[తానా జ్ఞాపిక తెలుగుపలుకులో స్థలాభావం వలన ఈ వ్యాసం కుదించబడింది. ఆ సంక్షిప్త రూపం గ్రంథాలయంలో ఉన్నది. ఇది రచయిత ప్రథమంగా వ్రాసిన వ్యాసపు పూర్తి పాఠం – సం.]
The writer invites us to understand his language, not to translate it into the language of our equivalencies.
– Nicolás Gómez Dávila
గోమెజ్ దవీలా వాక్యోక్తులలో(aphorisms) నన్ను బాగా ఆకట్టుకున్న ఒక వాక్యోక్తి యిది. రచనల్లో కవిత్వానికీ, అందులోను ఆధునిక కవిత్వానికి ఎంతగానో వర్తించే వాక్యమిదని నేననుకుంటాను.
ఇటీవలి కాలంలో వస్తున్న కవిత్వం చాలా వరకూ అర్థం కానిదనీ, కొండొకచో అర్థం లేనిదనీ పాఠకులు విమర్శించడం తరచుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇంటర్నెట్టులో ప్రచురితమయ్యే కవిత్వం విషయంలో దీన్ని నేను స్పష్టంగా గమనించాను. ఎందుకిలా జరుగుతోంది? ఇది వస్తున్న కవిత్వంలో లోపమా? లేదా చదివే పాఠకుల లోపమా? అని కాస్త నాలో ఆలోచన మొదలయ్యింది. దీని గురించి ఆలోచన మొదలుపెట్టగానే నాకు మొట్టమొదట ఠక్కున గుర్తుకు వచ్చినది విశ్వనాథవారి యీ పద్యం:
తొలినాళుల పద్యార్థము
తెలియనిచో పాఠకునిది తెలియమి, యీ నా
ళుల వ్రాసిన కవి దోషము
కలి ముదిరిన కొలది చిత్రగతులన్ నడచెన్!
పాత రోజుల్లో ఒక పద్యానికి అర్థం తెలియకపోతే అది పాఠకుని తెలియనితనం. అదే యీ కాలంలో, వ్రాసిన కవిదే తప్పు. ఏమిటో కలికాలం! – అని సుమారు ఒక ఏభయ్యేళ్ళ కిందట వాపోయారాయన! ఇది ముఖ్యంగా ఆ రోజుల్లో పద్యకవిత్వంపై వచ్చిన తీవ్ర నిరసనని దృష్టిలో పెట్టుకొని వ్రాసిన పద్యం. పద్యానికి అర్థం తెలియాలంటే దానికి పాఠకుడు కొంత పరిశ్రమ చెయ్యాలి. ఆ పద్యాన్ని ఎలా పదవిభాగం చేసుకోవాలో తెలిసుండాలి. అలా విభాగం చేసుకున్న పదాలకి ఆ సందర్భానికి తగిన అర్థాలు తెలిసుండాలి. ఇవన్నీ కలుపుకొని చదువుకుంటే పద్యం కొంత వరకూ అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అందులో మళ్ళీ ఏ శ్లేషో, మరో అలంకారమో, ధ్వనో ఉంటే దాన్ని గుర్తించే నేర్పుండాలి. అలా ఉండి చదివే పాఠకునికే పద్యార్థం పూర్తిగా బోధపడేది. అంటే కావ్యాలలో పద్యాలని అర్థం చేసుకోడానికి పాఠకులకి కూడా ఒక స్థాయి, కొంత అనుభవం అవసరం అన్నమాట.
