చేతివేళ్ళ మెటికలన్నీ ఒక్కసారిగా విరుచుకుని, అలా కలిగిన ఆనందాన్ని ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆస్వాదించి, ఈబే సైట్ మీదికి దృష్టి సారించాడు శంకర్ రెడ్డి.
సమయం రాత్రి పదకొండు గంటలు.
సుమతి వంట గదిలో గిన్నెలు కడగటం, సర్దటం వినిపిస్తోంది.
పిల్లలిద్దరూ పక్కల మీదికి చేరారు. రాత్రి పదకొండు గంటలు వాళ్ళ బెడ్ టైమ్ ఇద్దరూ హైస్కూల్‌కి
వెళ్తున్నారు గనక.
ఓ నెల రోజులనుంచి శంకర్ రెడ్డి ఈ వింత వేట లో వున్నాడు.
చూస్తూండగానే తొలిపిట్ట వచ్చివాలింది “సబ్‌కారాజ” మరో వస్తువుని ఆక్షన్‌లో పెట్టాడు.
మరో వంక ” Siva statue made of genuine granite ” ఆక్షన్ ముగిసింది.
మూడొందల డాలర్లకు అమ్ముడు పోయిందది.
దాన్ని కొన్న వాడు తనకు రోజూ పరిచితుడే ” heman ” (బహుశ అది హీమేన్ కి గుర్తు అయుంటుందని, ముందు తను అనుకున్నట్టు హేమంత్ కాదని ఈ మధ్యనే అనుమానం కలుగుతోంది శంకర్ రెడ్డికి).
ఇంకో పది నిమిషాల్లో తను గమనిస్తోన్న మరో ఆక్షన్ కూడ ముగియబోతోంది దాన్లో ఓ సరస్వతీ విగ్రహాన్ని అమ్ముతున్నారు. ఇప్పటి వరకు ఎవరో ఒక్కరే బిడ్ చేసి వున్నారు. ఐతే అది రిజర్వ్‌ని దాటలేదు.
తన ఆలోచన నిజమైతే మరో ఎనిమిది నిమిషాల్లో హీమేన్ దీనికి కూడ బిడ్ చేసి గెలుచుకోబోతున్నాడు.
తొలిరోజుల్లో ఐతే ఏ ఆక్షన్‌లో ఏమౌతుందా అని చివరి దాకా ఎంతో ఆసక్తిగా వుండేది గాని ఈ నెలరోజుల్లోను ఒక్కసారి కూడ తన అంచనాకి వ్యతిరేకంగా జరక్కపోవటంతో ఇప్పుడా ఆసక్తి లేదు. కేవలం తన తియరీని మరో సారి నిరూపించటానికే పనికొస్తున్నాయి ఈ కొత్త సంఘటనలు.
ఇంకో ఇరవై నిమిషాల్లో ముగియబోతోన్న మరో ఆక్షన్ వంక చూశాడు. అది వినాయక విగ్రహానికి. దాన్ని
కూడ మన హీమేనే కొనబోతున్నాడు!
“శంకర్! నా పనంతా ఐపోయింది. ఇవాళన్నా కాస్త ఎర్లీగా పడుకుందామా?” కింది నుంచి సుమతి.
“ఆఁ, వచ్చేస్తున్నా. నువ్వు స్నానం చేసే పనేమీ లేదా?” రూటీన్‌గా సమాధానం ఇచ్చాడు.
“ఓకే, పది నిమిషాల్లో స్నానం చేసి పడుకోబోతున్నా” బెడ్ రూమ్ లోకి వెళ్ళినట్టు తెలిసింది.
మళ్ళీ స్క్రీన్ వంక చూశాడు. సరస్వతీ విగ్రహానికి హీమేన్ ఠంచనుగా వచ్చి బిడ్ వేశాడు. రిజర్వ్‌ని దాటిపోయిందది.
మరో నిమిషమున్నరలో ఆ ఆక్షన్ ముగిసింది. హీమేనే గెలుచుకున్నాడు.
ఇంకో నాలుగు అలాటి ఆక్షన్లే వచ్చే గంటలోపల ముగియబోతున్నాయి.
వాటన్నిటినీ హీమేనే కొనబోతున్నాడు. వెయ్యి డాలర్ల పైగా ఖర్చు పెట్టబోతున్నాడు ఒక్క రాత్రిలోనే!
ఈ నెలరోజుల్లో ఇప్పటికి ఇలాటి పదిరాత్రుల్ని లెక్కపెట్టాడు శంకర్.
నెలకు పదివేలు ఖర్చు పెట్టి ఇలాటి వస్తువుల్ని కొంటున్నాడంటే అతనికి ఎంత వస్తూ వుండాలి?
