వైకుంఠపాళి

కాంతమ్మగారు తెచ్చిచ్చిన కూర గిన్నె మీద ఈగలు వాలుతున్నాయి. మూత పెట్టాల్సిందేమో అనుకున్నాడతను. ఆ రోజతనికి మరీ కోపంగా ఉంది. చాలా చిరాగ్గా కూడా ఉంది. ఎందుకావిడ రోజూ తలుపు కొడుతుంది? కూరలో, కాఫీయో ఇచ్చే వంకతో వచ్చి కబుర్లు మొదలెడుతుంది? అతను గుమ్మానికి అడ్డంగా నిలబడి, ముక్తసరిగా సమాధానం చెప్పినా సరే, తొంగి తొంగి లోపలికి చూస్తూ ఉంటుంది. ఒక్కోసారి మొహం మీదే తలుపేసేస్తాడు కూడా. కానీ, మర్నాడు మళ్ళీ మామూలే. నిజానికి ఇందులో అంతగా చిరాకు పడాల్సిన విషయమేమీ లేదేమోగానీ, అతనికీమధ్య మరీ అలానే ఉంటోంది. మితిమీరిన నిర్దయతో, క్రూరంగా ప్రవర్తిస్తున్న జీవితమంటే మరింతగా ద్వేషం పెరిగిపోతోంది. తల్లి పోయినప్పటినించీ, తనలోని ఈ మార్పతనికి మరింత స్పష్టమైన గమనికగా మారుతోంది.

ఉండుండి ఘాటుగా చెమట కంపు ముక్కు పుటాల్ని తాకుతోంది. గదంతా చిందరవందరగా విడిచిన బట్టలే. ఉతికి రెండు నెల్లై ఉండదూ? వెళ్ళి కిటికీ తలుపు తీద్దామనుకుని, అంతలోనే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ‘దారిన పోయేవాళ్ళంతా తొంగిచూడటమే. మరీ సర్కస్ అయిపోయింది జీవితం,’ గొణుక్కుంటూ కాళ్ళు టేబుల్‌కి నిగడదన్ని, కూర్చున్న కుర్చీతో పాటుగా ఊగడం మొదలుపెట్టాడు. ఎలా అయిపోతున్నాడు చివరికి? మొన్నటికి మొన్న! అతను అరుగు మీద కూర్చునుండగానే గుసగుసలాడుకున్నారు ఎవరో ఆడంగులు, ‘ఆవిడున్నంత కాలం తిండి కూడా లేక కుక్క బతుకే బతికాడు. ఇప్పుడు పదెకరాల పొలం కలిసింది కదా. అయినా అలాగే ఉంటాట్ట, పాలైనా కొనుక్కోడుట. టీవీ కూడా లేదుగా ఇంట్లో, ఎలా తోచుబాటు అవుతుందో ఏమో!’ మనిషిగా గుర్తింపబడటం మానేసి ఇన్ని సంవత్సరాలవుతున్నా, ఇంకా ఇలాంటి సూదులు దిగితే, నొప్పి తెలుస్తూనే ఉంటుంది.

ఏమీ తోచనట్టుగా ఉంది. ఆలోచించడానిక్కూడా ఏమీ కనిపించడంలేదు. బలవంతంగా ముందుకు వంగి, టేబుల్ మీద పడున్న చెస్ బోర్డ్‌ను అందుకున్నాడు. పాతబడింది తప్ప, దానిలోనూ పెద్దగా మార్పేమీ లేదు. ఎన్నేళ్ళ క్రితమో, ఆ రోజెప్పుడో మంచానికడ్డంగా బోర్లా పడుకుని ఏడుస్తుంటే, లేపి దాన్ని చేతికిచ్చాడు అతని శంకరం నాన్న. ఏదో అన్నట్టు గుర్తు, ‘దత్తతకు తీసుకున్నాక కొడుకువే’ అనో ‘నన్ను నాన్నా అని పిలుస్తావా’ అనో. అతనాయన్ని ‘శంకరం నాన్న’ అని పిలవడం ఎప్పుడు మొదలుపెట్టాడో గుర్తులేదు; ఆయన ఒకటికి రెండు సార్లు చెప్పే ఒకేలాంటి కొన్ని మాటలు మాత్రమే అతనికి ఎక్కువగా గుర్తుండిపోయాయి. తల్లి మాత్రం ఒక్క మాటా మాట్లాడేది కాదు, తిట్టేటప్పుడు తప్ప. ఎప్పుడూ అదే కోపంతో కూడిన చూపు. కోపం కూడా కాదు; ఏ క్షణంలోనైనా ఆవిడ చూపుల్లోంచి, అతనికి అసహ్యమే ఎదురొచ్చేది.

