ఎమితిని సెపితివె?

[ఆముఖం అంటే ముందు మాట. పీఠిక పర్యాయ పదం. ఆఃముఖం అంటే వెనుక మాట. ‘పృష్ఠక’ పరాయిపదం. గతరెండేళ్ళలో అచ్చలరించిన ముగ్గురి కవితాసంకలనాల పృష్టకాలు చదివిన తరువాత, క్షమాపణలతో… ]

1.

ఈ కవి రాసిన పద్యాలు ఎలా చదవాలో చెపుతాను. వినండి. నిశ్శబ్దంగా వినండి. ఇతని కవితలు మెల్లిగా చదవండి. గొంతెత్తి బిగ్గరగా చదివితే పద్యాల్లో మాటలు కలవరపడి నల్లగా కమిలి పోతాయి. ఇతను రాసిన ప్రతి పద్యం నీలిమందు వేసి, కృష్ణకాలవలో ఉతికి ఆరేసి, గంజి పెట్టి ఇస్త్రీ చేసిన లాల్చీ లాగానో లంఘోటీ లాగానో ఉంటుంది. జాగ్రత్తగా తొడుగుకోవాలి. రెండోసారో, పదహారోసారో చదివితే ఏనాడూ ఉతకని బ్లూ జీన్స్ గుర్తుకొస్తాయి.

ఇతని కవితల్లో చెదలు చీమలూ, పొదలు పాములూ, పాతమూకీ సినిమాలలో బొమ్మల్లా ఉంటాయి. ఆ నిశ్శబ్దం లోంచి బొమ్మల్ని వినండి; ఒకచేత్తో చప్పట్లు కొట్టినట్టుంటాయి. ఇతని కవితలలో కురిసేది మనవూరి వానే! మన బురద వీధులే! మన పక్కింటివాళ్ళు మన ఇంటి ముందు పారేసిన కుళ్ళే!

ఇతని పద్యాల్లో ఆక్రోశన లేదు. టొమేటో రొట్టలూ లేవు. చేటపెయ్యలసలే లేవు. అరవనీయకండా, ఊరికే అరిచేవాడి గొంతు అరిచేత్తో నొక్కేస్తే ఆ గొంతు పాడే బాధపాట బాధ ఇతని పద్యాలు చదివిన తరువాతే తెలిసింది.

ప్రతి పద్యాన్నీ, ఒకదాని తరువాత ఒకటి, నెమ్మదిగా నమలి పూర్తిగా గొంతుకలోకి దిగనీయండి. దొరికాయి గదా అని ఆబగా చారులోవేసిన తద్దినపు గారెల్లా గబగబా మింగేయకండి. ఎక్కిళ్ళు వస్తాయి.

మాటలు పద్యాన్ని చెప్పవు. పద్యంలో మాటలు అర్థాన్నివ్వవు. ఆకారం అసలే ఉండదు. రూపం శూన్యం. మాటల్ని గట్టిగా పట్టుకొని చలిమిడి ముద్దలా పిసకండి. చలిమిడి తెలీదూ! రామ రామ! పోనీ, మాటల్ని పంచరంగుల ప్లే డౌ లా పిసకండి. పిసకగా పిసకగా పద్యానికి ఆకారం వస్తుంది. అప్పుడు కనిపిస్తుంది కవితలో విశ్వరూపం.

ఇతని పద్యాలన్నీ మనం తెలిసో తెలియకో పాతరేసుకున్న అపజయాలే. అందుకని, ఇతని పుస్తకం చింపేసి మాటలపోపు పెట్టి తిరగమాత వేస్తే మీరూ కవులై పోతారు. ఈ కవి చాలా నెమ్మదస్తుడు. నెమ్మదిగా నడుస్తాడు. అంతకన్నా నెమ్మదిగా పద్యాన్ని నడుపుతాడు. ఇతన్ని కలిస్తే, ఇతనికి పెద్ద రాతిబండ నిఘంటువు బహుమతిగా ఇవ్వండి. దానిని ఉలితో కొట్టి మాటల ముక్కలు తీసి పారేసి నగిషీ చెక్కి పద్యశిల్పం కడతాడు. పెద్ద రాయి పెద్దిరాజుల కథా తెలీదూ? మీ ఖర్మం.

ఇతను మాటకీ మాటకీ మధ్య ఎంత జాగా ఉండాలో ఊహ తెలిసిన మంచి కంపోజిటర్‌. ఊసుకీ ఊసుకీ మధ్య పేజీలో ఎంతభాగం విరిచిన మాటలు, ఎంతభాగం తెల్లకాయితం విడిచి పెట్టాలో గురుతెరిగిన ప్రింటర్‌.

ఇతని పద్యాలు కొన్ని గడుసుతనం ముసుగు లోంచి దబుక్కున మీదికి దూకి మిమ్మల్ని భయపెడతాయి. ఆ కవితలు చదివినపుడు మాట్లాడకండా ఊరుకోండి. ఊరుకోకపోతే పద్యాల బొమ్మలు చిరిగి పోతాయి. ఆ తర్వాత మీ ఇష్టం.

