రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

నాకు నచ్చిన పద్యం: దాంపత్య మధురిమ – కవిత్వ మాధురీమహిమ

రచన: భైరవభట్ల కామేశ్వరరావు
సెప్టెంబర్ 2015

శాస్త్రీయసంగీత ప్రియులకు స్వరప్రస్తారాలు బాగా పరిచితమే! రాగ లక్షణాన్ని సంపూర్ణంగా దర్శింపజేయడానికో, పాటలోని భావావస్థితిని పైస్థాయికి తీసుకువెళ్ళడానికో (లేదా తమ గానవైదుష్యాన్ని ప్రదర్శించడానికో!) గాయకులు చేసే స్వరప్రస్తారం శ్రోతలను సమ్మోహితులను చేస్తూ ఉంటుంది. వాటికంటూ ఒక ప్రత్యేకతతో గాయకుని మనోధర్మానికి అద్దంపడుతూ అవి శోభిస్తాయి. అయితే కొన్నిసార్లు, పాట మధ్యలో ఒక స్వరమో, ఒక చిన్న గమకమో, ఊహించని విధంగా వినిపించి పాటకీ రాగానికీ ఒక కొత్త కాంతిని తీసుకు వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. వాటిని ఆ పాటనుంచి వేరు చేసి చూసే అవకాశం ఉండదు. కావ్యాలలోని పద్యాలు కూడా సరిగ్గా యిలాగే ఉంటాయి. కవి తన కల్పనాచాతుర్యంతో చేసే వర్ణనలు స్వరప్రస్తారాల లాగా పాఠకులని అబ్బురపరుస్తాయి. కొన్ని పద్యాలు మాత్రం మనం ఊహించని విధంగా, కథాగమనంలో తళుక్కున మెరిసి, కథకో అందులోని పాత్రలకో కొత్త వెలుగుని అందిస్తాయి. అలాంటి ఒక ముచ్చటైన పద్యాన్ని గురించి యీ నెల ముచ్చటించుకొందాం.

ఆ పద్యం ఏమిటో చెప్పుకొనే ముందు, అది వచ్చే కథనూ, అంతకన్నా ముఖ్యంగా ఆ కథలోని నాయికానాయకులనూ, పరిచయం చేసుకోవాలి. మన మునులందరిలోనూ అగస్త్య ముని అంటే నాకు ఎందుకో చెప్పలేని అభిమానం. ఆయన ఒక సాహసికుడు. వింధ్య గర్వాన్ని అణచినా, సముద్రాన్ని పుక్కిటబట్టినా, వాతాపిని జీర్ణం చేసుకొన్నా – అతని కథలన్నీ అద్భుత సాహసాలే! పైగా, ఈ పనులన్నీ ఆయన చేసింది తన స్వార్థం కోసమో, లేదా తన కోప కారణంగానో కావు. అన్నీ పరోపకారం కోసం చేసిన మహాకార్యాలే. ఆ అగస్త్యుడే ఈ రోజు మన కథానాయకుడు. సాక్షాత్తూ ఆయనకు సహచరి, సహధర్మచారిణి, లోపాముద్ర. ఆవిడే కథానాయిక. వాళ్ళది ఒక అపురూపమైన దాంపత్యం! తనకు దీటైన అమ్మాయి ఎవరూ భూప్రపంచం మొత్తంలో కనిపించకపోతే అగస్త్యుడే స్వయంగా ఆమెను తయారు చేశాడని ఒక కథ. లోపాముద్ర అగస్త్యునికి సరైన జోడీగానే కనిపిస్తుంది. తాపసులకు కూడా సంసార బాధ్యత ఉందనీ, తనను పట్టించుకోవడం అతని కర్తవ్యమనీ, ఆమె అగస్త్యుని నిలదీసినట్టు అర్థం వచ్చే రెండు సూక్తాలు, ఆమె పేర అతి ప్రాచీనమైన ఋగ్వేదంలో ఉన్నాయి! జ్ఞానమూ సౌందర్యమూ కలగలిసిన లలితాదేవి స్వరూపంగా లోపాముద్రను చాలామంది భావిస్తారు. అగస్త్యుని విషయం సరేసరి! అతను సాహసికుడే కాదు గొప్ప శస్త్రాస్త్ర కోవిదుడు కూడా. ఆదికావ్యమైన రామాయణంలో అతను ప్రముఖంగా కనిపిస్తాడు. అగస్త్యుని గొప్పతనం తెలిసిన రాముడు అరణ్యవాసంలో అతని గురించి వెతుక్కుంటూ వెళతాడు. ముందు ‘అగస్త్య భ్రాత’ను కలిసి, అతని ద్వారా అగస్త్యుని కలుస్తాడు. అగస్త్యుడు రామలక్ష్మణులకి అనేక అస్త్రాలను ప్రసాదిస్తాడు. తిరిగి యుద్ధకాండలో దర్శనమిచ్చి, రామునికి ఆదిత్యహృదయాన్ని బోధిస్తాడు. ఉత్తరరామాయణంలో కూడా అగస్త్యుని ప్రస్తావన ప్రముఖంగా వస్తుంది. మహాభారతంలో కూడా ద్రోణునికి బ్రహ్మాస్త్రాన్ని అందించిన మహర్షి అగస్త్యుడే. లోకకల్యాణం కోసం అగస్త్యుడు ఉత్తరభారతం నుండి దక్షిణానికి తరలి వచ్చినట్టుగా కథలున్నాయి.