చెస్‌తో పాటుగా ఆయన వైకుంఠపాళి కూడా తెచ్చాడు. రంగురంగులుగా ఉండి, అదే నచ్చింది ముందు; కానీ ఆ ఆట ఎందుకాడాలో మాత్రం అతనికి అర్థం కాలేదు. ఎలాగూ పాము నోట్లోంచి జారి క్రిందపడేటప్పుడు, నిచ్చెనెక్కి ఆనందపడ్డం ఎందుకో. అదే చదరంగమైతే! ఆ నలుపూ తెలుపూ గళ్ళ మీద ఎన్ని యుద్ధాలు చెయ్యచ్చు. ఎన్నెన్ని గెలుపోటముల్ని మూటగట్టుకోవచ్చు! ఆలోచిస్తూ, తల గోక్కున్నాడు. జిల్లా స్థాయి పోటీల్లో గెలిపించి, ఎప్పుడూ చెప్పుకుంటే వినడమే తప్ప అనుభవంగా ఎదురుపడని గౌరవమనే ఓ అత్యున్నత పురస్కారాన్ని–అతనికి బహుమతిగా ఇచ్చిన ఆ గొప్ప స్నేహంపై, అతనికి అనురాగం పెల్లుబికి వచ్చింది. అనేక సంవత్సరాలుగా అతన్ని ఆవరించి ఉన్న ఆ చదరంగం తాలూకూ ఏకైక సాన్నిహిత్యానందం, తన గురించి మరింత బలంగా చెప్పమని అతన్ని ప్రోత్సహించింది. దానిమీద పొరలు పొరలుగా అట్టకట్టుకుపోయిన అతడి వ్యామోహమంతా ఆ క్షణపు ప్రేమపూరితమైన ఆలోచనల వేడికి జిగురు జిగురుగా కరగసాగింది. దాని గొప్పతనాన్ని, బరువైన భావపరంపరగా తర్జుమా చెయ్యాలన్న కోరిక, అతన్ని కార్యోన్ముఖుడ్ని చేసింది. ‘అదేమిటంటారూ… అంత సైన్యంలోకీ, అన్నిరకాల కాడ్రేల వ్యక్తుల్లోకీ, చివరికి మంత్రిలోకీ, రాజులోకీ కూడా ఒకే ఒక్క మైండ్ చేరి నడిపిస్తే, ఆ యుద్ధంలో ఎంతటి కంప్లీట్‌నెస్ ఉంటుంది! ఊహించలేనంత పెర్ఫెక్షన్! అదే కదా మరి చెస్సంటే!’ సంతృప్తిగా తలాడించాడు. అప్పటివరకూ ముక్కుమీద కూర్చుని ముచ్చట్లు వింటోన్న ఈగొకటి ఆ ఊపుకి కదిలి లేచి మళ్ళీ చెంపమీద వాలింది. విసుగ్గా దాన్ని అదిలిస్తూ, తిరిగి తన లోకంలోకొచ్చిపడ్డాడు. ఇప్పుడేం చెయ్యాలి? ఎదురుగా, తన బోలెడంత పొడవైన చేతుల్ని చాచి కూర్చుని ఉన్న కాలం; అతను మాత్రం, ఒక్కడూ ఒంటరిగా ఒక్కో క్షణంతోనూ పోరాడుతూ.