ఇతను నాకు ఆప్త మిత్రుడు.

2.

చక్కగా కుచ్చెళ్ళు పెట్టి పట్టుచీర కట్టుకోవటం చేతకాక పోతే, నీకు చీర కట్టుకోటం రానట్టే. పచ్చితెలుగులో చెప్పాలంటే కుచ్చెళ్ళు పెట్టడం తెలిసిన వాళ్ళకి చీర కట్టుకోవడం చెప్పకపోయినా తెలుసు. కుచ్చెళ్ళు పెట్టడం తెలియని వాళ్ళకి చీర కట్టుకోవడం చెప్పినా తెలీదు. అలాగే, పద్యం చదవగానే కవిత్వం అని పట్టుకోలేకపోతే నువ్వు కవిత్వం పట్టుకోలేవు. నీకు కవిత్వం తెలియకపోతే కవిత్వం తెలియదు. ఇది విశ్వజనీన లాక్షణిక సూత్రం.

ఈ కవి నాకు మనిషిగా తెలియదు. మూడు పొడి అక్షరాలుగానే తెలుసు. అందులో ఒక అక్షరం ఏ సజీవభాష లోనూ లేని అక్షరం; ఒక్క తెలుగువాడి ఇంగ్లీషులో తప్ప. కవి మనిషిగా తెలియక పోవడం అజ్ఞానం. అజ్ఞానం కవిత్వాన్ని అజ్ఞాతంగా అంచనా వెయ్యడానికి ఆసరా ఇస్తుంది.

ఇతని పద్యాలు వింటుంటే చదువుతున్నట్టుగా నటించి సూటిగా మీ గుండెల్లోకి ‘ఈపీ’ ల్లాగా దూసుకొని పోతాయి. పెళ్ళాం మీద గొణుగుడులాగా భయంభయంగా మీలో మీరు తిట్లాడుకునే మాటలు కట్టే బొమ్మలు ఇతని కవితలు. ఒక్కొక్క సారి, పద్యంలో మాటలు చటుక్కున మాయమై భయం బొమ్మలే వినిపిస్తాయి. కవిత్వం అంటే తెలిసీ తెలియని వాడికి ఈ బొమ్మలు బుర్రలో కదిలి బుర్రకెలికేసి తలలో జువ్వు మనిపిస్తాయి. నెప్పి పుట్టిస్తాయి.

ఈ కవి, కవిని గంగిరెద్దు వాడితో పోల్చడం అశాస్త్రీయం. కవులని గంగిరెద్దులనడమే శాస్త్ర పద్ధతి. ఈ కవి ఉత్ప్రేక్షలు నిరసిస్తాడు.

ఇతని కవితలన్నింటిలోనూ మాటలు ఎక్కడెక్కడి బొమ్మలతోనో ఈతజడ వేసుకుంటాయి. ఈ సంకలనాన్ని, బొమ్మలపుస్తకం అనటం సబబే. అంతేకాదు. ఇతని కవితలు కొన్ని కుమ్మరి కుండలు. ముట్టుకుంటే కొన్ని గట్టి కుండలు ఖంగ్‌ మంటాయి, ఘటవాయిద్యంలా! కొన్ని ముట్టుకోకముందే టుప్పుమని విరిగిపోతాయి, పగిలిన పద్యం ముక్కల్లా!

ఈ కవికి ఎల్లలులేని ఇల్లుంది. ఇంటి తెల్లగోడల మీద బలిసిన తెలుగునాడు బల్లులున్నాయి. అయితే, వీటికీ ఇతని కవిత్వానికీ సంబంధం బాదరాయణం.

మాటల వంటకీ, మనిషి వంటికీ ఉన్న సంబంధం తెగిపోవడానికి ముఖ్యకారణం: కోకొల్లలుగా కొత్త కొత్త కవులు తయారుచేస్తున్న అర్థం పర్థం లేని కొత్త కొత్త మాటల జబ్బులు. వాడకంలో ఈ మాటలు నున్నగా అరిగి అరిగి ఒకే సైజు, ఒకేరంగు మట్టి గోళీల్లా తయారవుతున్నాయి. అస్తమానం ఈ మట్టిగోళీలతో వీధిన పడి ఆటలాడటం కొంగ్రొత్త సాహిత్య సంప్రదాయంగా తయారయ్యింది. ఆడగా ఆడగా ఈ గోళీలకి మకిలి మసి పడుతుంది. మకిలి మసి కడగకండా ఆడిన ఆటే ఆడితే రకరకాల అంటువ్యాధులొస్తాయి. అడ్డంగా ఒక పంక్తి, నిలువుగా మరొక పంక్తి అచ్చేసి కవిత్వం అనడం ఒక పెద్ద అంటువ్యాధి. ఈ మాటల జబ్బు జలుబులో పడకండా బయటికొస్తున్న కొద్దిమంది కవుల్లో ఇతను ముఖ్యుడు.

