ఏకైక కథాయానా – మెడికో శ్యామ్ కథలు

చాలా కథలు చదివాక, కథకు కావల్సిన లక్షణాలు ఏవిటి, ఎన్ని? అన్న అనుమానం వస్తే చాలామందిని ప్రశ్నించాను. ప్రశ్నలో ఉన్న ‘లక్ష’ణాల్లోనే జవాబు ఉందన్నాడొకాయన. వస్తువే ముఖ్యం అన్నారు కొందరు; కాదు, కథనం అన్నారు మరికొందరు; ఉహూ, శిల్పం అన్నారు ఇంకొందరు; ఇవేం కాదు – నేపథ్యం ఉండాలన్నారు ఇంకా కొందరు. ఒకాయన మాత్రం, “ఇవేమీ కాదు. కథకి కావాల్సింది నిజాయితీ కల గొంతు – అది పలికే భాష. ఇవుంటే చాలు చెప్పేదేదయినా కథే! భాష లేని కథ – ఉప్పులేని వంటకం” అని బల్లగుద్ది మరీ చెప్పాడు. నిజమే అనిపించింది.


శ్యామ్‌యానా (2010)
వంగూరి ప్రచురణ

చాలాకాలం క్రితం అనుకోకుండా ఓ మిత్రుడొక పుస్తకం నజరానా ఇస్తే, అది కాస్తా పుస్తకాల సొరుగుకి అంకితం ఇచ్చేశాను. చాన్నాళ్ళకి నా దృష్టి దాని మీద పడి చదివాను. ఇంకోసారి చదివాను. ఇలా చదువుతూనే ఉన్నాను. అంతగా ఆకట్టుకొన్న అంశాలు రచయిత ప్రత్యేక శైలీ, భాషా. ఇంతగా మాయ చేసిన ఆ పుస్తకం పేరు శ్యామ్‌యానా. హిందీలో యాన్ అంటే ప్రయాణం. ఆ తీరులోనే శ్యామ్‌యానా అనే పేరు పెట్టారనుకుంటాను. కావాలనే పేరు పెట్టారో, లేక సరదాకి పెట్టారో తెలీదు. నిజంగా ఈ పుస్తక పఠనం ఒక ప్రత్యేకమైన కథాయానా.

రాసింది మెడికో శ్యామ్. వంగూరి ఫౌండేషన్, అమెరికా వారి ప్రచురణ. ఈ మధ్య కాలంలో ఎక్కడా ఈ రచయిత పేరెప్పుడూ కనిపించలేదు. వినిపించలేదు. బహుశా కొత్త రచయితల్ని ప్రోత్సహిద్దామని వంగూరి ఫౌండేషన్ వారు ప్రచురించారనుకొన్నాను మొదట్లో! తీరా చూస్తే ఈ కథలు 1970-80 మధ్య కాలంలో రాసినవి. ఈ కథలన్నీ డాక్టర్ చిర్రావూరి శ్యామ్ అనే ఆయన తాను మెడిసన్ చదివే రోజుల్లో రాసిన కథలూ, గల్పికలూ, లేఖినీ చిత్రాలూ. గత ముప్పయ్యేళ్ళగా ఆయన ఒక్క రచనా చెయ్యలేదు. రాసినవన్నీ పాతికేళ్ళ లోపులో రాసినవే అవడం వల్ల, ఆ వయసులో వుండే వడి, వాడీ, వేడీ అన్నీ ప్రతీ రచనలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

చుట్టూ వున్న మనుషుల పట్ల, జీవితం పట్ల ధృఢమైన నమ్మకమూ, ఎంతో అవగాహనతో రాసిన ఈ కథలు చదువుతూంటే ఈ కథలు ఏ ఏభయ్యోపడిలోనో రచయిత రాసుంటాడనిపిస్తుంది. కానీ ఇవన్నీ పద్దెనిమిదీ, ఇరవై అయిదేళ్ళ వయసులో రాసిన కథలు అంటే నమ్మశక్యం కాదు. అప్పట్లో ఈ కథలన్నీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ, నండూరి, చాసో, పతంజలి వంటి ప్రముఖ రచయితల మెప్పు పొందాయి. డాక్టర్ డిగ్రీ వచ్చాక ఎందుకో శ్యామ్ రచనా వ్యాసంగం ఆగిపోయింది. అందుకే నేటి తరం కథకులకి అంతగా పరిచయం లేరు. పాతికేళ్ళ లోపునే ఇంత మంచి రచనలు చెయ్యడం మెచ్చుకోతగ్గది. సింప్లీ బ్రిలియంట్!

