పరిచయము
సీసము అనే పదము శీర్షకమునుండి జనించినది. శీర్షకమును శీర్షము అని కూడ అంటారు. ఈ శీర్షక, శీర్ష పదములు సీసకము, సీసములుగా మారినవి తెలుగులో. సీసపద్యమునందలి సీసమునకు లోహవిశేషమైన సీసమునకు ఏ సంబంధము లేదు. శీర్షకము అనే ఛందస్సును మనము నాట్యశాస్త్రములోని ధ్రువా ప్రకరణములో (32వ అధ్యాయము) చదువవచ్చును. దీని ప్రకారము ఎనిమిది వృత్తములలో ఏదైన ఒకదానిని, లేక ఒకటికంటే ఎక్కువ వృత్తములను వ్రాసి చివర ఒక గీతిని రచించినప్పుడు అది శీర్షకము అనబడును. జనాశ్రయిలో ‘శీర్షకం గీతికాపరా’ అని చెప్పబడినది. సంస్కృత శీర్షకమునకు తెలుగులోని సీసమునకు లక్షణములు ఒకటి కాకపోయినా, సీసరచనయందలి ప్రణాళిక ఒక్కటే. మొదట ఒక పద్యమును వ్రాసి పిదప ఒక గీతిని వ్రాయుటయే ఈ సీసపద్యపు అమరిక. శాసనములలో సీస పద్యము ఆఱవ శతాబ్దము నాటికే గోచరించాయి. నా ఉద్దేశములో దేశి ఛందస్సులో ఇది ఒక గొప్ప సంఘటన. ఎందుకంటే దేశి ఛందస్సునకు మూలాధారములైన సూర్యేంద్రచంద్ర గణములు ఆఱవ శతాబ్దము నాటికే ప్రత్యేకమైన స్థానమును సంపాదించుకొన్నవి. అంతే కాక కన్నడ ఛందస్సులోని బ్రహ్మవిష్ణురుద్ర గణములలోని అన్ని గణములను అంగీకరించకుండడము కూడ గమనార్హము. కన్నడభాషలో పద్యశాసనములు తఱువాతి కాలమునాటివిగా ఉండడము కూడ ఒక విశేషమే. ఇక్కడ వచ్చిన చిక్కంతా మనకు నాడు వ్రాయబడిన లక్షణగ్రంథములేవి కూడ దొఱకక పోవడము. రేచన కవిజనాశ్రయము సుమారు ఐదాఱు శతాబ్దాల పిదప వ్రాయబడినది.
తెలుగులో సీసపద్యపు లక్షణములు
- ప్రతి పాదములో ఆఱు ఇంద్ర గణములు, రెండు సూర్య గణములు ఉంటాయి.
- ఈ సీస పాదము రెండు అర్ధ భాగములుగా విభజింపబడుతుంది. ప్రథమార్ధములో నాలుగు ఇంద్ర గణములు, ద్వితీయార్ధములో రెండు ఇంద్ర గణములు, రెండు సూర్య గణములు ఉంటాయి.
- ఈ రెండు అర్ధ భాగములు స్వతంత్రముగా వర్తిస్తాయి. వాటి మధ్య ప్రాసలు, యతులు ఐచ్ఛికము, కాని నియతము కాదు.
- రెండు అర్ధ పాదములలో మొదటి గణమునకు, మూడవ గణమునకు యతి చెల్లుతుంది. ఈ యతి అక్షరసామ్య యతిగా లేక ప్రాసయతిగా నుండవచ్చును.
- సీసపద్యము తఱువాత వ్రాసిన గీతిని ఎత్తుగీతి అంటారు. ఇది ఒక ఆటవెలఁది లేక తేటగీతి.
- నిజముగా ఈ ఎత్తుగీతి మొత్తము పద్యమునకు తలమానికమువంటిది, అనగా సీసపద్యములోని నిజమైన సీసము ఈ గీతియే. కొన్ని భావములను సీసపద్యములో వర్ణించి, వాటి సారాంశమును ఈ గీతిలో చెప్పుతారు. సీసపద్య శతకములలోని మకుటము కూడ ఇట్టిదే.
సీసపద్యపు నడక
సూర్య గణములు రెండు, అవి: UI, III (U – గురువు, I – లఘువు). ఇంద్ర గణములు ఆఱు: అవి – UII, IIII, IIIU, IIUI, UIU, UUI. ఇందులో మొదటి రెండు చతుర్మాత్రలు, మిగిలిన నాలుగు పంచమాత్రలు. సీస పద్యపు నడక ఇందులో ఏ గణములు ఉపయోగించబడినవి అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. సామాన్యముగా సీస పద్యమును పంచమాత్రల ఖండగతిలో నడుపుతారు. పూర్తిగా భ, నల గణములను ఉపయోగించి చతుర్మాత్రల సీసమును కూడ నిర్మించ వీలగును. రెంటిని ఉపయోగించి కూడ వ్రాస్తారు. ఈ రెండు మాత్రమే కాక సీస పద్యమును త్ర్యస్ర, మిశ్ర గతులలో కూడ వ్రాయ వీలగును. రెండు సూర్య గణములను మూడు సూర్య గణములుగా అమర్చినప్పుడు త్ర్యస్రగతి సాధ్యము. అది ఎట్లనగా IIII IIUI, IIIU IIII, UII IIUI, UIU IIII అమరికలలో మూడు సూర్య గణములు పక్కపక్కన ఉన్నాయి. మూడు, నాలుగు మాత్రల మిశ్రగతి కూడ సాధ్యము. కాని ఈ త్ర్యస్ర, మిశ్రగతులు సీసపద్యపు ప్రసిద్ధమైన ఖండగతిని మఱపించదు.
విషమసీసము
సీసపద్యములో యతుల, ప్రాసల అమరికను వివరిస్తూ ఎన్నో భేదములు ఉన్నాయి. వాటిని గిడుగు రామమూర్తి పంతులు, గిడుగు సీతాపతి వివరించియున్నారు. ఈ వ్యాసపు ముఖ్యోద్దేశము విషమ సీసపు వివరణ, కావున ఈ భేదములను గుఱించిన చర్చకు ఇది అనువైన స్థలము కాదు. సీసములో త్ర్యస్రగతి సాధ్యమని పైన చెప్పినాను. ఇది తప్పక లాక్షణికులకు కూడ తెలిసి ఉండాలి. త్ర్యస్రగతిలో సాగే జాతి పద్యము ఉత్సాహము (ఏడు సూర్య గణములు, ఒక గురువు). ఉత్సాహతో ఎందుకు సీసములాటి పద్యమును కల్పించరాదు అనే ఆలోచన వారికి కలిగి ఉంటుంది. దాని ఫలితమే ఉత్సాహవృత్తమును వ్రాసి, దానికి ఒక ఎత్తుగీతిని తగిలించడము. సామాన్య సీసపద్యముగా భావించరాదని దీనికి ‘విషమ’ సీసము అని పేరును ఉంచినారు. క్రింద కొందఱు లాక్షణికులు ఈ విషమ సీసమును వివరించిన విధములను తెలుపుతాను.