మరి యిదే అంశం యీ నాటి కవిత్వానికి కూడా వర్తిస్తుందా? – అని ఆలోచిస్తూ ఉంటే, “There is then creative reading as well as creative writing” అన్న ఎమర్సన్ (Ralph W. Emerson) మాట గుర్తుకువచ్చింది. ఈ మధ్యన ప్రముఖ కవి అఫ్సర్ తన బ్లాగులో ఇంచుమించు ఇదే అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేశారు: కవిత్వం రాయడం కన్నా, కవిత్వం చదవడం గొప్ప కళ అనిపిస్తోంది ఈ మధ్య. అటు ఎమర్సన్ పలుకు, ఇటు అఫ్సర్‌గారి చెణుకు, నా ఆలోచనలని మరింత బలపరిచాయి. కవిత్వం వ్రాయడం లాగానే, చదివి ఆకళించుకొని ఆస్వాదించడం కూడా అంతో ఇంతో సృజనతో కూడుకున్న పనే. దానికి కూడా కొంత పరిశ్రమ, అనుభవము నిస్సందేహంగా అవసరమే. ఇలా అంటే కొంతమంది ‘అభ్యుదయవాదులు’ ఉలిక్కిపడే అవకాశం ఉంది! వారి దృష్టిలో, సామాన్య జనానికి అర్థం కావడమనేది ఆధునిక కవిత్వపు కనీస లక్షణం. అలా కాకుండా ఏదో ఒక వర్గానికి చెందిన పాఠకులకి మాత్రమే కవిత్వం పరిమితమవ్వడం ఫ్యూడల్ ధోరణి అంటారు వాళ్ళు. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, కవిత్వం ఒకే వర్గానికి చెందిన పాఠకులకి పరిమితమవ్వాలి అని నేను అనలేదు. కవిత్వాన్ని అర్థం చేసుకోడానికి కొంత పరిశ్రమ అనుభవము అవసరమవుతాయని మాత్రమే నేనంటున్నాను. ఈ రెండిటికి తేడా ఏమిటన్నది అర్థం చేసుకోవాలంటే సాహిత్యచరిత్రని కొద్దిగా తిరగెయ్యాలి.
ప్రాచీనకాలం నుండి అభ్యుదయకవిత్వం ఆవిర్భవించే వరకూ కవిత్వానికున్న పాఠకవర్గం చాలావరకూ పరిమితమైనదే. పురాణాలైతేనేమి, కావ్యాలైతేనేమి, ప్రబంధాలైతేనేమి, చివరికి భావకవిత్వమైతేనేమి, వీటికి పాఠకులు చాలావరకూ పండితులూ కవులే. పురాణాలూ కావ్యాలు, పండితులు చెప్పడం ద్వారా సామాన్య జనంలోకి వచ్చి ఉండవచ్చు. వాటికి సామాన్యజనులు ‘శ్రోతలే’ కాని ‘పాఠకులు’ కారు. వాటిని చదివి అర్థం చేసుకొనే బాధ్యత పండితులదే. భావకవిత్వం కూడా వస్తువులో పెనుమార్పునీ రచనా శైలిలో కాస్త మార్పుని తీసుకువచ్చిందే తప్ప పాఠకవర్గంలో పెద్దగా మార్పు లేదు. ప్రాచీన కావ్య ప్రబంధాలని అర్థం చేసుకోడానికి అలంకారికుల ద్వారా ఒక framework ఏర్పాటయ్యింది. అది తెలిసిన పండితులకి వాటిని అర్థం చేసుకోడం పెద్ద కష్టం కాలేదు. కొత్తగా వచ్చిన భావకవిత్వం యీ frameworkకి ఒదగకపోవడం వలన దీన్ని అర్థం చేసుకోడం కష్టమయ్యింది. ఆ కారణంగా ఆ నాటి పండితుల నుండి గట్టి వ్యతిరేకతే ఎదురుకోవలసి వచ్చింది. అయితే క్రమేపీ ఆనాటి పాఠకవర్గానికి అది అలవాటు కావడం వల్లనైతేనేమి, కొందరు కవులు పండితులూ ఆ కవిత్వ తత్త్వాన్ని వివరించడం వల్లనైతేనేమి అది క్రమేపీ అధికశాతం పాఠకుల ఆమోదాన్ని పొందింది.