తమిళదేశంలో కూడా చాలా ప్రసిద్ధి పొందిన ముని అగస్త్య మహాముని. అతన్ని ముద్దుగా, కురుముని (అంటే పొట్టి ముని) అని పిలుస్తారు. తమిళభాషకూ వ్యాకరణానికీ ఆద్యునిగా తమిళులు అగస్త్యుని చాలా గౌరవిస్తారు. తమిళనాట చాలాచోట్ల అతని పేర అగస్త్యేశ్వర ఆలయాలున్నాయి. గొప్ప ఔషధసిద్ధునిగా కూడా అగస్త్యుని పేరు ప్రసిద్ధి చెందింది. దక్షిణభారతదేశంలో ప్రసిద్ధమై నాడీ జ్యోతిషానికి కూడా అగస్త్యుడే ఆద్యుడని నమ్ముతారు. అంటే, అగస్త్యుడు భారతదేశం మొత్తం మీద గొప్ప పేరున్న ముని అన్నమాట! ఉత్తర దక్షిణ భారతదేశ సంస్కృతులలో కనిపించే ప్రసిద్ధ వ్యక్తి కావడంతో, ప్రాచీన భారతచరిత్ర పరిశోధకులకు కూడా అగస్త్యుడు చాలా ముఖ్యమైన వ్యక్తి. సింధునాగరికతలో కనిపించే రెండు ప్రముఖ చిహ్నాలు అగస్త్యుని పేరుని సూచిస్తాయని ఐరావతం మహదేవన్ అనే ప్రసిద్ధ పరిశోధకుడు పేర్కొన్నారు. అగస్త్యునికున్న మరో ప్రత్యేకత, తమాషాగా చెప్పుకోవాలంటే, మనకు తెలిసిన మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీలలో అతనొకడు! రెండవవాడు వశిష్ఠుడు. మిత్రావరణులు అనే దేవతల ద్వారా కుండలో పుట్టిన కవల పిల్లలు అగస్త్యుడు, వశిష్ఠుడూను.

ఇన్ని రకాలుగా అగస్త్యుడు భారతీయ సంస్కృతిలో చాలా విశిష్టత కలిగిన ముని. ఆయన గురించి చాలా చోట్ల చాలా కథలున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ ధూర్జటి రచించిన శ్రీకాళహస్తిమాహాత్మ్యం అనే కావ్యం లోది. ఈ కథను స్వయంగా పరమశివుడే మాయాజంగముని వేషంలో వచ్చి శ్రీకాళహస్తిని పాలించే యాదవరాజుకు చెపుతాడు. కథ మొదలవుతూనే అగస్త్యుని మహత్వం మనకి స్పష్టంగా తెలుస్తుంది. శివపార్వతుల పెండ్లి వేడుక చూడాలని దక్షిణ దిక్కున ఉన్న సమస్త భూతకోటీ హిమాలయాలకు తరలి వస్తుంది. దానివల్ల ఉత్తరదిశపై భారం పెరిగి అది క్రుంగి పోతుంది. అప్పుడు శివుడు అగస్త్యునితో, “యీ ఉపద్రవాన్ని మాన్పడం నీకూ నాకూ తప్ప మరింకెవ్వరికీ సాధ్యపడదు. కాబట్టి నువ్వు వెంటనే దక్షిణ దిక్కుగా ప్రయాణం కట్టు,” అని అజ్ఞాపిస్తాడు. శివుని ఆజ్ఞకు కట్టుబడి అగస్త్యుడు తన యిల్లాలితో దక్షిణానికి ప్రయాణమవుతాడు. ఈ కథ, తమిళంలో అతిప్రాచీనమైన వ్యాకరణ గ్రంథం తొల్కాప్పియన్‌లో కనిపిస్తుంది. అలా బయలుదేరిన అగస్త్యుడు దక్షిణకైలాసంగా ప్రసిద్ధి పొందిన కాళహస్తి చేరుకొని అక్కడి శివలింగాన్ని దర్శించి పూజిస్తాడు. అంతటి గొప్ప పుణ్యస్థలం కూడా, దగ్గర నది లేని కారణంగా వెన్నెల లేని పున్నమి జాబిలిలా కళాకాంతులు లేకుండా ఉందని భావించి, ఆకాశగంగను అక్కడ ప్రవహింపజేయాలని సంకల్పిస్తాడు. దానికై పరమశివుని గూర్చి తపస్సు చేయాలనుకొంటాడు. కాళహస్తికి దక్షిణంగా నాలుగుయోజనాల దూరంలో ఉన్న మరొక పెద్ద పర్వతాన్ని భార్యాసమేతుడై చేరుకొని, దానిమీద ఒక చక్కని ప్రదేశాన్ని ఎన్నుకొని దృఢదీక్షతో తపస్సు మొదలుపెడతాడు. ఎండా వానా చలీ – వేటికీ చలించకుండా తపస్సు సాగిస్తాడు. ఆ భీకరమైన తపస్సుకు జడిసి దేవతలందరూ బ్రహ్మతో సహా ఈశ్వరుని దగ్గరకు వెళతారు. “ఏ దేవాధిపతిత్వం కోసం అగస్త్యుడు ఆ ఉగ్రతపాన్ని చేస్తున్నాడో! అతని సంగతేదో చూడు మహాప్రభో!” అని మొరపెట్టుకొంటారు. శివుడు చిరునవ్వు నవ్వి “మీకు భీతినొందను బని లేదు, అగస్త్యముని దక్షిణరౌప్యధరాధరంబు దాపున నది లేని దుఃఖమున బూనె మహాతపమాచరింపగన్,” అని దక్షిణకైలాసమైన కాళహస్తి దగ్గర నదిలేని కారణంగా ఆర్తి చెంది అగస్త్యుడు దానికై తపస్సు చేస్తున్నాడు తప్ప తనకేదో కావలని కాదు సుమా అని దేవతలకు ధైర్యం చెపుతాడు. ఈ మాత్రం దానికి తాను వెళ్ళడమెందుకని బ్రహ్మను వెళ్ళి అగస్త్యుని కోర్కె తీర్చమని చెపుతాడు. శివుని ఆజ్ఞ మేరకు బ్రహ్మ ప్రత్యక్షమై, అగస్త్యుని కోరిక మేరకు ఆకాశగంగను అక్కడ సువర్ణముఖరీ నదిగా ప్రవహింపజేస్తాడు. అగస్త్యుని తపోమహిమకు అక్కడి మునులందరూ సంతోషించి:

శితికంఠు డద్రికన్యా
పతియై సుఖి యయ్యె భువనభవనంబున ద
త్ప్రతిగా లోపాముద్రా
పతివై సుఖివైతి వీవు పరమ మునీంద్రా

అని అగస్త్యా లోపాముద్రల గొప్పదనాన్ని కీర్తిస్తారు. ఆ తర్వాత దక్షిణాన ఉన్న యితర పుణ్యక్షేత్రాలను దర్శించడానికి సతీసమేతుడై అగస్త్యుడు బయలుదేరుతాడు. అదీ కథ!

ఇంతకీ ఈ నెల పద్యం సంగతేమిటి? వస్తున్నా, అక్కడికే వస్తున్నా. అగస్త్యుడు తన తపస్సు కోసం కాళహస్తికి సమీపంలోనే ఉన్న ఒక పర్వతాన్ని చూసి అక్కడికి చేరుకొంటాడని చెప్పాను కదా. “దక్షిణ కైలాస గోత్రంబునకుం జతుర్యోజన మాత్రంబున రాత్రించర దిశాభాగంబున నొక్క మహాశైలంబు గని” అన్న వచనం తరువాత వస్తుంది యీ పద్యం. సాధారణంగా ఆ సందర్భంలో ఎలాంటి పద్యాన్ని ఊహిస్తాం? “అటజని కాంచె భూమిసురుడు…” అన్న తరహాలో ఆ పర్వతాన్ని వర్ణించే పద్యమేదైనా ఊహించవచ్చు. లేదూ, అసలే వర్ణనా లేకుండా అగస్త్యుడు ఆ పర్వతాన్ని అధిరోహించి తపస్సు ప్రారంభించాడని మామూలుగా కథ నడిపించేయ వచ్చు. ఈ రెండూ కాకుండా, ఒక ముచ్చటైన దృశ్యాన్ని మన కళ్ళకు కట్టించాడు ధూర్జటి!

ఉ. చేరగబోయి యాత్మసరసీరుహలోచన కేలువట్టి వ
      క్షోరుహకుంభభారమున సూక్ష్మవలగ్నము పీడబొంద బొం
      దారయు వృత్తి రమ్మనుచు నాదరణంబున దోడుకొంచు విం
      ధ్యారి తదగ్రభాగమున కల్లన నెక్కి, ఝరాంబుధారలన్