1. కావ్యాలంకార చూడామణి (విన్నకోట పెద్దన – క్రీ.శ. 1402-07)
తే. హగణనగణంబు లేడు గు-ర్వంతమగుచు
విస్తరిల్లిన నుత్సాహ – వృత్తమయ్యె
దీనితుద గీతియొకఁడు సం-ధింప విషమ
సీస మిత్తెఱఁ గెఱుఁగుట – చెలువు మతికి
ఉత్సా. ఓసరించుఁ బజ్జ లజ్జ – లుజ్జగించు రాజులన్
వేసరించు గర్వ పర్వ – వేష బూషితారులన్
వాసవానుకారి వీర-వర్య విశ్వభూప నీ
భాసురాసి ధేనుకాను-భావ మాహవంబులన్
ఆ. వడి దనర్పఁ బ్రాస-వైభవం బలరార
నిట్ల గణనిరూఢి – నెసక మెసఁగఁ
గీర్తితాతిమధుర-గీతియుఁ బైగల్గ
నదియు విషమసీస – మండ్రు కృతుల (8.32 – 8.34)
2. అనంతుని ఛందోదర్పణము (క్రీ.శ. 1435)
ఉత్సా. సాహచర్య మమర సప్త – సవితృ వర్గమును సము-
త్సాహ మెక్క నొక్క గురుఁడు – చరణములు భజింపఁగా
నీహితప్రదానలీల – లెసఁగు కమఠమూర్తి ను-
త్సాహరీతు లుల్లసిల్ల – సంస్తుతింతు రచ్యుతున్
ఆ. ప్రాసములును వడులు – భాసురంబుగ నిట్లు
విలసితముగ నాట-వెలఁదియందు
నుత్సుకత నొనర్చి – యుత్సాహ మది నిల్ప
విషమసీస మమరు – విషధిశయన (3.34, 35)
3. చిత్రకవి పెద్దన లక్షణసారసంగ్రహము (క్రీ.శ. 1550)
ఉత్సా. గ్రాహవైరి యిర్వురినులు – గలసియైన వేఱుగా
నీహఁ గూర్చి యైన గణము – లేడు చేసి గుర్వుతో
నాహితోక్తి నాల్గు గణము-లైన యతులు గూర్ప ను-
త్సాహ యయ్యె విషమసీస – సంజ్ఞ నిది వహింపఁగాన్
ఆ. దీన నాటవెలఁది – దీకొనఁ గొన నుంచి
యిటులు ప్రాలు వళ్ళు – నెసఁగఁ జేయ
విషమసీస మనఁగ – వెలయుఁ గావ్యంబుల
నార్యచర్యగేయ – యాంజనేయ (2- సీసప్రకరణము, 8)
4. అప్పకవీయము (సుమారు క్రీ.శ. 1656)
ఉత్సా. అంచితముగ భీమునకు స-హాయ మేగుదెంచి తా
నించు కెదిరి దురము సేయు – నేయు నంకుశంబు తాఁ-
కించుకొనక కినుకవలనఁ – గెరలి నరకపుత్త్రు మ-
ర్దించినట్టి సవ్యసాచి – తేరి ఘోటకావలిం
ఆ. దోలు కృష్ణ యంచుఁ – దోరంపు టుత్సాహ
మీఁద గీత మొకఁడు – మేలవింప
విషమసీస మనఁగ – వెలయుఁ గామెపలీశ
జమ్మిచెంత నున్న – చతురవచన (4.323)
5. పొత్తపి వేంకటరమణకవి లక్షణశిరోమణి (క్రీ.శ. 17-18)
ఉత్సా. శ్రీహరీ రమాంక హనలుఁ – జెల్లు నేళు నొగ గురున్
మోహనాంగ పదపదమున – ముదముతో నిరంతరో-
త్సాహ విరతి నాలుగింటఁ – జనునిడంగఁ దనరు ను-
త్సాహమనఁగ రుక్మిణీశ – చక్రపాణి పాహి గో-
ఆ. పాలబాల శౌరి – ప్రౌఢకవుల్ దుదం
దాటవెలఁది గీత – మమర నిలుప
నుర్వియందుఁ గృతుల – నుత్సాహవేదండ
విషమసీసమనఁగ – వెలయుఁ గృష్ణ (3.329)
పైన ఉదాహరించిన పద్యములన్నిటిలో ఉత్సాహములో యాదృచ్ఛికముగా తప్ప సీసములా ఇంద్రగణములు లేవు. అన్నింటికి ఆటవెలఁదిని గీతిగా ఉపయోగించినారు. అనంతుడు, విన్నకోట పెద్దన, రమణకవి స్పష్టముగా ఆటవెలఁది ఎత్తుగీతిగా ఉండాలని చెప్పినారు. ఆటవెలఁదిలో కూడ ఇంద్రగణములలో త్ర్యస్రగతి లేదు. మొదటి మూడింటిలో ఉత్సాహమునకు, ఆటవెలఁదికి శబ్దాన్వయము లేదు. అవి స్వతంత్రముగా నిలిచి ఉన్నాయి. అప్పకవి లక్షణ-లక్ష్య పద్యములో ఉత్సాహమునకు గీతికి శబ్దాన్వయము ఉన్నది (ఆవలిన్ దోలు). అదే విధముగా రమణకవి కూడ తన ఉదాహరణములో ఇట్టి అన్వయమును సూచించినాడు (గో-పాల). అనగా అప్పకవి, రమణకవి దృష్టిలో ఉత్సాహము, గీతి వీటిని ఒకే పద్యముగా చదువవలయును. రమణకవి దీనిని ఉత్సాహవేదండ విషమసీసము అని చెప్పినాడు. ఈ వేదండ (ఏనుగు) పదము ఎందులకు వాడబడినదో తెలియదు. కృతులలో దీనిని విషమ సీసము అంటారు అనిన విన్నకోట పెద్దన అలాటి ఉదాహరణములను చూచి దీనిని వివరించినాడా అన్నది పరిశీలించవలసిన విషయము.
ఉదాహరణములు
శ్రీమదాంధ్రభారతములోని ఆటవెలఁది లేక తేటగీతి ఉన్న ఉత్సాహవృత్తములు క్రింద ఇవ్వబడినవి. నన్నయ భారతములో అట్టివి లేవు. తిక్కన భారతములో స్త్రీ పర్వములో నాలుగు ఉన్నాయి, ఎఱ్ఱన భారతములో ఒకటి ఉన్నది. తిక్కన భారతములో అన్ని గీతులు తేటగీతులు. ఎఱ్ఱన భారతములో అది ఆటవెలఁది. తిక్కన భారతములో అన్ని ఉత్సాహములు, గీతులు స్వతంత్రముగా నిలబడినట్లు ఉన్నాయి, వాటిని ఒక్కటిగా చదువవలయునా అక్కరలేదా అన్నది తెలియదు. కాని ఎఱ్ఱన భారతములో భావాన్వయముతో నున్నది. ఎఱ్ఱన వ్రాసినది విషమసీసమా? దీనిని ఇంతవఱకు ఎవ్వరు గమనించలేదా? ఎఱ్ఱన రచనాకాలము బహుశా క్రీ.శ. 1325-50 మధ్య కాలము. కావ్యాలంకారచూడామణి కర్త (సుమారు క్రీ.శ. 1405) ఈ ఎఱ్ఱాప్రగడ పద్యమును చూచి విషమసీసపు లక్షణములను పేర్కొన్నాడా? ఈ విషయములో పాటిబండ మాధవరాయశర్మ విషమ సీసమును ప్రస్తావించినను, భారతములో అట్టిది ఉన్నదని చెప్పలేదు. విజ్ఞులు ఈ విషయమును పరిశీలించవలయును.