ఆ తర్వాత వచ్చిన అభ్యుదయ కవిత్వం, కవితా వస్తువులోనే కాక పాఠకవర్గంలో కూడా పెనుమార్పుని తీసుకువచ్చింది. ఈ పెనుమార్పులకి కారణం ఆనాటి సామాజిక పరిస్థితులలో చోటుచేసుకున్న మార్పులే. పండితులకీ, కవులకీ పూర్వకాలం నుండీ లభిస్తున్న రాజుల, జమిందారుల ఆదరణ, పోషణ క్రమేపీ తగ్గి పూర్తిగా పోయింది. పారిశ్రామికీకరణ వలన నశించిపోయిన కులవృత్తులు, పెరిగిన శ్రామికవర్గము, అక్షరాస్యులైన నిరుద్యోగవర్గము – వీళ్ళందరి సరసన పండితులు, కవులు చేరిపోయారు. దానితో ఆకాశమార్గంలో సాగే కవిత్వం భూమార్గం పట్టింది. సామాన్యుల కష్టనష్టాలు కవులకి అనుభవంలోకి వచ్చాయి. వారి కవిత్వానికి అవి వస్తువులయ్యాయి. ఇప్పుడా కవిత్వం రాజులని మెప్పించడానికి కాదు, జమిందారులు ఆస్వాదించడానికి కాదు. తమ తోటి బడుగు జీవుల, మధ్యతరగతి మనుషుల ఆవేదనతో ఆక్రోశంతో గొంతు కలపడానికి. అంచేత వాళ్ళే యీ కవిత్వానికి పాఠకవర్గమయ్యారు. మరి వీళ్ళకి కవిత్వం అర్థమయ్యేందుకు కావలసిన స్థాయి సహజంగానే ఉండదు కదా. వాళ్ళకి అర్థమయ్యేలా కవిత్వం చెప్పాలంటే నిఘంటువులు శ్మశానాలవుతాయి. ఛందస్సులు సర్పపరిష్వంగాలవుతాయి. అందుకే వాటిని ఛేదించుకుని అభ్యుదయకవిత్వం అవతరించింది. వస్తువుతో బాటు రూపంలోనూ మార్పు రావలసివచ్చింది. ఆ కవిత్వాన్ని అర్థంచేసుకోడానికి, కవితో సహానుభూతి చెందడానికీ, ఆనాటి పరిస్థితులు దోహదపడ్డాయి.
ఇది రెండు ముఖ్యమైన పరిణామాలకి దారితీసింది. ఒకటి, ఒక సామాజిక సిద్ధాంతాన్నో ఉద్యమాన్నో ఆలంబనగా చేసుకొన్న కవిత్వ సృష్టి. అభ్యుదయకవిత్వంతో ఆరంభమైన యీ పోకడ, విప్లవకవిత్వం, స్త్రీవాద కవిత్వం, దళితవాద కవిత్వం, ప్రాంతీయవాద కవిత్వం – ఇలా సాగుతూ పోయింది. రెండో ముఖ్య పరిణామం, పాఠకులు సామాన్య ప్రజలవ్వడంతో పాటుగా కవులు కూడా ఆ సామాన్యులే అవ్వడం. అంటే, ప్రత్యేకమైన వ్యుత్పత్తి అభ్యాసాలు లేకుండానే కవిత్వం వ్రాయవచ్చునన్న భావన స్థిరపడింది. ఇలాంటి కవిత్వాన్ని ఆకళించుకోవాలంటే ఆయా సాంఘిక పరిస్థితుల సిద్ధాంతాల కనీస అవగాహన తప్పనిసరి అవుతుంది. అది లేనప్పుడు సహజంగానే ఆ కవిత్వం మనసుకి పట్టదు.
ఈ కవితోద్యమాలకి సమాంతరంగాను, ఆ తరువాతా, తెలుగు కవిత్వంలో మరికొన్ని ధోరణులు చోటుచేసుకున్నాయి. ఒకటి – ఆధునికజీవితంలో పెరిగిపోయిన సంక్లిష్టత. ఈ సంక్లిష్టత కవిత్వంలో ప్రతిఫలించాలనే ఒక దృక్పథం మొదలయ్యింది. ఈ దృక్పథం కలిగిన కవులు సామాన్యప్రజలు కారు. విద్యావంతులూ, దేశీయ విదేశీయ సాహిత్యంతో పరిచయమున్న వారూను. వీరు కవిత్వంలో సంక్లిష్టతను, అస్పష్టతను ప్రవేశపెట్టారు. సహజంగానే ఇది ఎక్కువ మంది పాఠకులకి అర్థంకాదు, ఆస్వాదయోగ్యం కాదు. అధివాస్తవికత, విధ్వంసవాదము, ఆధునికానంతరత మొదలైన ధోరణులు యీ కోవకి చెందుతాయి. ఆయా ధోరణులతో పరిచయము, వాటిలో అభిరుచి ఉన్న పాఠకులకి మాత్రమే ఆయా ధోరణులలో వచ్చిన కవిత్వం ఆస్వాద యోగ్యమవుతుంది. ఆధునిక జీవితంలోని సంక్లిష్టత మరొక పరిణామానికి కూడా దారితీసింది. కవులలో పెరిగిన తాత్త్విక చింతన. ఇక్కడ కూడా యీ కవులు విద్యావంతులూ, సాహిత్యపరిజ్ఞానం కలిగినవాళ్ళును. కవిత్వసృజనని ఒక యోగంగా భావించి, తమ అంతరంగ శోధనే కవిత్వంగా మలిచినవాళ్ళు వీరు. వీరు తమకోసమే కవిత్వం వ్రాసుకొనే వాళ్ళు. అందుచేత వీరి కవిత్వాన్ని అర్థం చేసుకోవాలన్నా కూడా, దాని వెనకనున్న తత్త్వంతో పరిచయమూ అందులో అభినివేశమూ తప్పనిసరి అవుతుంది.