ఐనా, ఈ వస్తువుల్ని ఇండియా నుంచి కొనితెచ్చుకుంటే దీన్లో సగం కూడ ఖర్చు అక్కర్లేదు కదా?
పోనీ, ఇవన్నీ బిజినెస్‌కా?
అలాటప్పుడు ఆ అమ్మే వాళ్ళని నేరుగానే కాంటాక్ట్ చేసి కొనుక్కోవచ్చు కదా?
అమ్మే వాళ్ళైనా, నేరుగా అమ్మొచ్చు కదా, ఇలా ఈబే ద్వారా వెళ్ళటం ఎందుకు? వాళ్ళకు కమీషన్ ఇచ్చుకోవటం ఎందుకు?
అన్నీ ప్రశ్నలే!
ఏదో గూడుపుఠాణీ జరుగుతుందేమో అని అనుమానం.
ఐతే, అదేమిటో ఏ మాత్రం అంతు పట్టటం లేదు.
లేచి వెళ్ళి బ్రష్ చేస్తుండగా హఠాత్తుగా వచ్చిందా ఐడియా!
దాన్లోని సింప్లిసిటీకి అతనికే ఆశ్చర్యం వేసింది.
హమ్మా! ఎంత పని చేస్తున్నారురా! అని వాళ్ళని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు.
ఏ మాత్రం భయం లేకుండా, పబ్లిగ్గా ఎలా చెయ్యగలుగుతున్నారా అని తలుచుకుంటేనే అతనికి భయం వేసింది.
“ఈ మధ్య ఇండియా నుంచి వస్తున్న వాళ్ళకి ఏ మాత్రం భయం గాని ఇక్కడి చట్టాల మీద నమ్మకం గాని ఉన్నట్టు కనపడటం లేదు” తను వెళ్ళే పార్టీల్లో ఎప్పుడూ వినపడే అభిప్రాయం నిజమే అనిపించిందతనికి.
“పాతవాళ్ళలో ఎవరైనా ఇలాటి పన్లు చెయ్యగలరా?” అనుకున్నాడు.
హఠాత్తుగా నిద్రలోంచి మెలకువ వచ్చింది. టైమ్ చూస్తే మూడైంది.
ఎందుకు మెలకువ వచ్చిందా అని ఆలోచిస్తుంటే తట్టింది పడుకునే ముందు తను ఆలోచిస్తున్న చిక్కుసమస్యకి ఓ మార్గం దొరికింది.
చప్పుడు చెయ్యకుండా జాగ్రత్తగా లేచి కంప్యూటర్ దగ్గరకు వెళ్ళాడు. తను గమనిస్తున్న ఆక్షన్ లన్నిటిలోను అమ్ముతున్న వాళ్ళ ఈమెయిల్ అడ్రస్‌లు తన కంప్యూటర్ మీదికి కాపీ చేసుకున్నాడు.
అందరికీ ఓ ఈమెయిల్ పంపించాడు.
“గత కొంతకాలంగా మీరు చేస్తున్న ఫ్రాడ్‌ని నేను గమనిస్తున్నాను. ఐతే, ఈ స్కీమ్‌లో ముఖ్యుడు హీమేన్ అని నాకు తెలుసు. నాకు కావలసింది అతను, మీరు కాదు. ఇకనుంచి మీరు నేను చెప్పిన విధంగా మీ ఆక్షన్లు సాగిస్తే మీకేం భయం లేదు. లేకుంటే మీ మీద కూడ కఠినమైన చర్య తీసుకోవాల్సొస్తుంది.
ఆలోచించుకుని మీ అంగీకారాన్ని నాకు వెంటనే తెలియపరచండి. లేకుంటే అనవసరంగా చేజేతులా మీ భవిష్యత్తు నాశనం చేసుకున్నట్టే! ఇది మీకున్న ఒకే ఒక ఆఖరి అవకాశం.
అన్నట్టు, చెప్పటం మరిచాను నా పేరు పీటర్ జాన్‌సన్, నేనో ఎఫ్. బి. ఐ. ఏజెంటుని.”
తృప్తిగా, తనని తను అభినందించుకుంటూ వెళ్ళి పడుకున్నాడు శంకర్.
ఉదయం పది గంటలు.
అభిషేక్ జిమ్‌లోనుంచి ఈల వేసుకుంటూ బయటకు వచ్చాడు. తన బి. ఎమ్. డబ్య్లు. 545ఐ కార్లో ఠీవిగా కూర్చుని ఆఫీసుకి దారితీశాడు.
రెండేళ్ళుగా ఆ ఆఫీసుని లీజ్‌కి తీసుకున్నాడతను. ఆ ఆఫీసులో అతను ఒక్కడే.
