విజ్ఞానశాస్త్ర పరమైన విషయాలను నిర్వచించటానికి వీలైనట్లుగా,మానవీయ విషయాలను నిర్వచించటం వీలు కాదు. కారణం, విజ్ఞానశాస్త్ర విషయాలు తటస్థ పరిశీలనకు సంబంధించినవి. మానవీయ విషయాలు చాలావరకు వైయక్తిక అనుభూతికి సంబంధించినవి. అందులో కవిత మరీను. జీవితాన్ని నిర్వచించటం ఎంత కష్టమో, ఎంత సంక్లిష్టతతో కూడుకున్నదో, కవిత్వాన్ని నిర్వచించటం కూడా అంతే. కవిత్వం కూడా అంత బాహుళ్యం, సంక్లిష్టత కలిగినది కాబట్టి.
ప్రపంచప్రసిద్ధి పొందిన కవులు, సాహితీవిమర్శకులు రకరకాలుగా కవిత్వాన్ని నిర్వచించటం మనం చూస్తున్నాం. కానీ లిరిక్ లేదా వైయక్తిక కవితకు సంబంధించి అందరూ అంగీకరించిన విషయం – కవి ఒక సంఘటనకు సంబంధించి కానీ, ఒక విషయానికి సంబంధించి కానీ, ప్రగాఢమైన అనుభూతికి లోనై, హృదయం ఆర్ద్రమై, మనసు రసప్లావితమై, తన ఆవేశపూర్వక అనుభవాన్ని పదిమందితో పంచుకోవాలనే తపన లోంచి కవిత్వం వస్తుంది అని. అప్పుడు కవి మూర్తీభవించిన సృజనాత్మక ఆవేశస్ఫూర్తి. ఈ ఆవేశం ఆనందం అయినా, ఆవేదన అయినా, కారుణ్యం అయినా, కోపం అయినా, జుగుప్స అయినా, ఆ ఆవేశ స్వభావం ఏదైనా అది పాఠకుడి హృదయానికి హత్తుకునేటట్లు చెప్పాలి. దానికి మార్గం అందంగా చెప్పటం, కవితామయంగా చెప్పటం. ఆ ఆవేశం జుగుప్సాకరమైనది అయినా అందంగానే చెప్పాలి. అప్పుడే, అది కవిత అందించిన ఆనందానుభూతి ద్వారా, ఆ జుగుప్సాకృతిని పాఠకుడి హృదయం మీద చెరగని ముద్ర వేస్తుంది. ఇదంతా విజయవంతంగా జరగాలంటే, నిగ్రహ ప్రగ్రహాలు లేకుండా బయల్వడిన అనుభూతుల రఫ్ ఎడ్జెస్‌ను చిత్రిక పట్టి వాటి కొక రిఫైన్మెంట్‌ను, ఒక చక్కని స్వరూపాన్ని ఇచ్చే మార్షలింగ్ ఇంటెలిజన్స్ కవి కలిగిఉండాలి.ఇది పొయెటిక్ క్రాఫ్ట్‌కు సంబంధించిన విషయం.
కవిత్వానికి స్వావలంబన, స్వయంప్రతిపత్తి ఉండటం వల్ల అది సార్వభౌమాధికారం కలిగి ఉంటుంది. ఏ సామాజిక స్పృహకో, ఏ రాజకీయ,ఆర్థిక, సామాజిక, తాత్విక, ఆధ్యాత్మిక సిద్ధాంతాలకో అది తల వంచనవసరం లేదు. కవితలో ఇవన్నీ ఉండవచ్చును. కానీ కవిత, కవితలా భాసించటానికి ఇవి ఏ మాత్రం అడ్డుపడకూడదు. కవితాశక్తికి అవి అణిగిమణిగి ఉండవలసిందే. దురదృష్టం ఏమిటంటే, మనది ప్రచారయుగమైపోయింది. కొందరికి సామ్యవాదానుకూలంగా వ్రాస్తేనే కవిత్వమవుతుంది. మరికొందరికి, సంఘసంస్కరణాన్ని ప్రచారం చేస్తేనే కవిత. మరికొందరికి ఆధ్యాత్మికత, మరికొందరికి పతితజనోధ్ధరణ ప్రచారం చేస్తేనే కవితలు. ఇలా ప్రచారకవితలు వ్రాసే కవులకు, ప్రచారం చేయబడిన సిద్ధాంతాన్ని కాంక్షించే వారు పెద్ద అభిమానులుగా ఏర్పడతారు. వారికి, గొప్ప కవులని, ఈ అబిమానుల ద్వారా పెద్ద వ్యవస్థీకృత ప్రచారం సిద్ధిస్తుంది. ఇవన్నీ మహితాదర్శాలు కావనటం లేదు. కానీ, వీటిని ప్రచారం చేయవలసిన పని కవిత్వానికి లేదు.