పర్వతాన్ని చేరుకొని ఎక్కడం మొదలుపెట్టాడు అగస్త్యుడు. తానొక్కడే చకచకా ఆ కొండెక్కి లోపాముద్రని వచ్చేయమనలేదు. పాపం అసలే సన్నని నడుమేమో, అంత పెద్ద కొండ ఎక్కేటప్పుడు ఆమెకి నడుమునొప్పి రాక మానదు. అది గ్రహించిన అగస్త్యుడు, తానొక అడుగు ఎక్కి, ఆమె చేయిపట్టుకొని, ప్రేమగా రమ్మని పిలిచి, ఎక్కిస్తూ, ఎంతో ఆదరంతో జాగ్రత్తగా తనతో పాటు కొండ చివరికంటూ తీసుకువెళ్ళాడట. సరే ఆ తర్వాత అక్కడి జలపాతాలలో వారిద్దరూ సరిగంగ స్నానాలు చేశారు. ఎంత చూడముచ్చటైన దృశ్యమో కదా! అలాంటి సందర్భంలో యిలాంటి ఒక దృశ్యాన్ని ఊహించి చిత్రించడం సామాన్యమైన విషయం కాదు. అగస్త్యా లోపాముద్రల అన్యోన్య దాంపత్యం, వారి బాంధవ్యం లోని సౌందర్యం, ధూర్జటి మనసులో బలంగా నాటుకుపోయి ఉండాలి. దాన్ని వ్యంగ్యంగా చిత్రించడం ఎలా? నేరుగా చెప్పేస్తే అది కవిత్వం కాదాయె! సున్నితంగా స్ఫురింపజేసే అవకాశం కోసం ప్రతి సన్నివేశంలోనూ వెతుకుతూ వస్తూ ఉంటే, బహుశా ఇక్కడ అది అతనికి సాక్షాత్కరించిందేమో! దాంపత్యంలోని మధురిమను యింత లలిత మనోహరంగా చిత్రించే సన్నివేశాలు కావ్యాలలో చాలా అరుదుగా కనిపిస్తాయి!

ఇలాంటి పద్యాలను నిర్మించడం కూడా అంత సులువైన విషయం కాదు. వర్ణన అయితే, అందులోని విషయానికి తగిన పద్యరచన చేసేందుకు కొన్ని పూర్వ నిర్మిత పథకాలు ఉంటాయి. ఉదాహరణకు, చేసే వర్ణనలో అనేక అంశాల ప్రస్తావన ఉన్నట్టయితే, సీసపద్యాన్ని ఎన్నుకోవచ్చు. ఒక గంభీరమైన వర్ణనకు శార్దూల మత్తేభాలవంటి వృత్తాలని ఎన్నుకొని సమాసభూయిష్టమైన రచన సాగించవచ్చు. కానీ యిక్కడ విషయం అంత పెద్ద వర్ణన కాదు. అగస్త్యుడు తన భార్యను ఆప్యాయంగా వెంటపెట్టుకొని కొండ ఎక్కించే దృశ్యాన్ని చిత్రించాలి. మామూలుగా ఒక చిన్న పద్యంలో అలా ఎక్కించాడన్న విషయాన్ని మాత్రం చెప్పి ఊరుకొంటే పాఠకుల మనసులో అది ముద్రపడదు. అంచేత పద్యరచన సొగసుగా సాగాలి. కానీ అది చిత్రించే దృశ్యాన్ని మింగేయకూడదు. ఎన్నుకొనే ఛందస్సు మొదలుకొని, దాన్ని చివరికంటూ నిర్మించే దాకా యిది కవికి కత్తిమీద సామే! దాన్ని సమర్థంగా నిర్వహించి తన పలుకుల మాధురీ మహిమతో చక్కని దృశ్యాన్ని మనముందుంచాడు ధూర్జటి. తన భార్య చేయిపట్టుకొని అనడానికి ఆత్మ సరసీరుహలోచన కేలువట్టి, అన్నాడు. ఆ సన్నివేశంలో అగస్త్యునికి లోపాముద్ర ‘సరసీరుహలోచన’గా కనిపించిందన్న మాట. ఎన్నో ఏళ్ళు సంసారం చేసిన తర్వాత కూడా భార్య భర్తకు సరసీరుహలోచనగా కనిపించండం ఎంత అరుదో, ఎంత అదృష్టమో వేరే చెప్పక్కర లేదు కదా! ఆత్మ అన్న పదం, ఆమె అతనికి ఎంత దగ్గరో సంపూర్ణంగా అవగతం చేస్తుంది. ఆవిడ వక్షోరుహకుంభభారము, సూక్ష్మ వలగ్నము కూడా అగస్త్యుని దృష్టిలో ఉన్నాయి. అందుకే, పొందు ఆరయు వృత్తి (తన స్నేహమంతా తెలిసేలా) ఆమెను పిలిచాడు. ఆదరణంబున తోడుకొంచు కొండ నెక్కించాడు. ఇక్కడ ‘తోడుకొని’ అని క్త్వార్థకం (భూతకాలాన్ని సూచించేది) కాకుండా ‘తోడుకొంచు’ అని శత్రర్థకాన్ని (అంటే వర్తమాన కాలాన్ని సూచించే క్రియ) ప్రయోగించడం ద్వారా, అగస్త్యుడు తన వెంట చివరికంటూ లోపాముద్రను తీసుకువెళ్ళడాన్ని ధూర్జటి చక్కగా ధ్వనింపజేశాడు. అగస్త్యునికి ‘వింధ్యారి’ అని ఉపయోగించాడు. మామూలుగా చూస్తే యిది కేవలం ప్రాసకోసం వేసినట్టుగా అనిపించవచ్చు. కాని ఒక్క క్షణం ఆలోచిస్తే అందులోని గొప్పతనం స్ఫురిస్తుంది. అప్పుడది మామూలు దృశ్యం కాదు. మహాపర్వతమైన వింధ్య గర్వాన్ని అణచిన గొప్ప మహిమాన్వితుడు, ఒక సామాన్య సంసారిలా తన భార్యతో ఒక చిన్న కొండ నెక్కే దృశ్యం. ఎంత ఆశ్చర్యం!