ఇంటర్నెట్ మీద వార్తలు, స్టాక్ మార్కెట్ వివరాలు ఓ గంటన్నర చూసి లంచ్‌కి వెళ్తాడు.
రెండింటికి తిరిగొచ్చి మళ్ళీ ఓ గంట ఇంటర్నెట్ మీద గడుపుతాడు.
మూవీ ఏదైనా చూడాలనిపిస్తే వెళ్ళి చూస్తాడు. లేకుంటే ఏదైనా పార్క్‌కో లేకపోతే లేక్ వైపుకో వెళ్ళి గడుపుతాడు. అదికూడ బోర్ కొడితే ఏదైనా పుస్తకం కాసేపు చదువుతాడు.
ఆరింటికి ఇంటికి చేరుకుంటాడు. అరుణ ఏడింటికి వస్తుంది వర్క్ నుంచి. ఇద్దరూ కలిసి తాపీగా భోంచేసి టీవీ చూస్తూ కాలం గడుపుతారు. పదింటికి పైకి వెళ్ళి ఓ గంట కంప్యూటర్ మీద గడుపుతారు.
వీకెండ్ ఐతే డిన్నర్ కి బయటకు వెళ్తారు. మూవీ ఏదైనా చూసి, క్లబ్ కి వెళ్ళి అర్థరాత్రికి ఇల్లు చేరుతారు.
అదీ అతని మామూలు దినచర్య.
యథాప్రకారంగా కంప్యూటర్ ఆన్ చేసి ఈమెయిల్ చెక్ చేసుకున్నాడు.
అతని మిత్రులు ఆరుగురి నుంచి పానిక్ మెసేజ్‌లున్నాయి.
వెంటనే తెరిచి చూశాడు వాటిని. అన్నిట్లోను దాదాపుగా ఒకటే సారాంశం.
అందరూ వాళ్ళకు ఎఫ్. బి. ఐ. నుంచి వచ్చిన ఈమెయిల్ ని జతచేశారు.
అభిషేక్ గుండె కలుక్కుమంది.
అసంకల్పితంగానే ముచ్చెమటలు పట్టాయి.
“కొంపలు మునిగినయ్!” అనుకున్నాడు.
కంగారుగా అరుణకి ఫోన్ చేశాడు.
గబగబా పరిస్థితిని వివరించాడు.
అంతా విన్నదామె.
కాసేపు ప్రశాంతంగా ఆలోచించింది.
“అది ఎఫ్. బి. ఐ. నుంచి వచ్చిన ఈమెయిల్ కాదు!” అన్నదామె దృఢంగా.
అభిషేక్‌కి ఆమె ఏమంటున్నది ముందు అర్థం కాలేదు.
అర్థం అయ్యాక, “ఎలా చెప్పగలవ్?” అన్నాడు నీరసంగా, ఆశగా.
“నాకు తెలుసు. ఎఫ్. బి. ఐ. వాళ్ళెప్పుడూ అలా చెయ్యరు. నా మాట నమ్ము. ఇది ఎవడో పనిలేని వాడి పని.
మనం ఏదో చేస్తున్నామని తెలుసు కాని ఏంచేస్తున్నామో తెలియదు వాడికి.
ఆ మెసేజ్‌ని పట్టించుకోవద్దని వెంటనే నీ ఫ్రెండ్స్‌కి ఈమెయిల్ పంపించు.”
అనుమానంగానే వున్నా “సరే” అని ఫోన్ పెట్టేశాడు అభిషేక్.
అతనికి అరుణ సామర్య్థం మీద అపారమైన నమ్మకం వుంది.
ఎలాగైనా ఆమెది చాలా స్మార్ట్ బ్రెయిన్. తనలాటి వాడికి ఎన్ని జన్మలెత్తితే తడుతుంది ఇలాటి ప్లాన్?
సరిగ్గా అంతకు గంట ముందు ఎన్. ఎస్. ఏ. కంప్యూటర్లు అదే ఈమెయిల్‌ని ఫ్లాగ్ చేసినయ్, అందులో ఎఫ్. బి. ఐ. ప్రసక్తి వచ్చినందువల్ల. ఇప్పుడున్న (అ)భద్రతా పరిస్థితుల దృష్య్టా ఇరవై నాలుగ్గంటల్లోగా ఒక ఎఫ్. బి. ఐ. ఏజెంట్ దాన్ని చూసి తగిన చర్య తీసుకోవాలి.
మర్నాటి రాత్రి భోజనం కాగానే పరుగెత్తుకెళ్ళి తన ఈమెయిల్ చూసుకున్నాడు శంకర్ రెడ్డి.
ఏమీ లేవు!
ఆశ్చర్యం వేసిందతనికి!