ఉత్సా. వినుము నారదుండు దీని – వినఁగఁ జెప్పె ధర్శనం
దనున కతని మనము కరుణ – దవిలి యున్కి హింసకున్
గొనకొనంగఁ జొరమి నతఁడు – కురుకులంబుతోడ పొం-
దునక వడఁడె జగము మెచ్చఁ – దొడఁగి పెక్కు భంగులన్
తే. ఏను నతనికిఁ జెప్పితిన్ – గాన నాతఁ
డధిక యత్నంబు సేసెఁ దా-నంత వడియు
వైర మెమ్మెయి మాన్పంగ-నేరఁ డయ్యె
నియతిఁ దప్పింప నేరికి – నేర నగునె (తిక్కన భారతము, స్త్రీ 1.85, 86)
ఉత్సా. వాఁడి మగఁడు నిద్రపోవు – వాలుమృగముఁ బోలెనై
వీఁడె బాహ్లికుండు వృష్టి-వీర చూడు చచ్చియుం
బోఁడి దొఱఁగ కున్న యట్టి – పొల్పునన్ వెలింగె వె-
న్నీఁ డితండు బలము లెన్ని-యేనిఁ బెల్గు ద్రోచినన్
తే. మేనఁ బ్రాణము వాసిన-మీఁద మొగము
బొఱసి యుండునె యెందు ని-త్తెఱఁగు కాంతి
తోడఁ బున్నమనాఁటి చం-దురుని చంద
మమరెఁ జూడు మిక్కురువృద్ధు – నాననంబు (తిక్కన భారతము, స్త్రీ 2.94, 95)
ఉత్సా. తనయుఁ గాచు పనికిఁ – బూని ధర్మపుత్రవాయునం-
దనులుఁ గవలుఁ జేయఁ – గలుగు దండిమగలు సేనలం
గొని వడిం గడంగ సరకు – గొనక నిల్చి యొక్కఁడుం
బెనఁగి యాఁగె సైంధవుండు – బిరుదు దక్షుడుంగదే
తే. తప్పు సైంధవుపైఁ బెట్టఁ – దగునొ తగదొ
పార్థు ప్రతినకు నొక్కండ – పాత్రమయ్యెఁ
దాన యందఱ నాఁగుట – తప్పుగాదె
యదియు సౌభద్రు మృతి హేతు – వగుట లేదె (తిక్కన భారతము, స్త్రీ 1.101, 102)
ఉత్సా. అతని నందనుఁడు సుకేతుఁ – డల్లవాఁడె ద్రోణ పా-
తితుఁడు వీనిఁ జూడఁగా మ-దిన్ సుయోధనుండుఁ ద-
త్సుతుఁడు దోఁచుచున్నవారు – శోకవహ్నితాప మూ-
ర్జితము గాఁగ బంధుజనుల – చిత్త మెంత గుందునో
తే. అల్లవారె యవంతీశు – లధికబాహు
బలులు విందానువిందులు – బహుళ భూష
ణోజ్జ్వలులు పడియున్న వా-రుగ్రవాయు
పతిత కుసుమిత నవసాల-భంగి దోఁప (తిక్కన భారతము, స్త్రీ 1.153, 154)
ఉత్సా. “వినవె రాముఁ డనఁగ నొకఁడు – విపులదర్పహృదయుఁడై
మన ఖరుండు లోనుగా స-మగ్ర శౌర్యులైన య-
ద్దనుజవరులఁ దునిమి యిపుడు – దండకస్థలంబునం
దొనర నిర్భయత్వ మొప్ప-నున్న వాఁడు మేటియై
ఆ. వానిఁ బరిభవింప – వలయు నప్పనికి సా-
హాయ్యకం బొనర్పు – మనఘ నాకు”
ననిన నధిక భయస-మావిష్ట హృదయుఁడై
యసురవైరి కిట్టు-లనియె నతఁడు (ఎఱ్ఱాప్రగడ భారతము, అరణ్య 6.318, 319)
విషమసీసము అని చెప్పక ఉత్సాహయుక్త గీతి అని పేర్కొని గణపవరపు వెంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములో ఒక పద్యమును రచించెను. అది:
ఉత్సా. అందమైన కీలుగొప్పు – లందుఁ బూలు తేనియల్
చిందనీక యుంచి నిగ్గు – చెంగళించు జాళువా
సందిదండ లుంగరాలు – సన్నబన్న సరులు హొ-
న్నందెలుం గడెంబు లచ్చ – హారముల్ తురాలు క్రొం-
తే. బసిఁడి గంటల మొలనూళ్ళు – బాహుపురులు
సరిపెణలు ముత్తియంపు ముం-గరలు తాళి
పతకములు దాల్చి పన్నీట – పదను మించు
చందన మలంది రంతట – సంతసమున (273)
పై పద్యములో ఎత్తుగీతి ఆటవెలఁది కాదు, తేటగీతి. ఈ తేటగీతిలో త్ర్యస్రగతి లేదు. కాని ఉత్సాహమునకు, గీతికి అన్వయము ఉన్నది (క్రొం-బసిఁడి). వెంకటకవి లక్షణకారుడు కూడ, కావున తేటగీతిని ఉపయోగించి రెండు గీతులలో ఏదైనను విషమ సీసమునకు సరియే అని చెప్పినట్లున్నది.
ఉత్సా. వేఁడు కాంతను బలవంత-పెట్టి యపహరించునో
వాఁడు సృష్టిధర్మ మర్మ-పథము బాహిరించెఁ బో
మూఁడు గణము లేవొ పాళ్ళు – మొనసి జగము సాగినన్
వీఁడు మాత్ర మచ్చతమము – వెట్టు రూపు, సర్వధా-
ఆ. రణకితఁడు వెలుపల – యణువును గాఁడు ప-
దార్థమైన దని-యందు నాత్మ
వీసమైనను బ్రతి-బింబించుఁ జీఁకటి
మొదటి ముద్ద వెలుఁగు – ముట్టుకోదు (విశ్వనాథ శ్రీరామాయణకల్పవృక్షము, అరణ్య, జటాయు – 254)
పై పద్యము లక్షణయుక్తముగా నున్నది. ఎత్తుగీతి ఆటవెలఁది. అందులోని ఇంద్ర గణములకు త్ర్యస్ర గతి లేదు. ఉత్సాహమునకు, గీతికి సర్వధా-రణ ద్వారా అన్వయము కుదిరినది.
సీసము-ఉత్సాహము-విషమసీసము
సీసములో ఉత్సాహభేదమును గర్భితము చేయ వీలగును. అదే విధముగా ఆటవెలఁదిని గాని, తేటగీతిని గాని త్ర్యస్రగతిలో వ్రాయ వీలగును. దీనిని నిరూపించుటకై క్రింది పద్యమును నేను వ్రాసినాను.
