నివాసం

చిలకలపూడి స్టేషన్నించి
చక్కా వచ్చానింటికి.
గేటు ముందు
చిత్తం వచ్చినట్టు పెరిగింది
పచ్చ గడ్డి.
కిటికీ భుజం మీదకు
కొమ్మ సాచి
స్నేహంగా ఊగుతోంది
దానిమ్మ.
వసారా చూరులో
గజిబిజి గడ్డి పోచల్లోంచి
కిచకిచలాడాయి
బుల్లి ఎర్ర నోళ్ళు.

గడియ తీస్తే
తలుపు మూల
తన పేరును వల్లె వేసుకుంటూ
ఇల్లలలుకుతోంది కందిరీగ.
పడగ్గదిలోకి తొంగి చూస్తే
పిల్లాపాపలతో పలకరింపుగా
మీసాలు ఊపాయి బొద్దింకలు.

వంట గదిలో
బంగాళా దుంపల పొట్టల్లోంచి
చొచ్చుకొచ్చాయి
బొటన వేలంత మొక్కలు.
నీళ్ళ బిందెలో
నింపాదిగా ఈత్తున్నాయి
చిరు చిరు తోక జీవులు.
చక్కెర డబ్బా ముందు
మాటలు మీటుతూ
కూలీ చీమల బారులు.
అల్మరా మూలల్లో
చీకటి లోపలి చీకటిలో
జోగుతూ బల్లి గుడ్లు.
చెక్క బీరువా మీద
చెద పురుగులు చెక్కిన
చిత్ర లిపి?

ధుమధుమలాడుతూ
కలియదిరుగుతుంటే
నా రాకను పసిగట్టి
ఆవలిస్తూ వచ్చి
హాజరీలో నిలబడ్డాయి
చెత్త బుట్ట
చీపురు కట్ట.