వీళ్ళు ఐతే మహా ముదురు ఘటాలన్నా ఐవుండాలి, లేకపోతే మరీ అమాయకప్రాణులన్నా కావాలి.
ఒకవేళ తన మెసేజ్‌లో ఏదన్నా తను ఎఫ్. బి. ఐ. కాదని వాళ్ళకి అనుమానం కలిగించిందా?
తను పంపిన మెసేజ్ పదేపదే పది సార్లు చదివి చూశాడు. రకరకాల కోణాల నుంచి ఆలోచించి చూశాడు.
ఏమీ తట్టలేదు.
అసలు ఈ ఈమెయిల్ వెళ్ళిందా?
తన మెసేజ్‌లో ఒక పొరపాటు జరిగినట్టు మెల్లగా అర్థమైందతనికి వాళ్ళు హీమేన్‌తో ఈ విషయం చెప్ప కూడదని తను ఆ ఈమెయిల్లో రాయలేదు. వాళ్ళు వాడిని కాంటాక్ట్ చేసి వుంటారు. వాడు తను ఎఫ్. బి. ఐ. కాదని గ్రహించేశాడు!
వీడు సామాన్యుడు కాడు!
ఇంక ముసుగులో గుద్దులాట మానేసి నేరుగా ఎటాక్ చెయ్యటం మంచిది.
వెంటనే హీమేన్‌కి ఈమెయిల్ పంపించాడు
“నువ్వు చేస్తున్న ఫ్రాడ్‌ని చాలాకాలంగా గమనిస్తున్నాను. ఈ పాటికి నువ్వు ఎంతో సంపాయించావని నాకు తెలుసు. అందులో నాకు సగం ఇవ్వాలి. లేనిపక్షంలో ఎఫ్. బి. ఐ. కి వెంటనే నీ గురించి చెప్తాను.”
ఇలా పంపించాడో లేదో అలా సమాధానం వచ్చింది
“మిత్రుడా! నువ్వు ప్రయత్నిస్తున్న దాన్ని బ్లాక్ మెయిల్ అంటారని నీకు తెలుసో తెలియదో! ఈ విషయం నేను ఎఫ్. బి. ఐ. కి రిపోర్ట్ చేస్తే నీగతి ఏమౌతుందో ఆలోచించుకో!”
అహా! అలా వచ్చావా? అనుకున్నాడు శంకర్.
“అది నీకు నేను పంపిన ఈమెయిలేనని నువ్వు ప్రూవ్ చెయ్యలేవు. ఐనా, అది కాదు ఇక్కడ మనం చర్చించాల్సిన విషయం. నాక్కావలసింది నువ్వు చేస్తున్న ఫ్రాడ్ విషయం.”
“ఇలా ఈమెయిల్స్ ఎందుకు? మనం ఫోన్లో మాట్లాడుకోవచ్చుగా?” టైప్ చేసింది అరుణ.
“నాకు ఇష్టం లేదు. ఈమెయిల్లోనే మాట్లాడుకుందాం.”
“అలాగే. కాని, ఇక్కడ ఇప్పుడు టైమ్ అర్థరాత్రి దాటింది. రేపు మాట్లాడుదాం. గుడ్ నైట్!” లాగ్ ఆఫ్ చేసేసింది అరుణ.
ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోతూ, పక్కనే వున్న అభిషేక్ ఆమెను భయంగానూ ఆరాధన తోనూ చూశాడు.
“మనకేం తొందర? ముందు తనే ఎఫ్. బి. ఐ. ఏజెంటునని బెదిరించిన వాడు ఇంతలోనే ఓ మెట్టు దిగాడు కదా! వాలకం చూస్తే దేశీ గాడిలానే వున్నాడు. బహుశా ఎవడో గ్రాండ్‌పా గాడు. ఏమీ కంగారక్కర్లే!” ఆవులిస్తూ అన్నది అరుణ.
“మరి వాడు ఎఫ్. బి. ఐ. కి రిపోర్ట్ చేస్తే?”
“వీడా? ఎఫ్. బి. ఐ. కా? కనీసం ఎనానిమస్ గా ఈమెయిల్ పంపాలన్న ఆలోచన కూడా రానివాడు ఎఫ్. బి. ఐ. కి మనమీద రిపోర్ట్ ఇస్తాడా? వాడి ఈమెయిల్ అడ్రస్ చూడు sank1953@yahoo.com ! ఏదో శంకర్ అయుంటాడు 1953 వాడి పుట్టిన సంవత్సరం. అది సెంటిమెంటో లేకపోతే తన ఈమెయిల్ అడ్రస్ తనకే గుర్తుండదని నమ్మకమో! ఇంక పడుకుందాం పద”
“ఇవన్నీ కరక్ట్ కాకపోతే?” అని అడగబోయి, దాన్ని ఆవులింతగా తర్జుమా చేశాడు అభిషేక్.