1) సీ. మోహనాంగ త్వరగ – ముదపు ముద్దు లొసఁగు / వేళరా ప్రియముగఁ – బ్రేమ నొలుక
దాహమయ్యెఁ గదర – దప్పి దయను దీర్ప / రమ్మురా సలిలము – నిమ్ము నీయ
వాహనంపు సడులు – పజ్జ వచ్చు ననుచు / నుంటిరా సరసపు – పంట నీవు
వాహినిగను నన్ను – వలపు వఱదలోన / ముంచుమా తరఁగల – పులక లిడఁగ
ఆ. రాయ సొబగు నిండు – రేయి రమ్య తతము
మీటనా స్వరముల – మృదువుగాను
హాయి గల్గు మనకుఁ – దీయనైన ఘడియ
పిల్చెరా వదలఁగఁ – దల్చనీకు
(తతము = వీణవంటి వాద్యము)
ఉత్సా. మోహనాంగ త్వరగ ముదపు – ముద్దు లొసఁగు వేళరా
దాహమయ్యెఁ గదర దప్పి – దయను దీర్ప రమ్మురా
వాహనంపు సడులు పజ్జ – వచ్చు ననుచు నుంటిరా
వాహినిగను నన్ను వలపు – వఱదలోన ముంచుమా
రాయ సొబగు నిండు రేయి – రమ్య తతము మీటనా
హాయి గల్గు మనకుఁ దీయ-నైన ఘడియ పిల్చెరా
విషమ సీసము
ఉత్సా. మోహనాంగ త్వరగ ముదపు – ముద్దు లొసఁగు వేళరా
దాహమయ్యెఁ గదర దప్పి – దయను దీర్ప రమ్మురా
వాహనంపు సడులు పజ్జ – వచ్చు ననుచు నుంటిరా
వాహినిగను నన్ను వలపు – వఱదలోన ముంచు మా-
ఆ. రాయ సొబగు నిండు – రేయి రమ్య తతము
మీటనా స్వరముల – మృదువుగాను
హాయి గల్గు మనకుఁ – దీయనైన ఘడియ
పిల్చెరా వదలఁగఁ – దల్చనీకు
2) సీ. తెల్లతెల్లఁగఁ బడెఁ – దెల్లతెల్లఁగఁ బడెఁ / దెల్లఁగా ధవళిమ – కెల్ల యనఁగ
మెల్లమెల్లఁగఁ బడె – మెల్లమెల్లఁగఁ బడె / మెల్లఁగా మిసిమియు – ఫుల్ల మవగ
చల్లచల్లఁగఁ బడెఁ – జల్లచల్లఁగఁ బడెఁ / జల్లఁగాఁ గళలను – జల్లి చిమ్మి
త్రుళ్ళుత్రుళ్ళుచుఁ బడెఁ – ద్రుళ్ళుత్రుళ్ళుచుఁ బడెఁ / ద్రుళ్ళె రాగిలు హృది – త్రుళ్ళి పడెనె
ఆ. జిల్లుమనెను దనువు – జల్లుజల్లు మనెడు
నుల్లముల్ హిమమణు – లెల్ల వెలుఁగ
వెల్లి విరిసె మంచు – మెల్లఁ బృథ్వి విరిసె
మల్లెలై, తొడుగఁగఁ – దెల్ల చీర
ఉత్సా. తెల్లతెల్లఁగఁ బడెఁ దెల్ల-తెల్లఁగఁ బడెఁ దెల్లఁగా
మెల్లమెల్లఁగఁ బడె మెల్ల-మెల్లఁగఁ బడె మెల్లఁగా
చల్లచల్లఁగఁ బడెఁ జల్ల-చల్లఁగఁ బడెఁ జల్లఁగాఁ
త్రుళ్ళుత్రుళ్ళుచుఁ బడెఁ ద్రుళ్ళు-త్రుళ్ళుచుఁ బడెఁ ద్రుళ్ళెరా
జిల్లుమనెను దనువు జల్లు-జల్లు మనెడు నుల్లముల్
వెల్లి విరిసె మంచు మెల్లఁ – బృథ్వి విరిసె మల్లెలై
విషమసీసము
ఉత్సా. తెల్లతెల్లఁగఁ బడెఁ దెల్ల-తెల్లఁగఁ బడెఁ దెల్లఁగా
మెల్లమెల్లఁగఁ బడె మెల్ల-మెల్లఁగఁ బడె మెల్లఁగా
చల్లచల్లఁగఁ బడెఁ జల్ల-చల్లఁగఁ బడెఁ జల్లఁగాఁ
త్రుళ్ళుత్రుళ్ళుచుఁ బడెఁ ద్రుళ్ళు-త్రుళ్ళుచుఁ బడెఁ ద్రుళ్ళె రా-
ఆ. జిల్లుమనెను దనువు – జల్లుజల్లు మనెడు
నుల్లముల్ హిమమణు – లెల్ల వెలుఁగ
వెల్లి విరిసె మంచు – మెల్లఁ బృథ్వి విరిసె
మల్లెలై, తొడుగఁగఁ – దెల్ల చీర
3) సీసమువలె గణముల విఱుపుతో అర్ధ పాదములతో ఉత్సాహము, త్ర్యస్రగతిలో ఆటవెలఁది:
ఉత్సా.చిలిపిగాను – గలిపి మెక్కెఁ / జిన్నవాఁడు – మన్నుఁ దాఁ
దలియు నడుగఁ – దలఁ గదల్చెఁ / దప్పిదమ్ము – నొప్పకన్
చెలువుఁ డపుడు – చిత్రముగను / జిఱుత వాయిఁ – దెఱువఁగాఁ
గలయొ నిజమొ – కల్ల యేమొ / కాననయ్యె – వాని స-
ఆ. ద్గళమునందు సర్వ – జలధులన్, గ్రహముల
వలయములను, వెలుఁగు – నిలయములను,
మలల యంచులందు – మంచులన్, సృజనల,
విలయములను, భ్రమల – నిలిచె మాత!
ఇందులో ఉత్సాహపు రెండు అర్ధాలలో సీసపు అర్ధపాదాలవలె యతి ప్రాసలు ఉన్నాయి. రెండు అర్ధపాదాలకు అక్షరసామ్య యతి ఉత్సాహవలె ఉన్నది. ఉత్సాహకు సరిపోవునట్లు ప్రాస ఉన్నది. ఉత్సాహయందలి త్ర్యస్రగతి ననుసరించి ఆటవెలదిని కూడ త్ర్యస్రగతిలో నడిపినాను.
ఉత్సాహవృత్తముతో మాత్రమే విషమసీసము సాధ్యమా?
శీర్షకపు, విషమసీసపు లక్షణములను మళ్ళీ పరిశీలిద్దామా? ఒక జాతి పద్యమో లేక వృత్తమో మొట్టమొదట ఉండాలి. ఈ వృత్తము యతిప్రాసలతో ఉండాలి. తఱువాత ఒక గీతిని రచించాలి. ప్రాసయుక్త వృత్తము సీసభేదమైన వృత్తప్రాసము వంటిది. ఎటువంటి జాతి పద్యములను గాని వృత్తములను గాని మనము ఈ ఉద్యమమునకు గ్రహించాలి? నా ఉద్దేశములో సీసమునకు కొద్దిగా సంబంధము ఉన్న పద్యములను మాత్రమే స్వీకరించాలి దీనికి. వృత్తములలో అట్టివి మత్తేభవిక్రీడితము, మత్తకోకిల, శారద, అంబురుహము, మానిని, కవిరాజవిరాజితము, సాధ్వి, లాక్షణి, మున్నగునవి. జాతులలో తరువోజ, మహాక్కర, షట్పదలు. నేను పేర్కొన్న వృత్తము లన్నియు సీసపద్యములో గర్భితము చేయ వీలగును. అనగా వీటిని మొత్తముగా లేక సీసపద్యపు భాగముగా గర్భితము చేయవచ్చును.