అదీ అగస్త్యుని వ్యక్తిత్వం!

    
   

11అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    Santhaiah September 2, 2015 6:22 am

    చాల చక్కటి వర్ణన.

  2. 2
    v r veluri September 2, 2015 2:59 pm

    కామేశ్వరరావుగారూ! మీరంటే నాకు అసూయ! చక్కని పద్యం ఎత్తుకోవటం, దాన్ని మరింత చక్కగా వ్యాఖ్యానించటంలో మీకు మీరే సాటి. అయితే లోపాముద్రకి సన్నటి నడుము అని మహ చక్కగా తప్పించుకొని పోయారు! ఆవిడగారి నడుము సన్నగా కనపడటానికి అసలు కారణం “వక్షోరుహకుంభభారమున,” అన్న విశేషం వివరించకుండా వదిలేశారు. నా లాంటి అర్భకుడికి అలాంటి వర్ణనలే ‘పసందు’గా కనిపిస్తాయి, వినిపిస్తాయి.

    మంచి కథ చెప్పారు.మరయితే,ఋగ్వేదంలో రెండు సూక్తాలూ ఎందుకు వదిలి పెట్టారు? మాలాంటి వాళ్ళకి హోం వర్కా?

    ప్రతిసారీ మీరు ఈమాటలో వ్యాఖ్యానించే పద్యం పై కామెంట్ రాద్దామనుకుంటాను.వాయిదాలతో కాలం వెళ్ళబుచ్చటం ఆనవాయితీ అయ్యింది, ఇప్పటి వరకూ.

    వేవే

  3. 3
    v r veluri September 5, 2015 11:38 pm

    rig vEda saMhita ( Hymn 1.179)

    These were the suuktaa-s attributed to Lopaamudra and Agastya in the rigvERda saMhita,which Sri Kameswara Rao garu mentioned in passing in his beautiful explanation and analysis of Dhurjati’s fascinating poem.

    In particular, the two suuktaa-s of Lopamufra clearly show the strong character and personality of Lopamudra. In passing, I should add that all the Vedic women sages were strong and independent thinkers. They have straightened their men and set them on the right path.

    [1.179.1] pUrvÍr aháM sharádaH shashramANÁ doSÁ vástor uSáso jaráyantIH

    [1.179.1] minÁti shríyaM jarimÁ tanÚnAm ápy U nú pátnIr vRSaNo jagamyuH

    [1.179.2] yé cid dhí pÚrva RtasÁpa Ásan sAkáM devébhir ávadann RtÁni

    [1.179.2] té cid ávAsur nahy ántam ApúH sám U nú pátnIr vRSabhir jagamyuH

    [1.179.3] ná mRSA shrAntáM yád ávanti devÁ víshvA ít spRdho abhy àshnavAva

    [1.179.3] jáyAvéd átra shatánItham AjíM yát samyáñcA mithunÁv abhy ájAva

    [1.179.4] nadásya mA rudhatáH kÁma Ágann itá ÁjAto amútaH kútash cit

    [1.179.4] lópAmudrA vRSaNaM nÍ riNAti dhÍram ádhIrA dhayati shvasántam

    [1.179.5] imáM nú sómam ántito hRtsú pItám úpa bruve

    [1.179.5] yát sIm Ágash cakRmÁ tát sú mRLatu pulukÁmo hí mártyaH

    [1.179.6] agástyaH khánamAnaH khanítraiH prajÁm ápatyam bálam ichámAnaH

    [1.179.6] ubhaú várNAv RSir ugráH pupoSa satyÁ devéSv AshíSo jagAma.

    ‘Through many autumns have I toiled and laboured, at night and morn, through age-inducing dawnings.

    Old age impairs the beauty of our bodies. Let husbands still come near unto their spouses.

    For even the men aforetime, law-fulfillers, who with the Gods declared eternal statutes,–

    Superemus in hac centum artium pugna in qua duas partes convenientes utrinque commovemus. / qui me despicit, utrum hinc utrum illinc ab aliqua parte nata sit.

    They have decided, but have not accomplished: so now let Wives come near unto their husbands

    This Soma I address that is most near us, that which hath been imbibed within the spirit,

    To pardon any sins we have committed. Verily mortal man is full of longings. / Agastya thus, toiling with strong endeavour, wishing for children, progeny and power.

