ఈ సంచిక గురించి…

మన దేశంలో ప్రస్తుతం ఉన్న సాంస్కృతిక రాజకీయ వాతావరణాన్ని చూడండి. ఎవరేమన్నా అనకపోయినా దెబ్బతినే మనోభావాలు, డాంబికంగా ఎదురు తిరిగే మన ఆత్మన్యూనత మీరు గమనించే ఉంటారు. ఈ న్యూనత మన రక్తంలో ఎందుకు ఇంతగా జీర్ణించుకుని పోయింది అని ఎప్పుడైనా ఆలోచించామా? అసలిది న్యూనత అని గుర్తించామా? మన ప్రవర్తనలో ఆ న్యూనతను కప్పిపుచ్చుకోడానికి మనం చూపించే అహం, మన సమర్థనలు గమనించారా? దీనికి కారణం మన సంస్కృతికి మనం పరాయివాళ్ళు కావడం అని గుర్తించామా? లేదనే అనిపిస్తుంది.

అయితే మన సంస్కృతి అనేది ఒకటి ఉందా? ఉంది. అదేమిటో మనకు తెలుసా? తెలియదు. మనకు తెలిసిన మన సంస్కృతి, దానిలో తప్పులు, బ్రిటీషు వారు నేర్పించింది. వారి రాక వల్లనే మనం ఆధునికులమైనామనీ, వారు వచ్చి మనల్ని సంస్కరించే ముందు మనమంతా చీకటిలో ఉన్నామనీ వారు చెబితే విని నేర్చుకున్నది. ఇప్పటికీ బ్రౌన్ దొర గారినీ, కాటన్ దొర గారినీ మనల్ని ఉద్ధరించిన దేవుళ్ళని పూజిస్తాం తప్పితే, వారు వలస పాలనలో ఒక భాగమనీ, వారి ఉద్దేశాలను, వారి కృషిని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అని మనం సహేతుకంగా విచారించం. (“అవసరానికి మించిన కృతజ్ఞత మనిషిని బానిసగా చేస్తుంది,” అని వెల్చేరు నారాయణ రావు చెప్పింది వినిపించుకోం). విక్టోరియన్ నైతిక సూర్యోదయంతో కొత్త కళ్ళజోళ్ళు పెట్టుకున్న తెలుగు సాహిత్యకారులు, సామాజికవేత్తలు, మన సాహిత్యం అశ్లీలమనీ, మనకు చారిత్రక స్పృహ లేదనీ, మన సారస్వతం కేవలం పుక్కిటి పురాణాలనీ వారు నమ్మి మనల్ని నమ్మించారు. మన సాహితీసంపద నుంచి మనల్ని దూరం చేశారు. దీనికి మన దేశవాళీ మార్క్సిస్టులు వారి వంతు సహాయం వారు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు కూడా.

అయితే, సంజయ్ సుబ్రహ్మణ్యం (2001లో) వ్రాసినట్టుగా — ఇన్నాళ్ళకి మన మీద బ్రిటీష్ పాలన ప్రభావపు వాస్తవికతను గుర్తించి మనం, గత 3 శతాబ్దాల చరిత్రతో రాజీకి వస్తున్నాం. కానీ, ఇప్పటి వరకూ మన పతనానికి వారే కారణమని నిందించిన మనం, ఇప్పుడు ఇంకో శత్రువుని వెతుక్కుంటున్నాం. అందుకనే ఇప్పుడు మన కోపమంతా వారికంటే ముందు మధ్య యుగాలలో దండెత్తిన ముస్లిం పాలకుల మీదకు తిప్పుకున్నాం. మనకంటూ ఒక అద్భుతమైన ప్రాచీన భారతీయ సంస్కృతి ఉండేది. అది ముస్లిముల వల్ల నాశనమయింది అని ఇప్పుడు ఈ రకంగా మనల్ని మనం మభ్యపెట్టుకుంటున్నాం. ‘హిందూ ధర్మ పరిరక్షకులు’ రాజకీయ పరంగా చేస్తున్న అఘాయిత్యాలు, వక్రీకరించి రాస్తున్న చరిత్రలు ఈ అజ్ఞానానికి ఆజ్యం పోస్తున్నాయి.

ప్రస్తుతం, ఈ రకంగా రెండు వైపరీత్యపు ధోరణుల మధ్య మనదైన సాంస్కృతిక అస్తిత్వాన్ని పూర్తిగా పోగొట్టుకొని మనం ఇలా మిగిలిపోయేం. “వలసపాలన వలన మనకు జరిగిన కీడు ఆర్ధికంగా వెనుకబాటుదనం, రాజకీయ దాస్యం కాదు — మనం మన అభిరుచిని కోల్పోవడమే మనకు జరిగిన దౌర్భాగ్యం,” అని వెల్చేరు నారాయణ రావు అన్నమాట నిజంగా నిజం.

