కృష్ణం వందే జగద్గురుం

1970లలో సాలూరు రాజేశ్వరరావు సంగీతదర్శకత్వంలో పి. సుశీల పాడిన కృష్ణభక్తిగీతాల లాంగ్‌ప్లే రికార్డొకటి ‘కృష్ణం వందే జగద్గురుం’ అనే పేరుతో విడుదల అయింది. ఇటువంటి ప్రైవేట్ గీతాలకు సినిమాపాటలంత పేరు రాకపోవడం సహజమే కాని ఇప్పుడు మళ్ళీ వింటే శ్రోతలకు హాయిగా అనిపిస్తాయి. ఇంతకు మునుపు విననివారు వీటిని ఇంటర్నెట్‌లో వినవచ్చు.

వీటిలో జయదేవ, అన్నమయ్య, నారాయణతీర్థులు, క్షేత్రయ్య రచనలున్నాయి కనక సాహిత్యపరంగా, భక్తిభావపరంగా అన్నీ ఉత్తమశ్రేణి రచనలే. ఈ పాటలు వింటే రాజేశ్వరరావు శక్తిసామర్థ్యాలు అప్పటికీ తగ్గుముఖం పట్టలేదని మనకు తెలుస్తుంది. ఇటీవల 75 ఏళ్ళు నిండిన సందర్భంగా అభిమానుల మన్ననలందుకున్న సుశీల ఇవి పాడినప్పుడు అగ్రశ్రేణి గాయనిగా ఉండేదని కూడా అర్థమవుతుంది.

సినీసంగీతదర్శకుడుగా విశేషప్రతిభను కనబరిచి, అంతులేని ప్రజాదరణ పొందిన రాజేశ్వరరావు ఇందులో దృశ్యపరమైన ఒత్తిడులు లేనప్పుడు ట్యూన్లనూ, నేపథ్యసంగీతాన్నీ ఎలా స్వరపరుస్తాడో మనం గమనించవచ్చు. సందర్భం ఏదైనా పాట పాటే అని సామాన్యులకు అనిపిస్తుందేమో గాని సినిమాలకు విజయవంతంగా సంగీతరచన చేసేవారు కనబడుతున్న సన్నివేశం గురించిన పూర్తి అవగాహన కలిగి వుంటారు. ప్రైవేట్ పాటలకు బాణీలు కడుతున్నప్పుడు వారికి సాహిత్యమే ప్రధానం అవుతుంది. అది ఈ రికార్డులోని 12 పాటల్లోనూ మనం చూడవచ్చు. పైన ఇచ్చిన లింకులో పాటలు మరొక వరసలో వినబడతాయిగాని నేను మాత్రం రచనలపరంగా వాటి గురించి రాస్తాను.

(వీటిలోనివేకాక మరెన్నో అన్నమాచార్య కీర్తనల సాహిత్యం, కొన్నిటి ఆడియో, వీడియో లింకులతో సహా పొందుపరిచిన ఒక మంచి వెబ్‌సైట్ ఉంది. ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు.)

శ్లోకం:

వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం
అతసీపుష్పసంకాశం హారనూపుర శోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం

ఈ సంకలనానికి ఇందులోనిదే పేరుగా పెట్టారు. ఆరభి రాగంలో చక్కని ఆలాపన శైలిలో పాడిన శ్లోకమిది. కూచిపూడి నాట్యంలో లేఖ ఘట్టానికి ఇదే రాగం ఉపయోగిస్తారని మీకు గుర్తుకురావచ్చు.

నారాయణ తీర్థ రచనలు

1. గోవర్ధన గిరిధర గోవింద గోకులపాలక పరమానంద
    శ్రీ వత్సాంకిత శ్రీ కౌస్తుభధర భావక భయహర పాహి ముకుంద
    ఆనందామృత వారిధికేల అలఘు పరాక్రమ అనుపమ లీల
    శ్రీ నందాత్మజ శ్రితజనపాల శ్రీకర కిసలయ లాలనలోల
    పాటిత సురరిపు పాదప బృంద పావన చరిత పరామృతకంద
    నాట్యరసోత్కట నానాభరణ నారాయణ తీర్థార్చిత చరణ