    The above translation is due to Ralph. T. H. Griffith. The English translation for verse 111 was not found in the Griffith’s original.

    No problem.

    Wendy Doniger did translate 108 selected hymns from the Rigveda and the Penguin Books brought out a paperback (1984).

    See The Rig Veda, Penguin Classics by Wendy O’Flaherty ( Trust me, she is the same famous professor from Chicago who now goes by the name Wendy Doniger).

    Her translation of the hymn 1.179 is as follows:

    Lopaamudra : ‘For many autumns past I have toiled, nught and day, and each dawn has brought old age closer, age that distorts the glory of bodies. Virile men should go to their wives.
    For even the men of the past, who acted according to the Law and talked about the Law with the gods, broke off when they did not find the end. Women should unite with virile men.

    Agastya: ‘Not in vain is all this toil, which the gods encourage. We two must always strive against each other, and by this we will win the race that is won by a hundred means, when we merge together as a couple.’

    Lopamudra: ‘Desire has come upon me for the bull who roars and is held back, desire engulfing me from this side, that side, all sides.’

    The poet: Lopamudra draws out the virile bull: the foolish woman sucks dry the panting wise man.

    Agastya: ‘By this Soma which I have drunk, in my innermost heart I say: Let him forgive us if we have sinned, for a mortal is full of many desires.’

    Agastya digging with spades, wishing for children, progeny, and strength, nourished both ways, for he was a powerful sage. He found fulfiment of his real hopes among the gods.

    Of course, there is a some copious notes for each verse by Doniger. And, I do not want to bother the reader with it.

    — V R Veluri

  4. 4
    కామేశ్వరరావు September 6, 2015 3:20 pm

    వేలూరిగారు,
    Thanks for your comments. నా రాతల్లోని తప్పులు దిద్దడం, ఖాళీలు పూరించడం అనే విషయాల్లో ఈమాట పాఠకులపై నాకున్న భరోసాని మరోసారి నిలబెట్టారు. ఈ సూక్తాలకు రెండు మూడు చోట్ల (నెట్లో వెతికితే) కాస్త భిన్నమైన అర్థాలు కనిపించాయి. ఏది “authentic”, ఏది కాదు అన్నది నాకు తెలియదు కాబట్టి వాటి జోలికి వెళ్ళలేదు. దాశరథి రంగాచార్యులుగారి అనువాదంలో యీ సూక్తాలు ఉన్నాయేమో చూడాలి.

    ఇక “ఒత్తుకొని వచ్చు” వాటి గురించి ఒత్తి చెప్పడమెందుకని ఊరుకొన్నాను. తెలిసినవాళ్ళకి వివరించనక్కర లేదు, తెలియని వాళ్ళకి వివరించినా తెలియదు 🙂

    మీ ప్రోత్సాహానికి మరోసారి ధన్యవాదాలు!

  5. 5
    వేలూరి వేంకటేశ్వర రావు September 7, 2015 1:10 pm

    కామేశ్వర రావు గారూ:

    దాశరథి రంగాచార్యుల గారి శ్రీ మదాంధ్ర వచన ఋగ్వేద సంహితలో ఉన్న అనువాదం ఇది:

    నూటడెబ్బది తొమ్మిదవ సూక్తము

    ఋషి 1-2 లోపాముద్ర, 3-4 అగస్త్యుడు, 5-6 బ్రహ్మచారి,
    దేవత – రతి, చందస్సు – 1-4,6 త్రిష్టుప్, 5 బృహతి.

    1. లోపాముద్ర అనుచున్నది:

    అగస్త్యా!అనేక సంవత్సరాలనుండి రాత్రింబవళ్ళు జరాకారకమగు ఉషస్సులందు నిన్ను సేవించినాను. అలసినాను. ముదిమి శారీరక సౌందర్యమును నష్టపరచును. అప్పుడు పురుషుడు స్త్రీ వద్దకు ఏల చేరవలెను?

    2. అగస్త్యా! ప్రాచీనులు సత్యపాలకులు అగు ఋషులు దేవతలతో సంభాషించినారు. వారికి కూడ రేతస్ఖలనము జరిగినది. వారికి సహితము అంతుపట్టలేదు, పురుషుడు స్త్రీ వద్దకు ఏల చేరవలెను?

    3. అగస్త్యుడు అనుచున్నాడు:

    మనము వట్టిగా అలసిపోలేదు. దేవతలు మనని రక్షించుచున్నారు. మనము సర్వభోగములను అనుభవించవచ్చును. మనము ఇద్దరము కోరినచో ఇహ లోకములందలి వందల కొలది భోగములను సాధించగలము. అనుభవించగలము.

    4. నేను జయము, సంయమము కోరి ఉన్నాను. అయినను ఏ కారణముననో ఏదో కారణమున నాకు కామవాంఛ కలిగినది. లోపాముద్ర పతితో సంగమించవలెను. అధీరయగు నారి బలవానుడగు పురుషునకు ఉపభోగ్యము కావలెను.

