గంట నాలుగైనా వైశాఖమాసం ఎండ తీవ్రంగానే వుంది. సావిట్లో తాతయ్య, సీతాపతి, చదరంగం బల్ల దగ్గిర కూర్చున్నారు. ఆట మంచి రసదాయకంగా వుంది. అంతా చుట్టూచేరి ఎవరికి తోచిన ఎత్తు వాళ్ళు గట్టిగా నలుగురు వినేటట్టు చెప్పుకుపోతున్నారు. సుభద్రం, శంకరం సైకిళ్ళు దిగేరు.
“ఏం బాబూ! యీ ఎండలో ఎక్కడనుండి రావడం!” అన్నారు నరసరాజుగారు.
ఆట ఆపి అంతా అటు తిరిగేం.
“ఏమిటి విశేషం తాతా”, అని తాతగారు సుభద్రాన్ని పలకరించేరు. తాతగారికీ తెలుసు అసలు వాళ్ళెందుకొచ్చిందీను.
“పెళ్ళికి చెప్పడానికొచ్చినట్టుంది” ముభావంగా అన్నారు రాంభద్దర్రాజుగారు.
ఇక దాచడం దేనికన్నట్టు ఆపళంగా పెద్దవారైన తాతగారితో “వాళ్ళ పెత్తండ్రి కూతురు లక్ష్మీదేవిని శ్రీ రాజా కలిదిండి నీలాద్దిర్రాజు మావగారి సుపుత్రుడు వరహాల రాజు, ఎం. ఎ. బావగారికిచ్చి వచ్చే శనివారం ఉదయం ఆరు గంటల ముప్ఫైరెండు నిమిషాలకు వారి స్వగృహంలో వివాహం జరిపించడానికి పెద్దలు నిశ్చయించినారని – మిమ్మల్నందర్నీ శుక్రవారం నాటికే దయచెయ్యవలసిందిగా శ్రీ పెద్ద బావాజీగారు మరీమరీ మనవి చెయ్యమన్నారనీ” సుభద్రం గుక్క తిప్పుకోకుండా చెప్పేడు.
“దానికేముంది, తప్పకుండా వస్తామని మీ పెద బావాజీతో చెప్పు” అని అందరి పక్షానా తాతగారు సెలవిచ్చేరు.
“పెళ్ళికి ఏటపోతుల్ని ఏమాత్రం జాగ్రత్త చేసేడోయ్ మీ పెదబావాజీ?” అన్నారు భోజనప్రియులైన బంగార్రాజుగారు.
“తమదయవల్ల వాటికేం లోటు రానీయం లెండి” వెంటనే అందుకున్నాడు శంకరం.
అంతా ఘొల్లున నవ్వుకున్నాం.
వాళ్ళిద్దర్నీ కూర్చోపెట్టి, మంచితీర్థం తీసుకొచ్చి ఇచ్చేను. వాటిని పుచ్చుకొని, పెళ్ళికి తప్పక రావాలని అందరితోనూ పేరు పేరున చెప్పి సెలవు తీసుకొని వెళ్ళిపోయారు.
వెళుతోన్న శంకరాన్ని తర్జనితో చూపిస్తూ, “అతనే కదూ సుభద్రం మేనత్త కొడుకు? చిన్నప్పటి నుంచీ చంద్రం కూతుర్ని ఇతనికే ఇచ్చి చేస్తారని, అందరూ అనుకున్నారే? దద్దయ్యగారు ఇప్పుడీ దూరపు సమ్మందాలకు పోయారేమిటి చెప్మా?” అన్నారు నరసరాజుగారు.
“నాకేమో శంకరం లక్షణంగానే కనుపించేడు. మరి వారికెందుకు నచ్చలేదో! ఏమో?” అన్నారు సీతాపతిగారు తాతగారి గుర్రం మీద ఏనుగును పగ పెడుతూ.
“ఇంతకు యీ కొత్తపెళ్ళి కుమారుడు ఏం చేస్తోన్నట్టు బాబూ” యాదాలాపంగా అడిగారు తాతగారు శకటుని గుర్రానికి కాపు వేస్తూను.
“చెయ్యడానికేముంది, ఎమ్మే చదువుకున్నాడు. మద్రాసులో ఏదో చేస్తోన్నాట్ట, బోలెడంత ఆస్తి ఉందని వినికిడి, కూతురు సుఖపడుతుందని చంద్రం ఆలోచించే యీ నిర్ణయానికొచ్చుంటాడు” అన్నారు తమ ధోరణిలో వరహాలరాజుగారు.