స్నేహితులంతా ఎప్పుడో సెటిలై, పెళ్ళిళ్ళు చేసుకుని పెద్ద పెద్ద పిల్లల తండ్రులయిపోయారు. పెళ్ళంటే గుర్తొచ్చిందతనికి. మొన్న కామేశ్వరరావుగారు సైకిలు మీద వెళ్తూ అతన్ని చూసి ఆగాడు. ‘ఏమయ్యా, ఆదివారం ఖాళీయేనా? పెళ్ళివారిని రమ్మందామని. వచ్చి అన్నీ చూసుకుని, చెప్పి వెళ్తామంటున్నారు.’ అన్నాడు. తల్లి పోయాకా, ఇలా ఎవరో ఒకరు, తమదికాని భారాన్ని తలకెత్తుకున్న పెద్దరికంతో పలకరించడం, అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంది. ఎవరూ ఏమిటని అడుగుదామనుకుంటూనే, మళ్ళీ మానుకుని, తలూపి ఊరుకున్నాడు. ‘ఇలా అయితే ఎలా అయ్యా? వాళ్ళొచ్చినప్పుడైనా కొంచెం మాట్లాడు. అమ్మాయి బావుంటుందిలే. డిగ్రీ చదువుకుంది. ఆ వేళ రమ్మంటానయితే. టైమ్ మళ్ళీ చెప్తాలే.’ సమాధానం కోసం ఎదురుచూడకుండా వెళ్ళిపోయాడాయన, ఇంకోసారి తలూపే శ్రమనుండి అతన్ని తప్పించి. ఇదివరలో అయితే, ఇలా ఎవరైనా సంబంధాలు తెచ్చినప్పుడు, ఒక్క పాటున ముసురుకునేవి ఆలోచనలు; గండి కొట్టిన కాలవ నీటిలా, అవి అతని మనసులోంచి పొంగి పొరిలేవి. అమ్మాయి ఎలా ఉంటుందో ఊహించుకుంటూ, తర్వాత ఎదురొచ్చే నాలుగైదు సామాన్యమైన రోజులకైనా, రంగురంగుల కలలద్దుతూ గడిపేసేవాడు. రెండు జళ్ళూ చెరో చేత్తోనూ పట్టుకు లాక్కుంటూ కూనిరాగాలు తీస్తూ, అతను కనబడగానే ఠక్కున ఆపేస్తుండే భారతీ; కళ్ళ సైజుకి రెండింతలు పెద్ద సైజు అద్దాలున్న కళ్ళజోడుతో, పుస్తకాలు గట్టిగా గుండెలకి హత్తుకుని, తల దించుకుని, బహుశా ఊపిరి కూడా బిగపట్టి, మనుషుల్ని దాటుకుపోతుండే సూర్యశ్రీ; సెలవలకని వచ్చినప్పుడు, తలుపంచులకి కళ్ళానించి చూస్తుండే–శంకరం నాన్న మేనకోడలు విజయ; సంక్రాంతి రోజుల్లో వోణీ కొంగు నడుం చుట్టూ బిగించి, దీక్షగా ముగ్గులేస్తుండే పక్కింటి వాసవి… ఇలా విభిన్నమైన రూపాలేవో అతని ఊహల్లోకి కొట్టుకొస్తుండేవి. ఎప్పుడూ ఒక్క పలకరింపుకీ పట్టుబడక, చూపులకి మాత్రమే చిక్కుబడి మిగిలిపోయిన కొన్ని ఆడతనపు జ్ఞాపకాలేవో, వరదలా ముంచెత్తి అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసేవి. కానీ ఇప్పుడలా లేదు. ఎప్పటికీ నిజం కాలేని, కొన్ని వొట్టి ఊహల్ని ఊరికే పెంచి పోషించడం, జిత్తులమారి సమయానికి శక్తిని తినిపించడం మాత్రమేనని అతనికి అర్థమయింది. మరీ ఉధృతంగా పట్టి కుదిపేసిన ఓ పదేళ్ళ కాలంనాటి యవ్వనప్రాయపు పనికిరాని పనులు మాత్రం, గత జన్మ స్మృతుల్లా ఛాయామాత్రంగా పలకరించి పోతాయిప్పుడు.