వెల్చేరు నారాయణ రావు ఏం చేశాడు?

  • మనకంటూ స్వర్ణ యుగం అనేది ఉండేదో లేదో మనకిక ఎప్పుడూ తెలియదు. వేల సంవత్సరాల భారతీయ సంస్కృతి మనది అని గొప్పలు చెప్పుకోడానికి బాగున్నా, మన సంస్కృతి గురించి మనం తెలుసుకోగలిగినది గత ఐదు లేదా ఆరు శతాబ్దాల దాకానే. అంతకు ముందు చరిత్ర అని మనం అనుకుంటున్నది కేవలం మన ఊహాసృష్టి. ఆ ఎండమావి కోసం పరుగెత్తవద్దని చెప్తున్నాడు. (జరుగుతున్న నష్టం కళ్ళముందు కనిపిస్తూనే ఉంది కదా.)
  • ఆధునికత 19వ శతాబ్దంలో బ్రిటీష్ పాలకులు మనకు ఇచ్చిన వరం కాదు. ఆధునికతా చైతన్యం మనకు ఇంకా ఎంతో ముందే వచ్చింది. నారాయణ రావు, తన సహ పరిశోధకులతో కలిసి, ‘ఆధునికత’కి నిర్దిష్టమైన లక్షణాలు ప్రతిపాదించాడు. శ్రీనాథుడు, అన్నమయ్య, పింగళి సూరన, క్షేత్రయ్య, గురజాడ, చాసోల రచనలలో ఈ ఆధునికత పరిణామ క్రమాన్ని వెలికితీసి మనందరికీ చూపించాడు. కులమతవర్గాంతరాలు దాటి ఆ ఆధునిక చైతన్యం సమాజం అంతటా ఎలా ప్రసరించిందో వివరించాడు.
  • మనది ప్రధానంగా మౌఖిక సాహిత్యం. 16వ శతాబ్దం నుంచీ కరణాల ద్వారానూ, పర్షియన్ పాలన ప్రభావం వల్లనూ రాతకు ప్రాముఖ్యం పెరిగింది. రచన-రచయిత గురించి పాశ్చాత్యులకు ఉన్న బలమైన అభిప్రాయాలు, సమాజం సమిష్టిగా వ్రాసుకున్న మన సాహిత్యాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాట్లకు దారి తీశాయి. పాశ్చాత్య సాహిత్య విమర్శా పద్ధతులు భారతీయ సాహిత్యానికి నప్పవు. అందువల్ల భారతీయ సాహిత్యాన్ని విశ్లేషించడానికి మనకంటూ పనిముట్లు మన సాహిత్యం లోనుంచే తయారు చేసుకోవాలి. అవి అంతర్గతంగా మన సంస్కృతిలోనే ఉన్నాయి. మన సాహిత్య సంప్రదాయాన్ని అర్థం చేసుకోకుండా, గుడ్డిగా పాశ్చాత్య పద్ధతులను అనుసరిస్తే, సమాధానాలు దొరకక పోగా సమస్యలు ఎదురౌతాయని, సోదాహరణంగా వివరించాడు.
  • భారతీయులకు, ప్రత్యేకించి దక్షిణ భారతీయులకు చారిత్రక స్పృహ లేదు అని శతాబ్దాలుగా అందరూ అభిప్రాయపడడానికి కారణం, భారతదేశం తన చరిత్రను సాహిత్యంలో ఎలా రాసుకున్నదో తెలుసుకోలేక పోవడమే. పాశ్చాత్య సంస్కృతిలో లాగా మన సాహిత్యం వర్గీకరించబడలేదు. పురాణేతిహాసాలలో కూడా చారిత్రక సమాచారం ఉంది. దాని శైలీలక్షణం కావ్య కల్పనా లక్షణాలకు విరుద్ధమైనది. ఒక రచన మనకు ఏం చెప్తున్నదో శ్రద్ధగా ‘వినడం’ వల్లనే ఈ తేడా గుర్తించడం సాధ్యమౌతుంది. అందుకు ముందు ముఖ్యంగా మనం మరిచిపోయిన మన సాహితీ సంప్రదాయాన్ని పునరుద్ధరించుకోవాలి. అంటే, మన సాహిత్యాన్ని ఎలా చదవాలో ఎప్పుడో మర్చిపోయిన మనం, మళ్ళీ ఎలా చదవడం నేర్చుకోవచ్చో ఓపికగా వివరించాడు.
  • తన అనువాదాలు, వ్యాఖ్యానాల ద్వారా భారతీయ సాహిత్యాన్ని ఎలా చదవాలో ప్రపంచానికి తెలియచెప్పాడు. సిద్ధాంతాల చట్రాలతో సాహిత్యానికి లేని ఆదర్శాలను అంటగట్టడాన్ని గుర్తించి, ఎలా ఆ భ్రమ నుంచి బైటికి రావాలో, మన సాహిత్యాన్ని, మన సంస్కృతిని, మన సమాజ చైతన్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో వారికే కాదు, మనకూ ఎంత అవసరమో ఇంకా ఎన్నో రకాలుగా, నిర్విరామంగా చెప్తూనే ఉన్నాడు. ఓపికున్నంత వరకూ చెప్తూనే ఉంటాడు.