“అసలు కథలు రాయడం ఎలా?” అన్న ప్రశ్నకి “ఎలా బడితే అలా!” అనే శ్యామ్ పుస్తకం మొదట్లో తన మాటలో చెప్పారు. కవిత్వానికీ, వచన రచనకీ, కథకీ, కమామీషుకీ, కథన కుతూహలానికీ గల తేడాలు తాను అంతగా పాటించలేదనే ఏ భేషజం లేకుండానే చెప్పారు. తగ్గట్టుగానే ఈ పుస్తకం ఓ కలగూరగంప. ఈ పుస్తకంలో మొత్తం 27 రచనలున్నాయి. కథలున్నాయి. కాదనుకునే వారికి కథానికలున్నాయి. లేఖినీ చిత్రాలున్నాయి (పెన్ ఫొటోగ్రాఫ్). గల్పికలున్నాయి. ‘కలం’కారీ అనుభవాలున్నాయి. వ్యాస కథానికలున్నాయి. కథా నిర్మాణ ప్రక్రియకి లోబడకున్నా ఇందులో చాలా వున్నాయంటూ, “ఇవి కథలు కావని కొందరి అభిప్రాయం. కావచ్చును,” అని ఏ దాపరికం లేకుండా ఒప్పేసుకుంటారు. దీనికి కొనసాగింపుగా – “అన్ని రచనలూ చివరకి ఏమైందని చదవమేమో! కొన్ని ఏమిటి రాసారని చదివితే, కొన్ని ఎలా రాసారోనని చదువుతామేమో!” అంటారు. ఈ పుస్తకంలో కనిపించేవి సరిగ్గా ఇవే!

కాకపోతే ఈ పుస్తకంలో కథలూ లేకపోలేదు. మంచి కథలున్నాయి. అన్నిటికన్నా చదివించే గుణం ఎక్కువగా కనిపిస్తుంది. భాషా చమక్కులూ, పదాల తళుక్కులూ చాలా కనిపిస్తాయి. ఒక్కోసారి వీటి మాయలో పడి అసలు కథని మర్చిపోతాం. కథ ముగింపొచ్చేస్తుంది. ఏవయ్యిందనీ మళ్ళా చదువుతాం. ఇవీ ఈ పుస్తకంలో స్పష్టంగా కనిపించే విశేషాలు.

కథల వరకూ వస్తే, ముక్కుపుడక, వారిజాక్షులందు, సన్నాయి పాట, ఐసీసీయూ, వెన్నెల సోన, కాఫీ, గ్రీటింగ్ కార్డ్ -మంచి కథలు. కథ పేరుతో ఉన్న నత్తి వాడి కథ, కథకుడి కథ, సాహిత్యం కథ, హంతకుడి కథ, డామిట్ కథ, ఇదీ మా కథ – వాటిల్లో ‘ఇదీ మా కథ’ ఒక్కటే కథ గా చెప్పుకోవచ్చు. మిగతావి అటూ ఇటూ కాని కథా వ్యాసాలు. లేదా వ్యాస కథనాలు. ఇవి కాక ఎలెక్టడ్ థాట్స్, ఆలోచన్ల ట్రెయినులో’ వంటి లేఖినీ చిత్రాలున్నాయి. డామిట్ కథ, తేడా వంటి గల్పికలూ చోటుచేసుకున్నాయి. మెడికో శ్యాం కథలు అన్న శీర్షిక చూసే సరికి పాఠకులకి కథల పుస్తకం అని ఒక అభిప్రాయానికొచ్చే అవకాశముంది. తీరా కొన్ని గల్పికల వంటివి చదివాక వీటిని కథల బుట్టలోకి వేయలేని సంకోచం కలగవచ్చు. కానీ పుస్తకం చేతికొస్తే అన్నీ ఒదిలి పెట్టకుండా చదువుతాం. ఆస్వాదిస్తాం. దీనికి కారణం – రచయిత పదాల గారడీ, మాటల మాయాజాలం.

