అక్టోబర్ 2018

తెలుగునాట తెలుగు చదవడం రాయడం అటుంచి సరిగ్గా మాట్లాడడం కూడా అరుదైపోతున్న ఈ రోజుల్లో, ఎక్కడో అమెరికాలోని డిట్రాయిట్ నగరంలో కొందరు పుస్తకాలు చదవడం ఇష్టం ఉన్నవారు కలుసుకోవడం, తాము చదివిన కథలూ నవలలూ కవితల మంచీచెడ్డలు మాట్లాడుకోవడం, ఆపైన ఆ ఆసక్తి, అభిరుచులే డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ పేర ఎదిగి ఒక సంస్థగా మారి అమెరికా తెలుగు ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడమే కాక, ఇరవై యేళ్ళు నిరాఘాటంగా నడవడం అసామాన్య విషయం మాత్రమే కాదు, ఎంతో సంతోషం కలిగించే విషయం కూడా. డీటీఎల్‌సీ అని అందరూ పిలుచుకొనే ఈ బుక్ క్లబ్ కేవలం పుస్తకాలు చదవడంతోనే ఆగిపోక, నిక్కచ్చిగా విమర్శ చేయడం, ఎంతో శ్రమతో, నిరపేక్షతో, కేవలం తెలుగు సాహిత్యం పట్ల ప్రేమతో, మరుగునపడిన పుస్తకాలను ప్రచురించే బాధ్యత కొంత తలకెత్తుకోవడం, తెలుగు భాషాసాహిత్యాల గురించిన సభలు నిర్వహించడం ఎంతో హర్షించదగిన పరిణామం. వీరి స్ఫూర్తితో అమెరికాలోని ఎన్నో నగరాలలో తెలుగు సాహిత్య సంఘాలు వెలిశాయి, తెలుగు కథ కవితల గురించి మాట్లాడుకుంటున్నాయి, ఏం చేస్తే మన తెలుగు భాష కలకాలం బ్రతికి ఉంటుంది, మరింత అభివృద్ధి చెందుతుంది, మనం ఎలా దీన్ని కాపాడుకోవాలి అని ఆలోచిస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు. డీటీఎల్‌సీ పుట్టి ఇరవై యేళ్ళు అయిన సందర్భంగా సెప్టెంబర్ 29-30 తారీకులలో ఇరవై యేళ్ళ పండగ పేరుతో తెలుగులో ప్రామాణిక భాష అవసరమూ ఆవశ్యకత, తెలుగులో ప్రచురణ వ్యవస్థ, ఇత్యాది అంశాలపై ఒక చక్కటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా, డీటీఎల్‌సీ వారి కృషికి, తెలుగు పట్ల వారి ప్రేమకు, వారి నిస్వార్థ ప్రయత్నాలకూ ఈమాట తరఫున హార్దికాభినందనలు తెలుపుతున్నాం.