ఈ కవి, అర్థాలు పద్యాలు కావని, మాటల కలయికవల్ల వచ్చే పద్యాల బొమ్మలు నచ్చకపోతే వాటిని చించి పారేసి పాదాభివందనం చెయ్యమని సూటిగా ఘాటుగా చెప్పుతున్న ఆధునికానంతర వ్యతిరేకి.

అందుకే ఇతనంటే నాకు గౌరవం.

3.

‘ముసురేసి మతిపోయి ససిచెడినట్టు’న్న సందిగ్ధ సమయంలో సడెన్‌గా విరిగిన అద్దం పెంకు మీద మాటల వెలుతురుల జల్లులు పడితే ఎటువంటి అనుభవం వస్తుందో, సరిగ్గా అటువంటి అనుభూతి వచ్చింది, ఈమె కవితలు చదివిన క్షణం. విన్న మరుక్షణం ‘గుండె గొంతుకలో’ కొచ్చి కాట్లాడి, ఒళ్ళు పులకరించి జ్వరం వచ్చినంత పని అయ్యింది.

ఈ పులకరింపు కవితలు రాసిన మనిషిని నేను చిన్నప్పటినుంచీ ఎరుగుదును. అంటే, ఆమె చిన్నప్పటినుంచీ అని నా భావం. నాకై నాకు తెలియని కవిత్వం ఈమెకు ఎలా వంటపట్టిందా అని గందరగోళం పడ్డాను. అది వాస్తవం.

ఈమె కవితలు విని, ఇవి యాండీ గిబ్స్‌కీ రైటియస్ బ్రదర్స్‌కీ అందని నిర్మాణం ఉన్న కవితలు అని గ్రహించటానికి ఎంతోకాలం పట్టింది. ఈమె కవితలు పూర్తిగా చదివి, ఇది కవిత్వమా (?) అని ఆశ్చర్యపడితే, మీరు బతికి ఉన్నారో లేదో ఒకసారి మిమ్మల్ని మీరు గిల్లి చూసుకోవడం అవసరం.

మాటలకి నగిషీలు చెక్కి కూర్చని కారణంగా ఈమె కవితల్లో మీరు లాంఛనప్రాయంగా అనుకునే శిల్పం, కూర్పు ఎంత వెతికినా కనపడవు. ఈమె కవితలు చదుతున్నంతసేపూ మూగవోయి మూలకూలిపోయిన మాటలన్నీ కవిత్వానికి ఎంత అర్హమైనవో తెలిసింది. ఈ కవి మూగవోయి మూలకూలిపోయిన మామూలు మాటలకు ఆకారం ఇచ్చి అందంగా అచ్చువెయ్యడం అసాధ్యం కాదని రుజువు చేసింది.

ఉపమా ఈమె కవితల్లో కొట్టొచ్చినట్టు కనిపించే ప్రత్యేక లక్షణం. కొన్ని కవితల్లో ఉపమా లవణహీనమై చప్పగా నీళ్ళు కారినట్టుంటుంది. మరికొన్ని కవితల్లో ఉపమా హేబన్యారో ఘాటులా కళ్ళల్లో నీళ్ళు నింపుతుంది. మరోకొన్ని కవితల్లో ఉపమా సత్యనారాయణ వ్రతప్రసాదంలా తియ్యగా కవ్విస్తుంది. ఉపమా కాళిదాసస్య అన్నది సదా సత్యం కాదన్న విషయం ఈమె కవితలు చదివిన తరువాత రూఢిగా నేను గ్రహించిన సత్యం.

ఈమె రాసిన కవితల్లో మొదటి ముక్తకం మధ్యకి, మధ్య ముక్తకం చివరికీ, చివరి ముక్తకం ముందుకీ మారిస్తే ఏది మొదలో ఏది తుదో చెప్పటం కష్టం. ఇదే ఎంత తన్నుకున్నా అందరికీ అందని ఉపమాహతి.

ఈ పద్యాలు ‘దూతిక తెచ్చి ఇచ్చిన కప్పురవిడెం’ నమలుతూ తాపీగా ఉయ్యాల ఊగుతూ చదివే కవితలు కావు. అంజలి ఘటిస్తూ ఒంటికాలిపై నిట్టనిటారుగా నించోనో, ట్రెడ్‌ మిల్‌ మీద చెమటోడుస్తూ నడుస్తూనో, అంబలి తాగుతూ జోరుగా పరుగెడుతూనో చదవవలసిన కవితలు.

ఈ కవి రాసిన కవితలకి కవితలుగా ఆకారం ఎలా వచ్చిందో ఇంతవరకూ నాకు అంతు పట్టలేదు. మీకు అంతు పడితే నాకు రాయండి.

ఈ సంకలనంలో కొన్ని ఖండికలు మీలో మిమ్మల్ని ‘క్రోమాన్యాన్‌ గుహల్లో’  మానవుడిలా పలకరిస్తే, జడుసుకోకండి. Pass it On!!

[Happy birthday, nArA!]