సాయంత్రాలప్పుడు ఎప్పుడైనా, వీధుల్లో కూర్చుని కబుర్లు చెప్పుకునే ముసలి బాచ్ బాతాఖానీలో అతనికి కాస్త చోటు దొరుకుతుంటుంది. ‘ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని పెద్ద పేరు గానీ నిజానికి అది మరీ మళ్ళూ, దళ్ళూ, ఆచారాలూ అంటూ పెరిగిన ఇళ్ళలో వాళ్ళ చాదస్తమేనయ్యా, ఓసీడీ అంటే. శేషమ్మగార్ని చూస్తే మీకు బాగా అర్థమవుతుంది.” అన్నాడోసారి, సైంటిస్ట్ కాబోయి స్కూల్ టీచర్‌గా రిటైరైన సూర్యం మాస్టారు. తల్లినుద్దేశించి ఆయనా మాటలు చెప్పినప్పుడు, కాదంటున్న మనసులోంచి తనకి తోచిన వాదననేదో తోడు తెచ్చుకుందామనుకున్నాడు గానీ, ఆ పళంగా అది తోడి తెచ్చే అనేక జ్ఞాపకాల ఒత్తిడికి తట్టుకునే ఓపిక లేక వినేసి వదిలేశాడు. ఇప్పటికీ ఈ ఒంటరి క్షణంలోనూ ఆవిడలా గుర్తు రాగానే, అతని మనసులోంచి తెలియని కంగారేదో తెలిమబ్బులా బయల్దేరింది. అలవాటైన ఆందోళన, అలవోకగా కురవడం మొదలైంది. ఉన్నపాటుగా అక్కడినించి లేచి ముందు గదిలోకొచ్చాడు. ‘ఇలా కూర్చుంటే ఇంతే. కాసేపలా తిరిగొస్తే మంచిద’నుకుంటూ, తలుపు వెనక తగిలించి ఉన్న బట్టలు తీసి వేసుకోవడం మొదలుపెట్టాడు. జేబులు తడిమి చూసుకుని, ఎదురుగా గోడమీద నించి చిరునవ్వులు చిందిస్తున్న చిన్నికృష్ణుడికో రెండు దణ్ణాలు పడేసి, వేసవికాలపు వేడి గాలులు చక్కర్లు కొడుతున్న ఒంటరి వీధుల్లోకొచ్చిపడ్డాడు.