ఈ సంచికలో నారాయణ రావు సాహిత్య కృషిని వీలైనంత సమగ్రంగా, సంగ్రహంగా తెలుగులో ఒక్క చోట పరిచయం చేయడం మా లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకు గాను ఆయన రచనల గురించి వివరాలు, సమీక్షలు పొందుపరిచాం. నారాయణ రావును వ్యక్తిగా కూడా తెలుసుకునేందుకు వీలుగా ఆయన స్నేహితులు వ్రాసిన పరిచయాలు సేకరించాం. ఆయన వ్రాసిన పుస్తకాలలో ముఖ్యభాగమైన వ్యాఖ్యానాలు కొన్నింటికి తెలుగులో అనువాదాలు చేశాం. ఇక్కడ అనువాదాల గురించి ఒక చిన్న వివరణ అవసరం కావచ్చును.

ఈమాట పాఠకులు ఇంచుమించుగా అందరూ తెలుగు ఇంగ్లీషు — రెండు భాషలలోనూ ప్రవేశం ఉన్నవారే. మరి ఎవరి కోసం ఈ అనువాదాలు?

అనువాదం ఏ భాష నుండైనా ఇంకో భాషకు ఎందుకు చేస్తారు? ఆ భాష మాట్లాడే వారికి ఆ రచనను మరింత దగ్గరగా తేవడానికే కదా. వెల్చేరు నారాయణ రావు తన పరిశోధనలన్నీ ఇంగ్లీషులో ప్రచురించాడు. అవి తెలుగు రాని వారికి, పాశ్చాత్యులకు, ప్రత్యేకించి శాస్త్రపరిశోధకుల కోసంగా వ్రాయబడినవి. వాటిని వీలైనంత సరళంగా తెలుగులోకి అనువదించడం ద్వారా నారాయణ రావు ఆలోచనలను తెలుగు పాఠకులకి చేరువ చెయ్యడం, తద్వారా పరిశోధకులకే పరిమితమైన విషయాలను మనలాంటి పదిమందికీ అందించడం ఒక కారణం. ఈ సంచిక తయారీలో, ఎన్నో సార్లు నారాయణ రావు ఆంగ్లానువాదం చదువుతూ, తెలుగు మూల పాఠాన్ని వెతికి పట్టుకొని మరింత లోతుగా అర్థం చేసుకోడానికి ప్రయత్నించడం, మాకు స్వానుభవమైన విషయం. అదే విధంగా, మేము సరళతరం చేసి అందించిన అనువాదాల ద్వారా పాఠకులలో ఉత్సుకత పుట్టి, వెల్చేరు మూల గ్రంథాలను మరింత లోతుగా చదవడానికి తోడ్పడవచ్చునేమో అనే భావన మరో కారణం. పదిసార్లు చదివేకంటే ఒకసారి రాస్తే బాగా గుర్తుంటుంది అని చదువుకునేటప్పుడు అమ్మా నాన్నా చెప్పడం మీకు గుర్తుంది కదా. అలాగే, ఒక వ్యాసాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలంటే అనువాదం చేయాలి అని మాకిప్పుడు తెలిసింది. నారాయణ రావు వ్రాసిన పుస్తకాలు అందుబాటులో లేనివారికి, కాపీరైట్ వల్ల పుస్తకం నుంచి పూర్తి వ్యాసాలు ప్రచురించడానికి అనుమతి లేకపోవడం అనేది ఇందుకోసం మేము పెట్టుకున్న ఒక సాకు, నిజంగా.


