అది పోయి వారం.
ఇదొచ్చి వారం.
కానీ ఈ క్షణానికి అదీ, ఇదీ ఒకటే.
కనిపించినవాడితో లేచిపోయే రకాలు.
వాడు వేరే.
వీడు వేరే.
ఇద్దరూ ఒకటే.
కనిపిస్తే చాలు ఎగరేసుకుపోతారు.
దగుల్బాజీలు. దొంగ రాస్కెళ్ళు.
అది బరంపురం. ఇది లోకల్.
బరంపురంది రంగు రూపు బాగనే ఆనేది. ఉల్ఫాగా దొరికింది. అందుకే మరొకడు తగలగానే తనదారి చూసుకున్నా అది పోయిందన్న బాధలేదు. కానీ ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. కోరి కోరి తెచ్చుకున్నది. అందుకే బాధ మరీను.
అది పోయినప్పుడు ఒంటరిగా మిగిలాను.
ఇప్పుడు ఇది జత మిగిల్చేపోయింది.
మరీ బాధ ఏమిటంటే ఇది ఎవడితో పోయిందో వాణ్ణి నేను చూసేను. ఇది వాడితో పోతుందేమోనన్న అనుమానం కూడా వచ్చింది. అయినా జాగ్రత్తపడలేకపోయేనన్న బాధ మరీ పీడిస్తోంది. మనసు హెచ్చరిస్తూనే ఉంటుంది. పట్టించుకోం. అంతా అయిపోయాక అప్పుడు తడుతుంది, అరే ముందే అనుకున్నావేఁ, అని.
మరో అరగంటలో ఈ వాహనసేవ పూర్తయిపోతుంది, పాపని మా ఆవిడ చేతికిచ్చేస్తే ఈ రోజుకి అగ్రిమెంట్ ప్రకారం డ్యూటీ పూర్తవుతుందని అనుకుంటూ వీధి చివర గుడిదాకా వచ్చాను. తీరా గుడికొస్తే దేవుడు చేసిన నిర్వాకం ఇది.
గుళ్ళోకి అడుగుపెడుతూ చూసేను వాణ్ణి. గుడికొచ్చేవాడు పెట్టి పట్టుకుని రావడం చూస్తే అనుమానంగా ఉన్నా, పాపం ఊరెళుతూ భక్తి ఎక్కువై ఆఖరి చూపులకోసం దేవుడిని చూసుకుపోడానికి వచ్చాడనుకున్నాను. కానీ ఇంత దగుల్బాజీ అనుకోలేదు.
మామూలు మనిషిలాగే ఉన్నాడు. పల్చటి కోల మొహం. సన్నగా ఆ పెట్టిని మాత్రమే మోయగలిగేవాడిలాగ, వాడి మిగిలిన బరువుబాధ్యతలన్నీ దేవుడే మోయాలన్నట్టు మొహం పెట్టుకుని నా కన్నా ఒక్క అడుగు, ఒక్క క్షణం ముందుగా గుడిలోకి అడుగుపెట్టాడు. వాడి వెనకే, దేవుడితో మరేం పన్లేకపోయినా, పోయిందేం లేదు కదా టైమ్ తప్ప అని, ప్రస్తుతం అది మనకక్కర్లేనంత ఉంది కదా అని, నేనూ అడుగు లోపలికే వేసేను.
ఎందుకైనా మంచిదని వారం రోజుల నా చెప్పుల జతని గట్టుదాటి రెండు అడుగుల అవతలగా పెట్టేను. ఇటు దేవుడు. అటు దేవత. ఈ మూల నవగ్రహాలు. ఏ మూలనుంచైనా కనిపిస్తూ ఉండేలా ఉంచేను.
గుళ్ళో జనం లేరు. చల్లగా గాలివీస్తోంది. గుడి చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి వచ్చేసరికి పెట్టి మనిషి పుట్టదేవుడితో ఏదో మొరపట్టుకుంటున్నాడు. రెండోసారి తిరిగి వచ్చేసరికి గేటు దగ్గర చెట్టుదేవుడి దగ్గర భక్తిగా నించునున్నాడు. దేవుడు, దేవత, నవగ్రహాలు, గట్టుపక్కన నా స్వార్జితాలు ఎవరి జాగాల్లో వాళ్ళున్నారు.
మూడోసారి… వాడొక్కడే సీన్‌లో మిస్సింగ్. పాప స్తంభాల మీది బొమ్మలని చూస్తూ ఆడుకుంటూంటే, పూజారిగారు ఓ మూల కూర్చుని పారాయణ చేస్తూంటే దూరంగా ఎండలో ఎత్తుగా తలూపుతూ నిల్చున్న కొబ్బరి చెట్టుని చూస్తూ, చుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని వింటూ, కునుకుతూ కొంతసేపు కూర్చున్నాను.
ఇంక డ్యూటీ దిగచ్చనుకుని, పాపని ఎత్తుకుని వచ్చేసరికి…
హమ్మ అనుకున్నంతా అయిందే… అయ్యో… పోయిందే… గోవిందా…!?
నేను ఉంచిన చోటే ఉన్నాయి. అలాగే ఉన్నాయి. కానీ అవి కావు. నల్లని నిగనిగలాడే నలుపు కాదు. ఇదేదో బూడిదలో దొర్లిన తెల్లపిల్లి రంగు. ఆ మెఱుపు ఆ తళుకు లేనివి.
నావి వారం రోజులైనా వాడుక లేక ఇంకా అరగనివి. ఇవి తిరిగి తిరిగి నలిగినవి.
ఏడీ? వాడేడీ? బస్సెక్కిపోయేడా? ఇంతలోనే ఆటో దొరికేసిందా?
ఎవరో పక్క సందులోకి త్వరగా వెళ్ళినట్టయింది. అబ్బే వాడు కాడు. పోయేడు. అంతలోనే! కొత్త చెప్పుల జోరుమీద ఉన్నవాడు ఇంకా ఇక్కడే ఉంటాడా? కానీ వాడి చెప్పులు మరీ అంత పాతగా కూడా కనబడ్డంలేదే. వాడూ అలాంటి వాడిలాగ లేడే. నా కంటబడకుండా ఎలా ఏమర్చి పట్టుకుపోయాడు?
లేడు. వీధిలో లేడు. కనుచూపు మేరలో లేడు.
ఉంటే?
వదల్నే.
నిలదీస్తా. వదిలిస్తా. సాధిస్తా.
కానీ లేడే… పోయాడే… పోనీ, ఇవే వేసుకుపోదామా… నావి కావే. తప్పదు. నా పాదాల సైజే. కొద్దిగా వదులుగా ఉన్నాయి. చక్కగా పాదాలకతుక్కుని ఉండేవి. చేజారిపోయాయి. వీటిలో నా కాళ్ళు జారిపోతున్నాయి.
ఛ! ఛ! మరీ వారానికి రెండు జతలు పోగొట్టుకున్నవాడినయ్యాను.
“నాన్న చెప్పులేసుకెళ్ళారా? వెతుక్కున్నారు. మీవి వేసుకెళ్ళేరు.” అంది మా ఆవిడ పాపన్తీసుకుంటూ…