షేర్ ఆటో నిండిపోయి ఉంది. అలాగే చిన్న చెక్కంచు చివర్న, వారగా ఇరుక్కుపోయి కూర్చున్నాడు. కొన్ని చేతుల, మరికొన్ని ఇతర శరీర భాగాల ఒరిపిడి ఓ పక్కనంతా తెలుస్తూనే ఉంది. ‘తనకేం అనిపించదే. కానీ అమ్మెందుకో చాలా అసహ్యపడేది. ఆవిడకి మనిషి తగిలితే, తనని చూసినంత కంపరం’, అనుకోగానే అప్రయత్నంగా కొంచెం ముడుచుకు కూర్చున్నాడు. అక్కడికొచ్చిన కొత్తలో, ఎప్పుడో ఓసారి, పదేళ్ళుంటాయేమో అప్పటికి, అయినా బాగా గుర్తు; దొడ్లో దానిమ్మ చెట్టు పక్కన ఆవిడ వాంతి చేసుకుంటుంటే, పరిగెట్టుకెళ్ళి వింతగా చూశాడు. ఎక్కడినించో తండ్రి తిట్టడం వినిపించింది, ‘మందుబిళ్ళ కూడా ఎవడన్నా కడుక్కు వేసుకుంటాట్టే! వెధవ చాదస్తం నువ్వూనూ.’ అది మొదలు, అటువంటి చిత్రాలు చాలానే చూశాడు. అతన్ని చూస్తే ఆవిడకి కలిగే అసహ్యం కూడా, ఆవిడ మానసిక సమస్యలో ఒక భాగమేమని చాలా కాలానికి గానీ తోచలేదతనికి. అతని పుస్తకాల సంచీనో, పడుకునే మంచాన్నో పొరపాటున ముట్టుకోవాల్సివస్తే, వెంటనే చేతులెందుకు సబ్బుతో తోమి తోమి కడుక్కుంటుందో అర్థంకాక, ఓసారి తండ్రినడిగాడు. ‘దానికి మరీ అతి శుభ్రంలేరా. ప్రత్యేకంగా నీ వస్తువులనే కాదు, ఏం ముట్టుకున్నా అంతే.’ ఆయన సర్ది చెప్పినా, తనన్నా, తన వస్తువులన్నా ఆవిడకి మరికాస్త ఎక్కువే చీదరని, పెద్దయ్యేకొద్దీ అతనికి తెలుస్తూనే ఉండేది. వద్దంటున్నా ఆయనే తీసుకొచ్చాడని ఆవిడ, ఆవిడే ఒప్పుకుని కావాలనుకుందని ఆయన, అతని దత్తత విషయంలో లెక్కలేనన్నిసార్లు గొడవపడ్డారు. ఆ గాలి దుమారాల్లో పడి, బిక్కచచ్చిన మనసుతో ఎన్నిసార్లు చిగురుటాకులా వణికిపోయాడో! తన అమ్మా నాన్నా అసలెందుకు తననక్కడికి పంపేశారో అర్థంకాక, పసితనాన్ని ఎన్నిసార్లు చిదుముకుని చితికిపోయాడో. నలుగురు పిల్లల్తో పంచుకునే ఒక వాటా ఇంటికంటే, అచ్చంగా అతనికి మాత్రమే వచ్చే పదెకరాల పొలమే మంచిదని భ్రమపడి, వాళ్ళాపని చేశారని తర్వాతెప్పుడో తెలిసింది. ముప్ఫయ్ ఏళ్ళ క్రిందటి సంగతి; ఇప్పుడు వాళ్ళ ముఖాలు కూడా సరిగ్గా గుర్తులేవు. గుర్తు తెచ్చుకునే ప్రయత్నమూ చెయ్యడు. పదిహేనేళ్ళ క్రితం చనిపోయిన అతని శంకరం నాన్నే ఇప్పుడతనికి, ఎప్పుడో గానీ గుర్తు రావడం లేదు.