మత్తేభవిక్రీడిత విషమసీసము
సీ. ప్రవిమలాంశమ్ముల – భాసిలెన్ గనఁగ నా / విశ్వప్సుఁ డందా ది-విన్ వెలుఁగుల
సుశమనమ్మందెను – సొంపు నిండె నెదలో / సానంద దీపమ్ము-లై మెఱయుచు
సదమలమ్మయ్యెను – శర్వరిన్ జగతి స/ర్వామోదమై శుభ్ర-మై నిలిచెను
ప్రియమునన్ జేరుము – ప్రేమతో రయముగా / నాశల్ సుమించన్ బ్రి-యా గిరిస్థ-
ఆ. లముల నీడ మనము – రమియించ నృత్యాల
కమలనయన పాడ – గళము విప్పి
హిమము కురియు వేళ – హితముగా నుందమా
సుమము విరియు వేళ – సుందరముగ
మత్తేభవిక్రీడిత విషమసీసము (స/భ/ర/న/మ/య/లగ IIU UII UIU IIIU UUI UUIU 20 కృతి 298676):
విమలాంశమ్ముల భాసిలెన్ గనఁగ నా – విశ్వప్సుఁ డందా దివిన్
శమనమ్మందెను సొంపు నిండె నెదలో – సానంద దీపమ్ములై
యమలమ్మయ్యెను శర్వరిన్ జగతి స – ర్వామోదమై శుభ్రమై
యమునన్ జేరుము ప్రేమతో రయముగా – నాశల్ సుమించన్ బ్రియా-
ఆ. లముల నీడ మనము – రమియించ నృత్యాల
కమలనయన పాడ – గళము విప్పి
హిమము కురియు వేళ – హితముగా నుందమా
సుమము విరియు వేళ – సుందరముగ
శారదా విషమసీసము
సీ. కమల దళమ్ముల – కన్నులఁ గాంచుచు / రంజిల నా మది – రా తరించ
విమల రవమ్ముల – వీనుల విందుగ / రాగము పాడుచు – రా రమించ
సుమముల సుందర – శోభలఁ జూపుచు / రంగుల రాజిలి – రా సుమించ
నమలపు కాంతుల – నందపు టద్దపు / రశ్మిని జిమ్ముచు – రా వరించ
తే. సరస నిర్ఝరి వలె స్వాదు – జలముల వలె
చల్ల జేయుమ యిట నుల్ల – మెల్ల నలర
హృదియు నీ కొఱకు దహించె – నిందు వగచి
రమ్ము తీర్చ తపన రమ్ము – రయము నీవు
(లేక)
ఆ. సరస నిర్ఝరి వలె – స్వాదు జలముల వలె
చల్ల జేయుమ యిట – నుల్ల మెల్ల
హృదియు నీ కొరకు ద-హించె నిందు వగచి
రమ్ము తీర్చ తపన – రమ్ము రయము
శారదా విషమసీసము (న/జ/జ/జ/జ/జ/లగ IIII UII UII – UII UII UIIU 20 కృతి 298676):
శార. కమల దళమ్ముల కన్నులఁ – గాంచుచు రంజిల నా మది రా
విమల రవమ్ముల వీనుల – విందుగ రాగము పాడుచు రా
సుమముల సుందర శోభలఁ – జూపుచు రంగుల రాజిలి రా
నమలపు కాంతుల నందపు – టద్దపు రశ్మిని జిమ్ముచు రా-
తే. సరస నిర్ఝరి వలె స్వాదు – జలముల వలె
చల్ల జేయుమ యిట నుల్ల – మెల్ల నలర
హృదియు నీ కొరకు దహించె – నిందు వగచి
రమ్ము తీర్చ తపన రమ్ము – రయము నీవు
(లేక)
ఆ. సరస నిర్ఝరి వలె – స్వాదు జలముల వలె
చల్ల జేయుమ యిట – నుల్ల మెల్ల
హృదియు నీ కొరకు ద-హించె నిందు వగచి
రమ్ము తీర్చ తపన – రమ్ము రయము
అంబురుహ విషమసీసము
సీ. నిన్నటి మాటలు – నిన్నటి పాటలు / నీ స్వరమ్ములఁ గోరె-నే వరముగ
నిన్నటి యాసలు – నిన్నటి బాసలు / నీదు స్నేహము నెంచె-నే చిరముగ
నిన్నటి పూవులు – నిన్నటి తావులు / నీదు జ్ఞప్తిని దెచ్చె-నే ప్రియముగ
నిన్నటి కౌగిలి – నిన్నటి ముద్దులు / నీ వియోగముఁ బెంచె-నే రయముగ
తే. నెన్నడును గల్పకమగు నీ – నీడ నుండ
నిన్నె మానస మందు నే – నిల్పి యుంటి
నెన్ని సంధ్యలో వేచు టిం-కెన్ని నాళ్ళొ
కన్ను మూయక ముందుగాఁ – గాన రమ్ము!
అంబురుహ విషమసీసము (భ/భ/భ/భ/ర/స/లగ UII UII UII UII – UIU IIUIU 20 కృతి 372151):
అం. నిన్నటి మాటలు నిన్నటి పాటలు – నీ స్వరమ్ములఁ గోరెనే
నిన్నటి యాసలు నిన్నటి బాసలు – నీదు స్నేహము నెంచెనే
నిన్నటి పూవులు నిన్నటి తావులు – నీదు జ్ఞప్తిని దెచ్చెనే
నిన్నటి కౌగిలి నిన్నటి ముద్దులు – నీ వియోగముఁ బెంచె నే-
తే. నెన్నడును గల్పకమగు నీ – నీడ నుండ
నిన్నె మానస మందు నే – నిల్పి యుంటి
నెన్ని సంధ్యలో వేచు టిం-కెన్ని నాళ్ళొ
కన్ను మూయక ముందుగాఁ – గాన రమ్ము!
లాక్షణీ విషమసీసము
సీ. తీయని రజనియుఁ – దెలితెలి వెలుఁగులు / తేనియ పవనము – దెస లలరెను
మూయని కనులకు – ముదమిడు గగనము / పున్నమి తొగదొర – పులకలిడెను
మాయని మమతలు – మనసునఁ గలిగెను / మాధవ యనె మది – మధురముగను
రా మధుమురళికి – రసమును నినుపఁగ / రాగపు స్వరముల – రవణములను
ఆ. ఘనముగాను మ్రోఁగి – గగనమ్ము నింపఁగా
తనువు విరియు విరిగఁ – దావితోడ
మనము మురియుఁ ద్రుటిని – మాయాజగమ్ములో
ప్రణయ మంత్రముల జ-పమ్మునందు
లాక్షణీ విషమసీసము (భ/న/న/న/భ/న/న/స UII IIII – IIII IIII – UII IIII – IIIIU):
తీయని రజనియుఁ – దెలితెలి వెలుఁగులు – తేనియ పవనము – దెస లలరెన్
మూయని కనులకు – ముదమిడు గగనము – పున్నమి తొగదొర – పులకలిడెన్
మాయని మమతలు – మనసునఁ గలిగెను – మాధవ యనె మది – మధురముగన్
రా మధుమురళికి – రసమును నినుపఁగ – రాగపు స్వరముల – రవణము లం-
ఆ. ఘనముగాను మ్రోఁగి – గగనమ్ము నింపఁగా
తనువు విరియు విరిగఁ – దావితోడ
మనము మురియుఁ ద్రుటిని – మాయాజగమ్ములో
ప్రణయ మంత్రముల జ-పమ్మునందు
సాధ్వి విషమసీసము
సీ. ఏల పలు రణము – లేలకొ మరణము / లేలకొ దహనము – లేల ప్రభువు
యేలకొ కలహము – లేలకొ విరసము / లేలకొ విలయము – లేల ప్రభువు
యేలకొ హృదయము – లేలకొ శిల లగు / నేల కరుగ విల – నేల ప్రభువు
యేల సహనమున – నేల సమరసము / నేలకొ తలచర – దేల ప్రభువు
ఆ. పుడమిపైన శాంతి – పూర్ణమై నెలకొన్న
విడును గనుల నీరు – వెతల కతలు
పుడమి నీదు సృష్టి – పుడమి జనులు కూడ
కడకుఁ గరుణ జూపి – కావవేల
సాధ్వి విషమసీసము (భ/న/జ/న/స/న/న/భ/గురు UII IIII – UII IIII – UII IIII – UIIU 25 అభికృతి 14665451):
సాధ్వి. ఏల పలు రణము – లేలకొ మరణము / లేలకొ దహనము – లేల ప్రభూ
యేలకొ కలహము – లేలకొ విరసము / లేలకొ విలయము – లేల ప్రభూ
యేలకొ హృదయము – లేలకొ శిల లగు / నేల కరుగ విల – నేల ప్రభూ
యేల సహనమున – నేల సమరసము / నేలకొ తలచర – దేల ప్రభూ
ఆ. పుడమిపైన శాంతి – పూర్ణమై నెలకొన్న
విడును గనుల నీరు – వెతల కతలు
పుడమి నీదు సృష్టి – పుడమి జనులు కూడ
కడకుఁ గరుణ జూపి – కావవేల
కవిరాజవిరాజిత విషమసీసము
సీ. మనసునఁ బూచిన – మల్లెల నల్లిన / మాలల గొల్తును – మాధవ నిను
ప్రణతుల వేడెద-రా కవిరాజవి- / రాజితమౌ పలు – ప్రస్తుతులను
కనులకు ముందుగ – గంతుల వేయుచు / గానము పాడుచుఁ – గాంచుమ నను
తను విట వేచెను – దాపము తీఱఁగ / తప్పక రమ్మిటఁ – దాఁకగ నను
తే. వేగ వచ్చెద నంటివి – ప్రియముగాను
నే గవాక్షము వద్దనె – నిలచినాను
మూగవోయెను డెందము – ముదము లేక
రాగవీణను మీటర – రమణ యిపుడు
