కాగితంపూల కాలం

అది నీ దేశం
వారు నిన్ను రాణిని చేశారు
నువు వారిని బిడ్డల్లా సాకుతావు
కుంతీదేవిలా రహస్యంగా ఏడుస్తావేమో మరి
చీకటిలో వెలిగిన కబుర్లు నీ ఆహార్యంగా పనికిరావిక.

స్నేహితులు కూడా ఆస్తి పంపకాలు చేసేసుకున్నారేమో!
పాపం వారు ఒక్క చెవిపోగుతో ఎలా ముస్తాబయ్యేది?


ఏమీ తోచక
నా తల చుట్టూ చమ్కీరేకులు చుట్టుకుని
వంటి నిండా తళుకులు పూసుకుని
కాసేపు గంతులు వేస్తాను
వీళ్ళు దాన్ని నాట్యం అని చప్పట్లు కొడతారు
అర్ధరాత్రులు ఒంటరి క్రేంకారం విని ఉలిక్కిపడి నువ్వు నిద్రలేస్తావు


గులాబీ బుక్క చల్లే దారిలో పడ్డావు నువ్వు
అదే దారిలో కాగితంపూలు తయారు చేసి అమ్ముకుంటున్నా నేను

ఆఖరికి సరైన దారి నాది అనుకున్నావు నువ్వు
ఒక్కసారి చూసిస్తానని నా పూలు లాక్కుని చించేసేవారు ఇక ఎవరున్నారు?

ఇప్పుడు బండరాళ్ళు, కంపలు అడ్డొచ్చేశాయి
కంచెల మధ్య ఖాళీని నింపడమెలాగో తెలియట్లేదు

ముళ్ళగులాబీలు పూసే వంకరటింకర దారులలో తప్పిపోం
వాటిని దాటిపోతూ అప్పటికప్పుడు వెనకకు తిరిగి ఎప్పటికీ నడవం


చివరగా ఒక్క విన్నపం
ఇంత దూరమొచ్చేశాక నాతో దయగా ఉండకు.
కాలం మొనదేల్చిన గునపం
గుండెలోకి దిగబడి పూడ్చిన జ్ఞాపకాలను బద్దలుకొడుతుంది
నా కన్నీళ్ళతో మనిద్దరి మధ్య ఉన్న సొరంగం పోటెత్తుతుంది.