    5. శిష్యుడు అనుచున్నాడు:

    మనసుతో త్రావిన సోమమును హృదయ పూర్వకముగా ప్రార్థించుచున్నాను. సోమను నాకు సుఖమును ప్రసాదించవలెను. లీపులు కామోహి మర్త్యః మానవుడు అనేక కోరికలవాడు.

    (సోమమునకు చంద్రపరమగు అర్థము ఉన్నది)

    6. అగస్త్యుడు మహిమాన్వితుడు అగు ఋషి. అతడు అనేక ఉషస్సులను ఉపాసించినాడు. అతడు బలము కోరినాడు. పుత్రులను కోరినాడు. తపమాచరించినాడు. కామము అనుభవించినాడు. ఉభయములను పాలించినాడు. అగస్త్యుడు దేవతలనుండి వాస్తవ ఆశీస్సులు అందుకున్నాడు.

    విధేయుడు,

    వేలూరి వేంకటేశ్వర రావు.

    పి. యస్. ఏ అనువాదం సమంజసముగా ఉన్నదో ఊహ తెలిసిన పాఠకులు నిర్ణయించగలరు.

  6. 6
    SeshaKumar KV September 11, 2015 8:03 am

    ఒక పద్యాన్ని సాధారణంగా చదువుకుంటూ పోతే అందులో ప్రత్యేకతలు గోచరించవు.విషయం తెలిసివస్తుందేమో కానీ విశేషాలు తెలియవు.శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు గారు విపుల వ్యాఖ్యనం లో ఎన్నో సంగతులను తెలిపారు. ముఖ్యంగా శాస్త్రీయసంగీత స్వరప్రస్తారాలను, కవి తన కల్పనాచాతుర్యంతో చేసే వర్ణనల తో పోల్చడం గొప్పగా ఉంది. మంచి పద్యాలను మరిన్నింటిని ఇటువంటి వ్యాఖ్యానాల తో ఇవ్వవలసింది గా మనవి.( “ఒక సంచిక కు ఒకే పద్యం”- అనే నియమము ఏదైనా ఉంటే అది సడలింప ప్రార్థన.)

    శ్రీయుతులు కామేశ్వరరావు గారికీ, వేలూరి వేంకటేశ్వర రావు గారికీ కృతజ్ఞతా పూర్వక వందనాలు.

  7. 7
    indrakanti pinakapani September 12, 2015 10:54 am

    This time I couldn’t get your meaning. May be dihhajaalamkaara is due to the undue hype you created through the little longer prologue-like svara, Prastavana or may be due to lack of rasagnyatha on my side, I am I can only see a simple sahajalamkara. May be those lopaamudra suuktha reference only making the poem peculiar.

  8. 8
    కామేశ్వరరావు September 12, 2015 11:13 pm

    వేలూరిగారు, మరోసారి ధన్యవాదాలు! సామంజస్యం మాట ఎలా ఉన్నా, నాకు తెలుగు అనువాదం కాస్త స్పష్టంగా అర్థమయింది.

    శేషకుమార్‌గారూ, ధన్యవాదాలు.

    పినాకపాణిగారూ,

    I can only see a simple sahajalamkara

    True. It is indeed a simple sahajalamkara!

  9. 9
    indrakanti pinakapani September 17, 2015 8:14 am

    Sir here I want to add some (not so much but still) pidakala veta. There is one story in Ramayana that rama met so many muni s including agasthya bhratha., meaning he has no individual name or not so recognised because his bhratha agasthya over shadowed him with his achievement s. What I want to add is even agasthya’s earlier name was not known befor his achievement that is stopping a mountain from further growing And avoiding people’s problems. T’hey aga! Thishtha’ some thing like that agasthya spoke and as the mountain could not but obey . so the sage was named agasthya thus goes the etymology.

  10. 10
    ఏల్చూరి మురళీధరరావు September 17, 2015 1:36 pm

    శ్రీ ఇంద్రకంటి పినాకపాణి గారికి
    నమస్కారములతో,

    అగమును = వింధ్యపర్వతాన్ని, స్త్యాయతి = స్తంభింపజేయువాడు అన్న వ్యుత్పత్త్యర్థంలో అగస్త్యుడు, అగస్తి అని ఏర్పడినవి మీరన్నట్లు కాలాంతరసంక్రాంతములైన పేర్లై ఉండవచ్చును. కుంభమునందు జన్మించినవాడు కాబట్టి కుంభసంభవుడు, కుంభయోని, కుంభోద్భవుడు, కలశజుడు, కలశీసూనుడు; మిత్రావరుణుల సంతతి కనుక మైత్రావరుణి; ఊర్వశీపుత్త్రుడు కాబట్టి ఔర్వశేయుడు అన్నవి నిఘంటుపఠితాలు. “మిత్రావరుణయోః సూను రౌర్వశేయశ్చ వారుణిః” అని వ్యాడికోశం. అదే, అణ్ ప్రత్యయాంతమైనప్పుడు “వారుణః” అని నామలింగానుశాసనానికి భానుజీ దీక్షితుల సుధా వ్యాఖ్య. అందువల్ల ‘వారుణి’ అన్నది అగస్త్యునికి తొలి సంజ్ఞ యేమో అనిపిస్తున్నది. వింధ్యగర్వభంగానికి మునుపే అగస్త్యుడు భగవద్గీతను చదువుకొన్నాడని శ్రీనాథుని కాశీఖండం. అది పూర్వకల్పంలోని కథ కాబట్టి తదనంతరీయములైన పురాణేతిహాసాలలో అగస్త్య నామమే రూఢికెక్కిందని ఊహించాలి.

