మేఘాంగన

చిత్రవిచిత్ర వర్ణములఁ జెల్వు వహించి క్షణక్షణంబునన్
చిత్రవిచిత్ర రూపములఁ జేకొనుచున్ గగనాబ్ధిలోన సాం
యాత్రికులట్లు సంతతవిహారము సల్పెడు మేఘమండలీ
చిత్రములం బటంబున రచించు తలంపు మదిన్ సుమింపఁగన్.

తన్వతనుమృదుకుంచికాతతులతోడ,
ప్రకృతిసహజదృశ్యప్రకరంబు లెల్లఁ
బ్రతిరచింపఁగఁ జాలు వర్ణములతోడఁ
బరగు నాలేఖకాపేటి పాణిఁ బూని.

ప్రాంతవనాంతరానఁ జివురాకులయాసవమూని మత్తమై
గొంతులు విప్పి పాడు నెలకోయిలగుంపుల కాలవాలమై
సాంతముగా సుమించిన రసాలము చెంతను గూరుచుండి యే
కాంతమునందుఁ జిత్రపరికల్పన సేయుట కుద్యమించుచున్.

ఆరుణతామ్రవిద్యుతిమయాపరదిగ్గగనార్ధమందు సాం
ద్రారుణశోణపీతధవళాసితవర్ణసముజ్జ్వలంబులై
మారుతసంప్రసారితసుమంజులరూపములైన సాంధ్యవే
ళారుచిరాభ్రసంతతివిలాసము లుత్సుకతన్ ఘటింపఁగన్.

కఱ్ఱచట్రంబు పైఁ గట్టి గట్టిగాను
చిత్రలేఖన కనువైన శ్వేతపటము
వ్రాయఁగాఁ గడంగితిఁ దద్వి హాయసానఁ
గ్రాలు ఘనమాలికాచిత్రమాలికలను.

అట్లు నేనుండఁగా ననూహ్యంబుగాను
కొన్ని మబ్బు లూయలరూపు గొనుచు నలర
మఱొక కొన్ని యూయల నూఁగు తరుణికరణి
నమరుచుం గననయ్యె నయ్యంబరాన.

అమరగఁ గేశపాశముగ శ్యామలనీరదఖండమొండు వ
క్త్రమువలె నొక్క శ్వేతజలదంబు రహింపఁగ గాత్రవల్లిపై
నమరిన పీతవర్ణకలితాంచలశోభితరోహితాంశుకో
పమమయి మిశ్రవర్ణయుతవారిద మొక్కటి తారసిల్లఁగన్.

పరమేష్ఠినిఁ బనిగొనకయె
పరమాద్భుతముగ సృజింపఁబడిన తదీయాం
బరవిలసితవరవర్ణినిఁ
బరికించుచు నక్కజంబు పర్విన మదితోన్.

ఆ రమ్యాకృతి నున్న చందమున నత్యంతప్రమోదంబునన్
స్ఫారంబై తగు చిత్రలేఖనకళావైదగ్ధి దీపింపఁగన్
నే రంగుల్ గలగల్పి వ్రాయుచును నెందేనిన్ సమక్షంబునన్
స్త్రీరత్నంబును నిట్టిదానిఁ గని భాషింపంగ నేఁ గందునే!

అని చింతించుచు నామె చిత్రమటులే సాంతంబుగావ్రాసి ద్యో
మణి తత్కాలమునం గ్రమంబున నధోమార్గస్థుఁడై పశ్చిమా
బ్ధిని నస్తంగతుఁడౌ విచిత్రమును సంవీక్షింప నారోహణం
బును గావించితిఁ బ్రాంతమందుఁగల యల్పోర్వీధరంబు న్వెసన్.

కాలాఖ్యబాలక కేళికాతాడిత
         కమనీయరోహితకందుకంబొ,
నాకస్థకల్పకానోకహశాఖాగ్ర
         పతితాతిపరిపక్వఫలవరంబొ,
అప్సరఃకామినీహస్తాగ్రసంస్రస్త
         సురనదీభవరక్తసరసిజంబొ,
నటదీశగళచలన్నాగఫణగళిత
         మహనీయమాణిక్యమణివరంబొ,

అనఁగ నంతకంతకు నత్యంతమైన
రక్తిమవ్యాసయుక్తుఁడై రాణఁ దాల్చి
పశ్చిమాంభోధిలోఁ గ్రుంకె పద్మహితుఁడు
కొండపైనుండి నేఁ గాంచుచుండ నపుడు.

అట్లు దినరాజసంత్యక్తమైన యవని
తలమున కరాజకత్వంబు గలుగుచుండె
నని తలంచెనొ యేము పూర్వాశయందు
పూర్ణతేజుఁడై రేరాజు పొల్చె నపుడు.

