కినిమా పత్రిక నుంచి – 2

పేరులేని ఎడిటర్‌గా కొడవటిగంటి కుటుంబరావుగారు చందమామతోబాటు కినిమా మాసపత్రికకు కూడా చాలా చాకిరీ చేశారు. అందులోని వ్యాసాలూ, శీర్షికల నిర్వహణ కాకుండా ఎక్కడ ఏ ఫోటోలు వెయ్యాలనేదికూడా చూసేవారు. అందులోని కొన్ని విశేషాలు స్కాన్ చేసి చదవడం వీలుగా ఉండడం కోసం పి.డి.ఎఫ్‌.లుగా పొందుపరుస్తున్నాను.


తొలి నాటి అనుభవాలు

తొలి సినిమా అనుభవాలు: తరవాతికాలంలో లబ్ధప్రతిష్ఠులైన కొందరు 1952లో తమ గురించి తామే చెప్పుకున్న విషయాల సమాహారం. సినిమాలలో చేరదాం అనే ఉబలాటం ఉన్నవారికి ప్రోత్సాహకరంగా ఉండడం కోసం పెట్టిన శీర్షిక ఇది. ఇంతకు ముందు సంచికల్లో కొందరు నటుల అనుభవాలు మీకందించాను. ప్రస్తుతం, కామెరామన్ ఆది ఇరాని, దర్శకుడు పి. శ్రీధర్, పరిచయం అక్కర్లేని నటులు అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి. రంగారావు, ఆర్ట్ డైరెక్టర్ మా.గోఖలేల అనుభవాలు ఈ వ్యాసంలో జతచేశాను.

చిత్రవార్తలు: ఈ శీర్షిక కోసమని స్టూడియోలకూ, ఫ్లోర్లకూ తిరిగి, సమాచారం సేకరించి, వార్తలను క్లుప్తంగా రాయవలసిన బాధ్యత ఉండేది. వీటిలో కొన్ని సినిమాలు పూర్తికానివి కూడా ఉండేవి.

జనవాక్యం: సంచిక చివరిపేజీలలో నవంబర్ 1952 ప్రాంతాల సంచిక చివరిపేజీలలో రిలీజయిన ఒక సినిమా (పల్లెటూరు) గురించిన తమ అభిప్రాయలను పంపిన పాఠకుల ఉత్తరాలు ప్రచురించేవారు. నాకు తెలిసి ఇది మరే తెలుగు సినీజర్నల్‌లోనూ కనబడని సంగతి. ప్రచురించతగిన అభిప్రాయాలను ఎంపిక చేసి, కాస్త ఎడిట్ చేసి వెయ్యడం సంపాదకుడి పని.

అరవయ్యేళ్ళ క్రితం ఎన్.టి.రామారావు

కినిమా సెప్టెంబర్ 1952 సంచికలో కుటుంబరావు అతన్ని పర్సనల్‌గా ఇంటర్‌వ్యూ చేసి రాసిన వ్యాసం ఇప్పుడు చదవటానికి ఆసక్తికరమే. ఇందులో రాయటానికి వీల్లేనివి మా నాన్న మాతో చెప్పేవారు. జ్ఞ అనే అక్షరం పలకలేకపోవడం తరవాత అందరూ గుర్తించినదే. పెళ్ళిచేసిచూడు సినిమా వేషానికి కుట్టించిన దుస్తులు (షూటింగ్ ముగిశాక ప్రొడక్షన్ ఆఫీసుకు తిరిగి ఇవ్వడం అప్పటి సంప్రదాయం) ‘ఇవి మీరేం చేసుకుంటారు? నేను పట్టుకుపోనా?’ అని రామారావు అడిగితే తెల్లబోయిన నిర్మాతలు సరే ననవలసి వచ్చిందట. ఇది అప్పటి రామారావు శైలి. అప్పటికి నటసార్వభౌమవంటి భట్రాజు ధోరణులు మొదలవలేదు.


ఎన్. టీ. రామారావు

ఇందులోని విషయాలకొస్తే రామారావు రాజకీయధోరణి గురించిన కామెంట్లున్నాయి. అతని పెద్దకొడుకు రామకృష్ణ మద్రాసులో ఫోర్త్ ఫాం తప్పి నాకు క్లాస్‌మేట్ అయాడు. అతనికి చదువు పెద్దగా రాకపోయినా బొమ్మలు బాగా వేసేవాడు. 1961లోనే అతనికి 500 రూపాయలు చేసే స్పోర్ట్స్ సైకిలుండేది. ఇతరత్రా గొప్పలకు పోయేవాడు కాడు. మేమిద్దరం గుండమ్మకథ ప్రీవ్యూ చూడడం నాకు గుర్తుంది. 1962 వేసవిలో అతను మశూచికంతో చనిపోవడం ఫిఫ్త్ ఫాంలో ప్రవేశించినప్పుడు మాకందరికీ తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. రామారావు, నాగేశ్వరరావు సరదాగా టెన్నిస్ ఆడడం కె.వి.రెడ్డి గమనించారనీ, అందులో ఒక బాల్ మిస్ అయిన రామారావు కోపంతో దాన్ని దూరంగా పడేట్టు బాదాడనీ, అది చూసి రెడ్డిగారు పాతాళభైరవిలో నాగేశ్వరరావుకు బదులుగా రామారావును తీసుకున్నారనీ ఎక్కడో చదివాను.

కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...