ఆ మాటలు ఎవరికీ పట్టినట్టు లేదు. అంతా సీతాపతి గారి ఆట కాసుకునే పరిస్థితిలో పడిందని, ఆలోచిస్తూ ఎత్తులు తోచక, తాతగారి ప్రజ్ఞని మెచ్చుకుంటున్నారు. అందర్నీ ఆలోచించమని తాతగారు చుట్ట వెలిగించేరు.
గుప్పున పొగవదులుతూ, “మొగపెళ్ళి వారంతా పెద్దపెట్టున తర్లొస్తారనుకుంటాను, ఈ పెళ్ళికి తప్పకుండా వెళ్ళాలనేవుంది. ఏమోయి పెదబాబు! నీ సవారీ బండికి రంగులు వేయించడం అయిందేమిటి?” అన్నారు తాతగారు.
“యివాళే పూర్తిచేశాం తాతయ్యా! మధ్యాన్నం శనగలు పంచిపెట్టిద్దామనుకుంటున్నాను. తప్పకుండా అలాగే వెళదాం” అని వప్పుకున్నాడు పెదబాబు.
సీతాపతిగారికి ఎత్తు తోచింది. తిరిగి అంతా చదరంగంలో ములిగి పోయాం.
పెళ్ళి రేపనగా ఆ మధ్యాన్నం ఎండ చల్లబడ్డ తరువాత సవారీబళ్ళు వేసుకొని అంతా ప్రయాణానికి సిద్ధం అయేం. ఆడపెళ్ళివారి ఊరు మా గ్రామానికి రెండు క్రోసుల దూరంలో ఉంది. నేనూ తాతగారూ కొత్తగా రంగులు వేసిన పెదబాబు మైసూరెడ్ల బండిలో చదరంగంబల్ల పెట్టుకొని కూర్చున్నాం. పెదబాబు మొత్తాల్న ఎక్కి ముగుదాళ్ళు చేత్తోగట్టిగా పట్టుకొని ” ఎ – హెయ్ – ద – ద” అంటూ ఎడ్లని అదలకించాడు. పాలికాపు ముందున పరిగెడుతూంటే బళ్ళన్నీ ఒకదానివెనక ఒకటి సాగిపోయినై.
పెళ్ళివారి ఊరు చేరుకోవడానికి మాకాట్టే వ్యవధి పట్టలేదు. సావిటి వద్ద బళ్ళు నిలిపి అంతా దిగేం. పెళ్ళి ఏర్పాట్లన్నీ పటాటోపంగా జరిగినై. సావిడి ముందు పెద్ద పందిర, ఆ పందిరకు ఎక్కడ చూసినా మావిడాకు తోరణాలు, రంగులగొలుసులూనూ. రాట్లకు చుట్టిన లేసులు, పందిట్లో కట్టిన కాగితం బుట్టలు గాలికి రెపరెపలాడుతుంటే ఆ వాతావరణం చూడ ముచ్చటగానే వుంది.
పెళ్ళి కుమార్తె తండ్రిగారు పినతండ్రిగారు వచ్చి మమ్మల్ని ‘దయచెయ్య’ మని ఆహ్వానించారు. పరుపులు, పెట్టెలు బంధువులకోసం ప్రత్యేకం ఏర్పాటుచేసిన బసలో దింపమని పెదబాబు నౌకర్లకు పురమాయించేడు.
“విడిది ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారోయ్” అని అడిగేరు తాతగారు.
“హస్తబల్లో అంతా శుభ్రం చేయించి జంబుఖానాలు, చాపలూ పరిపించేం తాతయ్యా” అని శంకరం తండ్రిగారు అప్పలనరసింహరాజుగారు చెప్పేరు.
“హస్తబల్లో ఏవిటోయ్! లక్ష్మీవిలాసంలోనో మోతీమహల్లోనో చెయ్యవలసింది” అన్నారు తాతగారే.
“ఈ రోజుల్లో యిదే బావుంటుంది. హాయిగా గాలి వేస్తుంది; అంటే సరే అన్నాను” అన్నారు నీళ్ళునములుతూ పెళ్ళికుమార్తె తండ్రి చంద్రం గారు తాతగారితో.
“బాగానే వుంది వరస” అన్నారు తాతగారు మీసం దిద్దుకుంటాను.