ఉదాహరణకి – “గౌరవం ఇమ్మన కూడదు. గాని ఇవ్వనప్పుడు ఇవ్వబడదు కూడా (సరాగమాల); వగలు కురవడానికి వీలుపడని పగలు (ఐసీసీయూ); ఎందరో వక్తలు మాట్లాడారు. వక్త్ కాల్చేసారు (సాహిత్యం కథ); కుంచమే పరనిందా, మెండుగా ఆత్మస్తుతీ ఉన్నాయనీ… (కవిగారి కళత్రం); ఈ నిజం ప్రిజన్లో పెట్టినా, ప్రిజమ్లో పెట్టినా వుండదూ…? (ఆలోచనల ట్రెయిన్లో); బీరువా ఉంచడానికి ఇల్లో అని అల్లో నారాయణా అని ఏడ్వాలి మనం (చదవడమా? మానడమా?); ప్రతీ వాడూ ఒకటో అరో కవితల సంపుటిని వేసి పాతికో మరిన్నో ఇళ్ళనీ, వాకిళ్ళనీ కాలిచిన వారే – మంటల్తో, కేకల్తో, ఆకల్తో (సాహిత్యం కథ); వంటి చమక్కులు కోకొల్లలు ఈ కథల్లో. శ్యామ్‌కి భాషని ఎక్కడ, ఎంత, ఎలా, వాడాలో తెలుసు. మొత్తం రచనల్లో అనవసర వాక్య పటాటోపం కనిపించదు. సూటిగా, సున్నితంగానే చెబుతాడు. కథా విమర్శకులు “కథకి క్లుప్తతే ప్రాణం” అంటారు కదా? అది దాదాపు అన్ని కథల్లోనూ కనిపిస్తుంది.

నిజానికి ఇదొక సాహిత్య ‘షామియానా’. పసందైన రిసెప్షన్ బఫే! ఎవరిక్కావల్సింది వారు ఆస్వాదించవచ్చు. వద్దనుకున్నవి వదిలేయచ్చు. కథా ప్రక్రియకి భిన్నంగా ఈ కథలుండడం వల్ల ఇవి కథలు కావనిపించే అవకాశమూ ఉంది. కేవలం వైద్య రంగంలో వైద్యులకే సొంతమయిన కొన్ని అనుభవాలు వేరే కోణంలో కథలుగా చెప్పారు.

ఈ కథా సంకలనంలో ఐసీసీయూ చాలా మంచి కథ. కేవలం వైద్య వృత్తిలో ఉన్న రచయితలే రాయగల కథ. ఈ కథలో ప్రథాన పాత్ర ఐసీసీయూ గదిలో గోడ గడియారం. ఇదే గంట వాయిస్తున్నట్లుగా మనకి కథ చెబుతుంది. మూడు బెడ్స్ మీదున్న పేషంట్లకీ, అక్కడ డ్యూటీ చేసే మెడికల్ కన్సల్టెంట్లకీ మధ్య జరిగే సంఘటనలే ఈ కథ. ఐసీసీయూ అంటే ప్రాణం కొడిగట్టించే ఆఖరి గదులే కాదు, మనిషికి ప్రాణం పొసి జీవితాన్ని కూడా ఇవ్వగలవు. రోగం కన్న రోగం వుందన్న అపోహ మనిషిని సగం చంపేస్తుంది, అని చెప్పే కథ. ఈ కథ మొత్తం గోడ గడియారం వైపునుంచే సాగినా, చివరికొచ్చేసరికి అక్కడున్న కన్సల్టెంటు మనస్సులో ఆలోచనలూ, విషయాలూ కూడా చెప్పేయడంతో కథా ప్రక్రియకి భంగం కలిగిందనిపించింది. గోడ గడియారం ముందు జరగని విషయాలు ఉటంకించడం తప్పుగా అనిపించింది. కానీ కథనంలో ఇవేమీ స్పృహకి రావు. ప్రత్యేకంగా తరిచి చూస్తే తప్ప.