ఆపాటి తెలివుందతనికి.
శంకర్ రెడ్డికి ఒళ్ళు మండిపోయింది.
పళ్ళు పటపట లాడించాడు.
సీరియస్ గా కూర్చుని ఒక డాక్యుమెంట్ తయారుచేశాడు. దాని సారాంశం ఇది
కనీసం పదిమంది ఈబే ద్వారా ఫ్రాడ్ సాగిస్తున్నారు. వాళ్ళు వాడుతున్నది చాలా సింపుల్ టెక్నిక్. కాని, చాలామంది కలిసి చేస్తున్నందువల్ల ఆటోమేటిక్ ప్రోగ్రాములకు పట్టుబడేది కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్కొకరు ఒక రకమైన వస్తువుల్ని ఈబేలో ఆక్షన్‌కి పెడతారు. ఒకోసారి ప్రతిరోజూ చేస్తారు, ఒక్కోసారి రెండు మూడు రోజులకొకసారి. ఏమైనా ఈ వస్తువులు చాలా కొద్దిమందికి ఇంటరెస్ట్ ఉండేవి. పైగా ఎవరన్నా ఈ గ్రూప్‌కి బయటవాళ్ళు పొరపాటున కొనెయ్యకుండా రిజర్వ్‌లు చాలా ఎక్కువగా పెడతారు. ఆక్షన్ ఐపోయే టైమ్‌కి కొద్ది నిమిషాల ముందుగా ఆ గ్రూప్‌లో వాడు ఒకడు బిడ్ చేస్తాడు. ఆ బిడ్ రిజర్వ్ కన్నా పైగా వుంటుంది. అంతలో ఇంకెవ్వరూ బిడ్ చెయ్యరు కనుక అది వాడికే వస్తుంది. ఠంచనుగా వాడు వెంటనే ఆ వస్తువు ఖరీదు పేపాల్ ద్వారా చెల్లించేస్తాడు. ఐతే, వస్తువు మార్పిడీ ఏమీ జరగదు.
దీనివల్ల, ఒకడి క్రెడిట్ కార్డ్ నుంచి మరొకడికి డబ్బు వెళ్తుంది. రెండో వాడు, అంటే ఆ వస్తువుని అమ్మినవాడు వెంటనే కేష్ చేసుకోగలడన్న మాట! మరో విధంగా చెప్పాలంటే, ఒకడి క్రెడిట్ కార్డ్ నుంచి రెండో వాడు వెంటనే కేష్ డ్రా చేసుకోగలుగుతున్నాడు ఏ మాత్రం ఇంటరెస్ట్ గాని, ఎలాటి ఫీజ్ కాని లేకుండా! ఐతే, ఇదే సమయంలో మొదటి వాడు అమ్మే వస్తువుకి రెండోవాడు బిడ్ చేసి కొంటాడు గనక వాడి క్రెడిట్ కార్డ్ నుంచి మొదటి వాడికి కూడ కేష్ వస్తుంది. అలా, ఇద్దరికీ కేష్ చేతికొస్తుంది వీడికి వాడి క్రెడిట్ కార్డ్ నుంచి, వాడికి వీడి క్రెడిట్ కార్డ్ నుంచి. వ్యవహారం ఇంతటితో ఐపోతే పెద్దగా పట్టించుకోనక్కర లేదు. అది క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ కిందికి వస్తుంది గాని, పాపం కేష్ ఎడ్వాన్స్‌లకి బోలెడు ఇంటరెస్ట్ ఛార్జ్ చేస్తారు కనుక దాన్ని తప్పించుకోవటానికి ఇలా చేస్తున్నారు, పోన్లే అని సర్దుకుపోవచ్చు.
కాని, అసలు కథ అక్కడే ప్రారంభమౌతుంది! వీళ్ళందరికీ ఒక నాయకుడున్నాడు. వాడు మహా జోరుగా వస్తువులు కొనేస్తున్నాడు. అంటే తన క్రెడిట్ కార్డుల మీద బోలెడంత ఛార్జ్ చేస్తున్నాడన్న మాట! అంటే, వాడి క్రెడిట్ కార్డ్ లకు అప్పుల వసతులు చాలా ఎత్తుగా వుండివుంటాయి. ఓ పది కార్డులున్నాయని, ఒకో దాని మీద వాడు పాతికవేలు అప్పు తీసుకోవచ్చని అనుకుంటే, మొత్తం రెండొందల యాభై వేలు. ఆ క్రెడిట్ కార్డుల మీద కేవలం ఏ నెల కా నెల మినిమమ్ కడుతూవుంటే, ఆ కార్డుల వాళ్ళూ ఆనందంగా వుంటారు, వాడూ బ్రహ్మాండంగా బతకొచ్చు ఎలాగూ తను అప్పు చేసిందంతా తన దగ్గర కేష్ రూపంలోనే వుంది కదా! కాబట్టి, వాడి దగ్గర తేలిగ్గా రెండొందల వేలన్నా కేష్ వుండి వుండాలి.
