సిగిౙ్మండ్ క్రిజ్‌జనావ్‌స్కీ (1887-1950): యావత్ప్రపంచంలో పేరెన్నిక గన్న రచయితల పంక్తిలో నిలబడవలసింది పోగా, జీవిత కాలంలో ఇంచుమించు విస్మృతుడైపోయి తనను తాను ‘అనామకుడిగా ప్రసిద్ధుడ’నని వర్ణించుకున్న సిగిౙ్మండ్ క్రిజ్‌జనావ్‌స్కీ, తన కథలను బ్రతికుండగా ప్రచురణలో చూసుకోలేకపోయాడు. అతని కథలను స్టాలినిస్ట్ ప్రభుత్వం ప్రచురించనీయక పోవడంతో బ్రతికి ఉండగా అతను ఒక రచయిత అన్న సంగతి సాటి రచయితలతో సహా ఎవరికీ తెలియరాలేదు. ఒక ఇరుకైన గదిలో ఒంటరిగా అతను తన కథలనే అద్భుతలోకాలు సృష్టించాడు. వాస్తవంలో సాధ్యం కాని వాటిని భాష సాధ్యం చేయగలదని నమ్మిన సిగిౙ్మండ్ కథలు వర్గీకరణకు లొంగవు. అతని కథలను వాస్తవికతపై చేసిన ప్రయోగాలుగా అభివర్ణించుకున్నాడు ఈ అధివాస్తవిక కథకుడు. అతని కథలలోని పాత్రల అస్తిత్వం అభూత కల్పన; కానీ అవి ఉండేది, పాటించేది భౌతిక జగత్తు ధర్మాలనే. వాస్తవికతకు అద్దిన ఒక కొత్త కళాదృక్పథం అతని సాహిత్యం. వాస్తవం అనేది సంపూర్ణమూ, స్వతంత్రమూ కాదు; అది మనకు ఎన్నటికీ పూర్తిగా అవగతం కాదు; అది కేవలం ఒక పగిలిన ముక్కల కూర్పు వంటిది–ఇదీ వెస్టర్న్ ఫిలాసఫీతో పాటు వేదాంతాన్నీ శ్రద్ధగా చదువుకున్న సిగిౙ్మండ్ కథలలో కనిపించే దృక్పథం. అత్యంత సూక్ష్మమైన అస్తిత్వం ఉన్న పదార్థాలను లోతుగా పరిశీలించడం ద్వారా, తాత్వికసమస్యలను కళాకారుడి దృష్టితో దర్శించడం ద్వారా, వాస్తవికత గురించి కొంతైనా అర్థం చేసుకోవచ్చనే ప్రయత్నం అతని కథలలో కనిపిస్తుంది. 1920 నుంచి 1940ల వరకూ అసామాన్యమైన సృజనతో అతని కలం సృష్టించిన ఒక అద్భుతమైన సాహిత్యప్రపంచం అతని మరణం తరువాత కూడా రహస్యంగా కాపాడుకోబడింది. చివరకు 1976లో వదీమ్ పెరెల్మూతర్ అనే రష్యన్ సాహిత్యవేత్త ద్వారా మొదటిసారిగా వెలుగు చూసిన ఇతని కథలను, గత పదేళ్ళలో వచ్చిన ఆంగ్లానువాదాల వల్ల, ప్రపంచం ఇప్పుడిప్పుడే చదువుతూ అబ్బురపడుతున్నది. ఈ అద్భుత కథకుడి కథలను అనువదించడమే కాక, వాటికి అనుబంధంగా సిగిౙ్మండ్ సాహిత్య దృక్పథాన్ని సరళంగా వివరించే వ్యాసంతో ఒక సమగ్రమైన పరిచయాన్ని అందిస్తున్న పప్పు నాగరాజుకు అభినందనలతో, అతను పడిన శ్రమకు కృతజ్ఞతలతో ఈ సంచికను సిగిౙ్మండ్ విశేష సంచికగా విడుదల చేస్తున్నాం.
ఈ సంచికలో:
- కథలు: వంకర గీత – పూర్ణిమ తమ్మిరెడ్డి (సాదత్ హసన్ మంటో); దిల్లీ నుంచి హరిద్వార్ వరకు – అనూరాధ నాదెళ్ళ; In the Pupil – నాగరాజు పప్పు (Sigizmund Krzhizhanovsky); The Collector of Cracks – నాగరాజు పప్పు (Sigizmund Krzhizhanovsky); Thirty pieces of Silver – నాగరాజు పప్పు (Sigizmund Krzhizhanovsky);Yellow Coal – నాగరాజు పప్పు (Sigizmund Krzhizhanovsky).
- కవితలు: అమానుషి – యార్లగడ్డ రాఘవేంద్రరావు; Muse – బండ్లమూడి స్వాతికుమారి.
- వ్యాసములు: నేనొక చిత్రమైన చిక్కుముడి 4: ఈ వ్యాస రచయిత నేను కాదు – భైరవభట్ల కామేశ్వరరావు; ముక్కలయిన వాస్తవం: సిగిౙ్మండ్ క్రిజ్‌జనావ్‌స్కీ – నాగరాజు పప్పు; వీర శైవులు: ఒక పరామర్శ – వీరభద్రప్ప ముచ్చండి; వీర శైవులు – వీరభద్రప్ప ముచ్చండి.
- ఇతరములు: నాకు నచ్చిన పద్యం: వరూధిని వగపు – చీమలమర్రి బృందావనరావు; కాస్త ఘనీభవనం ఇంకాస్త ద్రవీభవనం (సమీక్ష) – ఎ. రవీంద్రబాబు; గడి నుడి 28 – సుభద్ర వేదుల.