హల్లకముల్లసిల్లఁగ, నవామృతసిక్తములౌచు నోషధుల్
పెల్లుగ వృద్ధినందఁగను, బిత్తరులై యభిసారికామణుల్
తెల్లని కట్టుబొట్టులను దీరిచి సాగఁగ, నవ్యదంపతుల్
చల్లగ నన్యముల్ మఱచి శయ్యకుఁ జేరఁగ నిండె వెన్నెలల్.

అమృతమును బూను కరముల నల్లఁ దట్టి
ధవుఁడు బోధము గూర్ప నుత్పలిని పతికిఁ
బ్రియము గూర్చెను దరహాసవికసితాస్య
కమ్రసౌరభ్యమృదుభావకలిత యగుచు.

మలయసమీరుఁ డత్తఱిని మంజులచందనగంధసంపదా
కలితుఁడు నయ్యు నంతికవికస్వరకైరవగంధసంపదన్
బలిమి హరించుచు న్మలసె; ప్రాప్తిలునే పరితృప్తి సంపదా
కలితుల కంతకంత కధికంబగు సంపద లొందకుండినన్?

అంతటితోడఁ దృప్తి సనకయ్యనిలుం డతిసంభ్రమోద్ధతిన్
ప్రాంతమున న్నితాంతసుమభారనతామ్రమహీజశాఖికా
సంతతులందు దూరుచుఁ, బ్రశస్తసుగంధరజోవిభూతి నొ
క్కింతయు చింతలేక హరియించుచుఁ బాఱెను చోరుపోలికన్.

అట్లు హృదయంగమంబైన యవ్వనంబు
నందు లీలమై విహరించు నాస్థతోడ
మందమారుతచాలితామ్రతరుశాఖ
కరణి నల్లన నేనందుఁ దిరుగుచుండ.

చంపకపుష్పవర్ణయుతసంహననంబు, నవాతసీ ప్రసూ
నంపు సునీలిమంబు గల నల్లనికొప్పును, నల్లగల్వపూ
సొంపు వహించు కన్నులును, సుందరవక్త్రము, బంధుజీవపు
ష్పంపు సురక్తిమంబు గల సన్ననివల్వయుఁ గల్గు యోషితన్.

అక్కజంబుగ నేను మున్నభ్రమందుఁ
గాంచి యాలేఖనం బొనరించినట్టి
కాంతనుం బోలు నక్కాంతఁ గాంచి నిల్చి
యుంటిని యొకింతవడి చేష్టలుడిగి యచట.

అటుపైఁ జేరం జని త
త్కుటిలాలక మోముఁ గాంచఁ గొందలమెదియో
స్ఫుటమై తోఁచఁగఁ దన్ముఖ
తటమునఁ, బలికితి నిటువలెఁ దన్మదవతితోన్.

“ఓ రమణీలలామ! యిటులొంటి చరించెదవేల? నీ మనో
హారి ముఖేందుబింబమును నల్పపు మేఘములట్లు గ్రమ్మె నే
లా రుచిరత్వభంజక విలాసవిదూర విషాదరేఖికల్?
వేరుగఁ దల్పఁబోక నను వెల్లడిసేయుమ నీమనఃస్థితిన్.

మున్నొక యింతియాకృతిని ముచ్చటగాఁ గని మేఘపంక్తిలోఁ
జెన్నుగ వ్రాసియుంటి నొకచిత్రము నేను, తదీయచిత్ర ము
ద్యన్నవచేతనత్వకలితంబగుచు న్నడయాడుచున్నదో
యన్నటులున్న దో కలికి! యారయ నీ సుమనోజ్ఞరూపమున్.

అవిరతసత్యసంయుతదయామయభాషణతత్పరుండ, స
త్కవికులలోకభాస్కరుఁడ, ధర్మపరుండ, పవిత్రపద్మసం
భవగృహిణీపదాంబురుహబంభరుఁడ, న్నను విశ్వసించి తె
ల్పవె భవదీయవక్త్రగతభావవికారపు హేతు వో సతీ!”

అనఁగా నా వనజానన
వినయాన్వితమధురవాక్యవిస్తారముతో
వినిపించెను తత్కారణ
మును నీగతి నక్కజంబు వొడమఁగ నాకున్.

“తొల్లిటి భవమున నుంటిని
తెల్లని హంసము నయి శతధృతిలోకమునన్,
చెల్లితి వాహనమయి త
ద్వల్లభకుం గొన్నినాళ్ళు భాగ్యవశమునన్.

ఏదేవి కలిగించు నీరేడుజగముల
         జనుల చిత్తములందు జ్ఞానదీప్తి,
ఏదేవి సామాదివేదనిష్ఠిత యౌచుఁ
         బరమేష్ఠిముఖములఁ బలుకుచుండు,
ఏదేవి సుశ్రావ్యనాదంబె సర్వగాం
         ధర్వవిద్యలకు నాధారమయ్యె,
ఏదేవి హాసాంకితేక్షణప్రకరంబె
         కవికల్పనాశక్తికారకంబు,

పసిఁడికిన్నెర యేదేవి పలుకుఁదోడు,
పలుకుచిలుకయె యేదేవి చెలిమికత్తె,
అట్టి దేవికి వాహనం బగుచు నుంటి,
నాదు భాగ్యంబు నేమి యనంగవచ్చు!