ఇలా కొంత కాలం సాగించి ఎప్పుడో వాడు ఆ డబ్బంతా పుచ్చుకుని దేశం వొదిలి ఉడాయిస్తాడు! కార్డ్ కంపెనీలకు బొక్క పడుతుంది.
ఇది క్రెడిట్ కార్డ్ ఫ్రాడే కాదు, మెయిల్ ఫ్రాడ్, పిరమిడ్ స్కీమ్ ఫ్రాడ్, క్రెడిట్ కార్డ్ కంపెనీల్ని డిఫ్రాడ్ చెయ్యాలన్న తెలివైన ప్రోసెక్యూటర్ ఇంకా ఎన్నో రకాల క్రిమినల్ కేసుల్ని అవలీలగా తయారుచెయ్యగలడు దీన్నుంచి.
వాడెవడో చాలా ఘటికుడు. సందేహం లేదు. మరి అలాటి వాడి దగ్గర్నుంచి వాడు కొట్టేసిన దాన్లో సగమన్నా సంపాయించటం ఎలా?
తను సరిగ్గా పథకం ఆలోచించకుండా తొందరపడి బయటపడ్డానేమో నని శంకర్‌కి అనుమానం వచ్చింది.
దీర్ఘంగా ఆలోచిస్తూ కిందికి దిగాడు.
సుమతి ఏదో అంటోంది కాని అతనికి ఏమీ వినపడటం లేదు.
సరిగ్గా అప్పుడే, ఏజెంట్ జాక్సన్ శంకర్ పంపిన మెసేజ్‌ని చూశాడు.
ప్రొఫైల్ చెకర్ ని దాని మీద ప్రయోగించాడు.
అది ఆ ఈమెయిల్‌లో వున్న అందరి ఈమెయిల్ అడ్రస్ లనీ రకరకాల డేటాబేస్‌లతో పోల్చి చూస్తుంది.
ముందుగా టెర్రరిస్ట్‌లు, తర్వాత నేరస్తులు, ఆ తర్వాత ఇంటర్నెట్ చాట్ గ్రూపుల్లో అదివరకు ఏ కారణాల వల్లనైనా ఫ్లాగ్ ఐనవాళ్ళు.
అభిషేక్ అంత తెలివైన వాడు కాడు.
కాని, చాలామంది అలాటి వాళ్ళలా కాకుండా, ఆ విషయం అతనికి తెలుసు.
ఆ రాత్రి అతనికి అర్థమై పోయింది ఇన్నాళ్ళుగా వాళ్ళు ఆడిన ఆట కట్టబోతున్నదని. ఐతే అతనికి అర్థం కానిది దీనికి అంతం ఎలా జరుగుతుందనే విషయం.
ఇప్పుడు హఠాత్తుగా ఆపెయ్యటానికి అరుణ ఒప్పుకుంటుందా అన్నది మొదటి ప్రశ్న.
తాము జాగ్రత్తగా జరుపుతున్న వ్యవహారాన్ని ఎవడో కనుక్కున్నాడంటే, వాడు కూడ సామాన్యుడు కాడు. ఐతే వాణ్ణెలా వదిలించుకోవాలో తెలియటం లేదు.
ఇకపోతే ఈ క్రైమ్ లో పార్ట్‌నర్స్ పరిస్థితి ఏమిటి? వాళ్ళు ఎవరికైనా దీన్ని గురించి చెప్తారా?
మర్నాడు ఉదయాన మామూలుగా ఆఫీసుకు వెళ్తున్నట్లు బయల్దేరి హడావుడిగా తన బాంక్‌లన్నిటికీ వెళ్ళాడతను.
ఏయే ఎకౌంట్లలో ఎంత బేలెన్స్ ఉన్నదో చూసుకున్నాడు.
ఒక్కో బాంక్‌లో ఉన్న అనేక ఎకౌంట్లని కలిపి ఒక కొత్త ఎకౌంట్‌లోకి బేలెన్స్‌లన్నీ ట్రాన్స్‌ఫర్ చేశాడు.
మొత్తం కలిసి 220,003 డాలర్ల కేష్ వుంది.
ఇంత మొత్తాన్ని ఒక్కసారిగా ఇండియాకి తరలించటం ఎలా?
ఆలోచిస్తూ తన ఆఫీసుకు చేరుకున్నాడు.