ఆలోచించడానికి పెద్దగా ఏం లేని మనసుతో అతనెప్పుడూ అప్రమత్తంగానే ఉంటాడు; అందుకే అంత పెద్ద ప్రమాదంనించి సురక్షితంగా బయటపడ్డాడు. అతి వేగంగా వస్తోన్న లారీ ఒకటి, తమ ఆటోని నుజ్జు నుజ్జు చేయబోతోందని గ్రహించి, చివరి నిమిషాల్లో అసంకల్పితంగానే క్రిందికి దూకేశాడు. లేచి, ఒళ్ళు దులుపుకుని, కళ్ళు పైకెత్తి చూస్తే ఎదురుగా కనిపించిన సన్నివేశం, అతని మెదడులో వెంటనే నమోదు కాలేదు. మామూలు ఊహగా మెదడు అనువదిస్తుండే అలవాటు దృశ్యమేదీ కంటబడలేదు సరికదా, విధి తాలూకూ వికృత స్వరూపం, వెయ్యినాల్కలూ బయటకి పెట్టి వెక్కిరించింది. అక్కడ మనుషులేరీ! ఆ మాంసం ముద్దలూ, ఎర్రని రక్త ప్రవాహాలూ ఎక్కడ్నించి వచ్చాయి? అప్పుడు గుర్తొచ్చింది, ఆటోలోంచి ఎందుకు దూకాడో. చుట్టూ జనం చేరుతున్నారు. విపరీతమైన గోల. అందర్నీ తప్పించుకుంటూ, అక్కడినించి బయటపడ్డాడు. వేగంగా అడుగులు వేస్తూ, పరుగులాంటి నడక మొదలుపెట్టాడు. ఏవేవో ఆలోచనలు. ఓ చిరపరిచితమైన గొంతేదో మెదడులో గట్టిగా మోగడం మొదలుపెట్టింది. ‘ఇంతోటి డిగ్రీ వెలగబెట్టావు, ఉద్యోగం సద్యోగం మాత్రం లేదు. ఎన్నాళ్ళిలా సిగ్గులేని బతుకు బతుకుతావు, ఏ లారీకిందో పడి చావచ్చు కదా!’ తల్లి రూపం, స్వరంగా మారి, గొంతెత్తి అరుస్తోంది. ‘చెట్టంత మనిషే పోయాకా ఈ దరిద్రం నాకెందుకు? ఎక్కడికి పోతాడో, ఎలా బతుకుతాడో నాకు తెలీదు. పొమ్మనండి నా ఇంట్లోంచి.’ భర్తను పోగొట్టుకున్నప్పుడు అంతటి భరింపశక్యంకాని శోకం కూడా ఆవిడ రౌద్రరూపానికి అడ్డుకట్టలు వేయలేకపోయింది. ‘శుచీ శుభ్రం లేని వెధవా, ఇంతటి ఏబ్రాసి వెధవ్వని తెలిస్తే, చచ్చినా నా ఇంట్లో కాలు పెట్టనిచ్చేదాన్నికాదు.’ అతని సామాన్లని పక్కకి తోసేస్తున్న ఆవిడ చేతిలోని చీపురు, గాలిని చీరుకుంటూ వెర్రి శబ్దాలు చేస్తోంది. చిట్టచివరికి, ఓ చెయ్యీ కాలూ పడిపోయి మంచానికతుక్కుపోయి కూడా, మంచినీళ్ళు తెచ్చిస్తే, బాగున్న చేత్తో విసిరికొట్టి, వంటమనిషి వచ్చేవరకూ దాహంతోనే పడున్న ఆ మనిషి హృదయంలోని ద్వేషజ్వాల, నిలువెల్లా సెగలు విడుస్తూ అతన్ని తరిమి తరిమి కొడుతోంది. అతను నడుస్తున్నాడు. అతను పరిగెడుతున్నాడు. తానెందుకు చావలేదు! అక్కడ తలలు విచ్చుకుని బయటపడిన మాంసపు ముద్దల్ని చూసి, ఎన్ని హృదయాలు పగిలి, ప్రేమ, మడుగులు కడుతుందో…

ఎందుకో ఒంటికేదో అంటుకున్నట్టుగా అనిపించింది. చిరాగ్గా దులుపుకున్నాడు. బంక బంకగా తగిలింది. ఛిచిచ్ఛి… అరచేతుల్ని గట్టిగా షర్టుకి తుడుచుకున్నాడు. పోయినట్టుగా లేదు. ఒళ్ళంతా కంపరంగా ఉంది. చచ్చిన వింత దేహాలేవో వొళ్ళంతా వడివడిగా పాకుతున్నట్టుగా, రక్తంతో నిండిన రంగురంగుల చేతులేవో, అతని ఒంటికి తమని తాము తుడుచుకుని తడుముతున్నట్టుగా, ఎండకి ఆరబెట్టిన తెల్లని తుండులాంటి శరీరం, ఎగిరి ఎర్రని తడి మడుగులో పడి మునిగిపోతునట్టుగా… అతని జ్ఞానం, అసహ్యనికీ భయానికీ మధ్యన గీసి ఉన్న సన్నని గీతపైనుండి భయానకంగా నడుచుకుంటూ వచ్చి, అతని మస్తిష్కపు తెరపై నమ్మశక్యం కాని నూతన సందర్భాల ప్రదర్శనను మొదలుపెటింది. ఏఏఏ… పెగలని గొంతుతో గట్టిగా అరుస్తూ, గుండ్రంగా తిరిగిపోతూ గంతులు వేస్తున్నాడతను. అంతలోనే షర్టు లోపలికి చేతుల్ని చొప్పించి, కనిపించనివేవో బయటకి తీసి విసురుతున్నాడు. పదునుతేరిన గోళ్ళతో వొళ్ళంతా గీరుకుంటున్నాడు… నిర్మానుష్యమైన ఆ నడిరోడ్డు మీద అతనలా ఎంతసేపు తనతో తనే పోరాడుకున్నాడో తెలీదు, చివరికి ఎప్పటికి ఎలా ఇంటికి చేరుకున్నాడో కూడా తెలీదు.