తాతగారి విసురుకి అంతా విస్తుపోయారు. రెండునిముషాలు నిశ్శబ్దం. ఆ తరువాత ఎవరి పనులు వాళ్ళకి గుర్తొచ్చి పెళ్ళిపెద్దలంతా హడావుడిగా వెళ్ళిపోయారు. సావిట్లో పెళ్ళికుమార్తె తాతగారైన పెదరాజుగారి సరసన కూర్చొని, తాతగారు చదరంగం ఎత్తు వేసేరు.
అనుకున్న వేళకు రైలు రావడంతో మొగపెళ్ళి వారంతా బళ్ళు దిగేరు. కాని అనుకున్నంత మంది తర్లి రాలేదు. స్టేషనుకి వెళ్ళిన బళ్ళు చాలామట్టుకు వట్టినే తిరిగొచ్చినై.
మొగ పెళ్ళి వారి బసలో అంతా స్నానాలు చేసి బట్టలు వేసుకొని, పెళ్ళి కొడుకుని ముస్తాబు చేసి విడిదికి బయల్దేరేవేళకు ఆరుగంటలు దాటింది.
ఈ లోగా ఆడపెళ్ళివారంతా అటుతిరిగీ ఇటుతిరిగీ నిలువు చాకిరీ చేసేరు.
పెళ్ళికొడుకుని ముత్యాల పల్లకిలో కూచోపెట్టి, బాజా భజంత్రీలతో తీసుకొచ్చేరు. పెళ్ళికొడుకు విడిదిలో కూర్చున్న తరువాత, ఆడపెళ్ళివారంతా కలిసి విడిదిలోకి వెళ్ళేరు. మొగపెళ్ళివారంతా లేచి నిలుచుని చేతులు చూపిస్తూ దయ చెయ్యమన్నారు. ఆడపెళ్ళివారు అందుకు ప్రతిగా చేతులు చూపిస్తూ దయ చెయ్యమన్నారు. అలా ఒకర్నొకరు దయ చెయ్యమంటే దయ చెయ్యండని గౌరవించుకున్నారు. తలపాగాలు చుట్టుకుని తిలకం దిద్దుకుని ఠీవిగా వున్న రాజులంతా మీసాలు సరిజేసుకుంటూ, ఇస్త్రీ మడతలు నలక్కుండా విడిదిలో వేసిన తివాసీ మధ్యకు నెట్టి మర్యాదగా అంచుల మీద ఒకర్నొకరు అంటీ ముట్టకుండా జరిగి కూర్చున్నారు.
“బంగార్రాజు” ఇంతవరకూ మడత నలక్కుండా దగ్గరగా చుట్టబెట్టి, చంకను పెట్టితెచ్చిన జరీ కండువా దులిపి సాపు చేసి భుజం మీద వేసుకున్నాడు.
పురోహితులు లగ్నపత్రాలు చదువుతూ ఇరుపక్షాల వంశవృక్షాన్ని వర్ణించేరు. శౌర్య పరాక్రమాలను పొగిడేరు. పనసలు దొర్లించేరు. సత్కారాలు జరిగినై. విడిది చుట్టూ గ్రామంలో వున్న చిన్నా పెద్దా చేరి మండిగం కట్టి పెళ్ళికొడుకునీ పెళ్ళివారినీ చూసి “సెభాస్” అన్నారు. పెళ్ళికొమారుడు పెట్రోమాక్సులైటు వెలుగులో చంకీ కోటు, జరీ తలపాగా దానిపై “జీగా సర్‌ఫేస్” మెరుస్తోంటే మెత్తని పరుపు మీద దిండ్లను ఆనుకొని ఎదురుగా వున్న చూపుటద్దంలో ప్రతిబింబం చూసుకొంటూ రాచఠీవితో కళకళలాడుతోన్నాడు. అతని చుట్టూ వెండి పళ్ళేలతోనూ ఇత్తడి పళ్ళేలతోనూ నేతితో చేసి తెచ్చిన ఫలహారాలు “ఘుమ్మ”ని పరిమళాలు విరజిమ్ముతోన్నై. పెళ్ళికొడుక్కి రెండువేపులా తోటి పెళ్ళికొడుకులు. తెల్లని సుర్వాలు షేర్వాణీలు బిగించి, చిలకపచ్చ రంగు తలపాగాలు చుట్టుకొని బొమ్మల్లా కూర్చున్నారు. తోటి పెళ్ళికొడుకులిద్దరూ కవలపిల్లలవలె జత సరిపోయేరు.