ఇద్రిస్ షా రాసిన ముష్కిల్ గూషా అనే పర్షియన్ కథ ఒకటుంది. కట్టెలు కొట్టుకుని బ్రతికే ఒక బీదవాడు, వాడి చిన్నారి కూతురు ఉంటారు. ఒకరోజు ఆ అమ్మాయి, నాన్నా, నాకు ఖర్జూరం మిఠాయి తినాలనుంది అని అడుగుతుంది. అందుకోసం వాడు అడవిలో మరింత లోపలికి పోయి మరిన్ని కట్టెలు కొట్టుకొని తిరిగి వచ్చేసరికి చీకటి పడింది. ఆ అమ్మాయి తన కోరిక పూర్తిగా మర్చిపోయి తలుగు గడి వేసుకొని హాయిగా నిద్రపోతుంటుంది. వాడు తలుపు ఎంత తట్టినా నిద్ర లేవదు. ఇంటి బైటే పడుకొని, మరిన్ని కట్టెలు తెస్తే మరిన్ని మిఠాయిలు కొనచ్చు గదా అని ఆ రోజూ అడవి లోపలికి వెళ్ళి ఇంకా ఎక్కువ కట్టెలు పట్టుకొస్తాడు. కానీ ఆ అమ్మాయి వాళ్ళ నాన్న బజారులో ఉన్నాడేమో అని ఇంటికి తాళం వేసుకుని బైటికి వెళుతుంది. … (పర్షియన్ సాంప్రదాయక సమాజం రాసుకున్న కథ ఇది. అందుకే ఏ ఇద్దరు చెప్పుకునే కథ ఒకటిగా ఉండదు. నిజం కదా, అందుకే ఎన్నో రూపాలలో ఉంటుంది, నారాయణ రావు చెప్పినట్టుగా.)

రాజకీయాలలో ఒక పద్ధతి ఉంది. మనకు వ్యతిరేకంగా మాట్లాడేవాడికి ఏదో ఒక ‘వాది’ అని ముద్ర ఒకటి అంటిస్తే దానితో సరి. నారాయణరావుకి ‘సాహిత్య అనువాదకుడు’ అని ఒక ముద్ర తగిలించి, ఆయన చేసిన అనువాదాల్లో రంధ్రాన్వేషణ చెయ్యడం మన విమర్శకులకి పరిపాటైపోయింది (ఇదొక్కటే కాదు ఆయనకి ఉన్న ముద్ర!). నిజానికి నారాయణరావు ‘తెలుగు పండితుడి’ పరిధిని దాటి, పరిశోధకుడుగా, చరిత్రకారుడిగా, సాహిత్య మీమాంసకుడిగా, సాహిత్య సంప్రదాయ వ్యాఖ్యాతగా గత నలభై ఏళ్ళుగా చేసిన కృషి చాలా విస్తృతమైనది. తెలుగులో కవిత్వ విప్లవాల స్వరూపాల నాటినుండి, చాసో కథల దాకా ఎన్నో పుస్తకాలు, అధ్యయనాలు, పరిశోధనా పత్రాలు ఆయన ప్రచురించాడు. వాటన్నిటినీ కూలంకషంగా చదివితే, నారాయణరావు పరిశోధనల నేపథ్యం, వాటిలో అంతఃసూత్రంగా ఉన్న అంతిమ లక్ష్యం తెలుసుకోవడం అంత కష్టమేమీ కాదు.


ఆ అమ్మాయి ఎవరో, ఈ సందర్భంలో ఆ కట్టెలు కొట్టి కష్టపడుతున్నదెవరో మీకు అర్థమయే ఉండాలి. ఆయన మన మీద కోపంతో బైటికి వెళ్ళిపోలేదు. కుత్సితమైన రాజకీయాలు, సిద్ధాంతాల చట్రాలలో బిగుసుకుని పోయిన సంకుచిత స్వభావాలు — కారణాలు ఏమైతేనేం, మనం నారాయణ రావుని ఇంట్లోకి రానియ్యటం లేదు. ఆయన ఇంటికి రావాలనే ఆశిస్తున్నాడు. తలుపు తడుతూనే ఉన్నాడు. మన తెలుగువాళ్ళ గొప్పతనం ఇంకెవరూ గుర్తించటం లేదని బోలెడంత బాధ పడిపోయే మనం, మన సాటి తెలుగు వాడైన నారాయణ రావుని ఇలా విస్మరించడంలో హేతువు ఏమాత్రమూ లేదు.

ఇప్పటికీ మించిపోయింది లేదు. నారాయణరావుని మళ్ళీ మనం ఇంట్లోకి సగౌరవంగా, ఆదరాభిమానాలతో తెచ్చుకుందాం. మా ఈ చిన్న ప్రయత్నం అందుకోసమే.