కాలం విలవ తెలీదు

నాలుగింటికే బర్రుమని
పాల్లారీ ఒచ్చీసింది చూసుకో
కాఫీనీళ్ళు వేగిరం వడగట్టు
కాగునీళ్ళ డేగిశా ముట్టించు
మడిబట్ట కట్టుకుని గబగబా
నైవేద్యం అయ్యిందనిపించు.
ఆరున్నరైపోవొచ్చింది
స్నానాల దగ్గిరా జట్టీలు?
నాన్న విన్నారంటే తంతారు!
కాఫీ టిఫినూ ఏవండీ ఇవుగోటి
ఫేంటూ లాల్చీ మంచమ్మీద పెట్టేను
కేరేజీ చురుకుతుంది జాగర్త!
ఏడూ నలభయ్యీ!! ఏరీ వీళ్ళు…?
కాళితల్లికి జడవేసి తెఁవలగొట్టు
ఎంతసేపు చీఁవ గంగాయాత్ర?
ఫణిబాబు బట్టల బేగు సద్దీ
పన్నెండు వందలూ ఇవిగోటి
పేంటు జేబులో నాన్నా చూసుకో!
ఏడుస్తాడు వెర్రివాడు వేళకి
ఏదీ ఇదిగో ఫేరక్సు ము…ద్ద
ఆఁ ఆఁ అమ్మది ఒక ముద్ద
నాఁ నాఁ నానగారిది ఓ ముద్ద
కలిపింది పారీకుండా తింటేనే
నానిబాబు బంగా…రు తం…డి!
తొమ్మిదయిపోయింది పరిగెట్టు
అన్ని చుక్కలు రెండోమాటు కాఫీ
కట్టి విడిచిన చీరే ఇవేళ్టికి
చాకలికి గట్టిగా చెప్పాలి
జడకి టైము లేదు బన్ను చుట్టుకుని
ఎవడేనా రిక్షావాణ్ణి చూడు.
ప్రేయర్‌కి లేటెందుకయ్యేవు?
దేవుని వాక్యమంటె నిర్లక్ష్యం
హత్తిరీ ఎందుకింతాలిశ్యం?
సంజాయిషీ రాసిచ్చి వెల్లండి!
పిల్లలకి ఇదేనమ్మ నీయాదర్శం?
బొత్తిగా కాలము విలువ తెలియదు.

(Inspired by an Icelandic poem by Morgunsongur Husmodur)