ఇలా చెప్పినంతమాత్రాన ఒక కవికి వ్యక్తిగా ఒక జీవన సరళికి, ఒక తాత్విక సిద్ధాంతానికి నిబద్ధత ఉండకూడదని కాదు. తన కవిత ద్వారా ఒక సందేశం అందించకూడదని కాదు. కానీ తన నిబద్ధతను ప్రతిబింబించే సందేశాన్ని కవితా పరంగా అందించాలని మాత్రమే. కవి ప్రధాన లక్ష్యం తన కవిత ద్వారా తన అనుభూతిని పాఠకుడికి అందంగా అందించి,ఆనందాన్ని చేకూర్చటం. కవి సందేశం కవిత అందించే ఆనందానుభూతిలో అంతర్లీనమై పాఠకుడి అంతరంగం లోకి ప్రవేశించాలి. కవిత్వం విశ్వ సత్యాలను ఆవిష్కరించవలసిన అవసరం లేదు. దాని పని మానవుని అనుభూతులమయమైన జీవితాన్ని అందంగా ఆవిష్కరించటమే.
దేవరకొండ బాలగంగాధర తిలక్ తాను అనుభూతి వాదినని నిస్సంకోచంగా చెప్పుకున్నారు.వారు కవిత్వం గురించి చెబుతూ, నవత-కవిత అనే కవితలో;
కవిత్వం ఒక ఆల్కెమీ
…..
కవిత్వం అంతరాంతర జ్యోతిస్సీమల్ని బహిర్గతం చేయాలి
విస్తరించాలి చైతన్య పరిధి
అగ్ని జల్లినా, అమృతం కురిసినా
అందం,ఆనందం దాని పరమావధి
అని రాస్తారు. నెహ్రూ ఎంత గొప్ప రచయితో, ఆయన రచనా శైలి ఎంత రమ్యమైనదో, వివరిస్తూ వ్రాసే వ్యాసంలో విపరీతంగా ఆయనను కోట్ చేయడం తప్పదు. తిలక్ గురించి కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఆయన చెప్పింది చూస్తుంటే, ఆయన వ్రాసిన కవితలు చదువుతుంటే,కవిత్వతత్వం వారికి నరనరాలా ఎంత జీర్ణించుకు పోయిందా అని అనిపిస్తుంది. ఆయన హృదయం, మనస్సు ఎంత కవితామయమైనవా అని అనిపిస్తుంది. ఆయన జగత్తును చూసే తీరులో, ఆయన చూపులో, ఎంత కవిత దాగుందా అనిపిస్తుంది.
తిలక్ కవితా సంకలనం ‘అమృతం కురిసిన రాత్రి’లో మొదటి కవిత ‘నా కవిత్వం’ వారి కవిత్వానికి ,వారి కవిత్వావగాహనకు, మానిఫెస్టోగా భాసిస్తుంది. ఆయన కరుణ, జాలి కలిగి సర్వజనావళి సంతోషంగా ఉండాలని కాంక్షించే మానవతా వాది. అంతేగాని, ఆయన ఏ రాజకీయ, ఆర్ధిక, సామాజిక సిద్ధాంతానికి పట్టం గట్టాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. తాను బ్రతుకుతున్న సమాజంలో ప్రజలను వేధిస్తున్న సమస్యలకు తాను స్పందించకుండా ఏనాడూ ఉండలేదు. కానీ ఆ స్పందన, ఆ ఆవేదన కవితామయంగా మాత్రమే రూపు దిద్దుకోవాలి. ఇది తిలక్ నిశ్చితాభిప్రాయమే కాదు, ఆయన సహజసిధ్ధ స్వభావం.