“వడ్డన్లు అయినాయి. భోజనాలకు దయచెయ్యండి” అని లోగిట్లోంచి కబురొచ్చింది. వచ్చిందే తడవుగా, పెట్రోమాక్సు లైట్లతో సహా అంతా పొలోమని భోజనాలకి లేచి వెళ్ళేం.
వంటకాలన్నీ రుచికరంగానే వున్నాయి. తాతగారికి మాత్రం ఈ శాకాహారం పడినట్టులేదు.
“పూతచుట్టలు మాబాగా ఉన్నాయండే” అని నా ప్రక్కన కూర్చున్న పడమట రాజుగారు పాస్ చేసేరు. భోజనాలయిన తర్వాత తాంబూలాలు వేసుకుని బసలకు చేరుకున్నాం.
“ఏమితో మొగపెళ్ళివారు కొంచెం తక్కువ కనిపిస్తున్నారు తాతా!” అన్నారు తాతగారు. గూడార్ధం నాకేం కనిపించలేదు.
“దూరం కదూ! అందుకని ఏదో తగుమాత్రంతో వొచ్చారు” అన్నాను.
“అదేవిటి! మారోజుల్లో ఈ మాత్రం దూరపు చుట్టరికాలు చెయ్యలేదూ? చినబాబు పెళ్ళికి కొప్పాక ముప్పై కార్లలోనూ, ఇరవై బస్సుల్లోనీ జిల్లా సరిహద్దుకి తర్లివెళ్ళేం. ఆ సప్లయిలేమిటి? ఆ మర్యాదలేమిటి” – అన్నారు తాతగారు ఆవులిస్తూనే.
“తెల్లవారు జామున లేవండి తాతయ్యా! కళ్యాణమండపం లోనికి వెళదాం” అని చెప్పి ఆయనకు నిద్రాభంగం కాకుండా ఉండాలని లేచి దూరంగా చతుర్ముఖ పురాణంలో వున్న సుభద్రం శంకరం వాళ్ళ దగ్గరికి పోయి, నేనూ ఒక చెయ్యి కలిపేను.
“రాజ్జాకీ మూడుపొళ్ళూ మారాసు” ఎత్తి మూడు బేస్తులు పంపకం పెట్టేను.
“నీకెందుకురా తద్దినం, సత్తెప్ప ఎత్తులూ నువ్వూనూ” శంకరం హేళన చేసేడు. అలిగి ఆటమానుకుని వెళ్ళి పడుకొన్నాను.
అనుకున్నట్టు తెల్లవారుజామున నాలుగు గంటలకే తాతగారు లేచి నన్ను లేపేరు. నిద్దర ముంచుకొస్తున్నా లేచ్చి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేయడానికి వెళ్ళేను.
వసారా ప్రక్కన గొఱ్ఱెపోతుల్ని చంపి చర్మాలు తీస్తున్నారు. బంగార్రాజూ, రాంభద్దర్రాజూ కత్తిపీటలు ముందు వేసుకుని చాపలమీద కూర్చున్నారు.
బంగార్రాజుని చూసి నవ్వుకుంటూ వెళ్ళి స్నానం చేసి బట్టలు వేసుకొని చదరంగం బల్ల పట్టుకొని తాతగారితో సహా కళ్యాణమండపం వున్న నాలుగిళ్ళ భవంతి చేరుకున్నాను. అప్పుడే బంధువులతో కళ్యాణమండపం, నాలుగిళ్ళ భవంతీ నిండిపోయేయి. పురోహితులు లయబద్ధంగా మంత్రోచ్ఛారణ చేస్తున్నారు. భజంత్రీ మేళం ఎడతెరిపి లేకుండా మోగిపోతోంది.
పెళ్ళికుమార్తె తాతగారు హుక్కా పీలుస్తూ మాతాతగారినీ చదరంగం బల్లనీ ఆహ్వానించేరు. ఇద్దరూ చదరంగంలో జమాజట్టిలే. తాతగారు ఎత్తువేసేరు. దగ్గర కూర్చొని దీక్షగా ఎత్తులు చూస్తున్నాను.
శంకరం వచ్చి పిలిచేడు, లేచి అతనితో వెళ్ళేను. సుభద్రం, శంకరం నేనూ కలసి వెండి పళ్ళేలలో అమర్చిన అత్తరు తాంబూలాలు, కర్పూరపు పుల్లలు, తలా ఒకటి ఇచ్చి పన్నీరు చల్లేం. అతిథులందరికీ చందన తాంబూలాది సత్కారాలు యధావిధిగా జరిగిపోయినై.