అంతట నొక్కనాఁడు విబుధాపగయందున చెల్మికానితో
సంతసమారఁగా మఱచి సర్వము నే జలకేళి సల్పుచుం
జెంతకు రాకయున్న ననుఁ జీరిన దూఱిన నేమి సేసినన్
స్వాంతమునం గలంగి జలజాసనవల్లభ యాగ్రహించుచున్.

“చెలువునితో నమరాపగ
జలకములాడుచు నితాంతజాల్మతచేతం
బలుమాఱులు నినుఁ బిలిచిన
నులుకవు, పలుక విదియేమె? ఓ కలహంసీ!

ఉందువు గావుత మానవ
సుందరివై యీక్షణమె వసుంధరయందున్,
సుందరమగు నీ రూపం
బెందును గనకుంద్రుగాత నిలలో మనుజుల్.

అన్యులను నీవు చక్కగ నరయఁగలవు;
ఐన నన్యులు నిన్నెప్పు డరయలేరు;
దాన నొంటరివై యిలాతలమునందు
సాగదీతువుగాక నీ జన్మమింక!”

అనుచు శాపంబు నిడిన నా యజునిరాణి
పదములం బడి యౌవనమదముచేత
నట్లు చేసితి మన్నింపు మనుచు వేడఁ
దెల్పె నామె శాపాంతమౌ తీరు నిట్లు.

“ఒక గంధర్వుఁడు మేఘమాలికలలో నూహించి నీరూపమున్
బ్రకటోత్సాహముతోడ నీవు గల యారామస్థలిం జేరి నీ
మొకమం దావృతమైన వంత గెడపం బూనం గలా డప్పుడే
వికలంబౌను మదీయశాప, మిటకు న్వీతెంతు వీ వంచవై”

అట్టి భారతీశాపవశాత్మ నగుచు
ఒంటిపాటున నీతోఁట నుంటి నేను
ఎన్ని యేఁడులు గడచెనో యెఱుగనైతి
అన్యపురుషునితోడ మాటాడి నేను.

తోఁచెడు నోయీ శాపవి
మోచనమగు క్షణమిపుడె సముత్పన్నంబై
నా చిరకాలైకాంతస
మాచితదుఃఖము తొలఁగెడు నని యోచింపన్.

మానవులు నన్నుఁ గాంచలే రైన నీవు
గాంచఁ గల్గితివిట నన్ను నంచితముగ,
అభ్రపంక్తుల నారూపు నరసితీవు,
తర్కమది యేల? నీవె గంధర్వపతివి!”

అనుచా సుందరి నన్ను గాఢతరమౌ నాశ్లేషబంధంబుచే
ననురాగోద్ధురచిత్తవృత్తి కలన న్నానందదుగ్ధాబ్ధిలో
మునుగంజేయుచునుండ వాణికృపచేఁ బూర్వాకృతుల్మారి చ
క్కని రాయంచల రూపము ల్గలిగె మాకవ్వేళ బల్వింతగన్.

నాకుఁ దెలియ దేరీతి గంధర్వరూప
మబ్బెనో కాని, మున్ను నా యంచకలికిఁ
గూడి సురగంగ జలకంబులాడినట్టి
అంచపోతురూపంబె నా కబ్బె నిపుడు.

శాపము వాసె, నా చెలియ సందిటికౌఁగిలి సౌఖ్యమబ్బె, సం
తాపము వాసె నిర్వురకు, ధాతృకుటుంబిని మాదుమేలుకే
యీ పథకంబుఁ బన్నెనని యెంచి, తదంఘ్రిసరోజసేవలో
నే పరితుష్టిచెందఁగను నింగికిఁ బ్రాఁకితిమేము జంటగన్.

వసవల్చుబాలకప్రకరంపు జిహ్వలం
         దొలియక్కరంబులం దొలుచు నెవతె,
అజ్ఞానతిమిరంబె యావరించిన నేల
         విజ్ఞానదీపంబుఁ బెట్టు నెవతె,
చతురాస్యునకుఁ గూడ స్వరచాతురిని గూర్చు
         నజ్ఞాతశక్తియై యలరు నెవతె,
తన కటాక్షముచేత ధరణిలోఁ గళలెల్ల
         విలసిల్లగాఁజేయు కలికి యెవతె,

అట్టి వాణిని సేవించు చవిరతముగ
సత్యలోకంబులో నుండజంటగాను
నెగసితిమి మే మెడతెగని గగనమందు,
ఇదియె మాకథ, ప్రథితకవీశ్వరుండ! “

అని యొక హంసవతంసము
తన గాథను దెల్ప నాకుఁ, దత్కథకుం గ
ల్పన సేసితి మధురాక్షర
గణరూపము నిట విరించికాంతాకృపచేన్.