమొప్ప
నీదుమంజిమఁ గాంచుచు నిల్తు నిటనె!

లక్ష్మి:

(తనలో)

ఈతఁడు వచ్చు కీడు గణియింపక నిల్చెను నన్నుఁ జూచుచు
న్నీతిఁ దొఱంగి గాని, యితనిం గనుచుండఁగ నాయెడందలో
నూతనమార్దవాన్వితమనోహరభావమె కల్గు, దీనికే
హేతువొ? హేతువేది యగు నీతని యీదృశచిత్తవృత్తికిన్?

(ప్రకాశముగా)

వచ్చు నపాయము నెంచక
యిచ్చట నిర్భీతి నిల్తు వీదృశధృతి నీ
కిచ్చిన దేవుం డెవ్వఁడొ,
అచ్చెరువగు నతనిమహిమ మాలోచింపన్!

జెరార్డ్:

(పాట)

ఆదేవుఁడె నీదేవుఁడు, నీదేవుఁడె నాదేవుఁడు
ఏదేవుం డెదలో మోదాంకురముల మొలిపించును
ఏదేవుం డళులం బూఁదేనియకై పురికొల్పును
ఏదేవుఁడు తరుణుల యెదలందుం దహతహ నించును
ఏదేవుం డిలలో నేలును వలపులరాజ్యంబును
ఆదేవుఁడె నాదేవుఁడు, నాదేవుఁడె నీదేవుఁడు

(పైపాటను వినుచామె అనురాగపూర్ణమైన హావభావముల ప్రకటించును. అప్పుడాతఁడు ఆమెను ప్రేమతో లోఁగొనుచు ఈక్రింది పాటను పాడును)

నాదేవుఁడె నీదేవుఁడు, నీదేవుఁడె నాదేవుఁడు
ఏదేవుని కృపచే నిగురించును తరుగుల్మంబులు,
ఏదేవుని కృపచే కుసుమించును సుమగుచ్ఛంబులు,
ఏదేవుని కృపచే జనియించును అనురాగంబులు,
ఏదేవుని కృపచే ఫలియించును దాంపత్యంబులు
ఆదేవుఁడె నాదేవుఁడు, నాదేవుఁడె నీదేవుఁడు

(అట్లు కౌఁగిటిలో నుండి, ఇర్వురును గలసి ఈక్రింది పాటను పాడుదురు.)

ఇర్వురు:
నాదేవుఁడె నీదేవుఁడు, నీదేవుఁడె నాదేవుఁడు
ఆదేవుఁడె మూలం బగు నఖిలంబగు సృష్టికి
ఆదేవుఁడె మూలం బగు నాసృష్టి పురోగతికి
ఆదేవుఁడె మూలం బగు నాత్మల పరితుష్టికి
ఆదేవుఁడె మనదేవుఁడు, అతఁడే అందఱి దేవుఁడు
ఆదేవుఁడె మనదేవుఁడు, అతఁడే అందఱి దేవుఁడు

(ఇంతలో నీలకంఠుఁడు, మల్లికాశ్రావకులు వచ్చు సవ్వడి వినిపించును.దానికి అలజడి చెందుతూ లక్ష్మి కౌఁగిటినుండి వెలువడి జెరార్డుతో పల్కును.)

లక్ష్మి:
తిరిగివచ్చెను నాతండ్రి పురమునుండి
వెంటనే చను మాతని కంటఁబడక!
జెరార్డు:
కాలమున కిసుమంతయుం గరుణ లేదు
మనల విడదీయుచుండెను క్షణములోనె
కాని మఱవ నీక్షణము యుగంబు లైన
వీడుకోలిదె ప్రియురాల వీడుకోలు!

(జెరార్డు త్వరగా నిష్క్రమించును. శ్రావకుఁడు తెరచియుండిన వెదురుతల్పును చూపుచునీలకంఠునితోఁ బల్కును.)

శ్రావకుఁడు:
అరయుఁ డీతల్పు పూర్తిగాఁ దెఱవఁబడెను!
నీల:

(పరిశీలించి)

హైందవేతరుఁ డెవ్వండొ యడుగు మోపి
మలిన మొనరింపఁ బోలు నీస్థలము నెల్ల

లక్ష్మి:
(భీతితోఁగంపించుచు) అమ్మ కాళిక! నీవె కాపాడవలెను!

(నీలకంఠాదులు లోనికి ప్రవేశింతురు.తర్వాత అతని అనుచరుల గుంపు ప్రవేశించును. )

నీల:

(కోపంతో)

పావనంబగు నిచ్చోటు పంకిలంబు
చేసి మాయమైనట్టి యా దోసకారి
అంతమొందకపోడు కారాకువోలెఁ
గాలి మన్మహోగ్రాగ్రహజ్వాలయందు

అనుచరులు:
పావనంబగు నిచ్చోటు పంకిలంబు
చేసి మాయమైనట్టి యా దోసకారి
అంతమొందకపోడు కారాకువోలెఁ
గాలి యస్మదుగ్రాగ్రహజ్వాలయందు
(ప్రథమాంకము సమాప్తము)