    అగస్త్యభ్రాత పేరు సుతీక్ష్ణుడని మలయాళకోశాలలో ఉన్నది. అలాగని అక్కడి రామాయణాలలో ఉన్నదేమో నాకు తెలియదు. అగస్త్యభ్రాత, సుతీక్ష్ణుడు వేర్వేరని “శరభంగం, సుతీక్ష్ణకమ్, అగస్త్యభ్రాతరం నత్వా అగస్త్యం” అని పద్మపురాణం (7-1) చెప్పింది. ఆ “అగస్త్యభ్రాత” మహాముని అని, అగస్త్యునికంటె మునుపు ఆయన ఆశ్రమాన్ని దర్శించి, ఆ తర్వాత అగస్త్యాశ్రమానికి వెళ్ళండని శ్రీమద్రామాయణం అరణ్యకాండ 11-వ సర్గలో సుతీక్ష్ణమహాముని సీతారాములకు చెప్పిన సన్నివేశం ఉన్నది. ఆయన పేరు సుదర్శనుడని వ్యాఖ్యాతలు వ్రాశారు. వావిళ్ళ వారు ప్రకటించిన శ్రీ చదలవాడ సుందరరామశాస్త్రి గారి తాత్పర్యంలో సుదర్శనుడనే ఉన్నది. పంచవటికి మునుపు అగస్త్యకూటానికి ఉత్తరాన సుదర్శనుని ఆశ్రమం ఉన్నదట.

    అగస్త్యుని నామాంతరం “సత్యాగ్ని” అని తెలుగు పర్యాయపదనిఘంటువులో జి.ఎన్.రెడ్డి గారు వ్రాశారు. అందుకు ఆధారమేమిటో నాకు తెలియరాలేదు. నామనిధాన కోశంలో “మైత్రావరుణా స్త్వాగ్నిమారుతాః” అని ఉన్నదని రామాశ్రమి అంటున్నది. అది ఈ భ్రాంతికి కారణమేమో తెలియదు.

    మున్ముందుగా చెప్పవలసిన మాట: శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు గారి హృద్య పద్యవివృతికి హార్దికాభినందనలు!

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  11. 11
    Vaduguru Sharma January 25, 2021 4:22 am

    చాలా చక్కటి విశ్లేషణ. భాష మీద చాలా పట్టుంది. చెప్పే విధానం అద్భుతం

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • నాకు నచ్చిన పద్యం: పండువెన్నెల పిండివంటలు!
  • పద్య శిల్పం
  • గడి-నుడి-2 సమాధానాలు
  • గడి నుడి – 11
  • పద్యాలు – వాడుకభాష

ఇటువంటివే…

  1. నాకు నచ్చిన పద్యం: ధూర్జటి చంద్రబింబపు వర్ణన
  2. నాకు నచ్చిన పద్యం: వామనావతారం
  3. నాకు నచ్చిన పద్యం: అలముకొన్న అదృశ్యాంజనం
  4. నాకు నచ్చిన పద్యం: ఊరుద్యుతి వర్ణన
  5. నాకు నచ్చిన పద్యం: వసంత కుసుమ వికాసం

సెప్టెంబర్ 2015 సంచికలో ...

  • అదీ ఇదీ వదలితే
  • ఈమాట సెప్టెంబర్ 2015 సంచికకు స్వాగతం!
  • ఎందుకో అలా!
  • ఎక్కడెక్కడ తిరిగేవు నాయనా
  • ఒక పద్ధతి ప్రకా…రం
  • చిత్రం – ‘బాపు’రే విచిత్రం!
  • టూఎయిటీన్ డీ
  • తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు
  • దృశ్యం
  • నాకు నచ్చిన పద్యం: దాంపత్య మధురిమ – కవిత్వ మాధురీమహిమ
  • పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం
  • ప్రత్యేక జనరంజని: పిఠాపురం
  • ప్రార్ధన: నువ్వే నేనవ్వు – 1వ భాగం
  • మాటల అక్షరాలు
  • వెడలెను కోదండపాణి
  • శ్రీమాన్ రీమాన్ ఉవాచ!
  • సినిమా
  • సౌభాగ్య కుమార మిశ్ర: మూడు ఒరియా కవితలు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం
వెడలెను కోదండపాణి

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.