తిలక్ కవితా సౌందర్యానికి ప్రధానమైన హేతువులు భావోద్వేగం, పరీశీలనా నైశిత్యం, ఇమేజరీ. సింబల్స్ ద్వారా వైరుధ్యాలు లేని అందమైన మెటఫర్లతో కూర్చబడిన పదచిత్రాల హారాల ద్వారా ఒక దృశ్యాన్ని, ఒక మానసిక స్థితిని, మనోహరంగా, అంతర్లీనంగా పాఠకుడి ప్రత్యక్షానుభవంగా మలచగల రసవిద్యా నైపుణ్యం తిలక్‌ది. తిలక్ కవితల నిండా మెటఫర్ల సౌందర్యమే. పంక్తి పంక్తి లో మెటఫర్. ఆ మెటఫర్లను ఒక గొప్ప నిడివి సమాసంలో అందమైన హారంలా కూర్చడం. దాదాపు మెటఫర్లు లేని పంక్తులెక్కడా ఉండవేమో. అలా ఉన్నా ప్రక్కనున్న మెటఫర్ల కాంతికి అవి ధగద్ధగాలవుతవి. అసలు మెటఫర్లు లేకపోతే కవిత్వం ఎక్కడుంది,ముఖ్యంగా వచనకవిత్వంలో. తిలక్ వచన కవిత అలంకారభాషలో దృశ్యాదృశ్యంగా, పరమ మనోహరంగా భాసిస్తుంది, మేలిముసుగులో రెబెకా (Veiled Rebecca) పాలరాతి శిల్ప సౌందర్యంలా. వచన కవితలో మెటఫర్ వాడటానికి ఉన్న విస్తృతి అపారం. దానిని పూర్తిగా కొల్లగొట్టి ఆ ప్రక్రియను స్వంతం చేసుకున్నవారు తిలక్.
అమృతం కురిసిన రాత్రి సంకలనంలో అరవైకి పైగానే కవితలున్నవి. వీటిలో ప్రతి ఒక్కటీ గొప్ప కవిత అని నేను అనడం లేదు. అధిక సంఖ్యలో గొప్ప కవితలే. అవి వెలుగులు విరజిమ్మడం పాఠకులు గమనిస్తారు,తన్మయులౌతారు. అవి నిస్సందేహంగా ప్రపంచ కవితా ప్రాంగణంలో అగ్రాసనాలమీద అధిష్టించగల ఔన్నత్యం కలవి. తిలక్ కవితలకు మహా సులభంగా కంఠవశమయ్యే గుణం, తరగని ఆకర్షణాశక్తి ఉన్నవి. సందర్భం వచ్చినపుడు -రసజ్ఞత ఉన్న స్నేహితుడు కలిసినపుడు, ఏకాంతంగా ఉన్నపుడు, ఇంట్లో అందరం విశ్రాంతిగా ఉన్నపుడు – ఎప్పుడు గుర్తుచేసుకున్నా సాయంకాలం వేళల పూలతోటలమీదుగా వీచే చల్లని గాలుల్లా ఆయన కవితలు ఆహ్లాదాన్ని కలిగిస్తూ మనసును వశపరచుకుంటాయి. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ అదే ఆకర్షణ.
విస్తృతి భయంతో ఏ కవితా ఇక్కడ పూర్తిగా కోట్ చేయడం లేదు, అలా చేయాలనే తపన ఉన్నా. అదే తిలక్ కవిత్వంలో ఉన్న సమ్మోహనశక్తి. అమృతం కురిసిన రాత్రి అనే కవితలో పరమ మనోహరమైన కవిత్వం నిలువెత్తునా సాక్షాత్కరిస్తుంది. తిలక్‌ని జీవితాంతం మరణభయం వెంటాడుతూనే ఉంది. తన కవిత్వాకర్షణలో తాత్కాలికంగానేనైనా మరణ భయాన్ని తాను జయించాననుకుంటారు అప్పుడప్పుడు. అది మరచిపోవాలనే ధృఢమైన పట్టుదల కూడా కనిపిస్తుంది, గొప్ప కవిత్వం వ్రాసి కవిత్వంలో అమరులై పోవాలనే ఆకాంక్ష కూడా కావచ్చు. పాపం, ఆయన వ్రాసిన కవిత్వంలో నిస్సందేహంగా అమరులై పోయారు కానీ, భౌతిక మరణం ఆయన 45వ ఏటనే (1921-1966) ఆయనను పొట్టన పెట్టుకుంది.
జలజలమని కురిసింది వాన
జాల్వారింది అమృతంపు సోన
దోసిళ్ళతో తాగి తిరిగి వచ్చాను
దు:ఖాన్ని చావుని వెళ్ళిపొమ్మన్నాను
కాంక్షామధుర కాశ్మీరాంబరం కప్పుకున్నాను
జీవితాన్ని హసన్మందారమాలగా ధరించాను
……అందుకే పాపం
ఈనాటికీ ఎవరికీ తెలియదు
నేను అమరుడనని!