కవిరాజవిరాజిత విషమసీసము (న/జ/జ/జ/జ/జ/జ/లగ IIII UII – UII UII – UII UII – UIIU 23 వికృతి 3595120):
కవి. మనసునఁ బూచిన – మల్లెల నల్లిన – మాలల గొల్తును – మాధవ నిన్
ప్రణతుల వేడెద-రా కవిరాజవి-రాజితమౌ పలు – ప్రస్తుతులన్
కనులకు ముందుగ – గంతుల వేయుచు – గానము పాడుచుఁ – గాంచుమ నన్
తను విట వేచెను – దాపము తీఱగ – తప్పక రమ్మిటఁ – దాఁకగ నన్
తే. వేగ వచ్చెద నంటివి – ప్రియముగాను
నే గవాక్షము వద్దనె – నిలచినాను
మూగవోయెను డెందము – ముదము లేక
రాగవీణను మీటర – రమణ యిపుడు
మానినీ విషమసీసము
సీ. చిన్నగ పాడును – జెన్నుగ నాడును / జిన్నియ లెన్నియొ – చిందిడుచును
వెన్నను మ్రింగెడు – వెన్నుని నవ్వులు / వెన్నెల కుప్పల – వెల్గులుగను
కన్నుల నిండుగఁ – గన్నని రూపమె / కన్నుల పండుగ – కన్నయగను
మున్నటి నోముల – పున్నెము లన్నియుఁ / బున్నము లయ్యెను – ముగ్ధముగను
ఆ. యమున మునిగి యాట-లాడంగ రమ్మురా
కమలనయన మొగముఁ – గాంచనిమ్ము
సుమమువోలెఁ దనువు – సుందర వేణువు
గమకములను వినెదఁ – గర్ణములను
మానినీ విషమసీసము ((భ)7/గ UII UII – UII UII – UII UII – UIIU 22 ఆకృతి 1797559):
మానిని. చిన్నగ పాడును – జెన్నుగ నాడును – జిన్నియ లెన్నియొ – చిందిడుచున్
వెన్నను మ్రింగెడు – వెన్నుని నవ్వులు – వెన్నెల కుప్పల – వెల్గులుగన్
కన్నుల నిండుగఁ – గన్నని రూపమె – కన్నుల పండుగ – కన్నయగన్
మున్నటి నోముల – పున్నెము లన్నియుఁ – బున్నము లయ్యెను – ముగ్ధము గా-
ఆ. యమున మునిగి యాట-లాడంగ రమ్మురా
కమలనయన మొగముఁ – గాంచనిమ్ము
సుమమువోలెఁ దనువు – సుందర వేణువు
గమకములను వినెదఁ – గర్ణములను
(గాయము = పాట)
తరువోజ విషమ సీసము
జాతులలో తరువోజ, మహాక్కర, షట్పదలతో విషమ సీసమును వ్రాయవచ్చును. తరువోజలో ప్రతి పాదమునకు సీసమువలెనే ఆఱు ఇంద్ర గణములు, రెండు సూర్య గణములు. కాని గణముల అమరిక సీసము వంటిది కాదు. సీసములో సూర్య గణములు రెండవ అర్ధపాదపు చివర ఉంటే, తరువోజలో అవి ద్విపదలా అర్ధపాదముల చివర మనకు కనబడుతుంది. అనగా ఇం/ఇం – ఇం/సూ – ఇం/ఇం – ఇం/సూ (సీసములో ఇం/ఇం, ఇం/ఇం, ఇం/ఇం – సూ/సూ). కాని సీసములో తరువోజను గర్భితము చేయ వీలగును. కాబట్టి సీసమునకు బదులు తరువోజను వ్రాసి, దానికి ఒక ఎత్తుగీతిని జతపరచినప్పుడు మనకు తరుపద సీసము లేక తరువోజ విషమ సీసము లభిస్తుంది. క్రింద రెండు ఉదాహరణములు.
1. తరుపద సీసము
తరు. ఏ మూర్తి నెటు బిల్తు – నెన్ని జన్మముల / నీ విశ్వమున వాని – నెటులఁ బ్రేమింతు
నే మూర్తి నెటు దల్తు – నెన్ని నాళ్ళులుగ / నీ ధరన్ వానికై – యే కైత వ్రాతు
నే మూర్తికొఱకు నా – హృదయమ్ము తోడ / నేమైన జేయంగ – నిటుల నేనుంటి
నే మూర్తికొఱకు నే – నెన్ని రీతులుగ / నిట్లు గాలించినా – నిన్ని రోజులుగ
తే. నట్టి యామూర్తి దప్పక – నరుగుదెంచు
గట్టిగా నమ్మి యుంటిని – కలల నిజము
నట్టి యానందమూర్తిని – ననవరతము
ముట్టి మాటాడెద భువన – మోహనుఁడని
2. తరువోజ.
తరు. కుసుమముల్ వికసించె – కూర్మితో వేగ / కురిపించ వానగాఁ – గోమలమ్ముగను
రసవాహినుల్ పారు – రమ్యమై యింక / రవములన్ గోకిలల్ – రహితోడఁ బాడ
నసమాన మీ సొంపు – లతి దీప్తి వెలుఁగ / నానంద ముప్పొంగు – నవధి మీఱంగ
మిసిమితో నలరారు – మేదినిన్ నేఁడు / మిహిరుండు లేలేఁత – మెఱుఁగులన్ రాగ-
తే. సీమలోఁ బ్రయాణము సేయఁ – చిత్రముగను
ప్రేమికులు మోదమొందంగఁ – బ్రీతి నిండ
నామనియు వచ్చె నవ్వుచున్ – హర్ష మీయఁ
గామవర్ధిని కవ్వించె – గళము విప్పి
తరువు పూఁత విషమ సీసము
తరువోజలో సూర్య గణములు నాలుగవ, ఎనిమిదవ స్థానములను ఆక్రమిస్తాయి. శంబరము అనే వృత్తమును పరిశీలిస్తుండగా, అందులో సూ/ఇం/ఇం/ఇం – సూ/ఇం/ఇం/ఇం మూస గోచరించినది. శంబర వృత్తపు లక్షణములు: న/భ/భ/ర/న/భ/భ/ర III UII UII UIU – III UII UII UIU24 సంకృతి 5993912. ఈ ‘ఆద్యరుణ’ తరువోజను తరువు పూఁత అని పిలిచినాను. దీనితో కూడ విషమ సీసమును వ్రాయవచ్చును. క్రింద ఒక ఉదాహరణము –
త. పూఁ. తల్లి సీతమ్మ – తన చుట్టు నుండెడు / దైత్య వనితల – తప్పు మాటల విని
యుల్లమందున – నురుతర దుఃఖమ్ము / నొందెఁ బతిదేవు – నూహించి మదిలోన
మెల్లఁగా వినె – మృదువైన స్వరమొండు / మిగుల శాంతితో – “మేదినీనాథుండు
చల్లఁగా నుండె – సైన్యమ్ముతో వచ్చు -/ సాగరము దాఁటి – స్వామినిన్ గాపాడు”
తే. ననఁగ, నది విని తలబోసె – నామె యపుడు
“నిదియు రాక్షస మాయయో – యేమొ యెఱుఁగ,”
“వలదు వలదమ్మ సందేహ – మిలను నీకు
రామదూతను నే, నంపె – రాముఁడు నను”
మహాక్కర విషమ సీసము లేక మహాశీర్షకము
మహాక్కరకు ప్రతి పాదములో వరుసగా ఒక సూర్య గణము, ఐదు ఇంద్ర గణములు, ఒక చంద్ర గణము ఉంటాయి. చంద్ర గణములలో UIUI, IIIUI వరుసగా రెండు సూర్య గణములే. మహాక్కర ప్రారంభ దశలో ఒక్కొక్కప్పుడు మొదటి సూర్య గణమునకు బదులు ఇంద్ర గణమును కూడ వాడినారు. ఇట్టివి కన్నడ ఛందస్సులో నున్నాయి. కాబట్టి మహాక్కరతో కూడ విషమ సీసమును వ్రాయ వచ్చును. క్రింద ఉదాహరణములు:
1) మహాక్కర. నీవు లేనిచో జీవమ్ము లేదురా – నీవెగా నాజీవ రాజీవము
నీవు లేనిచో రావమ్ము లేదురా – నీవెగా నాజీవ సంగీతము
నీవు లేనిచో భావమ్ము లేదురా – నీవెగా నాజీవ చైతన్యము
నీవు లేనిచో నేనేమి కాదురా – నీవెగా నాజీవ సర్వస్వ మ-
ఆ. నిశము మనములోన – నిన్నె తలఁతు నిజము
మసృణ స్నిగ్ధ హసన – మందజేయ
రసపిపాసి నీవు – రమ్ము చెంత నిలువ
నసువు లిత్తు నీకు – నసురదమన
2) మహాక్కర. నీల గగనమ్ము – నిండెగా నక్షత్ర – మాలలన్ జిత్రమై – మాయమ్ముగా
నేల నిద్రించె – నింగియున్ నిద్రించె – నాలమందల గంట – లాఁగిపోయె
వేళ యిప్పుడే – వేవేగ కనుమూయ – జాలమ్ము వలదయ్య – శయ్య పిల్చె
లాలి పాడెదన్ – లలితాంగ మెల్లఁగా – నాలించి నిదురించు – మందాల తో-
ఆ. రణములో యనంగ – రమ్య తారలు బలు
నిను నిదురను ముంచు – నెమ్మి నిండఁ
గనుల రేపు తెఱచి – కమల మిత్రుఁ గనుము
వినఁగఁ గ్రొత్త కతలఁ – బ్రియముగాను
(ఇందులోని మహాక్కరలో అక్షరసామ్య యతికి బదులు ప్రాసయతిని ఉంచినాను, అంతే కాక పూర్వార్ధములో, ఉత్తరార్ధములో సీసములా అక్షరసామ్యయతి కూడ ఉన్నది.)