కల్యాణి రాగంలో సుశీల చక్కగా పాడిన ఈ పాటలో ఎప్పటిలాగే ఆమెకున్న స్పష్టమైన ఉచ్చారణ వినిపిస్తుంది. సుశీల పెద్ద ‘దమ్మున్న’ గాయనికాదు. ఆమెకు పి.లీలకున్నంత శాస్త్రీయ సామర్థ్యంగాని, భానుమతికున్నంత నటనాకౌశలంగాని, జానకికున్నంత స్వరాల పట్టుగాని, జిక్కీ కున్నంత పంచ్‌గాని ఉండేవికావు. అయితే వీరందరికీ మించిన డిక్షన్ క్లారిటీ ఆమెకున్న ప్రత్యేకత. ఈ మధ్య గాయకుడు ‘మనో’ చెప్పినట్టుగా ఉచ్చారణ పట్ల ఆమె ఎంతో శ్రద్ధ పెట్టినందువల్లనే ఎంత చిన్న టీషాపు లోని బుల్లి ట్రాన్సిస్టర్‌లో రేడియో ప్రసారం విన్నా ఆమె పలికే మాటలు స్పష్టంగా వినిపిస్తాయి. తెలుగుదనం పలుకుతుంది. కవి రాసిన మాటలకు పూర్తి సాఫల్యం కలుగుతుంది. శైలిపరంగా చూస్తే దబాయించినట్టుగా పాడకపోవడమే ఆమెకు ప్రజాదరణ తెచ్చిపెట్టింది. ఘంటసాల లీలను డిస్కవర్ చేసి ఎంతగానో ప్రోత్సహించినప్పటికీ గుండమ్మకథ తరవాత సుశీలకే పెద్దపీట వెయ్యక తప్పలేదు.

2. పాహి పాహి జగన్మోహన కృష్ణ పరమానంద శ్రీ కృష్ణ
    నంద యశోదా నందన కృష్ణ ఇందువదన శ్రీ కృష్ణ
    కుందరదన కుటిలాలక కృష్ణ మందస్మిత శ్రీ కృష్ణ
    చంచల ఝళఝళ నూపుర కృష్ణ మంజుల వేష శ్రీ కృష్ణ
    తరళిత కుండల మండిత కృష్ణ తాండవలీల శ్రీ కృష్ణ
    సాధు సాధు నట వేష కృష్ణ సత్య సంధ శ్రీ కృష్ణ
    పాలిత నారాయణ తీర్థ కృష్ణ పరమపావన శ్రీ కృష్ణ

ఇది మోహన రాగంలోని పాట. ఈ రాగం రాజేశ్వరరావుకు హోంగ్రౌండ్ వంటిది. ఇందులో అతను చేసిన అద్భుతరచనలెన్నో ఉన్నాయి. ఇది మామూలు భక్తిగీతమే కనక ఇందులో తన మామూలు పద్ధతిలో కాక ధైవతంమీద ఎక్కువ ప్రస్తారం చేసినట్టుగా అనిపిస్తుంది.

జయదేవ అష్టపదులు

అష్టపదులకు ఒడిస్సీ కళాకారులూ, బెంగాలీలూ, కర్నాటకవిద్వాంసులూ ఇలా ఎంతోమంది ఎన్నో రకాల స్వరరచన చేశారు. అతి మధురమైన సాహిత్యంతో అలరించే ఈ సంస్కృత రచనలు ఒకరకంగా పబ్లిక్ ప్రోపర్టీ అయిపోయాయి. తెలుగువారికి మాత్రం బాలమురళి, ఘంటసాల, రాజేశ్వరరావు మొదలైనవారి సంగీతంవల్ల అవి తెలుగు రచనలే అనిపిస్తాయి. ఈ సంకలనంలో వీటికి హిందుస్తానీ రాగాల ఉపయోగం జరిగింది.

3. లలిత లవంగ లతా పరిశీలన కోమల మలయ సమీరే
     మధుకర నికర కరంబిత కోకిల కూజిత కుంజ కుటీరే
     స్ఫురదతి ముక్త లతా పరిరంభణ ముకుళిత పులకిత చూతే
     బృందావన విపినే పరిసర పరిగత యమునాజల పూతే
     శ్రీ జయదేవ భణితమితమిదం ఉదయతి హరిచరణ స్మృతిసారం
     సరస వసంత సమయ వనవర్ణనం అనుగతమదన వికారం

ఇది లలిత్ రాగంలో చేసిన పాట. దీన్ని పోలినది కర్నాటకంలో లేదు. రెండు మధ్యమాలూ వరసగా వినిపిస్తాయి. పంచమం ఉండదు. హిందీ సినిమాల్లో మదన్‌మోహన్ చేసిన ప్రీతం దరస్ దిఖావో అనే మంచిపాట లతా, మన్నాడే పాడినది ఒకటుంది. ఈ వీడియోలో స్వరాలుకూడా వినిపిస్తాయి.