ఆ తర్వాత కూడా అతని జీవితం ఎప్పటిలానే ఉంది. అతనిల్లు కూడా అలానే ఉంది, చిందరవందరగా; కానీ కొన్ని కొన్ని అనుకోని మార్పులు మాత్రం సంభవించాయి. అతనిప్పుడు బస్సులుగానీ ఆటోలుగానీ చివరికి స్కూటర్‌గానీ ఎక్కడు. ఏం కావాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా నడిచే వెళ్తాడు. నడవటం కుదరనంత దూరమైతే, వెళ్ళడమే మానేస్తాడు. ఏ పరామర్శకైనా, చివరికి అనారోగ్యంతోనైనా సరే, హాస్పిటల్‌కి వెళ్ళాల్సి వచ్చే పరిస్థితుల్నించి, వీలైనంత వరకూ తప్పించుకుంటాడు. ఎంత తెలిసిన వారైనాసరే, చనిపోయిన తర్వాత చివరి చూపుల కోసమైతే అసలే వెళ్ళడు. ఎన్నిసార్లు బయటకి వెళ్ళివస్తే అన్నిసార్లూ స్నానం చేస్తాడు. అవసరమనుకుంటే రోజుకు పదిసార్లయినా చేస్తాడు. ఏం కొన్నా కొనకపోయినా సబ్బులు కొనడం మాత్రం మానడు. చాకు, బ్లేడు లాంటి పదునైన వస్తువుల్ని కూడా సాధ్యమైనంత దూరంగానే ఉంటాడు… జాగ్రత్తగా పరిశీలిస్తే, అతనివి కాని మరికొన్ని చిన్న చిన్న మార్పుల్ని కూడా, మనం అతని చుట్టూ గమనించవచ్చు. ఇప్పుడతనికి ఎవరూ సంబంధాలు తేవడంలేదు. ఎదురింటావిడ, ఇంతకుముందులా వండిన కూరలు తీసుకొచ్చి ఇవ్వడంలేదు. ఆడవాళ్ళ కాలక్షేపం కబుర్లలో కూడా అతనికిప్పుడు పెద్దగా చోటు దొరకడంలేదు. ఈసారి కాలం మరింత కసిగా తన పాచికల్ని విసిరింది. గౌరవంగా చదరంగమాట ఎక్కించిన కాసిని నిచ్చెన మెట్ల ప్రక్కన పొంచి కూర్చుని, నోరంతా తెరిచి మింగేసి, తోక చివర్లలోకి ఝాడించి కొట్టింది. అర్థం లేనిదిగా అనిపించిన ఆ మాయదారి బ్రతుకాటను, అతనింకెంతకాలమాడాడో, ఎలా ముగింపుగా మారాడో ఊహించడం, మరీ అంత కష్టమేమీ కాదనుకుంటాను.