తలుపు – ఒక ముగింపు

“ఏంటో ఇక్కడంతా చీకటి చిక్కగా భయంగా ఉంది.” అందామె.

ఆచితూచి అడుగులేస్తూ తలుపు దగ్గరకి చేరుకుంది.

“అబ్బా, ఈ తలుపెంత బరువుగా ఉందో!”

అంటుండగానే భళ్ళున లోపలి వైపుకి తెరుచుకుంది బరువైన ఆ తలుపు.

“అమ్మో, చూసుకోనక్కర్లా?”

“అయ్యో, తలుపు పడిపోయింది. లోపలివైపు గడి ఏమీ లేదు, ఎలా?”

“ఓసి దెయ్యమా, మనిద్దర్నీ లోపలే బంధించేసేవు కదే!” అన్నాడతను కంగారుగా, కోపంగా.

“ఇద్దర్ని కాదు, ఒక్కర్నే.”

ఆమె ఆ తలుపులోంచి నడుచుకుంటూ వెళ్ళిపోయింది.


కొన్నాళ్ళ తర్వాత, అతను కూడా ఆమెలాగే తలుపులోంచి నడుచుకుంటూ బయటపడ్డాడు.

ఆమె అతని కోసం బయట ఎదురుచూస్తోంది.

అతన్ని చూడగానే, సుడిగాలై అతన్ని కౌగలించుకుంది.

“ఇంక మనం ఎప్పటికీ విడిపోలేం.” అన్నాడతను, ఆమెని తన లోలోపలకి పొదవుకుంటూ.

“అవును, నో హార్డ్ ఫీలింగ్.”

ఈసారి, ఇద్దరికీ ఆ కౌగిలి కొత్తగా ఉంది.


ఇంతకీ వాళ్ళిద్దరూ ఎవరు? వాళ్ళకు ఏమైంది?

అతన్నెందుకీ తలుపు లోపలికి ఆమె నెట్టేసింది?

ఇలాంటి ప్రశ్నలు ఎన్నో నాకూ ఉన్నాయి.

కానీ, లోపలనుండి తెరుచుకోలేని తలుపు చెక్కని, నాకెలా తెలుస్తాయి అవన్నీ?