ఈ రెండు పరిణామాలు కాకుండా, ఇంకొక ముఖ్యపరిణామాన్ని కూడా గమనించవచ్చు. అదేమిటంటే, కవిత్వం సామాజికపరిస్థితులకి అద్దంపట్టాలని అంగీకరిస్తూనే, దాని అభివ్యక్తిలో మాత్రం ప్రత్యేకత తప్పనిసరిగా ఉండాలని భావించే కవులు తయారుకావడం. కేవల ఉద్యమస్ఫూర్తితో వ్రాసే కవుల కవిత్వం జానపద కవిత్వమనుకుంటే, యిలాంటి కవులది మార్గకవిత్వ ధోరణి అనుకోవచ్చు. అంటే, యీ కవులు కూడా సాహిత్యపరిజ్ఞానం బాగా ఉన్నవాళ్ళే అన్నమాట. సామాన్యప్రజలకి వీరి కవిత్వం అర్థమవుతుందని చెప్పడానికి వీలులేదు. వ్యంగ్యమో, ప్రతీకలో, పదచిత్రాలో వీరి కవిత్వానికి పనిముట్లు. అందువల్ల వీరి కవిత్వం అర్థం కావాలంటే, ఆయా సాంఘిక పరిస్థితులతో పాటు, ఇలాంటి కవిత్వ నిర్మాణ పద్ధతులతో కూడా పాఠకులకి పరిచయముండాలి.
అతి స్థూలంగా చెప్పుకుంటే, ఆధునిక కాలంలో కవిత్వం యిన్ని పరిణామాలను పొందింది. ఇంకా పొందుతూనే ఉంది. పైన చెప్పినవి చాలా స్థూలమైన విభాగాలే. వీటికి అపవాదాలుగా వచ్చిన కవిత్వం ఉంది. అనేక ధోరణుల మిశ్రమంగా కనిపించే కవిత్వమూ ఉంది. కవిత్వాన్ని అర్థం చేసుకొనే దిశలో నాకు తోచిన కొన్ని ధోరణులని మాత్రమే నేనిక్కడ ప్రస్తావించాను. ఆధునిక కవిత్వాన్ని అర్థం చేసుకోవాలనుకొనే వాళ్ళకి వీటితో కొంతైనా పరిచయం అవసరం. “సరేనండి, ఆధునిక కవిత్వంలో యిన్ని రకాల ధోరణులున్నాయి బాగానే ఉంది. ఇంతకీ వీటిని అర్థం చేసుకోడం ఎలా? కావ్యాలలో పద్యాలకి ప్రతిపదార్థ తాత్పర్యాలని ఇచ్చేవాళ్ళుంటారు. వాటిని చదివితే అది బోధపడుతుంది. మరి ఆధునిక కవిత్వానికి అలాంటిదేదయినా ఎందుకు ఇవ్వకూడదు?” అని నిజాయితీగానే అడిగే పాఠకులుంటారు. దీనికేమిటి సమాధానం? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే, ప్రాచీన ఆధునిక కవిత్వాలలో ఉన్న ఒక ముఖ్యమైన తేడాని గమనించడం చాలా అవసరం.