ఏదైనా జబ్బు చేస్తే అది తగ్గకపోతే ముందు డాక్టర్నే నిందిస్తాం. పేషంట్లు తాము చేసే తప్పుల్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంటారా? ఈ కథాంశంతో కేవలం డాక్టర్లే చూడగల రాయగల కథ ‘కాఫీ’. ఇలాంటిదే మరో కథ, ముక్కు పుడక మంచి కథల కోవలోకి వస్తుంది.

ఒక స్త్రీని ఆకర్షించడానికి చురుకుదనమూ, వాగ్ధాటీ, తెలివితేటలూ కావు; ప్రేమగా గౌరవించగల మనస్తత్వం అన్నది ‘వారిజాక్షులందు’లో అంతర్లీన కథనం. ఈ కథలో గోపాల్రావూ, ముకుందరావులకి పాప అనే అమ్మాయి ట్రెయిన్లో పరిచయం అవుతుంది. ప్రయాణం మొత్తం గోపాల్రావే ఆమెతో సంభాషించినా ముకుందరావు ఒక్క మాటా మాట్లాడడు. “గోపాల్రావుకి తెలిసున్నదింతైనా అంతున్నట్లుగా మాట్లాడ గలడు. తప్పు చెప్పినా తప్పుకునేట్లుగా చెబుతాడు…” అని ఆ పాత్ర తీరుతెన్నులు చూపిస్తాడు రచయిత. చివర్లో ఊహించని ముగింపు మనల్ని ఆశ్చర్యపరుస్తుంది.


శ్యామ్‌యానా, రూ.150/-
వంగూరి ప్రచురణ, 2010.

డెబ్భై, ఎనభై కాలాల్లో మధ్య తరగతి కుటుంబాల్లో ఉన్న మనుష్యుల కథ ‘ఇదీ మా కథ’. చాలీ చాలని జీతంతో జీవితాన్ని నెట్టుకొస్తున్న నాన్న, నిస్సహాయత, ఏవీ చేయలేక ఉక్రోషం దిగమింగుకునే అమ్మ, అమ్మాయిలకి లైనెయ్యడమే జీవిత ధ్యేయమనుకునే అన్న, సినిమా హీరోలే ఆదర్శంగా ఎదిగే తమ్ముడు, “వస్తాడు నారాజు ఈరోజు” అంటూ వీధి గుమ్మానికి కళ్ళనీ, వయసునూ కట్టేసే అక్క, “రాజా అందించు నీ లేత పెదవి” అంటూ పాడుకునే పదహారేళ్ళ చెల్లెలు, ఇంకా ఆఖరిదీ, ఆఖరివాడుల పసితనపు గోల, ఇవన్నీ కలబోసిన ఆ కుటుంబం గురించి చెబుతూ – “మా చుట్టు పక్కల అంతా బురద. బురదలోంచే పుట్టాం. అసహ్యకరమైన, అసభ్యకరమైన బురదే మాజీవితం.పంకజంలా మాలో అక్కడా, ఇక్కడా… ఒకటీ, అరా.” అంటూ ముగిస్తారీ కథని. ఈ కథలో ప్రతీ పాత్రా తమ గురించి చెప్పుకుంటాయి. ఇదే ఈ కథకి ఆయువు పట్టు. అలా చెబుతూనే కథని నడిపిస్తాయి. కాకపోతే ఈ పాత్రలన్నీ తమ వయసుకు మించిన ఆలోచనా ధోరణితో చెప్పడం చూస్తే కథకుడే వారి తరపున మాట్లాడేయడం కనిపిస్తుందీ కథలో.