ఆ తరవాత నౌషాద్ లీడర్ సినిమాకి మరొకటి చేశాడు. ఘంటసాల కుంతీకుమారిలో పాడిన చివరి పద్యాలు లలిత్ రాగంలోనివే. పై అష్టపది వీటన్నిటితో పోలిస్తే అంత గొప్పగా ఉండదు కాని రాగంమీద రాజేశ్వరరావుకున్న పట్టు మనకు తెలుస్తుంది.

4. నాథ హరే సీదతి రాధావాస-గృహే
     పశ్యతి దిశి దిశి రహసి భవంతం తద ధర-మధుర-మధూని పిబంతం
     త్వరిత ముపైతి న కథం అభిసారం హరిరితి వదతి సఖీం అనువారం
     శ్లిష్యతి చుంబతి జల-ధర-కల్పం హరిర్ ఉపగత ఇతి తిమిరం అనల్పం
     శ్రీజయ దేవ-కవేరిదం ఉదితం రసికజనం తనుతాం అతిముదితం

ఈ అష్టపది చంద్రకౌఁస్ రాగంలో వినిపిస్తుంది. తెలుగు పాటల్లో అరుదుగా వినబడే ఈ రాగం హిందోళం వంటిదే కాని నిషాదం మాత్రం మారుతుంది. సినిమా పాటలకు భిన్నంగా ఇందులో ఎక్కువ రాగాలాపన వినబడుతుంది. ఇది వినకముందు నేను బాలమురళి ఇదే పాటకు చారుకేశి రాగంలో చేసిన ట్యూన్ విన్నాను. అది నాకు ఎక్కువ బావుంటుంది. అయినా ఇదీ మంచి కాంపొజిషనే.

రామదాసు కీర్తనలు

రామభక్తుడైన వాగ్గేయకారుడుగా పేరు పొందిన రామదాసు కృష్ణుడి మీద కూడా పాటలు రాశాడని ఈ రికార్డువల్లనే నాకు తెలిసింది. పైగా ఇవి రెండూ సంస్కృతంలో రాసినవే. రామదాసుకు స్వంత మనిపించే తెలుగు నుడికారం లేకపోయినప్పటికీ ఇవి చక్కని పాటలు.

5. కమలనయన వాసుదేవ కరివరద మాం పాహి
    – అమల మృదుల నళిన వదన అచ్యుత ముదం దేహి
    జారచోర మేరుధీర సాధుజన మందార పారరహిత ఘోరకలుష భవజలధి విదూర
    నారదాది గానలోల నందగోపాల వారిజాసనానుకూల మండిత గుణశీల
    కామజనక శ్యామసుందర కనకాంబరధరణ రామదాస వందిత శ్రీ రాజీవాద్భుత చరణ

ఈ పాటకు స్వరరచన చేసినప్పుడు రాజేశ్వరరావుకు రేవతి రాగంమీద మోజు పెరిగినట్టుంది. ‘ఎవరికి ఎవరు’ అనే సినీగీతం కూడా ఇదే రాగంలో చేశాడు. హిందుస్తానీవాళ్ళు బైరాగీ భైరవ్ అని పిలిచే ఈ రాగం విషాదంగా వినిపిస్తుంది. తెలుగులో తక్కువగా వినబడే ఈ రాగం తెలుసుకోవడానికి ఈ పాట పనికొస్తుంది.

6. నందబాలం భజరే బృందావన వాసుదేవం బృందాలోలం
    జలజసంభవాది వినుత చరణారవిందం
    లలిత మోహన రాధావదన నళిన మిళిందం
    నిటలతటస్ఫుట కుటిల నీలాలక బృందం
    ఘటిత శోభిత గోపికాధర మకరందం
    గోదావరీ తీరవాస గోపికా కామం
    ఆదిత్యవంశాబ్ధిసోమం భద్రాద్రి శ్రీరామం

రాజేశ్వరరావు బహుశా సగం నిద్రలోకూడా అద్భుతంగా పలికించగల రాగాల్లో భీంపలాస్ (ఆభేరి) ఒకటి. ఈ పాట నడక చిన్నికృష్ణుడు చిన్నపాటి డాన్స్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ‘కృష్ణం’ అంటూ ఆలాపన చేయించడం అతని జీనియస్‌కు నిదర్శనం.