షట్పద సీసము
ఆఱు పాదములు కలిగిన ఈ ఛందస్సు రెండు విధములు: (1) ఉపగణ లేక అంశగణ నిర్మితములు, (2) మాత్రాగణ నిర్మితములు. ఇందులో రెండింటితో షట్పద సీసమును కల్పించ వీలగును. కాని ప్రస్తుతము నేను ఉపగణములతో నిర్మితమైన ఛందస్సును మాత్రమే చర్చిస్తాను. మాత్రాగణ నిర్మిత ఛందస్సును నేను షట్పది అనియు, ఉపగణములతో వ్రాసిన ఛందస్సును నేను షట్పద అని పిలుస్తాను. దీనివలన రెంటికి నడుమ ఉండే సందిగ్ధత మాయమవుతుంది. ప్రతి షట్పద పాదములో ఆఱు ఇంద్ర గణములు, ఒక చంద్ర గణము. ప్రతి పాదములో రెండేసి గణములకు ప్రాసయతి. షట్పదలోని మూడుపాదములు– ఇం/ఇం, ఇం/ఇం, ఇం/ఇం – చం
–ఇలాగే మూడు పాదములు, మొత్తము ఆఱు పాదములు. ఇది షట్పదలోని రెండు పెద్ద పాదములకు సరిపోతాయి. చతుష్పదియైన షట్పదలో రెండు ఆఱు పాదముల చిన్న షట్పదులు ఉన్నాయి. అనగా నాలుగు పాదములలో 12 చిన్న పాదములలో ఒకే ప్రాసయతిని పాటించాలి. షట్పదలోని మూడవ చిన్న పాదములో అక్షరసామ్య యతిని వాడవలెను. ఈ నియమము ఎందుకంటే షట్పద ఒక జాతి పాద్యము. తెలుగులో జాతి పద్యములలో అక్షరసామ్య యతి ఉండాలి. లేక పోతే అది వడి లేని ఛందస్సు అవుతుంది. తెలుగులోని 14 చంద్ర గణములు కన్నడములోని 16 రుద్ర గణములలో UUUU, IIUUU లను తొలగించగా మిగిలినవి అవుతాయి. తెలుగు ఛందస్సులోని 14 చంద్ర గణములు – UUUI, UUII, UUIU, IIUII, IIUIU, IIUUI, IIIII, IIIIU, IIIUI, IIIUU, UIUI, UIUU, UIII, UIIU. ఇందులో UIUI, IIIUI రెండు పక్కపక్కన ఉంచిన సూర్య గణములు. ఈ గణములను ఉపయోగించినప్పుడు సీసమునకు, షట్పదకు ఎట్టి భేదము లేదు. కావున షట్పదకు ఒక ఎత్తుగీతిని చేర్చినప్పుడు మనకు సీసములాటి షట్పద విషమ సీసములభిస్తుంది. క్రింద ఉదాహరణములు.
షట్పద. వరిచేలపై వచ్చె – చిఱుగాలి మెల్లఁగా – తరుపత్రములు మెల్ల – తల లూఁపఁగా
చెరువు గట్టులపైన – చిఱు పుల్గు లవి యెల్ల – వరుసగా నడయాడు – వరుస బాగు
కరములోఁ గఱ్ఱతో – తిరుగాడె నొక రైతు – త్వరగాను బాడుచున్ – తందానలన్
మరువంపు నునుతావి – హరుసమ్ము నొసఁగఁగా – విరిబోణి నను జూడు – వేవేగ మీ
తే. సరసమగు సందె వేళలో – నరుణ కాంతి
మెఱయుచుండంగ నింగిలో – నెరులవోలె
మురియు సమయమ్ము వచ్చెనే – సిరుల నొలికి
స్వరసుమమ్ముల నర్చన – జరుపుదాము
ఇందులో రెండవ పాదము సీస పాదమునకు సరిపోతుంది. షట్పద చివర వేవేగము అని అంతము చేసినప్పుడు అది స్వతంత్రముగా నిలబడుతుంది. గీతితో అన్వయమునకై వేవేగము + ఈ సరసమగు అని వ్రాసినాను.
షట్పదలా యతులను సీసమునకు ఉంచితే (అనగా రెండు అర్ధ పాదములకు ప్రాస, మొదటి అర్ధ పాదములో ప్రాసయతి, రెండవ అర్ధ పాదములో సామాన్య యతి) మనకు ఒక కొత్త సీస భేదము లభిస్తుంది. అదియే షట్పద సీసము. షట్పద సీసము షట్పద కాదు, ఎందుకనగా అందులో చివర ఉన్నది చంద్ర గణము కాదు, రెండు సూర్య గణములు మాత్రమే. ఇట్టి సీస భేదమును ఇంతవఱకు ఎవ్వరు పేర్కొనినట్లు లేదు. క్రింద షట్పద – సీసము – హిందీలోని ఝుల్లణా (ఝూలనా) మూడింటికి సరిపోయే ఒక పద్యము. ఈ షట్పద పంచమాత్రా యుక్తమైన కుసుమ షట్పదికి సరిపోతుంది.