దక్షిణపు గదిలో అవిరేడు దించేరు. గదంతా పిల్లలతోనూ పేరంటాళ్ళతోనూ నిండిపోయింది. ఆడవారంతా తలుపుకి సందు చేసుకుని ఒకరిమీద ఒకరుపడి కళ్యాణమండపంలో జరుగుతోన్న తంతు చూస్తున్నారు. గది దాటిరావడానికి శక్యం కాదు. మండువానిండా రాజులే.
పెళ్ళిపీటల మీద కూర్చొని పెళ్ళికుమారుడు హోమం చేస్తున్నాడు. పెళ్ళికూతురు చుట్టూ తెరవేసి పట్టుకున్నారు. చెట్టంత విసినకర్రకు చుట్టూ జూలు కట్టి ఇంటి మంగలి విసురుతూ, సేవ జేస్తున్నాడు. ముహూర్తం సమీపిస్తోంది.
పెళ్ళికొడుకు మేనమామగారైన సూరపరాజుగారు బుగ్గమీసాలు దువ్వుకుంటూ తలపాగా ఎగరవేసుకుంటూ వచ్చి పెళ్ళికొడుకు చెవిలో ఏదో చెబుతున్నాడు. పెళ్ళికొడుకు, ఆయనా కలసి గుసగుసలాడుకొంటున్నారు.
శంకరం తండ్రిగారు సుభద్రాన్ని పిలిచి “ఏమిటి మామా! ఆ మీసాల మహారాజు పెళ్ళికొడుకు చెవి కొరికేస్తున్నాడు.” అన్నారు హాస్యధోరణిలో.
“ఏవుందీ గౌరీదేవిని ఎలా సంగ్రహించుకు పోవడమా అని ప్లాను వేసుకుంటున్నట్లున్నారు” అన్నారు పెదబాబు.
” ఆ పప్పులేం వుడకవు లెండి. సన్నికలు పొత్రం అన్నీ భద్రంగా చూడమని మా తమ్ముడ్ని కాపలా పెట్టేను” అన్నాడు శంకరం అమాయకంగా.
“అవునర్రోయ్, అదే కాదు, ఆ దుక్కిపూజ, కొబ్బరి బొండం, రోకలీ అవన్నీ చూడమను. పెళ్ళి దగ్గర సామాగ్రిలో ఒక్క పూచిక పుల్లైనా పెళ్ళికొడుకుతో వెళ్ళటానికి వీల్లేదు జాగ్రత్త” అని హెచ్చరిక చేసేరు శంకరం తండ్రిగారు.
పెళ్ళికొడుకు చెవినుంచి వూడిపడ్డ సూరపరాజుగారు గొంతు చించుకుంటూ, “ఆపండి సిద్ధాంతి గారూ! మంత్రాలూ లేవు చింతకాయలూ లేవు” అని “గర్జిం”చేరు. ఆ కేకతో వాయిద్యాలు ఆగిపోయినై.
“యీ పెళ్ళి జరగడానికి వీల్లేదు. సూరపరాజంటే ఏవనుకున్నారో” అని చిందులు తొక్కడం ప్రారంభించేరు. వాతావరణం అంతా స్థంభించిపోయింది. అంతా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఎవరికీ ఏమీ అర్థం కావడంలేదు. తెల్లముఖాలు వేసి ఒకర్నొకరు చూసుకుంటున్నారు.
కంకణం కట్టుకున్న పెండ్లికుమారుడు పీటలమీద నుంచి లేచిపోయాడు.
“డబ్బులేని దర్జాలు, మొహర్బానీలు ఎందుకూ? సాంప్రదాయమట! సాంప్రదాయం. మాకూ వుంది చచ్చినంత. మా తాతలంతా మహారాజులే, అదేం పనికిరాదు. అనుకున్నట్టూ పదిహేను వేలూ నగదు చెల్లించవలసిందే. యిచ్చుకోలేకపోతే చెప్పండి వెళ్ళిపోతాం” అన్నాడు పెళ్ళికొడుకు.
చదరంగం ఆడుతోన్న తాతగారు “అవ్వ” అని నోరు నొక్కుకొని “ఏవిటీ వేలు? కట్నం కాబోలు! తన కాలంలో ఏ పెళ్ళైనా ఇలా జరిగిందా! పెళ్ళికుమారుడు పీటల మీద కూర్చొని నోరు కదపడమే! హద్దూ పద్దూ లేనట్టుంది, పైగా సాంప్రదాయం అంటాడు! చదువుకున్నాట్ట చదువు! ఎందుకూ? నామోషీ!” అనుకున్నారు.