ఆ రోజు రాత్రికి ఇండియాకి బిజినెస్ క్లాస్‌లో తనకోసం ఒక టికెట్ బుక్ చేశాడు.
అరుణ తన కంప్యూటర్‌ని ఆన్ చేసేసరికి బాంక్‌లన్నిటి నుంచి ఈమెయిల్ ఎలర్ట్‌స్ వచ్చి వున్నాయి.
ఏం జరిగిందో వెంటనే అర్థమయ్యింది ఆమెకి.
టక్కున తన క్రెడిట్ కార్డ్ కంఫెనీలకు ఫోన్ చేసింది. ఒక క్రెడిట్ కార్డ్‌తో 3230 డాలర్ల ఎయిర్‌టికెట్ కొన్నట్టు తెలుసుకుంది.
ఆ రోజు ఉదయమే ఎవరో తన పర్స్ కొట్టేశారనీ, క్రెడిట్ కార్డ్‌లన్నీ పోయాయనీ చెప్పి, ఆ ట్రేన్సాక్షన్‌ని వెంటనే కేన్సిల్ చెయ్యమని వాళ్ళని అడిగింది. క్రెడిట్ కార్డ్ లన్నీ కేన్సిల్ చేయించి కొత్త కార్డుల్ని పంపమని కోరింది.
శంకర్ రెడ్డి నిద్రలేని రాత్రి తర్వాత లేచి ఆఫీసుకు వెళ్ళాడు.
ఆలోచించే కొద్ది తన బ్లాక్ మెయిల్ పథకం ద్వారా డబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ లేనట్టు గ్రహించాడతను.
లంచ్ టైమ్‌లో దగ్గర్లో ఉన్న కింకోస్‌కి వెళ్ళి ఓ కొత్త యాహూ ఎకౌంట్ ఓపెన్ చేసి దానిద్వారా ఎఫ్. బి. ఐ. కి తను కనుక్కున్న విషయాలన్నీ వివరిస్తూ ఓ ఈ మెయిల్ పంపించాడు.
నాలుగు నిమిషాల్లో ఆ ఈ మెయిల్ ఏజెంట్ జాక్సన్‌కి ఫార్వర్డ్ చెయ్యబడింది.
తను చెయ్యవలసిన పన్లన్నీ చేశాక అభిషేక్‌కి ఫోన్ చేసింది అరుణ. అతను దొరకలేదు.
వెంటనే ఇంటికి బయల్దేరింది.
ఆమె వెళ్ళేసరికి ఓ సూట్‌కేస్ హడావుడిగా సర్దుకుంటున్నాడు అభిషేక్.
ఆమెను చూట్టంతోటే కంగారు పడి ఏం చెయ్యాలో తోచక బిత్తరచూపులు చూట్టం మొదలెట్టాడు.
“ఏం చేస్తున్నావ్?” తీక్షణంగా అడిగిందామె.
“మా నాయనమ్మకి చాలా ప్రమాదంగా వుందని ఇండియా నుంచి ఫోనొస్తే అర్జంటుగా వెళ్ళబోతున్నా” ధైర్యం చిక్కబట్టుకుంటూ బింకంగానే అబద్ధం ఆడాడు.
చుట్టూ జాగ్రత్తగా గమనిస్తున్న అరుణకి ఓ కొత్త బేగ్ కనిపించింది ఆ దగ్గర్లో.
దాన్ని తీసుకోబోయిందామె.
ఒక్కసారిగా గెంతి దాన్ని లాక్కున్నాడతను.
తాపీగా తన పర్స్‌లోంచి ఓ గన్‌ని బయటకు తీసింది.
అతనికి గురిపెడుతూ నిశ్చయంగా అన్నదామె “నువ్విప్పుడు ఆ బేగ్‌లో ఏముందో నాకు చూపించకపోతే ఏమాత్రం వెనకాడకుండా షూట్ చేస్తాను. ఐదు సెకండ్లలో బతుకుతావో చస్తావో ఆలోచించుకో!”
“నన్ను షూట్ చేస్తే నువ్వు జైలు కెళ్తావ్” బెదిరించినట్టు అన్నాడతను.
“నువ్వు చచ్చాక ఏం చెయ్యాలో నేను చూసుకుంటానులే! నీ సంగతి నువ్వు తేల్చుకో ముందు!”
ఆలోచించుకోవలసిన అవసరం లేకపోయిందతనికి.
బేగ్ ఆమె చేతికిచ్చాడు.
డబ్బుతో నిండి వుంది బేగ్. దాన్ని చూసి ఫక్కున నవ్విందామె.