సీ. షట్పద(ది) – ఝుల్లణా. సొగసుతో నవ్వవా – వగల నా కివ్వవా – రగులు మానసములో – శ్రాంతి నిమ్ము
మొగములోఁ గాంతితో – సుగపు విక్రాంతితో – నగణిత మ్మగు మోద – మంద నిమ్ము
అనురాగ సరసిలో – వనజంపు చెలువులో – నిను నేను చూడనా – నెమ్మితోడ
కనుసన్న విఱుపులో – వినుచున్న కవితలో – నను నేను మఱతు ర-త్నాల మేడ
ఆటవెలఁది షట్పద. న్మృదు పదమ్ములను
సుధలఁ గలిపి నీవు
మధుర గతులఁ బాడు – మలఘు రీతి
వ్యధలు దొలఁగు వేగ
ముదము గలుగు నాకు
మదిర వోలె నిచ్చు – నధిక ప్రీతి
కుసుమ షట్పది – 5+5 / 5+5 / 5+5 – 5+2, ఝుల్లణా – 10 + 10 + 10 + 5+2 మాత్రలు.
మత్తకోకిల విషమ సీసము
మత్తకోకిల వృత్తము ‘జల’ షట్పదికి మూలము. జలషట్పదిలో 3,4 / 3,4 / 3,4 -3,2 మాత్రలు ఉంటాయి. ఇది మత్తకోకిల ఒక పాదమునకు సరిపోతుంది.
ప్రాసయతితో జలషట్పది రూపములో మత్తకోకిల వృత్తము –
వాన వచ్చెను / సోన లెల్లెడ / మేనఁ జిన్కులు – మెత్తఁగా
భానుఁ డెక్కడొ / కానకుండెను / ఫేన రాశులు – వృత్తమే
బానలందున / వాన బొట్టులు / గాన మయ్యెను – గమ్మఁగా
నేను వేచితి / వాణి మ్రోఁగఁగ / వీనులందున – బ్రేమగా
మత్తకోకిల విషమ సీసము:
మత్తకోకిల (ప్రాసయతితో). వాన వచ్చెను – సోన లెల్లెడ / మేనఁ జిన్కులు – మెత్తఁగా
భానుఁ డెక్కడొ – కానకుండెను / ఫేన రాశులు – వృత్తమే
బానలందున – వాన బొట్టులు / గాన మయ్యెను – గమ్మఁగా
నేను వేచితి – వాణి మ్రోఁగఁగ / వీనులందున – బ్రేమ వా-
తే. క్ఝరులు పారెను నంద మొ-ల్కఁగ నలలుగ
హరి ధనుస్సిఁక రంగు మా-యల నలరఁగ
మురియు సమయము మోహన-మ్ముగ నమరఁగ
సరసిజానను రమ్య హా-సము గలుపఁగ
(తేటగీతిని కూడ మిశ్రగతిలో వ్రాసినాను.)
మంజరీద్విపదతో విషమసీసము
తరువోజ, మహాక్కర, షట్పద ఛందస్సులు ప్రాసయుక్తములు. ఉపజాతియైన సీసములాటి ఛందస్సే మంజరి ద్విపద రెండు పాదములు. ఇందులో మొదటి రెండు పాదములకు ఏ సంబంధము లేదు సీసములోని రెండు అర్ధ పాదములవలె. అక్షరసామ్య యతి కూడ తరువోజలా మొత్తము పద్యమునకు కాక సీసపు అర్ధపాదములవలె ఉంటుంది. కాబట్టి మంజరీద్విపదను వాడినప్పుడు తరువోజ స్వరూపము వస్తుంది, కాని యతి ప్రాస నియమములు తక్కువ, కావున కవికి స్వేచ్ఛ ఎక్కువ. అట్టి మంజరీద్విపదతో ఒక విషమ సీసమునకు ఉదాహరణము:
మంజరీద్విపదతో విషమ సీసము:
మంజరీద్విపద. చూడుమా చంద్రుని – సుందరమ్ముగను / నింగిలో వెలిఁగెను – నిండారి యిపుడు
పాల వెన్నెలలోనఁ – బలు పూల తావి / తేలె నీగాలిలో – దిక్కు దిక్కులకు
మందమై పవనమ్ము – మధురమై వీచె / కలరావ మొక్కటి – కలవోలె లేచెఁ
బరువిడెన్ భావముల్ – వర కవిత్వముగ / నది యయ్యె నదియు – నవరాగభరిత
తే. మగుచు ముదమున నయ్యది – యాత్మ నింపె
ప్రణయ పదముల సుస్వర – పంక్తితోడ
నాలపించెడు వేళ యా-హా యనంగ
భామినీ మనకింక భా-వాబ్ధి మున్క
ముగింపు
సీసముతో కొద్దిగా సంబంధము ఉన్న వృత్తముతో కాని, సీసపు స్వరూపమును కొద్దిగా నైన సంతరించుకొన్న జాతి, ఉపజాతి పద్యములతో కాని విషమ సీసమును వ్రాయ వీలగును. ఇలా వ్రాసినప్పుడు స్పష్టముగా దానిని విషమ సీసము అని పేర్కొనాలి. ఈ విధముగా సీసపు పరిధిని విస్తారము చేయుటకు వీలవుతుంది. ఈ వ్యాసమును ముగించుటకు ముందు దీనికి సంబంధించిన ఒక గర్భ కవితను ఇక్కడ ఉంచ దలచినాను:
ద్విపద/తరువోజ/సీసము/మత్తకోకిల/తేటగీతి:
సీ. మాధవా యలనాటి – మత్తగు మైత్రి మా- / ధురు లెంచితిన్, మది – తూఁగగాను
రాధ నీ విట లేక – రాగ-విరక్తరా, / ధృతి లేదురా! గ్రహ – దృష్టి యేమొ?
బాధతో హృదయమ్ము – వాడుచు వంగె బా- / ధల బాప రా, పరి-తాప ములను
నా ధనమ్ములు నీవె – నంద సునందనా / ధవు డౌదువా, నగ-ధారి, నాదు
తే. శోధనమ్ములఁ గాల్చుచుఁ – జుఱుకు నీయ,
వ్యాధి తగ్గునె నాకు, వ-యసు హరించు,
భూధరమ్ములు కూడ పు-వులఁ జలించె
మాధవా, నను జేరు మ-మతల తోడ
తరువోజ విషమ సీసము (తరుపద సీసము):
తరువోజ – మాధవా యలనాటి – మత్తగు మైత్రి – మాధురు లెంచితిన్, – మది తూఁగగాను
రాధ నీ విట లేక – రాగవిరక్త-రా, ధృతి లేదురా! – గ్రహ దృష్టి యేమొ?
బాధతో హృదయమ్ము – వాడుచు వంగె – బాధలఁ బాప రా, – పరితాప ములను
నా ధనమ్ములు నీవె – నంద సునంద-నా ధవు డౌదువా – నగ-ధారి, నాదు
తే. శోధనమ్ములఁ గాల్చుచుఁ – జుఱుకు నీయ,
వ్యాధి తగ్గునె నాకు, వ-యసు హరించు,
భూధరమ్ములు కూడ పు-వులఁ జలించె
మాధవా, నను జేరు మ-మతల తోడ
తరువోజలో రెండు ద్విపద పాదములు కూడ ఉన్నాయి.
మత్తకోకిల విషమ సీసము:
మ.కో. మాధవా యలనాటి మత్తగు – మైత్రి మాధురు లెంచితిన్
రాధ నీ విట లేక రాగవి-రక్తరా, ధృతి లేదురా!
బాధతో హృదయమ్ము వాడుచు – వంగె బాధల బాప రా,
నా ధనమ్ములు నీవె నంద సు-నందనా ధవు డౌదువా
తే. శోధనమ్ములఁ గాల్చుచుఁ – జుఱుకు నీయ,
వ్యాధి తగ్గునె నాకు, వ-యసు హరించు,
భూధరమ్ములు కూడ పు-వులఁ జలించె
మాధవా, నను జేరు మ-మతల తోడ
తేటగీతిలో గర్భితమైన ద్విపద:
శోధనమ్ములఁ గా-ల్చుచుఁ జుఱుకు నీయ,
వ్యాధి తగ్గునె నాకు – వయసు హరించు,
భూధరమ్ములు కూడ – పువులఁ జలించె
మాధవా, నను జేరు – మమతల తోడ