రెండు ముచ్చట్లు

దొండంత నొప్పి

సాధారణంగా పొద్దున పొద్దున్నే టీవీ పెట్టను. కానీ ఒక్కోసారి పిల్లలు స్కూలుకు వెళ్ళిపోయాక ఏర్పడే నిశ్శబ్దాన్ని శబ్దంతో భర్తీ చేయాలనిపిస్తుంది. సినిమా, ట్రావెల్, ఫుడ్ ఇవి నా ప్రయారిటీలు. శబ్దం మరీ ఎక్కువైందన్నట్టుగా పెట్టగానే ఏదో ఫైట్ వస్తోంది. మహేశ్‌బాబు సినిమా. తలల మీద ఇటుకలు పగులుతున్నాయి. గోడలకు వెళ్ళి గుద్దుకుంటున్నారు. గాల్లోకి వెళ్ళి భూమిలో కూరుకుపోయేలా పడిపోతున్నారు. మంచి కామెడీ.

ఎటూ ఊరికే కూర్చున్నానని నా భార్య దొండకాయలు కోసివ్వమంది. ఈ మధ్యాహ్నపు షిఫ్టులతో ఉన్న సమస్యేమిటంటే, మనం మరీ ఖాళీగా ఉన్నట్టు నలుపు తెలుపుగా కనబడతాం. కాదనే వీలుండదు. పీట, కత్తి సహా అర్ధకిలో కాయలు నా ముందు తెచ్చిపెట్టింది. తగిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశాను. ముందు దాని మూతివైపు చిన్నగా చాకుతో కట్ చేయాలి. తర్వాత దాని కిందివైపు చిన్న నల్లటి బొడిపె ఉంటుంది కదా, దానికోసం కూడా కత్తిని వాడొచ్చు, కానీ అంత అవసరం లేదు, గోటితో గిచ్చి పడేయొచ్చు. ఇలాచేస్తే కాయ వృథా కాదని ఎప్పటిదో జ్ఞానం. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత చిన్న ముక్కలు చేయాలి. నాకు ముక్కలు గుండ్రంగా కోస్తే నచ్చదు, నిలువుగా కోస్తే తప్ప దొండకాయ తినబుద్ధి కాదు. మొదటి దశ పూర్తయింది. ఎడమ బొటనవేలితో గోటి గిచ్చుళ్ళ కార్యక్రమం మొదలైంది. టిక్కుం టిక్కుం టిక్కుం టిక్కుం. ముప్పావు కాయలు పూర్తయ్యేసరికి గోటిలో చిన్నగా సలపరం మొదలైంది. చేయి మార్చుకున్నాను. కోయడం పూర్తయ్యింది. నొప్పి మాత్రం పోలేదు. తర్వాత ఆఫీసుకు వచ్చాను, రాత్రిదాకా ఉన్నాను. అయినా నొప్పి అలాగే ఉంది. చాలా చిన్నది. ఎవరికీ చూపలేనది. తోలును పట్టి గుంజినట్టు ఏం చేసినా ఆ నొప్పి తెలుస్తోంది. మళ్ళీ ఇంటికి వెళ్ళాక తిని, ఊరికే అట్లా ఒకసారి ఏమొస్తున్నాయో చూద్దామని టీవీ పెడితే ఇంకో సూపర్‌స్టార్ సినిమా. మళ్ళీ అలాంటి ఫైటింగులే. ఇక్కడ కొడితే పావుకిలోమీటరు దూరం జర్రున జారుతున్నారు. అంతెత్తున ఎగిరి పడుతున్నారు. మనుషులు ఇలా కూడా కొట్టుకోవచ్చా?

అంతంత దెబ్బలు కొడుతూ, తింటూ కూడా హీరో చెక్కుచెదరకుండా ఉన్నాడు. నా బోడి దొండకాయల సలపరం మాత్రం అలాగేవుంది.