మువ్వగోపాల పదం

7. ఎంత చక్కనివాడే నాసామి వీడు
    ఇంతి మువ్వగోపాలుడు సంతతము నా మదికి సంతోషమే చేసెనే
    మొలకనవ్వులవాడే ముద్దుమాటలవాడే తళుకు చెక్కుటద్దములవాడే
    తలిరాకు జిగి దెగడదగు మోవిగలవాడే తెలిదమ్మి రేకు కన్నుల నమరువాడే
    పొదలు కెందామరల వెంపొదవు పదములవాడే కొదమసింగపు నడుము కొమరమరువాడే
    మదకరి కరముల మురువుచేతులవాడే సుదతి మువ్వగోపాలుడెంత సొగసుగలవాడే

క్షేత్రయ్య రచన లేని కృష్ణుడి పాటల సంకలనం అసంపూర్తిగానే అనిపిస్తుంది. రొమాన్స్ పుష్కలంగా ఉండే ఈ పాటను రాజేశ్వరరావు ఆభోగి రాగంలో అద్భుతంగా మలిచాడు. దీన్ని ఏ నాట్యప్రదర్శనకైనా తిన్నగా వాడుకోవచ్చు. చాలామంది వాడారేమో కూడాను. ఆభోగి సినిమాపాటల్లో తక్కువగా వినబడుతుంది. ఇందులోని బిట్స్‌లో ‘దాగరీగ దారిసారి సదమా మదసమదస మదరిసదమగరిస’ అనే వరస చాలా బావుంటుంది.

పదకవితా పితామహుడు

వెంకటేశ్వరుడిమీద ఎక్కువ రచనలు చేసిన అన్నమయ్య కృష్ణభక్తిగీతాలు ఇందులో మూడున్నాయి. తెలుగు పదకవితలో సాటిలేని మహాకవి రాసిన ఎంతో చక్కని రచనలకు రాజేశ్వరరావు ప్రతిభావంతంగా సంగీతం అందించగా, సుశీల అద్భుతంగా పాడింది.

8. చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడు చూడమమ్మ ఇటువంటి శిశువు
    తోయంపు కురులతోడ తూగేటిశిరసు, చింతకాయలవంటి జడలగములతోడ
    మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాలతోడ పాయక యశోద వెంట పారాడు శిశువు
    ముద్దుల వ్రేళ్ళాతోడ మొరవంక యుంగరాల నిద్దపు చేతుల పైడి బొద్దుల తోడ
    అద్దపు చెక్కుల తోడ అప్పలప్పలనినంత గద్దించి యశోద మేను కౌగిలించు శిశువు
    బలుపైన పొట్ట మీది పాల చారలతోడ నులివేడి వెన్నతిన్న నోరితోడ
    చెలగి నేడిదే వచ్చి శ్రీవేంకటాద్రిపై నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువు

తప్పటడుగులు వేసే తెలుగింటి పిల్లవాడు ఈ రచనలో మన కళ్ళముందు ఎంతో ముద్దుగా సాక్షాత్కరిస్తాడు. చదువుకోడానికే ఎంతో అద్భుతంగా, తెలుగుదనం ఉట్టిపడే ఈ రచనకు శంకరాభరణంలో స్వరరచన జరిగింది. ‘శంకరాభరణమూ’ అని తారస్థాయిలో గావుకేకపెట్టే మహాదేవన్ ట్యూన్ ఈ రాగభావాన్ని ఏ మాత్రమూ ప్రతిఫలించదు. (ఆ సినిమా గురించి అడిగితే బాలమురళిగారు ‘అందులో శంకరాభరణం ఏదీ?’ అని మాతో జోక్ చేశాడు). మంద్రస్థాయిలో హుందాగా పలికే ఈ రాగభావం ఈ పాటలో చక్కగా వినిపిస్తుంది. సంగీతదర్శకుడికి ఉండవలసిన సంస్కారం ఇటువంటి విషయాల్లోనే బైటపడుతుంది. మాటల అర్థాన్ని సుశీల ఎంత బాగా పలికించిందో గమనించవచ్చు.