“క్షమించాలి. అన్న సమయానికి లెఖ్ఖ జతపళ్ళేదు. తప్పకుండా ఇచ్చుకుంటాను, ముందీ తంతేదో కానివ్వండి” అని పెళ్ళికుమార్తె తండ్రి చంద్రంగారు సూరపరాజుగారి రెండు చేతులూ పట్టుకున్నారు.
“అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలన్నారు. అదేదీ పనికిరాదు. గతిలేకపోతే మానుకోవాలి. ముందు డబ్బు పడితేనే శుభకార్యం జరుగుతుంది. అంతే” అని పీటల మీద నుంచి లేచిన పెళ్ళికొడుకు పెళ్ళరుగు దిగిపోయేడు.
తెరమరుగున వున్న పెళ్ళికూతురు దించుకున్న తల పాతాళానికి కుంగిపోయింది. తల్లిగారి కంటిని నీటిబొట్టు కనిపించింది.
“వీడు రాచపుట్టుకే పుట్టాడా!” అనుకున్నారు తాతగారు.
“కట్నం ఇస్తున్నామన్నట్టు మా వెధవ నాతో చెప్పనేలేదండీ” అంటూ చదరంగం వదలి లేచి వెళ్ళిపోయేరు పెళ్ళికుమార్తె తాతగారు. బంధువులందరిలోనూ పెద్ద కలకలం బయల్దేరింది. పెళ్ళికుమారుడితో వచ్చిన చిన్నా పెద్దా ఎందులోనూ కలగజేసుకోవడం లేదు. పెళ్ళికుమార్తె తండ్రిగారికి ముచ్చెమటలు పోసినై. పెళ్ళికొడుకెంత మాటన్నాడు! నలుగురిలోనూ పరువు పోయేట్టుంది. ఎలాగ?
చరచరా లోగిట్లోకి వెళ్ళేరు. బొట్టుపెట్టె తెరచి వున్న డబ్బంతా దులిపి తీసుకొచ్చేరు. సూరపరాజుగారి కందిస్తూ, “యీ ఐదువేలూ వుంచండి. మిగతా లెఖ్ఖ జతపడగానే ఇచ్చుకుంటాను” అన్నారు.
“మీరేమీ పుచ్చుకోకండి మావయ్యా! ఈ జతపడ్డాలు, లేకపోడాలు నాకనవసరం. ఆమాట ముందే ఏడుస్తే జత పడింతర్వాతే వద్దుం! అనుకున్నట్టు డబ్బివ్వండి, ఒక్క పైసా తక్కువైనా పనికిరాదు” అన్నాడు పెళ్ళికొడుకు.
మగపెళ్ళివారితో వచ్చిన ముసలిరాజుగారు కలుగజేసుకొని – “ఏదో అంటున్నారు సర్దుబాటు చేస్తామని, ఎందుకు తొందర పడుతున్నావు బాబూ”, అని సర్ది చెప్పబోయేరు.
“తమరు కొంచెం నోరు మూయించండి. చాలు పెద్దరికం” అని సూరపరాజుగారు ఆయన మీద విరుచుక పడ్డారు.
ఆయన వెంటనే కళ్యాణమండపం వదలి తిరిగి చూడకుండానే స్టేషనువైపు వెళ్ళిపోయేరు.
సుభద్రానికి చెల్లెలి పెళ్ళి అభాసు పాలౌతున్నందుకు చిర్రెత్తుకొచ్చింది. పెద్దలంతా చుట్టూ వున్నారు. ఏవిటి చెయ్యడం?
గదిలో పేరంటాళ్ళంతా విడ్డూరంగా మూతులు విరుచుకొంటున్నారు.
పెళ్ళికుమార్తె తండ్రిగారు దిక్కుతోచక కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకోంటుండగా తమ్ముడు కనిపించేడు.
“ఎక్కడైనా లెఖ్ఖ జతపడ్తుందంటావా?” అన్నారు చంద్రం గారు తమ్ముణ్ణి చూస్తూ.
తమ్ముడు ఉగ్రరూపంలో వున్నాడు. కళ్ళు చింతనిప్పుల్లా వెలిగిపోతున్నాయి. “చాలు మీ పెద్దరికం”, అని బావమరిది అప్పల నరసింహరాజు వైపు తిరిగి ఒక్క చూపుతో సంజ్ఞ చేసి, “కుదురుతుంది. కుదరకేం! మీరిక్కడే వుండండి”, అని పెళ్ళికుమారుడ్ని సమీపించేరు.