“స్టుపిడ్! ఇంత డబ్బు తీసుకుని వెళ్తే ఇక్కడి ఎయిర్‌పోర్ట్‌లోనే నిన్ను పట్టుకుని బొక్కలో తోస్తారు! ఈ పాటి దూరం
ఆలోచించలేని వాడివి నన్ను మోసం చేద్దామనుకున్నావా?”
“మరీ అంత వెధవని కాదు నేను. అంత డబ్బు తీసుకెళ్ళటం లేదు. నా ఫ్రెండ్ కుమార్‌కి ఇచ్చి పదేసి వేల చొప్పున నాకు ఇండియాకి పంపించమని అడగబోతున్నా” అప్రయత్నంగా, ఉక్రోషంగా అన్నాడు.
“ఆహా! ఫరవాలేదు. ఈ మధ్య కొంచెం బుర్ర పెంచినట్టున్నావ్. నీకింక ఆ బాధ ఉండదులే. ఈ డబ్బు సంగతి నేను చూసుకుంటాను. నువ్వింక హాయిగా ఇండియా వెళ్ళొచ్చు”
“అంటే డబ్బంతా నువ్వు తీసుకుంటావా?”
“మరీ నీ అంత ఆశపోతుని కాదులే నేను. సగం నేను తీసుకుని సగం నీకు పంపుతాను”
“మరి ఈ లోగా ఖర్చులకి కాస్తన్నా ఇవ్వవా?” చిన్న పిల్లాడిలా తయారౌతున్నా డతను.
“సర్లే. ఇదుగో ఐదు వేలు. అంతకన్నా ఎక్కువ తీసుకెళ్తే దార్లో ఎక్కడో పట్టుబడతావ్” అంటూ ఐదు వేలిచ్చిందతనికి.
బేగ్ తీసుకుని వెళ్ళిపోయాడతను.
కొద్ది సేపట్లో కిచెన్‌లో మెల్లగా మంట రాజుకుంది. చూస్తుండగానే ఇంట్లోంచి పొగలు రాసాగేయి.
ఫైర్ ఇంజన్లు వచ్చేసరికి ఇల్లు చాలా భాగం కాలిపోయింది.
అప్పటికే అరుణ న్యూస్‌పేపర్లో చూసి ఓ వ్యక్తి దగ్గర్నుంచి యూజ్‌డ్ కార్ కొని తన కార్‌ని ఎయిర్‌పోర్ట్ పార్కింగ్ లాట్‌లో వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయింది.
ఎయిర్‌పోర్ట్‌లో చెక్‌ఇన్ చెయ్యటానికి లైన్లో నిలబడ్డాడు అభిషేక్.
అతని వంతు వచ్చింది.
తన టికెట్ కేన్సిల్ అయిందని చెప్తూ ఎవరికో సైగ చేసింది కౌంటర్లో ఉన్న వ్యక్తి.
అతను ఆశ్చర్యంలోంచి తేరుకునే లోగానే ఏజెంట్ జాక్సన్ అధ్వర్యంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చెయ్యటం, పోలీస్ కార్లో ఎక్కించుకుని వెళ్ళటం జరిగిపోయాయి.
ఫ్రాడ్ పథకం లో తను నిమిత్తమాత్రుణ్ణనీ, అంతా చేసింది అరుణేననీ అతను ఎంత మొత్తుకున్నా ఎవరూ అతని మాటలు నమ్మలేదు.
అతను ఇంట్లోంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే ఇల్లంతా కాలిపోవటం కూడ ఇదంతా అతని పనేనని వాళ్ళు నమ్మేట్టు చేసింది.
ఆ పథకంలో భాగస్వాములైన మిగిలిన వాళ్ళ గురించి అతను చెప్పాడు కాని వాళ్ళందరూ అభిషేక్ చెప్పినట్టు చేశామే కాని మాకేమీ తెలియదన్నారు.
పదేళ్ళ జైలు శిక్ష పడిందతనికి.
మిగిలిన వాళ్ళందరూ తలా యాభై వేల ఫైన్లు కట్టుకుని బయటపడ్డారు.
అరుణ జాడ ఎవరికీ తెలియలేదు అలాగని, ఎవరో పనికట్టుకుని ఆమె కోసం వెదికారని కాదు. ఆమె పాత్ర పూర్తిగా తెలిసిన వాడు ఎలాగూ కన్విక్టెడ్ ఫెలన్ కనుక అతని మాటలు ఎవరూ నమ్మరు.
మిగిలిన వాళ్ళెవరికీ ఆమె చేసిందేమిటో ఎలాగూ తెలీదు!
శంకర్ రెడ్డి కి ఇవేవీ తెలియవు. ఇప్పటికీ ఎలా చేసివుంటే తను కొంత సంపాయించుకుని వుండేవాడో కొత్త కొత్త ఆలోచనలు చేస్తూనే వున్నాడతను.