“జీవితంలో మలుపులు అచ్చు కథల్లో లానే ఉంటాయి,” అనే సరాగమాల కథ చివర్లో “జీవితం తప్పొప్పుల సరాగమాల. తప్పులూ, ఒప్పులూ కూడా రాగయుక్తంగానే వాయించబడతాయి. ఒకప్పుడు శ్రు(గ)తి తప్పిన వాద్యగాడు కూడా సరాగాలే చిలికించడం విచిత్రమైన వరం వాద్యగాడి జీవితానికి” అంటూ ముగిస్తారు. లెప్రసీ వ్యాధి వస్తువుగా చెప్పిన ‘వెన్నెల సోన’, కట్నం పైకి వద్దంటూ పరోక్షంగా తీసుకునే, ఇచ్చే వాళ్ళ గురించి చెప్పే ‘డౌరీ హౌ మచ్?’ కథలు మరింత పట్టుగా చెప్పిన కథలు.

ఆత్మ విమర్శ చేసుకుంటూ, తనని తాను ఉత్తరంలో ఆవిష్కరించుకోవడానికి ధర్మారావు చేసిన ప్రయత్నమే ‘విప్పని హృదయం’. ఈ కథలో చెప్పిన విషయాలు మనసుకి హత్తుకుంటాయి. ఉదాహరణకి – “బస్టాండులో టూరిస్టు బస్లో ఒకడు విజయనగర వైభవాలూ, ఆంధ్ర ప్రశస్తీ చాలా గొప్పగా చదువుతాడు. కళ్ళమ్మట నీళ్ళొస్తాయి. కానీ జేబులోంచి -?”, “ఫెయిలయిన ప్రతీ మగాడూ మళ్ళీ ఆ ఆడదాని మొహం చూడక, ముఖం చెల్లక ఇష్టంవచ్చినట్లు దాన్ని అందరి దగ్గరా తిట్టి, తన్ని తనలో తిట్టుకొని…చీ! ఎంత వెనుకబడినతనం?”, “పుస్తకంలో మేటర్ పెరిగినా బరువూ పెరగదు. భారం పెరగదు. కానీ హృదయాలదో – ?” అంటూ ఎన్నో ప్రశ్నలు సంధిస్తాడు శ్యామ్, ధర్మారావు పాత్ర ద్వారా.

ఈ కథలన్నింటినీ పట్టుగా చదివించేది శ్యామ్ రచనా శైలీ, వాక్య పటిమా. చెప్పే విధానంలోనే వెరైటీ కనిపిస్తుంది. ఉదాహరణకి – లీవిట్ అనే కథలో – “పొయిట్రీ! దేని మీద? ఠకీమని సమాధానం “కాగితం మీద!” మళ్ళీ ఠకీ. ఇటువంటి వాక్య నిర్మాణం ప్రతీ కథలో కొట్టచ్చినట్లుగా కనిపిస్తుంది. కొన్ని చోట్ల రాసిన వాక్యాలు ఎప్పటికీ గుర్తుంటాయి; “వస్తువు అసహ్యకరంగా వుంటే విసిరెయ్యగలం. జీవితం అసహ్యకరంగా ఉంటే విసిరెయ్యలేం. విడిచెయ్యలేం”; “ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్!”; “కళ అనేది ముసుగు. ధనాశ ఒరిజినల్. కళాసేవ మేకప్. బిజినెస్ న్యూడ్ పిక్చర్” వంటి పదునైన జీవిత సత్యాలు.

కేవలం కథలమీదే కాదు, జీవితమ్మీదా, మనుషులపైనా శ్యామ్‌కు ప్రత్యేకమయిన అభిమానమూ, ఆక్రోశమూ వున్నాయి. ముఖ్యంగా జీవితంపై పరావర్తనం చెందే సాహిత్యమ్మీద. “పక్కవాడి పేపర్రాసిన కుర్రాడికీ రచయితకీ తేడా ఏమైనా వుందా?” కాపీ అన్న పదం వాడకుండా రచయితల మీద బాణం సంధిస్తారు. “ఒక్క విషయం గుర్తుంచుకో! గొప్పగా రాసానన్నవాణ్ణెవణ్ణీ నమ్మకు!” వంటి అచ్చుతునకలు చాలా కనిపిస్తాయి. ఇటువంటివే మరికొన్ని:

“పెంచుకో విజ్ఞానం. ఎదుగు మనిషిగా… న్యాయంగా… సత్యంగా… సభ్యంగా… నిస్స్వార్థంగా… గా… గా… గా! ప్రతీ ఒక “గా” నిన్ను దెబ్బతీస్తుంది.”; “కొందరు ముందు సంపాదిస్తారు. కొందరు వెనుక. కొందరు ఎక్కువ సంపాదిస్తే కొందరు తక్కువ. కొందరు న్యాయంగా, కొందరు అన్యాయంగా. ఏది కావల్సి వస్తే దాన్ని ఎన్నుకో. దేని సుఖాలు దానివి. దేని కష్టాలు దానివి.” ; “అమిత వేదన విడుదల చేసే కన్నీటి బొట్ల కాన్సంట్రేషన్ కనుక్కున్నాడా, ఏ సైంటిస్టయినా?”; “రోగంలో అసామాన్యుడు కూడా అతి సామాన్యుడు.”; “అన్నట్టు ఆవిడ అతన్ని ఓ “ల”కారం ఎత్తుంటుంది.”

ఈ పుస్తకంలో టెక్నిక్ పరంగా అమితంగా ఆకట్టుకున్న అంశం ‘పెన్ ఫొటోగ్రాఫ్’ కథలు. అప్పట్లో, అంటే 70-80ల కాలంలో, ఇవి సరికొత్త ప్రయోగాల క్రిందే లెక్క. వీటిని తెలుగు కథా సాహిత్యంలో కథలుగా ఒప్పుకోపోవచ్చు కానీ, ఇటువంటి ప్రక్రియలకి వెస్ట్రన్ కథా సాహిత్యంలో పెద్ద పీటే వేస్తారు. ఎలెక్టెడ్ థాట్స్, ఆలోచన్ల ట్రెయిన్లో వంటివి ఈ లేఖినీ చిత్రాలు.

శ్యామ్ కథనా శైలి మరెక్కడా చూడం. అదొక ఏకైక రచనా శైలి. ఏ శైలి అయితే ఆయన కథలకి శక్తిగా, ప్రయోజనకారిగా మారాయో అవే ఆయన కథలకి బలహీనతా, లోపాలయి కూర్చున్నాయి. ఆ శైలికీ, ప్రాసలకీ, వాక్యాలకీ అబ్బురపడి అసలు కథ ఏవిటో మర్చిపోతాం. కథ చివరికొచ్చేస్తుంది. మళ్ళీ చదువుతాం. ఇది కేవలం పొగడ్త కోసం రాస్తున్నది కాదు. ఇది నా పఠనానుభవం. కొన్ని కథల్లో అయితే కథలో పాత్రలకీ, పాఠకులకీ మధ్య ప్రొటాగనిస్ట్ పాత్రలో కథకుడు వచ్చేస్తాడు. వద్దనుకున్నా శ్యామ్ పీటేసుకు మరీ కనిపిస్తాడు. అందువల్ల కొన్నింటిని కథలు అనడానికి మనసొప్పదు. ఇంకొన్ని కథల్లో అయితే ఉత్తమ పురుషలో (నేను) మొదలవుతాయి. మధ్యలో ప్రథమ పురుషలోకి మారి, చివర్లో ఉత్తమ పురుషకి వచ్చేస్తాయి. ఉదాహరణకి – వెన్నెలసోన కథలో, “ఒక సీట్లో కూలబడ్డాడు.” అని మొదలయ్యి, “అటూ ఇటూ చూశాను.” అని మధ్యలో వస్తుంది. ఇటువంటివి రెండు మూడు కథల్లో కనిపించాయి. కథ చెప్పే తొందర్లో ఇటువంటి చిన్న విషయాలు పట్టించుకో లేదనిపిస్తుంది. కనీసం ఇలాంటి లోపాలని పరిష్కరించి ఈ పుస్తకం ప్రచురించి వుండాల్సింది.