“వాయించండర్రా భజంత్రీలూ, సిద్ధాంతి గారూ మీ మంత్రాలు కానివ్వండి. ఈ పెళ్ళి ఎలా జరక్కపోతుందో మేం చూస్తాం” అన్నారు బావమరిది అప్పల నరసింహరాజుగారు.
“బాబూ! మర్యాదగా పీటలమీద కూర్చో. లేకపోతే పరువు దక్కదు”, అన్నారు పెళ్ళికూతురి పినతండ్రిగారు పెళ్ళికుమారునితో.
“లేకపోతే ఏం చేస్తారేవిటి? యీ మోటు వ్యవహారం నా దగ్గర సాగదు”, అన్నాడు పెళ్ళికొడుకు బింకంగా.
“పెదబాబూ! ఆ నాలుగు తలుపులు మూయించమ్మా! ఇదేదో చూస్తాట్ట వీడు”, అని ఆజ్ఞాపించేరు పినతండ్రిగారు.
వెంటనే నాలుగు తలుపులూ మూతలు పడిపోయినై. పెండ్లికుమారుడ్ని తర్లించుకొచ్చిన వారందరికీ గుండెలు గుండెల్లో లేవు. ఎంతో క్లుప్తంగా వచ్చేరు. చతురంగబలాలు తెచ్చుకోలేదు. ఆయుధాలసలే లేవు. స్థానబలం విజృంభించింది. రాజులు దూరాభారం నుండొచ్చారు.
రోషాలతో కుళ్ళిపోతూ, ఎక్కడ కూర్చున్న వాళ్ళక్కడే కూర్చున్నారు. కదల్డానికి వీల్లేదు. గట్టి చిక్కే తెచ్చిపెట్టుకున్నారు. పెళ్ళికుమారుడు ఒకరు చెప్తే వినే తత్వంలా లేడు. ఎవరికీ – ఏమీ పాలుపోవడం లేదు.
పురోహితులు మంత్రాలు గడగడా చదివేసుకుపోతున్నారు.
పెళ్ళికుమార్తె పినతండ్రిగారూ మేనమామగారూ కలిసి సూరపరాజుని ఒక్కతోపు తోసి పెళ్ళికొడుకుని అమాంతం ఆకాశంమీద కెత్తి ఒక్క కుదుపుతో పెళ్ళిపీటల మీద కూర్చోబెట్టేరు. పందిరంతా గడగడలాడింది. చేరిన పిల్లలంతా అదిరిపోయేరు. పురోహితులు రెట్టించిన గొంతుతో మంత్రోచ్ఛారణ చేస్తున్నారు. హోమగుండంలో అగ్నిహోత్రం తీక్షణజ్వాలల్ని మీదకు లేపుతోంది. రాజుల ముఖాలలో రౌద్రం, శౌర్యం వుట్టిపడిపోతున్నాయి.
వాయిద్యాలు అనేక శ్రుతుల్లో మోగిపోతున్నాయి. పెళ్ళి చూడ్డానికి వచ్చినవాళ్ళు నోళ్ళు తెరుచుకొని ఆశ్చర్యంగా చూస్తున్నారు.
“ఏవిటో కంగాళీ చట్రం” అనుకున్నారు తాతగారు.
అవిరేడు గదిలో కొంపలంటుకున్నంత గోల వినిపించింది. నలుగురు తలుపులు తోసుకొని వెళ్ళేం.
సుభద్రం తుపాకీ పుచ్చుకొని కళ్యాణమండపం ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆడవారంతా అడ్డుకొని తుపాకీ లాక్కోవడానికి యత్నిస్తున్నారు. వారికి తుపాకీ అందకుండా ఒక చేత్తో మీదకెత్తి పట్టుకొని, వీరావేశంతో చిందులు వేస్తున్నాడు.
ఏ అఘాయిత్యం చేస్తాడో అని తలపడి సుభద్రం వద్దనుండి ఆ ఆయుధం లాక్కుని గదిలో పెట్టి భద్రంగా తాళం వేసేను. స్త్రీలంతా నోళ్ళు నొక్కుకొని “అయ్యో భగవంతుడా” అని దేవుణ్ణి ప్రార్థించుకొంటున్నారు.