‘నువ్వు లేవు నీ పాట ఉంది’ ఒక అద్భుతమైన కవిత. మిట్టపల్లాల మీదుగా దూకుడుగా ప్రవహించే నదిలా ఈ కవిత సాగుతుంది. ఇది యాభై ఆరు పంక్తుల కవిత. అయినా చటుక్కున అయిపోయినట్లు పాఠకుడికి అనిపిస్తుంది. దానికి కారణం దాని ప్రవాహ వేగం. ఈ యాభై ఆరు పంక్తులు మూడే మూడు వాక్యాలలో మహా కవితా శిల్పసోయగంతో ఒదిగిపోతవి. ఎక్కడా అన్వయకాఠిన్యం ఉండదు, సంక్లిష్టత ఉండదు. ఉన్నా ఆయన చెప్పినట్లే ట్రాన్స్పరెంట్ చీకటిలా ఉంటుంది. ఆమె గతించిన ప్రేమైక మూర్తి. ఆమెను గురించి వ్రాసిన ఈ కవిత ఒక ఎలిజీ లాంటిది. తనను వీడని ఆమె తాలూకు మధుర స్మృతులు, అమరమైన వారి ప్రేమ, ఇప్పటి తన దీన స్థితి, ఆగని కన్నీళ్ళు- చాలా రసస్ఫోరకంగా కవిత సాగుతుంది. ఆ కవితలో కొన్ని పంక్తులు –
సిగ్గిలిన సోగకళ్ళతో మల్లెపూల వాల్జడ తో నువ్వు పాడిన పాట
నా గుండెల దగ్గర తడబడుతూ ఏదో కొత్త భాష లో చెప్పి
ఒక అందమైన రహస్యం విప్పి పరువానికి వస్తున్న నా వయస్సులో
చటుక్కున పరిమళపు తుఫానుల్ని రేపి మహారణ్యాల సౌందర్యాన్ని చూపి
సముద్రపు కెరటాల బలంతో మధ్యగా మౌనంగా ఉన్న ద్వీపాల్ని ఊపి…
ప్రారంభ యౌవన సౌందర్యాన్ని,అది కలిగించే అపారమైన, మధురమైన అలజడిని, ఇంతకంటే అందంగా ఎక్కువ శక్తిమంతంగా మరెవరైనా చెప్పారేమో నాకు తెలియదు.
పండిన మొగలిపొత్తి వంటి పరిమళం గల ప్రారంభ యవ్వనపు నిండైన
ఆరోగ్యపువాకిళ్ళ ముందు విరిసిన నందివర్ధనం పువ్వుల మధ్య
నువ్వూ నేనూ కూర్చుని అలాగ ఒకర్నొకరు చూసుకుంటూ ….
ఒక అందమైన వాతావరణాన్ని, ఆనందంతో తొణికిసలాడే మానసిక స్థితిని ఎలా మనలో రేకెత్తిస్తారో చూడండి, ఈ అందమైన పద చిత్రాల ద్వారా;
నీ వొడిలో నా తల పెట్టుకుని అభ్యంగనావిష్కృత త్వదీయ
వినీల శిరోజ తమస్సముద్రాలు పొంగి నీ భుజాలు దాటి
నా ముఖాన్ని కప్పి ఒక్కటే ఒక్క స్వప్నాన్ని కంటున్నవేళ
చంద్రికాస్నపిత సంగీతం వింటున్నవేళ…
కవితారస ప్రవాహ మహా వేగాన్ని సందర్భాన్ననుసరించి తిలక్ సాధించే విధానం ఈ కవిత నిండా కనిపిస్తూనే ఉంటుంది.
నే కూరుకుపోతున్న చాతకానితనపు వానాకాలపు బురద మధ్య
నీ పాట ఒక్కటే నిజం లాగా నిర్మలమైన గాలిలాగా
నిశ్శబ్ద నదీతీరాన్ని పలుకరించే శుక్తిగత మౌక్తికం లాగా…
ఆయన శైలీ లక్షణాలైన లయబద్ధమైన నడక, శబ్దసారూప్యత వల్ల సాధింపబడిన లయలకు అద్దం పట్టే కోకొల్లలుగా ఉండే చరణాలలో ఇది మచ్చుకొకటి. ఈ రసధార, ఈ అందమైన పదాల కూర్పు, ఈ కదిలించే కవితాశక్తి, ఈ జాలి గొలిపే దు:ఖావేశం ఎవరిని పూర్తిగా లోగొనక మానుతుంది!?