!!!ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!
కోవెల సంపత్కుమారాచార్య
(26 జూన్ 1933 – 6 ఆగస్ట్ 2010)
శ్రీ కోవెల సంపత్కుమారాచార్య జననం వరంగల్లులో. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు, హిందీ భాషలలో ఎం. ఏ., ఆపై కాకతీయ విశ్వవిద్యాలయం నుండి 1978లో ‘తెలుగులో ఆధునిక సాహిత్య విమర్శ: సంప్రదాయము’ అనే సిద్ధాంత గ్రంథంతో డాక్టరేట్ డిగ్రీలు. అధ్యాపక వృత్తిలో కొనసాగుతూ – లక్షణ దీపిక, తెలుగు ఛందోవికాసము, మధుర గాథలు, తదితర గ్రంథాలు; ఆముక్త, చేతనావర్తం కవితా కావ్యాలు; విశ్వనాథ కవిత్వ విమర్శ, కన్యాశుల్క నాటక విమర్శ, వచన పద్య లక్షణంపై చేరాతో చర్చ, అనేక తదితర సాహిత్య వ్యాసాలు – తెలుగు సాహిత్యాన్ని ఎంతగానో పరిపుష్టం చేసిన పండితుడు, కవి, విమర్శకుడు, నిగర్వి, స్నేహశీలి, ఒక మామంచి మనిషీయన. కోవెల సంపత్కుమారాచార్య సాహితీప్రస్థానంపై డా. యు. ఎ. నరసింహమూర్తి సమగ్ర పరిచయాత్మక ప్రత్యేక వ్యాసం విశిష్ట విమర్శకుడు: సంపత్కుమార సహితంగా ఆ పండితుని స్మరణలో ఈ సంచికను కోవెల సంపత్కుమార స్మారక సంచికగా మీ ముందుకు తెస్తున్నాం. మా ఈ ప్రయత్నం పై మీ అభిప్రాయాలు తప్పక తెలియజేయండి.
ఈ సంచికకు ప్రత్యేక సహాయ సహకారాలందించిన జెజ్జాల కృష్ణ మోహన రావు, భైరవభట్ల కామేశ్వరరావు గార్లకు మా కృతజ్ఞతలు.
– సంపాదకులు