కళ్యాణమండపంలో వేదమంత్రాలు శాస్త్రీయ కంఠంలో స్వరాలు పలుకుతున్నాయి. “హమ్మయ్య” అని వచ్చి కూర్చున్నాను.
ఇంతలో పెళ్ళరుగు మీద మళ్ళా గొడవ జరిగింది. ఈసారి పెళ్ళికుమార్తె చుట్టూవున్న తెర ఒక్క వూపుతో ఎగిరిపోయింది.
వాయిద్యాలు, మంత్రాలు ఆగిపోయినై. పెళ్ళికుమార్తె లేచి నిలుచుంది. నిలుచొని పెళ్ళికుమారుడి ముఖం మీద తెరపట్టిన శాలువా విసరికొట్టింది. ఏడువారాల నగలతో ముస్తాబై ఇంతసేపూ తలవంచుకొని సిగ్గుతో కందిపోయిన పెళ్ళికుమార్తె, ఇప్పుడందర్నీ తలెత్తి ధైర్యంగా చూసింది. చూసి ఒక్క తృటిలో గిరుక్కున తిరిగి అవిరేడు గది తలుపులు తోసుకొని వెళ్ళి పేరంటాళ్ళ మధ్య పడింది. ఆమె ననుసరించి తల్లిగారు కూడా వెళ్ళిపోయేరు.
తాతగారికిదేం అర్థం కాలేదు. ఇంతమంది రాజుల్లోనూ రాజుల పరువూ, మర్యాదా మంటగలిసేయి.
“ఏవిటీ దిమ్మరి మేళం! వెధవ సంత! ఇది పెళ్ళేనా” అని అనుకున్నారు.
పెళ్ళివారంతా నిర్ఘాంతపోయి స్తంభించి పోయేరు.
ఐదు నిమిషాలు ఎవరికీ మాటరాలేదు. ఏ విషయం తేల్లేదు.
“చూడండి బాబూ! ముహూర్తం దాటిపోతుంది” అన్నారు సిద్ధాంతిగారు.
“దాటిపోతే పోనీండి. రాజుగోరి మాటకేటి, నోగిట్లో సిన్నమ్మిగోరు పెళ్ళికొమారుడ్ని సేసుకోడాని కొప్పుకోడం నేదని అమ్మగారు సెప్పిరమ్మని నన్నంపినారు. పంతులుగోరూ! ఈముహూర్తానికి సిన్నమ్మిగోర్ని శంకరంబాబు కిచ్చి కళ్యాణం సెయ్యండి” అని దాసీ చిట్టెమ్మ జబర్దస్తీగా చెప్పింది.
“ఇదేవిటి! యీ ఎత్తు! మరీ పసందుగా వుందే!” అని తాతగారు చదరంగం బల్లకు అతుక్కుపోయి చూస్తూ వుండిపోయేరు.
పెదబాబు తలుపులన్నీ బారుగా తెరిపించేడు. మొగపెళ్ళివారు ఒకరితో ఒకరు చెప్పకుండా పెళ్ళరుగంతా ఖాళీ చేసి వెళ్ళిపోయేరు. తర్లివొచ్చిన “పెళ్ళి కుమారుడు”ఎలా వెళ్ళేడో తెలీదు గానీ ఆ ఊళ్ళో మాత్రం వీళ్ళకు నిలువెత్తు బంగారం పోసినా బండి దొరకలేదు.
శంకరం తర్లి రాలేదు. అతనికి విడిది ఏర్పాటు చెయ్యబడలేదు. జరీ కోటు, తల పాగా, “జీగా సర్‌ఫేస్” కట్టలేదు.
నేతపంచ కట్టుకుని, పెళ్ళికుమార్తె చెయ్యి పట్టుకొని స్వయంగా తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టుకున్నాడు. పెళ్ళికిమార్తె చుట్టూ ఎవరూ తెర పట్టలేదు. పురోహితులు –
“అయాం ముహూర్తస్సు ముహూర్తోస్తు” అని నలుగురి చేతా అనిపించేరు.
“బంగార్రాజు” పెళ్ళిభోజనంతో ఏటపోతులన్నీ జాగ్రత్తగా ఖర్చయిపోయినై.
సాయంకాలం అంతా ఇండ్లకు తిరిగివచ్చేం.
వస్తోన్నప్పుడు బలగంలో రెండు బంట్లు ఎక్కడో జారిపోయాయని తాతగారు దారిపొడుగునా నొచ్చుకుంటూనే వున్నారు.
(కథ నచ్చిన కారణానికి దారి)