ఐద్రూపాయల దోషం

మా సన్నీకి వచ్చిన ఎంసెట్ ర్యాంకుకు మొదటి కౌన్సిలింగులో ఘట్‌కేసర్ వైపు కాలేజీలో సీటొస్తే, కాలేజీ వాతావరణం ఎలావుందో చూసి తిరిగొస్తున్నా. అమ్మోజిగూడ దగ్గర పెద్దాటో దొరికింది. ఉప్పల్ వరకు వస్తుంది. ఏడెనిమిది మంది ఉన్నారు. నేను ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్నా.

కొర్రెముల క్రాస్‌రోడ్ దాటినంక డ్రైవర్ సడెన్‌గా బ్రేక్ వేశాడు. అంతే ఠక్కున తల తిప్పి వెనక్కి చూశాను. ఏమైనా జరిగిందా? రోడ్డు పక్కన ఆకుల గంపల్లో తాజాగా కళకళలాడుతున్న మామిడిపళ్ళు తప్ప ఇంకేమీ కనబడలేదు.

“తాతా, దిగు” అన్నాడు డ్రైవర్ వెనక్కి పిలుస్తూ.

తెల్ల అంగీ, తెల్ల లుంగీ కట్టుకునివున్నాడు పెద్దాయన. ఆయన జుట్టు కూడా వాటంత తెల్లగా ఉంది. రంగు వేయకపోవడం ఆయన ముఖానికో కొత్త కళను తెచ్చింది. ఈ ఆపిన తీరుకు అనుమానపడుతూనే ఆయన దిగుతూ డ్రైవర్ వైపు చూశాడు.

మరీ ఎక్కువేం దాటిరాలేదు అన్నట్టుగా, “ఆ డౌన్లోనే ఉంటది తాతా” అంటున్నాడు డ్రైవర్.

డ్రైవర్‌కో నలబై ఏళ్ళుంటాయి. గడ్డం. బొట్టు. చెబుతున్నది నిజం కాదని ఆ గొంతు పట్టిచ్చేస్తోంది.

“నాకు తెలవకేగా చెప్పమన్నాను” అన్నాడు పెద్దాయన. గొంతులో తెలంగాణ కాని యాస స్పష్టంగా తెలుస్తోంది.

తన స్టాపు వచ్చినప్పుడు చెప్పమని ఆయన అడిగింది నిజం; ఈయన మరిచింది నిజం. డ్రైవర్ ఇంకేమీ చేయలేడు. దానికి పరిష్కారం అంతకంటే లేదన్నట్టుగా, చిన్నగా, “ఒక్క ఐదు రూపాయలిస్తే దించుతరు” అన్నాడు.

పెద్దాయన కొంచెం గొంతు పెంచి, “డబ్బుల సమస్య గాదు నాయినా, వంద బోనీ” అన్నాడు. ఒక మౌనం తర్వాత, గొంతు తగ్గించి, జేబులోంచి తీసి నోటు ఇస్తూ, సమాధానపడక తప్పని స్థితిలో తన పైచేయి ఉంచుకుంటూ చెప్పాడు: “ఇట్ల చెయ్యగూడదు, తప్పు.”

డ్రైవర్ తల గీరుకున్నాడు. ముఖంలో తప్పు చేసిన భావం కనబడుతోంది.

పెద్దాయన లుంగీ ఎగ్గట్టి, వెనక్కి వెళ్ళాల్సిన అదనపు దూరాన్ని అంచనా వేస్తున్నట్టుగా అటువైపు తిరిగి నిలబడ్డాడు. దానికి గౌరవంగా అన్నట్టుగా డ్రైవర్ ఒక క్షణం అలా చూసి గేరు మార్చాడు.

ఈ ఆటోలోని సమూహానికి ఒక వివరణ బాకీ ఉన్నట్టుగా, ముందు సీట్లో పక్కన కూర్చున్నాను కాబట్టి, వాళ్ళందరికీ నన్ను ప్రతినిధిగా నిలబెడుతూ చెబుతున్నాడు డ్రైవర్: “ఆటో ఎక్కినా ఏవో ఆలోషనలు మైండ్ల దిరుగుతుంటయన్నా. ఏడని గుర్తువెట్టుకుంటం ఇవన్నీ.”