ఈ పుస్తకానికి మూడు ముందుమాటలు. చాగంటి తులసి ముందుమాట ఏం చెబుతున్నారో సామాన్య పాఠకుడికి ఓ పట్టాన అర్థం కాదు. వృత్తాలూ, చాపాలూ, వర్తులం అంటూ మొదటి పేజీ నిండా చాలా గణితమే చెప్పారు. మునిపల్లె రాజుగారి ముందు మాటలో ఇంతవరకూ తెలుగుసాహిత్యంలో వున్న డాక్టర్ రచయితల గురించీ ఆయన అభిప్రాయాలూ, పరిచయాలూ యధాశక్తి పేజీన్నర పైగా విపులంగా చెప్పారు. ఇద్దరివీ పోల్చి చూస్తే రాజు గారిదే కాస్త నయం అనిపించింది. ఇంకా రాచకొండ శాయి “చిన్నమాట” కూడా వుంది.

అలాగే ఈ అచ్చ తెలుగు పుస్తకంలో ఒక అచ్చ ఇంగ్లీషు ముందుమాట చూస్తే ఇబ్బందికరంగా వుంది. ఈ మధ్య చాలా కథా సంకలనాల్లో చూస్తున్నాను. మా మాటలూ, ఆప్త వాక్యాలూ అంటూ రాసే ముందుమాటకారులు తమ విజ్ఞానాన్నీ, రచయితపై ఉండే అభిమానాన్నీ ఒలక బోస్తున్నారు తప్ప కథా పరామర్శ చెయ్యడం కనిపించడం లేదు. ముందు మాటలు ఆ పుస్తకంలో వున్న కథల గురించి ఉంటే బాగుంటుంది కదా! ముందుమాటలు రాసిన వారి నుండి నాలుగైదు మంచివి పీకి మరలా పుస్తకం వెనుక తగలించారు. వెనుక మాట (బ్లర్బ్) రాయడానికి వేరెవరూ దొరకలేదా? కథల్లో పునరుక్తి దోషాలుంటే ఎత్తి చూపుతాం. పునరుక్తి ముందుమాటలు దోషాల క్రిందకి లెక్కకు రావా? ప్రచురణకర్తల నిర్లక్ష్యం ఇక్కడ కనిపిస్తుంది.

అలాగే కథలు వేసిన వరుస క్రమం కూడా బాగో లేదు. పెన్ ఫోటో గ్రాఫ్ వంటివీ, గల్పికలూ చివర్లో వేస్తే బావుండేది. ఇవన్నీ మొదటే వెయ్యడం వల్ల, మొత్తం కథలన్నీ ఇలానే ఉంటాయన్న భావన పాఠకులకి కలిగే ప్రమాదముంది. ఈ పుస్తకంలో అచ్చుతప్పులు అంతగా లేవు. ఇది మెచ్చుకోదగ్గ విషయం. ఇవన్నీ ఎలా వున్నా, పాఠకులు తప్పక చదవాల్సిన పుస్తకం. ముఖ్యంగా కథలు రాసే వాళ్ళు. కథలకి క్లుప్తతా, వాక్యమూ ఎంత అవసరమో చాటి చెప్పేవి మెడికో శ్యామ్ కథలు.

కథల్లో చూపిన విశ్లేషణా, పరిణితీ, భాష మీద పట్టూ చూసాక, అయ్యో ఈ రచయిత ఇంకా రాసుంటే బావుణ్ణు కదానిపిస్తుంది. రాయక పోవడం వల్ల రచయిత కొచ్చిన నష్టమేమీ లేదు కానీ, తెలుగు కథా సాహిత్యం మాత్రం ఒక గొప్ప కథకుణ్ణి కోల్పోయిందనిపించింది. ఈ ‘రాయని’ శ్యామసుందరుడు, ‘రాసే’ భాస్కరుడిగా మరిన్ని రచనా కిరణాలని వెదజల్లుతారని ఆశిద్దాం.

(ప్రతులకు: వంగురి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారిని సంప్రదించండి (vangurifoundationyahoo.com). ఇండియాలో నవోదయ, విశాలాంధ్ర పుస్తకాల షాపుల్లో ఈ పుస్తకం దొరుకుతుంది. వెల రూ. 150.00)