9. కొలని దోపరికి గొబ్బిళ్ళో యదుకుల స్వామికిని గొబ్బిళ్ళో
    కొండ గొడుగుగా గోవుల గాచిన కొండొక శిశువునకు గొబ్బిళ్ళో
    దుండగంపు దైత్యుల కెల్లను తలగుండు గండనికి గొబ్బిళ్ళో
    పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళో
    యేపున కంసుని యిడుమల బెట్టిన గోపబాలునికి గొబ్బిళ్ళో
    దండివైరులను తరిమిన దనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో
    వెండిపైడి యగు వేంకట గిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో

అచ్చతెలుగు నుడికారంతో, కడపజిల్లా పలుకుబళ్ళతో మనను ఆకట్టుకునే ఈ రచనకు మధ్యమావతిలో స్వరరచన జరిగింది. చిన్న కోరస్‌తో రాగంలోని అయిదు స్వరాలనూ ఎంతో చక్కగా వినిపించే ఈ ట్యూన్ నాకు చాలా ఇష్టం. ఎవరైనా అమ్మాయిలు గొబ్బి నాట్యం చేసేటప్పుడు మనం చూడగోరే డైనమిక్స్ ఈ పాటలో వినిపిస్తాయి. చివరకు కౌంటర్‌లాగా సాగే ఆలాపన చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది.

10. లాలనుచు నూపేరు లలనలిరుగడల బాలగండవర గోపాల నినుచాల
     లలిత తాంబూల రసకలితంబులైన తళుకు దంతములు కెంపుల గుంపులీన
     మొలక వెన్నెల డాలు ముసురు కొనితోన చెలగి సెలవుల ముద్దు చిరునవ్వులాన
     లలనా జనాపాంగ లలిత సుమచాప జలజలోచన దేవ సద్గుణ కలాప
     తలపు లోపల మెలగు తత్వప్రదీప భళిర గండపరేశ పరమాత్మరూప

ఆనందభైరవి రాగంలో ఎంత తెలుగుదనం వినిపిస్తుందంటే దాన్ని ఆంధ్రభైరవి అంటారట. ఈ లాలిపాట ఆ మాటను రుజువుచేస్తున్నట్టనిపిస్తుంది. కవితలో లేని ‘లాలీలాలీ’ అనే కోరస్ ఎంతో చక్కగా అమరింది. పాట వింటున్నంతసేపూ మనంకూడా ఉయ్యాలలో ఊగుతాం.

11. మంగళం: ఇది సురటి రాగంలోనిది.


ఈ పాటలు విన్న కొన్ని నెలలకు వీటికి నేను సితార్ వాయించే అవకాశం కలిగింది. 1980లో మద్రాసులో కళాసాగర్ గోకులాష్టమికి ఏర్పాటుచేసిన స్టేజి ప్రోగ్రాములో రాజేశ్వరరావు సుశీల చేత ఈ పాటల్లో చాలామటుకు పాడించారు. ఆర్కెస్ట్రాలో సితార్ వాయించమని నన్ను పిలిచారు. అప్పటికే ఈ పాటలు విని ఉండడంతో నాకది కష్టమనిపించలేదు.

ఆ ప్రోగ్రాములో ఆనాటి సినీగాయనీ గాయకులందరూ పాడారు. సుశీల పాడి ముగించాక ప్రేక్షకుల కోరికమీద రాజేశ్వరరావు ‘పాట పాడుమా కృష్ణా’ పాడారు. అది ఎంత బాగా వచ్చిందంటే ఎస్. జానకి స్టేజి దగ్గరకు వచ్చి ‘మాస్టారూ మీరింత బాగా పాడేస్తే ఎలా? ఇంక మా పాటలెవరు వింటారూ?’ అని గోముగా కోప్పడింది.

ప్రోగ్రాముకన్నా రిహార్సల్స్ ఆసక్తికరంగా ఉండేవి. ఈ సంకలనం తరవాత మరొకటి రాబోతోందని సుశీల చెపుతూ రాజేశ్వరరావు చేసిన రెండు పాటలు మాకు వినిపించింది. ఒకటి బేగడ రాగంలో ‘నందనందనా గోపాలా’ అనేది. రెండోది ‘మామియం’ అనే అష్టపది పిలూ రాగంలో చేశారు. అవి ఎంతో బావున్నాయి. ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. ఆ రికార్డు రిలీజయిందో లేదో నాకు తెలియదు.

రాజేశ్వరరావును దగ్గరనుంచి చూస్తున్నంతసేపూ ఆశ్చర్యానందాలు కలుగుతూనే ఉండేవి. సుశీలకు కూడా ఆయనంటే చాలా గౌరవం. మొత్తంమీద ‘కృష్ణం వందే జగద్గురుం’ మంచి పాటల కలెక్షన్. ఆసక్తి ఉన్నవారు నెట్‌నుంచి తిన్నగా రికార్డు చేసుకోవచ్చు.


కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...